Wednesday, November 10, 2021

దారుణమేలా? - ఈనాడు వ్యంగ్యం



 వ్యంగ్యం 

దారుణ మేలా! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపా - 21 -01 - 2003 ప్రచురితం) 


పీక్ అవర్సులో సిగ్నల్ దగ్గర బండి ఆగ గానే గ్రీన్సిగ్నల్ పడేలోగానే క్రెడిట్ కార్డు అంటగట్టి పోయాడో గట్టిపిండం. 


ఈసురో మని ఆఫీసుకు రాగానే బాసురమ్మన్నాడని పిలుపు. 


ఆలస్యమైందని క్లాసు పీకుతాడు. . కామోసని కంగారుగా పోగానే ' కంగ్రాట్యులే షన్సోయ్ సుబ్బారావ్ ' అంటూ ఎన్నడూ లేనిది ఎదురు కుర్చీ చూపించాడు


 'ఎంతకాలమిలా ఆ తుక్కు చేతక్కు తొక్కుతూ ఆఫీసుకు ఆల స్యంగా వస్తుంటావు? మారుతీ సెకండు హ్యాండొకటి మంచి బేరానికొచ్చింది. తీసుకో! అంటూ కాగితాలేవో కొన్ని నాముందు పారేశాడు. 


తీరాచూస్తే అవి ఒక లక్షకు అప్పు పత్రాలు! 


' అప్పా సార్! నేనడగలేదే!' అన్నాను ఆ శ్చర్యపోతూ. 


అడగందే ఇవ్వకుండా ఉండేందుకు ఇదేమన్నా అమ్మపెట్టే అన్నంటయ్యా?  అప్పు . చందమామ ఏమడిగాడని సూర్యుడలా కిరణాలను రుణంగా ఇచ్చేస్తున్నాడు... చంద్రబాబు ఏమడిగాడని ప్రపంచ బ్యాంకు అలా వెంటపడి అప్పిచ్చేసిందీ! చెయ్... ముందు సంతకం!' అని గదమాయించేశాడు బాసు.


ఒకప్పుడు కప్పుడు పంచదారపుకోసం చెప్పులరిగేలా ఎన్ని పంచలెక్కి దిగాల్పొ చ్చేదీ...? 


ఇప్పుడిలా ఇంటిమీద పడి ఇంటి లోనిస్తామనీ, పిల్లాడితో కలిసుంటే స్టడీలో నిస్తామనీ, పిల్లతో కలిసిచూస్తే మారేజికి లోనరేంజ్ చేస్తామనీ అడుగడుగునా అప్పుల వాళ్ళు చెడుగుడాడేస్తుంటే ఏ పాతాళం అడు కెళ్ళి దాక్కోవాలో దిక్కుతోచటం లేదురా దేవుడా! 


రీఫామ్స్ మహత్యం! మనీ ఏదో ఫారంలో రొటేట్ కాకపోతే మార్కెట్టే రాట వుతుందని మల్టీ నేషనల్ బ్యాంకులు కూడా మధ్యతరగతి వాడింటిముందు పల్టీలు కొడు తున్నాయిప్పుడు. 


అప్పు ఏరూపంలో ఇచ్చినా అపురూపంగా పుచ్చుకునేదీ మధ్యతరగతి జాతేగా ! 


హరిశ్చంద్రుడి రోజుల్లో గానీ ఈ రీఫారమొచ్చుంటే నక్షత్రకుడి అప్పునలా ఆలినమ్ముకుని తీర్చాల్సొచ్చేదా?


అప్పనంగా అప్పిస్తుంటే తీసుకోడానికేం నొప్పి ' అంటూ 

కేకలేయటం మొదలెట్టాడు మా ఆఫీసరు

 "అప్పెంత గొప్పదో నీకు తెలుసా సుబ్రావ్! తిరుపతి వెంకన్నకు అంత పరపతి  ఉన్నా పెళ్ళికోసం అప్పెందుకుచేశాడో తెలుసా? గొప్పకోసం. అప్పర్ క్లాసంటే అప్పులున్న  లోవర్ క్లాసనేనయ్యా బాబూ అర్థం. అప్పంత గొప్పది కనకనే మన ఉపనిషత్తులు సైతం పంచభూతాల్లో అప్పును చేర్చి మరీ స్మరిస్తున్నాయి. అప్పంటే నీరని ఇంకో అర్థముంది  తెలుసుకో! భగీరధుడంతటి మహర్షి  ఆ అప్పు కోసమేగా శివుడిని వేడుకున్నదీ ! మిడిల్‌ క్లా సోళ్ళం... మనమోలెక్కా!'


