Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం అంతా మాయ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సం.పు- 09 -02-2009 న ప్రచురితం )

 



ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

అంతా మాయ 

రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం.పు- 09 -02-2009 న ప్రచురితం )


'సత్యం రాజుగారు కంపెనీలో ఏడు వేలకోట్లు కని పించటం లేదంటున్నారేమిటి స్వామీ? '


యామా సా మాయా' నాయనా!'


' చిత్తూరు రోజా  బెల్టు షాపుల్ని రద్దు చేయమంటే సీయం నా దగ్గరెలాంటి బెల్టులూ, మొలతాళ్లేవీ లేవంటున్నాడేమిటి గురూజీ! 


 'యామా సా మాయా' శిష్యా! 


'ఎన్నికలకు ముందే ఓటర్ల జాబితాలో పేర్లు కనబడకపోవటమేంటి దేవా?' '


యామా సా మాయా' వత్సా ! '


'బొత్సాగారు  వోక్స్ వేగన్లో పోసిన పదకొండు కోట్లూ పత్తా లేకుండా పోయాయి. బాలాజీ బంగారు డాలర్లకు రెక్కలొచ్చి ఎటో చక్కా ఎగిరిపోయాయి! ఆయేషాను చంపిన అసలు హంతకుడి అంతు దొరక్కుండా వుంది. మంత్రులు మారుతి కార్లయినా లేవని   గగ్గోలు పెడుతున్నారు . రాజకుమారి గారింట్లోని బంగారం మొత్తం పోగేసి తూచినా రెండు తులాలు మించి తూగడంలేదంట ! ఈ మాయంతా ఏమిటి మహాత్మా! '


' యామా సా మాయా అన్నానుగా నాయనా!' 


'అసలు - ఆ మాయదారి ' యామా సా మాయా ' అంటే  అర్థం ఏమిటి స్వామీ?' 


' ఏది కలదో అది లేదు' అని భావంరా బుద్ధూ! ఇది బుద్ధుడు బో ధనరా బండ శిష్యా! ' 


'బొత్తిగా నా బుర్రకెక్కనే లేదు. కాస్త వివరంగా చెప్పండి గురూజీ!' 


' నీకేదైతే బుర్ర ఉందని నువ్వనుకుంటున్నావో అది లేనేలే దని  అర్ధం నాయనా! మన అశోక చక్రం మీద మూడు సింహాలున్నట్లుంటాయా!... నిజానికవి నాలుగు నాయనా! కనిపించని ఆ నాలుగో సింహమే 'యమా సా మాయా' ! 


'అయోమయం ఇంకా అలాగే వుంది మహాశయా!' 

మరింత వివరంగా చెప్పి పుణ్యం కట్టుకోరాదా!' 


'మన ప్రధాని మన్మోహన్ సింగుగారి వెనక తలకాయ  ఎవరిది బిడ్డా?' 


'మన మేడమ్ సోనియా గాంధీగారిదీ'


' కనిపిస్తుందా?' '


' లేదు స్వామీ!'


' మొన్న జరిగిన ముంబై దాడుల వెనకున్న హస్తం ఎవరిది శిష్యా? ' 


'ఇంకెవరిదీ! కనిపించటం లేదుగానీ... కచ్చితంగా అది పాకిస్తానుదే. ' 


' అలాగే ఉండీ కనిపించకపోవటాన్నే 'యామా సా మాయా' అంటారు. దాన్నే 'జగమే మాయ' అని దేవ

దాసు పాడుకున్నాడు. 'కనబడినది కనబడదని... వినబడినది వినబడదని' మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానంలో మొత్తు కున్నాడు. ఈ కనబడకపోవటాలూ, వినబడకపోవటాలూ ఇవాళ మనకు కొత్తగా పుట్టుకొచ్చిన వికారాలేమీ కాదురా  శిష్యా! మహాభారతకాలంలో దుర్యోధనుడికి మయసభామధ్యమంలో  మడుగు ఉండీ కనబడకపోవటం చేతే కదా తడబడి అడుగుపడి బుడుంగుమని నీట మునిగి గొడవ గొడవ అయినదీ! 


