Saturday, December 4, 2021

ఈనాడు - గల్ఫిక- హాస్యం - వ్యంగ్యం ' లా ' వొక్కింతయు లేదు .. - కర్లపాలెం హనుమంతరావు

 


ఈనాడు - గల్ఫిక- హాస్యం - వ్యంగ్యం 


' లా ' వొక్కింతయు లేదు .. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 22 -11-2003 - ప్రచురితం ) 


'వాట్ ఈజ్ ది ఓల్డెస్ట్ ప్రొఫెషన్ ఆఫ్ ది వర ల్డ్'-  అనడిగాడు అప్పారావు.


అప్పారావు చెనలాయ (చెట్టు కింద వకాల్తా చేసే లాయరు)గా తిరిగే రోజుల్లో కోర్ట్  బార్లో కన్నా కోర్టు బైటున్న బారులోనే  ఎక్కువగా ఉంటుండటం వల్ల బిల్లు తడిసి మోపెడై మోపెడ్ అమ్ముకున్నా తీర్చలేని స్థితిలో అప్పారావునే అల్లుడిగా బిల్లుకి చెల్లేసుకున్నాడా బార్ అండ్ రెస్టారెంట్ ప్రొప్రయిటర్. 


 అప్పారావుకిప్పుడు పెర్రీ మేసన్ కు  ఉన్నంత  పేర్లేకపోయినా ఈ బారు మూలంగా చౌకబారు జనం బారులు తీరుంటారని పేరుంది.  కోర్టు బైటా లోపలా కూడా మామా అల్లుళ్ళలా ఎడాపెడా జేబులు కొడుతున్నారని గిట్టని వాళ్ళు కుళ్లుకుంటుంటారు. అది వేరే కథ


సత్తిరాజు కొడుకు పెళ్ళి సందర్భంగా ఓల్డు బాయిస్సందరికీ అప్పారావు బారులో ఆతిథ్యమంటే ఓ పది మంది పాత మిత్రులదాకా పోగయి కూర్చున్నాం. మనిషి కనబడితే చాలు... ప్రశ్నల్తో ప్రాణాల్తీయటం అప్పారావు వృత్తి, ప్రవృత్తి.  అందుకే ఇందాకా ప్రశ్న.


'ఆడమ్ ఆరో పక్కటెముకనరగతీసి మేడమ్ ను  చేశాడా దేవు డని కదా బైబిల్ కథ! సో... సర్జరీ ఈజ్ ది ఓల్డెస్టు సబ్జెక్ట్ ఆఫ్ ది సొసైటీ' అనేశాడు సత్తిరాజు.  వాడు డాక్టరు. 


' సత్తీ! ఆపు నీ సుత్తి' యాడమ్మైనా, మేడమ్మైనా ఉంటానికి  ... తింటానికి  ఓ ఇంటి పంచా, తినే పండూ ఉండాలి కదా! ఈ ప్రపంచాన్ని సృష్టించింది దేముడిలోనింజనీరే... సో..! ' 


' యువర్ ఆవర్!  సర్జరీ ఈజ్ ఆఫ్టర్ అవర్ ఇంజనీరింగ్ ' అన్నాడు.

రంగారావు . మామ రియలెస్టేట్లో వాడు సివిలింజనీరు. 


' దేవుడైనా ప్రపంచాన్నెలా సృష్టించాడు? కన్ఫ్యూజన్ నుం చే కదా! .. అయ్ మీన్... అయోమయం...! దాన్ని సృష్టించిం దిదిగో మన అప్పారావులాంటి లాయర్లేరా రంగారావ్! సో. . త్రీ ఛీర్స్ టు హిమ్.. ' అంటూ విశ్వనాథం గ్లాసు గొంతులోకి వంపేసుకున్నాడు. 


వాడికి లాయర్లకీ పడదు.


గెలాక్సీలు గుద్దుకున్నప్పుడు గెలీలియో తీసిన ఫొటోల్లో కూడా కొన్ని నల్లకోటు విగ్రహాలు ఆయా గ్రహాల  చుట్టూ తచ్చాడు తున్నట్లు నాసా కేంద్రం ఈమధ్యే కన్ఫర్మ్ చేసింది.. కదరా వాసూ' అంటూ వాసుగాడిని కూడా తన వైపు కలుపుకోబోయాడు విశ్వనాథం. 


వాడు శ్రీహరికోటలో చిన్న సైజు సైంటిస్టు.  సాహిత్యమంటే చచ్చేంత ఇంటరెస్టు. 


'మీ మాటలు నమ్మటానికి లేదు.  రామాయణం రోజుల్లో లాయర్లే  ఉండుంటే సీతమ్మోరికి ఆ శీల పరీక్ష జరిగుండేదా? సాక్ష్యాల్లేకే  ఆ సాథ్వీమణి పాపం నిప్పుల్లో దూకింది.  భారతం కాలంనాటిక్కూడా ప్లీడర్లున్నారో లేదో డౌటే! తన్నోడి నన్నో డెనా? ... నన్నోడి తన్నోడెనా?  అని నాడు నిండు సభలో ద్రౌపదలా తన్నుకులాడినా నోరు మెదిపిన నాథుడే లేడు.  ప్లీడర్లే గనకుంకుంటే ద్రౌపదికా దుశ్శాసనుడి పీడానే ఉండేది కాదుకదా!'


