Wednesday, November 10, 2021

ఈనాడు - గల్పిక పోటీ దేవుళ్లు - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దినపత్రిక- సంపాదకీయపుట - 28 -05 - 2003 )

 


ఈనాడు - గల్పిక 

పోటీ దేవుళ్లు 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - దినపత్రిక- సంపాదకీయపుట - 28 -05 - 2003 ) 



' నారాయణ! .. నారాయణ ! 


' దా.. నారదా! దా ! నీ పారాయణంలో  తేడా ఉన్నట్లుందే! మహానాడు మహిమా? భూలోకంలో విశేషాలేమి?' 


' సర్వాంతర్యామీ  .. తమకు తెలీని సంగతులేమి! భూలోకం పాపులతో  లుకలుకలాడుతోంది. రాకాసురులు, కోకాసురులు, బకాసురు.. ఇలా... రోజుకోరకం ప్రాసలవారీగా  పెరుగుతూనే ఉన్నారు... మహాప్రభో! ' 


' అయినా కాపాడమని ఏ భక్తుడూ  నన్నడి గిన పాపాన పోవటంలేదేమి?' 


' అడక్కుండానే ఆదుకొనే కొత్త దేవుళ్లు భూలోకంలో పోటీలమీద పుట్టుకొస్తున్నారు స్వామీ! ' 


' ఆ పని నాది కదా నారదా ? దుష్ట శిక్షణ,  శిష్ట రక్షణ  చేస్తానన్నది నేను .  కృతయుగానికి ముందు దేవుళ్లనీ, రాక్షసులనీ విడివిడిగా ఉండేవాళ్లు.  త్రేతాయుగులో నేను మనిషిగా మారాను.  ద్వాపరంలో దానవుడు మానవుడ య్యాడు. కలియుగంలో మాన .. దాన వులిద్దరూ  ఒకే మనిషిలో దూరి ముష్టి యుద్ధాలకు దిగారు. రోజురోజుకి రాక్షసబలం  ఎక్కువవుతోంది. ఏ అవతార మొత్తాలా  అని ఆలోచనలో ఉన్నాను...'


'మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే ఆవతల మీ అసలు అవతారానికే ఎసరొచ్చే సమయం ఆసన్నమైంది స్వామీ! ఎన్నికలకాలు కదా...! భూలో కంలో దేవుళ్లు పుట్టపగిలినట్లు పుట్టుకొస్తు న్నారు.  ఆడక్కుండానే వరాలిచ్చేందుకు పోటీలు పడుతున్నారు. రేషన్కార్డులు, పక్కా ఇళ్లు పట్టాభూములు, మరుగుదొడ్లు... చివరికి పసిపిల్లలక్కూడా పింఛన్లిస్తామని  వెంటపడుతున్నారు స్వామీ! పింఛమొకటే తక్కువ ఒక్కో గోపిక చుట్టూ వంద మంది కృష్ణులు! దేవుళ్లకు ఇప్పుడక్కడ కొరతలేదు. జనానికి మీదాకా వచ్చి దేవులాడే అగత్యం లేదు . దుష్ట శిక్షణ గత్తర్  సంగత్తరవాత స్వామీ.. ముందు తమ మేటరు  చూసుకోండి.. నారాయణా! ' 


' ఏమి చేస్తే సబబిప్పుడు చెప్తా! ? ' 


'భూమ్మీదికొద్ది భక్తుల్ని ఆకట్టుకోండి ! పదండి స్వామీ నేనూ వస్తాను' అని లేచింది పద్మపత్ర మార్కు  శ్రీలక్ష్మి. 


`త .. తమరెక్కడికీ? ' నారదులవారి తడబాటు . 


