Thursday, June 18, 2015

ఆపరేష(షా)న్ ! - సీరియస్లీ సిల్లీ స్టోరీ




మా కొలీగ్ సుబ్బారావు తనకు వంట్లో బావోలేదని ఆసుపత్రికి వెళుతుంటే నేనూ తోడు వెళ్ళా.
బైట బోలెడంత క్యూ. గంటకయినా లోపలికి పోవడం అనుమానమే. ఆఫీసుకి టైమయిపోతుందని నేను కంగారు పడుతుంటే కారిడార్లలో గుర్నాథం కనిపించాడు. నన్ను గుర్తుపట్టి పలకరించాడు.
గుర్నాథం హైస్కూల్లో నా క్లాస్ మేట్. చాలా ఏళ్ళతరువాత అనుకోకుండా ఇక్కడ కలిసాడు. నేను వచ్చిన పని కనుక్కొని చనువుగా 'డాక్టరుగారు నాకు బాగా తెలుసులేరా! నువ్వెళ్ళు! మీ ఫ్రెండు పని నేను చూస్తాలే!' అన్నాడు.

ఆ సాయంత్రం సుబ్బారావు గుర్నాథాన్ని ఒహటే పొగడటం! 'మీ ఫ్రెండుకి మా చెడ్డ ఇన్ఫ్లుయన్సుందండీ! చకప్పులూ అవీ చకచకా చేయించేసాడు. రిపోర్టులు తీసుకొని తనే వస్తానన్నాడు' అన్నాడు సంబరంగా.
గుర్నాథం స్కూలురోజుల్లో యావరేజి. వెనుక బెంచీలో కూర్చోని ఎప్పుడూ ఏవేవో పెన్నులు రిపేరు చేస్తుండేవాడు. వాడి సంచీలో పుస్తకాలు అన్నీ ఉన్నా లేకపోయినా.. రకరకాల కలం కేపులు, పాళీలు, నిబ్బులు, సిరాబుడ్డి, చెత్తగుడ్డపీలికలు మాత్రం నిండుగా ఉండేవి. మూడుపైసలకు కేపు, రెండు పైసలకు నిబ్బు, పైసాకి పాళీ.. పెన్నుమొత్తమయితే అణా.. అలా అమ్మేవాడు పాత కలాలని. అణాలు, పైసలు చలామణిలో ఉండే జమానాలేండి అది. అప్పట్లో ఇప్పట్లా బాల్ పెన్నులు కాకుండా సిరా నింపుకొని రాసుకొనే రకం కలాలు వాడకంలో ఉండేవి. మా మాస్టార్లుకూడా ఈ గుర్నాథం బుట్టలో పడుతుండేవాళ్ళు! అవసరం వచ్చినప్పుడు వాడు వాళ్ళకీ పేనాలు ఉచితంగా తయారు చేసిస్తుండేవాడు.  అందుకని ఏమనేవాళ్ళు కాదు.
పదో తరగతి పరీక్షలు రాసే రోజుల్లో సమాధాన పత్రాలు తారుమారు చేసాడని డిబారు చేసారు వాణ్ణి. ఆ తరువాత ఇదిగో ఇప్పుడే.. మళ్ళీ దర్శనం!
గుర్నాథం తెచ్చిన రిపోర్టులు చూసి గుండె ఆగిపోయినంత పనయింది  సుబ్బారావుకి. కిడ్నీలో ప్రాబ్లమున్నట్లు తేలింది. 'ఆపరేషన్ అవసరమంటున్నాడు డాక్టర్' అన్నాడు గుర్నాథం తాపీగా.
కిడ్నీ ట్రాన్సప్లాంటేషనంటే మాటలా? దానికి ముందు డయాలసిస్. డయాలసిస్ అంటే లక్షల్లో వ్యవహారం. ముందు డోనర్ దొరకడమే గగనం. కిడ్నీదాత బంధువు కాకపోతే ఆథరైజేషన్ కమిటీ అప్రూవల్ అవసరం. అదంత తేలికగా తెమిలే వ్యవహారం కాదు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్లు రిస్కు తీసుకోవడానికి బాగా జంకుతున్నారు. మరీ ఈ మధ్య ఈ కిడ్నీ కేసుల చుట్టూతా గవర్నమెంటు నిఘా  పెరిగిన తరువాత.
