Wednesday, November 10, 2021

పునాదిరాళ్ల ప్రార్థన- కల్లాపాలెం హనుమంతరావు - సాహిత్య ప్రస్థానం ప్రచురితం - కథానిక - వ్యంగ్యం

 కథానిక : వ్యంగ్యం : 

పునాది రాళ్లు 

- కర్లపాలెం హనుముంతరావు 

( సాహిత్య ప్రస్థానం - మాసపత్రిక - ప్రచురితం) 


క్రీ.శ 3011 హాట్‌ జూపిటర్‌ నుండి అరగంట క్రిందట బైలుదేరిన సూపర్‌ సానిక్‌ రాంజెట్‌ ''గో ఇండా'' (గోవిందాకి గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదే పనిగా గిరికీీలు కొడుతోంది. చిన్న పిల్లలు ఆడుకునే టామ్‌వెరోప్లేన్‌ రీమోట్‌ కంట్రోలుతో తిరుగుతున్నట్లుంది ఆ దృశ్యం.


 గోఇండా నుండి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్ద బంతిలాగా ఉంది.  


స్పేస్‌ సెంటర్నుంచీ గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే రాంజెట్‌లోని యువశాస్త్రవేత్త లిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని, స్క్రామ్‌జెట్‌ సాయంతో సూటిగా భూమి వైపుకు దూసుకురావడం మొదలుపెట్టారు.  


పొట్టిగా పాత సినిమాల్లో రామచంద్రరావులా ఉన్న వాడి పేరు మొగానో. పొడుగ్గా, రమణారెడ్డి లాగా పొట్లకాయ బొమ్మను గ్రాఫిక్సులా సాగతీసినట్లున్న వాడి పేరు తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్‌ యూనివర్సల్‌ స్పేస్‌ యూనివర్శిటీలో రిసెర్చి స్టూడెంట్లు.


స్కాంజెట్‌నీ, రాంజెట్‌నీ రిమోట్‌ ద్వారా కంట్రోల్‌ చేస్తూ హాట్‌ జూపిటర్‌ స్పేస్‌ సెంటర్‌లో కూర్చుని ఆపరేషన్‌ డిస్కవర్‌ ఇండియా సూపర్‌వైజ్‌ చేస్తున్నాయన పేరు కబిల్‌ అతను ఆ ప్రాజెక్టు గైడ్‌, ప్రకాష్‌ రాజ్‌లా ఉన్నాడు.


కబిల్‌ ముత్తాతలు కొన్ని వేల ఏళ్ళ క్రిందట భూమ్మీద జీవించినవారు. ఐదొందల ఏళ్ళ క్రిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవన మనుగడకే ముప్పు ముంచుకొచ్చిన వేళ గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకు వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్‌ ముత్తాతలు సూర్య కుటుంబంలోని గురు గ్రహానికి చేరినవారే.


ప్రకృతి వికృతిగా మారి, దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవ జాతులన్నీ క్రమక్రమంగా నశిస్తూపోగా, ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది. అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్‌ కరువై బొగ్గుపులుసు వాయువుతో పూర్తిగా నిండిపోయిన భూమి మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!


తమ సౌర వ్యవస్థను బోలిన మరెన్నో గ్రహ కుటుంబాలను వెదికి పట్టుకుని, పరిశోధించి థీసిస్‌ సబ్‌మిట్‌ చేయడం 'ఆపరేషన్‌ డిస్కవర్‌ ఇండియా 'లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్‌ గైడెన్స్‌లో గగనాంతర రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను, పరిశీలిస్తూ, గెలాక్సీలను గాలిస్తూ చివరి అంచెగా భూగృహం మీదకి దిగుతున్నారు ఇప్పుడు ఆ యువశాస్త్ర వేత్తలిద్దరూ.


భూతలం మీది వాతావరణం మాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే పెను తుఫాను గాలులు ఎడాపెడా గొడుతున్నాయి. కనుచూపు మేరంతా ఇసుక ఎడారుల్లాగా ఇసుకదిబ్బలే.


ఓజోన్‌పొర చిరిగిపోయి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతుండటం వల్ల జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.


ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమి మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడో యువకులిద్దరికీ అంతుపట్టడం లేదు.         స్కామ్‌ జెట్‌ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్‌ కబిల్‌ కమాండ్స్‌, స్పేస్‌ విండో నుండి వినబడుతున్నాయి. ''కంగ్రాట్స్‌! వేలాది ఏళ్ళ క్రిందట రోదసీ మండలం మొత్తంలో మహా నాగరికతలు వెల్లివిరిసిన పుణ్యభూమి మీద మీరు ఇప్పుడు పాదం పెట్టారు.'' కబిల్‌ హృదయంలో మాతృ గ్రహం మీద  భక్తి ఎంతలా పొంగి పొర్లుతోందో అతని గొంతులోని ఉద్వేగాన్ని బట్టే గమనించారు శిష్యులిద్దరూ. గురుదక్షిణగా ఇక్కడి నుంచీ ఏదైనా తీసుకెళ్ళి సమర్పిస్తే డాక్టరేట్‌ ఖాయమని ఇట్టే అర్థమయిపోయింది.


కబిల్‌ గొంతు గంభీరంగా వినపడుతోంది. ''ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్నింటిలో అదే ముందుండేది. వాళ్ళు గర్వంగా కట్టుకున్న స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని ఫోటో తియ్యండి''!


కెమెరాని బాస్‌ చెప్పిన డైరక్షన్‌ వైపు ఫోకస్‌ చేసి చూసాడు తనాకో. అక్కడమట్టి దిబ్బలు తప్ప ఏమీ కనిపించలేదు. ''అల్‌ ఖైదా వాళ్ళు ఆ అమెరికా నెప్పుడో సర్వనాశనం చేసేసారు. దాని నామరూపాలు కూడా మీకు కనిపించవిప్పుడు అన్నారెవరో''. ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాస్‌కి చేరవేశాడు తనాకో.


'పోనీ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ పేరుతో ఒక వెలుగు వెలిగి.. చివరికి రష్యాలాగా మిగిలిపోయిన దేశాల గుంపు వంక ఒకసారి మీ కెమెరా తిప్పండి! అట్టడుగు మనిషి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు నిర్మాణ రూపం రెడ్‌ స్క్వేర్‌. షూటిట్‌!'' కబిల్‌ కమాండ్‌.


కెమెరా పొజిషన్‌ మారింది. సేమ్‌సీన్‌. మట్టి దిబ్బలే మట్టి దిబ్బలు. ''వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళే కూల్చుకున్నారు. ముక్కలు చెక్కలయినా.. చివరికి ఒక చెక్కా మిగల్లేదు'' అంది మళ్ళీ ఇందాకటి గొంతే. జీవి మాత్రం కనిపించలేదు!


శిష్యుల ద్వారా సమాచారం విన్న కబిల్‌ అన్నాడు ''లండన్‌ టెన్‌ డౌన్‌లో ఉద్దండ పిండాలుండే వాళ్ళా రోజుల్లో. వాళ్ళ పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించడానికే చోటుండేది కాదంటారు. ఆ సామ్రాజ్యపు మహారాజులు రాణులు నివాసమున్న ఆ వీధిని కెమెరాకి ఎక్కించండి!'' తనాకో కెమెరా అటు తిరక్కముందే అందుకుంది ఇందాకటి గొంతే ''నోయూజ్‌! ఆ సూర్యుడస్తమించని మహా సామ్రాజ్యం తరువాత్తరువాత అమెరికా వారి తోక దేశంలాగా తయారైంది. ఆల్‌ఖైదా దెబ్బకీ అదీ మాడి మసైపోయింది!''


ఓన్లీ వాయిస్‌... నో జీవి !


'బొట్టు పెట్టుకొనేటంత చిన్ని దేశమైనా అమెరికాని గడగడ లాడించిన జపాను దేశం నాగరికత మహా ఘనమైనది. నాటి మానవుడు సాంకేతికంగా ఎంత అభివృద్ధి పథాన్నందుకున్నాడో ఒక్క జపాన్‌ హిస్టరీ తెలుసుకుంటే చాలు. వాళ్ళ విసనకర్ర ఈక కనపడినా చాలు. ఒక ఫొటో పట్టుకోండి'' అన్నాడు కబిల్‌ నిరాశను గొంతులో కనిపించనీయకుండా.


' అణు ధార్మికశక్తితో దానికదే మసయిపోయింది'' అంది ఆకాశవాణి ఒక్క ముక్కలో.


"ఫ్యాషన్‌ ప్రపంచానికి నేర్పించిన ఫ్రాన్స్‌'' కబిల్‌ గొంతు.


" ఎయిడ్స్‌ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగార దేశాన్ని కబళించేసింది'' అశరీరవాణి గొంతు.


" క్యూబా..'' కబిల్‌ గొంతులో వణుకు


" ప్లేగు వ్యాధికి ఫినిష్‌'' అ శరీరవాణి గొంతు.  


" ఆఫ్ఘనిస్తాన్‌.. పాకిస్తాన్‌... ఉజ్‌బెకిస్తాన్‌..'' కబిల్‌ పాఠంలా దేశాల పేర్లు వప్ప చెప్పేస్తున్నాడు.


