Wednesday, November 10, 2021

అమ్మల పండుగ - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ఆదివారం సంపాదకీయం )

 సాహిత్యం : 

అమ్మల పండుగ

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం ) 


కౌసల్య తన 'పేరేమిటో' చెప్పమంది. 'రా' అనే అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు 'లాములు' అంటాడు. 'నాన్న పేరేమిటి నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న. అమ్మతోనే కానీ.. ఆమె పేరుతో పనేంటి చంటి పిల్లలకి? 'అమ్మగాలు' అంటాడు బాలరాముడు అత్యంత కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే నాలుక తిప్పటం రాని రాముని కళ్ళలో చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న పాప- 'కనుపాప కన్న ఎక్కువ' అనటం 'సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి సంతత యోగ దాయి.' 'చల్లగ కావు మంచు మనసార పదింబది దైవ సన్నిధిన్ మ్రొక్కుచునుండు' మాత వాత్సల్యాన్ని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే 'తల్లి నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన చేరగలిగే ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో తనకన్న ముందుగా అన్న మూషికారూఢుడై సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం సిద్ధించిందన్న ధర్మసూత్రం వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడదు. వానలో తడిసి వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా' అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ తలతుడుస్తుందిట. అమ్మ అంటే అది. హిందువులు సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను ప్రార్థించేది అందుకే.


ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలపాటూ అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు మా/తండ్రిందల్లియు నంచు నుండుదుము.. యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్ధమై రేపల్లె వచ్చిన సందర్భంలో భాగవతంలో. ఈశుడు ఓంప్రథమంగా సృష్టించిన ఈశానాం ( లక్ష్మీ దేవి ) ఈశిత్రి ( జగత్తు) ని అమ్మలా పాలిస్తుంటుందని పరాశరబట్టర్ ద్వయ మంత్రశ్లోక సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని అలా తీర్చి దిద్దే శక్తి అమ్మదే. నాయన గొప్ప సంపద అమ్మే' అని కదా శ్రీస్తవ స్తోత్రం ! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే సంభావిస్తుంది దుర్గా సప్తశతి కూడా. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల మాటలు, నగవులు, ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్' అని అల్లాచల్లని దయమీదో చక్కని అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా, యేసు తల్లి మేరీ, బుద్ధుని మేనత్త గోతమి, బహాయీల తాయి తాహిరి, మహావీరుని తల్లి త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాల దేశకాలాల ఎల్లలే ముంటాయి? గ్రీకులకు వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా పేరిట దేవతామూర్తి సిబెల్ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్ తల్లులందరికీ 'మదరింగ్ డే' పేరిట ఆటవిడుపు. అదే రోజునుఅమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాల్టి రోజును మరెన్నో దేశాలూ తల్లికి నివాళులిచ్చే ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాల పాలు భారతీయులకూ అధికమే. మాతృదినోత్సవం మనకూ ఓ ముఖ్యమైన పండుగవడంలో అబ్బురమేముంది?


కాలం సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే గుండైనా కోసిచ్చే త్యాగం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం. గుళ్లోని దేవుణ్ని అడిగాడు ఓ సత్యాన్వేషి 'అమ్మ' అంటే ఏమిటని? 'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా ! 'అని ఆయనగారి ఉత్తరం. భిక్షమడిగే బికారి నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకులేన'ని సమాధానం. మానవులతో కాదని చివరికి పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల మీద సదా 'అమ్మా'లా దాగుండేదే అమ్మని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా?' తెలుసుకున్న వారికి 'అమ్మో..ఇంతనా!' అనిపిస్తుంది. 'ఆపద వచ్చినవేళ నారడి బడినవేళ/పాపపువేళల భయపడిన వేళ/ వోపినంత హరినామమొక్కటే గతి..' అని అన్నమాచార్యుల వారన్న ఆ ఒక్క హరినామానికి అమ్మపదమొక్కటే ఇలలో సరి. అద్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి బెల్లం.. తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ.. పెరటి తులసి వంటి అమ్మలో మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా? బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే కాస్తంత చెట్టునీడ కరవా? జీవితం పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం ! తల్లి కన్నీటికి కారణమైనాక బిడ్డ ఎన్ని ఘనకార్యాలు ఉద్ధరించినా నిరర్ధకమే. కన్నీటి తడితో కూడా బిడ్డ మేలు కోరేది సృప్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా ! /మాలలన్నియు నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు, అమ్మ పాదాలు.. కొండంత అండ! స్తోత్రాలు సరే. 'అమ్మ పండుగ' ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగే. ఈ 'అమ్మల పండుగ' నుడైనా చాలు.. అమ్మ మేలుకు బిడ్డలు మళీ నాంది పలికితే అదే పదివేలు.

***

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ఆదివారం సంపాదకీయం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...