కరవీర కుసుమము, గులాబీ పువ్వు కళ్ళు తెరిచేదాకా దాదాపు
ఒకే రూపు. మొగ్గలుగా ఉన్నప్పుడు మాత్రం ఒకటి గుడి, ఒకటి గోపురం. వీటి మూల రహస్యం ఏమిటో
తేల్చుకుందామని కాచుక్కూచుంటే.. ఎపుడో ఒక నిశ్శబ్ద గడియలో రససెల్లానుంచి
తొంగిచూసే ముగ్ధవధువులా మిసమిసలాడుతూ
ప్రఫుల్లనేత్రాంచలాలను రెపరెపలాడిస్తాయి.
సృజన జన్మరహస్యం మాత్రం అంతుచిక్కదు!
దారిన పోతోంటే కాలికి ముల్లు గుచ్చుకోవచ్చు.
అపురూప సౌందర్యరాసి సందర్సనసౌభాగ్యమూ లభ్యమవచ్చు. విడివిడిగా రెండు విరుద్ధ సంఘటనలే!
కాని సమన్వయించుకునే సామర్థ్యముంటే అవే ఓ అభిజ్ఞాన శాకుంతలాంకురాలు. సమన్వయశక్తికి
పాదు ఎక్కడో తెలియదు!
పట్టుబట్టి ఎప్పుడో కలం, కాగితాలు పట్టుక్కూర్చుంటే బుర్ర బద్దలవడం
మినహా ఫలితం సున్న. పదాలనాశ్రయించీ, పాదాలను దిద్దీ, పర్వతం ప్రసవించినట్లు పోగేసినా ఆ మాటలకుప్ప కవిత్వమనిపించుకోదు. శ్రీరస్తు నుంచి శుభమస్తు దాకా సమస్త శ్రీమదాంధ్ర మహాభాగవతాన్ని మహానుభావుడు బమ్మెర పోతనామాత్య్డుడు ఒక్క ఉదుటనే పద్యాలబండిలా తోలుకెళ్ళాడన్నా నమ్మలేం.
కావ్యాలేమన్నా శాసనాలా? కాళిదాసు కుమారసంభవమేంటి.. ఆఖరుకి సాక్షాత్తు ఆ శ్రీశంకరభగవత్పాదుల సౌందర్యలహరైనా
సరే .. ఒక్కబిగినే 'ఇతిసమాప్తః'
దాకా సంపూర్ణమవడం అసంభవం. ఒకవాక్యం
ఒక్కసారే అతకదు. అర్థం ఒకసారే పొదగదు. భావం ఒకేసారి పొసగదు. సృజన- భావుకత స్థాయిభేదమా? దానికదే
ఓ అంతిమ ఆత్మస్వరూపమా? ఉఛ్చరణమొదలు అంతిమభావపర్యంతం సర్వజీవశక్తులూ
విభావాదుల్లా వివిదౌపచారికలు నిర్వహిస్తేనే కదా ఏ రసభావానికైనా ఓ అంతిమస్థాయి!
అంతిమం సరే.. రసం అసలు
ఆదికొస ఏదో
అంతుబట్టదు! అది కదా అబ్బురం!
ఓ
కొబ్బరి చెట్టు. దాని వంపుకి సొంపు అమరేటట్లు వాలిన శాఖకు వరసగా తోరణాలు
కట్టినట్లు ఆకులు.
వాటిమీద ఉదయభానుడి నునులేతకిరణాలు పడి కోమలమలయసమీర
స్పర్శలకి ఒకటొకటే మృదువుగా కదలాడుతోంటే 'తరుణాంగుళీచ్చాయ దంతపుసరికట్టు లింగిలీకపు వింత
రంగులీనింది' అన్న భావాక్షర వీణాతంత్రి సాక్షాత్కరమవడం లేదూ!
శరద్రాతుల్లోఐతే గోపాలకృష్ణయ్య ఎక్కడో నక్కి
వేణుదండంమీద గర్భకేతకీ దళంవంటి వెన్నెల వేళ్ళతో చాలనం చేస్తున్నట్లు ఓ సమ్మోహనోహ
మనసును ఊయలలూగిస్తుంది . అక్కడితో ఆగితే
మంచిదే! అవ్యక్తంగా ఆ
వేణుస్వరాలు మన కర్ణద్వయంలో నర్తించుతో
గుండెలకు రెక్కలు తొడిగి ఏ గాంధర్వలోకాలకో ఎగరేసుకు పోవచ్చు. ఏ వరూధినో రత్నసానువుకోన
భోగమంటపాన కనిపించి వాస్తవలోకాలకు దారే తోచనీయకుండా మీదమీద కమ్ముకొచ్చేయవచ్చు. మళ్ళీ
కాళ్లు నేలకాని నిట్టూర్పుసెగలు చురుక్కుమనిపించేవరకూ సాగే ఆ భావాంబర విలాసవిహారం
పేరేమిటో? నింగిని వదిలి నేలకు దిగిందాకా మనసున సాగే ఆ
ఊహావిహంగ యానమంతా కవిత్వమేనా పాకం పడితే? మరైతే
ఆ పాకం పండేది ఎలా? ఆ
అనుపాకం సమపాళ్ళు ఆరంభంలో తెలిసింది ఏ
పుంభావ సరస్వతికో?