'కన్యాశుల్కం నాటకం నాటికి కోర్టులు గట్రాలు పుట్టుకొ చ్చాయి.  గనక పూటకూళ్ళమ్మ మెళ్లో పుస్తె కట్టకముందే కునిష్ఠి ముసలాడు గుటుక్కుమన్నాడని లంచమిచ్చి మరీ పరోహితుడి చేత సాక్ష్యం చెప్పించగలిగారు. పోతనగారు కూడా పాపం ఏదో కోర్టులో బాగా దెబ్బ తిన్న నేపథ్యంలోనే 'లావొక్కిం తయు లేదని '  పద్యంలో 'తెగబాధ పడ్డాడు' అన్నాడు విశ్వ నాథం మళ్లీ. 


వాడి బావమరిది భోపాలు గ్యాసు లీకుపాలై కోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్నాడని వాడిక్కోపం.  బిన్ లాడెన్నూ, వీర ప్పన్నూ అప్పారావునీ ముందుబెట్టి రెండు గుండ్లున్న గన్నిచ్చి కాల్చుకోమంటే అప్పారావునే కాల్చేస్తాడు రెండుసార్లూ.  లోకం కాల్తా ఉంటే వకాల్తా కోసం వెంపర్లాడే రకాలు లాయర్లని .. వీడి నిరసన. ప్లీడర్ల కోట్లకి జేబులే ఉండవు. వాళ్ల చేతులెప్పుడూ క్లయింట్ల పాకెట్లలోనే ఉంటాయంటుంటాడు. 


వీడిబారినుంచీ అప్పారావును కాపాడుకోలేకపోతే బారు బిల్లు చెల్లించలేక మేము బేరుమనాల్సొస్తుందని..  ప్లీడర్లంటే ఇన్ బిల్డ్ లీడర్లని ఆ పదాన్ని బట్టే పసివాడైనా పసిగడ్తాడని వాదన కెళ్లాన్నేను . ' అవునవును. ఆ ప్లీడర్ అన్న పదంలోనే 'డర్' కూడా ఉందనే నా

' భయం' అన్నాడు వాడు. 


ఇండియన్ ఇండిపెండెంటు స్థగుల్ మూడొంతులు ప్లీడర్ల మీదే డిపెండయి నడిచిందని నీకు తెలుసా? స్వాతంత్య్రానంతరం సైతం రాజ్యాంగ రక్షణ కోసం న్యాయ వ్యవస్థంతెవస్థ పడుతోందో చెబుతూ కూర్చుంటే తెల్లార్లూ ఈ బారిలాగే తెరిచి కూర్చోవాలి. అలాంటి లా వ్యవస్థకి ఈ వకీళ్లే కీలకం! 


' అందుకనేనా..  'లా ' నలా కీలు బొమ్మలా ఆడిస్తూ ఏ కీలుకా కీలు వూడదీస్తున్నారీ వకీళ్ళు?  మొన్న వినుకొండలో తీర్చుకు పది వేలు బేరం పెట్టాడో బారిష్టరు! ' 


' ఇప్పటి దాకా చప్పుడు చేయని అప్పారావప్పుడు నోరు తెరచాడు 'న్యాయదేవత చేతి లోని త్రాసుని చూసి తీర్పుల్ని తూకానికే అమ్మాలని నమ్మేడేమో పాపమా అమాయకుడు! తీర్పు నీ పక్క కొరగాలంటే నువ్వు నా పక్కకు జరగాల్సిం దేనని ఓ లాయరు లేడీ క్లయింట్ కొంగులాగాట్టగా  రాజస్థాన్ లో? ' 


' ధర్మార్ధ కామ మోక్షాలన్నారు  కదా ! ధర్మాన్ని అనుసరిస్తేనే మోక్షమని దానర్ధం'


' బెయిల్ కోసం బెంచినే మార్చి తీర్పుని దర్జాగా మార్చేశారు  బీహారు లాయర్ల సజ్జు' 


'ముల్లును ముల్లుతోనే చులాగ్గాలాగొచ్చనే లాజిక్కుకది కొత్త వరవడి'


'అంతెందుకూ .. నిన్నటికి నిన్న బెజవాడలో ఏకంగా ఒక నకిలీనే నిందితుడిగా కోర్టులో చూపెట్టాడో వకీలు! '


