Saturday, December 11, 2021

సుగ్రీవుడి మొదటి పట్టాభిషేకం రచన: కర్లపాలెం హనుమంతరావు 21 - 09- 2021

 సుగ్రీవుడి మొదటి పట్టాభిషేకం 


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



ఈ మాట అనడానికి కారణం ఉంది. వాల్మీకమే ఇందుకు ప్రమాణం. గందరగోళం లేకుండా సూక్ష్మంగా , సరళంగా,  సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 


సుగ్రీవుడు ఓ నలుగురు రాక్షసులను ( అనల, శరభ, సంపాతి, ప్రఘసన- వాళ్ల పేర్లు ) వెంటబెట్టుకుని శ్రీరాముడి శరణు కోసం ఆకాశంలో ఉత్తర దిక్కునుంచి వచ్చి  ఎదురు చూస్తూ నిలబడ్డాడు. అది సుగ్రీవుడి కంటబడింది. వచ్చినవాళ్లు శత్రువులు అనుకొన్నాడు. యుద్ధ కాలం. అనుమానం రావడం సహజమే.  సమీపాన ఉన్న హమమంతుడితో విషయం చెప్పాడు. ( హనుమత్ సముఖా: - అనే పదం వాడాడు  వాల్మీకి మహర్షి . బుద్ధిమంతుల ముందు వ్యవహారాలను విచారించుకునే సందర్భంలో ఈ పదం వాడటం ఓ భాషా సంప్రదాయం ). అది మిగతా కోతుల చెవిలో పడి ఆవేశం వచ్చేస్తుంది. సాలవృక్షాల మీద  చేతులేసి ' ఆజ్ఞాపిస్తే క్షణంలో వాడిని, వాడితో వచ్చిన వాళ్లనూ చంపేసివస్తాం ' అంటారు. 


ఆ మాట విభీషణుడు  విని ' తన సోదరుడు చెడ్డవాడని, జటాయువు చావుకు , సీతాపహరణకు వాడే కారణమని, ఆమె లంకలో దీనంగా రాక్షసస్త్రీల మధ్య భర్తకోసం ఎదురు చూస్తూ దుష్టుడయిన తన అన్నయ్యను నిరోధించడానికి చాలా ఇబ్బంది పడుతుందని, విడిచిపెట్టమని మళ్లీ మళ్లీ చెబుతున్నా వినకపోగా తనను అవమానించాడ' ని చెప్పుకొచ్చాడు. ' ఇప్పటిదాకా గౌరవం( సోహం) గా బతికిన వాడిని  దాసోహం  అనలేక శరణు కోసం రాముడి దగ్గరకు వచ్చాన' ని వివరంగా చెపుతాడు. భార్యా బిడ్డలను, స్నేహితులను, ఆస్తిపాస్తులను అన్నీ లంకలోనే వదిలేసుకుని ' రాఘవం శరణం గత: ' అంటూ వచ్చిన విభీషణుడి  మాటలకు కంగారుపడి ( లఘువిక్రమత్వం ) వాయువేగంతో లక్షణసమేతుడై ఉన్న రాముడి దగ్గరకు వెళ్లి ఈ వివరాలన్నీ క్లుప్తంగా  చెప్పాడు సుగ్రీవుడు . 


సుగ్రీవుడిది రాజనీతి. అపరిచితులను ముందుగా  అనుమానించి .. విచారించిన మీదట గుణాలు నిర్ధారించుకునే తత్వం.  కాబట్టే 'గుడ్లగూబ కాకులని చంపినట్లు  చంపేందుకే మన బలం తెలిసీ వచ్చి వుంటాడు. నికృతిజ్ఞులు  ( కపటులు)  అయిన రాక్షసజాతికి చెందిన వీడు గూఢచారిగానో, మనలో కలతలు సృష్టించడానికో వచ్చాడేమో?  వాలిని చంపినట్లు వీడినీ చంపేసేయ్ రామా ! మారీచుణ్ణి  మాదిరి సగం చంపి వదిలావా .. అనర్థకారి అయే ప్రమాదం కద్దు ' అని ఓ రాజులాగా, సేనాపతిలాగా రాముడికి సలహా ఇవ్వబోయాడు. అదీ రాముడు అడగక ముందే! హనుత్సముఖుడైన ( బుద్ధికి సంబంధించిన ) రాముడు అక్కడ ఉన్న మిగతా వానరుల వంక  చూసి ఒక ముఖ్యమైన మాట అంటాడు. అది అన్ని కాలాలకు అందరికీ పనికిపచ్చే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠం లాంటిది . 'స్నేహితుడు  ఒక సలహా ఇస్తున్నప్పుడు తతిమ్మా  వాళ్లు భయం చేతనో , స్నేహం చెడుతుందన్న భీతి చేతనో నిశ్శబ్దంగా ఉండటమూ ప్రమాదమే! ఇబ్బందుల్లో ఉన్నపుుడు సమర్థులు  సలహా ఇవ్వటమే  మేలు ' అన్న రాముని ఉవాచ సర్వదా శిరోధార్యం. ఈ సందర్భంలో వాల్మీకి ఉటంకించిన ఈ శ్లోకం మనందరం  మననం చేసుకోదగింది. 

