- ** **
** మీరు దీన్ని నిజమన్నా అనుకొండి! అబద్దమన్నా అనుకొండి!!అది మీ ఇష్టం!! నేను
పెద్ద బుక్కులు సదవ లేదు.నోరు తిరగని పరాయి మాట్లు నేర్సలేదు. అన్నీ సదివి
గడ్డాలు,మీసాలు నెర్సినోళ్లు ఏమి రాతలు రాసిండారో !ఏమి కూతలు కూసిండారో నాకి
అసలుకే తెలీదు. ఈ జనాల్నంతా సూస్తావుంటే,ఇంతకు ముందు జరిగిన సంగతంతా ఒగసారి మీకు
సెప్పుదామనిపిస్తావుంది. యనకటికి దేవునికి--ఆయప్ప లోకంలోని దేవాను దేవతల నంతా
సూసి,వాళ్ల యవ్వారాలన్నీ ఇని శానా బేజారయి
పాయనంట!'తూత్.. ఏమిరా ఈళ్ల
పాడు బుద్దులు, గలీజు పన్లు. అంతా సెడి సెన్నూరు తిప్పలు పట్టిండారు. ఈళ్లని సక్క
జేసేకి నా శాతగాదు. ఇంగొగ కొత్త లోకం ఏర్పాటు సేస్తే బాగుంటాదీ అని మనసులోనే
అనుకొన్నంట. అనుకోనుందే తడువు సంగటి ముద్ద మాదిరి ఒగ గోళాన్ని తయారు సేసి,
పైన్నుండి ఆకాశంలోకి పారేశనంట. అది గిర్ర్ న బంగరం మాదిరీ తిరగ బట్నంట. 'తోకెనక
నారాయణా' అని దేవుని సుట్టూ తిరుగుతా వున్నంట. అపుడు దేవుడు కొన్ని బొమ్మలు తయారు
సేసి రూపాలు ఇంగడిచ్చి దోసిట్లోకి తీసులోని, వాటి నోట్లోకి సుక్కుడు సుక్కుడు
ప్రాణం పోసినంట. అపుడు ఆ బొమ్మలు గుడ్లలోనుండి బయటికొచ్చిన కోడి పిల్లల మాదిరీ
దేవుని సేతుల్లో బిలబిల తిరగబట్నంట. దేవుడు రవ్వంత సేపు ఆ జీవుల్ని అట్లే సూసి
మాటలు నేర్పిచ్చి "మనుషులు" అని పేరు పెట్నంట. "ఈ దినం నుండి మీరు
బొమ్మలు కాదు. జంతువులూ కాదు.
బంగారట్లా ఆలోశన సేసే మనసున్న మనుషులు. మీరంతా ఆ గోళం మీదికి దుమికి హాయిగా
బతుక్కో పోండి" అని సెప్పెనంట. ఏడిదీ ఆదారం లేకుండా గిర్ గిర్ న యంత్రం
మాదిరీ తిరుగుతా వుండే దాన్ని జూసి వాళ్లు బయంపడిరంట. ఏమి సేయల్లో తెలీక, నిలువు
గుడ్లేస్కోని, బిర్ర బిగుసుకోని నిలబడి పాయరంట. దేవుడు వాళ్లకి శానా సెప్పు
సూసినంట."ఒరే! అది బూమిలోకము. మీకోసరం కన్నగసట్లూపడి తయారు సేసిండాను. ఆ
తావకి సేరుకోని మానాలుండే మానవ లోకం తయారు సేసుకొండి" అని గడ్డాలు పట్టుకోని
అడుక్కోని సిలక్కు సెప్పినట్ల సెప్పినంట. అయినా వాళ్లెవురూ ఇనలేదంట. అపుడు
దేవునికి కోపము నసాళానికి ఎక్కినంట. "ఇదిగో నేను కండ్లు మూసుకోని, మూడంకెలు
లెక్కబెట్టే లోపల ఈట్నుంచి ఎల్లిపోవల్ల. పోకుంటే మిమ్మల్ని ఏమి సేస్తానో నాకే
తెలీదు." అని కండ్లకొద్దీ కోపం సేసుకోని కండ్లు మూసుకొన్నంట. 'ఆత్రగాడికి
బుద్ది మట్టు ' అన్నట్ల యనకా ముందూ సూడకుండా ఒగడు బిర్న బూమిలోకం మీదికి 'ధఢుం' న
దుమికి పారేశనంట. వాడు ఎర్రోని మాదిరీ బూమ్మీదికి 'ధభాల్ 'న పడింది సూసి
మిగిల్నోళ్లు ఎర్సుకోని, గడగడ్న అదురుకోని దేవుని
నోట్లోకి,ముక్కులోకి,సెవుల్లోకి...ఇట్ల యాడ సందుంటే ఆడ దూరి దాచి
పెట్టుకొన్న్రంట!! మూడంకెలు లెక్కబెట్టేది అయినంక, దేవుడు కండ్లు తెర్సి సూస్తే
దోసిట్లో ఎవరూ లేరంట! బూమ్మీదికి తొంగి సూసెనంట. ఒగడు మాత్రం సీమిడిలో తగులుకొన్న
ఈగ మాదిరీ బూమ్మీద పడి తనుకులాడ్తా వుండాడంట. మిగిల్న జనాలు ఏమై పాయిరప్పా!! అని
దేవుడు బూమండలమంతా అంజనం ఏసినట్ల ఎదికినంట. యాడా కనిపిచ్చలేదంట. "నేను
పుట్టిచ్చిన జనాలు నాకే టోపీ ఏసి, నా
కండ్లకే కనిపిచ్చకుండా యాటికి మాయమై పాయిరప్పా??" అని సందేహం పడినంట.
