Wednesday, December 8, 2021

కథానిక: ఆలస్యం - అమృతం.. విషం - కర్లపాలెం హనుమంతరావు

 కథానిక:


ఆలస్యం - అమృతం.. విషం

- కర్లపాలెం హనుమంతరావు 


ఎడ తెరిపి లేకుండా కురుస్తోంది వర్షం.


వాన నీళ్లలోనే ఈదుకుంటూ వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది ఆటో. బాడుగ చెల్లించి ఆటో దిగి గేటుముందు కొచ్చి నిలబడ్డాడు సిద్ధార్థ .


సెల్ లో సేవ్ చేసుకున్న చిరునామాతో సరి చూస్పుకున్నాడు. గేటుపక్కన గోడలో బిగించున్న ఫలకంమీది పేరుని పోల్చిచూసుకుని సంతృప్తిగా తల పంకించాడు. పక్కనే ఉన్న భార్యామణి శ్రావణితో


"ఇదిగో 'లక్ష్మీ నిలయం' పేరు.. ఇదే.. పద తొందరగా లోపలికి !" అంటూ తనూ మూడేళ్ళ కొడుకు వేళ్ళు పట్టుకుని ఆ తుప్పరలోనే తడుస్తూ నెమ్మదిగా వరండా మెట్లెక్కాడు. కాలింగ్ బెల్ సుతారంగా

మోగించాడు.


రెండు నిమిషాల తరువాత అంతకన్నా నెమ్మదిగా తలుపు తెరుచుకుంది ఓరగా. "ఎవలూ?" అంది ఒక అమ్మాయి తలమాత్రం బైటకు పెట్టి.


"లక్ష్మీ మేడం గారిల్లేదానా ?" అనడిగాడు  సిద్ధార్థ. 

"ఔ.. ?" అందా  పిల్ల. పనమ్మాయి లాగుంది.


"మ్యాడం గారిని కలవడానికి వచ్చాను. నేను తన స్టూడెంటుని.. ఎలిమెంటరీ స్కూల్లో" అని చెప్పుకున్నాడు సిద్ధార్థ.


"ఒక్క నిమిట్" అంటూ లోపలికి వెళ్ళిం దాపిల్ల.


రెండునిమిషాలు తరువాత మళ్ళా వచ్చి తలుపులు పూర్తిగా తెరిచి "లోపలికి రాండ్రి" అంటూ దారి ఇచ్చింది.


అప్పటిదాకా సిద్ధార్థ, పిల్లాడు మెట్ల మీదా.. శ్రావణి మెట్లకిందా .. తుఫాను తేమ గాలిలో చిన్న వణుకుతూ..


చెప్పులు బైటే వదిలి దంపతులిద్దరూ వద్దికగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు. 


బైటకు కాస్త పాత మోడలే అనిపించినా .. లోపలంతా అధునాతనమైన అలంకరణ. 


గోడలమీది రకరకాల ఫోటోలు. ఈ మధ్యనే వేసినట్లున్నారు రంగులు.. ఆ బ్యాక్ గ్రౌండ్లో గ్రాండ్ లుక్ . 


గదిలో వెచ్చగా హాయిగా ఉంది..హీటరు ఆన్ లో ఉన్నట్లుంది.


"మాడం గారబ్బాయి మంచి పొజిషన్లోనే ఉన్నాడనుకుంటా!.. నేను చెప్పలా.. తన హస్తవాసి అలాంటిది మరి" అన్నాడు మెల్లిగా భార్యకు మాత్రమే వినపడేటట్లు.


గుళ్లోని దేవతను తల్చుకుని భక్తుడు పొందే తన్మయత్వంలాగుంది   సిద్ధార్థ పరిస్థితి. శ్రావణికి ఏం జవాబు చెప్పాలో తోచక మెల్లగా తలూపిమాత్రం వూరుకుంది.


ఇంతలో ఒక మూలనుంచి అలికిడి.


