Wednesday, December 4, 2019

అంతరాత్మల కథ- వ్యంగ్యం- సూర్య దినపత్రిక ప్రచురితం






'నేతలు మనకు అండగా నిలిచిన గుట్టు నేరుగా జనంలోకి  వెళ్ళిపోతోంది' అంది మద్యం బ్రాండు అంతరాత్మ.
'మరే! ఆపదల్లో ఉన్నప్పుడు ఆ సాముల్ని ఆదుకోవడం మన  ధర్మం!' అంది గోల్డు బ్రాండు అంతరాత్మ .
'పెదాల సానుభూతితో పనేమవుతుంది? పెడసరంగాళ్ల నోళ్ళు కుట్టించాలి ముందు. అందుకే  న్యాయదేవత అంతరాత్మకే టెండరు పెట్టానీసారి! అంది యుద్ధ విమానం మార్కు మరో అంతరాత్మ ధీమాగా.
ఆ అంతరాత్మ  మనంత గట్టిగా నిలబడదమ్మా! ఏ  తీర్పు ఏ భావోద్వేగంలో వచ్చిపడుతుందో ఊహాతీతం. గిట్టని అంతరాత్మల మధ్య పొత్తు కుదర్చడమే మెరుగు. పీ.కే అంతరాత్మను ప్రయోగిస్తేనో?
ఎంత ఖరీదయినా కొనడానికి ఓ.కే! కానీ అదీ వెళ్ళి ఆ బురద    రాజకీయాల్లో దిగబడిందే! 
రాజకీయ అంతరాత్మ బాధగా మూలిగింది. 'మా బురదలో అందరికీ భాగముందమ్మా! ఎలాగైనా సరే లాభాల్లాగాలనే లోభం తమ వ్యాపారులది! సర్కారులు ఎవరివైనా సరే మీకు సలాం కొట్టాలి.  జనంతో తంటాలు మావి! మిమ్మల్నీ వదులుకోలేం. ఓటర్లనీ వద్దనుకోలేం.’
'మా మీదేమన్నా వూరికే  కారుతోందా ప్రేమ? ఓటర్ల అంతరాత్మలను కొనిపెట్టే  సొమ్మంతా  మా  ఇనప్పెట్టెల్లోదేగదా!’  బొగ్గు మార్కు అంతరాత్మ భగ్గుమంది.
 ‘ఎంతో రిస్కుతో కుతంత్రాలు పన్ని, పన్నులు.. బ్యాంకు రుణాలు గట్రా  ఎగ్గొట్టి మా యజమానులు జమేసుకున్న సొమ్ము! మీ నేతలు కమ్మంగా అనుభవించే పదవులకిప్పుడు అదే కదమ్మా ఆధారం!’ వంత పాడింది వజ్రం మార్కు అంతరాత్మ.
'నేతలం కాదు మనం.. వాళ్ళ అంతరాత్మలం. మనలో మనకు కుమ్ములాటలొద్దు! మన ఆసాములు కష్టాల వూబిలో ఉన్నారిప్పుడు. వాళ్లని  గట్టెక్కించడం ఒక్కటే మన కర్తవ్యం కావాలి’  సర్ది చెప్పింది ఓ ముసలి అంతరాత్మ.
ఆ స్కాములప్పుడేమన్నా ఆ ఆసాములు మన మాటలు విన్నారా.. ఇప్పుడు గట్టెక్కించడానికి! గొణికింది ఓ యువ అంతరాత్మ.
అవును. అదనంగా నసగాళ్ళని  చీదర్లు కూడా ! నొసలు చిట్లించింది మరో కుర్రది.
అంతరాత్మలకి అంత ఆత్మాభిమానం చేటు! మన అసహనం, తిరుగుబాటు ఏ పంథాలో ప్రయోగిస్తే సత్ఫలితాలొస్తాయో.. ముందది ఆలోచించద్దాం! ఈ   పెద్ద అంతరాత్మలతో శిక్షణా తరగతులు  నిర్వహిస్తోంది కూడా అందుకే. బుద్ధిగా వినండి! గద్దించింది అధ్యక్ష స్థానంలో ఉన్న అంతరాత్మ.
వ్యాపార అంతరాత్మ ప్రసంగం ప్రారంభయింది మనం ఉన్నామన్న భరోసాతోనే పెద్దమనుషులు  స్కాములకు సిద్ధపడతారు. ఎంత  మొండిగా వాదించినా మన మాట వినరు. అందుకే మనమూ వాళ్ల బాట పట్టక తప్పదు. మన కుబేరులు  బేరుమంటే  మన అంతరాత్మలకే కదా నామర్దా’
'అయితే  ఏం చెయ్యాలంటా? తిట్టిపోసిన వాళ్లతోనే కూటమి కట్టాల్నా?' పెడసరంగా అడిగింది  ఇందాకటి  పిల్ల అంతరాత్మ.
