మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
సతీమణి ఉల్లిపాయలు కొనేందుకని బ్యాంక్ అప్పుకోసం వెళ్లినట్లు వార్త!
మామూలు మధ్యతరగతి మహిళామణి మరి కప్పు పంచదార కోసం ప్రపంచ
బ్యాంకు అప్పు కోశం వెంటబడి రొప్పుకుంటూ పరిగెట్టాలేమో! కిలో బియ్యం రూపాయికి ఇస్తామన్న
ఎన్నికల హామీ సాకారం చెయ్యడానికి మన పాలకులు పావుకిలో ఉల్లి పాతిక రూపాయలు పైగా పెంచేశారు. ఎక్కడెక్కడో ఉగ్రవాదులు బాంబులు పెట్టేస్తున్నారన్న వార్త విని బెంబేళ్లెత్తడం ఆనక! ముందు మన రైతు బజారుల్లో
పేలుతున్న కూరగాయ ధరలకు అప్రమత్తం అవండి బాబులూ! ఉప్పు బాంబో, మిరప
బాంబో పేలిందంటే బాబోయ్.. దేశమంతటా ఒహటే భీభత్సం! శాంతిభద్రతల అంశం ప్రశాంతంగా చూద్దురు
గానీ.. ముందు ఆహారభద్రత వశం తప్పుతోంది అంకుశం ఎక్కడుందో వెతుక్కు రండి సాములూ!
అరేఁ! ఉల్లి దోశ తినాలన్నా
ఏ బిర్లా కడుపునో పుట్టి తీరాలా? టాటాగారూ! ఎట్లాగూ ఆ 'కారు లక్ష' స్కీములో తమరు ఫెయిలయిపొయ్యారు గదా!
పోయిన వరువు తిరిగి పుంజుకునే స్కీము.. కరేపాకు రెబ్బ కనీసం రూపాయికి ఒకటైనా దొరికే ఉపాయమో కనిపెట్టడమే!
అమరావతులు, ఆర్టీసీ ప్రయివేటీకరణలూ
ఎట్లాగూ వట్టి గాలి కబుర్లేనని తేలిపోయాయి గదా! ఉపాధులూ, ఉపకార
వేతనాలూ, ఉద్యోగాలతో ఎట్లాగూ గట్టెక్కే పరిస్థితులు లేవు
గానీ.. ఉప్పుకారాలు, ఉల్లి మసాలాలు వంటి వంటింటి పచారీ సరుకుల వైపు నుంచైనా నరుక్కురండి
సారులూ.. ఏదో వేళకు ఎప్పుడూ ఏ మూలనో ఓ ఎన్నికల మేళం మోగే మన దేశంలో ముఖ్యంగా కూరగాయ
ధరవరలతో వేళాకోళాలు వద్దు మహాప్రభో! కొత్తిమేర కట్ట కోసం కొంప కప్పు ఎక్కి ఇంటిల్లాలు కొప్పు బిగించిందంటే
సర్కార్ల ఇమేజికే రిపేరు చేయలేని డేమేజి మరి! అరవై పెడితే తప్ప అరకిలో
ఆలుగడ్డలు సంచీలో పడని గడ్డ మీద నేతగా నిలబడ్డందుకు సిగ్గుతో తలొంచుకునే ఖర్మ
చేజేతులా తెచ్చుకోవద్దు పెద్దలూ! ఎన్నికలంటూ నిజాయితీగా జరిగితే ల్యాండ్- సైడ్ విజయం కాదు.. ఈ ధరల దెబ్బకు నిలబడ్డ నేతలంతా
ధడేల్మంటూ నేల కూల ఖాయం! వెయ్యో రెండున్నర వెయ్యో చేతిలో వెయ్యమంటే ఎప్పట్లా కోయంబత్తూర్ సరుకుతో తయారైతే
చాలదయ్యా సామీ! ఈసారి ఆసామి ఇంటికో తాజా కూరగాయల గంప దింపి పొమ్మంటే .. నా సామి రంగా !
తనరు కొంప గంగలో మునగడం ఖాయం.
తనరు కొంప గంగలో మునగడం ఖాయం.
