Tuesday, February 19, 2019

భార్య.. ఏమండీ అన్నదంటే ..! సరదా వ్యాఖ్య -సేకరణ




బాత్రూమ్ లో నుండి " ఏమండి"
అని పిలిచిందంటే
బొద్దింకని కొట్టాలని అర్ధం..


రెస్టారెంట్ లో తిన్నాక " ఏమండీ"
అని పిలిచిందంటే
బిల్లు కట్టమని అర్ధం


కళ్యాణమండపంలో " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలిసినవారొచ్చారని అర్ధం


బట్టల షాపులో " ఏమండీ"
అని పిలిచిందంటే
వెతుకుతున్న చీర లభించిందని అర్ధం..


బండిలో వెళ్ళేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
పూలు కొనాలని అర్ధం..


హాస్పిటల్ కి వెళ్ళినపుడు " ఏమండీ "
అని పిలిచిందంటే
డాక్టర్ తో మీరూ మాట్లాడడానికి రండి అని అర్ధం


వాకిట్లోకి వచ్చి బయట చూసి " ఏమండీ"
అని పిలిచిందంటే
తెలియనివారెవరో వచ్చారని అర్ధం..


బీరువా ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
డబ్బు కావాలని అర్ధం..


డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి " ఏమండీ "
అని పిలిచిందంటే
భోజనానికి రమ్మని అర్ధం..


భోజనం చేసేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
భోజనం టేస్ట్ గురించి అడిగిందని అర్ధం


అద్ధం ముందు నిలబడి " ఏమండీ"
అని పిలిచిందంటే
చీరలో తనెలా ఉందో చెప్పమని అర్ధం..


నడిచేటపుడు " ఏమండి "
అని పిలిచిందంటే
వేలు పట్టుకుని నడవమని అర్ధం


అను నిత్యం తనతో చెప్పినా
నీవు చివరి శ్వాస తీసుకునేటపుడు " ఏమండీ"
అని పిలిచిందంటే
నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం...


# అను నిత్యం " ఏమండీ " అంటూ చంపేస్తుందని అపార్ధం చేసుకోవడం కాదు అర్ధం చేసుకుని మసులుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది.
(సేకరణ .. )

ప్రేమల పార్టీలు.. దొంగప్రేమల పార్టీలు -వ్యంగ్యల్పిక




'
ప్రేమే దైవం! యువతే లక్ష్యం!'
'ఇది వరకేదో ఓన్లీ  సేవే లక్ష్యం అన్నట్లు గుర్తు!'
'అది ముగిసి పోయిన పార్టీ పొట్టి కేప్షన్ బాబాయ్! ఇది ముందుకు దూసుకొచ్చే మరో పార్టీ కొత్త స్లోగన్. మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు లవ్ పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల ఉత్తుత్తి ప్రేమల పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి గుర్తున్నాడా?'
'మర్చి పోదగ్గ మహానుభావుడా నాయనా! పాఠాలు చెప్పమని పెద్దబళ్లో  పంతులుద్యోగమిస్తే .. ప్రేమ పాఠాలు వల్లించి మరీ ఆడశిష్యులను ఏకంగా పెళ్లి పీటల మీదకు ఎక్కించిన మన్మథుడు! చాలా ఘన సన్మానాలే  జరిగినట్లు గుర్తు .. పాత చెప్పులు గట్రా గజమాలలతో!'
'చెప్పు పడ్డంత మాత్రాన గొప్పతనమేమన్నా తరుక్కుపోతుందా బాబాయ్! ఆ మాటకొస్తే ఇప్పుడున్న వాళ్లల్లో చెప్పు రుచి చూడకుండా పెద్ద నేతలుగా ఎవరెదిగారో చెప్పు?'
'సర్సరే! ఇప్పుడీ పాత చెప్పుల పురాణాలెందుగ్గానీ..  నువ్ చెప్పాలనుకొనే  కొత్త కహానీ ఏదో చప్పున చెప్పెయ్! పనికొచ్చే పనులు నాకవతల  ఇంకా చాలా ఉన్నాయ్!’
 'ఆ మాధుర్ చౌధురి గూరూగారే అప్పట్లో పన్లో పనిగా    ప్రేమ పేరుతో ఓ పార్టీ కూడా పెట్టేసి ‘ఆఠిన్ ‘ గుర్తుతో  హడలెత్తించేసాడు జనాలందర్నీ! రాబోయే ఎన్నికల్లో మేమూ  అదే మోడల్లో మరో ‘రతీ మన్మథుల రాజ్యం’.. సింపుల్ గా ‘ర.మ రాజ్యం’ పార్టీతో ఓటరు దేవుళ్ల గుండెలు కొల్లగొట్టబోతున్నాం!'
'ఊఁ.. కానీయండి మరి! ఎన్నికల జాతర్లు కనుచూపు మేరలో ఉండె. ఇట్లాంటి గారడీలు ఇంకెన్ని చూడాల్నో! ఇన్నాళ్ల బట్టి జనాల గోడు అసలు పట్టించుకోనోడు కూడా..  పరగడుపునే  పక్క దూకొసొచ్చేసి  హఠాత్తుగా ఇట్లా ఝడివాన ప్రేమల్తో జడిపిస్తుంటే తడిసి ముద్దయేందుకు జనాలేమన్నా ‘సి’ సెంటర్ కెళ్లి సినిమాలు చూసే  పిచ్చికుంకలట్రా నాయనా! బడా బడా నేతలు.. బడబడవాగే అధినేతలకే చుక్కలు చూపించే తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారీ మధ్య.. చూట్టంలా!'
'బాబోయ్! టీవీ చర్చా కార్యక్రమాల్లో మాదిరి ఆ ముతక భాషేంటి బాబాయ్.. ఇంత వయస్సు మీద పడిం తరువాత కూడా! షష్టిపూర్తి చేసుకున్న పెద్దమనిషివి..   నీకే  మనసులో ఇంత   పులుసు  పొర్లుతుంటే.. ఇహ కోడెవయసు  మీదున్నోళ్లం.. మేం మాత్రం దున్నపోతులకు మల్లే మీద వాన పడ్డా  నోర్మూసుకొనుండలేం కదా!’
'నా సంగతులు ఇప్పుడెందుగ్గానీ.. మీ ప్రేమ పార్టీ ఊడబొడిచే ఘనకార్యాలేంటో  ముందవి టూకీగా విప్పి చెప్పిపోరా బాబూ.. నన్నవతల మీ పిన్ని పిలుస్తోందీ!'
 'దేశాన్నిప్పట్లో పట్టి పీడించే ప్రధాన దేభ్యాలేంటి.. ఐ మీన్ సమస్య;లు?'