విశ్వనాథం చెప్పేవన్నీ వాస్తవాలే. విషయమెంతా  వాస్తవమైనదైనా సాక్ష్యం లేకుంటే అది సత్యం కాలేదనేది న్యాయశాస్త్రంలోని ప్రథమ సూత్రమని తెలుగు చిత్రాలు చూసే ప్రతి పిల్లాడికి తెలుసు. లంక కోర్టులై నా ఆ పులి  ప్రభాకరానికి నాలుగొందలు జైలు శిక్షా? !  జీవితకాలం పొడిగింపు కోసం దేవుడి కప్పీలు  చేసుకుంటారా ఎల్టీటీయీ!  మెహతా పోయినా కేసే  నడుస్తూనే ఉందింకా! ' 


 ఒక నిర్దోషి శిక్షింపబడకుండా ఉండే ముందు వందమంది దోషులదాకా తప్పించుకొనేందుకు వీలుందని వాదించే వాళ్లను,  బంతుల్లా  చేసి కోర్టులో లాయర్లు ప్లేయర్లై  ఆడుతుంటేను చూడలేక లా దేవతలా కళ్లగంతలు కట్టేసుకుందేమో ? రెండు రెళ్ళు నాలుగని ఒప్పుకొనేందుకు ఇన్ని - దావాలూ, వాయిదాలూ, వాదాలూ, ప్రతివాదాలా?! '


' లాగటంలోనే అంతా ఉందిగదా సోదరా!  సొసైటీని మా లాయర్లు లేయర్లలాగా కాపాడకపోతే లౌక్యం లేని నీబో టివాళ్లు పది మధ్య సున్నా ఉందంటే వందని వెంటనే ఒప్పు కొనే ప్రమాదముందని తెలుసుకోముందు' 


' పది మధ్య సున్నా పెడితే మరి వంద కాదా?' 


'వందా కావచ్చు. పందీ  కావచ్చు. సందర్భాన్నిబట్టి సత్య మేవ జయతే సబ్జెక్టు టూ గట్టి లాయరు'


ఇంతలో బిల్లొచ్చింది. ఐదువేలు! 


అప్పారావన్నాడు విస్సుగా ' తొగాడియా టైపులో  నన్ను తెగాడిపోసుకొన్నావుగా ఇందాక!  నువ్వన్నావే నాసా అని!  అలాంటి కేంద్రమే ఏదో కొత్త ప్రయోగం చేయబోతూ రాకెట్లో వృత్తినిపుణుణ్ణి పైకి పంపాలనుకుని ఇంటర్వ్యూలు చేసింది. సత్తిరాజులాంటి డాక్టరొచ్చి కోటి రూపాయలు కాంపెన్షేషనిస్తే పోతానన్నాడు. ' 


రంగారావులాంటింజనీరు రెండు కోట్టిస్తే రెడీ అన్నాడు. మనలాంటి లాయరు మూడు కోట్లకు బేరం పెట్టి మరీ సెటిలేయించుకొచ్చాడు. ఎలాగో చెప్పగలరా ఎవరైనా?


ఒక ప్లీడరు  పీడా అయినా  భూమికి వదుల్తుందని ఒప్పుకొనుంటరులే ! - అన్నాడు విస్సుగాడు విసుగ్గా. 


 'మట్టి బుర్రలకంత తొందరగా తట్టేది కాదుగా ని.. బారు  మూయటానికింకో అరగంట మాత్రమే టైముంది. బేరర్.. చూసుకో ! కరెక్ట్ ఆవ్యరిస్తేనే బిల్లులో  కన్సెషన్ ' అంటూ అప్పారావింకో పార్టీ పిలుస్తుంటే బైటికి వెళ్లిపోయాడు.


గంటయినా ఎవరం లేవలేక పోవటం చూసి బేరరొచ్చి బిల్లు వసూలు చేసుకుపోతూ ' అడ్వకేటు సారెప్పుడూ అంతే సారూ ! ఫ్రీగా ఇప్పిస్తానని తెగ తాగిస్తాడు. మెలికబెట్టి ఇలాగే డబుల్ లాగేస్తాడు. మీరు మొదటివాళ్లూ కాదు.. ఆఖరి వాళ్లూ  కాబోరు' అన్నాడు చిన్నగా చివరిగా. 


' వాడి  ప్రశ్నకు జవాబు నీకు తెలుసా? ' అనడిగాను కారు బయలు దేరే  ముందా బేరర్నే. 


' తెలుస్టార్! ఒక కోటి తనకు. ఒక కోటి ఆ నాసావాడికి. ఇంకోటి డాక్టరుకి పైకి పోవటానికి ' 


' మరాలాయరు పైకి పోడా ?! ' 


' పోతే ఎలా ? బారు ప్రాక్టీసో ' 


' అమ్మ అప్పారావూ! కోర్టు బార్ ప్రాక్టీసు ఎలాగూ లేదని. . త బారు పాక్టీసులో ఆరితే రావా! అదిరా మన అడ్వకేటుగారి తెలివి అంటే ' అన్నాను, 


' ఆ తెలివి నీ అడ్వకేటుగారిది కాదు.  కేటుగాడిది '  అన్నాడు విశ్వనాథం కసికసిగా! 


కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సం. పు - 22 -11-2003 - ప్రచురితం ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...