ఆఫీసునుంచి రాగానే కాఫీతో పాటు ఉత్తరం అందించింది శ్రీమతి.
కార్డు రేటు పదిహేను పైసలున్నప్పటి కాలం నాటి ఉత్తరం అది. రమణమ్మత్తయ్యది. ఒకసారి
అర్జంటుగా వచ్చి పొమ్మని ఎవరిచేతో రాయించింది. బేరింగు పడిందని మా ఆవిడ ఏడుపు.
"వివరంగా ఓ ఇన్లాండు ఉత్తరం రాయించుకోవచ్చుగా! పిసినారితనం కాకపోతే!...
పోయేటప్పుడు అంతా మూట కట్టుకుని పోతుందికామోసు..." అంటూ అక్కసు.
ఆ మధ్య తిరుపతి పోతూ రమణమ్మత్తయ్య ఇక్కడ దిగింది. వెళ్లే
ముందు నా చేతిలో ఒక డిపాజిట్ రసీదు పెట్టి దాచమంది. యాభైవేల బాండది. గడువుకింకా
మూడు నెలలుంది.
కొడుకుల చేతిలో
పెట్టకుండా ఇక్కడెందుకు దాచమందో అర్థంకాలేదు. అడిగితే బాగుండదని వూరుకున్నా.
"బ్యాంకులో వడ్డీ మరీ తక్కువగా వుందిరా అబ్బాయి! ఎక్కువ
వడ్డీ వచ్చేదేమైనా వుంటే చూడు.. అక్కడే వేద్దాం!" అంది.
మా ఆవిడ ఊరుకోకూడదూ..! "ఆ ఎక్కువ వడ్డీ మేమే ఇస్తాం.
మాకివ్వండి పిన్నిగారూ!" అనేసింది. అంతే.. రమణమ్మత్తయ్య కోపం చూడాలింక!
"అందరికీ నాడబ్బు మీదే కన్ను. నేనేమన్నా అంత ఎతిమతం దాన్లా
కనిపిస్తున్నానా" అన్నట్లు మాట్లాడింది.
ఆవిడ ధోరణి నాకు తెలుసుగనక నేనేమీ మాట్లాడలేదుగానీ మా ఆవిడ
మాత్రం చాలా బాధపడింది. అందుకే నేను వూరికి బైలుదేరేటప్పుడు ముభావంగా ఉంది. అయినా
తప్పదు. రమణమ్మత్తయ్యకూ నాకూ ఉన్న సంబంధం అటువంటిది.
రమణమ్మత్తయ్య నాకు సొంత మేనత్త కాదు మా నాన్న సవతి తల్లి
కూతురు అయినా ఇద్దరూ సొంత అన్నచెల్లెళ్ళ కన్నా అభిమానంగా ఉండేవాళ్లు. నల్లగా
పొట్టిగా గుమ్మటం లాగా ఉంటుంది. రమణమ్మత్తయ్య మొగుడు పుష్కరాలకని పోయి కృష్ణలో
కొట్టుకుపోయేనాటికి నట్టింట్లో నలుగురు పసికూనలు. వాళ్ళను ఆవిడ సాకిన తీరు
వర్ణనాతీతం. తినటానికి ఉండటానికి కరువు లేదు. తల్లివైపునుంచి ఆస్తి వచ్చిందావిడకి.
మగదిక్కులేని సంసారం. చేతిలో దమ్మిడీ లేకపోతే సంసారం బజార్నపడదా? అని ఆడభయం.
ఊళ్లో వాళ్ళకి వడ్డీకి అప్పులిచ్చేది. వసూళ్ల విషయంలో పరమ
నిక్కచ్చి. 'రమణమ్మ! అమ్మో.. కాబూలీవాలా నయం'
అన్న పేరు తెచ్చుకుంది. ఆమె గయ్యాళితనమూ, పిసినారితనమే
ఒకరకంగా ఆ సంసారాన్ని ఆదుకుందారోజుల్లో!
ఒంటి మీదెప్పుడూ ఒకటే నీరుకావిరంగు చీరుండేది. ఖర్చని తలకు
నూనెకూడా సరిగ్గా రాసుకునేది కాదు. ముప్పయ్యేళ్ళకే యాభైయేళ్ల ముసలమ్మలాగుండేది.
పిల్లల్ని మాత్రం పువ్వుల్లాగా తీర్చిదిద్దేది. ఇంటినీ అంతే!