' ఆ ద్వాపర యుగంలో సరైన వైద్యసహాయం లేక దుర్యోధనుడు కనబడేది కనబడలేదని పొరబడి ఉండవచ్చునేమో గానీ , ఈ కలికాలంలో కళ్ళజోళ్లు, కాంటాక్టు లెన్సులూ, కంటాపరేషన్లు వంటి సదుపాయాలు  బోలెడన్ని ఉండగా ఈ కనబడకపోవటాలూ, వినబడకపోవటాల అంతర్యమేంటో అర్ధం కాకుండా ఉంది స్వామీ! ' 


' కమ్యూనిస్టులకు అస్తమానం కనిపించే అవినీతి కాంగ్రెస్ వాళ్లకి ఫ్లడ్ లైట్లేసి వెతికినా  కనబడకపోయె! వై.ఎ స్ కి ఎక్కడబడితే అక్కడ కాళ్ళకడ్డంపడుతూ కనిపించే అభి వృద్ధి చంద్రబాబుకీ, చిరంజీవికీ చుక్కంత కూడా చూపులకానటంలేదాయె!'

ప్రతిపక్షాలకి ప్రతిదీ రాద్ధాంతం చేయటమే

సిద్ధాంతంగానీ ... సవ్యంగా ఆలోచిస్తే ఈ 'యామా సా మాయా ' అనేదే లేకపోతే లోకం కనీసం రెండు గంటలైనా సవ్యంగా  నడుస్తుందా నాయనా! బెయిలు కోసం పెద్ద మనుషులుకి నిజం గుండె పోటొచ్చిందాకా ఆసుపత్రుల్లో అలా పడుండాలంటే బైట రాజకీయాలు సజావుగా సాగుతాయా! ఇన్నేసి వేలకోట్లకు బిల్లులు పాసవుతున్నాయే! ... మచ్చుక్కి ఒకటి రెండు ప్రాజెక్టులైనా పూర్తవలేదంటే అధిష్ఠానం  ముందు కిందవాళ్ల  పరువు దక్కుతుందా! రాబోయే ఎన్నికల్లో అధికారపక్షం ఘనవిజయం అరచేతి మీద పండిన గోరింటాకంత స్పష్టంగా కనీసం సర్వేరాయుళ్ళకన్నా కనిపించకపోతే కార్యకర్తలను పట్టి అట్టేపెట్టుకోటం అంత సులభమా బిడ్డా ! బస్సుల్లో స్త్రీల సీట్లలో స్త్రీలే కనిపిస్తున్నారా! స్టోరీ సినిమాల్లో స్టోరీ కనిపిస్తుందా!


'యామా సా మాయా' మన సినిమాల వంద రోజుల పండుగలాంటిది। అది సామాజిక న్యాయమంత గంభీరమైనది. ఓబలాపురమంత గుంభనమైనది. ఇందులో ఇడుపుల పాయకన్నా ఎక్కువ మడతలున్నాయి నాయనా! పేలేదాకా బస్టాండులో పడివున్న  సూట్ కేసులో కూడా ఏముందో కనిపించదు. హరీష్ రావుకి వచ్చిన ఉత్తరం సుదర్శనమే రాసిందని ఘంటాపథంగా చెప్పగలవా? 'యమా సా మాయా' లేని రాజకీయాలు గిల్పం గింబళీ లేని మాయాబజారు సిని మాలా మజాగా ఉండవు శిష్యా అర్ధమయిందా!' 


'రేడియో సంస్కృత వార్తల్లాగా అర్ధమయీ అర్ధమవన ట్లుంది స్వామీ! చివరగా ఓ సందేహం. ఈ కనబడనవి కన బడేట్లు చేయాలంటే ఏమిటి సాధనం మహాత్మా! అంజనం రాసుకోవటమే ఏకైక మార్గమా? '


'లాభం లేదురా అబ్బాయ్! ఆపై వాక్యంలో ఏముందో తెలుసా? నీలాంటి వాడికి ఎంత అంజనం పట్టించినా ఏవీ కనబడదుగానీ, నాలాంటి జ్ఞానికే ఏ అంజనమయినా! ఇలా పట్టించేస్తే అన్నీ చక్కగా కనిపిస్తాయ్ సుబ్బారావ్! ' 


' సుబ్బారావేంటి? ... నా పేరు వెంకట్రావ్ స్వామీ! అయ్యో ! మీరు  పట్టించింది అంజనం కాదు... అమృతాం జనం... మీకూ కనిపించటంలేదా ఏమిటి  మహాత్మా!'


రచన - కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం.పు- 09 -02-2009 న ప్రచురితం )


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...