సర్కారు ఎవరిదన్నది మనకు ముఖ్యం కాదు. ఎవరు గద్దె మీదుంటే వాళ్లకే మన మద్దెల దరువు. అధికారంలో ఉన్న వాళ్లే ముందు ముందు మరెన్నో  మంచి పనులు చేస్తారని టముకేస్తే సరి. వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్తలపెట్టవోయ్' అన్నాడా లేదా గిడుగు పిడుగు?’
కిసుక్కని నవ్వింది కుర్ర  అంతరాత్మ 'ఆ కొటేషన్ గురజాడది
తెలిసే అన్నాన్లే! గిడుగు నుంచి గురజాడ కాపీ కొట్టాడని మన  అంతరాత్మలన్నీ కలసి  ఘోషించాలి. అదే నిజమని జాతి అంతరాత్మకూ  నమ్మకం కలిగించాలి. అందాకా బ్రెయిన్ వాష్ చెయ్యడమే  మన పని.’
బొగ్గు అంతరాత్మ అందుకుంది ‘ఆ గోల కవుల అంతరాత్మలేవో చూసుకుంటాయిలేద్దూ! మద్యం నుంచి భూములు, మార్కెట్ బూములు, బంగారం, విమానాలు, బ్యాంకు రుణాల వరకు ఎన్నో బడావ్యాపారాలు మన అంతరాత్మలను నమ్ముకునే పెద్దెత్తున అక్రమంగా నడుస్తున్నాయిక్కడ. ముందున్నది ముసళ్ల పండుగని మనమెంతైనా ఎంతైనా మూలుగు.. ఎవరి చెవినా పడ్దంలేదు’
‘అలాంటి ఇబ్బందుల్లోనే ఈ కార్యకర్తల అంతరాత్మలేం చెయ్యాలనేది మీ సీనియర్లు నేర్పించాలిప్పుడు’ గుర్తుచేసింది అధ్యక్ష అంతరాత్మ.
'ఈ సారి ఈ అంతరాత్మల అంశాన్నే ముందుకు  తోద్దాం! సెంటిమెంటుతో చేసే ఏ  ప్రయోగం ఇంత వరకూ విఫలం కాలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో. అధికార పక్షం తరుఫు నుంచే ఈ తుర్ఫు ముక్క  తీయిస్తే సరి! తిరుగుబాటు వర్గాల్లోకి మన కోవర్టులను చొప్పించి అందరి  నొప్పులను  టోకున కొనిపిచేద్దాం!’
‘కొనడం అంటే మూటలతో పని. అనైతికం. ఆసాముల్నందర్నీ  సతాయించాలి?’ ముఖం చిట్లించింది మళ్ళీ మొండి అంతరాత్మ.    
‘సతాయించడానికే మనుషుల్లో మనమున్నది! వ్యాపార అంతరాత్మలుగా అది మన విధి కూడా’
మళ్లీ అడ్డుపడింది జిడ్డు అంతరాత్మ ‘అమ్ముడయేందుకు మీ రాజకీయ  అంతరాత్మలు  సిద్ధంగానే ఉంటాయమ్మా! కానీ కొనే సొమ్ము తమ  ఆసాములనుంచి  రాబట్టాలంటేనే గడసాములు చెయ్యాలిక్కడ. పాపం వ్యాపార అంతరాత్మలు!
‘ఏంటీ నస?’ అన్నట్లు మొండి అంతరాత్మకేసి గుడ్లురిమి చూసాయి మిగతా అన్ని అంతరాత్మలూ.
చూడూ! మన అంతరాత్మల  ముందు ఎంత లావు బిరుసున్నా తలవంచాల్సిందే! అనుభవంతో చెబుతున్నా.. అంతరాత్మ ప్రబోధం కన్నా ఉత్తమ చమత్కారం మరోటి లేదు. ముఖ్యంగా  రాజకీయాల్లో. మనం గానీ ఎంటరయితే ఏ నేత వంటికీ మకిలి అంటదు’ కలగచేసుకుంటూ అంది అధ్యక్ష అంతరాత్మ ‘దేవుడు, రాజ్యాంగం కన్నా మన అంతరాత్మల మీదే అమాయక జనాలకు గట్టి  నమ్మకం. ఆ నమ్మకం వమ్ము కానివ్వద్దు’
‘మరి ప్రజాహితం?’ మొండి అంతరాత్మ లొంగదలుచుకోలేదు.
 ‘మేధావులకే పట్టని ప్రజాహితం మనకెందుకెందుకంట? ఎన్నికలు  తరుముకొస్తున్నాయ్  అవతల! ఎన్నికల కోడు పీడ  ఏ క్షణానైనా విరుచుకుపడచ్చు. ఎంత సొమ్ముకైనా సరే.. అమ్ముడవడానికి మీరంతా సై య్యేనా?’
‘సై’ అరిచాయి అన్ని కుర్ర అంతరాత్మలు.
