Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం ఎదిగిన విధంబెట్టిదన... రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సం. పు - 21 - 07- 2016 - ప్రచురితం )

 




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

ఎదిగిన విధంబెట్టిదన... 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 21 - 07- 2016 - ప్రచురితం ) 





'ఈ మధ్య పత్రికల్లో మరీ ఎక్కువైంది బాబాయ్ ఈ గోల! ఈ ' ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏమిటి? 


' పక్కనే చక్కని తెలుగు ముక్కల్లో రాసుందిగా, ' సరళ తర వ్యాపార నిర్వహణ'  అని మీ బాబాయి పని చెడ గొట్టందే  నీకేం తోచదా? ' 


'బాబాయికి పనా ఇదేంటి కొత్తగా? '


' అట్లకు పిండి రుబ్బి పెట్టాలి. బట్టలకు సబ్బు పెట్టి ఉతికి ఆరబెట్టాలి. అన్నింటికన్నా ముందు బియ్యంలో రాళ్లు ఏరిపెట్టాలన్నది మీ పిన్ని హుకుం రా! ఏ 'సరళతర విధానం' అవలంబించి ఈ పనులన్నీ చకచక చేసుకుపోదామా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాననుకో . ఇంతలోనే నువ్వొచ్చి పడ్డావ్' 


ఈ బియ్యంలో రాళ్లు ఏరే కన్నా.. రాళ్లలో బియ్యం ఏరడం సులభం బాబాయ్! అదే ప్రస్తుతానికి మనం అవలంబించాల్సిన సరళతర నిర్వహణ' 


' మా బాగా చెప్పావురా! ఈ దుకాణాల వాళ్ళు బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో, రాళ్లతో వ్యాపారం చేస్తున్నారో బోధపడకుండా ఉంది.' 


' అర్థమైందిలే బాబాయ్ ఇప్పుడీ సరళతర వ్యాపార నిర్వహణ మూల సూత్రం ' 


' ఛ.. ఛ !  ప్రపంచ బ్యాంకు ఇలాంటి చేటలో బియ్యం చెరిగే విధానాలను గురించి ఎందుకు సమయం వృథా చేసుకుంటుందిరా తిక్క సన్నాసీ! పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకోవడానికి ఉన్న వెసులుబాట్ల ప్రకారం వివిధ దేశాలకు అది ర్యాంకులు ఇస్తుంటుంది. ఆ ర్యాంకుల్ని ఆధారం చేసుకొనే పెద్ద వ్యాపారస్తులు ఏయే దేశాల్లో పెట్టుబడులు పెడితే గట్టి లాభాలు గుంజుకోవచ్చో ఓ అంచనాకు వస్తుంటారు' 


'అలాగైతే మన దేశానికి మొదటి ర్యాంకు వస్తుండాలే ఏటేటా' 


' వెనకనుంచి మొదటి ర్యాంకు రానందుకు సంతోషించు! నూట ఎనభై దేశాల పట్టికలో నిరుడు మనది నూట ముప్పై నాలుగో ర్యాంకు. ఈసారి నాలుగు స్థానాలు ముందుకు జరిగామంతే ! సింగపూర్ మొదటి నుంచీ అగ్రస్థానం. ' 


' అన్యాయం బాబాయ్! అంతా సింగపూర్ సింగపూర్ అంటూ కలవరించే వాళ్లేకాని మన దగ్గర ఉన్నన్ని సులువు సూత్రాలు ప్రపంచంలో ఇంకెక్కడ ఉన్నాయి? ఈస్టిండియా కంపెనీ ఈ వెసులుబాట్లను లెక్కేసుకొనే కదా మన దేశాన్ని వెదుక్కుంటూ వచ్చి మన నెత్తికెక్కింది?' 