డోర్ కర్టెన్ నెట్టుకుని ఎప్పుడు వచ్చి నిలబడిందోగాని.. ఒక మహిళ.. కాస్త ముదురు రంగుకు తేరుతున్న మొహం.. నెరిసిన వెంట్రుకలు.. చూడంగానే గౌరవించాలనిపించే గంభీరమైన విగ్రహం. 


కళ్లజోడులోంచి ఇటే ప్రశ్నార్థకంగా చూస్తూ నిలబడివుంది. 


ఎక్కడికో బైలుదేరబోతున్నట్లుంది ఆమె తయారైవున్న తీరు. 


తటాలుమని లేచి. నిలబడిపోయాడు సిద్ధార్థ. ఆ నిలబడిన తీరులోనే తెలుస్తుంది అతనికి లక్ష్మీ మ్యాడం అంటే ఎంత గౌరవాభిమానాలో.


శ్రావణికీ లేవక తప్పింది కాదు  .


"నమస్తే మ్యాడమ్!" అన్నాడు సిద్ధార్థ  రెండు చేతులు ఎత్తి నిండు మనసుతో నమస్కరిస్తూ. 


ప్రతిగా చిరునవ్వుతో కాస్త తలూపింది గాని.. ఆ మొహంలో ఇంకా ప్రశ్నమార్కు భావం పూర్తిగా తొలగిపోనేలేదు.


అర్థమయింది సిద్ధార్థకు.


మ్యాడం తనను గుర్తుపట్టినట్లు లేదు 'ఎలా గుర్తు పడతారు ! ఎప్పుడో ఇరవై ఏళ్లకిందట చూసారు. అదీ పొట్టి నిక్కర్లలో. గడ్డాలు మీసాలు

వచ్చేసాయి తనకిప్పుడు. పెళ్ళి చేసుకుని ఒక బిడ్డకు తండ్రికూడా అయాడు. హఠాత్తుగా ఇలా వచ్చేసి 'నేను.. సిద్ధార్థను' అంటే మాత్రం గుర్తుపట్టడం సాధ్యమా! ఒక్కో క్లాసుకి నలభైయ్యేసిమంది పిల్లలుంటారు. ఐదు క్లాసులకి సుమారు రెండొందలమంది. అదీ ఒక ఏడాదికి. ఎన్నేళ్ళ బట్టి చేస్తున్నారో.. ఈ టీచరు ఉద్యోగం! ఎంతమంది సిద్ధార్థలనని గుర్తుపెట్టుకుంటారు. అందులోనూ క్లాసులో తను అంత బ్రైట్ స్టూడెంటు కూడా కాదు.'


"రాజీ..!" అంటూ లోపలికి కేకేసిందా మ్యాడం.


" కూర్చోండి ! "అని సైగ చేసింది మ్యాడం నిలబడి వుండగా తను కూర్చోవడమా! 


 అతని తటపటాయింపు ఆమెకు అర్థమైనట్లుంది.. చిరునవ్వుతో తనూ అక్కడే వున్న ఒక సోఫాలో కూలబడింది.. చేతికర్ర సోఫా పక్కనానించి.


అప్పుడు గానీ కూర్చోలేదు సిద్ధార్థ.

 ఆ కూర్చోవడం కూడా మాటవరసకు కూర్చోవడమే. 


' ఈ కాలంలో కూడా పాఠాలు చెప్పే పంతుళ్లంటే ఇంత గౌరవభావాలున్న వాళ్ళున్నారా!' లక్ష్మీ మ్యాడంకి ఆశ్చర్యంగా ఉంది. ముచ్చటా వేసింది. 


ఆబ్బాయికన్నా ఆ అమ్మాయే కాస్త నయం లాగుంది. ఆ కూర్చునే తీరులోనే తెలిసిపోతోంది' అనుకుంది మనసులో.


"ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మ్యాడం! ఇప్పటికి తెమిలింది. " 


శ్రావణి మర్యాదకోసం అంటున్నట్లు వింటోంది, సమయానికి పనమ్మాయి మంచినీళ్ళు తేవడంతో ఆ ప్రసంగానికి బ్రేక్ పడింది. 


