Sunday, December 12, 2021

రుణం -నీ కాడే ఉంచు నాయనా!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 


బస్ ఆత్మకూరు చేరేసరికి తెల్లారింది. బస్టాండ్ వెనకాలే లాడ్జ్. రిఫ్రెషయి మళ్ళీ నందిపాడు వైపెళ్లే బస్సు పట్టుకునే వేళకు ఎండ చిరచిరలాడుతోంది.

బస్సు నిండా జనం. కరటంపాడు కరణంగారు నన్ను చూసి పక్కతన్ని లేపి సీటిప్పించాడు.  లేచి నిలబడ్డ సాహెబ్ గారు నన్ను చూసి గుర్తుపట్టి సలామ్ చేశాడు.

'ఆశ్రమానికేనా?' అని అడిగాడు కరణంగారు. ఆయనా తన భార్యకు వంటో బాలేపోతే  స్వామివారి దగ్గరకు తీసుకెళుతున్నాట్ట.

'సాయబ్ గారూ! మీరూ..?' అనడిగాను.

'అందరం అక్కడికే సాబ్!' అన్నాడు నవ్వుతూ.

బస్సులో స్వామివారి మీద సినిమా స్తైల్లో పాటలు మారుమోగిపోతున్నాయి. వాటి కనుగుణంగా చప్పట్లు కొడుతూ భజనలు చేస్తున్నారు కొందరు భక్తులు.

ముందు సీటాయన దగ్గర ఏదో కరపత్రం ఉంటే అడిగి తీసుకున్నా. దాన్నిండా నీళ్లస్వామివారి మహిమలను గురించే!

.. '.. నమ్మి సేవిస్తే సంకటాలు తొలుగుతాయి. శుభం కలుగుతుంది. నమ్మని మూర్ఖులకు సుఖశాంతులుండవు. అరిష్టాలు తప్పవు..' అంటో ఏదేదో రాసివుంది. కరణంగారేదో చెప్పుకుపోతున్నాడు '.. చక్రాలపాడు శీను తెల్సు కదా సార్! అదే.. నక్సలైట్లలో తిరిగేవాడు. వాడిప్పుడు స్వామివారికి ప్రథమ శిష్యుడు. నెల్లూరు నుంచి జమీన్ రైతు వచ్చేది కదా! దాని సబ్-ఎడిటర్.. దశరథ రామి రెడ్డి ఇప్పుడు స్వామివారికి  పరమ ఆప్తుడు. స్వామివారి హవా అట్లా ఉంది మరి.  మూడేళ్ళ కిందటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా! అయినా స్వామివారి కృపవల్ల మళ్లా మా ఆడోళ్లు  నీళ్లోసుకోబోతున్నారు. నాలుగు నెల్ల బట్టి వస్తున్నాం. ఇంకో అరడజను సార్లన్నా దర్శనం చేసుకోవాలంటున్నారు.'

'అన్ని నెల్లు గర్భమేవిఁటండీ! డాక్టరుకొకసారన్నా చూపించారా?' అని అడిగాను ఆశ్చర్యంగా!'

'అదే మరి గజ గర్భంట! అట్లాగే ఉంటుందట సార్! డాక్టర్లకు చూపిస్తే పెద్ద ప్రాణానికి మొప్పం అని చెప్పారు. స్వామివారినేనమ్ముకునున్నాం' అంటూ చేతి వేలికున్న పగడపు ఉంగరాన్ని భక్తిగా కళ్లకద్దుకున్నాడు కరణంగారు.

'మా బేటాకు ముందు నుంచి మాటలు సరింగా పలకరావు సాబ్! స్వామీజీ ఇచ్చిన పానీ తీన్ మహీనే తీసుకుంటే మాటలు మంచిగ వస్తాయన్నారు. వస్తూ ఉన్నా! ఇదీ  దూస్రీ బార్!' అన్నాడు సాహెబ్జీ.

'ఫలం కనిపించిందా?' అనడిగాను. ఇంకా స్వామి దయ కలగలేదన్నట్లు గాల్లోకి చెయ్యాడించాడాయన.

నమ్మకాలకు మతాలు అడ్డం కావు కాబోలు మన దేశంలో!

నందవరంలో బస్సెక్కిన నాయుడుగారు నన్ను చూసి షాక్ అయ్యాడు. 'సార్! మీరింకా సర్వీసులోనే ఉన్నారా? ఏదో జైల్లో ఉన్నావన్నారే!' ఆశ్చర్యాన్ని దాచుకోలేకపోయాడు పాపం అతగాడు.

బండి టోల్ గేట్ ముందాగింది. బడబడా బస్సులో కెక్కిన కుర్రాళ్లు కొందరు ప్యాసిమ్జెర్లకు స్టిక్కర్లింటించేస్తున్నారు డబ్బు వసూలు చేసుకున్న తరువాత. ఆ హడావుడిలో నాయుడుగారు నన్నొదిలేశారు కనక బతికిపోయా.

'స్టిక్కర్లు లేకపోతే క్యూలో నిలబడనీయరు. అక్కడైనా ఇదే గోల. ముందు తీసుకోండి. ఇరవై రూపాయలే!' అన్నాడు కరణంగారు. నా దగ్గర్నుంచీ ఓ ఇరవై పుచ్చుకుని స్వామి వారి బొమ్మ ఉన్న ఓ స్టికర్ నా  చొక్కా జేబుకు అంటించిపోయాడో కుర్ర వలంటీర్!