‘మహా భారతం మొత్తం పది ముక్కల్లో పూర్తిగా చెప్పమన్నట్లుంది నీ చమత్కారం. ‘అ’ ఫర్ ఆవినీతి.. ‘ఆ’ ఫర్  ఆశిత్రులకు ఫర్.. ‘ఇ’ ఫర్ ఇష్టారాజ్యప్పాలన.. ‘ఈ’ ఫర్ ఈశా అల్లా ఏసులు అంటూ తన్నులాటలు! ఇట్లా ‘బండి రా’ దాకా ప్రతి అక్షరానికో వంద చొప్పున  అవకతవకలు  తడువుకోకుండా  ఏకరువు పెట్టేయచ్చు. ఈ పీకులాటలేవీ వద్ద<టె.. టూకీగా ఓ టూ వర్డ్స్ల్  లో .  కూడూ.. గూడూ!’
'ఒకే ఒక్క ఓటుతో ఆ రెండు ప్రారభ్దాలను పటాపంచలు చేయబోతోంది బాబాయ్  మా  రతీ మన్మథుల రాజ్యం పార్టీ! ప్రణయాలకు ఆకలి దప్పికలుండవంటారు కదా! తిండి తిప్పలనేవి ఇహ  సమస్యలుగానే ఉండబోవు మా ‘ర.మ’ రాజ్యం పాలనలో. రూపాయిక్కిలో బియ్యం, పండగ పబ్బాలొచ్చి పడ్డప్పుడు ఆ అన్న సంచీ, ఈ అయ్య ముల్లె అంటూ ఉప్పు పప్పులు పంచే నక్కజిమ్మిక్కులేమీ  చెయ్యనక్కర్లేదు.  తాగు నీరో.. సాగు సీజనుకు సరిపడా నీరో.. అంటూ ఉన్న కుంచెడు  గుంతల్లో  నీటి వాటాల కోసం గడ్డపారల్తో కొట్టుకు చచ్చే సీన్లుండవు. ముందెప్పటికో పొదల మాటున చేరి చేసుకునే  శృంగార కార్యకలాపాలకని ఇప్పట్నుంచే చెట్లు చేమలంటూ రోడ్ల పక్కన అట్లా పడీ పడీ మొక్కలు పాతుకొనే చెత్తపథకాలుండవు. ప్రేమలో పడ్డోళ్లంతా ఎదుటి వాళ్ల గుండెల్లో కాస్తింత చోటు దక్కితే అదే.. పెద్ద ఆస్తిగా భావిస్తారు కదా! ఇంకీ గులాబీ రంగు డబుల్ బెడ్రూంలు, పసుప్పచ్చ కలర్ ఒంటి స్తంభం మేడలు అనే రాష్ట్ర పథకాలకు, సర్వం సత్వరం కమలమయం అయిపోవాలన్న కేంద్రం పెద్దల ఆవాస యోజన ఆయాసాలకు  వీసమెత్తైనా విలువుండదు. ప్రేమలో పడ్డవాళ్లకి  మన మామూలు భాషల్తో బొత్తిగా పని నడవదు కదా! వాళ్లవన్నీ మూగ సైగలు! సింగర్ సైగల్ కాలం నాటి  బొంగురు గొంతు  పాటలు!   మూలుగు సంగీతం కేసెట్లో నాలుగు సూటుకేనులకు  పోసి ప్రజలకిచ్చేస్తే సరి! ఇహ ఏ ‘సతారా. బెళగావుఁ మార్కు  భాషా సమస్యలకు తావుండదు. తమిళమా.. తెలుగా.. ఏది అతి ప్రాచీన భాష? అన్న కీచులాటలన్నీ పక్కన పెట్టేయక తప్పదు. దేశమంతటా అప్పుడు వాడుకంలో ఉండేది ఒకే ఒక భాష. అదే  ఆడమ్ అండ్ ఈవ్ పుట్టుకతో పాటు పుట్టుకొచ్చిన రిమ్మతెగులు ఘోష. అదే  అత్యంత ప్రాచీనం.. అంతకన్నా అధునాతనమైన భాషయినప్పుడు  మరాఠీవాడికి, బీహారీబాబుకి మధ్యన ఇహ  ఏ పనికిమాలిన పొరపొచ్చలకు టైముండదు,  త్యాగం మినహా మరేదీ కోరదు కదా అసలు సిసలు ప్రేమ! జనాలను కొల్లగొట్టి తరాలకు సరిపడా కూడబెట్టుకొనే తాపత్రయం దానంతటదే పెద్ద ప్రయత్నమేం లేకుండానే పెద్దమనుషుల మనసుల్లో నుంచీ  సులువుగా తుడిచిపెట్టుకుపోతుంది. మా ప్రేమరాజ్యం స్వర్ణయుగం పాలనలో కుంభకోణమంటే  జనలాలకు తటాలుమని తట్టేదిహ తమిళనాడు తాలూకు  ఊరు పేరు ఒక్కటే! ప్రస్తుతం పాలిటిక్సులో ప్రతీ క్షణం మోతెక్కిపోతోన్న  కుంభకోణాల ఊసులకు ఇహ ఆస్కారమే ఉండదు. వారసులే దేశాన్నేలుతున్నారన్న రుసరుసలు  ఇహ ఏ సైడు నుంచి వచ్చినా  ఓటరు చెప్పుతీసుకోడం ఖాయం. నిజంగా పెద్దపండుగే కదా బాబాయ్..  వెన్నుపోట్లు, వెన్నముద్దలు రాయడాలన్నీ ఇహ గత పాలకుల ఖాతాలల్లోనుంచి హఠాత్తుగా నిద్ర లేచొచ్చే పిశాచాలయి బక్కజనాలని  పీక్కుతినకపోతే! రతీ మన్మధుల రాజ్యం పార్టీ లక్ష్యం విస్తరించే కొద్దీ 'అది కావాలి.. ఇది కావాలి' అనే డిమాండ్లు వాటంతటవే అణిగిపోతాయ్. పై పెచ్చు 'ఇదిచ్చేస్తాం.. అదిచ్చేస్తాం! పుచ్చుకోకుంటే చంపి పాతరేస్తాం' లాంటి త్యాగనినాదాలే కర్ణభేరులదిరి పోయేలా మిన్నుముట్టేస్తాయి. మీరు కోసే  రామరాజ్యంలో కూడా సాధించలేనన్ని ఇంకెన్నో మహాద్భుతాలు మా ‘ర.మ రాజ్యం’ పాలనలోకొస్తే సులువుగా సాధించుకోవచ్చు బాబాయ్!   