Saturday, December 11, 2021

కవిత: బాలగోపాల్, ఓ బాలగోపాల్ - పి.రామకృష్ణ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 





మాకులాగే  నీకూ ఒక్క బ్రతుకే ఉన్నా 

ఆ ఒక్క బ్రతుకులో 

వంద బ్రతుకులు జీవించావు కదా బాలగోపాల్ 


మాకులాగే నీకూ రెండు కాళ్లూ,  రెండు కళ్లే ఉన్నా 

దేశంలో నీ కాళ్లు నడవని ప్రదేశం లేదు  

నీ కళ్లకు కనిపించని  హక్కుల అణచివేతలేదు 


చీమంత  పని చేసామేమో  

కొండంత అలసటతో కూచున్నాం మేము  

ఇదిగో.. ఈ మరణం దాకా 

నువ్వెప్పుడైనా అలసిపోయావా బాలగోపాల్ 

సీమవాడినని అనుకోవడానికి సిగ్గేసింది 

సీమనీటి వివరాల గురించి  నువు  చెప్పాక

పల్లం నుంచి మిట్టకు కూడా ప్రవహించావు  గదా బాలగోపాల్ 

నమ్మకాన్నీ, అపనమ్మకాన్నీ అంతే ధైర్యంగా 

అంతే నమ్మకంగా ప్రకటించావు గదా బాలగోపాల్ 

మేమైతే  నమ్మకం  మీద అపనమ్మకం కలిగినా 

నమ్ముతున్నట్లే కనిపిస్తూ వుంటాం 

ఇప్పుడు నీ కోసం ఏడ్వాలా 

మాకోసం ఏడ్వాలా 

నీ కోసం ఏడిస్తే, నువ్వింకా ఏదో చెయ్యాలనుకోవడం 

లేదా , ఏదో చెయ్యలేదు అనుకోవడం, వద్దు . 

నువ్వు చెయ్యవలసినవన్నీ చేశావ్ 

ఏసుక్రీస్తు చెప్పినట్టూ  ఇక మా కోసమే ఏడుస్తాం... 

- పి. రామకృష్ణ 


( పి.రామకృష్ణ రచనలు నుంచి ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 22-09-2021 

                  బోథెల్, యూ. ఎస్.ఎ


( బాలగోపాల్ భౌతికకాయం దగ్గర కూర్చున్నప్పుడు కలిగిన ఆలోచనలతో తను కూర్చిన కవిత ( పి. రామకృష్ణ దృ ష్టిలో ఇది కవితకాదు . బాలగోపాల్ ను ఒక కవితలో ఇమడ్చటం కష్టం అంటారాయన )  

 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...