'ఇక్కణ్నుంచీ అడుగడుక్కీ ముడుపులు చెల్లించుకుంటూ పోవాల్సార్!'అన్నాడు సాహెబ్ గారు.

రోడ్డుకు ఎడా పెడాగా ఉన్న మోటార్ పంపుల నుంచి జారే నీళ్ళల్లో జనాలు స్నానాలు చేస్తున్నారు. 'స్నానానికి ఇరవై.. దీనికైతే ఐదు.. రెండింటికైతే   రెండైదులు' అంటూ సాహెబ్జీ వివరించిన పద్ధతికి నవ్వాగింది కాదు నాకు.

'అంతా బిజినెస్సయిపోయిందిలే! మునుపీ రూటులో మిర్చి లోడు లారీలు తప్ప మరేవీఁ తిరిగేవి కాదు. చీకటి పడితే చాలు దొంగల భయం. ఇప్పుడో? కార్లు, స్కూటర్లు.. ఆటోల సంగతైతే ఇక చెప్పే పనే లేదు. స్వామివారి పుణ్యమా అని తలా ఓక రకంగా బాగుపడుతున్నారు. ఈ బళ్ళవాళ్లకు పేసింజర్ కు ఇంతని కమీషన్ ఉండేది  మొదట్లో!' అన్నారు కరణంగారు.

'మరే! మర్రిపాడు దగ్గర్నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియా అంతా ఇసక పర్రే కదండీ! ఎకరా పదేలన్నా కొనే నాథుడుండేవాడు కాదు. ఇప్పుడు రెండు లక్షలిస్తామన్నా అమ్మే కుంక లేడు.' అని వంత పాడాడు నాయుడుగారు.. ఎప్పుడొచ్చాడో గానీ!

వాళ్లూ వాళ్లు మాటల్లో పడిపోయారు. నాయుడుగారంటున్నాడు 'కావలి ఎం.ఎల్.యే రామారెడ్ది పెళ్లాన్ని తీసుకొని ఇటేపొస్తున్నట్లు తెలిసిందబ్బీ! వేరే చోటయితే మాటకు దొరకడు. ఇక్కడైతే స్వామివారి చేత ఓ ముక్క చెప్పినా పనయిపోతుంది. ఇంజనీరింగ్ కాలేజీ ఈజీగా పెట్టించెయ్యచ్చు.. ఉదయగిరిలో! ఇంతకీ ఈ బేంకాయన ఎందుకొస్తున్నాడో ఏమైనా తెలిసిందా?' అంటూ నా గురించి ఏదో లో గొంతుకతో కరణంగారి చెవి కొరుకుతున్నాడు.

అతగాడేం చెబుతున్నాడో నేనూహించుకోగలను. నా మనసు ఎనిమిదేళ్ల వెనక్కిపోయింది. 

బోరుబండ బ్రాంచిలో పనిచేస్తుండగా నాకు అనుకోకుండా ధర్మారావుపల్లి శాఖకు బదిలీ అయింది. నెల్లూరుకు పడమరగా బాంబే హై వే మీద ఆత్మకూరుకు దగ్గరగా ఉంటుందా చిన్నగ్రామం. ధర్మారావు పల్లి శాఖ లావాదేవీలన్నీ ప్రధానంగా పరిసరాలలోని పోగాకు రైతుల సాగుకు సంబంధించి టొబోకో బోర్డు కు చెందినవే. ప్రభుత్వ బ్యాంకు కనుక అరకొరగానైనా గవర్నమెంటు స్కీముల కింద రుణాలు ఇవ్వక తప్పేది కాదు.

కేంద్ర రుణమాఫీ పథకం వచ్చి పోయిం తరువాత మళ్లా ఆ తరహా మాఫీ పథకాలేమైనా రాకపోతాయా అన్న బేఫర్వాతో సొమ్ము సమకూరినప్పుడు కూడా రుణ గ్రహీతలు కిస్తీలు కట్టేందుకు తాత్సారం చేస్తుండేవాళ్లు. దరిమిలా శాఖ మొత్తం మొండి బాకీల కుప్పగా మారిపోయి వున్న పరిస్థితి నేను మేనేజరుగా ఛార్జ్ తీసుకున్ననాటి పరిస్థితి.

పిల్లల చదువులు భంగమవుతాయన్న దృష్టితో నేను ఫ్యామిలీ షిఫ్ట్ చేయలేదు. బ్యాంకుకు సంబంధించిన క్వార్టర్సులో నాది ఒంటరి నివాసం.

వర్కింగ్ డేస్ లో ఎలాగో కాలం గడిచిపోయేది. వీకెండ్స్ వచ్చినప్పుడు టైమ్ పాస్ కష్టంగా ఉండేది. తోచనప్పుడు అట్లా రోడ్డు మీదకు వెళ్లి కాకా హోటల్సు దేనిలోనో కూర్చుని కాలక్షేపం చేసేవాడిని.  అదిగో అప్పుడు తగిలాడు బర్రెల సాంబయ్య.

సాంబయ్యకు సొంతానికి పాడి లేదు. ఊరి వాళ్ల బర్రెలను మేపేందుకు తోలుకువెళ్లేవాడు. అందుకే అతగాడు బర్రెల సాంబయ్యగా ప్రసిద్ధం.