' యదుక్తం కపిరాజేన రావణానరజం ప్రతి 

వాక్యం హేతుమదర్ధ్యం చా భవద్వి రపి తచ్ఛ్రుతం 


రాముని మాటకు  ధైర్యం తెచ్చుకున్న  అంగదుడు ' నీకు తెలీనిదేముంది ప్రభూ! మా బతుకంతా రాజనీతి వంకన అందర్నీ శంకించడమేనాయ! అంతకుమించినది ఇంకేదో ఉంది. అదేదో నీకే తెలియాలి' అన్నాడు తెలివిగా. గతంలో తన రాజు సుగ్రీవుడు మీద కోపం  ఉంది అతగాడికి. 


సుగ్రీవుడు అది గ్రహించాడు.   ' అదిగో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అంగదుడికి రాజ్యం ఆశ చూపించి వానర  సైన్యంలో చీలిక తెచ్చి మనల్ని  బలహీనుల్ని చేసే  రావణాసురుడి ఎత్తుగడ కావచ్చు ఈ రాక్షసుడి రాక. ఎటూ ఆఖరుకు తేల్చాల్సి౦ది నువ్వే కాబట్టి అందరి అభిప్రాయాలు విడివిడిగా పిలిచి కనుక్కో రామా  ' అన్నాడు. 


అప్పుడుగాని అంగదుడు తన మనసులోని మాట బైటపెట్టలేదు. 'శత్రువు అంటే అనుమానించదగ్గవాడే.  మనం గుడ్డిగా నమ్మితే సమయం చూసి దెబ్బకొట్టే నయవంచకుడు కూడా . మిత్రత్వాని కి అనుకూలమైనది ముందే గుణ దోషాలు విచారించుకోవడం ' . 


ఆ తరవాత శరభుడు. అతడు  మాట్లాడ్డం అయిన తరువాత జాంబవంతుడు తన వంతుగా శాస్త్ర దృష్టితో ' రాకూడని కాలంలో శత్రువర్గం  నుంచి చేతులు కలపడానికి వచ్చిన వాడిని తప్పక  అనుమానించాల్సిందే ' అని తేల్చాడు. కేవలం శాస్త్ర దృష్టి మాత్రమే కాకుండా తత్వమరసి ( మనసు తెలుసుకొని )  నిర్ణయం తీసుకోవడం మేలు' అని  మైందుడు అడ్డుపడటంతో  హనుమంతుడి  ఆలోచనకు ప్రాధాన్యత పెరిగింది 


' ఎదుటివాళ్లను  గురించి వచ్చే ప్రస్తావనలో జాతి, కులం, హోదాలు వంటివి కాకుండా మన సంస్కారానికి ప్రథమ స్థానం  ఉంటుంది. రాజనీతో, ఎదుటి వ్యక్తి మీద ముందే ఏర్పరుచుకున్న  చెడ్డ అభిప్రాయం వల్నో ల న్యాయ నిర్ణయం జరగదు. పై పెచ్చు  విచారణలో కూడా మాటమృదువుగా, సృష్టంగా, క్లుప్తంగా ఉండాలంటారు పెద్దలు.( ' న వాదా నాపి సంఘర్షా న్నాధిక్యా న్నచ కామత: 

