1976లో తన ‘మూడు
దశాబ్దాలు’ సంపాదకీయాల సంకలనానికి ముందుమాట రాస్తూ నార్ల వెంకటేశ్వరరావుగారు ‘‘కారణాలేవైనా నేటి సంఘంలో సంపాదకునికి, అతడి సంపాదకీయాలకు పూర్వపు గౌరవప్రతిష్టలు
లేవు. నా జీవితకాలంలో సంపాదకుని ప్రతిపత్తి ఇంతగా దిగజారిపోవడం నాకు మరింత
బాధాకరం." అన్నారు . మరి నలభై ఏళ్ళతర్వాత పత్రికారంగంలో ఇప్పుడు సంభవిస్తున్న
ఈ విపరిణామాలకు వారు సజీవంగా వుండివుంటే ఏవిధంగా స్పందించి వుండేవారో!
దేశంలో మరే ఇతర భారతీయ భాషాపత్రికలకు తీసిపోని రీతిలో
తెలుగుపత్రికారంగం ఈనాడు వెలుగొందుతోంది. సంతోషమే !
హిందీ పత్రికలు చదివే రాష్ట్రాల సంఖ్య ఎక్కువ. కాబట్టి సహజంగానే వాటి చలామణీకూడా (సర్క్యులేషన్) ఎక్కువ.
దక్షిణాది పత్రికల పురోగతి మొదలయింది గత మూడు దశాబ్దాలనుంచే.
గతంలో మలయాళ, తమిళ పత్రికలు తెలుగుపత్రికలకన్నా ఎక్కువ ప్రతులు అమ్ముడయేవి. కానీ ఇవాళ
మలయాళం తర్వాత తెలుగు ఆ స్థానం ఆక్రమించింది.
క్రియాశీలకంగా, సృజనాత్మకంగా, రంగుల హంగులతో ఆకర్షణీయమైన
లే-అవుట్లతో, స్పష్టమైన
ఛాయాచిత్రాలతో, ఆసక్తికరమైన శీర్షికలతో చొచ్చుకొనిపోతున్న
పత్రికలలో ప్రథమ స్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకున్నాతెలుగుపత్రికలదే! మండలస్థాయి విలేకరులున్న పత్రికలు కూడా తెలుగువారివే.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాజకీయాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నవీ తెలుగు
పత్రికలే. శాసనసభల్లో చాలా సందర్భాల్లో తెలుగు పత్రికలు ప్రదర్శింపబడుతూ చర్చలు
కొనసాగడం, వార్తా పత్రికల కథనాలతో ఎందరి
రాజకీయ ప్రముఖుల
జీవితాలో మలుపులు తిరగడం మనం తరుచుగా చూస్తున్నతతంగమే! తాజాగా జరుగుతున్న
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగులలో సైతం
పత్రికల పాత్ర కొట్టొచ్చినట్లు కనిప్సిస్తున్నది కదా! గతం లోకూడా మన
తెలుగు
వార్తాపత్రికలు ఇలాంటి క్రియాశీలక పాత్రనే పోషించాయా? అంటే లేదనే చెప్పాలి. ఈ రెండు దశాబ్దాల మధ్యకాలంలో పత్రికారంగంలో వచ్చిన
మార్పులను తులనాత్మకంగా బేరిజు వేసుకున్నప్పుడు మనమీ నిర్ధారణకే రాకతప్పదు.
ఐదు దశాబ్దలకిందట పత్రికల నిర్వహణలో వృత్తి ధర్మం కాకుండా, ఉద్యమస్ఫూర్తి ఊతంగా ఉండేది. ఇప్పుడు
వృత్తిధర్మం స్థానే వ్యాపారపోకడలు పెరిగి పోయాయి. సామాజికసేవ స్థానంలో రాజకీయ,
ఆర్థికప్రయోజనాలు స్థిరపడ్డాయన్న విమర్శలో నిజం లేకపోలేదు. మేమిచ్చినవే వార్తలు.. మాకు వీలుకుదిరి పంపినప్పుడే మీరు
పత్రిక చదవాలి - అనే పాతధోరణి పూర్తిగా మారిపోయింది. అభివ్యక్తీకరణలో భావానికన్నా
ఆకర్షణకే భాష ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకుంది. . ఈ క్రమంలో తెలుగులో
తెలుగుతనం తగ్గిపోతున్నదనే విమర్శా ఉంది. అందులో కొంత వాస్తవమూ వుంది.