సాంబయ్యకు ఇద్దరు మగ బిడ్డలు. పెద్దవాడు వేరుపడిపోతే, రెండో ఉద్ధారకుడు దేశం మీద ఊరేగడానికి వెళ్లాడు. కూతురు కాన్పు కష్టమై అతగాడి భార్య కన్నుమూసింది.

'ఆడబిడ్డతో అగచాట్లుగా ఉంది. ఒక్క 'పదేలు' అప్పిప్పించమని వచ్చిన ప్రతీ మేనేజరు కాళ్లు గడ్డాలు పట్టుకు బతిమిలాడేవాడుట సాంబయ్య. ఆ దఫా నా వంతు.

'ఒక బర్రెను కొని సాక్కుంటా! నీ పేరు చెప్పుకుని నేనూ, నా బిడ్డా బతుకుతాం' అని నన్ను పట్టుకున్నాడు బర్రెల సాంబయ్య.

'ఇంత మంది లోన్లు తీసుకుని సొమ్ముండీ కట్టడంలేదే. ఒక్క ఈ సాంబయ్య మొహానే ఎందుకు మొద్దులు పెట్టాలి?' అనిపించింది నాకూనూ. బ్యాంకు అప్పుతో రెండు బర్రెలు ఇప్పించా. పెద్ద సంతలో వాటిని మూడు వేలకు అమ్మేసుకుని మనిషే మాయమయ్యాడు సాంబయ్య! వాడి కూతురు దుర్గ  నేను నడి రోడ్డు మీద కనిపించినా పడతిడుతుండేది. ఆ పిల్లకు అప్పుడు సుమారు పదమూడు పథ్నాలుగేళ్లు ఉంటయేమో!

 నెల్రోజులు తరువాత అబ్బ తిరిగి రావడంతో దాని కోపం కొంత తగ్గిన మాట నిజమే! కానీ మనిషి ఎదురు పడితే మాత్రం మిడి గుడ్లు వేసుకుని నొసలు చిట్లిస్తూ ముక్కూ మూతీ తెగ తిప్పుకునేది.

ఆ ఎండాకాలం సెలవులకు మా పిల్లలు ఊరు చూద్దామని ఉబలాట పడుతూంటే ఓ నెల్లాళ్లు ఉండి.. చుట్టు పక్కల విశేషాలు చూసి పోతారులెమ్మని తీసుకొచ్చాను. ఆ నెల రోజులూ సాంబయ్య కూతుర్నే నేను ఇంటి పనికి పెట్టుకోక తప్పింది కాదు. నా పెద్ద కూతురు దాదాపుగా దుర్గ వయసుదే.   దుర్గ పద్దస్తమానం మా ఇంట్లోనే చనువుగా తిరగడం సాగించేది. వాళ్లబ్బకు లోనిచ్చిన కోపం అట్లా నెమ్మదిగా నా మీద నుంచి  తప్పుకుపోయింది ఆ నెలరోజుల్లో. మా పిల్లలకు మల్లే తనూ నన్ను 'నాన్నా!' అంటుంటే మొదట్లో అదోలా ఉన్నా మెల్లిగా ఆ పిలుపే అలవాటయింది.

మా ఆవిడ తిరిగి వెళ్లే సమయంలో రెండు లంగాలు, ఓణీలు కొత్తవి కుట్టించి మా పాప చేతి మీదుగా తనకు ఇప్పిస్తుంటే భోరుమని ఏడ్చేసింది పిచ్చి పిల్ల మా ఆవిడను వాటేసుకుని. పల్లెటూళ్ల జనాల కక్షలే కాదు, ఆపేక్షాలు నగర జీవులకో పట్టాన అర్థం కావు. 

మా బాబు చేత  ఓ వెయ్యి రూపాయలు దుర్గ చేతిలో పెట్టించబోయా వాళ్లు బస్సెక్కేపోయే రోజున.  తీసుకో లేదు! ఎంత చెప్పినా మొండి కేసింది! 'ఈ సొమ్ము కళ్ల చూస్తే ఇంకెమైనా ఉందా? మళ్లా మా తాగుబోతు సచ్చినోడు ఊరొదిలి పోడా! నీ కాడే ఉంచు నాయనా! గాజులూ, పూసలకేగా నా ఆశంతా! కావాలనిపిస్తే నిన్నుకాక ఇంకెవర్ని  అడుక్కుంటా!' అని ఆ పిల్ల ఏడ్చినప్పుదు  నేనెంత షాకయ్యానో ఇప్పటికీ గుర్తే!

ఒక రోజున కేషియర్ గుప్తా భయంకరమైన వార్తొకటి తెచ్చాడు. ఇంతకు ముందు క్కడ మేనేజరుగా చేసి పోయిన సెల్వరాజన్ అనే అరవ ఆఫీసర్ రుణీ మాఫీ పథకం స్కామ్ లో  ఇరుక్కుని ఉద్యోగ పోగొట్టుకున్నాట్ట. ఇన్నేళ్లు కోర్టుల్లో పోరాడినా రెండు రోజుల కిందటే సుప్రీమ్ కోర్టులో కూడా చుక్కెదురయే సరికి..  పెన్నాలో దూకేశాట్ట! ఆ టాపిక్కే హాట్ హాట్ గా కాకాహోటల్లో చర్చ జరుగుతుంటే 'బ్యాంకు అప్పు తీసుకున్నవాడికి కేవలం బ్యాంకు అప్పు మాత్రమే! ఇచ్చే మా బ్యాంకాఫీసర్లకు  అది  సెటిలయే దాకా మెడకేలాడే యమపాశం!' అన్నాను.  ఆ టైములో బర్రెల సాంబయ్య అక్కడే ఉన్నాడు.