ఇప్పుడు జరిగే హక్కుల పోరాటాలన్నీ ఠక్కుమని ఒక్కసారే చెట్టెక్కేస్తే.. ధర్నా చౌకు వెనకున్న తుప్పలన్నీ నిర్మానుష్యంగా మారిపోతాయ్ గదా! అక్కడి  ప్రతీ అంగుళమూ ప్రేమ పక్షులకు కేటాయించేటందుకు సులువవుతుంది.  ప్రేమ మాత్రమే తప్పించి పగ, కక్ష, కార్పణ్యాల్లాంటి  దుర్లక్షణాలేవీ మచ్చుక్కైనా కంటబడని ఆ భయంకరమైన శాంతి భద్రతల అదుపుకు నీ లాంటి సీనియర్  సీజనల్ పొలిటీషియన్సు గుండెలు పాపం.. తట్టుకుంటాయో .. లేదో! వుయ్ పిటీ యూ బాబాయ్స్!'
'గురజాడగారి గిర్రాయి టైపు లెచ్చర్ల తంతును మించిపోతోందిరా నీ వాగ్ధాటి రోజు రోజుకీ! ఇన్నేసి న్యూసు పేపర్లు, ఇంతలేసి న్యూసెన్సు టీవీ ఛానల్సు  క్రమం తప్పకుండా చూసే నాకే  నిర్గుండె పడేటట్లుందే  నీ భావి భారత రాజకీయ ఊహా చిత్రం చూసి! ఇహ  తన మానానికి  తాను కామ్ గా తిని తొంగునే  ఆమ్ ఆద్మీగాడి పని!   మీ ప్రేమపిచ్చోళ్ల ధాటికి ఎట్లా తట్టుకుంటాడో ఏంటో.. పాపం! ఐ పిటీ ది ఓటర్! మూవీ, టీవీ మార్కెట్ల రేటింగులకంటే ఈ ప్రేమలూ.. దోమలూ ఓ.కే! మూడు పూటలా మెక్కేందుకింత కూడు.. మంచమెక్కి తెల్లారే దాకా తొంగునేందుకు ఓ జానెడు గూడు ఉంటే చాలు.. అబ్బో అదే ఓ పెద్ద భూలోక స్వర్గమని సంబరపడే బక్కోళ్లకు ఈ ప్రేమల, చీమల పార్టీలెందుకబ్బీ.. చీదర పుట్టించడానిక్కాకపోతే! పిచ్చాళ్లందరినీ మదపిచ్చాళ్లుగా మార్చేసి మీ పబ్బం గడుపుకునేందుక్కదూ మీరీ తిమ్మిరి పార్టీలన్నింటినీ తెర ముందుకు తెస్తున్నదీ? హన్నా.. ఏం.. ఎత్తిగడల్రా! స్నేహాలూ.. ప్రేమలూ.. అంటూ సొంత పాలిటిక్సుకి ఇన్ని కలర్సా!’
'ఏళ్ల బట్టీ బూర్జువా పార్టీల తత్వం  బాగా వంటబట్ట బట్టి నీ బోటి ముసలి డొక్కులకి ప్రేమంటే ముందులో కాస్తంత డోకేలే బాబాయ్! బట్ వుయ్ డోంట్ కేర్! బోల్డుగా చెప్పాలంటే నేటి తరానికి మా   రతీ మన్మథుల రాజ్యం’ దే ది బెస్ట్ మ్యానిఫెస్టో! ఇప్పుటి పార్టీలన్నింటివీ ప్రాంత, కుల. రాజకీయాలకు పక్కలు పరిచే  ఫీట్లే! కులం కత  వదిలేయ్..  అసలు ఉపకులం ఊసైనా ఎత్తకుండా మంత్రాంగం నడపలేనంత నిస్సత్తువలో ఉన్నాయ్ బాబాయ్ మీ మహా మహా పెద్ద పార్టీలే! ప్రేమజీవులకు అసలు కుల మతాలనే సతమతాలే ఉండవు. జాతి అడ్డూ ఆపుల్లేకుండా పురోగమించాలంటే  మా రతీ మన్మథుల రాజ్యం పార్టీ లక్ష్యాలే చివరికి గతి. అన్ని ప్రభుత్వాల ముందూ మేం పెట్టుకున్న  మహత్తర మహజర్లకు అతీ గతీ లేనందునే ఇప్పుడీ రతీ మన్మథ రాజ్యం పార్టీ పురుడుపోసుకుంది’ 
'అవునా! ఏంటబ్బీ  మరీ  అంత మహత్తరమైన మీ  మహజర్ల విశేషాంశాలు?'
'ప్రేమ కోసం జీవితాలను ఫణంపెట్టిన అమర జీవులు దేవదా, పారు; ఏంటొనీ క్లియోపాట్రా; సలీం అనార్కలి. ఆ అమర జూవుల విగ్రహాలని పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్టించమని మొత్తుకున్నాం. పసివగ్గులక్కూడా ప్రేమకథలను  ఉగ్గుపాలతో  రంగరించి మరీ గొంతులో పోయాలని గగ్గోలు పెట్టుకున్నాం. సిగ్గు ఎగ్గుల్లేకుండా ప్రేమించుకోవాలంటే ప్రాధమిక దశ నుంచే లైలా మజ్నూల్లాంటి లవ్ బర్డ్స్ చరిత్రలు పాఠ్యప్రణాళికల్లో చేర్చించమని చెవినిల్లు కట్టుకుని మరీ పోరాం.  ప్రేమ కథాచిత్రాలను మాత్రమే నిర్మించే విధంగా సినిమాటోగ్రఫీ చట్టాలలొ సవరణలు చేపట్టమని వినతి పత్రాలు వేలు ఇచ్చుకున్నాం. ప్రేమను కించపరిచే ఏ కళారూపాన్నైనా పర్మినెంటుగా బహిష్కరించే సెక్షన్లు  ఐ.పి.సి కోడుల్లో తక్షణమే చొప్పించాలని పెద్ద పెద్ద తలకాయలతో కూదా చెప్పించాం. ప్రేమ విరోధులకు విధించే శిక్షలు ప్రణయద్వేషులందరికీ వణుకుపుట్టేటంత కఠినాతి కఠినంగా ఉండాలని అనేకమైన పర్యాయాలు అప్పీళ్లక్కూడా వెళ్లివచ్చాం.  . ప్రేమ వివాహాలను ప్రభుత్వాలే స్వంత ఖర్చుతో భారీగా నిభాయించాలని నివేదించుకున్నాం.  ప్రేమపక్షుల విహారానికి అనుకూలమైన స్థలాలను ప్రభుత్వాలే సమీకరించాలని.  వాటిని ప్యారిస్ పార్కులని తలదన్నే పొదరిళ్ల మాదిరి  అభివృద్ధి పరచాలని ఎంతగానో పాకులాడాం.  విఫలప్రేమికులకు సరికొత్త ప్రేమికులు దొరికే వరకు ప్రభుత్వాలే 'వియోగభత్యం' కింద మందూ.. మాకూ ఖర్చులకని నెల నెలా ఇంతని చెల్లించాలన్న డిమాండ్లకయితే లెక్కేలేదు. ప్లాపైన ప్రేమ చిత్రనిర్మాతలకు ఉద్దీపన పథకాలు.. రేంటింగు తగ్గిన ప్రేమ సోపులకు  భారీ సబ్సిడీలు కేటాయించాలని  ప్రతి బడ్జెటుకు ముందు ప్రతిపాదనలు పంపించాం. పునః ప్రేమకు తాము చేసే సర్వ ప్రయాసలు పునః విఫలమై, పూర్తి విరక్తితో ఆత్మాహుతులకు తలపడితే .. సదరు విఫల ప్రేమికులు దూకి చచ్చేటందుకు సరిపడా  లోతైన కాలువలు, బావులు తవ్వించాలని..  తల పెట్టుకుని పడుకునేందుకు ప్రత్యేక రైలు పట్టాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన రైళ్లను వేళకు  ఆ ట్రాకుల మీదుగా పోయేలా ఏర్పాట్లు చేయాలని, ప్రేమికుల చేత పళ్లు రాలగొట్టించుకొనే ఔత్సాహిక ప్రేమికుల దంత చికిత్సలకు గాను వెంటనే ప్రత్యేక  'ప్రేమశ్రీ'  వంటి ఆరోగ్యపథకాలు  ఆరంబమవాలని ఎంతగానో ఆరాటపడ్డాం. లాస్ట్ బట్ నాట్ ది బెస్ట్ డిమాండ్ బాబాయ్! నూతన ప్రేమికులకు పరిమితుల్లేని ఉచిత సెల్ ఫోన్ కాల్స్ సౌకర్యమైనా  కల్పించాలని ఎంతగా కృషిచేసామో!  ఊహూఁ! ఒక్క అధికార పార్టీ అయినా మా మొరల్లో ఒక్కటైనా ఆలకిస్తేనా? అందుకే ఇప్పుడీ రతీ మన్మథుల రాజం పార్టీ పుట్టుకొచ్చింది! మా ర.మ రాజ్యం పార్టీ గాని రాజ్యంలోకి  వచ్చేస్తే ఆ  అద్భుతాలనీ మనకు మనమే ఇంచక్కా చెసుకొవచ్చనేదే మా ఆలోచన’   
'బాగుందిరా అబ్బాయ్ నీ ప్రేమ పార్టి సంబడాలు. కానీ నాదో బుల్లి సందేహం.  ఈ ప్రేమా.. దోమా..  వాలకం చూస్తుంటే ఇదేదో మొన్నటి గురువారం నాటి ప్రేమికుల దినోత్సవ తర్వాతనే వచ్చిన పూనకంలా ఉందే!  మరా రోజు నుంచే మీరీ పార్టీ అట్టముక్కలూ.. జెండా గుడ్డపీలకలు పట్టుకు రోడ్ల మీదకొచ్చి ఇంచక్కా చక్కర్లు కొట్టొచ్చు కదా!  మధ్యలో ఈ రెండు రోజుల సందూ ఎందుకు  తీసుకున్నట్లో?!'
'అర్థమవుతానే ఉందిలే  బాబాయ్ నీ మాటల్లోని పెడర్థాలు1  మాది మీ లాంటి 'కావలి కుక్కల' బాపతు పార్టీలు కావు. కావలింతల పార్టీ.  ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎంత గాఠ్ఠిగా  వాటేసుకోవాలో.. ఎవర్ని ఎట్లా చూసీ చూడనట్లుగా  దులపరించుకు 'అలా ముందుకు పోవాలో' .. ఆ ప్లానింగూ పాడూ కోసం  ఈ ఒక్కింత ఆలిసం ..!'
'కొయ్!.. కొయ్ రా నా రాజా! ప్రేమికుల రోజునే  మీరిట్లా అట్టముక్కలు, గుడ్డపీలికలు పట్టుకుని ఏ పార్టీలోకో దొడ్డిగోడ గుండా చీకట్లో  దూకుతూ పట్టుబడిపోతే    ఆ భజరంగ భళులా, రాంబంటు దళాలా..  ఆ గుంపులేవో  నిజంగానే మీ రెండు పార్టీలకీ  అక్కడికక్కడే పబ్లిగ్గా పొత్తులు కరిపించేసి   కొంపలు ముంచేస్తాయన్న బెంగ  కదట్రా  నాయనా.. నిజంగా చెప్పు! హ్హా.. హ్హా.. హ్హా! ప్రేమల పార్టీ  ఒహ వైపూ! దొంగప్రేమల పార్టీలు మరో వైపూ! ఇద్దరి మధ్యన ఒరకాటంలో పడి చచ్చేది మాత్రం పాపం.. మనసులో ఏముందో బైటికి గాట్టిగా చెప్పుకునే పాటి శకైనాలేని మన స్వతంత్ర భారత పౌరుడు! ఏడు దశాబ్దాల బట్టి ఇదే కదా మన ప్రజాస్వామ్యం కథా! ఐ పిటి దిస్ నేషన్స్  ఓటర్.. రా నిజం చెప్పాలంటే అబ్బిగా!’
***
-జి.ఎస్.దేవి
(సూర్య దినపత్రిక ఆదివారం (17 -02 -2019) సంపాదకీయ పుట వ్యంగ్యం)