విద్యకోసం, సామాజికపరమైన
అవగాహనకోసం అనే పరిస్థితి దాటి వినియోగం, వినోదం, వాణిజ్యంవంటి కోణాల్లో పత్రికలు
రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు ఆదివారం అనుబంధం అంటే కళ, సాహిత్య,
విజ్ఞాన, సాంస్కృతిక వేదిక. ఇప్పుడు
వినియోగదారుడి కరదీపిక. పాఠకుల ఆకర్షణకు
నిడివితక్కువ శీర్షికలు, కంటికింపైన
రంగులు, అంత్యప్రాసలతో కూడిన భాష తయారయ్యాయి. కించిత్ అశ్లీలం కూడా చోటు
చేసుకుంటున్న సందర్భాలు లేకపోలేదన్న విమర్శలూ కద్దు.డైనమిగ్గానో డైనమోట్ గానో
వుంటేనేతప్ప ఇప్పుడు పత్రిక బ్రతికి బట్టకట్టలేదన్న మాటలో ఆవగింజంతయినా అతిశయోక్తి లేదు.
పత్రికలు, అవి
ప్రచురించే పుటలు, అంశాలు, అమ్ముడయ్యే ప్రతులసంఖ్య పెరగడం విశేషం. ఐదు దశాబ్దాలకిందట
లక్షప్రతులంటే గగనకుసుమంగా ఉండేది. మూడు దశాబ్దాలకిందట మలయాళ మనోరమ ఐదులక్షల సర్క్యులేషన్ని గొప్పగా
చెప్పుకునేది. ఇవాళ తెలుగులో రెండు పత్రికలకు పదిలక్షలకుమించి సర్క్యులేషన్ ఉందని 'ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్' (ఎ.బి.సి) వెల్లడిస్తోంది. ప్రచురించే అంశాలకన్నా
అమ్మకాల్లో పాటించే నైపుణ్యమే పత్రికల విజయానికి కీలకాంశం అవుతున్న రోజులు ప్రస్తుతం నడుస్తున్నవి.
దేశంలో ఏ భాషలోలేని రీతిలో మండలస్థాయిలో విలేక్రులను కలిగి ఉండడం
తెలుగు పత్రికల ప్రత్యేకత. విలేకర్ల విధులలో స్థానికవార్తలు పంపడమేకాక, పత్రిక అమ్మకాలు, వాణిజ్య
ప్రకటనల సేకరణా అదనంగా వుండటం ఒక వాస్తవం. ప్రజాస్వామ్యస్ఫూర్తికి ఆలవాలమైన
వికేంద్రీకరణ విధానానికి అనుగుణంగానే నేడు ప్రతీపత్రికా జిల్లా అనుబంధాలనూ
ప్రత్యేకంగా ప్రచురిస్తున్నది. ఈ పరిణామాల కారణంగా పత్రికలకు ఆర్థిక వనరులు పెరగడం
ఒక లాభమయితే, విమర్శల తాకిడి పెరగడం ప్రతికూల అంశం.
ఒకప్పుడు సినిమా వార్తలు కావాలంటే ఆదివారందాకా వేచి ఉండే
పరిస్థితి. ఇవాళో? ప్రతి దినపత్రికా సినిమా విశేషాలకోసం ఒకటో రెండో
పుటలు కేటాయించడం కొత్త పరిణామం. కొన్ని దినపత్రికలైతే ప్రత్యేకంగా సినిమా ఎడిషన్లనే ప్రారంభించాయి . చిత్రప్రముఖుల రాజకీయ
రంగప్రవేశం కారణంగా సినీవిశేషాలు వార్తలుగా మారి తొలిపుటదాకా తోసుకురావడం సహజమైపోయింది. బాలలకోసం ప్రత్యేకంగా పత్రికలు
నడిపే అవసరం లేకుండా దినపత్రికలే ఆయాఅంశాలనుకూడా ఇవ్వడం మరో చెప్పుకోదగ్గ మార్పు.