ఆ తరువాత పది రోజుల కనుకుంటా .. ఓ శనివారం మధ్యాహ్నం పూట నేను బ్యాంకులో ఒక్కణ్ణే కూర్చుని పని చూసుకుంటుంటే పిల్లిలా లోపలికొచ్చాడు సాంబయ్య. రొంటి కింద దాచిన మూటను విపి నా ముందు పరిచాడు. అందులో అన్నీ వందా, యాభై నోట్లే! 'నా అప్పుకు కట్టేసుకొ సారూ! ఇంకా ఏమైనా ఉంటే నీ ఇష్టమొచ్చిన కాడికి చేసుకో!' అన్నాడు.

ఇంత సొమ్ము నీ కెక్కడిది?' అని అడిగా నివ్వెరపోయి. 'మా సంగం పిల్లోడు పంపించాడులే సారూ!' అంటూ వెళ్లిపోయాడు.

మొత్తం పదమూడు వేల దాకా ఉందా సొమ్ము లెక్కేస్తే! సాంబయ్య అప్పు కాతాకు క్రెడిట్ స్లిప్పు రాసి గుప్తు ఇంట్లో ఇచ్చేసి నేను హైదరాబాద్ వచ్చేశా. ప్రతి నెలా జీతం రాగానే అట్లా వెళ్లి రావడం నా నెలచర్య.

సోమవారం తిరిగొచ్చే వేళకు ఊళ్లో సీనంతా పూర్తిగా మారిపోయి ఉంది. ఊరు మీద వసూలుచేసిన ఇంటి పన్నుల్లాంటివి పంచాయితీ బోర్డు బిల్ కలెక్టర్ సుబ్రహ్మణ్యం ఆఫీసు బీరువాలో పెట్టి ఫోనొస్తే పక్క రూములోకి వళ్లి మాట్లాడుతున్నాట్ట! తిరిగొచ్చేసరికి ఆ మొత్తం పోయింద'ని అంటున్నాడు.

పద్దస్తమానం ఆఫీసు వరండాలో పడి దొర్లే సాంబయ్య మీదకు పోయింది బోర్డు ప్రెసిడెంట్ నాయుడుగారి దృష్టి. పూటుగా తాగించి చింత చెట్టుక్కట్టి చితక్కొడితే 'బ్యాంకు సారు చేతిలో పోశా' అని భోరుమన్నాట్ట! పోలీసులొచ్చి వాణ్ణి పట్టుకుపోయారు.

నేను ఊళ్లోకి దిగీ దగంగానే సర్పంచి బస్టాండులోనే నిలదీశాడు నన్ను. 'సాంబయ్యప్పుకి జమేసింది పోగా మిగిలిన పదమూడు వేలు ఎక్కడ నొక్కావో చెప్పమని నిలదీస్తుంటే నిలువు గుడ్లు పడిపోయాయ్ నాకు. సాంబయ్యప్పుకు పోగా మిగిలింది మూడు వేలే! అదీ అతగాడి కూతురు దుర్గ పేరుతో ఉన్న కాతాలో జమయింది' అంటే నమ్మడే!

ఈ గొడవ నెల్లూరు డివిజినల్ మేనేజర్ దాకా పోవడం, ఆ మర్నాడే అక్కడి నుంచి పర్యవేక్షణ బృందం వచ్చి రికార్డులు చూసి జరిగింది ఎందుకు అక్రమమని తేల్చారో ఆ పై వాడికే తెలియాలి! మొత్తానికి నాకైతే రాత్రికి రాత్రే నేరుగా  మరో కార్నర్లో ఉన్న కరీంనగర్ 'దురికి' బదిలీ అయిపోవడం!

ఆ తరువాత విచారణ కమిటీలు, ఎవరికీ తెలిసే అవకాశం లేని నివేదికలు.. వాటి మీద చర్యలు!

అందుకే ఇందాక నందవరం నాయుడుగారు నన్ను నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానం పంపించేసుకున్నది తన ఊహల్లో! ఆయనే అప్పట్లో ధర్మారావుపల్లి సర్పంచ్ గా ఉంటూ నా మీద చర్యల కోసం పదే పదే పై వాళ్ల మీద ఒత్తడి తెచ్చింది కూడా!

