ఇదీ ఇండియా .. !
దుబాయ్ కొడుకు ఉద్యోగం ఊడినందుకు దిగాలుపడ్డ అమరయ్య మంచంపట్టి ఇవాళ్టికి మూడు వారాలు.
మందిచ్చే ఆచారిగారు పెదవి విరిచి 'అయినవాళ్ళను పిలిపించుకోవచ్చు' అని హెచ్చరించిపోయారు.
షేకుల రుణాల 'షేక్' లో షేపులు పోయిన అమరయ్యకొడుకు కామేశ్వర్రావు తండ్రి చివరిచూపులకని దిగబడ్డాడు.. కొడుకును చూసిన ఉల్లాసంలో తండ్రి తెప్పరిల్లాడు కానీ.. కొడుకే లోడు ఖాళీఅయిన లేలాండుకు మల్లే కళ తప్పివున్నాడు.
'ఇక్కడే ఏదన్నా పని ఉంటే చూడు బాబాయ్! ఎటొచ్చి ఎటు పోతుందో.. నాయన కర్మకాండలకైనా చిల్లి నయాపైసా లేదు నా దగ్గర ' అని బైటపడిపోయాడు దుబాయ్ రిటర్న్డ్ కామేశ్వర్రావు.
‘నయాపైసల’దగ్గరే ఆగిపోయిన అన్నకొడుకు అమాయకత్వాన్ని చూసి జాలిపడ్డాడు బాబాయ్. ‘ఇక్కడి పరిస్థితులు అంతకన్నాఅధ్వానంగా ఉన్నాయిరా బంగారూ! పెద్ద పెద్ద సాఫ్టువేర్లే వేర్లు తెగిన మొక్కల్లా వాలిపోయున్నారు నిన్నటిదాకా. ఇప్పుడేదో పుంజుకుంటుందంటున్నారుగాని.. నాకైతే బొత్తిగా నమ్మకం లే! ఇక గవర్నమెంటు ఉద్యోగాలంటావా? ఇదిగిదిగో.. అదేదో సెక్షన్లు కోర్టుల్లో నలుగుతున్నాయి.. ఆ లిటిగేషన్లన్నీ అటు క్లియరైపోడమే లేటు .. ఇటు భారీ నియామకాలకు లాకులెత్తేస్తాం!' అని రెండు తెలుగు స్టేట్లూ ఒహటే రోటి పాటలు! మనమాట వినే మంత్రెవరైనా దొరకుతారు గాని.. మంత్రిమాట వినే అధికార్లు దొరకడమే కష్టంగా ఉందిరా సీను! సియమ్ములాదేశించినా 'నిమ్మళంగా చేద్దాంలేద్దూ' అని నిమ్మకు నీరెత్తినట్లు చిత్రాలు పోయే అధికార్లే అధికంగా ఉన్నారిప్పుడు ! నువ్విం కాస్త పెందలాడే వచ్చుంటే.. ఏ బై ఎలక్షన్ ప్రచారకమిటీలో జిల్లాబాధ్యుడి కింద మండల బాధ్యుడిగా వేయుంచుండేవాణ్ణి గదరాజడవా!’ అనేసాడు బాబాయ్!
'పోనీ. కంట్రాక్టు పనులేమన్నా ఖాళీగా ఉన్నాయేమో.. అవన్నా చూడు బాబాయ్!' అనడిగాడు కామేశ్వరం.
'చేసిన పల్ల బిల్లులకే చిల్లులబ్బీ ఇప్పుడు! ఎర్రచందనం దుంగలు తరలించడం లాంటి దొంగ బిజినెస్లు దర్జాగానే సాగాయిగాని మొన్నమొన్నటిదాకా. గవర్నమెంటు నిఘా మరీ గట్టి పడ్డాక .. ప్రాణాలమీద ఆశ వదులుకొంటే తప్ప ఇట్లాంటి కంట్రాక్టు పన్లకి దిగేందుకు లేదు. మన కంత రిస్కు అవసరమా? అందునా మీ నాన్నకి నువ్వొక్కడివే సుపుత్రుడివాయ!'
‘ఏదడిగినా మన సర్కోరోడికి మల్లే ఏదేదో కథలు చెబుతున్నావేంది బాబాయ్? ఇహ నేను మాత్రం ఇక్కడ ఉండి ఊడబొడిచేదేముంది! నాన్నెట్లాగూ పిడిరాయిలా దిట్టంగానే అరుగుతున్నాడాయ!' అంటూ వచ్చిన దారినే ఫ్లైటెక్కి చక్కా చెక్కేసాడు కామేశ్వర్రావు.
(ఆశ -సచిత్రమాస పత్రిక ఆగష్టు 2011 సంచికలో ప్రచురితం
***
No comments:
Post a Comment