మళ్లీ సంభాషణ ఎలాగోలా మొదలు పెట్టాలిగదా.. "మీ నాన్నగారు.. అమ్మగారు బాగున్నారా?" అనడిగిందిలక్ష్మీ మ్యాడం. 


" మీకు తెలీదా..మా నాన్న పోయి మూడేళ్లయింది మ్యాడం. అమ్మా ఆ దిగుల్తోనే మంచం పట్టి మొన్నీ మధ్యనే పోయింది. ఈసారొచ్చింది ఆ పని మీదే. ఎప్పుడొచ్చినా మిమ్మల్ని కలుద్దామనుకుని తెగ ట్రై చేస్తుంటాను. ప్.. ఎప్పుడూ కుదర లేదు. ఇప్పటికి వీలయింది. అదీ ఈ సారి ఎట్లాగైనా మిమ్మల్ని కలుసి తీరాలన్న గట్టి పట్టుదలతో ఉండబట్టి"


 సిద్ధార్థ మొహంలో ఆనందం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. 


తప్పిపోయిన తల్లిని మళ్ళీ కలుసుకున్న తువ్వాయి సంతోషంలా ఉందది. 


లక్ష్మిమ్యాడంకి సంభాషణెలా ముందుకి కొనసాగించాలో సమస్యగా ఉంది. 


వూరికే వింటూ కూర్చోవడంకూడా మర్యాదనిపించుకోదు కదా ! 


" చాలా సంతోషం బాబూ ! ఇప్పటికైనా వచ్చావు. ఏం ఉద్యోగం? ఎక్కడా పని ?"అనడిగింది చివరికి. 


"బి ఎస్ ఎఫ్ కి వెళ్లిపోయా మ్యాడం. మొన్నీ మధ్యనే ప్రమోషనొచ్చింది. ప్రస్తుతం అస్సాం బోర్డర్సులో పోస్టింగు. మీకు చెప్పేదేముంది మా కుటుంబం సంగతి ! మీరే కనక ఆరోజు అట్లా అడ్డుకోక పోయుంటే మా నాయన ఆనాడే నన్ను ఏగొడ్ల సావిట్లోనో పడేసుండే వాడు. ఇప్పుడిట్లా మీముందు కూర్చునే యోగం ఉండేదా?"  సిద్ధార్థ కంఠం వణుకుతోంది. 


బహుశా కృతజ్ఞతాభావంతో కూడిన భావోద్వేగంతో కావచ్చు. భార్యతో అంటున్నాడు " ఈ మ్యాడం నన్ను వూరికే హైస్కూల్లో చేర్పించి వూరుకోలేదు శ్రావణీ ! పుస్తకాలకీ .. మధ్యమధ్య ఫీజులకీ తనే భరించేవారు. మలేరియా వచ్చి మూలుగుతూ పడుంటే ఇంట్లో వాళ్లెవళ్లూ పట్టించుకున్న పాపాన పోలా. బడికెందుకు రావడం లేదో కనుక్కుందామని వచ్చి నా అవతారం చూసి అక్కడే బావురుమన్నారీమె. నాకిప్పటికీ నిన్నగాక మొన్న జరిగినట్లుంది.. మ్యాడం మానాన్న మీద కూకలేయడం. 

పెద్దాసుపత్రిలో చేర్పించి బాగై బడికొచ్చిందాకా మా అమ్మకన్నా ఎక్కువగా అలమంటించారీ తల్లి. ఈమె గాని మా గంగానమ్మ తల్లిలాగా నా జీవితంలోకి రాకపోయుంటేనా.." వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అంత పెద్ద మిలటరీ మనిషీ చిన్న పిల్లాడై పోయి పరాయి పంచలో కూర్చొని. 


పక్కనున్న భార్యకు ఇదెంత ఇబ్బందిగా ఉంటుంది ! 


శ్రావణి అసహనంగా కదులుతోంది సోఫాలో. పరాయివాళ్లముందు చెట్టంత మొగుడిని పట్టుకుని సముదాయించడమెట్లా? 


