బాబ్రీ
మసీదు కూల్చివేత పట్టపగలు.. కొద్ది మంది మతవాదుల దుందుడుకు ఆగడం. రాజ్యాంగ
అధికరణం 370 రద్దు ఓ
ప్రజాస్వామ్య ప్రభుత్వ అర్థరాత్రి అతిరహస్య ఎత్తుగడ.
రెండు ఘటనలకు ఎన్ని సమర్థనలో.. అంతకు మించి ఖండనలు!
చారిత్రిక తప్పిదాలను సరిదిద్దిన సాహసోపేత సంస్కరణలుగా సంఘ్
పరివార్, వారి తైనాతీల వాదనగా ఉంటే..
మతాతీత దేశానికి అతకని ముతక పోకడలుగా ప్రజాస్వామ్యవాదుల నిరసన! ఒక కూల్చివేత ఘటన పూర్వాపరాలు పంథొమ్మిది
వందల తొంభై నాటి వాతావరణానికి ప్రతీక. మరో
కొట్టివేత సన్నివేశం వెనుకా ముందు నాటి పరిస్థితులు రెండువేల
పంథొమ్మిది నాటి స్థితిగతులకు
నిదర్శనం. మధ్య ఉన్న దాదాపు మూడు దశాబ్దాల కాలంలో దేశం ‘మూడ్’
ఏ విధంగా మారిందన్నది చరిత్ర పరిశోధకులలో ఆసక్తి
ర్రేకెత్తించే అంశం.
బాబ్రీ మసీదు కూల్చివేత
నాటికి ధర్మకుమార్ దిల్లీ స్కూల్
ఆఫ్ ఎకనామిక్స్ లో
ఎకనామిక్స్ ప్రొఫెసర్. హిందూ మితవాదం, కమ్యూనిష్టు
భావజాలం.. రెండిటి పట్లా ఒకే తరహా వైఖరి ఆ స్త్రీ మేధావిది. ఒక మతానికి చెందిన ప్రార్థనాలయం
మరో మతవాదుల మూకచేష్టల కారణంగా కూలడం సహజంగానే మతసామరస్యం కాంక్షించే ఆ విద్యాధికురాలి
మదిలో ఆవేదన రగిలించింది. కూల్చివేత
ఘటనపై అప్పటికప్పుడు ఒకానొక ప్రముఖ
దినపత్రిక మొదటి పుటలో ఓ సుదీర్ఘ ప్రకటన రూపంలో స్పందించారా చైతన్యశీలి. ‘మరో ప్రార్థనాలయం కూల్చివేత హిందూ స్వాభిమానాన్ని
ఏ విధంగా పునరుద్ధరిస్తుందో ముందు తేలాలి. జాతిగౌరవం ఏ మోతాదున పెరుగుతుందో,
దేశ సమగ్రత ఏ తీరున పటిష్టమవుతుందో వివరించాలి!' అంటూ విధ్వంసకారుడిని నేరుగా నిలదీస్తూ సాగే ఆ నిరసనలో
ఆద్యంతం నిండి ఉన్నది ఆనాటి సగటు భారతీయుడి మదిలో ర్రగిలే ఆందోళనే. మత ప్రాధాన్యత అధికంగా
ఉండే సున్నిత అంశాలు కొన్నింటి పట్ల ప్రదర్శించే దురుసుతనం దేశ
అస్థిరతను మరంతగా విస్తరిస్తుందని,
ప్రపంచం ముందు ప్రజాస్వామ్య
దేశానికి తలవంపులు తెస్తుందని, భావితరాల జీవితాలలో వృథా
ఉద్రిక్తతలను పెంచుతుంద’ని ఆ ప్రొఫెసర్
ఆవేదన. నిరసనతో కలగలసిన ఆ ఆవేదన ధర్మకుమార్ ఎంతో ధైర్యసాహసాలతో బహిర్గతం చేయడం ఆనాటి ప్రజాస్వామిక స్వేఛ్ఛాయుత వాతావరణానికి సంకేతంగా
భావిస్తే తప్పేముంది? మొదటి
పుట నిండా నలుపు రంగు పులుముకొని పైన తెల్లటి అక్షరాలతో కొట్టవచ్చినట్లుగా
ఓ నిరసన ప్రముఖ దినపత్రికలో దర్శనమివ్వడం ఈ
కాలపు రాజకీయ విలువల దృష్ట్యా నిజంగా ఓ అద్భుతమే.