ప్రస్తుతం నేను హైదరాబాదు జోనల్ ఆఫిసులో పనిచేస్తున్నా. రిటైర్ మెంట్ దగ్గర పడింది. సర్వీస్ రికార్డ్స్ సెట్ రైట్ చేసుకోకపోతే ఆఖరి నిమిషంలో ఇబ్బంది. బర్రెల సాంబయ్యను గురించి టెన్షన్ పడుతుంటే పొదలకూరు నుంచి గుప్తా ఫోన్ చేసి ఈ నీళ్ల స్వామిని గురించి సమాచారం అందించాడు. నందిపాడు కవతల కడప రూట్లో బ్రాహ్మణపల్లి దగ్గర ఆశ్రమం కట్టుకున్నాడు. చాలా మహత్తు ఉందని పెద్ద ప్రచారం జరుగుతోంది సార్! పుట్టు గుడ్డోళ్లకు, మూగ మొద్దుల క్కూడా చూపూ మాటా తెప్పిస్తాడని  ప్రచారం చెప్పుకుంటుంన్నారిక్కడ. స్వామి మంత్రించి ఇచ్చిన నీళ్లు సేవిస్తే ఎట్లాంటి మొండి రోగాలైనా లొంగివస్తాయని మా వైపు మైకులు పెట్టుకు మరీ హోరెత్తిస్తున్నారు.  ఈ నీళ్లస్వామి మహిమకు మా పొదలకూరు ఫెర్టిలిటీ సెంటర్ మూతబడింది. నేనూ వెళ్లొచ్చా. మీరూ ఓ సారి వెళ్ళి రండి. మీ సమస్య తీరుతుందని నాకనిపిస్తోంది.' అంటూ తెగ చెప్పుకొచ్చాడు. అందుకే ఇప్పుడీ ప్రయాణం పెట్టుకుంది కూడా.

బస్సు ఆశ్రమం ముందాగడంతో జనం బిలబిలా దిగిపోతున్నారు. ఆ హడావుదికి ఈ లోకంలోకి వచ్చిపడ్డా. నేనూ దిగిపోయా.

ఎటు చూసినా అంగళ్లే! పూజా సామాగ్రి నుంచి పాటల కేసెట్ల దాకా అన్నిటి అమ్మకం జోరుగా సాగుతోన్నది. అంతా ఒక పెద్ద సంత వాతావరణం.

'ఆదివారం కదా! ఇట్లాగే ఉంటుంది' అంటూ కరణంగారు ఓ పంపు దగ్గరికి పరుగెత్తారు. వగరుస్తూ వగరుస్తూ ఓ ప్లాస్టిక్ కేన్ నిండా పంపు నీళ్లు పట్టుకొనొచ్చారు.

కేన్ పాతిక రూపాయలుట. 'అన్నింటికీ ఫిక్సడ్ రేట్స్! అదేమని అడిగితే దాష్టీకం చేస్తున్నారు.' అని భార్యతో సహా వెళ్లి క్యూలో నిలబడ్డారు గొణుక్కుంటూ. అర కిలోమీటరుంది ఆ క్యూ.

ఈ క్యూలో నిలబడి లోపలి దాకా పోవడం నాకు ఈవేళ ముగిసే పనేనా? మనసు లోలోపల పీకుతోంది. అందరి చేతుల్లోనూ నీళ్ల కేనులున్నాయి. లేనిది నా చేతిలోనే.  అనుమానం వచ్చినట్లుంది.. ఓ వస్తాదుకు. దగ్గరిసా వచ్చి 'నీళ్లేవీ?'అనడిగాడు మొరటుగా.

ఏమని చెప్పడం? చెబితే నన్నక్కడ నిలబడనిస్తాడా?

మాటల కోసం తడుముకుంటుంటే అనుమానం మరింత ఎక్కువైంది. పక్కకు తీసుకెళ్లి వళ్లంతా తడిమి చూశాడు. జేబులో సెల్ ఫోను, కళ్ల జోడు, పర్సు, ఏవో  ఇంకొన్ని పేపర్లు మాత్రమే కనిపించే సరికి ఏమి చేయాలో తోచింది కాదు అతగాడికి. మెయిన గేట్ దాకా తోసుకుంటూ వచ్చాడు. అప్పుడు కనిపించిందా అమ్మాయి.

నన్ను చూసి ఒక్క క్షణం షాకయినట్లుంది. తేరుకుని నవ్వు మొహంతో దగ్గరికొచ్చి 'బాగున్నావా !' అంది. తనెవరో నాకు గుర్తుకు రాలేదు.  

'దర్శనం అయిందా?' అనడిగింది మళ్లీ. నేను తలడ్డంగా ఉపాను నిరాశగా. ఎదో కాల్ వచ్చింది తన సెల్ లోకి.

'హాల్లోకి తీసుకెళ్లు! నేనొస్తున్నాను!' అంటూ ఇందాకటి వస్తాదుకు పురమాయించి తనెటో హడావుడిగా వెళ్లిపోయింది.

ఇందాక నెట్టుకుంటూ తీసుకొచ్చిన వస్తాదే అతి మర్యాద ప్రదర్శిస్తూ నన్ను ఓ హాల్లోకి తీసుకువెళ్లాడు.

'ముందు దర్సనం' అన్నాను టైం చూసుకుంటూ. పక్క గది చూపించి వెళ్లమన్నట్లు ఒక డోర్ తెరిచి నిలబడ్డాడు మాటా పలుకూ లేకుండా.

