Wednesday, November 10, 2021

సరదా గల్పిక అన్నమో.. రామచంద్రా! : - కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు

 




కొత్త వధూవరులపై అక్షతలు చల్లుదామన్నా బియ్యం ధర చూసిబేజారయిపోతోంది. వెర్రిపిల్ల వెంకికి   నాయుడుగారి మీద  వలపెంత  ఉండి ఏంలాభం... కూరలో కూరి పెడదామంటే వంకాయలు  కిలో పాతిక రూపాయలు! గంగి పాలు గరిటెడైనా చాలన్నాడుగానీ మన వేమన, ఇప్పుడు చుక్క పాలు కొనాలన్నా చుక్కలు చూడాల్సిన  పరిస్థితి!


ఆ కమ్యూనిష్టు కారయత్ గారికి మన చేపల వేపుడు కరకరమంటూ  మహారుచికరంగా ఉండవచ్చేమోగానీ, ఇక్కడ రెండు రూపాయలు పెట్టినా కరివేపాకు కాడ ఒకటి కూడా రావటంలేదు! పెట్రోలు గట్రా -రేట్లు  పేట్రేగిపోతున్నాయని ప్రజా సేవకులు అలా ఎడ్లబండ ఊరేగింపుల్లో మస్తు  మజా ఉడాయిస్తున్నారు. కానీ,  ఎడ్లు తినే ఎండు గడ్డి పరకలైనా పాతికా పరక్కొస్తు న్నాయా? భారతదేశం ఇప్పుడు చక్కని పాడి యావు కానేకాదు. వట్టి వట్టిపోయిన గొడ్డు. ఇంకా సూటిగా చెప్పాలంటే ఆబాలగోపాలం ఇవాళిక్కడ వరవిక్రయంలోని సింగరాజు లింగరాజులే. ఉప్పులూ పప్పులూ తులాల చొప్పున తూచి తింటేగాని బతకలేని దుర్భర పరిస్థితి!


వేళకు వానలు రాకపోవటం సర్కారు లోపమంటావుట్రా ? కరవు మొత్తానికీ  క్యాబినెట్టే కార ణమా ఏంట్రా ? వరదలకు గట్లు తెగటం కూడా గవర్నమెంటు కుట్రేననేటట్న్నావు! ఉప్పు రేటుకీ, ఎండీయే రెండో హయాముకి సంబంధంమేంటి చెప్పు! ఎస్మాలూ, తస్మాత్ జాగ్రత్త అని బెదిరించటాలూ తప్ప పాపం మోదీజీ  సర్కారు మాత్రం చేయగలిగిందేముంది చెప్పు? అదుపు చేసేటందుకు గాదెకింది పందికొక్కులు- పార్టీలోని కిందిస్థాయి కార్యకర్తలా? అక్కడికీ ధరల రెక్కలు కత్తిరించడానికి అందరూ పాపం... ఎంతగా కత్తెర్లు పట్టుకు వెదుకుతున్నారు! ఆకాశంలో అపరాలు అప్సరసలా ఏ మునీశ్వరుల తపస్సులు మంటలో కలిపేందుకు దిగిరావడానికి! 


రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారా! పార్లమెంటు స్తంభిస్తే పాతధరలు దిగుతాయా బాబాయ్? ధర్నాలకు ధనియాల ధరలు, గోబ్యాకులకు గోధుమల రేట్లు బెదిరే కాలమా ఇది? పిడికెడు అన్నం కూడా పెట్టలేని ఈ పీడీయస్ ఎందుకు? చీమలా అయినా పుట్టలేదు, మధ్యతరగతిలో పుట్టిచావడమే మన నోసట రాసిపెట్టిన ఖర్మ! 


ఆపరా ఆ  ట్రోలింగూ ! తెగ రెచ్చిపోతున్నావు వింటున్న కొద్దీ. ఆఫ్ ట్రాల్  ఆమాద్మీగాడివి నువ్వెంత? కొరియాలో పుట్టుంటే తెలిసొచ్చేది . . ఇరవై ఏళ్ళ బట్టీ  అక్కడ రెండంకెల ఆహార ద్రవ్యో ల్బణం రంకెలేస్తుంది. మన ప్రధాని పాపం ఒక్క అంకె ద్రవ్యోల్బణం కోసం ఒంటికాలి మీద ఎంతకాలంనుంచీ జపం చేస్తున్నారో చూడు! జాతీయ స్థాయిలో జాలి పడాల్సిన మేటరు! సెటైరు అవసరమా కటకటలప్పుడు కూడా! 