Sunday, February 17, 2019

ఎన్నటికీ ఒంటరులం కాలేం - కవిత



ఒంటరులం కాలేం!

1
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
             
2
పూల మీద నడుస్తున్నా
పాదం కందకుండా కింద
అమ్మ అరచేయి అడ్డు పెడుతుంది


ఉట్టికెగిరేటప్పుడు
రెక్క తెగి- నువు కింద పడకుండా
నాన్న నీడ పహరాగా నిలబడి ఉంటుంది          
             
4
తోబుట్టువులనే
తోటి చేపలతో
బతుకు తొట్టి
ఈత కొలనుగా
ఎప్పుడూ సందడిగానే ఉంటుంది!

5
నీ రాలి పడే నవ్వులకు
ఒడి పట్టి వెంటబడే లోకం అంటావా
నీతోనే తన లోకం అంటుంది

6
కన్నీరైనా  ఒంటరిగా వదలుతుందా నిన్ను!
చెక్కిలి తడి కానివ్వదు
చెలిమి హస్తం చాచే ఉంటుంది

7          
చింతల గుంతన అయినా
ఏకాంతంగా   వదలదు.
నీ వ్యథలో అర్ధం తనదే
అటుంది నీ ఆత్మ అర్థభాగం
             
 8
ఇక అమావాస్య నాటి
వెన్నెల పక పకలకు మల్లే
పిల్లా జెల్లా ఎల్లకాలమూ
నీ వెనకాలే!

9
చావుతోనే అంతా అయిపోయిందనుకోడం
శుభం కార్డు పడితే
మరో ఆట లేదనుకోడం

10
అనుకుంటాం కానీ ఎవరమూ
ఎప్పటికీ  ఒంటరులం కాము
కాలేం*
హామీ పత్రంః' ఒంటరులం కాలేం' కవిత నా స్వంతం.దేనికీ అనువాదం/అనుకరణ కాదు.అముద్రితం.ఏ ఇతర పత్రికలలోనూ పరిశీలనలో లేదు అని హామీ ఇస్తున్నాను.

-కర్లపాలెం హనుమంత రావు
17-09-2012


Friday, February 15, 2019

కథలు- సినిమా కథలు - నా సరదా వ్యాసం



కథలు- సినిమా కతలు
-కర్లపాలెం హనుమంతరావు 
ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా..  సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం. 
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి  ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా . అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు.  క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి  సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త  అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం  ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే  మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ  మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో  కథల పేరుతో వచ్చే రాతలకే  ఏ 'ఏకతా'సూత్రం అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథమోటి   రాస్తూ బుర్రను తొలిచే  పురుగును .. ఫైనల్ గా  మిణుగురు పురుగు మాదిరి   ఎలా మెరిపించచ్చో  స్టెప్ బై స్టెప్ లెక్కలాగా  సాధికారికంగా వివరిస్తాడు.   హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్   సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో  తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా  కనీసం  ఒక్కసారైనా  ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు. 
కథను  తెరకు అనువదించడం  ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం.  (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో..వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డం  మన రచయితలకో థ్రిల్లు! 'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన   రచయిత  'నేటివైజేన్'  టెష్టులో 'సి'గ్రే డైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు-  నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు.  మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ  బాండీ వేసుకునే  స్థాయికి తీసుకు రాఅకపోతే అక్కడికి అదృష్టవేఁ!   
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క  హాలీవుడ్డు మేథావుల చెవుల్లో  ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు.  ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.  కథానిర్మాణం  వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం  మేథస్సుకు సంబంధించిన  చమత్కారం. 
తెరమీద కదిలే కథకి..  తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే!  వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద  మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా!  వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది. భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి  అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు  స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో  చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక  సినీకథా రచయితలకు.. కథారచయితలకు..  ఒకే విధంగా ఉపకరించే  పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY- 
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్

నాగరికత కథానాయకుడు -కర్లపాలెం హనుమంతరావు - కవిత







నాగరికత కథానాయకుడు 
-కర్లపాలెం హనుమంతరావు 


వాన వచ్చిందని ఇంట నక్కడు 
ఎండ మండిందని నీడ చేరడు
వణుకించే  చలికైనా ఎన్నడూ ముణగదీయడు  

పొలం పలక..  హలం బలపం 
కాడెద్దులు సహవాసులు
ప్రకృతి బడిలో రుతువుల గురువులు 
దిద్దబెట్టించిందీ  అక్షరమంటి మంటి సేద్యం 

నాటటం, నారు నీరు చూడటం 
కంచెలు కట్టి కాపాడటం 
పురుగు పుట్రా,  తాలూ తప్పా  ఏరడం 
ఏరువాక నుంచి ఎత్తిపోతల వరకు 
ఏదీ ఏమరక జాతికి పెట్టే పట్టెడు బువ్వ కోసమని 
రేయీ పగలూ
బతుకును ఆసాంతం మీదు కట్టే కృషీవలుడు
అక్షర సేద్యం చేసే ప్రతీ 'కృతీ'వలుడికి  గురుతుల్యుడు    
నిస్వార్థ నిబద్ధ  సామాజిక కవులందరకు 
నిత్యం  ప్రాత: కాలాన స్మరించ దగ్గ 
నాగరికతా కథానాయకుడు!

 -కర్లపాలెం హనుమంతరావు 
14-02-2019
బోథెల్ , యూ.ఎస్. ఏ 

Thursday, February 14, 2019

రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభలోని నా కథానిక


రాధమ్మ పెళ్లి జరిగిపోయింది - ఆంధ్రప్రభ (29-07-1982  నాటి) వారపత్ర్రికలోని నా కథానికః
ఎన్ని కమ్మని ప్రేమ కబుర్లు పోటీ కొచ్చినా జీవతమనే  పరుగుపందెంలో ఆఖర్న బంగారు పతకం సాధించేది,, విచ్చు రూపాయే! ఆర్థిక సంబంధాల ప్రాబల్యం అప్పటికీ ఇప్పటికీ,, ఇంకెప్పటికీ ఎవరూ పడగొట్టలేని వస్తాదే బతుకుగోదాలో అని మరో సారి చెప్పిన చిన్న కథ.. రాధమ్మ పెళ్లి జరిగిపోయింది! 

కథానిక : 
రాధమ్మ పెళ్లి జరిగిపోయింది 
- కర్లపాలెం హనుమంతరావు
( 28 -07 - 1982 నాటి ఆంధ్రప్రభ వారపత్రిక - ప్రచురితం ) 

రాజు, రాధా ప్రేమించుకున్నారు.
ప్రేమం టే?!
ఏమో నాకూ అట్టే తెలీదు. "

' ప్రేమ .. అమావాస్య చందమామ. . అందుకొనే దెంతమంది? .. వంద తక్కువ నూరు  మంది!' అన్నాడో కవి! 