పోనీ మందలిద్దామన్నా ఇబ్బందికరమే! 


లక్ష్మీమ్యాడంకి ఇదంతా నిజంగానే కొత్త అనుభవం . 


 కదిలిపోయింది.


లౌక్యంగా బైటపెట్టింది.


తనకూ ఆసుపత్రికి పోవడానికి ఆలస్యమైపోతుందవతల. ఏ క్షణంలో ఏ కబురొస్తుందోనని మనసులో కంగారుగానే వుంది.


'పాపం..ఎన్నేళ్ళబట్టో వెతుకుతున్నాడుట ఈ అడ్రసు కోసం .. ఒక్క పది నిమిషాలు ఓపిక పడితే పూర్తి సంతృప్తితో వెళ్ళిపోతాడు'.


ఇష్టమైన టీచర్సు ఎన్నో ఏళ్ల తరువాత కలుసుకున్న ఆనందం ఈ అమాయకుడినుంచి దూరం చేయడం భావ్యం కాదనీ అనిపించింది. 


అందుకే..  సెల్ లోపల రాజీ చేతికిచ్చి వచ్చింది. అది లోపలనుంచి ఒహటే సైగలు.. ఎందుకో ? "కాఫీ పంపిస్తాను.. తాగుతుండండి.. బోర్నవిటా తాగుతాడుగా బాబు? ఇప్పుడే వస్తా" అని పనిపిల్లకు చెప్పే మిషతో వంటింట్లోకి వెళ్ళి సెల్ అందుకుంది. 


అవతల్నుంచీ ఏ కబురు విన్నదో కానీ అసలే పాలిపోయిన మొహం మరింత తెలుపు రంగుకి తిరిగింది. 


' అడుగుదామా.. వద్దా' అని ఒక క్షణం తర్జన భర్జన పడి చివరికి ఇక్కడి విషయం డాక్టర్ గారికి చెప్పేసింది.


అతి కష్టంమీద ఆయన్ను వప్పించుకోవడంతో మరో రెండు గంటలు సమయం కలిసివచ్చినట్లయింది.


కొద్దిగా రిలీఫ్!


"రెండు గంటల్లోపయితే నో ప్రాబ్లం అనుకుంటా. ఏదైనా మన చేతుల్లో లేదుగా! వుయార్ ఆఫ్ ట్రాల్ హ్యూమన్ డాక్టర్స్. బట్ యూ షుడ్ బి ఎవేరాఫ్ యువర్ అర్జెన్సీ ఆల్ఫో.. రెస్ట్ ఈజ్ యువర్ ఛాయిస్ " అంటూ చిన్న హింటుతో హెచ్చరించడమైతే మర్చిపోలేదా డాక్టర్.


'అవును.. అర్జెన్సీ తెలుసు. ఐనా ఒక్కో సారి ఇలాంటి పరీక్షలూ తప్పవు. ఈ పరీక్షలు మన విచక్షణకు. 


ఎవరి మనసులకి వాళ్లే డాక్టర్లు ఇటువంటి సందర్భాల్లో. 


 ' కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చే సందర్భంలో తరచూ తను చెప్పే సూక్తుల్లో ఒకటది. 


' ఇప్పుడు తనకు తానే వర్తింపచేసుకోవాల్సిన సమయం వచ్చింది' అనుకుంది లక్ష్మీ మ్యాడం. 


' ఈ సిద్ధార్థ 'విజిట్' ని సాధ్యమైనంత ఎర్లీగా ముగించి క్షేమంగా బైటపడటం అందరికీ మంచిది' అని తనకు తానే హెచ్చరించుకుంటూ బైటికొచ్చిన లక్ష్మీమ్యాడం అక్కడి సీన్ చూసి దాదాపు అవాక్కయిపోయింది.


అప్పటిదాకా నీట్ గా వున్న టీపాయ్ మీద పూలూ.. పళ్లూ.. పసుపూ.. కుంకుమా.. టెంకాయా.. అగరబత్తులూ వగైరా వగైరా పూజా సామాగ్రి!