ఇక ఆదివారం సంచికలు వారపత్రికల సైజులోకి మారడంతోపాటు
అందులోని అంశాలూ ఒకనాటి వారపత్రికల చట్రంలో ఒదిగిపోవడం ఇంకో విశేషం. గతంలో
దినపత్రికలంటే డెమీ సైజు, వారపత్రికలంటే 1/4 డెమీ,
మాసపత్రికలంటే 1/8 డెమీ అనేదే అలవాటయిన లెక్క. కానీ నేడు
దినపత్రికలే కొన్ని పుటలు డెమీ, మరికొన్ని పుటలు 1/2 డెమీ, 1/4 డెమీ సైజుల్లో ప్రచురిస్తున్నాయి.
పత్రిక అనగానే ఒకప్పుడు ఆ పత్రిక సంపాదకుడు గుర్తుకు
వచ్చేవారు. కానీ ఇవాళ ఆ పత్రిక యజమాని ముందు
గుర్తుకు వస్తున్నారు. గతంలో ఆంధ్రపత్రికను కాశీనాథుని
నాగేశ్వరరావుపంతులుగారు అమృతాంజనం లాభాలతో, గృహలక్ష్మి పత్రికను డాక్టర్ కె.ఎన్. కేసరి లోధ్ర అమ్మకాలతో, కిన్నెర సంపాదకుడు పందిరి మల్లికార్జునరావుగారు రీటావ్యాపారంలోని
మిగులుసొమ్ముతో నడిపితే.. నేటి కొన్ని పత్రికలు లాభాలకోసమే
నడపబడుతున్నాయనేది ఒక విమర్శ. వ్యాపారానికి
తగ్గట్టుగానే పత్రికలు వార్తాంశాల్ని ఎంపిక చేసుకోవడం, అలంకరించడం జరుగుతోంది. సంపాదకుడిస్థానం
కుంచించుకుపోవడం దురదృష్ట పరిణామం. గత పది,
పదిహేనేళ్లబట్టి క్రమంగా పెరుగుతూ వస్తున్న టి.వి చానళ్లు, వార్తాచానళ్లు తెలుగు పత్రిక
మనుగడనుకూడా గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయన్నది క్షేత్రస్థాయి వాస్తవం . ఎప్పటికప్పుడు సంభవించే విశేషాలను
వార్తలైనా కాకపోయినా మసాలా దట్టించి మరీ వడ్డిస్తున్న ఛానళ్ల పోటికి దీటుగా 'ఏం చెయ్యాల'న్న మధనలో పత్రికలూ కొంతకాలం నలిగినా క్రమక్రమంగ పరస్థితి
తేటపడిందనే చెప్పాలి. సంఘటనల వెనుక ఉండే నేపథ్యాలను వివరణాత్మక కథనాలుగా అందించటం
నేటిపత్రికల విధానంగా మారింది. ఆ కథనాల ఆధారంగా చర్చలు కొనసాగించడం టి.వి చానళ్ల వంతయింది.
వార్తాఛానళ్ళు అప్పటికప్పుడు ఇచ్చే పొట్టివార్తల ఆధారంగా
విస్తృతకథనాలు సిద్ధంచేసుకోవడం పత్రికలకు పెద్దసవాలే.
అనివార్యంగా టి.వి చూడక తప్పని పరిస్థితి- పాత్రికేయుల, సంపాదకుల మేధో, సృజనాత్మక సామర్థ్యాల విస్తృతికి
పెద్ద అవరోధంగా మారటం అభిలషణీయమైన పరిణామం కాదు.