' ఆ పాత కథలన్నీ ప్రపంచ బ్యాంకు ముందు పరమ దండగరా అబ్బీ!ప్రస్తుతం ' 


' పోనీ, ఇప్పటి లెక్కలు చూసుకున్నా న్యాయంగా మనకే మొదటి ర్యాంకు రావాలిగా బాబాయ్ ? సర్కారు భూముల్ని ఆక్రమించి భవంతులు లేపినా. అడిగే నాథుడు ఉండడు.  మన దగ్గర తిక్క పుట్టి ఎవరైనా కోర్టు గడప తొక్కినా ఆపరాధ రుసుము చెల్లించి ప్రమాణపత్రం గీకేస్తే సరి. . అంతా సర్దుకుంటుంది. ఆక్రమించిన భూములు అమ్ముకొనేటప్పుడు సెటిల్మెంటుకు ప్రజా సేవకుడో మోకాలడ్డినా ఓ శాతం మనది కాదనుకుంటే సరి- అంతా ఓం శాంతి.. శాంతి: - శాంతి: ' 


' ఆ మాటా నిజమేననుకో! వడ్డించే చేతులు మనవాళ్లవయ్యేలా కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు తట్టెడు సిమెంటన్నా తయారు కాకముందే పది రూపా యల షేరు పదింతలు పెంచి రాత్రికి రాత్రి సంపన్నులైపోవచ్చు. తుక్కు తవ్వుకుంటామని చెప్పి, ఉక్కు తయారయ్యే సరకు తరలించినా చాలు. ఏడుకొండలవాడి నెత్తికి కిరీటాలనేంటి, పడుకునే గదుల్లో పక్క ఎక్కేందుకు వాడే ఎత్తుపీటలకూ మేలిమి బంగారంతో మలాములు చేయించుకోవచ్చు. లెక్కలడిగే నోళ్ళు నొక్కి పారేసేందుకు విందులు, వినోదాలు ఉండనే ఉన్నాయి గదా' మరెందుకు ఇంత దిక్కుమాలిన దిగువ ర్యాంకులో మనల్ని తొక్కి పారే చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు? మంచి ర్యాంకు కొట్టేయాలంటే మరేదన్నా మతలబు ఉందంటావా బాబాయ్?'


'ఏమోరా. దమ్ముండాలేగాని దుమ్మూ ధూళితోనైనా సరే దుమ్ములేపు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేసి పారేసే వెసులుబాట్లు మనదేశంలో వీశల

కొద్దీ వాడుకలో ఉన్న మాట వాస్తవమే!  అయినా ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ కొలమానాలకు పక్కదారి చిట్కాలు బొత్తిగా కుదరవేమోరా! గాలికి, వానకి ఎక్కడో శేషాచలం అడవుల్లో పడి ఎదిగేవి ఎర్రచందనం మొక్కలు! చలిపులులకు వెరవకుండా ప్రాణాలకు తెగించి మరీ రెండు దుంగల్ని నరికి ఏ చైనాకో, జపానుకో తరలించి నాలుగు డబ్బులు దండుకునే రూట్లు ఎన్ని కనిపెట్టారు మన దేశీయ కొలంబస్సులు! కొత్త మార్గాలు కని పెట్టారన్న కనీస కృతజ్ఞతైనా లేకుండా ఎన్ని ఎన్ కౌంటర్లు జరిపారో?' 


' నిజమే బాబాయ్. క్రికెటర్లను వేలం వస్తువుగా మార్చేసి, ఆటలో వాణిజ్య లాభాల సూత్రాన్ని కనిపెట్టిన లలిత్ మోదీనైనా బిజినెస్ మోడల్ గా  చూసుకో వద్దూ! ఆ అబ్బిని దేశం సరిహద్దులు దాటిందాకా తరిమి తరిమి కొట్టాం మనందరం: ఏటేటా అందమైన సుందరాంగుల శృంగార భంగిమ లతో గోడ క్యాలండర్లు పంచిపెట్టే అమూల్యమైన ఆలోచన చేసిన వ్యాపార మేధావి మాల్యా బ్యాంకులకు అతగాడు ముష్టి ఏడు వేలకోట్లు బకాయి పడ్డాడని దేశం దాటి పారి పోయిందాకా నిద్రయినా  పోకుండా పహరా కాస్తిమి: పీనా సులు పోపు డబ్బాల్లో, పక్కగుడ్డల కింద దాచుకున్న చిల్లర సొమ్మునంతా బయటకు లాగడం సామాన్యమైన చమత్కా రమా! స్తబ్ధుగా పడున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఒక్కసారిగా తట్టి లేపాడన్న విశ్వాసమైనా లేదు అగ్రిగోల్డు పెద్దాయనమీద దేశంలోని పెద్దలెవరికీ' 