'శ్రీహరి ఎక్కడుంటే శ్రీదేవి అక్కడే కదా నారదా!  ఆయన రాముడైతే నేను సీతను.  ఆయన నరసింహస్వామి అయితే.. నేను చెంచులక్ష్మీ భామను' 


'ఉప్పుడంత సీమ లేదు తల్లీ!  తమరు  ఏ తల్లి కడుపులోపడ్డా ఆసుపత్రిలో  మార్చే స్తారు. ఆపటానికి  ఇప్పుడు శ్రీహరి కొనగోటి మీది ఆ  సుదర్శన చక్రమైనా లేదే! '


' పోయిన దఫా  భూలోక యాత్రలో .. చైనామీటర్ల మధ్య  చిక్కడిపోయిం ది కదా  నారదా!' శ్రీహరి బిక్కమొగ మేసాడు ఈసారి. 


' పోనీ... శంఖమన్నా అందుకోరాదా నాథా !' శ్రీలక్ష్మమ్మ సలహా. 


' ఎన్నికల శంఖం పూరించటానికని ఏదో పార్టీవాళ్లు ఎత్తుకెళ్లారు. తిరిగివ్వలేదు దేవీ !'


' కనీసం గద ఐనా భుజం మీద ఉండాలి గదా స్వామీ!' 


'కుమ్మిసిద్ధానికి తక్కువైతాయని   నేతలెవరో  తీసుకెళ్ళారు . తిరిగి అడిగితే తిట్టి పోస్తారేమోనని జంకు నారదా! ' 


' ఇట్లా వట్టి కిరీటం ... పట్టుబట్టలు... చమ్మీ దండలతో చమత్కారం చేద్దామనుకుంటే కాన్వెంటు కుర్రాడైనా  పట్టించుకోడు పరంధామా! సినిమా హీరోనో... క్రికెట్ ప్లేయరో అయితే పర్లేదు- విరగబడతారు! లేకుంటే.. లీడర్ల లాగా ఎగ్స్ట్రాలు  చేసినా ఎగబడతారు. పాదయాత్రల సరదా చూడరాదా! ' 


' పాదయాత్రా నా రామావతారం నాటి ఐడియా కదా! అదీ కాపీనేనా?! ' 


' ఒక్క తమదనేమిటి? రథయాత్రలు మాతం? సిద్ధార్థుడి సీనుకి కాపీ కాదా? పెరిగే కాఫీపొడి రేటుకే దిక్కులేదు . తమరి కాపీరైటు లెవరు స్వామీ లెక్క పెట్టేదీ! భక్తజనులకు పూర్వమంత పేషెన్సు లేదిప్పుడు .

తలవకుండాప్రత్యక్షమయే దేవుడికే వారి  మొగ్లు . తరచుగా వచ్చి కోరికలు తీర్చి పోతుండాలి. పాపాలెన్ని చేసినా ముడుపు కట్టగానే పటాపంచలైపోయి తీరాలి . కుదరదంటే పూజాదికాలు కట్ . గుళ్లూ గోపురాలు బంద్ ! గుండ్లు కొట్టి కల్యాణకట్ట  ఖాళీ! కాబట్టే ఆ  భూలోకదేవుళ్ల కళ్లు   నీ భూముల మీదా . .  వాటి ఆదాయాల మీదా  పడటం! నీ సొమ్ములు వాళ్ల హుండీలలో జమ చేసుకుంటున్నారు. పేరు నీది.. ప్రసాదం వాళ్లదయ్య  వెర్రి శ్రీ హరీ ! ' 


' హరి.. హరీ! ' దేవుడు కంగారుగా లేచి నిలబడ్డాడీసారి .. కిందికి దిగేందుకు . 


' రామలక్ష్మణులైనా రాజీకి రాని రోజులు! కౌరవ పాండవులైనా కౌగిలించుకు తిరిగే ఎన్నికల కాలం ! కాస్త చూసుకుదిగండి  స్వామి'' అంది శ్రీదేవి. 

--- 


దీనరక్షకుడి కెక్కడ దిగాలో దిక్కు తోచింది కాదు . దిగాలుగా నారదుడి వంక చూశాడు. 


ముక్కోటి దేవతలు ముప్పయి కోట్లకు పెరిగారిప్పుడు. 


