Sunday, June 14, 2015

తెలుగోడి తెలుగ్గోడు!- సరదా చర్చ



 తెలుగు కోతులు  
టెలుగు వినను
టెలుగు కనను
టెలుగు అనను


రుగ్వేదంలో ఆంధ్రులున్నారు. రామాయణంలో సీతకోసం ఆంధ్రదేశంలో వెదకడం ఉంది. పోతన భాగవతం ప్రకారం బలి సంతానంలో ఆఖరివాడు ఆంధ్రుడే. యుధిష్ఠిర చక్రవర్తి పట్టాభిషేకోత్సవానికి హాజరైన రాజులలో ఆంధ్రరాజూ ఒకడు. పురాణమో, పుక్కిటపురాణమో.. ఒక లెక్కప్రకారం ఆంధ్రులంతా విశ్వామిత్ర మహర్షి సంతానమే. విశ్వామిత్రుడు విశిష్టిమైన వ్యక్తి. గురువునుమించి ఎదగాలన్న తపన  ఆయనది. ఎన్నో ఉద్యమాలకు ఆయన  స్ఫూర్తిప్రదాత.  సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపరవిధాత. త్రిశంకుస్వర్గనిర్మాత. గాయత్రీమంత్ర ఆవిష్కర్త. వంకాయ, టెంకాయ, గోంగూరవంటి విడ్డూరాలన్నీ ఆయన ప్రసాదాలే.  తెలుగువాడికి అందుకే అవంటే అంత ప్రీతి. దీక్ష.. కక్ష తెలుగువాళ్లందరికీ విశ్వామిత్ర మహర్షినుంచే వారసత్వపు లక్షణాలుగా సంక్రమించాయేమోనని అనుమానం.  
రామాయణంలోని కిష్కింధ  ఆంధ్రదేశంలోని ఓ అంతర్భాగమేనని  వాదన ఉంది. ఆ లెక్కన మనమందరం కిష్కింధవాసులమే! అన్నదమ్ముల మత్సరం వాలిసుగ్రీవులనుంచి అబ్బిన జబ్బేమో! వాయుపుత్రుడి లక్షణాలూ తెలుగువాడికి ఎక్కువే మరి!
స్వామిభక్తి తెలుగువాడికి మరీ విపరీతం. స్వామికార్యం తరువాతే వాడికి ఏ స్వకార్యమైనా. ఆరంభశూరత్వం, అత్యుత్సాహం ఆంధ్రుల గుత్తసొత్తు. చూసి రమ్మంటే కాల్చి వస్తేనే వాడికి తృప్తి! కొమ్మ తెమ్మంటే కొండను  పెకలించుకొచ్చాడంటే వాడు కచ్చితంగా తెలుగువాడే. ఆ రావడంలోకూడా ఆలస్యమవడం వాడి ప్రత్యేక లక్షణం. కోటిలింగాలు తెమ్మని రాములువారు  ఆజ్ఞాపిస్తే ఆంజనేయులుగారు ఏమి చేసారు? ఒకటి తక్కువగా తెచ్చుకొచ్చారు! ఆర్భాటంగా మొదలుపెట్టి అసంపూర్తిగా చుట్టబెట్టడం తెలుగన్నకు  మొదట్నుంచీ అలవాటే!  స్వశక్తియుక్తులు మరొకడు పనిగట్టుకొని పొగిడితేగాని గుర్తెరగలేని బోళాతనం తెలుగువాడిది. సముద్రాలు లంఘించే శక్తిగలిగివుండీ ఏ స్వామివారి పాదాల చెంతో విశ్రాంతి కోరుకోవడం తెలుగువాడికి అనాదిగా వస్తున్న బలహీనత.
'తెలుగువాడివి అన్నీ అవలక్షణాలేనా?' అని ఉసూరుమనుకోవాల్సిన అవసరం లేదు.  వనవాసంలో రామసోదరులను ఆదరించిన శబరితల్లి తెలుగుతల్లే! చేసిన ఘనకార్యం  చెప్పుకొనే  సంప్రదాయం  అప్పట్లో లేదు. ఇంకెంతమంది కడుపునింపిందో  ఆ అన్నపూర్ణమ్మ తల్లి అందుకే మనకి తెలీదు. తెలుగుమహిళకు భోజనం వడ్డించడమంటే మహాసరదా కదా! పేరుకే అన్నపూర్ణమ్మ  కాశీనివాసి. అసలు మసలేదంతా మన తెలుగునేల నలుచెరగులే కదా! డొక్కా సీతమ్మలు, మంగళగిరి బాలాంబలు అడుగడుక్కీ తారసిల్లే పూర్ణగర్భలండీ తెలుగురాష్ట్రాలు రెండూ!