పిల్లలకు రకరకాల డ్రెస్సులు వేసేది. రంగురంగుల ముగ్గులు
ముంగిట్లో తీర్చిదిద్దేది. ఆవిడకొచ్చినన్ని పిండివంటలు మా అమ్మక్కూడా రావని మా
నాన్న దెప్పుతుండేవాడు. అయితే ఆ చేసినవేమీ బైటవాళ్ళకు పెట్టేది కాదు. తన పిల్లలకు
జిలేబీ చేతిలోపెట్టి ఎదురుగావున్న మాకు దొడ్లోని జామకాయలు ముక్కలుగా కోసిపెట్టేది.
మాకనేంటిలే.. తనూ తినేదికాదు. జామచెట్టునెక్కడ చూసినా రమణమ్మత్తయ్య గుర్తుకొస్తుంది.
"అందరికిలాగా కోరికలు తీర్చేందుకు పిల్లలకు తండ్రి లేడుగదా..
ఇక నా సంగతంటావా! ఈ పిల్లలు సక్రమంగా పెరిగితే నాకదే
కోటివేలు" అంటుండేది మానాన్న లాంటి వాళ్లెవరైనా ఎప్పుడైనా ఆ పిసినారితనానికి
మందలించటానికి పూనుకుంటే!
అన్నట్లు రమణమ్మత్తయ్య కథలు బాగా చెపుతుంది. భానుమతిలాగా
కమ్మగా పాడుతుంది. మా ఇంటి రేడియోలో నుంచి వచ్చే పాటలకు ఆవిడ గొంతు కలిపి
పాడుతుంటే వినటానికి చాలా హాయిగా వుండేది. సంగీతమన్నా, హిందీ అన్నా ప్రాణం. అస్తమానం పిల్లల్ని హిందీ చదవమని
సతాయించేది. రెండో కూతురుని హిందీలో విశారద దాకా చేయించింది. ఆ అమ్మాయి ఒక
హైస్కూల్లో హిందీ టీచరుగాచేరి ఒక క్రిస్టియనతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అది
వేరే కథ.
"కృష్ణాష్టమికి ఎన్ని రోజులుందండీ?" అనడుగుతున్నారు బస్సులో ఎవరో.
ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చిపడ్డాను. బస్సు ఒంగోలు పొలిమేరల్లోకొస్తుంది.
కృష్ణాష్టమి పేరు వినంగానే మళ్లీ మా రమణమ్మత్తయ్యే
గుర్తుకొచ్చింది. ఆ పండుగ రోజు అత్తయ్య శిబిచక్రవర్తి చెల్లెలు అవతారమెత్తేది.
కన్నయ్య పుట్టిన రోజు సందడంతా అత్తయ్య ఇంట్లోనే !ఇంటి నిండా ముగ్గులు వేసేది. కృష్ణపాదాలు పూజగదిలోనుంచీ
వీధిమెట్లదాకా గుర్తులుపెట్టేది. చీకటి పడేలోగా చిన్ని కృష్ణయ్య ఆ గుర్తులు మీద తన
పాదాలు మోపుతూ ఇంట్లో కొస్తాడని ఆమె నమ్మకం. కృష్ణుడికిష్టమని వెన్నతో చేసిన ఉండలు
తయారుగా ఉంచేది. ఆ రోజు ఆవిడ చేసే ప్రసాదం, పాయసం, నేతి గారెలు తిని చూడాల్సిందే! రాత్రిపూజ
పూర్తయిన తరువాత "అదిగదిగో కృష్ణయ్య వచ్చివెళ్లాడు. అడుగుల గుర్తులు
కనిపించటం లేదూ?!" అని అడిగేది మమ్మల్ని. 'కనిపించటం లేద'న్నాడని ఒకసారి మా సుబ్బరాజుని అప్పటిదాకా తిన్న
అప్పచ్చులన్నీ కక్కేదాకా చీవాట్లు పెట్టింది. ఆవిడ నోటికి జడిసి "అవునవును..
కృష్ణుడు వచ్చాడు. అదిగో పాదాలగుర్తులు" అనేవాళ్ళం మేం.
మరి ఆవిడ భక్తి అలాంటిది. పెద్దవాడికి కృష్ణమూర్తనీ
రెండోవాడికి వాసుదేవమూర్తనీ,
ఆడపిల్లలకు శ్యామల, రుక్మిణి అని పేర్లు పెట్టుకుంది.
