Wednesday, November 10, 2021

గల్పిక : వానా! వానా! వల్లప్పా! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం )

 


గల్పిక : 

వానా! వానా! వల్లప్పా! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం ) 


జోరున కురిసి వాన వెలిసిన మరుసటి నిమిషాన దారంతా గోదారై  పొంగి పోర్లే వేళ మా బడి పిల్లల చంకల్లోని సంచుల్నుంచీ ఎన్ని పడవల పుట్టేవో! పసి సందేశాలను ఏ పసిడి దేశాలకు మోసుకుపోవాలనే తుళ్లుతూ తూలుతూ సాగే తన చిట్టి పడవ ఠక్కున  ఏ చెట్టు కొమ్మకో

చుట్టుకుని  చిరిగి కంటిముందే మునిగిపోతుంటే నవ్వాడని కసికొద్దీ పక్కవాడి మీద కలబడి నేన నీల్లలో పడి  తడిసి ముద్దయి వణుకుతో  ఇంటికొస్తే అమ్మ తిట్టి చూరు కింద  గోరువెచ్చని నీళ్లతో

తలంటుపోసిన తొలిదినాల తొలకరి చినుకుల పలకరింతల పులకరింతలు... ఓహ్ .. మరపురాని ఆ మధుర క్షణాలు తిరిగి వచ్చేనా! 


ఏవీ ఆ జడివానల జాడలిప్పుడు? ఏవీ ఆ కారుమబ్బుం దారుల బారులు? ఏరీ ఆ వరుణదేవుని  కరుణ కురిసే అమృత ధారలు? 


జులై నెల జలమాసం రోజులు.  జన్మభూమి జోరుగా జరుగుతున్నది. గ్రామసభలు కిక్కిరిసిన జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఏ నోట విన్నా ఒకటే మాట..  వాసకావాలి! 

మరి మన అధికారులు ఏమనుకుంటు న్నారో విందామా ? బోలెడంతా  కామెడీ అక్కడే పుడుతుంది.

***

'రుతుపవనాలేమన్నా  రుణానికిచ్చే సొమ్మా? ఒత్తిడి పెడితే వాయుగుండాలవటానికి మేమేమన్నా సముద్రాలమా?  తొంద రపడితే ఎలా? మేమందరం వానలు కురి పించే పనిలోనే ఉన్నామయ్యా!  మీడియా .. ఏదైనా ఐడియా తడితే మీరూ చెప్పచ్చుగా.. ఆలోచిస్తాం! 


'గాడిద చెవులు నులిమితే వానలుపడతాయని గార్దభశాస్త్రం చెబుతుందండీ!

ఊరికో గవర్నమెంటు గాడిదను సరఫరా

చేస్తే వానబెడద వదిలిపోతుందిగా! గాడిదలకూ కరువేనా? ...

'గాడిదలకు కరువు లేదు. చెవులకే కరువు. ఎక్కడ చూసినా నోరున్న గాడిదలే గానీ చెవులున్నవి కనిపిస్తేనా! 

కప్పల  పెళ్ళిళ్లు చేయిస్తే కచ్చితంగా వానలు పడితీరతాయని మా ముత్తాతల కాలంనుంచీ మొత్తుకుంటున్నారండీ! కప్పులకైలే  కరవుండదేమో!


మండినట్లే వుందయిడియా! ఎండలు మండిపోతున్నాయి గదా! మండూకాలెక్కడ దొరుకుతీయండి!  అయినా మీకోసమని .. చైనా నుంచైనా సరేనని కప్పల్ని తెప్పించి ఘనంగా పెళ్ళిళ్లు చేశామా...! భారీగా కురిశాయి వానలు.. . చైనాలో! 


అందుకే పొరుగున ఉన్న వాళ్ళు అతిజాగ్రత్తగా స్థానిక గాడిదలనే  చూసి మరీ పెళ్ళిళ్లు చేస్తున్నారు సార్! 

అయినా వర్షాలు  కేరళలో కురిశాయి చూశారా! వరదలొచ్చాయని కేరళ వాళ్లి ప్పుడు తమిళనాడుతో తగవుకెళ్ళారు. 


నీటి తగాదాలు ఈనాటివా గానీ... యాగాలన్నా చేయించండి సారూ!  ఆ అభిషేకాలకన్నా మేఘాలు 'షేక్' అయి వానలు పడతాయేమో చూద్దాం'


ఆ ప్రయోగమూ అయింది బాబూ! ప్రయోజనం లేకుండా పోయింది. యోగమున్నప్పుడే చినుకులు పడతాయంటే మీరంతా ఆగం చేస్తుంటిరి! సరాసరి వర్ష పాతం .. లెక్క ప్రకారం సరిగ్గానే ఉంది మరి! 


'చుక్కలు పడాల్సింది మీ బుక్కల్లో కాదండీ! దుక్కుల్లో!  దున్నలేక బక్క రైతు 

దిక్కులు చూస్తున్నాడు. తాన్సేన్ లాంటి వాళ్లు  మళ్లీ వచ్చి ఏ మేఘమల్హారమో అమృత వర్షిణో ఆలపిస్తేగాని మాన్ సూన్ తో సంబంధం లేకుండా మనకు వర్షాధారలు కురిసిపోతాయని నమ్మకమా? 


