లోకంలో నీరు తరువాత తేనీరే
అధికంగా వినియోగమయే ద్రవం. కప్పు కాఫీనో, తేనీరో పడకపోతే పడక దిగడానికి పెద్దలే
పస్తాయిస్తున్న కాలం ప్రస్తుతం నడుస్తున్నది. ఓ ఆధునిక తేనీటి ప్రియుడు వాపోయినట్లు
'కిటికీలోంవి వానా ఉరుములూ వినిపిస్తున్నప్పుడు/ శవంలా
ఒరిగున్న నీరసం/ నిప్పుల పులిలా లేచి నుంచోవాలంటే' కావలసింది
ఓ కప్పుడు చాయ్. ఒకప్పుడే కాదు ఇప్పుడూ ఆ కవి చాయాలపన నూటికి నూరు శాతం వాస్తవమే!
ఎంతలా వేధించకపోతే పోకూరి కాశీపతి వంటి ఉద్దండ పండితులు కూడా దండకాలు చదువుతూ ఈ
కాఫీ టీల ముందు సాష్టాంగ ప్రణామాలకు పాల్పడివుంటారు! 'శ్రీ
మన్మహాదేవీ! లోకేశ్వరీ! కాళికా సన్నిబాకరణీ! .. అంబా కాఫీ జగన్మోహినీ!' అంటూ ఏకరువు పెట్టిన గుణగణాలన్నీ
పేరుకే కాఫీకి కానీ తేనీటి వంటి అన్ని ఉత్సాహ ప్రసాద తీర్థాలన్నింటికీ అక్షరాలా
వర్తించే స్తుతిమాలలే వాస్తవానికి! 'శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరి
ఊతంబునే పారిజాతంబున్ దెచ్చియున్ నాతికిన్ బ్రీతిగ నిచ్చు కాలంబు
నందా సుమంబునందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలి' ఏ కాఫీ
చెట్టుగానో, తేయాకు మొక్కగానో పుట్టుకొచ్చిందన్నంత దాకా ఆ
అవధానిగారి ప్రేమగానం ముదిరిపోయిందంటే ఆ దోషం వారి పాండిత్యంలో లేదు. కాఫీ టీలకు కవులూ
కళాకారులకూ మధ్య ఉన్న బంధం అంత బలమైనదిగా అర్థంచేసుకోవాలి. 'కాఫీ
టీ లయినా సర/ దాకైనా మందొ కింత తాగరు సిగిరె/ ట్టూ కాల్చరు మరి వారె/ ట్లీ కవులైరొ
తెలియనగునా!' అంటూ కోవెలవారు ఓ శతావధానంలో ఆదే పనిగా ఆబ్బురపడిపోతారు!
'సరదాకే' అని ఆ కవిగారన్నా కాఫీ టీ లు కేవలం కవుల సరదాకేనా?!
'తింటే
గారెలు తినాలి.. వింటే భారతం వినాలి' అనే నానుడి బహుశా వేడి
వేడి కాఫీ టీలు వాడకంలోకి రాని కాలం నాటివై ఉండాలి. గారెలు తినగ తినగ చేదు. కాఫీ
చాయిలకు ఆ దోషం లేదు. తెల్లవారగానే తేనీటికి వెంపర్లాడే బుద్ధి తెల్లవాడు వచ్చి
మనకు మప్పినన కాలానికి ముందు పుట్టబట్టే అల్లసానివారు సత్కృతులకు అవసరమైన సరంజామాలో 'అల్లం టీ' ని
కలపలేదు. కాఫీ టీల యుగంలోనే గాని ఆ కవితాపితామహుడు ప్రభవించుండి ఉంటే 'రా! నడిచే నగరంలానో / నిద్రించే పల్లెలానో వచ్చి/ నా ముఖం మీద దుప్పటి
లాగిపారెయ్/ బోర్లించుకున్న రాత్రిళ్లూ/ పొర్లించుకున్న పాటలూ/ నిరామయ ప్రపంచాలూ
చెరిసగం పంచుకుందాం ఇరానీ కప్పులో.. గోర్వెచ్చగా' వంటి ఈ
నాటి కవితలకు దీటైన 'టీ కవితలు' టీకా
తాత్పర్యాలతో సహా రాసుండేవారు. నాయుడుబావ ప్రేమ కోసం నండూరివారి వెంకి అట్లా
గుత్తొంకాయ కూరలు, పూరీలు, పాయసాలు
చేసి అంతలా హైరానా పడింది కానీ -చారెడు ఏలకులు గుండ కొట్టి కలిపిన తేనీటీని ఓ కంచు
లోటాకు నిండుగా పోసిచ్చి ఉంటే జుర్రుకుంటూ తాగి వెర్రిత్తిపోయుండేవాడా ప్రియుడు. 'దిగిరాను దిగిరాను దివి నుండి భువికి' అంటో భావకవి
కృష్ణశాస్త్రి అన్నేసి మారాములు చేయడానికి 'మసాలా చాయి'
రుచి పరిచయం కాకపోవడమే కారణం కావచ్చును. 'క్షీరసాగర
మధనంలో సాధించిన సుధ జగన్మోహిని దేవ దానవులకు పంచే
వేళ ఒలికిపడ్డ ఓ
రెండు మూడు చుక్కలే భూమ్మీద మొలకెత్తిన ఈ తేయాకు
మొక్కలు' అన్నది గురజాడ గిరీశంగారికి అన్నలాంటి మేధావి తీసిన
థియరీ! భగీరథుడు అంతలా పరిశ్రమ చేసి భూమ్మీదకు సురగంగను పారించింది ఎందుకైనా .. లాభం అందుతున్నది మాత్రం ఈనాటి మన తరాలకే సుమా! గంగ
పారే నేల సారం, గంగ వీచే గాలి తరంగం భారతీయుల తేయాకుకు అందుకే అంతలా బంగారపు
రంగు, సుగంధాల రుచి.. వెరసి విశ్వవిపణిలో విపరీతమైన గిరాకీ! చైనాకు చాయ్ ఒక ఔషధమయితే,
జపానుకు అదే 'ఛదో' అనే ఓ
కళ. భారతీయులకు
మాత్రం అన్నివేళలా అవసరమయే ఓ నిత్యావసర పానీయం. పేటెంట్ హక్కుల కోసమై తమిళనాట సుదీర్థకాలంగా సాగిన
న్యాయ వ్యాజ్యమే తేయాకు మీద భారతీయులకున్న అవ్యాజప్రేమాభిమానాలకు నిదర్శనం.
నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రమండలం
మీద పాదం మోపిన మరుక్షణమే 'హుర్రే! పరాయి గ్రహం మీద కాలుపెట్టిన మొదటి మొనగాడిని నేనే!' అని ఓ వెర్రికేక వేయబోతే..'అంతొద్దు! నీకు టీ..
కాఫీలు అందించేందుకు ముందుగానే ఓ అయ్యర్ ను అక్కడ దింపి ఉంచాం' అంటూ భూ కేంద్ర నుంచి సందేశం అందిందని.. ఓ జోక్! కాఫీ.. చాయ్ లు దొరకని
స్థలి భువన భాండములో ఎక్కడా ఉండదు' అన్నదే ఈ ఛలోక్తి
సారాంశం. మూడు వేల రకాల 'టీ'లను
పదిహేను దేశాలవారు రోజుకు మూడు కప్పులకు తగ్గకుండా తాగుతున్నారంటే తేనీటి మహిమ చెప్పతరమా? రుచికి ఆరోగ్యంతో పొసగదని కదా సామాన్య
సూత్రం! కాకర చేదు. కరకరలాడే కారబ్బూందితో గుండెకు ఇబ్బంది. మద్యంతో అందేది పెగ్గుల
కొద్దీ అనారోగ్యమే! తేనీటిలోనూ చూపుకు దొరకని రోగకారకాలుంటాయనే వైద్యనిపుణులు
కద్దు. ' 'ఆరోగ్యానికి అమరదు' అని ఎవరేమి అనుకున్నా కాఫీ చాయిల వంటి అమృత పానీయాల పైన మనిషి చాపల్యం అమరం. 'కడుపులోకి ప్రవేశించాక/ కరెంటు లావాలా
ఉరకలు వేస్తుంది/ ఆ
వేడి నీటిపూల నీరు కాటుకు గుండె కంట్రోల్ టవర్ నుంచి / తల వెంట్రుకలు కూడా ఫిలమెంటులవుతాయం'టూ మానేపల్లివారు వినిపించిన గిటారు సంగీతం కాఫీ గురించే కావచ్చునేమో
కానీ.. నిజానికి ఇరాన్ నుంచి దక్కన్ దాకా ఏ రకం చాయ్ కప్పు చేతికి తీసుకున్నా
అంతకు మించిన మరపురాని ఉత్తేజాన్నందిస్తుంది. ఉత్త ఉత్తేజమే కాదు.. వాషింగ్టన్
అంతర్జాతీయ ఆరోగ్యనిపుణుల తీర్మానం ప్రకారం తేనీరు ప్రాణాంతక వ్యాధులను నిరోధించే
దివ్యౌషధం కూడా! ఒక కప్పు చాయ్ కిలో కాయగూరల సారాన్ని ప్రసాదిస్తుందన్నది
ఆరోగ్యశాస్ర నిర్ధారణ. చురుకుదనం, జ్ఞాపకశక్తి, రేడియేషన్ కు విరుగుడు, కంటికి చలువ- వంటి
ప్రయోజనాలు ఎన్నింటినో జనాలకు అందించేదీ వేడి వేడి ఔషధమే! అధిక రక్తపోటుకు, నరాల నిస్సత్తువకు,
రక్తనాళాలలో అధికమయ్యే కొవ్వు పదార్థాలకు, పంటి
చిగుళ్ల సమస్యలకు.. తేనీరు ఓ సంజీవనీ ఔషధం. బ్లాక్ టీ లోని థియాఫ్లావిన్-2 కేన్సర్ కణాల సంహరణకే కాక ఆ ధర్మం నిర్వర్తించే జన్యుకణాల క్రియాశీలతకూ
తిరుగులేని మందులా పనిచేస్తుందని అమెరికా విశ్వవిద్యాలయ పరిశోధనల్లో తాజాగా
తేలింది. కేన్సర్ వ్యాప్తికి కారణమైన సివో ఎక్స్ -2 నీ
నిర్వీర్యం చేసే చాయ్ నిజానికె సంజీవనీ జేషధమే! చెయ్యెత్తి
ఆ తేనేటి మందుకు 'జై' కొట్టకుండా ఎట్లా ఉండగలం?
-కర్లపాలెం
హనుమంతరావు
(ఈనాడు-
ఆదివారం సాహిత్య సంపాదకీయఁం - 26, జూన్, 2011)
No comments:
Post a Comment