కవిత్వానికి నిర్వచనం ఏమిటి?
కవులెంతమందో కవిత్వానికి
నిర్వచనాలన్ని. అదనంగా సాహిత్య విమర్శకుల శాస్త్రీయ నిర్వచానాలు.
“The best
in the best order is “Emotions recollected in Tranquility” అంటారు శ్రీశ్రీ.
అల్లసాని పెద్దన గారి లెక్క
ప్రకారం కవిత్వం”రాతిరియుం బవల్ మరపురాని హోరు”
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి
గారు ఒకసారి కవిత్వాన్ని గురించి అరగంట మాట్లాడతానని చెప్పి మధ్యాహ్నం 3గంటల్నుంచీ
రాత్రి 8గంటలదాకా ఏకబిగిన ఉపన్యాసం చేశారుట. కవిత్వ పరిధి అంత విస్తృతమైనది మరి.
ప్రపంచమంతా కవితావస్తువే
కదా!’ మరిచి పోయేది చెత్త.. జ్ఞాపకంలో మిగిలుండేది కవిత్వం’ అన్నది కూడా ఆయనే. లోకుల
రసనలే తాటాకులుగా వేమన పద్యాలు తెలుగులోకంలో నేటికీ నిలిచి వుండటమే దీనికి మంచి ఉదాహరణ.
శ్రీపాదకృష్ణమూర్తి గారు
భారతం మొత్తాన్ని ఒంటిచేత్తో పద్యాలుగా రాశారు. చదివినంతసేపూ బాగానే ఉన్నా తిరిగి
చెప్పమంటే ఒక్కటీ చప్పున గుర్తుకు రాలేదంటారు
శ్రీశ్రీ!
విలియమ్ సారోయిన్ ప్రఖ్యాత short
story రచయిత. The Latest Position In Modern American Poetry అని శీర్షిక పెట్టి తనకు తోచినదంతా ఒక క్రమంలో కథగా రాసేవాడుట.కథ పూర్తయిన తరువాత
ఆ శీర్షికను తీసేసి కథకు తగిన Title పెట్టుకోవడం ఆయన
అలవాటు. కథకు కూడా పొయిట్రీనే ప్రేరణ అని చెప్పటానికి ఈ పిట్ట కథ చెప్పింది.
ఇక తెలుగు కవిత్వానికి
వస్తే…
నన్నయగారు ఆదికవి అని
మనందరి అభిప్రాయం. అంటే ఆయనకు ముందు కవిత్వం అసలే లేదా! ఉంది. జానపదుల ప్రపంచం నిండా
ఉండేది కవిత్వమే. కాకపోతే అది గ్రంధస్థం అవడానికి నోచుకోలేదు. ఆ గాసటబీసటలు చదివి
ప్రేరణ పొంది సంస్కరించి వాగనుశాసనుడయ్యాడు నన్నయభట్టారకుడు.
ప్రపంచం అంతటా ఈ ధోరణే
ఉంది. కవిత్వం అంటే అక్షరబద్ధమైనదేనా! Haves poetry(కలవారి
కవ్విత్వం) ఉన్నట్లే లేని వారికీ కవిత్వం ఉంటుంది. అది శిష్టసాహిత్యం కన్నా పాతది
కూడా. నన్నయ గారికన్నా ముందు నదుల్లో నావలు నడుపుకునే వాళ్ళూ, పొలంపనులు చేసుకునే కూలీనాలీ పాటకజనం
నోట నలిగిందీ కవిత్వమే. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి మాటల్లోఅది 'అనాఘ్రాత
వాజ్ఞ్మయం’.
ఇంక ఆధునికతకు వస్తే…
గురుజాడగారు ముత్యాలసరాలు
రాసిందాకా తెలుగుకవిత్వం ధర్మంలాగా పద్యాల్లో నాలుగు పాదాల మీదే కచ్చితంగా
నడిచింది. చంపకమాలైనా.. శార్దూలమైనా రథవేగం సాధించాలంటే నాలుగు చక్రాలే ఆధారం.