'కేసులవుతాయేమోనని భయం. అవన్నీ నేను చూసుకొంటాగాని.. మనీ సంగతిమాత్రం మీరు చూసుకోండి' అని అభయమిచ్చాడు గుర్నాథం.
'ఎంతవుతుందేమిటీ?'  సుబ్బారావు సందేహం.
'సుమారు నాలుగయిదు లక్షలు'
'అమ్మో! గవర్నమెంటు ఉద్యోగినికూడా కాదు. ఎక్కణ్ణుంచి తవ్వి తేవాలీ అంత డబ్బు?' అంటూ సుబ్బారావు గుండెలు బాదుకొన్నాడు. '
'ఇదింకా చీపండీ! లివరయితే ఏడు లక్షలు. హార్టు, లంగ్సు ఆపరేషనయితే అంతకు రెట్టింపు. కంటిగుడ్డుకు వాడే కార్నియానే ఐదు లక్షలు పోస్తేగాని దొరకడంలేదు మార్కెట్లో'
రైతుబజారులో కూరగాయల దరవరల్లాగా ఏకరువు పెడుతున్నాడు గుర్నాథం.
'చూస్తూ చూస్తూ వంట్లోని పార్టుల్ని ఎవరమ్ముకొంటార్రా? ఏదో సినిమాల్లో అలా చూపిస్తుంటారుగానీ' అన్నాను నేను అక్కడికీ నమ్మకం కుదరక.
'పేదరికం ఎంత పనయినా చేయిస్తుంది బాబూ! మెదడు చచ్చిపోయినా గుండె కొట్టుకొంటుంటే చాలు.. ఇలా చాలా అవయవాలని తీసి హాయిగా వాడుకోవచ్చు. ఇవాళా రేపూ ఆ వ్యాపారం బాగా ఊపందుకొందికూడా మిత్రమా! పేపర్లలో వచ్చేవే వార్తలు కావురా బాబూ! వాటికి వెనకాల సమాంతరంగా అంతకుమించిన ప్రపంచం పరుగెడుతోంది' అన్నాడు గుర్నాథం.
'ఎంత అన్యాయం!' గుండెలమీద చెయ్యివేసుకొన్నాడు సుబ్బారావు తబ్బుబ్బయిపోతూ.
'ఇందులో అన్యాయం ప్రసక్తేముంది?అవసరం అలాంటిది. ఇంద్రుడు వజ్రాయుధంకోసం దధీచి పక్కటెముకలు లాగేసుకోలా? కవచకుండాలలనికూడా దానం చేసిన కర్ణుడికథ మనకు కొత్తా? డబ్బు పడేస్తే లివర్లయినా ఫ్లవర్లలో పెట్టి ఇస్తున్నారు సార్ ఈ కాలంలో! గుండెకాయలు బెండకాయల్లా, కంటిగుడ్లు కోడిగుడ్లలా మారకం జరిగిపోతున్నాయి. యూరప్ లాంటి డెవలప్డ్ కంట్రీసులో అయితే ఏకంగా 'యునైటెడ్ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్స్ సేల్' అని భారీ నెట్ వర్కే నడుస్తోంది బ్రహ్మాండంగా’.
'చట్టం చూస్తూ వూరుకొంటుందా?!’
'ఎందుకూరుకొంటుంది సార్? తనపని తాను చేసుకు పోతుంటుంది. నెట్ వర్కూ తనపని తాను చేసుకు పోతుంటుంది. ఇక్కడిలాగానేఒకరి పనిలో ఇంకోరు జోక్యం చేసుకోకుండా డబ్బుమూట చూసుకొంటుంది'
గుర్నాథం చెప్పిందాంట్లో అతిశయోక్తేమీ లేదనే అనిపిస్తోంది. డబ్బుకు చట్టం చుట్టం కానిది ఎక్కడలేండి?! ప్రాణంతీపిముందు ఎన్ని ధర్మపన్నాలైనా చేదుగానే ఉంటాయికదా!
'మీరు ఆలోచించుకొని కబురు చేయండి!.. వస్తా!' అని విజిటింగ్ కార్డొకటి ఇచ్చి కాఫీతాగి వెళ్ళిపోయాడు గుర్నాథం.