అయితేనేం  పాపం, రాజూ, రాధా ప్రేమించుకున్నారు. 

ప్రేమం టే వాళ్ళకూ తెలుసన్న మాట అనుమానమే. అయినా ప్రేమించుకున్నారు.  పోనీ, కనీసం అలా అనుకుంటున్నారు. వాళ్ళు మేధావులు కాదు కనక. 

సాధారణంగా అందరి లాంటి యువతీ యువకులే గనక 'ప్రేమంటే ఏమిటి?' అంటూ ఆరా తీస్తూ కూర్చోలేదు. 

ఏదో హాయిగా అలా కాలక్షేపం చేస్తున్నారు. కాలక్షేపమంటే అదే... ఏదో కొద్దిగా సరదాగా గడిపేయడం. 

సరే వాళ్లు మాత్రం  వూరికే అలా ఎంతకాలం చూసుకుంటూ కూర్చుంటారు ? 

బోర్ బోర్! 

కడుపు నిండేనా, కాలు నిండేనా? 

ఒక శుభ ముహూర్తంలో పెళ్ళికూడా అయిపోతే  'శుభమస్తు ' కార్డు పడిపోతుంది కదా వాళ్ల ప్రేమ కథకు కూడా! 

' చేసేసుకుందాం .. పెళ్లి ' అని ప్రమాణాలు ఎక్స్ ఛేంజి చేసుకున్నారు. 

వాళ్ళయితే అనుకున్నారు... కుర్ర కారు.  మరి ఇరుపక్షాల పెద్దలు? 

"పెద్దవాళ్లు ఒప్పుకుంటా రంటావా, రాజూ!" అని అడిగింది రాధ.. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే ఏకాంతంలో కూర్చున్నప్పుడు పెళ్ళి ప్రస్తావన తవే ముందు తెచ్చి.

" ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను" అన్నాడు రాజు.. అనుమానాన్ని కూడా ధ్వనింపజేస్తూ

" ఒకవేళ ఒప్పుకోకపోతే?”

“ఒప్పుకోకపోనూవచ్చు. ఇంత దూరం వచ్చిన తరువాత వెనక్కు తగ్గుతాననుకున్నానా, రాధా!".

"అబ్బే... అలా అని కాదు. వూరికే అడిగేనులే. మరి మీదేమో బ్రాహ్మణ కులం. మేమేమో నాయుళ్ళం. కులాంతరమంటే మీ వాళ్లు అంతా తొందరగా ఒప్పుకుంటారా అని "

" మరి మీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవద్దూ కులాంతర వివాహావికి?"

" మా సంగతి వేరు, రాజూ! మా నాన్న గారు కులాంతర వివాహం చేసు కున్నారు. మా అమ్మ ఆ రోజుల్లో కొద్దో గొప్పో పేరున్న నటి. ప్రసక్తి వచ్చింది గనక చెబుతున్నా.  అమ్మది వడ్రంగి కులం. అయితేనేం, మా నాన్న గారు నాయుళ్ళయి ఉండీ ఆదర్శ వివాహం చేసుకోలేదూ! నేను గ్యారంటీ ఇస్తున్నాను, రాజూ. మన పెళ్ళికి మా వాళ్ళు ఎంతమాత్రం అభ్యంతరం చెప్పరు. మా బ్రదర్ పోయి నేడు ఫారిన్ నుండి తిరిగొస్తూ అమెరికన్ అమ్మాయిని  పెళ్ళాడి మరీ వచ్చాడు తెలుపా?" 

"మీ వాళ్ళది చాలా విశాల దృక్పథం, రాధా! ఐ యామ్ రియల్లీ హ్యపీ!  ... మా వాళ్ళే ఒట్టి చాందసులు. మా చెల్లెలు శాంత.. అదే బ్యాంకులో పనిచేస్తుందే .. తను తన కోలీగ్ ను చేసుకోవాలని చాలా పాకులాడుతోంది . శాఖాంతరమని మా వాళ్లే పడనీయడం లేదు " 

"మరి నువ్విప్పుడు ఏకంగా కులానికే ఎసరు పెట్టేస్తున్నావుగా: అడిగి చూడు! పెద్దల ముందుగా వద్దన్నా సరే, అంగీకారం కోరటం మన డ్యూటీ. నేనూ ఈ రోజే ఇంట్లో విషయం కదుపుతాను."

"ఏ విషయం. రేపు ఆదివారం సాయంత్రంలోగా ఇక్కడే తేలిపోవాలి.. విష్ యూ బెస్సాఫ్ లక్.." అని నవ్వుతూ లేచాడు రాజు. రాధ రాజు చెయ్యి పట్టుకుని పైకి లేస్తూ , "విష్ యూ  ది సేమ్ ...' అని నవ్వింది. 

రాజు కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు. రాధ ఉమెన్స్ కాలేజీలో  డిగ్రీ మూడో ఏడు చదువుతూంది. కాలేజీకి దగ్గరే ఆఫీసు, ఇద్దరూ తరచూ ఒకే కేంటీన్ లో కలుసుకోవటంతో పరిచయం కలిగి .. అది ప్రణయంగా మారింది. అందుకు ఇద్దరూ అభిమానించే సినిమాలు, ననలలు బోలెడంత దోహదం చేశాయి. 

అనుభవంలేని వయసు పాంగొకటి తోడైంది.  ప్రణయం ముదిరి పాకాన పడింది.

రాజుకు శాంత అనే పెళ్ళి కాని చెల్లెలుతో పాటు, రాఘవ అనే ఉద్యోగం లేని  గాడ్యయేట్  తమ్ముడూ, పించను   ఇంకా సెటిల్ కాని రిటైర్డు టీచరు తండ్రి. చాదస్తం వదలలేని  పాతతరం తల్లి .. కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఆ ఇంటికి దిక్కు రాజు జీతమే . శాంత జీతం మాతం కట్నం కోసమని దాస్తున్నారు. 

ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఎప్పుడూ అరవ కాకి లాగా బయట పడి తిరిగే   రాఘవకూడా ఒంట్లో నలత కారణంగా ఇంటి పట్టునే ఉన్నాడా పూట. 