అక్కడ అన్న సంతర్పణ లాంటిది ఏదో జరుగుతోంది. పంక్తి మధ్యలో ఉన్న ఒక ఆడమనిషి హాఠాత్తుగా విరుచుకుపడిపోయింది. మొహాన నీళ్లు చల్లారెవరో. తెప్పరిల్లి లేచి నిలబడింది. పూనకం వచ్చిన మనిషికి మల్లే స్వామివారి మహిమ వల్ల తనకు పోయిన కాళ్లు ఎలా వచ్చాయో.. చిలవలు పలవలుగా కథలా చెబుతోంది పెద్ద గొంతుతో. నీళ్లస్వామికి గోవిందలు కొడుతున్నారు తన్మయత్వంతో భక్తులు. అంత తాదాత్మ్యతలో కూడా ఎదుటి విస్తరిలోని పదార్థాలను ఖాళీచెయ్యడంలో అశ్రద్ధ చూపించడం లేదే భోక్తలు.

'తింటారా? సాంబారన్నం. ఉచితం' అన్నాడు వస్తాదు.

'ముందు దర్శనం' అన్నాను మళ్లీ. మరో గది చూపించి తలుపు తీసి వెళ్ళమన్నట్లు సైగ చేశాడీ సారి.

వెళ్లాను. అక్కడ దర్శనమిచ్చాడు నీళ్ల స్వామి.. భక్తుల మధ్య కొలువు తీరి.

క్యూలో నుంచి వస్తున్నవాళ్ల కేనుల్లో ఎడం చేయి వేలు ముంచగానే ముందుకు నెట్టేస్తున్నారు స్వామివారి ఆంతరంగికులు. స్వామివారికి చెరో పక్క నిలుచున్న మరో ఇద్దరు ఆంతరంగిలుకు పట్టి నిలబడ్డ జోలెల్లో యధాశక్తి వేసి ముందుకు కదులుతున్నారు సందర్శకులు. వాలంటీర్ల సందడే అధికంగా ఉంది. 'భోజనం చేశావా నాయనా?' అని అడిగింది ఇందాకటి మనిషి మళ్లీ ప్రత్యక్షమై.  నేను బదులు చెప్పేలోగానే చొరవగా నా చెయ్యి పట్టుకుని మరో గదిలోకీ తీసుకెళుతూ 'ముందు మీరు భోజనం చెయ్యడం ముఖ్యం. అసలే మీకు షుగర్. అవునూ! అలాగే ఉందా ఇంకా ఏమైనా పెరిగిందా నాయనా?' అని ఆడిగింది ఆప్యాయంగా ఆ అమ్మాయి. తనే విస్తరి వేసి  చికెన్ బిర్యానీ వడ్డించింది. రెండు రోజుల నుండి సరైన ఆహారం లేకుండా ఉందేమో గబగబాలాగించేసింది కడుపు.

'కాస్సేపు  కునుకు తీయండి నాయనా! దర్శనాలు అయేసరికి రెండు గంటలు దాటుతుంది' అంటూ మరో గదిలోకి తీసుకువెళ్లింది. అదేదో విఐపిల  రెస్ట్ రూమ్ లా ఎ.సి, డబుల్ కాట్స్ తో యమ  పోష్ గా ఉంది.   ఇందాకటి స్వామీజీ పక్కనున్న వాలంటీర్స్ లాంటి వాళ్లే మరో ఇద్దరు అదే రకం జోలెల్లో నుంచి కార్పెట్ మీద కుమ్మరించి ఉన్న సొమ్మును డినామినేషన్ ప్రకారం విడదీసి కట్టలు కడుతున్నారు. మధ్య మధ్యలో వచ్చే బంగారపు ఉంగరాలు, గొలుసులు, గాజుల్లాంటివి విడిగా తీసి మరో ప్లాస్టిక్ బుట్టలో పడేస్తున్నారు. వయసులో చిన్నతను కొద్దిగా నోటితో విసుగుదల ధ్వనించే శబ్దాలు రెండు సార్లు చేయగానే పెద్దతను మందలిస్తున్నట్లు చిన్న స్వరంతో అంటున్నాడు  'ఇంకా ఇట్లాంటి  జోలెలు కనీసం నాలుగైనా వస్తాయిరా సన్నాసీ! అప్పుడే అలిసిపోతే ఎట్లా?' బ్యాంకులో నిత్యం నోట్ల కట్టల మధ్య బతుకీసురోమని వెళ్లదీసే నాకు ఈ డర్టీ డఫ్ విలువ తెలీక కాదు గానీ, ఈ కోణంలో చూడడం ఇదే మొదటి సారయే సరికి కొద్దిగా షాక్ తగిలిన మాట వాస్తవమే!

ఈ లెక్కన ఈ నీళ్లస్వామివారి ఆదాయం కోట్లలో ఉంటుందేమో! అందుకే కోటలాంటి ఆశ్రమం ఏర్పాటుచేసుకున్నాడు ఈ మహానుభావుడు. ఇంత మంది వందిమాగధులని  మేపుతున్నాడు.  ఈ హంగూ ఆర్భాటాలు చూడబట్టే సినిమావాళ్లు, వ్యాపారస్తులు, రాజకీయాల్లో నలిగేవాళ్లు, విదేశీ కుబేరులు చుట్టూ మూగేది.

సుమారు నాలుగ్గంటల ప్రాంతంలో స్వామివారు ఈ గదిలోకి వేంచేశారు.

మనిషిలో పెద్ద మార్పేమీ లేదు. అప్పట్లానే సన్నగా, రివటలా పొట్లకాయను మరింత సాగదీసినట్లున్నాడు.