పత్రికా రంగంలో కంప్యూటర్, ఉపగ్రహం వంటి వెసులుబాట్లతో తాజా వార్తలు తెల్లవారుజాముదాకా ఇవ్వవలసిన
పరిస్థితి పాత్రికేయుల మానసిక శారీరిక ఆరోగ్యాలని దెబ్బతీసే ప్రతికూల అంశం .
ఆసక్తితో, ఆర్తితో సమాజానికి ఏదో చేయాలనే తపనతో తక్కువ
జీతానికైనా పాత్రికేయులుగా ప్రవేశించాలనుకునే వారి సంఖ్య నేడు క్రమంగా తగ్గుతూ
వస్తుంది . బాగా జీతాలు ఉన్న వృత్తులలో ఇప్పుడు జర్నలిజం కూడా ఒకటి అని
ఒప్పుకోవాలి. అయితే వేతనాలు పెరిగుతున్న స్థాయిలో మేధస్సు, సృజన,
భాష, శైలి పెరుగుతున్నాయా అంటే అవునని
కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ఇది ఒక్క తెలుగు పత్రికా రంగం ప్రత్యేక
పరిస్థితేమి కాదు.దేశమంతటా పత్రికా రచనల స్థాయి ఒకేలా తగ్గుతూ రావటం గమనించవచ్చు.
దీన్ని వాంఛనీయ పరిణామంగా కాక ఒక అనివార్యమైన పరిస్థితి గా అర్ధం చేసుకోవాలి . తమ
యజమానులకు దోహదపడేవి , తమ ఉద్యోగౌన్నత్యానికికి తోడ్పడే
వాదనలనే సమాజాని క వసరమైన ఔషధాలుగా పత్రికా ప్రముఖులు ముందుకు తీసుకుని రావడానికి
సిద్ధమవడం ఒక ప్రమాదకరంయిన విపరిణామం. పాత్రికేయులకు సంబంధించి రకరకాల అవినీతి
ఆరోపణలు తరుచుగా వినబడుటానికి పవిత్రమయిన పాత్రికేయ వృత్తిని స్వలాభం కోసం
వాడుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎక్కువవటమే ముఖ్యమయిన కారణం. కేవలం వార్తను నివేదించే
పాత్రికేయుడే ఈ స్థాయిలో ఉంటే ఇంక యజమాని గురించి చెప్పనే అక్కరలేదు. సమాచార హక్కు
పరిధిలోకి మీడియా సంస్థలను, వ్యక్తులను కూడా తీసుకురావాలని
ఒక వర్గం బలంగా వాదించటానికిదే ప్రధాన కారణం .
పత్రికారంగం ఇంతగా విస్తరించినా, సమాజంపై ఇంతబలమైన ప్రభావం చూపిస్తున్నా
దానికి దీటైన స్థాయిలో పాత్రికేయశాస్త్రం తెలుగులో అభివృద్ధి చెందక పోవటం
విచారించవలసిన విషయం. పాత్రికేయులకు అవసరమైన సమాచారగ్రంధాలు గతపదేళ్లకాలంలో కొన్ని
వచ్చాయి. అంతకుముందయితే అటువంటి సౌకర్యాలే బొత్తిగా ఉండేవి కావు.
