Monday, June 29, 2015

అలా అయితే మనమే ఒలంపిక్సులో ఛాంపియన్స్!- సరదా గల్పిక


ఏడు దశాబ్దాలు  గడిచిపోయాయి.. దేశం దాస్యం సంకెళ్ళు తెంచుకొని! దాని దుంపతెగ.. ఏడుగురికిమించి ఒలంపిక్సు విజేతలు మన దగ్గర తేలకపోతిరే! నూటపాతిక కోట్లమందున్నాం        జనాభా! ఎందుకూ?  దేశమాత పరువు గంగలో కలుపుతున్నాం అందరం!
ఒలంపిక్సు ఇప్పట్లో లేవే! ఇప్పుడెందుకబ్బా ఈ దెప్పుళ్ళూ! ఉన్నప్రతిభను పట్టించుకోకుండా.. లేనివాటిని.. తేలేని వాటిని గురించి విలపించడం ఈ మద్య మరీ ఫ్యాషనై పోయింది! దేశమాత పరువు పోతోందని బావురుమంటున్నావు గానీ.. ఆ లోటు తీరుస్తున్న మనపాలిటిక్సు పెద్దల్నిమాత్రం  తెగ తిట్టిపోస్తున్నావ్!
క్రీడలలోటును రాజకీయాలు పూడ్చడమా? పెద్ద జోక్!
ఒలంపిక్సులో మన రిలే ఆటగాళ్లెప్పుడూ బొక్కబోర్లా పడుతుంటారని నువ్వేగా తెగ విమర్శిస్తావు! ఆ లోటునిప్పుడు మన రాజకీయవేత్తలు ఎంత వడుపుగా   పూడుస్తున్నారో చూడవా! నెహ్రూజీనుంచి పుత్రిక ఇందిరా ప్రియదర్శిని, ఆ ప్రియదర్శిన్నుంచి బిడ్డ రాజీవ్ గాంధీజీ, ఆ రాజీవ్ జీనుంచి భార్యామణి సోనియమ్మాజీ, ఆ సోనిమ్మాజీనుంచి ఇప్పుడు బుజ్జి రాహుల్ బాబూజీ.. ఇలా ఐదు తరాలబట్టీ ఆ   ‘జీ’ళ్ల ఫ్యామిలీనే అధికార మంత్రదండం  రిలే పరుగులతో ఎలా 'చేతులు' మార్చుకొంటూ నెట్టుకొస్తుందో నీకు పట్టదు! ప్రపంచంలో ఎక్కడైనా మరీ ఇంత కట్టుదిట్టమైన రిలేపరుగులు నడుస్తున్నాయా నువు చెప్పు!
ఓహో!.. అలాంటి క్రీడలా బాబూ తమరు చెప్పేది! ఆ ఆట ఇక్కడ మన తెలుగురాష్ట్రంలోకూడా  ఆడనివ్వడంలేదనేగా  జగన్ బాబు అలక పానుపెక్కింది!
ప్రస్తుతానికి ఆ టాపిక్కు అప్రస్తుతంలే! ట్రాకు తప్పితే నాకు  టాకు కష్టమవుతుంది.  ముక్కూమీదా మూతిమీదా రక్తాలు కారేటట్లు గుద్దుకునే మీ బాక్సింగూ ఓ
క్రీడేనంటావా? దెబ్బంటే కంటికి కనపడకుండా పడాలి! మూడో కంటికి తెలీకుండా మట్టి కరవాలి! చేతికి మకిలంటకుండా గొయ్యి తియ్యాలి. ఏ క్రిమినల్ సెక్షన్లకందకుండా క్షురకర్మకాండమొత్తం గమ్మున  కానివ్వడంలోనే ముష్ఠికళంతా బైటపడాలి. అలాంటి క్రీడానైపుణ్యం కోకొల్లలుగా ఉన్నా మన రాజకీయనేతల్ని నువ్వేనాడన్నా  నోరారా 'శభాష'న్నావా? ఏడుపదులు దాటిన ఎవడో మూడుకాళ్ల ముసలిడొక్కు గుర్రపుస్వారీ కళలో తెగ మెప్పించేసాడని డప్పుకొడుతున్నావ్ గానీ, కాటికి కాళ్లు చాపీ.. ఒంట్లో ఓపిక లేకపోయినా.. వృద్దపితామహులు ఎందరో వళ్ళు తూలుళ్ళనుకూడా లెక్కచేయకుండా వణుక్కుంటూ వణుక్కుంటూ రాజకీయాలను ఎంత కళగా నెట్టుకొస్తున్నారో! వాళ్లనొక్కమారైనా నోరారా పొగిడిన పాపాన పోయావా? మనదేశ పతాకం లండన్లో ఎగిరినా, లడక్లో గింగిరాలు కొట్టినా  నీ వళ్లోకేమీ బంగార్రాసులు  వచ్చి రాలవుగదా సోదరా! సర్కారువారి బుగ్గకారు నీ కొచ్చి.. దానిమీదగానీ నీ పార్టీజెండా ఎగురుతుంటేనేగదా దర్జా.. దర్పం! బోడి  ఒలంపిక్సు రికార్డులకోసం అంతలా కొట్టుకు చావడ మంతవసరమా? నీ కన్నా ఖిలాడీగాడెవడో వచ్చి నీ రికార్డులుగట్రా  బద్దలుకొట్టేస్తే నీ ఆట శాశ్వతంగా కట్టయి పోయినట్టేగదా! అంతమాత్రం దానికి ఇన్ని అష్టకష్టాలు దేనికి.. ఆలోచించవా? నీ కన్నవాళ్ల చేతుల్లో ఎన్ని వందల బంగారు పతకాలైనా పొయ్యి.. ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టుకి అవేవీ ఎప్పటికీ సాటిరావు. మెడలు ఇరగ్గొటుకొని  వంద మెడల్సు నువు సాధించినా సర్కారుపెద్దలు దయతలిస్తేనేనబ్బా  రొక్కమైనా.. శివార్లలో భూమిస్తానన్న హామీ ఐనా నీకు దక్కేది! అదే నీకు నువ్వే ఓ ప్రజాప్రతినిధివయావనుకో! వయా ఎమ్మేల్యే సీటు రూటులో కోట్లక్కోట్లు  ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేకుండానే కుమ్మేసుకోవచ్చు!  రకరకాల పతాకాలు మన ఇందిరాపార్కుదగ్గరి   ధర్నాచౌకులో రోజూ రెపరెపలాడుతుంటాయ్..  మరి దేనికోసమంట?!