ఇంగొగసారి దుబిణీ ఏసి ఎదికినట్ల బూమండలం ఒగపక్కనుంచి అంగుళమంగుళమూ గాలిచ్చినంట.
అయినా కనిపించలేదంట. సివరాకరికి-- "ఈళ్లు కంటి పాపలకి తెలీకుండా కన్ను
రెప్పల్ని కత్తిరించే రకం మాదిరీవుండారు" అని అనుకోని, బయటి సూపులు సాల్జేసి,
అంతరంగం లోనికి తొంగి సూసుకొన్నంట. యపుడయితే దేవుని సూపులు,దేవుని లోపలికి ఎలుగులు
మాదిరీ జొరబడ్నో.. అవుడు వాళ్లకి బయ్యమయి పాయనంట. కన్నాల్లో దూరుకోనుండే యలకలకి, ప్యాడపిడకల్తో ఊదర బెడితే యట్ల అవి బయటికి
ఉరికెత్తుకొస్తాయో అట్ల భగమంతుని శరీరములోని సందుల్లో నుంచి సర్ న బయటికొచ్చిరంట.
అపుడు దేవుడు వాళ్లని సేతుల్లోకి తీసుకోని "ఒరే! తప్పుడు నా కొడుకులూ!!నేను
మీకు సెప్పిందేమి? మీరు సేస్తావుండేదేమి??"అని నొటికొచ్చినట్ల తిట్టి
పారేసినంట. దానికి వాళ్లు "స్వామీ! మాన్నబావా!! మమ్మల్ని ఈడ పుట్టిచ్చి ఆడ
పారెస్టే, యట్ల బతకల్ల? బతికే తత్వం తెలిసేదంకా నీ అంగాల్లో సేరుకోనుండి, పరాన్న
జీవులమాదిరీ బతుకుతాము" అని మొర పెట్టుకొనిరంట. అపుడు దేవుడు తలతలే
కొట్టుకోని "ఈ దేవలోకం సూస్తే అంతా మోసగాళ్లు. జనాలందర్లోనా లేని పోని బయాలు పుట్టిచ్చి--యాగాలూ, నోములూ, పూజలూ, శాంతులూ, వాస్తులూ, దానాలూ … ఇట్లా అర్తంపర్తం
లేని పనుల్ని సేపిచ్చి కూకోని తినేదానికి రుసిమరిగిండారు. బతుకనేది మర్సి నాటకాలే
జీవితమన్నట్లు తయారయ్యిండారు. యన్ని ఉపదేశాలు సేసినా ఈ సెవిలో యిని ఆ సెవిలో ఇడిసి
పెడతావుండారు. దాని కోసరమే--- దేవలోకమోళ్లు సూసి సిగ్గుపడే రకంగా బూమిలోకం తయారు సేస్తాము
అనుకొంటి. మీరు సూస్తే ముంతడు నీళ్లకే ముక్కు మూసుకొనే ముదనష్టం నా కొడుకుల మాడిరీ
వుండారు!" అని మనసులోని బాధనంతా యళ్లగక్కినంట. భూమి లోకంలోనికి వాళ్లనట్ల
తొంగి సూడమనినంట. *** **** *** *** ***** **** యాడసూసినా పచ్చపచ్చగా వుండే అడవులు. తళతళామెర్సే కొండలు, గుట్టలు. గలగలా పార్తావుండే ఏర్లు. వంకల్లో పిళపిళా ఈదులాడ్తావుండే సేపలు.
బక్కల్లో బెకబెకా అరుస్తావుండే కప్పలు.సెట్లమీద కిలికిలా అరుస్తావుండే గువ్వలు.
కసువు మేసుకొంటా బుడుగుబుడుగున ఎగురులాడతావుండే జింక పిల్లలు.పట్పట్న రెక్కలు
కొట్టుకోని ఎగుర్తావుండే పక్షులు.సర్ న జారి పోతావుండే పాములు. కొమ్మల మింద ఎగిరి
దుముకుతావుండే కోతులు. కండ్లకి ఆనందం తినిపిచ్చి శబ్దమే లేకుండా గాళ్లో తేలి
పోతావుండే ముత్యాలమ్మ పులుగులు (సీతాకోక చిలుకలు) ఇట్ల ఒగిటిగాదు రెండుగాదు,
బూమండలమంతా అందాలు ఒలకబోసి అలికి ఇంపుగా ముగ్గులు పెట్టినట్ల వుంది.దాన్ని సూసి
వాళ్లు శానా ఆనంద పడిపాయిరి. అఫుడు దేవుని దిక్క తిరిగి "స్వామీ! ఘడియ ముందు
సూసు నపుడు భూమండలం ఎండుకు పోయిన సంగటి ముద్ద మాదిరీ, తిరుమల పూజార్లకి సిక్కిన బక్తాదుల తలకాయ మాదిరీ నున్నగా ఉండింది కదా??
