Wednesday, November 10, 2021

దయ్యమా! .. నీకో దణ్లం! - కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు - హాస్యం

 


ఈనాడు - హాస్యం 

దయ్యమా! i .. నీకో దణ్లం! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయపుట- 10 -02 - 2003 ' ప్రచురితం ) 


బాలామణీ నీ భక్తికి మెచ్చితిని. ఏదన్నా వరంకోరుకో... ఇచ్చిపోతాను' 


ఏం వరం కోరుకోమంటారండీ''


నీళ్లక్కరవుగా ఉందన్నావుగా... వాటర్ కావాలని కోరుకోవే.. అదీ నేనే చెప్పాలా? 


వాటర్ నావల్ల కాదు. కర్ణాటక వాళ్లెవరు చెప్పినా వినరు. కావేరీ, కృష్ణాల్లాంటివి కాకుండా వేరేవి ఏమైనా కోరుకోరాదూ!


కరెంటైనా కోతల్లేకుండా ఇప్పించే ఏర్పాటు చేయించండి స్వామీ!


కాంగ్రెస్సోళ్లు  పవర్లోకొస్తే కంటిన్యువస్ గా కరెంటిస్తామంటున్నారుగా... ఇంతలోనే కంగారెందుకూ?


వెంటనే ఇప్పిస్తేనే బాగుంటుంది 


తథాస్తు 


ఠక్కున్  కరెంటు పోయింది! ప్రొబేషన్లో ఉన్న దేవుడా ఏందీ?! 


ఇదేంటి స్వామీ! ఇలాగయింది? ... మీ వరానికి ' పవర్ ' ఇచ్చే  పవరున్నట్లు లేదే '


ఏపీలో ఫుల్ పవరంటే దేవుడి తరం కూడా కాదు గానీ... ఇంకేదైనా కోరుకో భక్తమగడా! 


భక్తమగడా.. అంటే? 


నువ్వు డైరెక్టుగా నా డివోటీవీ కావు గదా! నా భక్తరాలైన బాలామణికి ఘోస్టువి . అందుకే అలా పిలిచింది. తొందరగా ఏదో ఒహటి తెమిలిస్తే ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడే డ్యూటీ  ఎక్కింది. ఇంకా ఎన్నో అప్పాయింట్ మెంట్లున్నాయి


పోనీ దగ్గరున్నదేదో మా మొహాన పారేసి పోరాదా స్వామీ!


గ్రాంటెడ్ నా దగ్గరో కోటి రూపాయల అప్పుంది మానవా ! ఈ క్షణం నుంచీ దాన్ని తీర్చే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను.. తీసుకో. ఫో! 


దేవుళ్ల దగ్గర ఆదాయముంటుందిగానీ.. అప్పుంటుందా ఎక్కడైనా! దేవాదాయ శాఖ వారి దయవల్ల ముడుపులన్నీ నీ హుండీ నుంచి పెద్దల  హుండీల్లోకి బదిలీ అవుతున్నాయా దేవా?'


కావచ్చు.. కానీ... ఫర్ యువర్ ఇన్ఫ రేషన్... నేను దేవుడిని దయ్యాన్ని. క


ద... దయ్యమా? దగా! .. మోసం! నిన్నెవరు రమ్మన్నారయ్యా ఇక్కడి కసలు ? అప్పనంగా అప్పులంటగట్టి పోవటానికొచ్చావులాగుంది. ఆ.. ఆ.. తొండి. నేనొప్పుకోను.


మీ ఆవిడే కదయ్యా... నాకిప్పుడంత భక్తిగా పూజ చేసిందీ. థింక్ ఆఫ్ డెవిల్ . తలుచుకోగానే ప్రత్యక్షమయితేనే దయ్యం. దేవుళ్లలాగా మేం తాత్సారం చెయ్యం


దేవుడి పటమనుకుని ఆ మేక్కి తగిలించిన మా బాబీగాడి హాలోవిన్‌  'దయ్యం మాస్కు'కి చెంపలేసుకుని కొంపముంచింది గదా బాలా మణి ! పెళ్ళిలో తలంబ్రాలు పురోహితుడి మీద పోసినప్పుడే కనిపెట్టాను.. మా ఆవిడకు చూపు తక్కువ" ఆత్రం ఎక్కువని. మూడుముళ్లు పడంగానే  మూడు జోళ్లు కొని పెట్టిందందుకే.  ఒకటి దగ్గరిది వెతుక్కోటానికి.. రెండోది దూరానివి వెతుక్కోటా నికి.. మూడోది రెండుజోళ్లూ వెతుక్కోటా నికి.  గ్లామరు తక్కువైపోతుందని ఒక్కటీ  వాడిచావటం లేదు. ఇప్పుడు కొంపముని గింది. 


దయ్యంగారి ముందు చెంపలేసు కుంటూ 'దయచేసి మా ఆవిడ పూజ కేన్సిలు చేసుకోండి... మీరిచ్చిన వరం వాపస్ తీసు కోండి' అని వేడుకున్నా.


కుదరదు. మానవుల్లాగా మాట తప్పటం మాకు అవమానము. అందుకే చెప్పింది చేయకమానము 


మొండికేసిందా దయ్యం . ఇంతలో సెల్లోకి కాల్‌ వచ్చింది. .


దయ్యాలకు సెల్లెందుకో? 