ఆ ప్రకటనకు మద్దతుగా అప్పటి మేధోవర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు,
బ్యురోక్రాట్లు, పాత్రికేయులు, వివిధ రంగాలలో పేరొందిన ప్రముఖులు ఎందరో మద్దతుగా నిలవడం, పంథొమ్మిది మంది ప్రముఖుల సంతకాలతో ఆ నిరసన ప్రకటన వెలువడడం పెద్ద చర్చకు దారి తీసిందంటారు అప్పట్లో.
ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ ఐ.జి.పటేల్ నుంచి మాజీ చీఫ్ ఆఫ్
ఆర్మీ స్టాఫ్ కె.సుందర్ జీ వరకు సంతకాలు చేసినవారంతా
నాటి సమాజం దృష్టిలో ఎంతో విశ్వసనీయులు! ఖర్చులు భరించి తానే జారీ చేసిన ప్రకటన కాబట్టి ధర్మకుమార్ విలువలకు కట్టుబడి స్వయంగా సంతకం
చేసారుకాదు. సంతకాలు
చేసిన ప్రముఖులలో ఆర్.పి.గోయెంకా, రాజ్ త్యాగరాజన్, దేశ్ బంధు గుప్తా వంటి వ్యాపార దిగ్గజాలూ కనిపించడం ఏ విధంగా సాధ్యమయింది?! ఈ
కాలం తరహాలో ధర్మకుమార్ ధర్మాగ్రహం ఏ హిప్పీ కటింగ్ కమ్యూనిష్ట్ చిల్లర 'కుట్టుపని' కిందనో ఎందుకు వెక్కిరింతలకు గురికాలేదు?! గత మూడు దశాబ్దాలుగా
కేంద్ర ప్రభుత్వాలను నడిపించిన పాలక పార్టీల
దృక్పథాలలో క్రమంగా వస్తోన్న మార్పుల నుంచే ఈ సందేహాలకు సరైన సమాధానాలు దొరికేది.
ఈ మూడు
దశాబ్దాలకు మూడేళ్లు ముందు ప్రస్తుతం నడుస్తున్న 2019, అగష్టు,
5 సోమవారం భారత రాజ్యాంగం
కశ్మీరు లోయ వాసులకని ప్రసాదించిన స్వయంప్రతిపత్తి సౌకర్యానికి గండి కొడుతూ ఆర్టికల్ 370 అర్థరాత్రి నిశ్శబ్దంగా
నిర్వీర్యమయింది! స్వీయపాలన ‘వద్దు.. మాక’ని స్థానికుల నుంచి కించిత్తైనా వత్తిడులు
లేవు. అధికరణ కారణంగా బాధితులం అవుతున్నట్లు ఏ వర్గ సమూహపు మొత్తుకొళ్ళూ వినిపించవు!
ప్రజలిచ్చిన అధికారం ఒక్కటే పాలకపక్ష అప్రజాస్వామ్య
చేష్టలకు ఊతం! ఆ నాటి ఎకనామిక్స్ ప్రొఫెసర్ ధర్మకుమార్ దారిలోనే నేడూ ప్రజావ్యవస్థలకు
రక్షణగా నిలబడ్డదలచినవారు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా ప్రశ్నిస్తేనో? ప్రశ్నల పర్యవసానాల సంగతి పక్కనుంచి..
ప్రశ్నించే పరిస్థితులు దేశంలో అసలు
ఎంత వరకు బతికున్నాయన్నదే ప్రస్తుతం ప్రధానంగా ముందుకొస్తున్న
ప్రశ్న.
