కామేశ్వర్రావు గొప్ప రచయిత. అది కామేశ్వర్రావు అభిప్రాయం.
నవల, నాటకం, కథ,
గల్పిక, కవిత, వ్యాసం.. ఒక అంశమనేమిటి? ప్రాచీన సాహిత్యంనుండి..
ఆధునికాంతర అస్తిత్వవాదం వరకు.. అతగాడు చేయని నాదం లేదు. అదృష్టమేమంటే అతడు రాసిన ఒక్క ముక్కా ఇంతవరకు వెలుతురు ముఖం చూడకపోవడం.
దురదృష్టం ఏమంటే అతగాడు గొడ్డు
కార్యశూరుడు కావడం.
ఎలాగైనా సరే అచ్చులో తన పేరు చూసుకొనే తీరాలని శపథం పట్టి ఉన్నాడు మహానుభావుడు!
అప్పటికీ అతగాడి అచ్చుముచ్చట ముచ్చటగా మూడుసార్లు తీర్చనే తీర్చాడు పైనున్న భగవంతుడు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించడం మొదటిసారి తీర్చిన ముచ్చట. పెళ్లి శుభలేఖలో వరుడిగా పేరచ్చేయించడం రెండోసారి తీర్చిన ముచ్చట. ఆ మధ్య ఆంధ్రాబ్యాంకు వాళ్ళు
బంగారంమీద లోనుతీసి పంగనామం పెట్టిన మొండిబకాయిదారుల జాబితా ఓటి నోటీసులాగా
పత్రికల్లో ప్రకటించారు. అందులో
కామేశ్వర్రావుపేరూ అచ్చయేటట్లు చూసి ముచ్చటగా మూడోసారి అతగాడి అచ్చుముచ్చట తీర్చాడు భగవంతుడు. అయినా కామేశ్వర్రావు అచ్చుదాహార్తి అంతటితో తీరింది కాదు. అతగాడికి కావాల్సింది రచయితగా.. ప్రముఖ పత్రికలో..
ధారావాహికంగా పేరు అచ్చులో కావడం!
ఆ ధ్యేయంకోసం కామేశ్వర్రావు దాడిచేయని పత్రిక లేదు ఆంధ్రదేశంలో. చందమామనుంచి చతురవరకు ఓ పట్టు పట్టాడు. పడుతూనే ఉన్నాడు. అతగాడి పోటుకు తట్టుకోలేక కొన్ని
పత్రికలు కొట్టు కట్టేసాయి కూడా.అయినా దిన, వార, పక్ష, మాస, ద్వైమాసిక, త్రైమాసిక, అర్థవార్షిక,
వార్షిక సంచికలు వేటినీ అతను వదిలి పెట్టింది లేదు. అదేం చిత్రమో! అన్ని పత్రికలదీ అతని రచనలమీద ఒకటే అభిప్రాయం. కూడబలుక్కొన్నట్లు అందరూ తిరుగుటపాలో అతని రచనలు తిప్పి పంపేస్తుంటారు! ఆ వీధి పోస్టుమేన్ అతని తిరిగి వచ్చే రచనలు మోయలేకే టపా కట్టేసాడని
వినికిడి.
కొత్త పత్రిక ఒకటి వస్తున్నదన్న ప్రకటన ఒకటి వెలువడిందీ
సారి. వెంటనే కామేశ్వర్రావు ఒక టన్ను బరువున్న నవల గీకిపారేసి ఆ పత్రిక్కి పంపించేసాడు. దానితో పాటు ఒక ఉత్తరంకూడ జత
చేసాడు. 'ఆంధ్రసాహిత్యాన్ని కాచివడబోసి చేసిన బృహత్ప్రయత్నం ఈ నవలారాజం. దీన్ని
ప్రచురించుకొనే మొదటి అవకాశం మీ పత్రికకే ప్రసాదిస్తున్నాను. స్థలాభావమే కారణమైతే సంకోచించనవసరం లేదు. కత్తిరించుకొనే
స్వేచ్చ మీకు ధరాదత్తం చేస్తున్నాను..' ఆవటా అని.
వారం రోజులతరువాత పోస్టుమాన్ ఓ బండిల్తో వచ్చి కామేశ్వర్రావు ఇంటరుగుమీద కూలిపోయాడు. బండిలు విప్పి చూసాడు కామేశ్వర్రావు. అందులో ఒక ఉత్తరం! పత్రిక
సంపాదకులనుంచే!
'అయ్యా! మీ నవలను పరిశీలించడం
జరిగింది.. కత్తిరించే స్వేచ్చను ధారాదత్తం చేసినందుకు బహుథా కృతజ్ఞతలు.
సమయాభావంచేత మేమా సత్కార్యం చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. మీరే స్వయంగా ఆ ఘనకార్యం చేసుకోగలరని విన్నపం. వీలుగా మా పత్రిక తరుఫునుంచి మీకు ఒక కత్తెర బహుమానంగా పంపుతున్నాం!
ఇట్లు
సంపాదకుడు.
***
-కర్లపాలెం హనుమంతరావు
చతుర కథలు- చతుర- సెప్టేంబరు 2000
No comments:
Post a Comment