అప్పులాళ్లందరూ కలిసి కొనిచ్చారు బ్రతికున్నప్పుడు' అంది దయ్యం కాల్ కట్ చేస్తూ

అర్ధమయ్యింది. అప్పులు తీర్చలేక ఆత్మ హత్య చేసుకున్న ఏపీ రైతు తాలూకు దయ్యంలాగుందిది.


కాదు. నీకు లాగా నిత్యంధూమపానం చేసిన పాపిని. అందుకే దయ్యమైపోయాను నాయనా! 


చైన్ స్మోకర్వా?  గుడ్.ఒక్క సిగరెట్టు ఇలా కొట్టు! 


ఇప్పుడు తాగటం మానేశాను. స్మోకింగ్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు హెల్త్ కదా!


' మీకన్నా ఈ దయ్యం నయం. దీన్ని చూసన్నా బుద్ధి తెచ్చుకోండి! ' అని సతాయిం చటం మొదలు పెట్టింది బాలామణి. .  సందు దొరికిందికదా అని.


ఇంత కాలానికి నన్నభిమానించే ఒక భక్తురాలు దొరికింది. మళ్ళీ వచ్చి కలుస్తా!  అవతల అర్జంటుగా పార్టీ మీటింగుంది


దయ్యాలకూ పార్టీనా! 


'కులానికో పార్టీ... మతానికో పార్టీ వున్న ప్పుడు.. మా భూతాలకి మాత్రం పార్టీ ఎందుకుండకూడదూ? ఈసారి ఎన్నికల్లో మా పార్టీదే అంతిమ విజయం


అంత ఖాయంగా ఎలా చెప్పగలవూ? 


సెన్సెస్ సరిగ్గా తీస్తే జనాభాలో సగానికి పైగా దయ్యాలే ఉన్నాయని తేల్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా... పల్లె నుంచి పట్నం దాకా... భూతలం మీద భూతాలు తిరగాడనిచోటు సెంటైనా దొరకదని సెంట్పర్సెంటు గ్యారంటీగా చెపుతున్నా. ఇంత భూత సంతతిలా ఇలాతలంపై దినదిన ప్రవర్ధమానమవుతున్నా. . దయ్యాలకి తగినంత ప్రాతినిధ్యం లేదనేదే మా ఆవేదన. అందుకే ముందు భూతాలను ప్రత్యేక జాబితాలో చేర్చాలి . జనాభా దామాషా ప్రకారం అధికారంలో వాటా మాకు దక్కాలి. లేకపోతే అన్ని పార్టీలలోనూ  అసంఖ్యాకంగా వున్న మా భూత, ప్రేత, పిశాచాలనన్నింటినీ సంఘటిత పరిచి ప్రత్యేక హక్కులకోసం పోరాడతాం. విప్లవం వర్ధిల్లాలి! 


ఇంట్రెస్టింగ్... మీ దయ్యాలు అధికారం లోకొస్తే ఏం చేస్తాయీ? 


మరిన్ని శృశానాల్ని సృష్టిస్తాం. హత్యల్నీ, ఆత్మహత్యల్నీ ప్రోత్సహిస్తాం. మతకలహాలు, ముఠా రాజకీయాలకి మావంతు కృషి చేస్తాం. అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తాం. మధుపానం, ధూమపానం, పేకాట, జూదం, వ్యభిచారం, గుర్రప్పందాల్లాంటి వాటిని పరిశ్రమలుగా గుర్తించి, వాటిలో విదేశీ భూతాల పెట్టుబడుల కోసం పాటుబడతాం. బళ్లలో చేతబళ్లు కోర్సులుగా పెడతాం. బాణామతిలాంటి వాటికి బహుమతులిస్తాం. 

ఎడ తెగకుండా స్కాములు చేసే స్వాములను గుర్తించి ఏటేటా 'దయ్యాల దినం రోజు'  ఘనంగా సత్కరించుకుంటాం. రేపటెన్ని కల్లోపు మా పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ సంఖ్యను కోటికి చేర్చాలని లక్ష్యం  పెట్టుకుని అగౌరవయాత్రలకు బైలుదేరాం.


స్పందన ఎలాగుంది? 


అపూర్వం. కోటి దయ్యాల టార్గెట్ మొదటి రోజే పూర్తయిపోయింది. బురిడీ బ్యాంకులు పెద్ద డిపాజిట్లు పట్టి బోర్డులు తిప్పేసిన బడాబాబులు, పరీక్షల్లో పేపర్లు లీకు చేసే ముఠారాయుళ్లు , ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల్ని వల్లో వేసుకొనే ఫోర్ ట్వంటీగాళ్లు, సీరియల్సు పేరిట జనాలు చీదరించుకుంటున్నా చూరుపట్టుకు వేలాడే టీవీ ముక్కు చీదుడుగాళ్లు ... అబ్బో.. చెప్పేందుకు టైము లేదుగానీ.. ఇలా చాలా కేటగిరీలుమా పార్టీలో చోటుకోసం పోటీలు పడుతు న్నాయి. టైం ఐో పోయింది . మళ్ళీ కలుస్తా!  అంటూ ఠంగ్‌ మంటూ  మాయమై పో  యిందా దయ్యం.


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయపుట- 10 -02 - 2003 ' ప్రచురితం

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...