‘ ఏం చేసైనా సరే మీ ఆసాముల్ని గెలిపించుకునేందుకు సిద్దంగా ఉన్నారా?’
‘ఉన్నాం.. ఉన్నాం.. ఉన్నాం!’ పిల్ల అంతరాత్మల కేకలు మిన్ను ముట్టాయ్!
 ‘గుడ్! అయితే.. ఏదీ.. నీ నోట్లో ఏముందో చెప్పు.. చూద్దాం?’ ఓ పెంకి ఘటం దగ్గరికొచ్చి అడిగింది అధ్యక్ష అంతరాత్మ.
‘ప్రద్దానికీ అడ్డొచ్చి ప్రశ్నిస్తోందే.. ఈ మంకు అంతరాత్మ.. దీని చూపుడు వేలు’ అంది పెంకిది.
‘వెరీ గుడ్! ఓ సారి  ఆ వేలు కొరుకమ్మా!’
లటుక్కున కొరికి కరకరా నమిలి మింగేసింది క్షణంలో పెంకిది కసిదీరా. వేలు తెగిన మొండిది  లబోదిబమంటూ బైటికి పరుగెడుతుంటే అంతటా నవ్వులే నవ్వులు.
‘అరెఁరెఁరెఁ! కొరకమంటే నిజంగా కొరికేయడమే!’ మందలించింది అధ్యక్ష అంతరాత్మ నవ్వులు కాస్త సద్దుమణిగాక. ‘నోట్లో వేలెట్టినా కొరకలేనంత జాణతనం చూపించాలమ్మా! ఆ మాత్రం అమాయకత్వం నటిస్తేనే అంతరాత్మల సాక్షికంగా నడిచే నాటకాలన్నీ నిజాలేనని పిచ్చి జనాలకు నమ్మకం కుదిరేది. మరీ మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరుగారంత  పారదర్శకత  పనికిరాదు అంతరాత్మలకు. నవ్వింది చాలు. ఇహ ముఖ్యమైన మూడు ముక్కలతో ఈ సమావేశం ముగిద్దాం. స్వచ్ఛమైన, అవినీతికి తావులేని పారదర్శక పాలనంటూ నేతలు బల్లగుద్ది లక్ష హామీలిస్తుంటారు.  బెదిరిపోవద్దు. మీరు లేకుండానే  మ్యానిఫెస్టోలా అంటూ అలకలసలే వద్దు.! అంతరాత్మల ప్రమేయం కుంభకోణాలతోనే మొదలవుతుంది రాజకీయాలల్లో.   బొగ్గా.. బంగారమా, పెద్దనోటా, పెట్ఱోలు రేటా.. అన్నది మనకు  పెద్ద ముఖ్యం కాదు.  ఎగ్గొట్టేందుకు వీలుగా రుణవిధానాలున్నప్పుడు ఎవరికయినా ఎందుకు తప్పు చెయ్యబుద్ధేయదు?  మనం క్లవర్లం. కాబట్టే తెలివిగా మన సాముల్ని కవర్ చేసుకుంటున్నాం. ఎవరేడ్చిపోతేనేం.. వియ్ డోన్ట్ కేర్. పిల్ల అంతరాత్మలు మీరు. ఆదర్శాల ఉచ్చులో ఇరుక్కోకండి! బడుగు ఓటరొచ్చి తడితే నిద్ర లేవద్దు. మరీ అంత కునుకు పట్టకుంటే అసమ్మతి రాగాల కోర్సుంది.. సాధన చేసుకోండి.. పెద్దమనుషులతో మన బేరసారాలో కొలిక్కొచ్చిందాకా! తతిమ్మా థియరీ రేపు! ఈ పూటకీ ప్రాక్టికల్స్  చాలు‘ ప్రకటించి లేచింది అధ్యక్ష అంతరాత్మ,
‘ప్రాక్టికల్సా?!’ నోరెళ్లబెట్టాయ్  అంతరాత్మలన్నీ.
‘మరే! ఎంత చెప్పినా మొండికేసే అంతరాత్మలు  కొన్నుంటాయెప్పుడూ. నిజాయితీ, నిమ్మబద్దలంటూ  మేధావుల మెదళ్ళు తొలవడమే వాటి పని! ఎన్నికల్రోజు బక్క ఓటరు అంతరాత్మలను అవి తట్టి లేపేస్తే.. అమ్మో.. మన ఆసాముల పని గోవిందా!  అందుకే పద్దాకా ఎత్తి చూపించే  చూపుడు వేళ్లను  ఎలా కత్తిరించేయచ్చో ప్రాక్టికల్ గా చేయించి చూపించా!’ అంది అధ్యక్ష స్థానంలో ఉన్న ఆ  ముసలి అంతరాత్మ! ఇందిరమ్మ హయాంలో వి.వి.గిరి గారికి అధ్యక్షగిరి ఇప్పించిన గడుసరి ఈ అంతరాత్మే మరి!
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)
***


 







No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...