వంకాయ కిలో వంద లెక్కన కొనే స్తోమతు కూడక తేరగా వచ్చిన మంచి అమెరికా సమ్మంధానికి మంగళం
పాడేసుకుంది మా మంగమ్మక్కగారు తన బంగారు కూతురుకు! కాలూ చెయ్యీ చక్కంగా ఆడుతున్నా ఆ ఆస్ట్రేలియా ఖండం దాకా పాకుతూ
దేకుతూ పడిపోవాల్సొచ్చింది మా చెంగయ్యమామ తన పెద్ద మనమడి దగ్గరకు మనసారా ఉలవచారు నీళ్లు తాగడానికి!
చెప్పుకుంటూ పోతుంటే మరీ అతి అనిపించే ఇట్లాంటి కన్నీటి కహానీలు కడవలు.. బుంగలు!
మా దోస్తు పరమేశం
శాస్తురులు గాడింట్లో దొంగలు పడి.. గ్యాస్ బండతో సహా ఫ్రీజర్లో దాచుకున్న పది
కిలోల వెజిటబుల్స్ మొత్తం తట్టతో సహా మాయం చేసేసాడు.. దాచుకున్న బీరువా బీగాలు ఆ ఫ్రిజ్జు
పక్కనే పడేసున్నా! ఆ దొంగ వెధవ ఎవడో గాని కూరగాయల మీద చూపించిన కక్కుర్తి
మరి కంచి పట్టు శారీలు, శాలువల మీద కూడా చూపించించాడు కాదు!
కాశీ దాకా పోయి తినే కంచం ఏ గంగలోనో కలిపొఛ్చే విరాగులకే తప్పించి.. రోజుకో గజం చొప్పున ఆకాశానికి ఎగబాకే ఈ
కూరగాయల ధరలతో సంసారులకైతే చచ్చే చావే!
నాలుగు చినుకులు రాలితే ధరలన్నీ వాటికవే
నీరుకారిపోతాయనే స్వామి ప్రబోధానందుల మార్క్ ధర్మోపన్యాసాలు వినేటందుకేనా పుంజాలు
తెంపుకుని మరీ సామాన్యులమంతా పోలింగు నాడు వేనులూ, రైళ్లూ, బస్సులు
పట్టుకొని మరీ సొంతూళ్ల దాకా వెళ్లాడుతూ వచ్చి నచ్చిన నేతలను ఎన్నుకొనొచ్చింది! జగన్నాథ
చక్రాలను ఆనక తీరిగ్గా భూ మార్గం పట్టించే మార్గం ఆలోచిద్దురు గానీ.. బాబ్బాబులూ! ముందర్జంటుగా
ధరాచక్రానికి దొరక్కుండా నభోంతారాళకి దూసుకెళ్లే అపరాల ధరల స్పీడునైనా కాస్తింత ఆపే చాతుర్యం చూపెట్టండయ్యా సర్కారు సాములార్లూ! మీ దేశభక్తి కూలా! ధరల అదుపును మించిన దేశ
భక్తి భావన జనం మనసుల్లో ప్రస్తుతం మరోటి ఎక్కడేడ్చిందీ! ఒక్క పూట వరకైనా చూరు కింది నాలుగు నోళ్లలోకి రెండు వేళ్లూ వెళ్లే సదుపాయం మించిన ప్రజాసేవ మరోటి
లేనేలేదు మహాశయా!
ఆనాడు ఆ వేములవాడ భీమయ్య కవి
ఏమని తిట్టిపోసాడో గానీ… ఇప్పుడు నిజంగానే కంచంలోని అన్నమంతా సున్నంలాగానూ, అప్పాలన్నీ
కప్పల కుప్పలుగానూ కనిపించి ఏమీ నంజక ముందే కడుపులు నిండిపోతున్నాయ్! సింగిల్ ప్లేట్ మీల్స్ కోసం
డబుల్ బెడ్రూం కొంపలు కూడా కుదవపెట్టుకోవాలసిన రోజులొచ్చేస్తున్నాయ్! బ్యాంక్
లాకర్లలో భద్రం చేసిన సిరి సంపద అంతా
బైటికి లాగేసి వాటి స్థానంలో ఓ నాలుగు కరివేపాకు మండలు,
మూడు మునక్కాయ కాడలు దాచుకుంటే తప్ప రాబోయే రోజుల్ని ఈ మాత్రమైనా
కాచుకోవడం మహా కష్టమే అని మా బెంగేస్తున్నది మిత్రమా!
-కర్లపాలెం
హనుమంతరావు
(ఈనాడు-
సంపాదకపుట-28, డిసెంబర్, 2010)
No comments:
Post a Comment