" అవన్నీ తాలిబాన్లకి స్థావరాల్లాగా మారిపోయిన పిదప చరిత్రలో స్థానం లేకుండా పోయాయి. ఆఫ్రికన్‌ జంగిల్సుని కార్చిచ్చు, ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లోఫేవరు.. ఒక్క ముక్కలో మీకు అర్థమయేట్లు చెప్పాలంటే తుఫానూ, భూకంపాలూ, సునామీలు, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామ రూపాల్లేకుండా సర్వనాశనం చేసి పారేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా ఎంగిలివున్నా రాజకీయాలు వాటినీ కాజేసాయి. చివరికి ఇప్పుడు మిగిలింది... ఇదిగో మీరు చూస్తున్నారే ఈ మట్టి దిబ్బలే!'' అశరీరవాణి ఆపకుండా చేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్త లిద్దరికీ తెగ వళ్ళు మండిపోయింది. గురువుగారికి దక్షిణంగా ఏదన్నా పట్టుకుని పోదామంటే.. వీడెవడు.. ప్రతిదానికీ పిలువా పెట్టకుండా కల్పించుకుని 'అంతా బూడిదయింది... మసయింది... నాశనమయింది.. మురిగిపోయింది... అంటూ అపశకునాలు తప్ప పలకడం లేదు. ''రెండు వాయిద్దామంటే వాయిస్సే గాని మనిషి ఎదురుగా కనిపించడం లేదాయ ! తమకు డాక్టరేట్‌ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది ! డుపులోని మంటను డుపులోనే ఉంచుకొని ఏం ప్రయోజనం! కనపడ్డా.. కనపడకపోయినా ముందు కడిగిపారేయడం ఉత్తమం. తనాకో ఇంకా తమాయించుకోలేక పెద్ద గొంతుకతో అరిచాడు'' ఇందాకట్నుంచీ చూస్తున్నాం ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటున్నావు. ప్రకృతి బీభత్సానికి అంతా బూడిదయిపోతే మరి నువ్వెలా ఉన్నావు మహానుభావా!'' ''ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మాముందుకురా!'' అని వంతపాటందుకున్నాడు మొగానో.


బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. ''మీరు నిలబడ్డ చోటులోనే క్రింద వున్నాను. గొయ్యి తీసి చూడండి. నా దివ్య దర్శనం అవుతుంది. అందా గొంతు వింతగా మరోసారి విరగబడి నవ్వుతూ.


మొగానో గబ గబా గొయ్యి తీయడం మొదలుపెట్టాడు. రెండడుగులు కూడా తవ్వకుండానే బైట పడిందా గొంతు తాలూకు వింత ఆకారం. నిట్ట నిలువుగా ఉంది నల్లగా నిగ నిగ మెరిసిపోతుంది. వంటి మీదంతా ఏవో గాట్లు... పై నుంచి క్రింద దాకా..! ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతర వాసులు ఇంత వరకూ రోదసీ మొత్తంలో ఎక్కడా చూసి ఉండలేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వ జీవాలు దుంప నాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్ట నిలువుగా... తాజాగా.. కళకళ లాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడగానే.. నిజం చెప్పద్దూ..  యువ శాస్త్రవేత్తలిద్దరికి ఒకింత గౌరవం కూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా తమ మనస్సులోని సందేహాన్ని బైటపెట్టారు కూడా.


" ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కాదు సార్‌!'' అనడిగాడు తనాకో. ఆ ఆకారం చెప్పడం మొదలుపెట్టింది'' పునాదిరాయి అంటారు నన్ను. వెయ్యేళ్ళ క్రిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పరిపాలనా విధానం ఒకటి వర్ధిల్లింది. ప్రజాస్వామ్య మంటే ప్రజలే రాజులు. ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల చేత నడిచేపాలన. మరీ లోతుగా వెళ్ళద్దులే. మీరొచ్చిన పనికూడా మర్చిపోయి తిరిగివెళ్ళటానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా ఆ రాజకీయ వ్యవహారం. ప్రజాస్వామ్య మంటే ప్రజలూ.. వారెన్నుకునే నాయకులు.. వాళ్ళు పాలించే ప్రజలు.. ఈ మాత్రం అర్థం చేసుకోండి చాలు ప్రస్తుతానికి ఇంకనేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు కావాలనుకునేవాళ్ళు ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టు కట్టిస్తామని, బళ్ళు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. ఇట్లా ! వాళ్ళు వాగ్దానం చేసినంత మాత్రాన జనం నమ్మాలని ఏముంది? వాళ్ళకి నమ్మకం కలిగించడానికి నాయకులు ఇదిగో ... ఇవాళే ... ఇక్కడ ... మీకు భవిష్యత్తులో కట్టబోయే భారీ నిర్మాణానికి నాంది పునాదిలో రాయివేస్తున్నాం. అంటూ బ్రహ్మాండంగా ఊరేగింపూ గట్రా జరిపి పటా టోపంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మిన జనం వాళ్ళకు ఎన్నికల్లో ఓటేస్తే గెలిచి నాయకులు అయిపోయి... వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ మళ్ళీ ఎన్నికలొచ్చేలోగా సుబ్బరంగా చేసుకుంటారన్నమాట'' ''ఒక్క నిమిషం పునాది రాయీ! చిన్న సందేహం. మరి వాగ్దానం చేసినట్లు నాయకులు నిర్మాణాలు ఎన్నికలయిన తరువాత పూర్తి చేస్తారు గదా! అయినా మీరింకా ఇలాగే పునాదులో శిలా విగ్రహాల్లో అల్లాడుతున్నారే !