రుక్మిణి ఆ పేరుని సార్థకం చేసుకోటానికన్నట్లు ప్రేమించినవాడిని పెళ్లి
చేసుకునేటందుకు ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
బస్సు చీరాల చేరేసరికి దాదాపు తెల్లారిపోయింది. ఏదో ఊళ్లో
ఆగి, మళ్లీ బయలుదేరే సమయానికి
బస్సెక్కుతూ కనిపించాడు సుబ్బరాజు. ''అనుకుంటూనే ఉన్నా..
నువ్వివాళో రేపో దిగుతావని" అన్నాడు నా వంక అదోలా చూసి నవ్వుతూ. నా పక్క ఖాళీ
ఉంటే వచ్చి కూర్చున్నాడు.
సుబ్బరాజు నా క్లాస్‌మెట్. వాళ్ళనాయన రమణమ్మత్తయ్య పొలం
కౌలుకు చేసేవాడు. ఆ తరువాత్తరువాత ఊరికి ప్రెసిడెంటయ్యాడు. వీడు వాళ్లనాన్న
అడుగుజాడలలోనే నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఊళ్లో ఓ గీతా మందిరం కట్టించేపనిలో
బిజీగా వున్నాట్ట!
"మీ రమణమ్మత్తయ్యను ఒప్పించి భూరివిరాళం ఇప్పించాలిరా! నీ
మాటంటే ఆవిడకు మంచిగురంటగా... పెద్దావిడ పేరు ఫలకం మీద చెక్కిద్దాంలే!"
అన్నాడు.
"నువ్వే అడక్కపోయావా? కృష్ణుడి పేరు చెబితే ఆవిడ కాదనదే.." అన్నాను నేను.
"ఆవిడకు అనుమానాలు జాస్తిరా బాబూ! అందరూ ఆవిడ ఆస్తిని
కాజేయటానికే కూర్చున్నారనుకుంటుంది. అందుకే బాగా అయింది శాస్తి" అన్నాడు.
"ఏమయిందీ?"
"నీకు తెలీదా? అందుకే వస్తున్నావనుకున్నా ఇంకా. ఆవిడకు క్యాన్సరంటగా.. లంగ్ క్యాన్సర్.
బాగా ముదిరిన తరువాత బైటపడ్డట్లుంది. పోయేలోపల తనచేత భారీవిరాళం ఇప్పించే పూచీ
నీదే."
"రమణమ్మత్తయ్యకు క్యాన్సరని నాకు తెలీదు. మా ఊరొచ్చినప్పుడు
బాగానే ఉందే!"
"మీ ఊరొచ్చిందా?" అని ఆశ్చర్యపోయాడు సుబ్బరాజు. నా దగ్గర బాండు దాచినట్లు కూడా
తెలీదు వీళ్లకు. బహుశా దాని కోసమే నాకు కబురు పంపిచినట్లుంది. బాండ్ వెంట
తీసుకురావటం మంచిదయింది.
"క్యాన్సరొస్తే పల్లెటూళ్లో ఏం చేస్తుంది? ట్రీట్‌మెంట్ తీసుకోదా?" అనడిగా. డబ్బు ఖర్చని వద్దందిట. "ఊళ్లో ఆచార్లే ఏదో
మందిస్తున్నాడు. పెద్దాడు అలిగివేరే కాపురం పెట్టాడు. వాసు స్టేట్సులో
ఉంటున్నాడాయ! పెద్దల్లుడు మంచాడు కాదంటారు. రెండో పిల్లని దగ్గరకు
రానివ్వదు." అన్నాడు సుబ్బరాజు.
పిల్లల్ని పూలచెట్ల మాదిరి సాకింది. గారాబంతో పెద్దాడు
చెడ్డాడు. రెండోవాడు అందకుండా పోయాడు. ఆడపిల్లలెప్పుడూ ఆడపిల్లలేగా!
ఇంటికెళ్లి చూశాక రమణమ్మత్తయ్య పరిస్థితికి జాలేసింది.
లంకంత ఇంట్లో పని పిల్లను పెట్టుకుని వంటరిగా నెట్టుకొస్తుంది.
కేన్సరు తెచ్చిన మార్పు కనిపిస్తూనే ఉంది. వేదాంతం బాగా
వంటబట్టింది. "ముందునుంచీ నాకు ఈ పిల్లలు తోడు లేరుగా! నా కన్నయ్యే నా
వెన్నంటి ఉండి నడిపించాడు. ఆ చల్లనయ్య చల్లంగా చూస్తే చాలు..." అంది
మంచంలోనుంచే.
