Sunday, December 15, 2019



 ఇప్పటి అయ్యేయెస్సుల వ్యవహార శైలి ఒకప్పటి సమాల్ రామచంద్ర సార్ ఉదంతం గుర్తుకు తెప్పిస్తుంది. అదికారుల అవినీత పురాణాల మీద  ఆయనగారు బైటపెట్టిన భాగోతంజంగానే గారెలకన్నా రుచి. బాధితులంతా కలసిపోయి సమాల్ సార్ మీద ఓ పిచ్చోడి ముద్ర కొట్టి రాష్ట్రం బైటికి నెట్టేసే దాకా నిద్రపోలేదు అప్పట్లో. ఇప్పుడు నడుస్తున్న అధికారుల దూకుడు చూసినా మరోసారి ఆ సారుగారి చాదస్త ప్రవచనాలే జ్ఞప్తికొచ్చేస్తాయ్!

నాలుక చివర్న నేతి బొట్టేసి నాకవద్దంటే   ఎంత సాధుపుంగవుడికైనా సాధ్యమవుతుందా? నీటిలో ఈదే చేప తాగే నీరు ఏ మాత్రం మోతాదులో ఉంటుందో లెక్క గట్టి ఓ సూత్రం సిద్ధంచెయ్యమంటే  పైకెప్పుడో వెళ్ళిపోయిన ఆ నోబెల్ మేధావి సర్ రామానుజమైనా  నోరు మెదపలేడు.  అర్థశాస్త్ర విజ్ఞానంలో ఎంతో పాండిత్యం వలకబోసిన ఓనాటి చాణక్యుణ్ని తెచ్చి సర్కారు ఖజానా ముందు కుదేసి చూడండి.. నో  యూజ్! సమాల్ సార్ తన నివేదికలో పదే పదే ఢమాల్ ఢమాల్మంటూ వర్ణించిన మాయావిలాసాలు ఆనాడు భగవానుడు ఎత్తిన పది అవతారాలను తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు. కాకపోతేక్కటే తేడా! పరమాత్ముడు ఎత్తిన అవతారాల లక్ష్యం ధర్మసంస్థాపనార్థం.    మన అధికారులు ఎత్తుతున్న అవతారాలు స్వార్థానికి చేసుకునే ధనసంపాదనార్థం!
ఏసిబి దాడులప్పుడో, సిబిఐ, ఈడీలకు దొరికినప్పుడో సదరు అవినీతి అధికారిని మనం ఒక చేపతో పోలుస్తాం. ఎప్పుడూ చిన్నచేపలేనా దొరికేదీ?’ అంటూ  ఆ మధ్య అధికారుల సంఘం సమావేశమొకటి పెట్టి మరీ తెగ ఆవేశపడ్డ  ఘట్టం చూస్తే 'మత్స్యావతారం' గుర్తుకురాకుండా ఉంటుందా? చిన్ని చిన్ని చేపలే ఎప్పుదూ వలలకు చిక్కేది. బడా బడా తిమింగలాలకు మింగే నెట్ వర్క్ వేరేగా  ఉంటుంది. ఆ మాత్రం ఆర్థిక సూత్రాలు ఆ పెద్ద పెద్ద బుర్రలకు తట్టవనా? పాడు కడుపు ఆత్రం బైటపడనంత కాలం.. తట్టలో రొయ్యలు ఖాళీ అవుతున్నా అంతా అయ్యవారలే!
ప్రభుత్వ పథకాలు నడిపించే డ్యూటీ నడ్డి మీద కొచ్చి పడ్డప్పుడు చాలామంది అధికారులు కూర్మావతారం ఎత్తేస్తారు. ఎత్తరా మరి? సర్కారు వర్కంటే మూడు మంధర పర్వతాలకు మించిన భారం కదా! సార్ల నడక పెళ్ళి కూతురు మోడల్లో మందంగా ఉండక ఛస్తుందా? అదే ఇంధనం పడిందనుకోండి!  తాబేలు- కుందేలుహానీలో మాదిరి కుందేలు కన్నా ముందే గమ్యం చేరే కూర్మం రోల్ మోడల్’  యిపోతుందా అధికారికి!
'పెద్దల ప్రమేయం ఏమీ లేకుండానే అంతా అధికారులే చేసే ప్రజాస్వామ్యమేనా మనది?' అంటూ అన్ని దారులూ మూసుకుపోయిన తరువాత అధికారులు నోరు తెరిచి తీసే కూనిరాగాల కచేరీకి  ఒక వేదిక ఎప్పుడూ  తయారుగానే ఉంటుంది. ఆ బురదజల్లుడు కార్యక్రమంలో అధికారిది  'వరాహమూర్తి' అవతారం! ఈ వరాహమూర్తుల 'నోట్' లో నోట్ పెట్టినందుకే అప్పట్లో సమాల్ సాబ్ అంతలా కమాల్ చేసినా పిచ్చివాడుగా మాత్రమే చివరికి చరిత్ర పుటలకెక్కింది!
అధికారులందరిలో కామన్ గా కనిపించే  సామాన్యగుణం అతివినయం. పై వాళ్ల ముందు ప్రదర్శించే ఆ ధూర్త లక్షణం.. తన కింది వారి ముందుకు వచ్చేసరికి దూర్వాసుని వారసత్వపు దుర్లణంగా మారిపోతుంది. ఆ బాపతు అరసింహావతారాలు  'దశావతారాల' తాలూకు 'నరసింహావతారాలకు  నకళ్లు!
పొట్టి సంతకంతో పని నడిపించే అధికారులు వామనావతారులు. గిలికే హస్తాక్షరి పొట్టిది అయితేనేమి.. రెండడుగులతో భూమ్యాకాశాలను ఆక్రమించి  మూడో అడుగు ఎవరి  మాడు మీద వేసి  బలిని మాదిరి పాతాళానికి తొక్కేద్దామా అని ఎదురు చూసే   వామనాతారులు  ఈ బాపతు అధికారులు!
ఒకే నోట్.. ఒకే పార్టీ! 'ఒకే బాణం.. ఒకే భార్య' తరహాలో సాక్షాత్ ఆ మర్యాదారామచంద్రుల దారిలో నడుచుకునే బుద్ధిమంతులూ  కద్దే అదికారుల్లో! కానీ..  అయితే ఆ కొద్ది మంది ప్రవర్తననూ అస్తమానం అనుమానంలో పడదోసే  అమర్యాదారాముల లెక్కే అధికం అధికారుల వర్గంలో! మర్యాద బాపతు ఆఫీసర్ల సరుకు ప్రజారాముళ్లకు ప్రతిరూపాలయితే .. అమర్యాద బాపతు సార్లకు మాత్రం 'ఆత్మారాముల' సంతృప్తి మాత్రమే పనికి వచ్చే ప్రధాన సూత్రం.