వక్ష్యామి వచనమ్ రాజన్ యధార్ధం రామ గౌరవాత్ ' అని వాల్మీకి  శ్లోకం ఇక్కడ ) ' నేమ వాదన  కోసమో, ఘర్షణ కోసమో, బడాయిగానో, లాభం కోసమో, అవకాశం వచ్చందనో  వాగడం  లేదు. కేవలం రాముడి మీద ఉండే గౌరవమే తప్పించి రాజువైన నిన్ను ధిక్కరించాలనే   ఆలోచన బొత్తిగా లేదు' అంటూ సుగ్రీవుడి అహాన్ని కొంత చల్లార్చి ' అర్థం.. అనర్థం కోణంలో మంత్రులు  మాట్లాడింది తప్పుపట్టడానికి  లేదు. కానీ పనిలో పెట్టకుండా ఎవరి సామర్ధ్యం ఎంతో ఎట్లా తెలుస్తుంది? అట్లాగని తొందరపడి ముఖ్యమైన రాచకార్యం కొత్తవారికి అప్పగించడమూ క్షేమం కాదు. ' అంటూనే అంగదుడు, జాంబవంతుడు చెప్పిన మాటలను కూడా ఖండిస్తున్నట్లు రామునితో ' ఈ విభీషణుడు రావణాసురుడి దుర్మార్గాన్ని చూశాడు. వాలి వధ చేసిన నీ పరాక్రమం గురించీ విన్నాడు. సుగ్రీవుడి పట్టాభిషేకం నీ వల్లనే సాధ్యమయిందని తెలిసి లంక మీది పెత్తనం ఆశించి నీ దగ్గరకు వచ్చి ఉండవచ్చు. నా బుద్ధికి తోచింది ఇది . గుణదోషాల విచక్షణ ప్రస్తుతం పక్కన పెట్టి మిత్ర గ్రహణం చేయవచ్చనిపిస్తుంది. మనసులో ఉన్నదే చెప్పాను . ఆపైన నీ ఇష్టం ' అని ముగించాడు హనుమ. 


హనుమంతుడికి ' వాక్ చతురుడు' గా పేరుంది. లంకలో విభీషణుడే హనుమంతుడికి ఆపదవచ్చినప్పుడు  రక్షించింది. అందువల్లే ఈ విభీషణుడిని అంగీకరించమంటున్నాడు  - అని సాటి వానరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య మొదటి నుంచి స్వభావరీత్యా వైరుధ్యం ఉన్నట్లు లంకలో ఉన్నప్పుడు హనుమ పసిగట్టాడు. కానీ ఈ విషయం మీద అవగాహన లేనందున  అంగదుడు, జాంబవంతుడు లాంటి వాళ్లు తన సలహా అంతరార్ధం  సవ్యంగా అర్ధం చేసుకోకపోవచ్చు. ఈ రెండు కారణాల చేతా హనుమంతుడు తన సంభాషణలో వాటి  ప్రస్తావన తీసుకురాలేదు . అదీ ఆంజనేయుడి వాక్ చాతుర్యం . 


అంగధ, సుగ్రీనాదుల సలహాలు కలవరం కలిగించినా ఆంజనేయుడి మాటలతో రాముడికి సంతోషం కలిగింది. తనగురువు వశిష్టుడు బోధించిన నీతి శాస్త్రం మననం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చుట్టూ ఉన్న పరిజనాన్ని చూసి ' ఈ విభీషణుడి విషయంలో మనం కాస్తా హేతు సాధ్యమైన కోణంలో ఆలోచిస్తే బాగుంటుందేమో! నా మంచి కోరే మీరంతా ఆలకించండి . ' స్నేహం అర్థిస్తూ వచ్చినవాడివి నేను నిరాశపరచను. వచ్చిన  వాళ్లలో  తప్పులున్నా సత్పురుషులు వాటిని లెక్కించరు. తనను చంపేందుకు వచ్చిన వాడి ఆవాచనను పక్కనపెట్టి ఆతిథ్యం ఇచ్చింది ఒక పావురం. దాని ఔాదార్యం మనకు శిరోధార్యం. విభీషణుడిని వదిలి పెట్టను ' 