తానే అపర ' సేన్ ' అంటూ తబలా బాదుకునే ఓ పెద్దాయన చేతా ఈ మధ్యా సంగీత కచేరీ యేదా పెట్టిస్తిమిగా! వానలు పడ్డాయా ? వడగళ్లు  పడ్డాయిగానీ! 

పడే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోమని మన ప్రధాని పిలుపిచ్చాడు.  వినిపించదా?  ఆయనా సాయం చేసేవాడే గానీ పాపం, మోకాలు పీకుతుందని  వెనకాడు తున్నాడు. ఈ గొడవంతా ఎందుకని అయిదేళ్ల కిందట గాడిపొయ్యిలు పెట్టి బాగా పొగపెట్టాం గుర్తుందా? వేడికి మేమాలు కరిగి కురుస్తాయని మా ప్లాను. 


పొగపెట్టటం మీకు  బాగా అలవాటేగా! మరి మేఘాలు కురిశాయా సార్?

ఏమైంది?


విఫలమైంది. పడ్డ నాలుగు చినుకులకు పొయ్యిలు ఆరిపొయ్యాయి. 


అందుకేనా ఈసారి ఉప్పు , సుద్దపొడి కలిపి చల్లాలని చూస్తున్నారూ? సుద్దపొడి పాళ్లెక్కువయి సున్నంవానా  పడితే ఉన్న పొలాలు కూడా సున్నబ్బటీలయి కూర్చుంటాయి బాబో;  వానలు కురిపించటంలో మనమింకా ఓనామాల దశ కూడా దాటినట్లు లేదు. రష్యావాడిని  చూడండి!  రుష్యశృంగుళ్లా  ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వానలు కురిపించ గలడు.. ఆపించనూగలడు.  ఆర్టిఫిషియల్ రైన్ కురిపించే ఆ అర్టంతా  మనవేదాల్నుంచి  కొట్టేసిందేనని కొండు భట్టు ఎంతగా గుండె బాదుకుంటే  ఏం లాభం? క్లౌడ్ సీడింగే మళ్లా  మనకిప్పుడు గతి అయింది.  కా మళ్ళీ గతయింది. 


క్లౌడ్ సీడింగంటే... మేఘాల్లో విత్తనాలు చల్లే స్కీమేగా! భూమ్మీద జల్లే

విత్తనాలకే అతీగతీ లేదు. మళ్ళీ మబ్బుల్లోనా ? అవ్వలాంటివి కావులేవయ్యా! 

దుమ్మెత్తి పోస్తే వానాపడుతుందని పుణే నించు నిపుణులొచ్చి చెప్పి  పోయారు! 

మనమా పనిలోనే ఉన్నామిప్పుడ

అందుకేనా మన బాబులు బహళ్ల మీ దొహళ్లు దుమ్మెత్తి పోసుకుంటోందీ! హాచ్! హా.. ఛీ! ఎంతలా అపార్థం చేసుకున్నాం. రుతుపవనాలను పాకిస్తాన్ పట్టుకెళుతుంటే చూస్తూ ఊరుకోవడం అమెరికా తప్పని ఒక రోజూ,  వాయుగుండాలను బంగ్లా వాళ్లa దారిమళ్లించుకెళుతున్నా  నోరు మూసుక్కూర్పోవటం యూఎన్వో  తప్పని ఇంకో రోజూ, పక్కనున్న కర్ణాటక మబ్బుల్నలా  తోలుకెళుతుంటే తోల్తీయడం పోయి సోనియమ్మ  తప్పని మనోళ్లు మైకట్టుకు  అరుస్తుంటే నిజంగా నీటికోసమే అంత మధనపడుతున్నారని అర్ధం చేసుకోలేక పోయాం సుమండీ!  ఒక్క ముక్క మాత్రం నాకర్ధమవటం లేదు సారూ .. విత్తనాల్నంత కృత్రిమంగా  తయారుచేసే మన మేధావులు వల్షాలనుకురిపించటానికి ఎందుకంత యాతన పడుతున్నట్లూ ! 

పుష్కరాలొచ్చి పడుతున్నాయి గదా! పుష్కలంగా నీరు కావాలంటే ఇహా ఒక్కటే  ఉపాయం. టీవీ ఛానెల్సులో  ఏడుపు సీరియళ్ల సంఖ్య ఇంకా బాగా పెంచండి!  చూసేవాళ్ల కన్నీటికి ఆనకట్టలు గాని కట్టేస్తే బంజరు కూడా బోలెడంత సాగు చేసుకోవచ్చు! 


లాభం లేదయ్యా!  వాటి మీద ఒరిజిన ప్రొడ్యూసర్స్ వాటాకొస్తారు' అని అది కారులు అంటుండగానే భోరున వాన కురవటం మొదలు పెట్టింది.

***


- కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...