సుబ్బారావుగారింట్లో రెండు రోజులు ఒహటే మల్లగుల్లాలు. పాపం! సుబ్బారావు గవర్నమెంటు ఉద్యోగైనా కాదు.. కనీసం ఖర్చులైన్నా రాబట్టుకోడానికి. ఇంట్లోని బంగారం, ఊరి బైట అప్పుడెప్పుడో కొనుక్కున్నస్థలం అమ్మైనా సరే .. ఆపరేషన్ చేయించుకోవాల్సిందేనని పట్టుపటుకు కూర్చొంది సుబ్బారావుభార్య. 
గుర్నథాన్ని పిలిపించి పరిస్థితి వివరించాం. ‘ఉన్నంతే ఇవ్వండి. మిగతా సర్దుబాట్లేవన్నా ఉంటే చూసుకోడానికి నేనున్నాగా!’ అంటూ అభయహస్తం ఇచ్చాడు.  
డోనర్ని చూపించమన్నాడు సుబ్బారావు. అన్నంరాజు అనే అతన్ని కలవమని అదేదో అనాథ శరణాలయం చిరునామా ఇచ్చాడు గుర్నాథం.
గుర్నాథం మనుషులమని నమ్మకం కుదిరాక  సగం రేటుకే బేరం కుదురుస్తానని ఉత్సాహం చూపించాడా అన్నంరాజు.
డోనర్ని మాత్రం ఇప్పుడే చూపించకూడదంట! 'లోపాయికారీ వ్యవహారాలు  కదండీ ఇవన్నీ! పదేళ్ళబట్టీ ఈ వ్యాపారంలో ఉన్నాను. నన్ను మీరు నమ్మాలి' అన్నాడు అన్నంరాజు. నమ్మకమాత్రం చేసేదేముంది గనక?
సగం పైకం ముందే గుంజుకొన్నాడు అన్నంరాజు.
'డాక్టరుగారు ఆపరేషన్ డేట్ ఇచ్చిందాకా కిడ్నీకి రెంట్ కడుతుండాలి. నెలకు నాలుగువేలు. డోనరు కిడ్నీని వేరేవారికి అమ్ముకోకుండా ఆపటానికి, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. ఆ మాత్రం భరించక తప్పదు. ఆఫ్ట్రాల్ ఆపరేషన్ అయిన తరువాత  ఆ కిడ్నీ మనదే అవుతుంది కదండీ చివరికి?' అని ఆ పెద్దమనిషి లా పాయింటూ!
డాక్టరుగారి డేట్ మూడు నెలలకుగాని దొరకలేదు. అంత బిజీట ఆయన! ఈ మూడు నెలలు క్రమం తప్పకుండా డయాలసిస్ తప్పటంలేదు సుబ్బారావుకి.

సుబ్బారావీ మధ్య చిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 'ప్రతీ మనిషికి కనీసం నాలుగు కిడ్నీలైనా ఉండాలి. అలాగే ఆరేడు జతల చేతులు, పది జతల కాళ్ళు, నాలుగైదు జోళ్ళ చెవులు, కళ్ళు, రెండు మూడు ముక్కులు, వందనాలికలు, నాలుగయిదు  గుండెలుకూడా ఉంటే బావుంటుంది.' ఇలా సాగుతోంది సుబ్బారావు ధోరణి.
రెండు చేతులుంటేనే మనిషిచేసే ఆగం తట్టుకోలేక పోతోంది లోకం. ఇహ పదులు.. ఇరవైలు మొలుచుకొస్తే జరిగే ఆగడాలని ఊహించగలమా?!
'ఒక్క తలకే  ఇంత లావున తిరుగుతోంది మీకు! పదేసుంటే ఇహ పట్టుకోగలమా తమర్నీ.. తమ తి.క్కనీ! ' అని శాపనార్థాలకు దిగింది సుబ్బారావుగారి శ్రీమతి. భర్త పిచ్చిమాటలు  విని విని పాపం ఎంతగా విసిగిపోయిందో ఆ ఇల్లాలు!
'ఇందులో తిక్కేముందే పిచ్చిదానా! శివుడికి మూడు కళ్ళు లేవూ? విష్ణుమూర్తికి నాలుగు చేతులు, బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు, రావణాసురుడికి పది తలకాయలు, కార్తవీర్యుడికి వెయ్యి చేతులు, దేవేంద్రుడికి వెయ్యి కళ్ళు!  దేవుళ్లందరికీ అన్నేసి అవయవాలుండగా లేనిది మానవులకు అందులో కనీసం సగమైనా ఉండాలని కోరుకోవడం తిక్కా?!'
ఒక అవయవం పాడైనా మరోటి పనికొస్తుందని కాబోలు సుబ్బారావు ఆశ. 'ఈసారి దేముడు కనబడితేమాత్రం రకానికో జత స్పేరుగా ఇవ్వమని పట్టుబట్టడం ఖాయం' అంటో సుబ్బారావు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మనసంతా దేవినట్లయిపోయింది.