అంత పెద్ద సంసారాన్ని అతిపిన్నవయసులోనే సునాయాసంగా ఈదిన
అత్తయ్యకు ఇలా చివరిరోజుల్లో అయిన వాళ్ల అండ లేకపోవటం చూసి నాకు చాలా కష్టం వేసింది.
"మద్రాసు రారాదూ! మంచి డాక్టరుకు
చూపించుకుందువుగానీ..." అన్నాను. నవ్వి వూరుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ రసీదు
బైటికి తీశాను. పడుతూలేస్తూ వచ్చి బ్యాంకులో బాండ్ మార్చుకుంది. 'ఇంక నేను వెళతానం'టే "ఈ ఒక్క రాత్రికీ ఉండి పోరా రాముడూ!" అంది.
ఆ రాత్రి ఎగశ్వాస... దిగశ్వాస. ఆచారొచ్చి చూసి "రాత్రి
గడవటం కష్టం" అన్నాడు. అందరికీ కబుర్లు వెళ్లాయి. అమెరికాలో ఉన్న వాసు
"రావటం లేటవుతుంది. అవసరమైతే అన్నయ్యనే అన్నీ కానిచ్చెయ్యమను బావా!"
అన్నాడు ఫోనులో.
పెద్దాడు వచ్చాడు కానీ కదలకుండా ఒకమూల కూర్చున్నాడు.
పలకరించబోతే తల తిప్పేసుకున్నాడు. నేనేదో వాళ్లమ్మని కాకాపట్టి ఆస్తి కొట్టేయాలని
వచ్చినట్లు ఒకళ్లిద్దరితో అనటం నా చెవిన బడింది. నేనేం మాట్లాడలా. ఆ గొడవలకిది
సందర్భమా?!
పెద్ద కూతురు వచ్చీ రాగానే ఇంట్లో సామానుల గురించి ఆరాలు
మొదలు పెట్టింది. రెండో అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయిని చేసుకున్న క్రిస్టియన్
కుర్రాడు మాత్రం ఒకసారి వచ్చి వెళ్లాడు. పనిపిల్లను కుదిర్చింది అతనేనట! అతనేదో
ఎన్జీవో విద్యాసంస్థలో వార్డెన్‌గా ఉన్నాడన్నారు.
మొత్తానికి రమణమ్మత్తయ్య చివరి శ్వాస తీసుకొనే వేళకి వాసు
తప్ప అందరూ పక్కనే ఉన్నారు. రెండో కూతురు చివరి చూపుకొచ్చింది. కొంత నయం. కానీ ఆ
తరువాత జరిగిన సంఘటనలే చికాకు పుట్టించేవిగా ఉన్నాయి.
"అమ్మ నాకొక్క దమ్మిడీ ఇవ్వలేదు. కర్మకాండలు జరిపించటమెట్లా?" అన్నాడు పెద్ద కొడుకు.
"పెద్దకొడుకుగా అన్నీ చేయడం నీధర్మం" అని పెద్దకూతురూ, పెద్దల్లుడూ!
సుబ్బరాజొచ్చిందాకా చర్చలలా సాగుతూనే వున్నాయి. "బ్యాంక్‌లో
నిన్ననే బాండు మార్చుకుందిటగా మరాడబ్బులేమైనాయీ?" అని వాడి ఆరాటం.
ఆఖరికి తను దాచుకున్న సొమ్ముతోనే అత్తయ్యను కాటికి పంపే
ఏర్పాట్లు చెయ్యటానికి తీర్మానమయింది. ఆ డబ్బే లేకపోతే రమణమ్మత్తయ్య పని
ఏమయివుండేదో?!
జీవితాంతం పిసినిగొట్టుగా బతికింది. కాట్లో కట్టెల ఖర్చు
కోసమే అన్నట్లయిందామె పరిస్థితి. కర్మకాండలు ముగిసిన వెంటనే నేనూ బైలు దేరాను.
"ఇంతకాలం ఉన్నావ్. ఇంకొక్క పూట ఓపిక పట్టు. మీ
రమణమ్మత్తయ్యేదో వీలునామా రాయించిందంట! బ్యాంకులో ఉంది. పట్టుకొస్తున్నారు.
గీతామందిరానికే మాత్రం రాసిందో విందువుగానీ!" అన్నాడు సుబ్బరాజు కులాసాగా.
నాకేదో అనుమానం మొదలయింది.
నడవాలో రమణమ్మత్తయ్య పటం ముందు కూర్చున్నారందరూ. పని పిల్ల
గుప్పెడు అగరుబత్తులు తెచ్చి వెలిగించి పోయింది.