అప్పటికి రథవేగం గొప్పది. రైలింజను వచ్చిన తరువాత Horse Power గొప్పయింది. విమానాలు
ఎగరడం మొదలయిన తరువాత వాయువేగం మీదే అందరి దృష్టి. ఇప్పుడయితే రాకెట్ వేగాన్ని కూడా
అధిగమించే ఉపగ్రహాల వేగం తెలిసిందే. పెరిగే వేగాన్ని అందుకోవడానికి కవులకూ
కొత్తకొత్త ప్రక్రియల్లో ప్రయోగాలు చేయడం అవసరం అయింది. నత్తనడకను చీదరించుకునే
కొత్త తరాన్ని అందుకోవడానికి కవులు కనిపెట్టిన అతినవీన అద్భుతం అత్యంత వేగంగా
పరుగులెత్తే వచన పద్యం.
తెలుగులొ 30వ దశకంలొ
ఊపందుకున్న ఈ ప్రక్రియకు పాశ్చాత్య సాహిత్య ప్రపంచంలో అంతకుముందే వచ్చిన ప్రయోగాలు
ప్రేరణ. 30వ దశకాన్ని Hungry Thirties అంటారు.ఇప్పటికన్నా ఎక్కువ
ఆర్థికమాద్యం ముమ్మరించిన కాలం అది. స్పానిష్ సివిల్ వార్ జరిగింది ఆ దశాబ్దంలోనే. ప్రపంచమేధావులు మొత్తం
రెండువర్గాలుగా చీలిన పరిస్థితి. స్పానిష్
యుద్ధాన్ని ఖండిచిన వాళ్ళు కాగితాలతో కలాలతో పోరాటం మొదలుపెట్టారు. రాల్స్
ఫాక్స్ , క్రిస్ట్ ఫర్, కాండ్ వెల్, స్టీఫెన్ స్పెండర్ లాంటి కవులైతే ఏకంగా ఇంటర్నేషనల్ ఆర్మీలోనే చేరిపోయారు. 'కవి అన్నవాడు
కల్లోలప్రపంచానికి దూరంగా కళ్ళుమూసుకుని కూర్చోనుండరాదు’ అన్న భావానికి ఊతం
పెరుగుతున్న రోజులు అవి. ఆ ప్రభావంతోనే శ్రీశ్రీ లాంటి ఉష్ణరక్తపు యువకులు అంతకు
ముందుదాకా రాస్తున్న సాంప్రదాయక కవిత్వాన్ని కాదని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. శ్రీశ్రీ
మహాప్రస్థానంలోని చాలా గీతాలు 30వ దశకంలో రాసినవే. గమనించండి. భావకవిత్వ ప్రచారకుడు
కృష్ణశాస్త్రి కూడా అభ్యుదయ రచయితల సంఘ వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహించారు ఆ
రోజుల్లో ఒకసారి.
1970దాకా ఒక వెలుగు
వెలిగింది అభ్యుదయ కవిత్వం. నూనె ఐపోయిందో.. వత్తి సారం తగ్గిందో.. మెల్లిగా కొడిగట్టడం మొదలుపెట్టింది.
శ్రీకాకుళోద్యమం ప్రేరణతో
విప్లవ కవిత్వం ప్రభ మొదలయింది.
1910 లో తోకచుక్క
రాలినప్పుడు గురుజాడవారు మొదలు పెట్టిన ముత్యాలసరాలు లగాయితు కవిత్వం ఇప్పటిదాకా
పోయిన.. పోతున్న వన్నె చిన్నెలన్నీ చర్చించడం ఇక్కడ అప్రస్తుతం. ఇప్పుడు
నడుస్తున్న కవిత్వానికి మాత్రం అస్తిత్వవాద, వైయక్తివాదాదులే ప్రధాన భూమికలుగా
ఉన్నాయన్న ఒక్క మాటతో స్వస్తి చెప్పుకుంటే సరిపోతుంది.
వరదపోటులాగా వచ్చిపడుతోంది
కవిత్వం ఇప్పుడన్ని దిక్కుల్నించీ. చందోబంధనాలు, వ్యాకరణాల
సంకెళ్ళు వంటి ప్రతిబంధకాలు లేకపోవడం.. భాషాసారళ్యం వల్ల ఎంత సున్నితమైన భావాన్నయినా
కవిత్వరీకరించవచ్చన్న స్పృహ పెరగడం, ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక విజ్ఞానప్రగతి, సంక్షుభిత సామాజిక పరిస్థితులు, గణనీయంగా పెరుగుతున్న చదువరుల సంఖ్యాపరిమాణాలు, ఆత్మగౌరవ ఆకాంక్షలు, అపరిమితమైన భావవ్యక్తీకరణ స్వేచ్చ నేటి
కవిత్వవికాసానికి కొన్ని ప్రధాన ప్రేరణలు, కారణాలు.