ఉద్యమమైనా సరే.. ఉప్పు సత్యాగ్రహమైనా సరే సొంతముద్రంటూ లేకుండా తెలుగువాడు ఒక్కడుగు ముందుకు కదలడు. బౌద్ధాన్ని సంస్కరించి మరీ ప్రచారం చేసిన నాగార్జునుడు మన  తెలుగువాడే! తెలుగువాడికి కొత్తొక వింత. పాతొక రోత. అందాకా నెత్తికెత్తుకొన్న జైనం శైవంరాకతో హీనం అయిపోయింది! ఆనక వాడు  వైదికం మోజులోపడ్డాక శైవం రాష్ట్రాల  శీవార్లలోకి పాతిపోయింది!
అటు ఆర్యులు.. ఇటు ద్రవిడులు! ఇద్దరూ ముద్దే మనకు! రెండు సంస్కృతుల పండుగలు  మనం సంబరంగా చేసుకొంటాం! పోతరాజు కృష్ణుణ్ణి తెలుగుదేవుడు చేసేసాడు. రామదాసు ఇక్ష్వాకులవాసిని సతీసోదరసమేతంగా భద్రగిరికి కట్టేసాడు.  కృష్ణరాయలు పాండిత్యప్రకర్షతో రంగధాముణ్ణి తెలుగుపెళ్ళికొడుకుగా తయారుచేసాడు. పాపయ్యశాస్త్రి భక్తిప్రవత్తులకు బద్ధుడైనట్లు బుద్ధభగవానుడు తెలుగు చిరునామా స్వీకరించాడు. అందరూ కావాలనుకొనే తత్వం తెలుగువాడిది. అయినా అతగాడే ఎవరికీ అక్కర్లేదు! భారతంలో తెలుగువాడి ఊసు ఆట్టే లేకపోయినా 'వింటే భారతమే వినాలి' అంటూ టాంటాం కొట్టుకొనే రకం తెలుగువాడు!
సాహసంలో మాత్రం? మనం వెనుకంజా? తైలంగ సామ్రాజ్యాన్ని స్థాపించాం. సుమిత్రా, జావా ద్వీపాల్లో వలస రాజ్యదీపాలను వెలిగించాం. సయాడోనిసిచయాల్లాంటి సుదూర ప్రాంతాల్లో నిబద్ధతతో బౌద్ధదర్మాన్ని ప్రచారం చేసి వచ్చాం. ఈజిప్టురాణికి చీనాంబరాలు కట్టబెట్టిన ఘనత మన  తెలుగువాడిదే! అజంతా, అమరావతి, సాంచి క్షేత్రాలలో అసమాన శిల్పకళావైభవాన్ని సృజించిన కళాతపస్వి మన తెలుగుయశస్వి. ధాన్యకటక విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన గురువులు మన తెలుగువారు. మానవనాగరికత మణికిరీటంలో నిరంతరం వెలుగులు చిమ్మే కోహినూరు వజ్రాలు కదుటండీ మన తెలుగువారు!
మేధస్సులోమాత్రం మనమేమన్నా అధమస్థులమా? హైదవం క్షీణదశలో  దక్షిణాది గోదావరీతటంనుంచే మహాతత్త్వవేత్త శంకరాచార్యులు ప్రభవించించింది. స్వధర్మ పునరుత్థనార్థం జన్మించిన పుణ్యమూర్తి విద్యారణ్యుడూ తెలుగు పురుషుడే! ఆయన తోడాబుట్టిన సాయనుడు వేదాలకు  భాష్యం చెప్పిన ఉద్దండుడు.  ఉత్తరాది కావ్యాలకు  వ్యాఖ్యానాలు చేసిన మల్లినాథుడుది తెలుగునాడు. జగన్నాథ పండితరాయలు హస్తిన ఎర్రకోట  యవనసుందరి అంకపీఠంపైన తెలుగుప్రతిభను సుప్రతిష్ఠంచిన ఘనుడు.   దేశదేశాల తాత్వికకేతనం విజయవంతంగా ఎగురువేసిన తెలుగు జ్ఞాననికేతనం రాధాకృష్ణపండితుడు. అంతర్జాతీయంగా కీర్తిప్రతిష్టలార్జించిన కోడి రామ్మూర్తి, సి.కె. నాయుడు, ఎల్లాప్రగడ సుబ్బారావు మన తెలుగువెలుగులేనంటే  తెల్లబోతాం మనం.