పకా పకా నవ్వింది పునాది రాయి ''మరదే ప్రజా స్వామ్యమంటే. సరే ఇందాకట్నుంచీ ఏది కనిపించటం లేదని అల్లాడుతున్నారు కదా ! అమెరికా, రష్యా, చైనా జపానంటూ ఎన్నడో అంతరించి పోయినవాటిని గురించి వెదుక్కుంటున్నారు కదా ! వృథాగా వాటికోసం సమయం పాడు చేసుకోకుండా... నన్నూ, నా సోదరులనూ.. ఫొటో తీసిపట్టుకుపోండి ! అంత దూరం నుండి వచ్చినందుకు ఈ మాత్రమన్న దక్కినందుకు సంతోషించండి.''


"నువ్వేకాక నీకు సోదరులు ఇంకా ఉన్నారా ! సజీవంగా నీలాగే ఉన్నారా? అనడిగాడు తనాకోనోరెళ్ళ బెట్టి


" ఎందుకు లేరు! వందలొందలు. మీ కెమేరాలు ఆన్‌చేయండి... వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్‌ చేసుకోండి! అదిగో అది బ్రహ్మాణి సిమెంటు ఫ్యాక్టరీ తాలూకు పునాదిరాయి. ఇదిగో ఇది పోలవరం అనే నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వేసిన పునాది రాయి. అల్లదిగో ఆ మూల వున్నది. హంద్రీ నీవా సుజల స్రవంతి పునాది రాయి. ఇల్లదిగో ఈ  మూల వున్నది. అప్పట్లో హైదరాబాదనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్టు పునాది రాయి. ఇది సిద్ధిపేట స్టోర్స్‌ స్టేడియం పునాది రాయి. ఇది పటాన్‌ చెరువులో వెయ్యి పడక లాసుపత్రి అప్పటి ముఖ్యమంత్రి వేసిన పునాదిరాయి. ఇది బడాయి గడ్డలోకాజ్‌ వంతెన తాలూకు పునాది రాయి. ఇదిగో పుణ్యవరంలో బ్రిడ్జి నిర్మాణానికి వేసిన రాయి. ఇలా మీరు ఎక్కడ తవ్వి తీసినా చక్కని పునాది రాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండి కనిపిస్తాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మాగతి మారలేదు. మా ఫొటోలను తీసి మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీరు కోరుకున్న పట్టా గ్యారంటీ!''


కెమేరాలో తళతళ లాడుతున్న ఆ పునాదిరాళ్ళన్నింటినీ గబగబా ఫొటోలు తీసుకుని ఆనందంగా మళ్ళీ అంతరిక్షంలోకి ఎగిరే ముందు మొగానో! తనాకో కృతజ్ఞతా పూర్వకంగా అన్నారు. ''మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం''. తీర్చుకోవచ్చు ఈ జన్మలోనే. మమ్మల్ని లా నిలువునా పాతేసి వెళ్ళిపోయిన పెద్ద మనుషులు మీరు వెళ్ళే దారిలో ఏ నరకంలోనో, పాతాళ లోకంలోనో కనిపిస్తారు. పెద్ద మనసు చేసుకొని వచ్చి కనీసం ఒక్క ప్రాజెక్టునైనా ప్రారంభించి మాకు ముక్తి కలిగించమని మా తరుపున విన్నవించండి'' అంది ఆ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.     


- కర్లపాలెం హనుమంతరావు

( సాహిత్య ప్రస్థానం  - మాస పత్రిక - ప్రచురితం ) 



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...