ప్రజాస్వామ్య పంథాకి
పెడగా ప్రభుత్వాల అడుగులు పడుతున్న ప్రతిసార్రీ గల్లాపట్టుకు నిలదీసే గుండె నిబ్బరం కోటికి ఎక్కడో ఒకరికైనా ఉందా? ఉందనే మాట వరుసకు అనుకుందాం.
ధర్మకుమార్ దారిలోనే
వారి చేతా నిరసన పత్రమొకటి తయారయితేనో?! 'దేశభక్తులంతా
తప్పక ఆలోచించాలి. కేవలం రాజ్యాంగ అధికరణ 370 రద్దు చర్యతోనే
మన జనస్వామ్య వ్యవస్థలన్నీ సుదృఢవుతాయని నమ్ముతున్నారా? సమస్యకు సంబంధించిన ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోని
రద్ధుసంస్కరణ దేశ ఉద్రిక్తతలకు తగ్గ మందుగా మీరు భావిస్తున్నారా? అదే వాస్తవమయితే
మతాతీత కులాతీత ప్రజాస్వామ్య భూమిక పై నిర్మితమైనదిగా జాతి గౌరవించే దేశ రాజ్యాంగం నిజానికి అప్రజాస్వామికమైనదని మీరు ఒప్పుకున్నట్లే! దేశం ఓ మూల భూభాగానికి మాత్రమే
ప్రత్యేక రక్షణ కవచాలు అందించడం అంటే అఖండ భారతావని సార్వబౌమికతను
కించపరిచిందన్నట్లేగా రాజ్యాంగం మీద మీ ఆరోపణ? కశ్మీరు లోయ స్వయంప్రతిపత్తి పట్ల ప్రత్యేక
ఆసక్తి ప్రదర్శించడమంటే అఖిల భారతావని ఇతర
భాగాల బాగోగులపై ఇసుమంతైనా శ్రద్ధ రాజ్యాంగానికి లేదన్నట్లేగా మీ ఫిర్యాదు?' ఈ తరహాలో
సాగే ఆ నిలదీత పత్రం ప్రముఖ దినపత్రికల ప్రథమ పుటలలో ప్రచురించడానికి సిద్ధమయితేనో? ఖర్చులకని
యాచిస్తే గుప్తంగా మద్దతిచ్చే విజ్ఞులకు ఇప్పుడూ పెద్ద
కొదవేమీ ఉండబోదు. కానీ సర్కారును ఇరుకున పెట్టే ఏ ‘డిస్సెంట్ నోట్’ పైనా పెన్ను పెట్టి ‘సైన్’ కొట్టే
దమ్ము ధర్మకుమార్ కాలంలో మాదిరి ఇప్పుడు ఎంతమంది బిగ్-బాసులకుంది?’ అదే బిలియన్ డాలర్స్
ప్రశ్న ప్రస్తుతం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలుగా విశ్వ విపణి వీధులనేలే భారతీయ కుబేరులలో ఎందరో నిజానికి ఉదారభావాలకు పెట్టింది పేరు. ప్రజాస్వామ్య పంథా పట్లా వారికుండే అచంచల విశ్వాసం సాధారణ పౌరుల
అంచనాలకు అందేవికావు. ఆర్టికల్ 370 వంటి పాక్షిక లాభాలు చేకూరే
రాజ్యాంగ అధికరణల పట్ల ప్రముఖులందరికీ ఒకే తరహా అభిప్రాయం ఉండకపోవచ్చు. అందుకు
తప్పు పట్టలేం. చట్టాల పట్ల కన్నా.. ఈ తరహా
బిల్లుల ఆమోద తిరస్కారాలకై చట్టసభలు నడుస్తున్న
తీరు మీదనే ఎందరో ప్రముఖులకు బాహాటంగా చెప్పలేని
బాధా.. ఆందోళన. పాలకవర్గ రాజకీయ ప్రేరిత ప్రణాళికల
కార్యాచారణ విధానాలను అంతర్గత సంభాషణలలో ఎంతగా
తూర్పారపట్టినా బహిరంగంగా మాత్రం తటస్థ వైఖరి తీసుకోక తప్పని దుస్థితి కొందరు పెద్దలది.
