Saturday, December 14, 2019

వనం, మనం; మధ్యన దైవం కర్లపాలెం హనుమంతరావు




వనం హిందువులకు దైవం. చెట్టులో పుట్టలో దేవుళ్లను దర్శించుకునే తత్వం భారతదేశం అంతటా కనిపిస్తుంది.  వనం మనకు వట్టి వనదేవతేనా.. వరాలు ప్రసాదించే వనలక్ష్మి కూడా. లక్ష్మి సంపదలకు పర్యాయపదం. కాబట్టి ప్రకృతి ప్రసాదాలే అయినా చెట్టూ చేమా మనుషులకు ఆస్తి పాస్తుల కిందనే జమ.
ఆలయం నిర్మాణం తరువాత దేవతా విగ్రహాలు ప్రతిష్టాపనకు ముందు   పరిసరాలలో చెట్టూ చేమా వృద్ధిచెందే అవకాశాలను పరిశీలించే పద్ధతి పురాణేతిహాసాల కాలం బట్టి అనూచానంగా వస్తున్న ఆచారవ్యవహారలలో అంతర్భాగం!  
పంచభూతాలలో ఒకటిగా పరిగణించే పృథ్వి విఘ్నాధిదేవత వినాయకునికి ప్రతిరూపంగా భారతీయుల ఆధ్యాత్మిక భావన . ఆయనకు శమీ, దూర్వ పూజలు ఇష్టం. ఉదకానికి భవానీమాతగా పరిగణన. ఆమెకు అశోక, విష్ణుక్రాంత దళాలతో పూజంటే ప్రీతి. వాయువు విష్ణువు కింద జమ. అశ్వత్థ, తులసీ దళాలతో అభిషేకం అంటే ఆయనకు మోజు. ఆకాశం ఈశ్వరాంశంగా భావించడం హైందవ ఆచారం. బిల్వ, ద్రోణ సంబంధ పూజాదికాలంటే అంబర దేవునికి మహా సంబరం. అగ్ని సూర్యభగవానుడు. ఆయనను అర్క, కరవీర పుష్ప పత్రాలతో పూజిస్తే శాంతిస్తాడని నమ్మకం.
భగవంతునికి ప్రతీకలుగా చెట్లను భావించే అనాది మనస్తత్వం నుంచే నేటి మన ఆలోచనాధారా వికసిస్తో వస్తున్నది.
వేరు నుంచి చిగురు వరకు చెట్టులోని ప్రతీ కణమూ ఏదో ఒక దేవునికి ప్రీతిపాత్రమైనదిగా భారతీయులు భావిస్తుంటారు. ఫల, దళ, పుష్ప సముదాయాల వంటి సరంజామా లేని  పూజావిధానం మనం ఊహించనైనాలేము కదా! శుభకార్యాలలో సైతం చెట్టు చేమల పాత్ర అనివార్యం. దేవీదేవతల చిత్రాలలో మనకు ఏ మూలనో ఓ మూల పిసరంతైనా కాయో, కొమ్మో, పండో, చిగురో కనిపించడం తప్పనిసరి. వృక్ష ప్రమేయం లేని దైవత్వాన్ని ఊహించడం భారతీయులకు మనస్కరించదు.
రామాయణ, భారత, భాగవతాది మహా కావ్య, పురాణాదులు వర్ణించిన వనాల వివరణ వింటుంటే చెవులకు బహు పసందుగా ఉంటుంది. రామాయణంలోని చిత్రకూటం, పంచవటి, అశోకవనం, ఋష్యమూకం, కిష్కింధ, మధువనం వంటి  మనకు తెలిసినవే కాకుండా అనేకానేక ఇతర వన్యదేవాలయాలూ ఉన్నాయి. మహాభారతంలో ఖాండవవనం, , కణ్వాశ్రమం, దైతవనం  దండకారణ్యాలు.. మహాభాగవతంలోని నైమిశారణ్యం, బృందావనం, వంటి వనాలూ ఈ కోవకే చెందే అందాల హరితాలయాలే.
కృష్ణుడు బృందావన సంచారి. వనమాలి, కుంజవిహారి. ఆ హరితప్రేమి  వేణువు ధరించి వేణుమాధవుడయినాడు. కొండను గోటికి ఎక్కించి గిరిధారి, ఆలమందలను వనాల వెంట తిప్పి  గోపాలస్వామి అయిన ఆ నీలమేఘస్వామిని చూసైనా మనిషికి, ప్రకృతి సంబంధమైన చెట్టూ చేమకూ మధ్య ఉన్న అవినాభావ అనుబంధం అర్థమవాలి.  
కృష్ణుని మాదిరే రాముడూ నిత్య సత్యమాలాధరుడు. అవతారమూర్తుల మూల మూర్తి విష్ణువు చేతిలో పద్మం, నాభిన తామర! అతని సహచరి లక్ష్మిదేవిది పద్మాసనస్థితి. రెండు చేతులా రెండు కమల పుష్పాలు ధరించిన ఆ మందస్మిత  దర్శనం కళ్లకు పండువుగా ఉండటం సహజం. 