' నిజమేకానీ... నేనింతవరకు ఒక్క  బేడా కూడా అప్పుచేసి ఎరుగను సార్‌!' అన్నా బిక్కమొగమేసి.. 


'అదే తప్పు . చెప్పుల్లేనివాడుమోగానీ... అప్పుల్లేని వాడున్నాడంటే న్నమ్మనోయ్ సుబ్బారావ్! సుతులు రుణస్థులని పాపం, పోతనగారు ఆ వామనావతార వర్ణనలో ఎలా వాపోతున్నారో చూడు!  "దారాసుతులు రుణ రూపాలని శంకరాచార్యులవారెప్పుడో భాష్యం చెప్పారు. మానవ బంధాలన్నీ రుణానుబంధాలేనని గురజాడ  అప్పారావుగారు అప్పట్లోనే గుర్తుపట్టేరు. కాబట్టే కన్యాశుల్కాన్ని గిరీశం అరువుసీనులకు  పెన్చేశారు. అప్పిచ్చువాడు లేని ఊర చొరపడద్దని సుమతీ శతకకారుడు శతవిధాలా కోప్పడ్డాడనే గదయ్యా మనమీ రుణానంద లహరికి నాందీ పలికిందీ!  అహ... నువ్యా

 సూ ర్యుడికన్నా గొప్పోడిననుకుంటున్నావా? '' అంటూ కోపానికి దిగారు ఆఫీసరుగారు. 


'' అదేంటి సార్... అలాగనేశారూ? " 

" లేకపోతే ఎందయ్యా... సూర్యుడంతటి వాడు కూడా సముద్రాల నుంచి  అప్పుచ్చుకునే మేఘాలుగా మార్చి  భూమి ద్వారా  మళ్ళీ చెల్లిస్తున్నాడు. కాబట్టే కదా రుణచక్రం సక్రమంగా తిరుగుతూ సృష్టి నడుస్తోందని ముళ్ళపూడివారి  అప్పులప్పారావెప్పుడో చెప్పిందీ!  అప్పంతగొప్పది కనుకనే  అప్పుడెప్పుడో  లోగడ మన ఇందిరమ్మగారు ఇండియాలో ఆసియా క్రీడలాడిస్తున్నప్పుడు 'అప్పు' నే  లోగోగా వాడిందయ్యా!  అంతెందుకూ...? మొన్న మన ఏపీలో సీయం గారు  ఆడించిన ఆటల్లో గెలిచిన పతకాల్లో మెజారిటీ అరువాటగాళ్ళచలవేనని తెలీనివా డెవడున్నాడూ! పిలిచి మధ్యాహ్న భోజనం పెడతానంటే మజ్జిగలోకి వంకాయబజ్జీ లేదని వంకపెట్టాట్ట వెనకటికి నీలాంటివెంకయ్యే ఒకాయన. లోను కావాలంటే వ్యసనాలకే లోను కానవసరంలేదయ్యా... దర్జాగా కారు కొనుక్కోవచ్చుగా! '


'అప్పుచేసి పప్పుకూడు తినమంటారా?' 


'అక్కడే పప్పులో కాలేస్తున్నావ్ సుబ్బా రావ్! అప్పుచేసిన పప్పుకూడిప్పుడస్సలు  తప్పేకాదు తెలుసానీకూ! పైపెచ్చు పెద్ద గొప్పకూడాను. కాబట్టే సి.యం లిక్కడా అక్కడా లెక్కా పత్రాల్లేకుం డా అప్పుడు వుట్టించే పోటీల్లో పడి  మరీ మధ్యాహ్నం పూటన్నాలు  పెట్టేస్తున్నారు. రుణాన్నెంత తృణమని తీసిపారేసినా అప్పు ల్నుంచీ నువ్వెప్పుడూ తప్పించుకుపోలేవు సుబ్బారావ్! తృణంలోనే రుణం దాగుంది. దీన్నే ఇంగ్లీషోళ్ళు హిడెన్ లోన్సంటారు. అలాగే 'హేలో ' అంటారు గదా! అంటే అర్థమేంటనుకున్నావ్! ' హేండు లో నుందా? "అనడగటమన్నమాట.  నీకో శాడ్ న్యూస్ చెప్పాలయ్యా! ! నువ్వు ఆల్రడీ అప్పులపా లయిపోయున్నావయ్యా;  నువ్విండియాలో పుట్టినపుణ్యానికి నీ తలమీదా  ఏటేటా పది వేల చొప్పున అప్పులవాటా పెరుగుతూనే ఉంటుందని ' నేషనల్ డెట్' పత్రం చెపుతూనేవుంది.  అందులోనే ఈ లోనూ ఉందనుకుని ముందు నా వంతు పదిశాతమక్కడ పెట్టి చెక్కుతీసుకు చక్కాపో... ఫో' అని బైటికి తోసేశాడు బాసు.