చెరువు గట్టు కెళ్ళి కూర్చున్నామనుకోండి సరదాగా
ఓ అందమైన సాయంకాలంపూట మిత్రబృందమంతా కలసి.
ప్రోషించబడ్డ నాగసంతానమంతా
సర్పయాగంలో ఆహుతి నిమిత్తం తరలిపోతున్నభ్రాంతి కలిగిస్తుంది మన వైపుకే వురికురికి
వచ్చే అలలసందోహం! అవేతరంగాలు మరోమిత్రుడి కంటికి పరుగుపందెంలో గెలుపు కోసం
ఉరకలెత్తే చురుకు కురంగాలు అనిపించవచ్చు. ఇంకో
నేస్తానికి దోస్తులంతా కలసిచేసే జలవినోదంలా తోచవచ్చు.
నాచన సోమన- 'హరివంశం' సత్యభామ హరికంటికొక రకంగా.. అరి
కంటికింకో తీరుగా తోపించినట్లు..
ఒక్కవస్తువు సందర్శనంలోనే ఎన్ని భావభేదాలో! కవి అయిన వాడికైతే గుండెల్లో బొండుమల్లెలచెండు
వాసనలు గుబాళించిపోవూ! చేతిలో రాతసాధనం
లేనంత మాత్రాన ఊహలో పొంగులెత్తే రసగంగప్రవాహం భంగపడుతుందా?
మదిలో 'మా నిషాద'
శ్లోకభావం కదలాడినప్పుడు వాల్మీకికవి హస్తాన ఏ గంటముందంట? 'మాణిక్య వీణా ముపులాలయంతీ' అంటో కాళిదాసు గళాన అలా ఆశుకవితాజల సెలయేరులా గలగలా పారినవేళా లేఖినేదీ దాపునున్న దాఖలాల్లేవే! పైసాపైసా కూడబెట్టే లుభ్ధుడికిమల్లే రసలుబ్ధుడైన
కవీ రసాదికాలకు
ఆదిమూలమైన భావదినుసులను ఏ హృదయపేటికలో పదిలపరుస్తాడో? ప్రయోగించే సందర్బరహస్యాన్ని ఎలా పసిగట్టగలడో?!
అలాగని ప్రతీమనిషీ ఇలాకనిపించిన ప్రతీదానిలోనల్లా కవితామతల్లినేదో భావించుకొని ఆమె రూపురేఖాదులను అల్లిబిల్లిగా
అల్లుకుని పోతానంటే 'అనంతా
వై వేదాః' అన్నట్లు ఈ పాటికీ ఈ భూమండలమంతా కవిలకట్టల్తో
నిండి ఏడుసముద్రాలూ పూడిపోయుండేవి కావూ! ఆ దస్తరాల్లో చిక్కడిపోయే దుస్తరం
తప్పింది. ఆనందమేనంటారా?
మరి మిణుగురులా తటాల్మని తట్టి, సీతాకోకచిలుకమల్లే
మనోభావం చటుక్కుమని ఎటో ఎగిరిపోతేనో? గుప్పెటపట్టి గూట్లోపెట్టే సాధనమంటూ ఏదో
ఒకటుండటమూ అవసరమే కదా? గాలిబ్
మహాశయుడికి ఏదైనా ఓ అందమైనభావం మదిలో కదలాడటం మొదలవంగానే పాటగానో పద్యంగానో గుణించుకుంటో అందుబాటులో
ఉన్న దస్తీతోనో.. అంగీఅంచుల పోగుతోనైనాసరే ముచ్చ్టటైన ముడులుగా మలుచుకునే అలవాటు.
తీరిక దొరకబుచ్చుకొని మళ్ళా ఆ ముళ్ళను అలాగే విప్పుకుంటో చూచిరాతంత చక్కగా పద్యాలు
చెక్కి వుండక పోతే మనకీ రోజుకి ఇన్నేసి చక్కని కైతలపాతర్లు దక్కివుండేవా?