' సరే! వచ్చిన రాక్షసుడి గుణంతో పనిలేదు . కానీ అతని అవకాశవాదమన్నా గుర్తించాలిగా! లంకాదహనం, పుత్రమరణం వంటి మహా దుఃఖాలలో ఉన్న సొంత అన్ననే విడిచిపెట్టి వచ్చినాడు అవకాశం వస్తే మన దుఃఖం మాత్రం పట్టించుకుంటాడా? వదిలేసి పోడూ ?' అని సుగ్రీవుడు మళ్లా రాజనీతి వలకపోయడం వివి లక్ష్మణుడికి నవ్వొచ్చింది. చిరునవ్వు తో  ' సుగ్రీవుడికి శాస్త్ర బద్ధంగా చెబితేనే బుర్రకెక్కేది'  అన్నట్లు గ్రహించి ఆప్రకారమే  ' సుగ్రీవుడు ఎప్పుడూ చదువుకున్న శాస్త్రాన్ని మాత్రమే వల్లెవేస్తాడు. కానీ ఆ ధర్మమే ఏం చెబుతోంది? ఉన్నత వంశంలో పుట్టిన వాడు ఎంతో కష్టం కలిగితే తప్ప తన స్థాయివారి దగ్గర చెయిచాపడు. సుగ్రీవుడిది   కాలాన్ని బట్టి అనుమానం. పద్దాకా శాస్త్రమో అంటూ అమమానాలు పెట్టుకొనేవాళ్లకి ఆ శాస్త్రం చెప్పే మరో మాట కూడా గుర్తు చేస్తా . మన ద్వాలా తన కన్నా బలవంతుడైన అన్నను చంపిస్తే, ఆ చంపినవాడి ముందు తన బలం చాలదన్న ఇంగితం ఉంటుంది గదా! వాడి రాక్షస కులానికి చెందని మనకు వాడి రాజ్యం మీద కోరిక ఉండదన్న లెక్కతోనే  సహాయం కోసం రామశరణు కోసం వచ్చాడు. కాబట్టి విభీషణుడు ఎట్టిపరిస్థితుల్లోనూ స్నేహాపాత్రుడే! 

' అవ్యగ్రాశ్చ ప్రహష్టాశ్చ న భవిష్యంతి సంగతాః

ప్రవాదశ్చ మహానేష తతో 2 స్య భయ మాగతం 

ఇతి భేదం గమిష్యంతి తస్యాత్గ్రాహ్యో  విభీషణ: 

నిశ్చింతగా, సంతోషంగా ఉండాలనుకునే పండితుల కూడా సఖ్యతగా ఉండలేరు. ఒకళ్లనొకళ్లు అణగదొక్కుకునే పరిస్థితి. రావణ విభీషణులు సమాన రాజనీతిజ్ఞులు. విభాషణుడి వాలకంలో సోదర భీతి సుస్పష్టం.  ఆ భయంతో వచ్చాడు కాబట్టి  అభయం ఇవ్వడం ఉచితం. అందరూ భరతుని వంటి సోదరులే ఉండరు.  తండ్రి మరణానికి కారణమైన కొడుకులు లేరా? అందరికీ నీవంటి స్నేహితుడే దొరకాలనే నియమం లేదుకదా! రావణ విభీషణులు వాలి సుగ్రీవులు, రామలక్ష్మణులో ఎప్పటికే కాలేరు. ఈ రాక్షసుల మధ్య వైరం నిజమే కావచ్చు. విభీషణుడు నిశ్చయంగా గ్రహణీయుడే ' అన్నాడు రాముడితో లక్ష్మణస్వామి. 


అయినా సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి నిలబడి  రాముడి ముందు  చేతులు జోడించి ' ఇట్లా అన్నందుకు క్షమించు . వచ్చింది. శత్రువు  సోదరుడు. వాడి తీయని మాటల వెనుక వంచన ఉండవచ్చు. వెంటనే వాడినీ, ఆ నలుగురు రాక్షసులను నువ్వన్నా చంపు! లక్ష్మన్న చేతనైనా చంపించు! '  అన్నాడు. 


వాద ప్రతివాదనల వాతావరణంలో  సానుకూలమైన ఆలోచనరాదు. గోలగా ఉన్న ఆ తరుణంలో మౌనంగా ఉండి చివరికి ప్రసన్నంగా లోకాలు అన్నిటికీ పనికివచ్చే మంచి మాట ఒకటి అన్నాడు. 