ఎప్పుడు మార్చారో పిల్లవాడి వంటిమీద అంచులకి పసుపు రాసిన కొత్త డ్రస్సు..


వాడి వళ్ళో కొత్త పలకా.. చేతిలో కొత్త బలపం! 


పెద్ద వెండి పళ్ళెంలో అక్షతలు  కలుపుతోంది శ్రావణి శ్రద్ధగా. 


వెంట తెచ్చుకున్న బ్యాగులో నుంచి ఒక్కో ప్యాకే వైనంగా తీసి టీపాయ్ మీద సర్దుతున్నాడు సిద్ధార్థ. 


ఇదో అనూహ్యమైన మలుపు. ఏం జరుగుతుందో అర్థంకాక అయోమయంగా చూసింది లక్ష్మీ మ్యాడం. 


వినయంగా అన్నాడు సిద్ధార్థ " పుట్టెంట్రుకలు తీయకుండా అక్షరాభ్యాసం కూడదంటారు కదా మీరు! మా తమ్ముణ్ని బళ్ళో వేసే ముందు పుట్టెంట్రుకలు తీయించమని ఎంత పట్టుపట్టారో.. నాకు ఇప్పటికీ గుర్తే. మీ చల్లని చేతుల మీదుగా మా పిల్లాడికి అక్షరాభ్యాసం జరగాలని నా కోరిక మ్యాడం. అందుకే మొన్న మీ అడ్రసు దొరకంగానే ముందు చేసిన పని . . మన చిత్తూరుదాకా పోయి మా గంగానమ్మ గుళ్ళో వీడికి పుట్టెంట్రుకలు తీయించడం. నిజానికి నా సెలవులు ఎప్పుడో ఐపోయాయి. అనాథరైజ్డ్  అబ్ స్కాండంటే మా సర్వీసుల్లో కొద్దిగా రిస్కే. మళ్లా నాకిటువైపు రావడం పడుతుందో.. లేదో ! మీ చేతుల మీదుగా మా బాబు అక్షరాభ్యాసం జరగాలని డేర్ చేసాను.. ప్లీజ్! మావాడి భవిష్యత్తు నాకన్నా ఉజ్వలంగా ఉండాలని దీవించండి ! మీ చల్లని చేతులతో వాడికి ఓనమాలు దిద్దపెట్టండి మ్యాడం " ఒక రకమైన ఉద్వేగంతో మాట్లాడుకుంటూ పోతున్న సిద్ధార్థ మాటలకు లక్ష్మీమ్యాడం నోటమాటరాలేదు. 


ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఉహించని ఈ సిట్యుయేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో బోధపడలేదు.


'నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి వానలు.

వాగులు వంకలూ పొంగి పొర్లుతున్నాయి. రవాణా సౌకర్యమంతా అస్తవ్యస్తమయి పోయింది. తప్పకపోతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని టీవీల్లో అరగంట కోసారి హెచ్చరికలొస్తున్నాయి. ఐనా పిల్లాడికి తన ప్రియమైన టీచరు చేతిమీదుగా మాత్రమే అక్షరాభ్యాసం చేయించాలని ఎంత పంతం ఇతగాడికి! టీచరుగారి సెంటిమెంటుని గౌరవించటం కోసం ఫ్రీ ట్రావెలింగ్ కన్సెషన్ని కూడా కాదనుకొన్నాడు సరే.. అది ఆర్థికం.. పసి ప్రాణాన్ని కూడా రిస్కులో పెట్టి  ఇలా తుఫానులో ఈ మూలనుంచి ఆ మూలకు, మళ్ళా ఆ మూలనుంచి ఈ మూలకు.. తిరిగొచ్చిన ఈ పెద్దమనిషిని ఏమనుకోవాలి!