నీ ఒలంపిక్సులో ఓ పక్షం రోజులే జెండా పండగ.   మన రాజకీయాల్లో రోజూ జెండాల పండుగే!  అక్కడి ఆటలు మొత్తం కలిపి కూడినా ఓ మూడొందలు మించుండవు మహా. అదే మరి మన రాజకీయాల్లోనో? రోజుకో కొత్తరకం ఆట! ఒలంపిక్కు ఆటల్ను అటల్బీహారీబాజ్పాయి ఇప్పుడున్న స్టేజిలోకూడా ఒంటిచేత్తో ఈజీగా  నిర్వహించేసవతల పారేయవచ్చు. పాలిటిక్సుక్రీడల  నిర్వహణకి ఎంత పరిణితి  అవసరం? అధిష్ఠానం కనుసన్నల్లోనే కదులుతుండాలా! తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతుండాలా!  కుంగ్ఫూలూ, కరాటేలూ, పంచిలూ, ఫెన్సింగులంటూ ఏవో నాలుగు బోర్డ్లు ఎవరెవరో మెళ్ళకు తగిలించేసుకొని బోరవిరుచుకోంగానే వాటికి నువ్వింతగా హారతులు పడుతున్నావే! అంతేలే! పెరటిచెట్లు మందుకు పనికిరావన్నట్లు .. మన రాజకీయక దిగ్గజాలు దుగ్గూదూగర్లా  నీకంటికానరు! నీ ఒలంపిక్సు  నాలుగేళ్ళకొక్కసారొచ్చి పోయే కొక్కిరాయి సంబడం. భూమి పుట్టకముందునుంచి ఉందబ్బా  మన భారతీయుల రాజకీయ క్రీడావైభవం!
ఒలంపిక్సులో నువ్వెంత ఒళ్ళిరుచుకొని నైపుణ్యం చూపించినా చివరకు దక్కేది
ఒక్క బంగారబ్బిళ్లేరా! అదే మన రాజకీయాల్లో?  వడుపు చూపి ముందుక్కదిలివానుకో..   వళ్లుకందకుండానే కిలోలకొద్దీ  బంగారం కందకాల్లో దాచుకోవచ్చు!  ఒలంపిక్కా?.. వాన్ పిక్కా? అని నీకింకా సందేహమేనందువా?
సందు లేకుండా వాయగొడుతున్నావ్! ఇహ సందేహమెందుకుంటుందులే!  అయితే అసలు సిసలు   ఆటలన్నింటినీ అటకెక్కించాల్సిందేనంటావ్ నువ్వు?!
మరి! నీ మాయదారి ఆటల్లో మ్యాచ్ ఫిక్సింగు పీడా ఒకటి! ఆ ముద్ర ఒక్కసారి పడిందనుకో.. ఆటగాడి లైఫుగాడీ పర్మినెంటుగా షెడ్డుపాలు! అదే తంత్రం రాజకీయాల్లో వడుపుచూసి వదిలావనుకో.. పదవులే పదవులు! కోట్లే కోట్లు! సంపదే సంపద! అవినీతిని కడిగిపారేస్తానన్న మీ అన్నాహజారేనే ఒకదశలో రాజకీయక్రీడలమీద తెగ మోజు చూపించాడబ్బా! పొలంబాట.. బడిబాట.. బస్తీబాట.. పాట ఏదైనా అదంతా రాజకీయాల్లో ఒక కొత్తరకమైన ఆటేరా బుజ్జికన్నా! వయసుతో నిమిత్తం లేకుండా పెద్ద పెద్ద వృద్ధనేతలుసైతం  పాదయాత్రలుకు ఎందుకు  ‘సై’ అంటారంటావ్?
    ఆ మారథాన్ మూలకంగా  ఆరోగ్యం బాగుపడుతుందనీ!
అమాయకుడా! నువ్వు బాగుపడవురా ఈ జన్మకింక! మూలబడ్డ పొలిటికల్ బతుకుబండిని మళ్ళీ రోడ్డుమీదకు లాగాలని..  జనంమధ్య మహారాజులా మళ్ళా ఊరేగాలని ఆ ఉబలాటమంతా! ఒలంపిక్సు నడిచే నాలుగురోజులేగా జనంనోళ్లలో నీ చాంపియన్ల పేరు తెగ నలిగేది! అదే రాజకీయాల్ని నమ్ముకొన్నావనుకో! రోజూ మీడియాలో డబల్ రోస్టు పెసరట్ విత్ అల్లం ఉల్లి పేస్టు! అమ్ముడుపోతూ బైటపడితే   ఆటగాడి బతుకింక చాకిరేవుబండమీది చింకిపాత సామెతే! అదే రాజకీయక్రీడల్లో?  అమ్మకం గ్లామరుకు గుర్తు. ఆనక పదవికి  పైపదవికి ప్లస్సు. ఇహ ప్రచారానికైతే   ఉండదు కానీ ఖర్చు!
ఐనా కానీ మన రాజకీయనాయకులమీద నాకింకా  ఎందుకో ఏమాత్రం నమ్మకం,  గౌరవం కలగడం లేదు బాబాయ్!
వాళ్లనలా వదిలేయవోయ్! ఒలంపిక్సులో పతకాలు రావడంలేదనేగా పదిరోజులబట్టీ శతకాలు చదువుతున్నావ్!  నీ కోరికతీరే దారొకటుంది.. చెప్పనా! పెద్ద పెద్ద ఆటగాళ్ళకు బదులుగా  మన సగటు నగరం ఓటర్లలో ఎవర్నైనా ఒలంపిక్సు గోదాలోకి దింపి చూడు! స్వర్ణాలకు స్వర్ణాలే స్వర్ణాలు!  వాటికవే దొర్లుకుంటూ మెళ్లోకొచ్చి పడతాయ్!  మరి దానికేమంటావ్?