' నన్నూ నావాళ్లను ఎవరినీ ఏమీ చేయలేని బలహీనుడు ఈ వచ్చినవాడు. శరణు అంటే ఎట్లాంటి వాడినైనా రక్షించి తీరుతా . దానవులు , పిశాచాలు, యక్షులు, భూలోక సంబంధితులు   ఎట్లాంటివాళ్లనైనా నా కొనగోటితో చంపేస్తా. ఒక పావురమే శరణాగత ధర్మాన్ని పాటించినప్పుడు నా బోటివాడి మాట ఏమిటి? ' అంటూ కండు మహర్షి ద్వారా  గురువు  గ్రహించిన గీతికను పునశ్చరణ చేసుకుంటూ ' అంజలి ఘటించి ఆశ్రయం అర్థించిన విపన్నుడిని తిరస్కరించకూడదు . అంజలి పరమా ముద్రా క్షిప్రం దేవ ప్రసాదినీ .. అని శాస్త్రం. దేవతలే తొందరగా ప్రసన్నమయే అంజలి ముద్రను మనం  వేళాకోళంగా తీసుకోకూడదు. అంజలి ఘటించక పోయినా దైన్యంగా ఉన్నా అంతే. ఆ రెండూ లేకపోయినా రక్షక స్థలానికి వచ్చి యాచిస్తే సాక్షాత్ శత్రువే అయినా చంపకూడదు. ఈ విభీషణుడు శత్రు కాదుగదా! కేవలం శత్రువు బంధువు మాత్రమే. అనుకున్నది ఆలస్యమయే కొద్దీ  అతనికి ఆదుర్దా  ఎక్కువగా ఉంది. ' ఆలస్య మయినా సరే ఫలితం వస్తే బాగుణ్ణు' అనుకుంటున్నాడు. అటువంటివాడిని ప్రాణాలు ఫణంగా పెట్టయినా రక్షించాలి. ప్రత్యవాయు హేతువు అనే ఒక న్యాయం ఉంది. భయంతోనో, మోహంతోనో, శాస్త్రాన్ని పట్టుకుని గట్టిగా చేసుకోని సంకల్పంతోనో, కాముకత్యంతోనో, బాధ్యత తెలీకుండానో , ప్రతిఫలం ఆశించో ,  సంపాదించిన ఆఖరు నాణెం ఖర్చయే దాకా సిద్ధపడి, ప్రాణత్యాగానికైనా వెనక్కు తగ్గకుండానో  ఉండటాన్నే ప్రత్యవాయు హేతువు అనేది. ఆశ్రయం నిరాకరించేవాడికి ఆ దోషం అంటుకుని నరకబాధలు మొదలవుతాయి. ఈ లోకంలో కూడా నిందలే . మంచినీళ్లు ముట్టవు . మొహం చూస్తే చాలు అసహ్యం కలుగుతుంది. నిరాశతో వెళ్లేవాడు వట్టిగా పోడు. తిరస్కరించిన పాపానికి  అప్పటి దాకా చేసుకున్న పుణ్యాలన్నీ పట్టుకుపోతాడు. మనస్ఫూర్తిగా ఇష్టంతో ఆశ్రయం ఇవ్వక పోయినా ఆశ్రయం ఆశించి వచ్చినవాడి మనసులో ఉన్న సామర్ధ్యాలన్నీ సర్వనాశనం .  ధర్మబద్ధం, కీర్తిదాయకం, స్వర్గ ప్రాప్తి . . ఇత్యాదులకు కారణమయే కండు మహర్షి ఉత్తమ ఉపదేశమే నాకు అనుసరణీయం. అందువల్ల ఆ వచ్చినవాడు విభీషణుడే కాదు, రావణాసురుడయినా అభయమిస్తాను ' అంటాడు రాముడు . 


' నా మనసు కూడా ఈ విభీషణుడు పరిశుద్ధుడనే ఘోషిస్తోంది. కాకపోతే రాజధర్మంగానే నా పరీక్ష . ఇప్పటి నుంచి అతను మాతో సమానుడు . మీ ఇద్దరి మధ్యా మైత్రి మాకూ సంతోషదాయకమే ' అంటూ విభీషణుడిని తీసుకురావడానికి వెళ్లాడు సుగ్రీవుడు. . గరుత్మంతుడు దేవేంద్రుడిని తీసుకురావడానికి వెళ్లినట్లు. 


సుగ్రీవుడి నోట శుభవార్త విని అనుచరులతో సహా దిగితే తాత్సారమవుతుందన్నట్లు గభిక్కున నేలమీద పడ్డాడు విభీషణుడు. ( వాల్మీకి దీన్ని 'ఖాత్ పాతావనీం' అన్నాడు. ) రాముడి పాదాల మీద పడిపోయి సంపూర్ణ సాష్టాంగ నమస్కార రూప శరణు పొందేడు. 