అగరుధూపం మెల్లిగా హాలంతా వ్యాపిస్తుంటే అదొకరకమైన అనుభూతి.
ఈ ఇంట్లో ఈ ప్రశాంతత ఎల్లకాలమూ ఇలాగే కొనసాగితే బాగుణ్ణు! ఈ ఆస్తి పంపకాల
తరువాతైనా అత్తయ్య ఆత్మకు శాంతి లభిస్తుందా? మెల్లిగా అక్కడనుంచీ తప్పుకుని దొడ్లో జామచెట్టు కింద
కుర్చీ వేసుక్కూర్చున్నాను. చెట్టు నిండా చిలక్కొట్టిన పళ్లు చాలా ఉన్నాయి. వగరు
కాయలకోసం పిల్లలు కొట్టుకుంటున్నారు. జామచెట్టును చూస్తే రమణమ్మత్తయ్యే
గుర్తుకొస్తుంది. లోపల్నుంచీ ఏవో గోలగా మాటలు వినిపిస్తున్నాయి.
"అమ్మ మీకీ ఉత్తరమియ్యమందయ్యా!" అంటూ ఒక కవరు
ఇచ్చిపోయింది పనిపిల్ల.
కవరు తెరిచి కాగితం మడతలు విప్పాను. అత్తయ్య ఎవరిచేతో
రాయించిన ఉత్తరం అది... "ఇది నా స్వార్జితమైన ఆస్తి. కొంత మా అమ్మవైపు నుంచి
వచ్చినా నా ఇష్టం వచ్చినట్లు పంచుకునే అధికారం ఉందని లాయరుగారు అన్నారు. నా
పిల్లలకు చాలా ప్రేమనురాగాలు పంచి ఇచ్చాను. వడ్డీతో సహా అసలు కూడా వసూలయితేగానీ...
మళ్లీ అప్పిచ్చే అలవాటు లేనిదాన్ని నేను. నా కన్నవాళ్లింకా నా రుణం తీర్చుకోలేదు.
కనక మళ్లీ వాళ్లకేమీ ఇవ్వలేను. ప్రతి కృష్ణాష్టమి రోజూ కన్నయ్య నాకోసం నా ఇంటి
కొస్తుంటాడు. ఈ సారి వచ్చినప్పుడు నేను లేకపోతే దిగులు పడతాడేమో! అది నేను
భరించలేను రాముడూ! అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నానురా! ఈసారి కృష్ణాష్టమికి
కన్నయ్య నా ఇంటికొచ్చే వేళకి నట్టింట్లో నేను లేకపోయినా... నాలాంటి వాళ్లింకెవరైనా
ఉండాలి. కన్నబిడ్డల ప్రేమానురాగాలకు దూరమై పరితపించే నాలాంటి తల్లులు... తండ్రులూ
దేశంలో కోకొల్లలు. అందులోని కొంత మందికైనా నా ఇల్లు ఆశ్రయమైతే చాలు. నాలాంటి
వృద్ధులను సాకాలంటే మాటలా? ఎంతో ఓపిక... సహనం కావాలి.
సేవాభావం ఉండాలి. ఈ రెండూ నా చిన్నల్లుడి దగ్గర దండిగా ఉన్నాయి. అతణ్ణి ఒప్పించి ఈ
వృద్ధాశ్రమాన్ని నిర్వహించేలా చూసే బాధ్యత నీదేరా రాముడూ! ఆశ్రమనిర్వహణగ్గానూ నా
దగ్గరున్న ఆస్తి బొటాబొటిగా సరిపోతుంది. సుబ్బరాజు గీతామందిరానికి ఇచ్చేందుక్కూడా ఇంకా
ఏమీ మిగల్లేదు...''
లోపలినుంచి అరుపులు పెద్దవయ్యాయి. సుబ్బరాజు భుజాన కండువా
వేసుకుని విసురుగా బైటికి వెళ్ళిపోయాడు. ఆ వెనకనే మిగిలిన వాళ్లు ధుమధుమలాడుతూ!
గంటలో ఇల్లంతా ఖాళీ అయింది. లోపలికి తొంగి చూస్తే..
రమణమ్మత్తయ్య ఫోటో ముందున్న అగరొత్తుల ధూపం పరిమళం గదంతా
మెల్లగా అల్లుకుంటోంది. అది గది కాదిప్పుడు. వృద్ధాశ్రమం. అదే గీతా మందిరం.
-కర్లపాలెం హనుమంతరావు
***
ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ప్రచురితం
No comments:
Post a Comment