గొప్పవాళ్లెప్పుడూ తెలుగువాళ్లు కారనీ.. తెలుగువాళ్లయుంటే గొప్పవాళ్లే అవలేరనీ మన తెలుగువాళ్లకో గొప్ప నమ్మకం. బొంబాయి చేరితేగాని కాశీనాధుని నాగేశ్వర్రావు పంతులుగారు నాలుగు కాసులు కళ్లచూడలేదు. తమిళదేశం చెప్పిందాకా  బాలమురళి గానగాంధర్వుడని  మనం ఒప్పుకోలేదు! తెలుగువాడు పైకిరావాలంటే పైకన్నా పోవాలి. దేశందాటి పైకన్నా పోయిరావాలి! ఎందుకిలా?
తెలుగువాడి వెటకారంవాడి మరీ అంత అత్యధికమా?! మహామాత  కాళీదేవత ప్రత్యక్షమయితే మరోడయితేసాగిలపడి మొక్కేవాడు. ఆమె అంగసౌష్టవంచూసి ఫక్కున నవ్వాడంటే తెనాలి రామలింగడు తెలుగువాడు కాబట్టేగా! వేలెడంత లేకపోయినా జానెడంతవాణ్ణి చూసి ‘మూరెడంతైనా లేడ’ని మూతి మూడువంకర్లు తిప్పాడంటే నిక్షేపంగా వాడు తెలుగువాడే అయివుండాలి.
.
పాకశాస్త్రంలో తెలుగింటి  ప్రావీణ్యమే వేరు. తెలుగు తాళింపు దినుసులు మరే ఇతర ప్రాంతాలలో కనిపించవు. తెలుగు వర్ణమాలా ఓ వంటింటి పోపుపెట్టె వంటిదే సుమా! సాతాళించగల చేవ ఉండాలేగాని.. తెలుగువంటకంలా తెలుగురచనా ఒక నవరసాల విందు.
గంగాజలం తెచ్చి కృష్ణ, గోదావరి, తుంగభద్రల్లో కలగలపడమే తెలుగుదనం కలివిడిదనం. తాగునీటినిసైతం ‘మంచి’నీరుగా పిలిచే మంచి నైజం తెలుగువాడి సొంతం! తెలుగుభాషకూ మంచినీరులా మేధోదాహార్తిని తీర్చే సత్తా ఉంది. శబ్దానికి  పూర్తిన్యాయంచేసే శక్తి ఇటాలియన్  తరువాత  ఒక్క తెలుగక్షరంలోనే ఉందిట! ఇది ఆధునిక భాషాశాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్న మాట. కంప్యూటర్ వేగాన్ని అందిపుచ్చుకోగల 'బైట్ స్(Bytes)' సామర్థ్యం తెలుగులిపికి అలంకారప్రాయం- అని  సాఫ్టువేరు నిపుణులు వెలిబుస్తున్న అభిప్రాయం.  ఏ పలుకునైనా తనలో మంచినీళ్ల ప్రాయంగా కలుపుకోగల కలివిడితనం తెలుగువర్ణమాలకు ప్రత్యేకం.
ద్రవిడ సంస్కారి చిన్నయసూరిచేత చక్కని వచన రచన చేయించిందీ తెలుగు పలుకుబడే! తెలుగుమాట తేటతనానికి దాసోహమయే బ్రౌన్ దొర నిఘంటువు నిర్మాణానికి పూనుకొన్నది!  జిజ్ఞాసకు తగ్గ ఉపజ్ఞ తెలుగుభాషామతల్లి  ప్రజ్ఞ.
'ఆంధ్రదేశపు మట్టి.. అది మాకు కనకంబు' అని ఆ మహామహులు తలవంచినే చోటుకే  ఇప్పుడు మనం తలవంపులు తెస్తున్నాం. అదీ విచారం!