ఎలాగైతేనేం.. సుబ్బారావుకి ఆపరేషన్ అయిపోయింది.
మూడో రోజు గుర్నాథం పేరు వార్తాపత్రికల్లో వచ్చింది ప్రముఖంగా ఫొటోలతో సహా. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆ రోజంతా ఆ మహానుభావుణ్ణి గురించిన సమాచారమే!
మానవ శరీరావయవావలను అమ్మే వ్యవహారంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఓ ప్రముఖ వార్తాపత్రిక వివరాలతోసహా వరుస కథనాలను ప్రచురించడం మొదలుపెట్టింది. ఈ గోల్ మాల్ మొత్తంలో గుర్నాథానిదీ ఓ ప్రధాన పాత్ర!
అరెస్టు చేయడానికని వెళ్ళిన పోలీసులు అతగాడు గుండెనొప్పి వచ్చిందన్నాడని కోర్టు ఆదేశాలమీద నిమ్సు ఆసుపత్రిలో చేర్చి బైట పహరా కాస్తున్నారు.
నేర పరిశోధక బృందం అన్నంరాజు అనాథ శరణాలయంమీద ఆకస్మిక దాడి చేసినప్పుడు బోలెడన్ని అవయవాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి బైటపడ్డాయని వార్త! కిడ్నీలు, లివర్లు, కళ్ళు.. వంట్లో అమ్ముకోవడానికి వీలున్న ఏ అవయవాన్నైనా సరే చెట్టుమీదనుంచి కాయలు కోసిచ్చినట్లు కోసిచ్చే ఏర్పాట్లు ఆ అనాథ శరణాలయంలో  జరుగుతున్నాయిట! అందుకు అనుగుణంగా అక్కడ  పెరుగుతున్న అనాథ బాలబాలికలను చూసి  నోరు వెళ్లబెట్టడం నేర పరిశోధక బృందం వంతయిందట!
కూరగాయలే సరిగ్గా దొరకని ఈ కరువురోజుల్లో అంతంత మందని  సేకరించి పెంచడమంటే మాటలా?!
ఆ ముక్కే ఎవరో పనిలేని చానెల్ వాళ్ళడిగితే ఆసుపత్రి శయ్యమీద విలాసంగా శయనించిన గుర్నాథంగారు చిద్విలాసంగా నవ్వి వినయపూర్వకంగా ఇచ్చిన సమాదానం
'అంతా ఆ పై వాడి దయ. ఆపైన సర్కారు పెద్దల సహకారం'
అన్నంరాజు అనాథశరణాలయంలోని పసిపిల్లలు తరుచుగా చనిపోతున్నారన్న విషయం అప్పుడు బైటపడింది! అనుమాన నివృత్తికోసం ముందురోజు పోయిన పిల్లలిద్దరి బాడీలను రీపోస్టుమార్టమ్ చేయిస్తే.. వచ్చిన రిజల్టు ‘షాకింగ్’!

బాడీల్లో చాలా పార్టులు మిస్సింగు!
ఉదయంబట్టీ వరసబెట్టి వస్తున్న ఆ వార్తల్ని చూసి చూసి సుబ్బారావు ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయాడు! మళ్లా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సొచ్చింది మాకు అర్జంటుగా!
ఎందుకైనా మంచిదని సుబ్బారావుబాడీని ఫుల్ స్కానింగు చేయించాం.  మా అనుమానం నిజమే అయింది. సుబ్బారావు వంట్లోని కిడ్నీలు మాయం!
గుర్నాథం రికమెండ్ చేసిన డాక్టరు  ఆపరేషన్ చేసింది- సుబ్బారావు కిడ్నీజబ్బు మాయం చేయడానికి కాదు. మంచి కిడ్నీని మాయం చేయడానికని ఆలస్యంగా తెలిసింది!
కిడ్నీధర కనీసం నాలుగయిదు లక్షలకు తక్కువ  పలికని రోజుల్లో .. నాలుగో వంతుకే ఆపరేషన్ చేయిస్తానని గుర్నాథం ఆఫరిచ్చినప్పుడే  అన్నిరకాలుగా ఆలోచించుకొని ఉండాల్సింది మేం!
'ఎలాగూ పోయే శాల్తీనేగదా అని ఆయన మంచి కిడ్నీని మా ఆపరేషన్ ఖర్చులకింద రాబట్టుకొన్నాం.. వ్యాపార ధర్మంగా! అదీ తప్పే?!' అంటూ బుకాయింపులకి దిగాడు బైలునుంచి  బైటికొచ్చిన పిదప అతికష్టంమీద సెల్లో దొరికినప్పుడు గుర్నాథం!
***
-కర్లపాలెం హనుమంతరావు
(శ్రీలక్ష్మి- మాసపత్రిక- మే/జూన్- 2012 సంచికలో ప్రచురితం)



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...