' అవమానింపబడ్డ రావణ సోదరుణ్ణి. లంకను, స్నేహితులతో సహా దారాపుత్రులు,ధనాది ఐశ్వర్యాలు, రాజ్యం మొత్తం నీకు స్వాధీనపరుస్తున్నాను. ఇకపై నీవే నా పోషకుడివి.  నా సుఖాలు, ఆముష్మిక సుఖాలలో భాగం నీకే అర్పితం. ' అంటున్న విభీషణుణ్ణి సముదాయించినట్లు సముదాయిస్తూనే కళ్లతో పరీక్షగా చూస్తున్నాడు రాముడు. 


ఇంకా శరణు ఇచ్చాను అనలేదు. మనసులో మాత్రం అభయం ఇచ్చాడు. వానర ప్రముఖుల కోసం ఈ పరీక్ష .  నీ గురించి చెప్పమన్నాడు. విభీషణుడి గురించి ఇప్పటికే హనుమంతుడి ద్వారా కొంత సమాచారం తెలుసు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు చెబుతాడా.. లేదా.. అన్నదే పరీక్ష . 


విభీషణుడు చెప్పడం మొదలుపెట్టాడు. ' రావణుడికి బ్రహ్మవరం ఉంది. దశగ్రీవుడు . సర్వభూతాలపై పెత్తనం సాధించాడు.  తరువాతి సోదరుడు కుంభకర్ణుడు.  ఇంద్రుడిలా యుద్ధం చేయగలడు. సేనాపతి ప్రహస్తుడు . కైలాసంలో జరిగిన యుద్ధంలో కు చేరసేనాపతి మాణిభద్రుడి అంతుచూశాడు.  గోధా, అంగుళిత్రాణ  అనే కవచాలు ధరించినప్పుడు ఇంద్రజిత్తును చిత్తు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. ధనుస్సు  ధరించి అదృశ్యంగా యుద్ధం చేసే నేర్పరి . సమరసమయంలో అగ్నిని ఉపాసించడం వల్ల ఆ అంతర్ధాన యుద్ధ నైపుణ్యం.  ఇక్ మహాపార్శ్వ , మహాదర, అకంపనలు - అనే సేనాపతులయితే ఆయుధాలు పట్టుకుని స్వయంగా యుద్ధంలోకి దిగితే లోకపాలకులు.  లంకలో ఉండే కోట్లాది రాక్షసులు తీవ్రస్వభావులు. శరీరాన్ని కుదించుకుని రక్త మాంసాలు అని హరాయించుకోగలరు. 

' రావణుని కర్మ వృత్తులతో సహా వివరంగా చెప్పావు. ప్రహస్తుడు, కుంభకర్ణులతో  రావణుని చంపి నిన్ను లంకాధిపతిని చేస్తాను. ఇది సత్యం. ప్రతిజ్ఞ .  రసాతలంలో దాక్కున్నా, పాతాళానికి పరుగెత్తినా, వరాలిచ్చే బ్రహ్మ దగ్గరకు వెళ్లినా నాచేతిలో రావణుడు చావడం నిశ్చయం .  నా ముగ్గురు తమ్ముళ్ల  మీద ఆన. కొడుకులు, బంధువులు, సైన్యంతో  సహా రావణుణ్ణి చంపకుండా అయోధ్యా నగర ప్రవేశం చెయ్యను .  రాముడి అయకార తీవ్ర పౌరుష వచూలు విని విభీషణుడు వినయంతో శిరసు వంచి నమస్కరిస్తూ ' రామా! రాక్షస సంహారం, లంకానగర దిగ్బంధనం, రాక్షససేనా ప్రవేశం విషయాలలో ప్రాణాలున్నంత వరకు సాయం చేస్తాను. ' 


విభీషణుడు ఇచ్చిన మాటకు సంతోషంతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు.  లక్ష్మణుణ్ణి పిలిచి ' సముదాజ్జలమానయ ' ( సముద్రం నుంచి నీళ్లు తెమ్మన్నాడు. 


' ఈ మహానుభావుణ్ణి  ఇక్కడే అభిషేకిద్దాం ' అని రాముడు అనగానే సుగ్రీవుడు, అంగదుడు, హనుమదాదులు సంతోషించారు. 


ఆ విధంగా లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షంలో రామశాసనం ప్రకారం విభీషణుణ్ణి లంకాధిపతిగా అభిషేకించాడు. వానరులంతా సాధువాక్యాలు పలకడంతో విభీషణుడి ' మొదటి పట్టాభిషేకం'  దిగ్విజయంగా ముగిసింది


రచన: కర్లపాలెం హనుమంతరావు 

             21 - 09- 2021 

              బోథెల్ ; యూ. ఎస్.ఎ 



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...