ఇంత బిరీన మా కండ్లు పట్టనంత అందం యాట్నుంచి వొచ్చె??" అని అడిగిరంట. అపుడు
స్వామి "దేవలోకంలో ఒగ నిమిషమైతే ఆడ భూలోకంలో ఒగ యుగము. ఈడ కత్తిరించుకోనే గిలీటు గాళ్లు. ఆడ కష్టం సేసి బతికే కల్మషంలేని జీవులు"
అన్నెంట. "అంటే వాళ్లెవురు స్వామీ??" అని అడిగిరంట. అపుడు స్వామి 'ఈళ్లు
నాన్న సేతికి నామాలు పెట్టి నాన్నా నాగుబాము అనే రకం జాతోళ్లమాదిరీ వుండారు ' అని అనుకోని "కండ్లు ఇగ్గబీకి
సూడండ్రా" అని అర్సినంట. అపుడు సూస్తే తలకాయకి బట్ట సుట్టుకోని, నడుంకానా పంచెగ్గట్టుకోని, ఆడా మగా పిల్లా జల్లా
ముసలీ ముతకా అనకుండా ఎద్దుల్తోను, ఎనుముల్తోను, ఆవుల్తోను భూమిని దున్నతా వుండారంట. యండ, వాన, పగలు, రాత్రి అనేదే మర్సి
పంటలు సాగుజేసి అందరి బతుకులకీ అన్నం పండి పెడ్తావుండారంట. వాళ్లకి భూమే ఒగ యగ్న
గుండమంట . పంటలు పండిచ్చేదే ఒగ
యాగమంట. మనిషంటే పనంట. పనంటే మనిషంట. కాయకష్టం సేయకుండా బతికే బదులు సచ్చేదే మేలు
అనుకోనే రకమంట. అట్లా జనాన్ని సూసిన దేవునిబిడ్లు, దేవునిగ్గూడా సెప్పకుండా
భూమ్మీదకి సేర్రంట. ఈళ్లూ,రైతులూ కల్సిన భూలోకం శానా బాగుంటుదని మీరనుకోవచ్చు. అట్లనుకొంటే మీరు సదువు నేర్సి సెడినోళ్లకిందే
లెక్క!! యాలంటే "ఒరే !!మేము దేవుని బిడ్లు. నేను దేవుని నోట్లో నుంచి
వొచ్చిండాను, నాకాకలయినవుడు నా
నోటికి అన్నం అందించేది నీపని" అని ఒగడు. "నేను సెవుల్లో నుంచి
వొచ్చిండాను, నేను సెప్పినట్ల ఇంటే
నీకి పుణ్యమొస్తుంది" అని
ఒగడు. "నేను కాళ్లలోనుంచి పుట్టిండాను, నా కాళ్లకిమొక్కి పూజలు సేస్టే స్వర్గలోకం అందుతుంది" అని
ఒగడు."నేను దేవుని కండ్లలో నుండి వొచ్చిండాను నేను సెప్పిన టయానికి
ఇల్లుగట్టి,పెండ్లి సేసుకో,నువ్వు నూరేండ్లు బతుకుతావు"అని ఒగడు... ఇట్ల
కష్టజీవులమింద దాదాగిరీ సేసుకొంటా,కండ్లకి గంతలుగట్టి గానుగ తిప్పే ఎద్దుల మాదిరీ
సేసి కాడిచ్చుకోని తింటావుండారు!! ఇంతకు ముందయితే దేవుడు భూలోకానికి అపుడపుడు
వొచ్చి సూసి పోతావుండే!! దేవుని లోకం మాదిరీ భూలోకంగూడా యఫుడు సెడి పాయనో!!అపుడు
ఆయప్ప వొచ్చేదే ఇడిసి పెట్టిండాడు.అందుకే ఈ లోకంలో దేవునిబిడ్లు ఆడింది ఆట!
పాడింది పాట!! అయి జరిగి పోతావుంది
-సడ్లపల్లె చిదంబరరెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010
మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్ , 08-09-2010 మతభావనలు , మనిషికీ నరవానరానికి తేడాలు తలెత్తినప్పటినుంచీ మొదలైనవిగానే ...
-
ఆదివారం ఆంధ్రజ్యోతి (15 జూన్ 2014) ఈ వారం కథ పి.సత్యవతిగారి 'పిల్లాడొస్తాడా?' ఒక మంచి కథే కాదు.. కథా వ్యాఖ్యానం.. అని న...
-
పూర్వం సంస్కృతం నేర్చుకోమని బలవంతంగా కుదేస్తే .. ఆ భాష గిట్టని బడుద్ధాయిలు కొందరు ' యస్య జ్ఞాన దయాసింధో ' అని గురువుగారు ప్ర...
No comments:
Post a Comment