కవిత్వం పెరగడం
సంతోషించదగ్గ పరిణామమే. మరి ప్రమాణాల సంగతి? వరదంటూ వచ్చిన
తరువాత మంచినీటితో పాటు మురుగునీరూ కలిసి ప్రవహించడం సహజమేగా! కొంతకాలానికి
తేటనీరు పైకి తేరుకొని.. రొచ్చు అడుగున మిగిలిపోతుందనుకోండి. కాకపోతే మడ్డినీరే
ఎక్కువగా కలిస్తే మంచినీరూ ఉపయోగించకుండా వృథా ఐపోతుంది. అదీ బాధ.
ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే.. అక్షరం అందుబాటులో ఉన్న ఉచిత వనరు కనక కనిపించిన ప్రతిసన్నివేశమూ, అనిపించిన ప్రతి భావావేశమూ ఔత్సాహిక కవులు కవితాలంకరణకు అర్హమైనదే అనుకునే
ప్రమాదమూ పెరిగిపోయింది. విస్తృతమైన అధ్యయనం, సమాజాన్ని సరైన
కోణంలో పరిశీలిస్తున్నామా లేదా అన్న విచక్షణ, వ్యక్తిగతమైన
భావోద్వేగాల పరిమితుల స్పృహ కొరబడుతుండటం వల్ల అకవిత్వమూ కవిత్వం పంక్తిలోకి
జొరబడుతున్నది. వచనకవిత అంటే వచనాన్నే కవితగా అనుకుని రాయడం కాదు. అలంకారరహితం
అంటే.. నిరలంకారంగా రాసుకుపోవడం కాదు. వట్టి స్లోగన్సు కవిత్వం ఎన్నటికీ కాదు.. వాటి
వెనుక ఒక తాత్వికనేపథ్యం లేకపోతే. ‘Workers Of The World..Unite!' శ్రామిక వర్గం మొత్తాన్ని ఏకం చేసిన విప్లవ నాదం. కవిత్వానికన్నా ఎన్నో
రెట్లు ఎక్కువ ప్రభావం చూపించింది. స్పెయినీష్ బార్శిలూనా సమరంలో’లాషాపనారా' (ముందుకడుగు వేయనీయం)అన్న స్పెయినీష్ సోల్జర్ల నినాదం ఆనాటి సమాజంమీద చూపించిన
ప్రభావం అంతా ఇంతా కాదు. పదమా?..నినాదమా? అన్నది ప్రధానం కాదు. అది కవిహృదయంలోని
రసానుభూతిలో మగ్గి బాహ్యప్రపంచాన్ని కదిలించేదై ఉండాలి. ‘కదిలేదీ
కదిలించేదీ/ పెనునిద్దుర వదిలించేదీ’ అని అతిసరళంగా శ్రీశ్రీ నిర్వచించింది ఈ భావాన్నే!
కవికి తన మాట మీద అధికారం
ఉండాలి. చిత్రకారుడికి గీతలాగా, సంగీతవేత్తకు స్వరంలాగా,శిల్పికి శిలలాగా కవికి పలుకు పరికరం. పికాసో అంతటి చిత్రకారుడు ’Probably
I am not an Artist.. I am not a Painter.. I am a Draftsman’ అని
చెప్పుకున్నాడు. కళాకారుడికి ముందు తనను గూర్చి తనకు ఒక కచ్చితమైన అంచనా అవసరం. కవీ
కళాకారుడే కదా!