భోజనాల దగ్గర పెళ్ళి ప్రస్తావన ఎత్తాడు రాజు. 
నా అంత ఎత్తు ఎదిగిన  వాడివి నీకేమని బుద్ధి చెప్పను! ఇంటి పెద్ద కొడుకుగా నీకూ  కొన్ని బాధ్యత లున్నాయన్న విషయం మరిచి పోయావురా?” అన్నాడు తండ్రి నిష్ణురంగా .

 “నే నంత కాని పనేం చేశామ, వాన్షా! ఆ అమ్మాయి చాలా గుణవంతు రాలు. “

" గుణమొక్కటే చాలుతుందా ? కులం?"

రాజు మాట్లాడలేకపోయాడు. 

తండ్రే అందుకున్నాడు "నువ్వు చెప్పక పోయినా మాకు తెలుసు లేరా ! నాయుళ్ళ సంబంధం చేసుకుంటే శాంతకు మళ్ళీ ఈ జన్మలో పెళ్ళవుతుం దంటావా?"

"ఈశ్వరావు నాకు బాగా తెలుసు. నేను కులాంతరం చేసుకున్నా తను శాంతను వదులుకునే పాటి మూర్ఖుడు కాదు. శాఖాంతరముని మీరే రాద్ధాంతం చేస్తున్నారు గానీ! " 

"ఏమో నాకీ సంకరజాతి వెళ్ళిళ్ళు ఇష్టం లేదురా! మేం మళ్ళీ అందరిలో  తలెత్తుకు తరగాలా. . వద్దా  ?” అని అందుకుంది తల్లి.

" రాధ వాళ్ళ కుటుంబం సంగతి మీకు తెలీక అలా అంటున్నారమ్మా! ఆయనతో వియ్యమందటానికి బిజినెస్ మేగ్నెట్లతో సహా ఎంతమంది క్యూలో  ఉన్నారో తెలుసా ? రాధ తండ్రి డబ్బున్న కాంట్రాక్టర్. ఎన్నికలలో ఈ దఫా కూడా పోటీ చేయబోతున్నాడు. గెలిస్తే, మంత్రి పదవి  ఖాయమంటున్నారు.  గెలవక పోయినా అధికార పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించే అంతస్తు . అలాంటి వాల్లాయి సంబంధం ఎన్నటికీ తలవంవులు కాబోదు. గొప్ప కింద లెక్క .  అందుకే మీ మహదేవన్నయ్య  ఇన్ని సిద్ధాంతావా వల్లించి చివరకు కొడుక్కోసం  రాధ తండ్రి చుట్టూతా  తిరుగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ నాయకు డికి లేని సంకరతనం ' మనకెందుకమ్మా?" 

" ఏమో! బాబూ! కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి .. ! "  

"అది కాదమ్మా! తమ్ముడు ఎంత కాలంగా  బియ్యస్సీ ఫస్టుక్లాసులో ప్యాసయ్యీ ఖాళీగా ఉంటున్నాడు? ఇంకింత కాలం ఉన్నా వాడికి ఉద్యోగం రావటం డౌటే. ఏ సిఫార్సో , మూటో లేకపోతే  ఉద్యోగాలు వచ్చే రాజులా ఇవి? వీడి సంగతి ఒక్కసారి ఆయన చెవినబడింబా చిటెకెల మీద  ఉద్యోగం రెక్కలు కట్టుకు వాలిపోతుంది.”

రానీయరా! అప్పుడే చూద్దాం” అంటూ విస్తరి ముందు నుంచి లేచాడు రాజు తండ్రి. 

ఆయన మెత్తబడినట్లు  తెలుస్తూనే ఉంది. రాఘనకు ఉత్తేజ మొచేసింది. ఉద్యోగ మొస్తుందన్న ఆశ తోటి. "అయినా ఈ రోజుల్లో కులం గిలం అట్టే ఎవరు పట్టించుకుంటున్నారే, అమ్మో! ఇందాక 
నువ్వు పెద్ద ఆచారాలను గురించి  చెబుతున్నావు కదా ! నువ్వు మొన్న , స్కూళ్ళ ఇన్ స్పెక్టరు గారు క్రిస్టియనైనా నట్టింట్లో నాన్నగారి పక్కన అకేసి అన్నం పెట్ట లేదూ? అప్పుడెక్కడికి పోయిందో కులం? ఆయన అధికారి. పింఛను  వ్యవహారం తొందరగా సెటిల్  చేస్తాడేమోనన్న ఆశ కొద్దీ మీరు తాత్కాలికంగా కులం సంగతి మరిచిపోయారు. అందరూ ఈ రోజుల్లో అలాంటివి ఆవసరమయితే తప్ప ఎవరూ పట్టించు కోవటమే లేదు.”

"ఏమోరా, బాబూ! అవ్యక్తపు మనిషిని. నన్నెందుకు చంపుతారు ! అయినా చూస్తూ చూస్తూ ఆ అంట రాని పిల్లని వంటింట్లోకి ఎట్లారా  రానీయడం? " 

శాంత అందుకుంది: “అంటరానితనం ఏ కులంలో లేదే ఈ రోజుల్లో! మొన్న నువ్వూ, నేనూ రామలక్ష్మి కూతురు పుట్టిన రోజు పండుగకు పిలిస్తే ..  మనవాళ్ళే గదా.. అని వెళ్ళామా! ఏమయిందీ? నిన్ను ఆ పసిపిల్లను ముట్టు కోనిచ్చారా ? మర్యాదగా పలకరించారా? ఎందు కొచ్చావిక్కడికి  అన్నట్లు మాట్లాడలేదూ! వాళ్ళు మరి మన కులం వాళ్ళేగా! ఎందుకు మరి నిన్ను అంటదానివాళ్ళుగా చూశారు? నాళ్ళకు లాగా సినిమా హాల్సు, రైసు మిల్లులు లేవనేగా ? బీద బడిపంతులు భార్యవనేగా!" 

"మీ అందరూ చదవేసిన వాళ్ళు, తల్లీ! తిమ్మిని బెమ్మిని, బెమ్మిని తిమ్మిని అయినా చెయ్యగలరు.  తల్లితండ్రులం, మేం కోరుకునేదేమిటి?  మీరు చల్లగా ఉండటం కావాలి మాకు.  మీ కిదే ఇష్టమనుకుంటే అట్లాగే కానీయండి. లోకం మారిందంటున్నారుగా!  రాఘవగాడికన్నా ఉద్యోగమొస్తే అదే పది వేలు - ఆదే
మాకు పెద్ద బెంగయిం దిప్పుడు” అనేసి కంచాలు తీసుకుని వెళ్ళి పోయింది రాజు తల్లి. 