సింగినాదం . . జీలకర్ర అనాలన్నా అదురుపుడుతోందిక్కడ ఆ కర్ర ధర కల్లో కొచ్చి . డబుల్ ఫ్లాట్ అమ్ముకున్నా సింగిలిడ్లీ రానప్పుడు . . అరటి పండు లేని  తొక్కలా  ఈ లెక్క లెందుకంట! 


ఎంత సేపూ దేశం నా భోజనంలోకి ఏమిచ్చిందన్న యావే తప్పించి దేశానికి నువ్వేమిచ్చావని చెక్ చేసుకోవా .. కనీసం ఒన్ టైం సెటిల్ మెంటుగా అయినా?     అండికి తిప్పలు పడే కడుపుకు ఇప్పుడు నీ కడుపుమంట అంతవసరమా  . . చెప్పు! అయినా అడిగావు కాబట్టి అతిచిన్న చిట్కాలు రెండో , మూడో నీ చెవిలో పడేస్తా! చెవుడు నటించక ! చక్కా విని ఇంచక్కా ఆచరించుకో! ఆ కోపమన్నా కొద్దిగా చప్పబడిపోతుంది! 


చప్పున చెప్పు .. చెప్పు బాబాయ్!  


కంచం ముందు కూర్చున్నప్పుడు మర్చిపోక ..  మాయాబజారు సినిమా ఘటోత్కచుడి భోజనం పాట పెట్టుకో! కడుపు నిండినట్లు కచ్చితంగా ఫీలింగు కలుగుతుంది. అయినా కడుపు ఆ ఫీలింగు కలక్కపోతే  ఆట్టే ఫీలయిపోకు! అసలే పీల కుంకవి ఈసారి కాశీకి పోయినట్లు ఊహించుకో!  అనే అనే కంచాన్ని  గంగలోకి విసిరేసెయ్ ! కంచం ఖర్చే తప్పించి .. మరో ప్రయోజనం కనిపించదనకో! దిగులుపడమాక!  నీ చ్నిప్పుడు మీ అమ్మ నిన్ను ఆడించిన ఉత్తుత్తి అన్నాలాటని  మీ చిన్నారులతో కలసి  మళ్ళీ ఆడించటం  నేర్చుకో! పిల్లమూక ముందు పిల్ల చేష్టలేంటని అట్లా చిన్నబోకురా సన్నాసీ! సీను మార్చు ఈసారి.  బ్రహ్మాండమైన చిట్కా!  చిటికలేసుకుంటూ పప్పు పెట్టి, పాయసం పెట్టి, అన్నం పెట్టి- అంటూ ముద్దుచేసి మరీ కాణీ ఖర్చు లేకుండా ఎన్ని ముద్దలైనా ప్రేమగా పెట్టేయొచ్చు మీ బుడ్డోళ్లకు. అమ్మలా ఆడినట్లూ ఉంటుంది కమ్మకా పిల్లల ఖాళీ కడుపులో నిండినట్లుంటుంది.  ఆపైన చక్కి లిగింతలు కూడా పెట్టేసావనుకో .. కడుపు నిండటమేం కర్మరా బాబూ! కళ్ళెంటనీళ్ళు కూడా వచ్చేస్తాయి ధారగా...'


ఇంకొద్దు బాబాయ్! ఇప్పటికే కన్నీళ్ళు కుండలకొద్దీ కారిపోతున్నాయి?' '


అదేంట్రా.... అలా తల గోడకేసి బాదుకుంటున్నావూ! ఒకసారి తల మోదుకుంటే గంటకు నూటయాభయ్ కేలరీలు వేస్టవుతాయిట. తెలుసా! వెస్టు సైడు పరిశోధకులు టెస్టు చేసి మరీ తేల్చిన మేటరు. 'భోజనకాలే గోవింద నామస్మరణ' అంటారుచూడు! అలా తల కొట్టుకుంటుంటే భోజనానికి ముందే నువ్వు గోవిందా అయిపోయేవు. భద్రం! భద్రం ! ముందు ఆ బాదుడు ఆపరా బాబూ: 


'ఎందుకున్నా... ముందుముందు మన ప్రజానాయకులకు జై జైలు, జిందాబాదులు.. బాదేందుకా! భారత్ బంద్ కాదు .. భరతదేశమంతా విందులు కాకపోయినా .. కనీసం గంజి కుడిచే మందులేమన్నా  ముందు కనిపెట్టండిరా  ప్రభువులూ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు దినపత్రిక  సంపాదకీయ పుట సరదా గల్పిక ) 



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...