విద్యాపరంగా తగిన సౌకర్యాలు లేకుండా సగటు యువకుడు పాత్రికేయుడుగా ఎదగటమంటే సామాన్యమయిన వ్షయం కాదు. ఈ మధ్య కాలంలోనే పట్టభద్రుల
స్థాయిలో పాఠ్యాంశంగా జర్నలిజం బోధించాలనే ప్రయత్నాలు విశ్వవిద్యాలయాల్లో
ఊపందుకున్నాయి . జర్నలిజం అభ్యసించిన ఎంతోమంది పాత్రికేయ వృత్తిలో ప్రవేశించకుండా
ప్రజాసంబంధ అధికారులుగానో, ఈవెంట్
మేనేజర్లుగానో స్థిరపడిపోవడం, పాత్రికేయవృత్తిని పక్కనపెట్టి
వ్యాపారరంగంలో ప్రవేశించడమో గమనార్హం. ఈ ఐదుదశాబ్దాల్లోనే ఆంధ్రపత్రిక, ఆంధ్రసచిత్ర వారపత్రిక, భారతి, యువ, జ్యోతి, సినిమారంగం,
విజయచిత్ర, ఉదయం సంస్థ పత్రికలు, సినీ హెరాల్డ్, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆదివారం.. ఇలా ఎన్నో పత్రికలు మూతపడ్డాయి. ఇప్పుడు
నడుస్తున్న పత్రికలన్నీ దాదాపు ఈ ఐదు దశాబ్దాలలో ప్రారంభమయినవే. అలాగే ఒకప్పుడు
తెలుగువారు ఆంగ్ల పత్రికారంగంలో రాణించిన మాట వాస్తవం. కానీ నేడు ఆ స్థాయిలో
తెలుగు వెలుగులు దేశ వ్యాప్తంగా ప్రకాశిస్తున్నాయా అంటే లేదనే సమాధానమే వస్తుంది.
పత్రికలను కూడా సమాజానికి బాధ్యులను చేసే కొన్ని ప్రయత్నాలు
ఈ మధ్య ఊపందుకు కొన్న మాట నిజమే! టైమ్స్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్ వ్యవస్థను
ప్రారంభించి కొంతకాలం కొనసాగించింది. హిందూ దినపత్రిక రీడర్స్ ఎడిటర్‌ను, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక కరెక్షన్స్
ఎడిటర్‌ను ఈ విధానం లో భాగంగానే నియోగించాయి. ఏ తెలుగు దినపత్రికా ఈ దిశలో
ప్రయత్నించక పోవటం గమనించదగ్గ అంశం.
తొలిపుట మొత్తం ప్రకటనలకు ఇవ్వడంవంటి వాణిజ్యపోకడలను ఆంగ్ల పత్రికలనుంచి ఇష్టంగా
అందిపుచ్చుకున్న తెలుగు పత్రికలు ధరల తగ్గింపువిషయలో మాత్రం ఆ స్థాయిలో స్పందించక
పోవటం మన పత్రికల వ్యాపార పోకడలక్ అద్దం పడుతున్నాయి.
వడివడిగా సాగిపోయే చరిత్రని వడిసిపట్టుకుని, నమోదుచేసే బృహత్తరమయిన పాత్ర పాత్రికేయానిది. కానీ అదే
నేడు విచారించదగ్గ స్పర్థలోపడి
వడివడిగా మారిపోతున్నది. ప్రపంచాన్ని
అన్నిరకాలుగా ప్రభావితంచేసి శాసించాలనుకునే మాధ్యమాన్ని మాత్రం శాసించే సరైన
యంత్రాంగం లేని లోటు కొట్టొచ్చినట్లు
కనిపిస్తున్నది. పర్యవేక్షణలేని శక్తివల్ల నివరించదగ్గ
ప్రమాదాలు జరిగే అవకాశాలే ఎక్కువ. మీడియాకూ ఆత్మవిమర్శ అవసరమనీ, స్వయం నియంత్రణ అనివార్యంగా ఉండితీరాలని
బుద్ధిజీవులు అందుకే భావించేది. పత్రికాప్రపంచం టి.వి. చానళ్లకన్నా ఈ స్వయం
నియంత్రణ విషయంలో కొంత మెరుగని
ఒప్పుకొన్నా.. ఔషధంవంటి ఈ స్వీయ నియంత్రణను, పథ్యంవంటి ఆత్మవిమర్శను పత్రికాలోకం ఇంకా
బాగా అలవాటు చేసుకోవాల్సివుంది.
అప్పుడే ఈ రంగానికి , దీనివల్ల సమాజానికి సరయిన మేలు జరిగే అవకాశం వుంది.
***
-కర్లపాలెం హనుమంతరావు
రచనా కాలం 2010
No comments:
Post a Comment