పరాయితనం భుజానమోసే ఔదార్యంలోనే తెలుగువాడెందుకో ముందునుంచీ తరించిపోతున్నాడు?! సగటు తెలుగు నాలికకు తెలుగు పదాల మాధుర్యం వెగటు?! ఆదిలో  సంస్కృతం, మధ్యలో హిందూస్తానీ, ఇప్పుడు ఆంగ్లం! వట్టి తెలుగుమాత్రమే తెలిసుంటే అది  వాజమ్మతనానికి నిదర్శనం! ‘గొప్పోళ్ళు చాలామందికి తెలుగురాదు. కాబట్టి తెలుగురాకపోవడమే గొప్పదన’మనుకొనే తెలివితక్కువతనం రోజురోజుకీ ఎక్కువవ్తుతున్నదీ తెలుగునాట! ‘విజ్ఞానమంటే కేవలం ఇంగ్లీషుమాట. పాండిత్యమంటే కేవలం సంస్కృత పదాల ఊట’. ఇదీ  ప్రతి సగటు తెలుగునోటా నేడు వినిపిస్తున్న పాట! పరాయిభాషల రుచి నోటికి పట్టాలన్నా పసిదశలో బిడ్డకు ల్లిభాష పాలు పట్టాలా వద్దా! చావగొట్టినా సొంతభాషరాని చవటకి చావచితక్కొట్టినా పరాయి భాష వంటపట్టదని భాషాశాస్త్రవేత్తలే మొత్తుకొంటున్నారు!

భోజనాలయంలోకి వెళ్ళినప్పుడు 'వాటర్' 'చట్నీ' అంటేనేకానీ వడ్డించేవాడి తలకెక్కదా?! కొట్లాట్టానికి అక్కరకొచ్చే సొంతభాష న్యాయస్థానాల్లో ఫిర్యాదులిచ్చేందుకు ఎందుకు చేదో?! రోగాలకే కాదు.. వాటి నిదానానికి  వాడే మందులకూ  నోరుతిరగని లాటిన్ పేర్లు?! రైలు, రోడ్డు, పోస్టు, సైకిలు, ఫోను, సెల్ఫోను.. నిత్యవ్యవహారంలో నలిగే కొన్ని పదాలకు ప్రత్యామ్నాయం  లేక వాడుకలో ఉన్నాయంటే..ఏదో అర్థం చేసుకోవచ్చు. పుస్తకం, కలం, ప్రేక్షకుడు, సంతోషంవంటి పదాలకూ బుక్కు, పెన్ను, ఆడియను(నిజానికి ఆడియను అన్న మాటే తప్పు), హ్యాపీసు వంటి సంకర పదాలను వాడే తిక్కసంకరయ్యలు ఎక్కువయిపోతున్నారు! భేషజంకోసం, అతిశయంకోసం పరాయిభాషాపదాలను వేలంవెర్రిగా వాడే గురజాడ గిరీశాలు తలుగునాట రోజురోజుకూ ముదిరిపోతున్నారు!  ఆత్మగౌరవం ప్రాణప్రదంగా భావించే తెలుగువాడికెవడికైనా   ఇది చివుక్కుమనిపించే  అంశం.
తెలుగుగడ్డమీద తెలుగుబిడ్డ మెడలో తెలుగు పలకను' అంటూ పలకలా?! తెలుగులో ఏడ్చిన నేరానికి పసిదాని అరచేతికి వాతలా?!
పేరుకేనా మనది ప్రజాస్వామ్యం? పాలితుడి పలుకుమీద పాలకులకెందుకో ఇంత కోపం?!  జన్మతః జిహ్వమీద కొలువైన శబ్దదేవత కదా తల్లిభాష!  జంతుతతులకన్నా విలక్షణంగా బతుకును తీర్చిదిద్దే ఆ భాషామతల్లి  అంటే తెలుగువాడికి తగునా అంత చులకన?! తల్లిమీద, తల్లిభాషమీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి?!
***
కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2012 'తెలుగు వెలుగు'లో ప్రచురితం)

(ఈ వ్యాసంలో ఉపయోగించుకొన్నవి సరసి, ఒన్ ఇండియావారి కార్టూనులు. వారికి ధన్యవాదాలు)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...