Wednesday, December 8, 2021

విషాదం - కవిత



 విషాదం 

- కర్లపాలెం హనుమంతరావు 

( సాహిత్య ప్రస్థానం - మాసపత్రిక - ప్రచురణ ) 


కాలం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డావు. పాటా!... 

పడింది నవ్వే కాదు... నీ పాదాలు పట్టుకుని వేలాడుతున్నందుకు అందరం


నీ స్వచ్ఛంద మరణంతో చైతన్యం ఒక క్షణం స్పృహ తప్పిన మాట నిజమే. 

కానీ తొందరగానే తేరుకుంటుందిలే....


జీరబోయిన నీ రాగమే తిరిగి సర్దుకోవడం కష్టం. 

తాకట్టు కొట్టు వాకిట్లో తచ్చాడుతున్నప్పుడు 

నీకిదంతా ఎందుకు తోచలేదో...

ఇలాంటి ఒక విషాద పశ్చాత్తాప ఘడియ ఏ గేయానికి రాకూడదు.


'చే' స్పర్శకే వజ్రం పగలటం విషాదం కాక మరేమిటి?

చెమట బిందువు మీదపడి

పరావర్తనం చెందే కిరణానికున్న వెలుగు 

చెమ్కీ దండ  మీద పడితే వస్తుందా?! 


తెలిసి తెలిసీ పాటా!... 

నువ్వు ఈ పరకాయ ప్రవేశం ఎందుకు చేసినట్లో! 

భ్రాంతినీది... దిగ్భ్రాంతి మాది. 

వసంతానికి తప్ప దేనికీ గొంతు విప్పని పిట్ట 

చిలుకలాగా పలకాలని ఎందుకనుకుందో! 

కత్తి అంచున నిలబడి గొంతెత్తి ఆడిపాడిన ఆ పాట నిజమా?... 

చేతిలో చెయ్యేసి చెట్టపట్టాల్ పట్టి 

కొత్త రాగంతో పాడుతున్న ఈ పాట నిజమా! 


ఒకటా... రెండా... ఎన్నియుగాల బట్టి 

నిప్పు కణికలను పుక్కిటబట్టి 

రవ్వలు వెదజల్లావు పాటా!


పుటిక్కుమని ఇలా 

రెండు రూపాయలు కొక నీటి పాకెట్ గా మారిపోయావేమిటి?! 

కలల్ని హరాయించుకోవటం అంత తేలికా? 

నిన్ను మోసిన భుజాలే నడిబజార్లో నిన్నిలా నిలదీస్తుంటే 

నీ గురించి కాదు గానీ 

నిన్ను నమ్ముకుని వచ్చిన ఆ కలల్ని గురించే 

జాలిగా ఉంది. 


వేళ్లు నరికినా, తలను తెంపినా 

ఆ కలలు మొండేలు నీ పాటే పాడుకున్నాయి 

వాటి పెదాల కిప్పుడు పదాలు తట్టని పరిస్థితి

తాత్కాలికంగానైనా తెచ్చిపెట్టింది. .. నీవేగా! తప్పు నీదే! 


సుడిగాలి నెదుర్కునేదేగా అసలైనపాట! 

నెత్తురు మీద పూచిన పువ్వు అంత తొందరగా వాడిపోదులే! 

మడుగును అడుగుకింతని నువ్వమ్ముకున్నా 

అడుగునున్న తడిని అమ్మటం నీ తరం కాదు... 

కొనటం వాడబ్బ తరమూ కాదు 


పాట మెలికపడొచ్చేమోగాని దాని ఆత్మది సూటి దారే! 

శ్రమజీవుల చెమట నుంచి పుట్టినది 

ఏ పరిశ్రమల జీవోలకు లొంగదు 

ఒక పాటకు రెండు నాలికలుంటాయని చెప్పి 

నువ్వే ఎటూ కాకుండా పోయావు. పిటీ! 


కవాతుకు ఒకపాట తగ్గటం మాత్రం ఒక విషాదమే!


- కర్లపాలెం హనుమంతరావు 

( వంగపండు.. బూర్జువా రాజ్యాన్ని పొగుడుతూ చిందేయడం చూసిన విషాదంలో  ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...