పరిథి మీరి మరీ వత్తాసుకు పోక తప్పని ఒత్తిళ్లు మరి కొందరు వ్యాపారప్రముఖులవి. సంపూర్ణ
మౌనమే సర్వదా శ్రేయస్కరంగా భావించి ఓ నమస్కారబాణంతో సరిపుచ్చుకునే సంపన్నుల సంఖ్యే
ప్రస్తుతం దేశంలో ఎక్కువ! కారణం;
ఆర్టికల్ 370 రద్దులోనే లేదు. గద్దె ఎక్కిన
పార్టీల ప్రాయోజిత సర్దుబాట్లు సంస్కరణల ముసుగులో మరెన్నో ముందు ముందుకు తోసుకుని వచ్చే కొత్త తరహా వాతావరణానికి 2019 నాంది కావడంలో ఉంది.
సంతకాలకై ధర్మకుమార్ సంప్రతించిన నాడు .. కేవలం ఒక నిరసన పత్రం పైన పొట్టిసంతకం
గిలికిన కారణానే తమ అండన బతికే వేలాదిమంది రోడ్డున పడరన్న ధీమా భరత్ రామ్, లలిత్
థాపర్ వంటి పరిశ్రమల పోషకుల గుండెల నిండుగా ఉండిన పంథొమ్మిది
వందల తొంభై రెండులు…
అదే మాదిరి గుండె నిబ్బరం మాజీ ఆర్థికశాఖామాత్యులైన శ్రీమాన్ చిదంబరానికే ఉండని
రెండువేల పంథొమ్మిదులు…
దాదాపు మూడు దశాబ్దాల మధ్యన పరుచుకున్న దేశ రాజకీయ, పాలనా
వ్యవస్థల పని తీరుల్లో కనిపిస్తున్న మార్పులను గమనిస్తే దేశం ‘మూడ్’
‘బ్యాడ్ టు వర్స్ట్’ దిశగా ఎంత వేగంతో
దిగజారుతున్నదో తెలిసి దిగులవుతున్నది ప్రజాస్వామ్య వికాసం పట్ల ఎంతటి ఆశావహ దృక్పథం
గల దేశభక్తులకైనా!
కంటి ముందు జరిగే ఆర్థిక
దాడులు, కుంటి సాకులు ఇరికించే అక్రమ
నేరాల కేసులు, ఊహించేందుకైనా భీతి గొలిపే ఉపద్రవాలు ఇంకెన్ని
ఏ సందు గొందుల నుంచి ముంచెత్తేందుకు సిద్ధమవుతున్నవో అంతుపట్టని ఉగ్ర వాతావరణం మధ్యన
నేటి దేశం అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నది
మరి! లోయకోని జాతులే కాదు..
దేశంలోని అన్ని తరగతులు ఒక్కో తీరున ఒకనాటి దేశ అత్యయిక పరిస్థితులను దాటి శిక్షల గదుల్లో
మగ్గుతున్నాయి.
‘ప్రజాస్వామ్యం పట్ల ఎంతటి ప్రగాఢ విశ్వాసమున్నప్పటికీ ఉదారవాదం ఆచరణలో సదా ఓ మిథ్య మాత్రమే’ అని భావి తరాలు సైతం ఒక శాశ్వత నిరాశ భావన లోనికి జారక ముందే మందలు మందలుగా
మరెంతో మంది ప్రొఫెసర్ ధర్మకుమార్ లు అందుకే పుట్టుకు రావాలసుంది.
-కర్లపాలెం హనుమంతరావు
(సూర్య దినపత్రిక- సంపాదకీయ పుట వ్యాసం)
***
No comments:
Post a Comment