ఇక ఈశ్వరునిది బిల్వలోకం. ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తి దర్శన భాగ్యం లభించిన పిదపనే పద్మపత్రాలు వికసించినట్లు.. ప్రకృతి పచ్చగా పలకరించినంత కాలమే మనిషిలోని చైతన్యం ప్రవర్థిల్లేది!
సృష్టి ఆరంభానికి ముందు భగవానుడు బాల దిశమొల స్థితిలో వటపత్రం పైన శయనించినట్లు   భారతీయులు భావించడం మనకు తెలుసు.  బాలశాయి శయనతల్పం రావిపత్రం  అశ్వత్ఠామ వృక్ష ప్రసాదితం. బాలకుడి బొడ్డు నుంచి లేచి నిలిచిన తామర తూడు కొసలు విస్తరించిన భాగమే సృష్టిని ప్రారంభించిన శక్తికి ఆధారభూతమయింది' అన్న ఆ కల్పనల్లో లోతైన ప్రతీకలే ఉన్నట్లు ఆధునిక  తత్వచింతనాపరులూ భావించడం విశేషం. ఆకులలమల బంధంలోనే స్త్రీ-పురుష బంధాల మూలాలు ఉన్నట్లు భావించడంలో  తర్కం ఎంత వరకుందో ఎవరికి వారుగా  విచక్షణాశీలులు తర్కించుకోవలసిన అంశం.
ఆకుల ఆకృతిని బట్టి రావికి పురుషత్వం, వేపకు స్త్రీ తత్వం ఆపాదించిన మేథస్సు మనిషిది.  కళ్యాణం జరిపించిన  ఆ  రావి- వేపల జంట నీడ కింద నాగ'బంధం' ప్రతిష్ఠించి దాని చుట్టూతా   ప్రదక్షిణాలు చేయిస్తే జంటకు నూరేళ్ల పంటగా సంతానం ప్రాప్తిస్తుందని పూర్వీకుల నుంచి ఓ విశ్వాసం.
దశావతారాలలోకి మనం లాగేసుకున్న బుద్ధుడి అవతారమూర్తి గాథల్లో ఈ రావిచెట్టుకు అద్వీతయమైన 'బోధివృక్షం' స్థాయి కల్పించడం హైందవుల గడసరితనానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. 
విష్ణువుకు తులసీ దళం ప్రీతి. నిత్య తులసీ దళ మాల గళధారి  ఆ లక్ష్మీనాథుడు .  మన్మథుడు తులసీ పత్రాలతో అల్లిన శరాలనే తన లక్ష్యాల పైన ప్రయోగించేది. మదనుడి అమ్ముల పొది వివిధ రకాలైన పుష్పబాణాదులతో నిండి ఉన్నట్లు ప్రబంధ కావ్యాల నిండా వర్ణనలే వర్ణనలు!  
ఆరోగ్య క్షేత్రంలో వృక్షజాతికి అగ్ర తాంబూలం అందించింది ఆయుర్వేదం.  ఆ చికిత్సా విధానం  అంటేనే వృక్ష సంతతికి చెందిన వనరుల ప్రయోజనాల ఏకరువు.  క్షీర సాగర మధన కథనంలో సముద్ర గర్భం నుంచి వెలికివచ్చిన కల్పవృక్షం కథ అందరికీ సుపరిచితమే కదా!
ప్రాచీన సాహిత్యం మీదనే కాదు సుమా.. ఆధునిక నాగరికత పైన కూడా చెట్టూ చేమకు గల  పట్టు సామాన్యమైనది కాదు. ఉదకమండలం మొదలు, కలకత్తా చండీగఢ్ తాలూకు వృక్ష  సంబంధమైన తోటలు, బెంగుళూర్ లాల్ బాగ్, మైసూర్ బృందావనం, కశ్మీర్ శ్రీనగర్ మొగలాయీ ఉద్యానవనాలు, దిల్లీ రాష్ట్రపతి భవనం ఆవరణలోని అలంకార వనాలు.. ఇట్లా  చెప్పుకుంటూ పోతే అంతూ పొంతూ లేనంత పెద్ద జాబితా భారతదేశంలోని పచ్చదనాల కథా కమామిషూ. 
 ఆంధ్రదేశంలోని తిరుమలవాసుని సేవకై పెరిగే వినియోగపు పూల తోటల కథ మరీ ప్రత్యేకమైనది. దేవతా విగ్రహాల స్థానే దేవతావృక్షాలను స్థాపించే సంప్రదాయానికి దేవాలయ వాస్తు, శాస్త్ర సూత్రాలు ప్రస్తుతం దారి చూపించడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆచారంలో ఉన్న కొన్ని తోటలు నాటే విధానాన్ని స్థాలీపులాక న్యాయంగా పరిశీలించే ప్రయాస మరో సందర్భంలో చేసుకోడం సముచితం. 
-కర్లపాలెం హనుమంతరావు
13 -12 -2019, బోథెల్, యూ.ఎస్





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...