" హిప్ హిప్ హుర్రే ” అని అరిచాడు రాఘవ సంతోషం పట్టలేక.
" పెద్ద వాళ్ళను  ఇబ్బంది పెట్టకుండా పెళ్లి జరిగి పోతుంది" అని తృప్తిగా నిట్టూర్చాడు రాజు.

ఈశ్వరావుతో జరగదనుకున్న  పెళ్ళి మళ్ళీ ఖాయమయ్యే పరిస్థితి వచ్చేసరికి  శాంత కళ్ళ లోకి మెరుపులు  వచ్చేశాయి. 

రాజు ఆ సాయంత్రమే రాధ కోసం పార్కు కెళ్ళాడు ఎంతో ఉత్సాహంతో. 

కానీ, రాధ పార్కుకు రానేలేదు. ఎంత నిరుత్సాహం కలిగిందో! 

మరునాడు కేంటీన్ లోను కనిపించ లేదు. కాలేజీలో వాకబు చేస్తే క్లాసుకే రాలేదన్నారు. 

అయోమయం అనిపిం చింది రాజుకు . . రాధ ఇంటికి వెళ్ళాడు.  తలుపుకు వేసి ఉన్న తాళం కప్ప వెక్కిరించింది. 

వారం రోజులయింది.  కానీ , రాధ జాడ  అంతు పట్ట లేదు. పిచ్చెపోయినట్లయింది రాజుకు. 

ఆ రోజు పోస్టులో రాజాకు  కవరొచ్చింది. ముత్యాలు పేర్చినట్లుండే దస్తూరిని చూడగానే ఆనందంగా అనిపించింది. రాధ దగ్గర నుంచే సందేశం, 

ఆత్రుతగా   కవరు ఓపెన్ చేశాడు.  రాజు. 

శుభలేఖ బయట పడింది. జలాగా చిన్న ఉత్తరమూ
ఉంది! 

రాజ గారికి! 
 అర్థమయిందనుకుంటాను. 
నా పెళ్ళి నిశ్చయమై పోయింది. 
పరుడు మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు ఇప్పించాల్సిన  రాజకీయ నాయకుడి ఏకైక పుత్రరత్నం. 
మన విషయం ఆ రోజు ఇంట్లో కదిలించిన రోజు మా వాళ్ళ నిజస్వరూ పాలు బయట పడ్డాయి. 
'నీ పెళ్ళి మీద నేను బోలెడన్ని ఆశలు పెట్టు కున్నాను, తల్లీ! అవి కల్లలయిపోవటానికి లేదు. వియ్యానికైనా, కయ్యానికైనా  సమ ఉజ్జీ ఉండాలి' అని నాన్న గారు కొట్టి పారేశారు. 

నా మొండితనం తెలిసి మా వాళ్ళు నిర్బంధంగా నన్ను  విశాఖపట్నం తీసుకొచ్చారు. వారుడుది ఈ  ఊరే. 
ఈ పెళ్ళితో మా నాన్నగారికి పార్టీ టిక్కెట్టు దొరుకుతుంది. అన్నయ్యకు పెద్ద కంపెనీలో జనరల్ మానేజరు పోస్టు దక్కుతుంది. అమ్మకు డాన్స్ స్కూలు పెట్టుకోవటానికి పర్మిషన్, ఫండ్సూ దొరుకుతాయి. 

మరి నాకో...? ఏం దొరుకుతుంది? జ్ఞానం. మనం అభిమానించే సినిమాలల్లో, నవలల్లో ఉండే ఊక దంపుడు  ఉపన్యాసాల తాలూకు కులాలు, మతాలు వాటి మధ్య అసమానతలు, దోపిడి, ఘర్షణ అంతా ఆచరణలో పట్టవలసిన సందర్భం వస్తే  ఫార్స్  అనీ, మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అసమానతలు  అన్నిటికి కారణం ఏకైక పదార్థం ఒక్కటే. . అదే 'ఆర్థికం' అనే జ్ఞానం మాత్రం మిగులుతుంది రాజూ! వీలైతే నిన్ను క్షమించు; 

ఇట్లు, 

... 

రాజుకు సవ్వొచ్చింది. 'క్షమించటానికి తనెవరు? రాధ తల్లి తండ్రులను తప్పు పట్టటానికి తన కెక్కడ నైతికంగా హక్కుంది? తమ్ముడికి ఉద్యోగం వస్తుం దనీ, తండ్రి సమస్య తీరుతుందనీ, సంఘంలో మరో మెట్టు పైకి ఎక్క గలమనీ నచ్చచెపితే గదా . . తన తలి దండ్రులు కులం అడ్డును కూడా  కాదని ఒప్పుకుంది! 

అదే మార్గంలో  రాధ తల్లిదండ్రులూ వెళ్లారు. 

రాధ నాన్నగారు కులాంతర వివాహం చేసుకుందీ, రాధ అన్న అమెరికన్ అమ్మాయిని చేసుకుందీ, పెళ్ళిని ఈశ్వరావుతో తన తల్లిదండ్రులు నిరాకరించిందీ, తన పెళ్ళిని రాధతో అంగీకరించనిదీ.  అన్నీ  ఒకే  ఆలోచనతోనే కద! అన్నిటికి ఆర్థిక కొలమానమే ప్రమాణమయింది గదా .. పెళ్ళిళ్ళకూ... ఆఖరికి ఆదర్శ వివాహాలకు కూడా! 

శాంత కిందివాడు పైమెట్టుకు ఎగబాకాలని చూస్తే, ప్లైవాడు ఇంకా ప్లైమెట్టుకు పాకులాడుతూ ఈ 'గాప్' ను సదా రక్షించు కోవటానికే చూస్తున్నాడు. అడుగున ఉన్న మనిషి పైన ఉన్న వాడి కాళ్ళు పట్టుకుని ఎగబాకాలని చూస్తుంటే, ఆ పైన ఉన్నవాడు క్రింది వాడి నెత్తి మీద కాలు పెట్టి ఇంకా  పైకి ఎగబాకాలని చూస్తున్నాడు! 

మనసులకు సంబంధించిన 'పెళ్ళి' వ్యవహారంలో కూడా ఇంతే.. ఇంతే! 

ఏమయితేనేం.. రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది— రాజుతో మాత్రం కాదు.

***
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ వారపత్రిక - 28-07-1982- ప్రచురితం)  






రాధమ్మ పెళ్ళి జరిగిపోయింది - కథానిక


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...