'నిజమేరా! నాలుగు డబ్బులు రాబట్టే ఉపాయాలు కనిపెట్టే వ్యాపారస్తుల మీదా న్యాయస్థానాలు సైతం అట్లా అగ్గినిప్పులు కురిపించేస్తుంటే. . ఎ గుండె నిబ్బరంతో విదేశాల నుంచి బిజినెస్ పెద్దలు సముద్రాలు దాటొచ్చి మరీ ఇక్కడ పెట్టుబళ్లు పెడతారు? మదుపుదారులకు డబ్బులు చెల్లించే విష యంలో విఫలమై, తిహార్ జైలు ఊచలు లెక్కించే సహారా గ్రూప్ సుబ్రతో రాయ్ గుర్తున్నాడా ? అతగాడు రాసిన పుస్తకం 'లైఫ్ మంత్రాస్' ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడైన వ్యక్తిత్వ వికాస గ్రంధంగా  రికార్డులకెక్కినా, ప్రపంచ బ్యాంకు అతగాడి వ్యాపార సులువు సూత్రాలని లెక్కలోకే తీసుకోవడంలేదు'


'ప్రపంచ బ్యాంకు కొలమానాలకు కొన్ని పరిమితులు ఉన్నాయనుకుంటా' 


' అలాగని అన్ని రకాల వ్యాపారాలకు తరగని గని లాంటి మనదేశానికి ఇంత దిక్కుమాలిన ర్యాంకు ఇచ్చి కిందకు తొక్కేస్తే అరటి తొక్కల వ్యాపారం కూడా ఇక్కడ ఎక్కివస్తుందా బాబాయ్! ఈ కాలం 'ఈ-కాలం' అయిపో యింది. ఈ ర్యాంకుల గొడవొకటి కొత్తగా నెత్తిమీదకొచ్చి పడింది. ఎలాంటి వ్యాపార వెసులుబాటులో విస్పష్టంగా చెప్పకుండా వట్టిగా ' సరళతర వ్యాపార నిర్వహణ' అని ఒక పేరు పెట్టి ర్యాంకుల పట్టికలు తయారుచేసుకుంటూ పోతుంటే ఎలా? ఎంత మేధి పొంగిపొర్లే గడ్డ అయినా గుడ్డిగవ్వ పెట్టుబడి పెట్టేందుకు విదేశీయులే కాదు స్వదేశీయులూ ముందుకు రానేరారు.' 


' అందుకే కదరా.  మీ పిన్ని రాళ్లు ఏరమని ఇచ్చిన బియ్యాన్ని సరళతరం వ్యాపార నిర్వహణ పద్ధతిలో రాళ్లకు బదులు బియ్యం గింజలేరి ఇచ్చేసింది! దాంతో చేసిన కిచిడీ ఇది. రుచి చూడు ! ఫలితం సానుకూలంగా ఉంటే సరళతర వ్యాపార నిర్వహణ నివేదిక ఒకటి తయారుచేసి ప్రపంచ బ్యాంకుకు మనమే సమర్పిద్దాం!' 


' బాబోయ్ . పన్ను విరిగింది. బాబాయ్ నీ బియ్యం కిచిడీ బంగారం కానూ' 


పిన్ని రంగ ప్రవేశం.


'విరగదట్రా వెర్రి సన్నాసీ/ బియ్యం కిచిడీలో ఉన్నవన్నీ పలుగు రాళ్లేనాయే! తమరి బాబాయిగారి సరళతర వ్యాపార నిర్వహణ విధానం అంత సలక్షణంగా ఏడ్చింది. మరి ఆడమనిషినని తీసిపారేయకుంటే నాకు తోచిన సలహా ఒక్క టి విని బాగుపడండి! ఈ దేశంలో అపరిమిత లాభాలు గడించి పెట్టే సరళ తర వ్యాపార నిర్వహణా  విధానాలు సక్రమంగా పనిచేసే రంగం ఒక్కటే ఒక్క టుంది. మీ ప్రపంచ బ్యాంకు కొలమానాలకు, అదిచ్చే పిచ్చి పిచ్చి ర్యాంకులకు అందనంత ఎత్తులో ఉందది. అదే రాజకీయ రంగం.  అందులో మీరెలాగూ రాణించే అవకాశం లేదుగాని,లోపలికి పదండి!  పిండి రుబ్బి పెడితే అట్లు పోసి పెడతా..  హాయిగా ఆరగించి గుర్రుకొట్టి నిద్దరోదురుగాని ఇద్దరూ! 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 21 - 07- 2016 - ప్రచురితం ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...