అదెలాగా?!
వెయిట్ లిఫ్టింగు పోటీలకు గ్యాసుబండల్ని అవలీలగా మోసే  మీ పక్కింటి పిన్నిగారిని పంపరా! దూదిపింజల్లా ఆ బరువుల్నెత్తవతల పారేయకపోతే నా నెత్తిమీద ఓ బండేసి మొత్తరా! మన భాగ్యనగర రహదార్ల గోతుల్ని దాటివెళ్లే వాళ్లెవర్ని ఎన్నికచేసి పంపించినా చాలు..  పోల్ జంప్ ఈవెంటులో పోలెండు రికార్డు బద్దలవడం ఖాయం. బస్సులమీదా, వేదికలమీదా రాళ్లు విసిరే బాపతు  అనుభవం.. డిస్కస్ త్రో ఈవెంటుకి కలిసొచ్చే నైపుణ్యంరా బాబూ! స్కూలు బస్సుల వెనకాల పరుగెత్తే బడికెళ్లే బుడతళ్ళు ఎంత లావు 'బోల్టు'నైనా పరుగుపందెంలో  పల్టీ కొట్టించెయ్యగలరు. ఎలాగూ మనకు మోదీజీ ఉండనే ఉండె! యోగా మోడల్లో ఒలింపిక్   క్రీడల్లో  రాజకీయాలుకూడా   చేర్చేట్టు చూడు! రాబోయే  ఒలంపిక్సులో బంగారం పతకాలన్నీ మనవే! దానికేగా నీ ఏడుపు!
***

-కర్లపాలెం హనుమంతరావు
(ఈ నాడు - ఆగస్టు 14-2012 దినపత్రికలో ప్రచురితమైన దానికి చిరుసవరణలతో)





No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...