హే రామా! మిడిల్ క్లాసులో పుట్టడమే నేను చేసిన నేరమా! ఈ మిడిమేళపు మొబైల్లోను మేళాలను  ఆపటం నా తరమా! 


చేసేదిలేక చెక్కు పుచ్చుకొని ఇంటికెళితే మా ఆవిడ మరో క్లాసు పీకేసింది. 'అమాయకుడని గీర్వాణం నేర్పితే వరుణదేవుణ్ణి రుణమడిగేందు కెళ్ళాట్ట మీలాంటివాడే ఒకడు. రుణం  తరుణంలో తీర్చలేని వ్రణంలాగా సలుపుతుందని తెలీదా? సమయానికి తీర్చలేకపోతే 'ఇంతింతై... మరియు దానంతై... నబోవీధి పైనంతై... ' వడ్డీ నడ్డివిరగ్గొడుతుందని పోత నగారెప్పుడో చెప్పారు గదా స్వామీ! వేళకు వాయిదా రాకపోతే లోనిప్పించిన మీ బాస్ కాబూలీ వాలాలా వాలీబాలాడేసుకుంటాడు స్వామీ! అంతలావు బిగ్ బీనే అప్పులు తీర్చలేక ఏబీసీ క్లోజుచేస్తే... ఆఫ్టరాల్ మిడిల్ క్లా సోళ్ళం... మనమెంత? అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే కేసులు ఏపీ నిండా . . కుప్పలుతిప్పలుగా ఉన్నాయి. మనమూ ఆ జాబితాలో చేరాలని ఉందా  యేం? అని దబాయించేసరికి... 


నేరుగా బాసుదగ్గరికి పోలేక అప్పిప్పించిన ఏజెంటు దగ్గరికి పోవాల్సొచ్చింది. వాడి పేరు కరుణాకరంట:  పేరులోనే 'రుణం ఉండి చచ్చింది. 


 వాడు పీల్చి పిప్పిచేసి హాండిలింగు ఛార్జీలకని మరో పదివేలు నొక్కిగాని చెక్కు వెనక్కుతీ సుకోలేదు. 


పోనీలే... ఏ జన్మలోనో వాడికి రుణపడివున్నానోనని సరిపెట్టుకొందామను కొనేలోపలే మర్నాడాఫీసుకొచ్చి నోటుమీద సంతకం చేయమని కూర్చున్నాడా సైతానుగాడు. మళ్ళీ నోటిమాటరాలే నాకు. 


' అదేంటీ! నిన్నే నీకు చెక్కు తిరిగిచ్చేశాగా!' అనంటే 'చంపారు పొండి! వాడు నేను కాదు.  నేను నేనే సర్  కరుణాకర్. వాడు కణరుణాకర్. నేను కణాలు రుణంగా ఇస్తే పుట్టినక్లోనింగ్ శాల్తీ.  నాకు సంబంధంలేదు సార్!' అనేశాడు.


కణాలు కూడా రుణాలుగా ఇచ్చే రోజులొచ్చేసాయని మా కొలీగ్ అప్పలాచారికి అప్పటికప్పుడు అప్పులగొప్పతనం గురించి క్లాసు పీకటం మొదలెట్టాడు మా బాసు మరో లోనులో కమీషనుకు ఎర వేస్తూ. 


అదీ సంగతి! ఏ శరణాగతుడొచ్చి ఈ రుణగ్రస్తుల వెతలు తీరుస్తాడో.. దేవుడికే తెలియాలి! 


- కర్లపాలెం హనుమంతరావు

( 21/01/03 నాటి ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట గల్పిక ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...