చింతచెట్టుచిగురు కంటబడంగానే 'చిన్నదాని
పొగరు' పాట చటుక్కుమని గుర్తుకొస్తుంది. రెండింటికి
సామ్యమేమిటో? నల్లటి బుర్రమీసాల ఆసామి ఎవరన్నా ముదురుపెదాల
మరుగునుంచీ బలిష్ఠమైన లంకపొగాకు చుట్టపీకొకటి
లంకించుకుని గుప్పుగుప్పుమని పొగవదుల్తూ కనిపిస్తే రైలుబండే రోడ్డు
మీదకొచ్చినట్లు అనిపిస్తుంది ఎంత జడ్డికైనా. అక్షరానికి అందకుండా అగరుధూపంలా
అనుభవించి వదిలేసే ఊహావల్లరులను అలా వదిలేసినా.. ఎన్నటికీ అణగిపోని కొన్నిభావమణుల
వెలుగుజిలుగులు అంతరంగం అడుగుల్లో మిగిలే ఉంటాయి. తెరవెనక్కి వెళ్లినట్లే వెళ్ళి ఆ
దృశ్యమో.. సాదృశ్యమో తటస్థించినప్పుడు సరికొత్త సామ్యాలతో మళ్ళీ మనోయవనిక ముందు
మెరుస్తుంటాయి! ఎందుకని అలా?!
కుసుమశరుడిలాగా భావసుందరీ మనసిజే. ఒక్కరుద్రుడికే
మన్మథుడు దద్దరిల్లాడు. కాని ఏకాదశ రుద్రులెదురైనా భావసుందరి సిగకొసనయినా కదలించలేరు. ఏ బంగారిమామ బెంగపడ్డా, ఏ బిచ్చగత్తె వొరుగులాంటి వడలిపోయిన కాయంతో
చింపిరి తలా, చిరుగువలువల్తో నడవలేక నడుస్తూ వీధివాకిట్లో నిలబడ్డా, మరకతాలు పరచినట్లున్న పచ్చని ఆకుమళ్ళ గట్లమీద చేరి అన్నంమూటలు విప్పుకుంటో వర్షాభావంవల్ల
వాలుమొహాలు వేసుకొన్న వరినారునుచూసి అన్నదాత కళ్ళు చెమ్మగిల్లినా, నురుగులుకక్కే దేహంతో కష్టాలకావిళ్ళు మోసే
కూలన్న మెలిబడ్డ నొసటిరేఖ కంటబడ్డా, ఎక్కడో దూరంగా ఉన్నప్రేయసి చూపులో చూపుంచి ఆలపించే అతిసుందర నిశ్శబ్ద మంద్ర కాకలీ స్వరం చెవిన
బడ్డా, తళుక్కుమని మెరుస్తుందే మానసాంబరవీధిన భావతారాతోరణం!. ఏ సూత్రం ఆధారమో ఈ
వింత పులకింతధారలకు?
మబ్బుకు దివిటీపట్టే మెరుపువిద్యంటారే మరి
దీన్ని విజ్ఞులు?! చూసిన చిత్రం.. చేసిన భావం మాటల్లోనో
మనసుల్లోనో భద్రంచేసి, సమయంచూసి
సూటిగా లక్ష్యాన్ని చేదించటమంటే మరి మాటలా? కలానికి కాలానికి కట్టుబడి ఎలా ఉంటుందీ తత్వం? అలుగులు
పారే సజీవకళతో ఉరకలెత్తే నిత్యచైతన్య ప్రవాహోత్శి కదా కవిత్వం! 'నదీనాం సాగరో గతిః' చందంగా
పొర్లుకునివచ్చే భావవాహినికి ఆనకట్టలు
కట్టి పంటకాలువలు తీసి పూలు, పండ్లు పెంచి లోకానికి ఆ జీవప్రసాదాన్ని పంచే వనమాలి కదూ కవి! ఉఛ్చృంబలంగా సాగే జీవప్రవాహం
ఏ కొండో, బండో అడ్డగిస్తే.. వెనక్కి మళ్లటమూ, ఉబికుబికి ముందుకు ఉరకటమూ, ఏ లోయో పల్లమో సంప్రాప్తిస్తే.. హడిలి అంతెత్తు
పై నుంచీ మోతలుపెట్టుకుంటో పాటుగా దూకిపడి
ముందుకు సాగటమో.. ఏ వంపో, ముంపో తగిలినప్పుడు తలప్రాణం తోకకొచ్చినట్లు సుళ్ళుతిరిగి ఊగటమో!
కవిత్వతత్వమూ అదేనేమో! అదే!
కవి జీవనయానంలో అందమైన విఘాతాలు అప్పటికైతే విస్మృతిలోకి
వెళ్ళిపోయినా.. మనసు అడుగు పొరల్లోనే ఎక్కడో పడుకుని ఉంటాయి. వాస్తవజీవితం ఏ
కష్టంతోనో, ఇష్టంతోనో ముష్టియుద్దానికో, ముద్దులాటకో
సిద్దమైన క్షణంలో.. పునరుత్తేజితమై జీవం పోసుకొని తెరముందుకు ఉరికి
వచ్చేస్తుంటాయి.
అలా రావడమే అసలు సిసలు కవిత్వతత్వ రహస్యమేమో!
మరి రససిద్ధులైన పెద్దలేమంటారో.. ఏమో!
-కర్లపాలెం హనుమంత రావు
వాకిలి- అంతర్జాల పత్రిక- మే 2013లో ప్రచురితం
No comments:
Post a Comment