పోతన.. శ్రీనాథులే ఇందుకు మనముందున్న మంచి ఉదాహరణలు. ’మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు వోవునే మదనములకు?’ అన్న పోతన మంచిపద్యం వినడానికీ వీనులవిందుగానే ఉంటుంది. కానీ.. కవిత్వకోణం దృష్ట్యా చూస్తే మాత్రం ముందు వచ్చే సందేహం.. ’కవి మాటలను నడిపిస్తున్నాడా?.. మాటలు కవిని నడిపిస్తున్నాయా?’ అని. శ్రీనాథుడి
శివరాత్రిమాహాత్మ్యం పద్యం చూడండిః ‘నిష్ఠాసంపదనర్ఘ్యపాణులగుచున్ విపుల్
బ్రశంసింప, మంజిష్ఠారాగము మండలంబున నధిష్ఠింపన్ నిలింపాది
భూకాష్ఠా మధ్యంబున తోచెన్/శతాంగాభ్రష్ఠ సర్పద్విష జ్యేష్టుండప్పుడు నిష్టుర ప్రసర
బంహిష్ఠద్యుతిశ్రేష్ఠతన్' (తూర్పుదిక్కున అనూరుడు
వెలిగాడు-అని అర్థం) అర్థం గురించి కాదు ఇక్కడ చెబుతున్నది. ఛందోనియమం ప్రకారం
ప్రాసస్థానంలో నాలుగు చోట్ల 'ష్ఠ' వస్తే చాలు. కానీ శ్రీనాథుడు ష కింద ‘ఠ’
వత్తు పెట్టి ఎన్నెన్ని మెలికలు తిప్పాడో చూడండి! భాషమీద అధికారం గలవాడు మాత్రమే
చేయగల గడసాము అది. అంతటి అధికారం ఉన్నప్పుడు అక్షరం చేత ఎంతటి ఊడిగం ఐనా
చేయించుకోవచ్చు. విస్తృతమైన పఠనం, గాఢమైన అనురక్తి, సునిశితమైన పరిశీలనాశక్తి.. ఎంచుకున్న ప్రక్రియమీద సరైన అవగాహన అభివృద్ధి
పరుచుకున్న వారెవరైనా పదికాలాల పాటు జనం గుండెల్లొ పదిలంగా నిలిచిపోయే విలక్షణమైన
కవిత్వం సలక్షణంగా రాయవచ్చు.
శ్రీశ్రీ గారు చెప్పిన ఒక
జోకే చెప్పి ముగిస్తాను. మద్రాసు మీనంబాకం ఏరోడ్రోములో ఇద్దరు పల్లెటూరి బైతులు
మొదటిసారి బోయింగ్ విమానాన్ని చూసి గుండెలు బాదేసుకున్నారుట. అందులో పెద్దవాడికి
ముందుగా వచ్చిన సందేహం ‘ఇంత భారీ బండికి పెయింట్ వేయాలంటే ఎంత తెల్లరంగు కావాలీ!
రంగున్నా వెయ్యడం ఎట్లా? ఎంత శ్రమా? ఎంత టైము వృథా?’ అని. రెండోవాడు దానికిచ్చిన సమాధానం మరీ విడ్డూరంగా ఉంది. ’అందుకేనేమో మామా! విమానం ఆకాశంలో
ఉన్నప్పుడు అక్కడికెళ్ళి వేస్తారనుకుంటా! అప్పుడయితే బుల్లిపిట్టంతే కదా ఉండేదీ!’
ఈ జోకు వినంగానే ముందు మనకు
నవ్వొస్తుంది. నిజమే కానీ.. నిజానికి.. కవిత్వతత్త్వసారం మొత్తం ఆ బైతు ఒక్క
ముక్కలో తేల్చేశాడు. విశాలవిశ్వాన్ని కళ
(మన దృష్టిలో ఇక్కడ కవిత్వం) తన
పనితనంతో కళకళ లాడించాలంటే కళాకారుడు బాహ్యప్రపంచాన్ని తన అంతరంగాకాశంలో ఎగరేయాలి.
అంతరంగాకాశంలో
విహారవిన్యాసం మరో పేరే కవిత్వం. ఎంత ఎత్తు ఎగరగలిగితే అంత గొప్ప కవిత్వం
దర్సనమిస్తుంది. రెక్కలు విప్పుకోవడమే కాదు.. వడుపుగా వాటిని కదపడమూ పట్టు
బడాలి. పట్టు చిక్కే దాకా సాధన చేయాలి. అలాంటి సాధన విజయవంతంగా చేసినందుకే ఇవాళ మనం
ఒకశ్రీశ్రీని, ఒకవిశ్వనాథని ఉదాహరణగా చెప్పుకుంటున్నాం.
***
No comments:
Post a Comment