నీతిగా పనిచేసే అధికారులు అసలే లేరంటే అపార్థం చేసుకున్నట్లవుతుంది. కానీ.. అధికశాతం అధికారుల్లో మనీ 'పరసురాముళ్ళ'  శాతమే ఎక్కువని ఇన్నేళ్ల మన ప్రజాస్వామ్య ప్రభుత్వాల అనుభవాలు  ముక్కు గుద్ది మరీ చెప్పే సుపరిపాలన సారం!
ఆయుధం పట్టకుండా కథ నడిపించగల కృష్ణావతారులూ అధికారుల్లో కోకొల్లలు. 'చెలుల చీరెలు దోచి.. చెల్లి చీరెను కాచి.. చేసెనే లాలూచి' అంటూ ఆరుద్రగారు ముద్ర గుద్దినట్లు మరీ చెప్పిన కూనాలమ్మ పదాలకు ఈ బాపతు కృష్ణావతారులు ఉదాహరణలు! గిట్టుబాటైతే రాయబేరాలు నడిపించడం, అవసరార్థం చక్రాలు అడ్డుపెట్టడం ఈ అవతారంలో అధికారుల గడసరితనం. ఆయా లీలా మాయావినోదాలలో పాలుపంచుకున్న ఈ కృష్ణుళ్ళల్లో ఏ సారైనా    నోరు తెరిస్తే నికృష్ట 'భువన భాండంబు' లెక్కలు బైటకుపొక్కేస్తాయ్! ఏనుగుకుండే అసాధారణ జ్ఞాపకశక్తి ఆయుధంగా వాడగలిగే   అధికారులను అందుకే పదవీ విరమణల పిదపా సర్కార్లు ఏదో ఓ  సలహాదారు పదవి పేరుతో ఏనుగు లాంటి కార్ల మీదెక్కి  మరీ ఊరేగే అవకాశం దయచేసేది!
జీత భత్యాలిచ్చే పదవుల నుంచి విరామం లభించినా ప్రభువుల భృత్యు సేవ నుంచి విముక్తి దొరకని అధికారులు 'బుద్ధావతారం' కోవకి చెందుతారు. సర్కారు జీవోలు వీరికి కంఠోపాఠాలు.  నేతల జాతకాలు కరతలామలకాలు! జ్ఞాన సముపార్జన అవసరానికి మించి  అధికంగా సాధించిన ఈ ప్రభుద్ధులకు ఏదో ఓ పీఠం కట్టబెడితేనే 'బుద్ధులకు' మల్లే  పద్ధతిగా మసలుకొనేది. ఎంత విలువ’ అయినవైనా సరే బుద్ధావతారుల ఉచిత సలహాల సర్కారు పెద్దల  మనుగడకు ఎప్పటికప్పుడు చాలా  అవసరం ప్రజాస్వామ్యంలో.
ఏ అవతారం అచ్చిరాకుంటే అధికారి ఎత్తే ఆఖరి అవతారం 'కల్క్యావతారం'. మునుపు ఆ సమాల్ సార్  చివరకు ఎత్తింది ఆ అవతారమే!   మొన్నీ మధ్యన కృష్ణారావుగసారు ఎక్సెట్రాలు పట్టిన బాటా అదే. గిట్టనప్పుడూ, గిట్టనివాళ్లు గద్దెలు ఎక్కి, దిగినప్పుడూ రూల్సు అనే కరవాలాలు ఝళిపిస్తో అధికారం అనే అశ్వం అధిరోహించి మరీ కదన రంగానికి ప్రత్యక్షంగా ఎప్పుడు కదలివచ్చేస్తారో ఆ పోస్టులకు రికమండు చేసిన శక్తులకూ తెలియదు!
భగవంతుని ఏ అవతారమైనా ఆఖరి లక్ష్యం  ధర్మ సంస్థాపనే కదా! కాకపోతే  దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ  ప్రజాస్వామ్య ధారావాహికంలో ఎవరు ఎప్పుడు దుష్టులుగా.. ఎవరు ఎందుకు విశిష్టులుగా  మారిపోతారో అంతుబట్టకే ఓటేసే బోడి మల్లయ్య బిక్కచచ్చి బుర్రగోక్కుంటూ కూర్చునుండేది చేసేది మరేమీ చేతిలో లేక!
***
కర్లపాలెం హనుమంతరావు
(కౌముది - అంతర్జాల మాసపత్రిక ( 'చుట్టు పక్కల చూడరా'- కాలమ్) ఏప్రిల్, 2012 ప్రచురితం)
-

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...