బాబాలు... బడాబాబులు.. లీడర్లు.. సినీ హీరోలు .. క్రికెట్ ప్లేయర్లు.. ఏ భజన సంఘంవారి చేయీ ఖాళీగా లేదు.


'ఆడుగో... జీవుడు. పోయి కలువుడు/' అన్నాడు నారదుడు.

--- 


'ఎవరూ?'


నేను... దేవుడిని జీవా!'


"అడక్కుండానే ఎందుకొచ్చావు దేవా? నీ మీద నాకు నమ్మకం లేదే' 


' నా స్థితి అలాగుంది నాస్తికా!  నువ్వయినా  నన్ను నమ్మవా! '


' నమ్మే వాళ్లకు నువుపెట్టే పరీక్షలు నరకం బాబూ! ' ఒక పట్టాన ప్రత్యక్షం కావు. వెయ్యి వరాలడిగితే ఒకటి విదిలిస్తావు... అదీ సవా

లక్ష షరతులతో ! భుక్తి కోసం భక్తి నటెంచటం నావల్ల కాదు' 


' పోనీ .. ఈసారికి వెంటనే తీరుస్తాను. కోరుకొని చూడు మానవా! ' 


'అర్జంటుగా లక్ష  రూపాయలు  కావాలి. అధర్మంగా వద్దు : ఇస్తావా ?' 


' మోక్షమంటే వెంటనే ఇచ్చెయచ్చు గానీ,  లక్ష అంటే ఎక్కణ్ణుంచి తేనూ ! ...'


దేవుడు తటపటాయిస్తున్నాడు. 


తటాలున దేవుడిలా ఓ దండు వచ్చిపడింది. 

కాలనీలో గుడి కట్టిస్తున్నాం. విరివిగా విరాశాలివ్వాల్సిందేనని బెదిరింపు.  దేనికోసమైనా భక్తులు  దేబిరించే కాలం చెల్లిపోయిందా ? 

దేవదేవుడి షాక్!  


అక్రమంగా ఆక్రమించిన జాగాలో ఓమూల దేవుడి విగ్రహం చెక్కించటానికి బలవంతంగా భారీచందాలిలా వసూలు చేయటం భగవంతుడికే మాత్రం నచ్చిందికాదు .


ఈ తరహా దొంగభక్తుల వల్లే నాస్తికుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.  చందా ఇవ్వకూడదు' అనుకున్నాడు ముకుందుడు మొండిగా. 


నాస్తికడో మ్యొ రూపాయలు వాళ్ల డబ్బాలో వేసి  నమస్కారంచేసి మరీ సాగనంపాడు! 


దేవుడికాశ్చర్యం! నన్ను నమ్మవు కదా! నా గుడికి చందా ఎందుకిచ్చావు?


నిన్ను నమ్మనన్నానుగానీ... నీ భక్తగణాన్ని కాదుగా ! ప్రజాస్వామ్యం మివ్య   కావచ్చు. కానీ బీద జనానీకం ఎన్నటికీ మిధ్య  కాదు .  ఇదంతా బీదాబిక్కీ యుగాల బట్టి నివసించే మురికి కూపం .   వసూలైన సొమ్ములో ఒక్కర శాతం పెట్టి గుడిగోడలు కట్టించినా .. ఈ మురికివాడ  భూముల రేటు ముడు రెట్లు పెరగటం ఖాయం! 


తన వెంట శంఖు చక్రాల్లాంటి ఆయుధాలేవీ  లేనందుకు  బెంగటిల్లే వున్న భగవంతుడు ఉల్లాసంగా అన్నాడు 'అడిగిన వెంటనే చందా  రూపంలో సాయం అందించిన నీవే నా భూలోక వారసుడివి . నిజం చెప్పాలంటే నీతో పోటీ  కొచ్చే దేవుడు ఈ యుగంలోనే  భూమ్మీద లేడు, ఇకపై రాడు ! ' అంటూ అంతర్థానమయిపోయాడు. 

**+


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - దినపత్రిక- సంపాదకీయపుట - 28 -05 - 2003 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...