అందరూ యాంత్రికంగా బైటకు వెళ్లిపోయారు.

నన్ను గుర్తు పట్టేడో లేదో తెలీదు. నేను వచ్చిన పని చెప్పబోయాను. అప్పట్లో బ్యాంకులో తీసుకున్న లోను వడ్డీ తిరుగుళ్లన్నింటితో కల్సి మొత్తం పాతిక వేలు దాటింది. అప్పు తాలూకు నోటు కూడా మురిగిపోయింది. ఇదిగో..  పత్రం.. నేనే తయారు చేసి తెచ్చా. కుడి చేతి బొటన వేలు ముద్ర ఒకటి వేసేస్తే నా దారిన నే పోతా!' అన్నాను.

నా మాటలు నాకే వింతగా ఉన్నాయి. బర్రెల సాంబయ్యను నిలదీయాలనుకున్నదేమిటి? ఈ నీళ్లస్వామిని బతిమాలుకునేది ఏమిటి?

చేతిలో చిల్లుగవ్వ లేనప్పుడు అప్పు తీర్చమని దబాయించానప్పుడు. డబ్బు నీళ్లలా వచ్చిపడుతున్నప్పుడు కిస్తీ అయినా కొంత కట్టమని అడిగేందుకు జంకుతున్నానిప్పుడు? ఎంతలో ఎంత మార్పు!

అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ముందు నా బ్యాంకు హోదా చిన్నబోయినట్లు స్పష్టంగా కనిపిస్తూందిప్పుడు.

నోటు అందుకున్నాడు నీళ్ల స్వామి. అదే బర్రెల సాంబయ్య. మాటా పలుకూ లేకుండా పరపరా చించేశాడు.

నేను షాక్!

'ఇంకా ఎన్నున్నాయి సామీ అట్లాంటి కాయితాలు మీ కాడ? అదే జనాలు కట్టకుండా నాలాగా ఎగనూకిన అప్పు తాలుకు పత్రాలు ?' అని అడిగాడు. ఆ అడగడంలో ఏ భావమూ తోచలేదు నాకు.

ఈ వారం రోజుల బట్టి  ఊళ్ల వెంట బడి తిరిగి సేకరించుకున్న మొండి బకాయీల తాలుకు రెన్యువల్ ప్రామిసరీ నోట్లు సుమారు ముప్పై దాకా ఉంటాయ్. గతంలో బ్యాంక్ మేనేజర్ హోదాలో   పని చేస్తున్నప్పుడు    నేను వివిధ శాఖల్లో ఇచ్చిన అప్పులన్నీ సక్రమంగా ఉండాలి. అప్పుడే నా ఉద్యోగ విరమణ ఫైల్ క్లియరయ్యేది.

అదీ నా టెన్షన్.

'అయ్యోయ్! ముంబయ్ నుంచి ఆ సినిమా అమ్మాయి మొగుడు వచ్చి కూర్చున్నాడు. మీ కోసమే గంట నుంచి వెయింటింగంట! ఒహటే టెన్షన్ పడతా ఉండాడు' అంది ఇందాకటి అమ్మాయి వచ్చి .

'ఉంటాడులేవే.. ఎదవ మొదనష్టపోడు! కమ్మంగా సంసారం చేసుకోడు ఏ మగ సచ్చినోడూ!  అనుమాన ప్పిశాచాలు! నమ్మి తాళి కట్టించుకున్న పాపానికి నీళ్ల తొట్టెలో ముంచేసి చంపేసిండు బిడ్డను! ఇప్పుడేమో  యములాడు గుర్తుకొచ్చి వణికి చస్తావుండాడు. కాసులు కుమ్మరించేస్తే పెంట సెంటయిపోతుందని ఈ డబ్బు పిచ్చోళ్లందరికీ మదం! సడే! మన గోల ఎప్పుడూ ఉండి సచ్చేదేలే! అయ్య అంత దూరం నుంచి పడతా లేస్తా వచ్చిండు. ముందు మన సామి పని సక్కబెట్టు! ఆనకే అన్నీ!' అంటూ స్వాములోరి దుస్తులు సర్దుకుని పైకి లేచాడు బర్రెల సాంబయ్య! నా కాళ్లు అంటుకుని బైటికి వెళ్లిపోయాడు.

ఆలస్యంగా అర్థమయింది..  ఆ అమ్మాయి దుర్గ!

 ముందు నన్ను చెడ తిట్టిపోసి ఆనక 'నాయనా.. నాయనా'  అంటూ సొంత బిడ్డ కన్నా ఎక్కువగా వెంపర్లాడిన  రాక్షసి పిల్ల. నన్ను మించి ఎదిగిన తల్లి!  దగ్గరకు తీసుకుందామా.. వద్దా అని ఇంకా  తటపటాయింపులోనే ఉన్నా. హఠాత్తుగా తనే నా పక్కన కూర్చొని భుజం మీద తలపెట్టి భోరున ఏడ్చేసింది.. ఎంత ఊరడించినా ఆ  పిచ్చి తల్లి కట్టలు తెగిన దుఃఖం  ఆగిందే కాదు.

కాస్సేపు అలాగే ఉండనిచ్చి తరువాత తన మొహాన్ని నా చేతుల్లోకి తీసుకుని అలా చూస్తూనే ఉండిపోయాను.