ఎక్కడెక్కడి ప్రవాసులో వీలు చూసుకుని వచ్చి మరీ బాసరలో పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించుపోతుంటే.. ఈ చిత్రమైన మనిషేంటి.. సాక్షాత్తూ ఆ చదువులతల్లి చల్లని వడిదాకా వచ్చీ 'లక్ష్మీ మ్యాడమో' అని కలవరిస్తున్నాడు!'


లక్ష్మీమ్యాడం తన ఆశ్చర్యాన్ని అణుచుకోలేక పోయింది. బైటికి అనకుండానూ ఉండలేకపోయింది. 


సమాధానం శ్రావణి చెప్పిందీసారి "మావారి వరకూ మీరే మా ఇంటి చదువుల తల్లి. ఈ లక్ష్మీనిలయమే ఈయనకు బాసర మ్యాడం. మీ గురించి రోజూ మాకు కథలుకథలుగా చెపుతుంటారీయన. మా అందరి దృష్టిలో మీరు మా ఇంటికి ఇంత ప్రసాదం పెట్టిన దేవత. పెద్దమనసుతో ఈ పిల్లవాడికి మీ దీవెనలు అందచేయండమ్మా"


రెండు గంటల్నుంచీ ఇక్కడే కూర్చున్నా.. శ్రావణి ఇన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడే. 


అవి చాలా పదునైన మాటలు. ఎదుటి వాళ్ళను కట్టిపడేసే పలుకులు. 


పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది లక్ష్మీ మ్యాడంకి.


'కాస్త ఆలస్యమైనా తప్పదు.. ఇదీ ఇటువైపు తాను నిర్వహించాల్సిన మరో ధర్మకార్యమని సరిపెట్టుకుంటే సరి.


' మనసులోకి ఇంకే సందేహాలు రానివ్వదలుచుకొలేదు. ఇటే మిడిగుడ్లేసుకుని చూస్తున్న రాజీ వంక చూసి" అలా దీపస్తంభంలాగా నిలబడకపోతే వాళ్ళకి కాస్త సాయం పట్టరాదుటే. పని తొందరగా తెమిలితే వాళ్ళు వేళకి బండికి అందుకుంటారూ" అని పురమాయించి. 


 లోపలి గదిలోకి వచ్చేసింది డాక్టరుగారికి ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకుంటూ విషయం వివరించడానికి ప్రయత్నించింది.


"మీరు చేస్తున్నది నిజంగా మంచి పనేనంటారా? " డాక్టర్ గారి ధర్మ సందేహం 


".. ఆ లక్ష్మీ మ్యాడం హస్తవాసిమీద పిచ్చినమ్మకంతో బిడ్డకు ఇప్పటిదాకా అక్షరమ్ముక్క అబ్బకుండా ఎండబెట్టాడు ఈ మహానుభావుడు. ఆ మ్యాడం నిర్లక్ష్యం వల్లే చెడ్డసావాసాలకు అలవాటుపడ్డ ఆమె బిడ్డ ఈ లక్ష్మీనిలయాన్ని పోగొట్టుకున్నాడని పాపం వీళ్ళకు తెలీదు డాక్టర్. కని పెంచిన సొంతబిడ్డకు కూడా చివరి రోజుల్లో భారమైన ఆ తల్లి.. ఎప్పుడో చిన్నతనంలో పాఠాలు చెప్పించుకున్న పిల్లాడి దృష్తిలో మాత్రం అపర సరస్వతీదేవి ! ఒక్క అతనికే కాదు.. ఆ ఇంట్లో పసివాడితో సహా అందరి దృష్టిలో ఆమె ఓ 'దేవతామూర్తి' లాగే ఉంది. పిల్లలు ఇవాళా రేపు తోటి మనుషుల పట్ల ఎలాంటి తుస్కార భావాల్తో ఎదుగుతున్నారో మనకు తెలుసు. చూస్తూ చూస్తూ నిజం చెప్పేసి ఆ పసివాడి మనసులోని ఒక మంచి భావనను చెదరగొట్టడం భావ్యమంటారా?" అంటూ ఎదురు ప్రశ్న వేసింది మిస్ లక్ష్మీ రమణ. 


