చలం అంత అపార్థం చేసుకోబడిన రచయిత తెలుగులో మరొకరు లేరంటారు. నాది కూడా ఒక సందర్భంలో.. ఒకానొక వయసులో అదే మానసిక స్థితి. అస్సలు చలం పుస్తకం కనిపిస్తే చాలు మొహం వికారంగా పెట్టి పక్కకు నెట్టేసిన వాడిని. These all are of because of our preoccupied positions on so called Social stigma prevailed at that particular period.. అన్న తెలివిడి బలిసిన తరువాత ఒక్కొక్కటే అజ్ఞాన ద్వారం వెనకటివి మూసేసుకుంటూ ముందుకు పోయే గుణం మార్క్సిజం నేర్పిన తరువాత ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా వాత్సాయన కామ సూత్రాలనుంచి రాహుల్ సాంకృత్యాయన్ వరకు అందుబాటులోకి వచ్చినవన్నీ సంపూర్ణంగా చదివి సాపేక్షికంగా తుల్యమానం చేసుకొని సంతృప్తి చెందిన తరువాతనే ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పరుచుకోవాలని తెలుసు కున్నాక మళ్లీ ఒక్కొక్కటిగా చలం పుస్తకాలు తెరిచి చదవడం మొదలు పెట్టింది . అప్పటిక నా బుద్ధికి అర్థమయిన విషయం ఏవిటంటే.. చలం ఆశయం ఇప్పటి సామాజిక దృష్టి కోణంతో చూడగలిగితే కచ్చితంగా గొప్పదే. స్త్రీలవరకు ఇప్పటికీ జరుగుతున్న దైహిక, మానసిక దోపిడి అక్షరాలా సత్యమైనదే. కాకుంటె అప్పటికింకా ఇప్పటి దానిలో ఐదో శాతమైనా వికసించని సమాజానికి తప్పని అనిపించడమూ సహజమే అనిపించింది. చలం ఎక్కుపెట్టిన అస్త్రాలన్నీ ఎక్కువగా 'బ్రాహ్మణవాదం' మీద. ఇహ సహి స్తుందా చాందస లోకం? అదీ కాకుండా ఆయన మరీ దురుసుగా 'ఆపరేషన్ క్లీన్' కి తలపడ్డాడేమోనని నాకనిపిస్తుంది.
అదే భావజాలం కొడవటిగంటి కూడా వెలిబుచ్చుతూనే తెలివైన గడుసుదారిలో చురకలు, హాస్యం అనే చమ్డాకోలు తోళ్లను అదిలిస్తూ ముందుకు పోవడం మనం గమనించవచ్చు. కొకును ఇష్ట పడుతూనే చలంని అసహ్యించుకోవడం వెనక చలం జీవన సరళి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చును. ఆయన ఏమయితే చెప్పదలిచాడో అది అందవలసిన వారికి అందక పోవడానికి, అందించవలసిన మధ్యవర్తులకు అందించడానికి జంకడానికి కారణాలు చలం ఎన్నుకున్న సామాజిక చట్రం సమ్మతించని నైతిక చట్రంలో ఇమడకపోవడమే! వ్యక్తిగా వాటిని పక్కన పెట్టి చూస్తే చలం ' చెప్పింది ఒకటి..చేసింది ఒకటి జాతికి ' చెందిన వాడు కాకపోవడం హర్షించదగిన విషయమేగా! నాటి ఎంతోమంది కవులు ప్రసిద్ధ రచయితలు వ్యక్తిగత, ప్రవచన జీవితాలు పరస్పర విరుద్ధంగా ఉండటం గమనించవచ్చు. చలం భావనలు ఎంత తీవ్రమైనవో వాటి వ్యక్తీకరణల స్థాయికూడా అంతే తీవ్రంగా సాగింది. ఆయన భావాలు సున్నితంగా ఉన్న సమయంలో ఆ వ్యక్తీకరణలు అంతే సున్నితంగా సాగిన విషయమూ మనం గమనించాలి. చలం గీతాంజలి అవడానికి ఠాగోర్ రచన మూలమే అయినా ఆయన తనదైన ఆత్మతో దానిని మళ్లీ తెలుగులో వెలిగించాడు. చలం గీతాంజలిలోని ఒక్కో శబ్దం స్వయం పూర్ణం.. స్వయం సంశోధితమార్గం.. స్వయం శోభిత దుఃఖ సంక్షుభిత సందిగ్ధ ఆత్మార్పణ ప్రయత్నం.
నా నలభైలలో నేను గీతాంజలి చదువుతున్నప్పుడు రోజుకు ఒక్క పద్యం మాత్రమే చదివే వాడిని. దానిని తిరిగి నా డైరీలో చూడకుండా రాసుకొనేవాడిని. ఆ ట్రాన్సులో ఉన్నప్పుడే నాదైన సొంత పద్యం నా డైరీలో రాసుకొనేవాడిని. అన్ని పద్యాలకూ అన్ని నా సొంత పైత్యాలు రికార్డులో నా దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. చలం మ్యూజింగ్సుతో మొదలు పెట్టండి వీలైతే మళ్లీ చలాన్ని చదవాలనుకునే వారు ఎవరైనా. ఆ మైదానం వంటి నవలలు ఇప్పుడు కేవలం అపార్థం చేసుకున్న చలాన్ని మళ్లీ అర్థం చెసుకునేందుకు మాత్రమే పనికొస్తాయి కానీ.. సమాజం అర్థమయేందుకు పనికి రావు. They are all out of context now! చలం ఊహించిన దానికన్నా బాగా ముదిరి పోయింది ఇప్పటి కాలం!
⁃ కర్లపాలెం హనుమంతరావు
⁃ 13 - 12 - 2019
⁃ బోథెల్ ; యూ . ఎస్
No comments:
Post a Comment