బైట అలికిడికి తేరుకుంది దుర్గ. లేచి నిలబడింది. లోపలికి వచ్చిన ఇందాకటి జూనియర్ సన్యాసుల చేత నా అప్పు పత్రాలన్నీ అక్కడే  తగలబెట్టేయించింది.

'నాయనా! ఒక్క అయిదు నిమిషాలు' అంటూ బైటకు వెళ్లిపోయింది.

నిశ్శబ్దంగా .. మొద్దుబారిన మెదడుతో అట్లాగే అక్కడే ఎంత సేపు కూర్చుండిపోయానో తెలీదు.

ఇందాకటి వస్తాదు సన్నాసి మళ్లీ వచ్చాడు. నన్ను చేతులు పట్టుకుని లేపి ఒక విచిత్రమైన దారి గుండా నడిపించుకుంటూ వెళ్లి ఒక పడవలాంటి కారులో కుదేశాడు. తాను డ్రైవర్ సీటులోకి వెళ్లి కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు.

 మళ్లీ ప్రత్యక్షమయింది దుర్గ.. బండి మూవ్ అయే టైములో పరుగెత్తుకొచ్చింది దుర్గ.తెరిచి ఉన్న విండో గుండా తల లోపలికి పెట్టి చిన్నగా అంది 'డిక్కీలో దరిద్రముంది. అయ్య బ్యాంకు తప్పును దాంతో కడిగెయ్యండి.  అయ్యదే కాదు.. ఆ దరిద్రుల తప్పులన్నీ దాంతో కడిగేసెయ్యండి! చాలక పోతే మళ్లీ రండి నాయనా! అమ్మకు నమస్కారాలు చెప్పండి! అక్కకు నా హగ్సివ్వండి! చిన్నోడికి నా తరుఫున ఇదివ్వడం మాత్రం మర్చిపోవద్దండి!' అంటూ చటుక్కున నా బుగ్గ మీద ముద్దు పెట్టుకుని తల బైటకు తీసేసుకుంది.

కారు ఎప్పుడు వేగం పుంజుకుందో తెలిదు. బుగ్గలు తడుముకుంటే అంతా తడి.. తడి!

నీళ్ల స్వామి కూతురు కన్నీళ్లు!

 

తరువాతొక సారి మళ్లీ  ఫోన్ లో కల్సినప్పుడు 'మీ అయ్య చేసిన అప్పు ఒక్కటి తీరిస్తే సరిపోను కదా! అందరివి ఎందుకు?' అని అడిగితే  దుర్గమ్మ ఇచ్చిన బదులు డబ్బుకోసం గడ్డి తినే లోకానికి నిజానికి చెర్నాకోల దెబ్బంత చురుకు పుట్టించాలి!

'ఇవన్నీ కూడా మా అయ్య సొమ్ములే నాయనా! వట్టి బర్రెల సాంబయ్యగా ఉన్నప్పుడు రోజంతా గొడ్డులా చాకిరీ చేసినా ఎవురూ పైసా రాల్చేవాళ్లు కాదు. చింత చెట్టుక్కట్టేసి కొట్టిన నాయుడు ఇవాళ    నీళ్ల స్వామి అవతారమెత్తడం ఆలస్యం ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పించమని అదే బర్రెల సాంబయ్య వెంట పడుతున్నాడు . ఈడొచ్చినా నాకు వళ్లు కప్పుకునేందుకు సరైన బట్ట ఉండేది కాదు.   నీకూ  తెలుసుగా నాయనా! నువ్విచ్చిన అప్పుతో అయ్య ఊరొదిలి పారిపోయిండు కదా! పంచాయితీ  ప్రెసిడెంటు తన కూతురు వయసు కన్నా చిన్న దాన్ని  నా మీద చెయ్యని అఘాయిత్యం లేదు. ఎవరికీ చెప్పుకొనే అవకాశం లేక  ఆ ఉక్రోషమంతా బైటూరోడివి కనక నీ మీద చూపించే దాన్ని పిచ్చిగా. అమ్మ, అక్క, తమ్ముడు వచ్చి  నన్నూ మీ ఇంట్లో బిడ్డగా చూసుకున్నప్పటి బట్టి కదూ మనుషుల్లో మంచోళ్లు కూడా ఉంటారని నమ్మబుద్ధేసింది! ఇదంతా అయ్య సొమ్మే.. అంటే నాదే! నా ఇష్టం కోసం ఏమైనా చేస్తాడు కాబట్టే.. నాకు ఇష్టమైన నాయన కష్టానికి ఇచ్చేసింది. నాకు తెలిసి దొంగ నీళ్లస్వామి చేసిన మంచి మొట్టమొదటి పని ఇదే ! ఉండనీయి నాయనా! మీ బోటి దేవుళ్ల కాడుంటేనే ఆ ధనలక్ష్మికీ రెండు మంచి పనులు చేసే అవకాశం ఉండేది' అంటున్న దుర్గమ్మ గొంతు నాకు నిజంగానే ధనలక్ష్మి తదుపరి నేను చేయవలసిన ప్రజాసేవ ఏమిటో ఆదేశించినట్లనిపించింది.

***

-కర్లపాలెం హనుమంతరావు

25 -03 -2021

(రచన మాస పత్రికలో ప్రచురితం)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...