డాక్టరు గారి దీర్ఘమైన నిట్టూర్పు వినబడింది ఫోన్లో "ఓకే.. మ్యాడం. ఒక ప్రిస్టీజియస్ ఇంజనీరింగ్ కాలేజీకి పాతికేళ్ళు ప్రిన్సిపాలుగా చేసి రిటైరయిన విజ్ఞత మీది. ఆ లక్ష్మీమ్యాడం ఎవరో కాని నిజంగా చాలా అదృష్టవంతురాలే ! లేకపోతే అదేపేరుతో ఉన్న మీరు ఆమె కొడుకునుంచి ఈ ఇల్లు కొనుక్కోవడమేమిటీ!   ఆ అడ్రసు పట్టుకుని ఇప్పుడామె శిష్యుపరమాణువు ప్రత్యక్షమవడమేమిటీ! వీలైనంత తొందరగా ఈ రీల్-లైక్-స్టోరీని సుఖాంతం చేసేసి వచ్చే ప్రయత్నం మాత్రం చేయండి మ్యాడం. గుడ్ లక్ ! అని ఫోన్ పెట్టేసారు డాక్టర్ గారు.


అక్షరాభ్యాసం తంతు ముగించేందుకు ఇంటి పురోహితుడి సెల్ నెంబరు వెదుక్కోవడంలో మునిగిపోయింది మ్యాడమ్ లక్ష్మీ రమణ. 


ఆలస్యమంటే అస్సలు గిట్టని లక్ష్మీమ్యాడం 'ఇప్పుడే వస్తాన'ని లోపలికి వెళ్ళి ఇంతసేపు ఎందుకు  తాత్సారం చేస్తుందో అర్థం కాక బైట ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాడు సిద్ధార్థ . 


అసహనంగా గోడగడియారం వంక చూస్తోంది శ్రావణి.. ఇవాళ కూడా  బండికి లేటవుతుందేమోనని ఆమె కంగారు ఆమెది . 


                *.                     *.                          *.                         *


ఐన ఆలస్యం ఎలాగూ అయింది. ఇంకొక్క రెండు వాక్యాలు ముక్తాయింపుగా చెప్పుకోక పోతే ఈ కథా శీర్షికకు న్యాయం జరిగినట్లు కాదు.


లక్ష్మీరమణ గారింట్లో అక్షరాభ్యాసం తంతు ఎంత ఆదరాబాదరాగా ముగించుకుని స్టేషనుకు పరిగెత్తినా బండి మిస్సయిపోయింది సిద్ధార్థ కుటుంబానికి. 


బల్హర్షా దగ్గర బ్రిడ్జి మీద పట్టాలు తప్పి నదిలో దూకిన బోగీల్లో ఒకటి సిద్ధార్థ  ఫ్యామిలీ బెర్తులు బుక్కైనవే!


'ఆలస్యం వల్ల విషం అమృతమయింది ' అనుకుని ఆనందించటమా?


లక్ష్మీమ్యాడం పాత్ర అత్యంత ప్రతిభావంతంగా పోషించిన అనంతరం లక్ష్మీరమణ మ్యాడం ఎంత ఆఘమేఘాలమీద ఆసుపత్రికి పరుగెత్తుకెళ్ళినా కని పెంచిన తల్లి ఆఖరి చూపులు దక్కించుకోలేక

పోయింది. 


జీవితాంతం తొలిచే లోటే అది.


'ఆలస్యం- అమృతం వంటి  అమ్మ కడసారి   చూపులకు నోచుకోలేనంత విషాదపు  క్షణాలుగా  ఓ కూతురుకు మిగిలిపోయాయి అని' చింతించడమా ? 


ఆలస్యం వల్ల – విషం అమృతమా ? 

అలస్యం వల్ల అమృతం విష తుల్యమా? 


 ***


- కర్లపాలెం హనుమంతరావు 

05 - 11 - 2021 


బోథెల్ ; యూఎస్ఎ 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...