సెల్ లోని నెంబరు చూసి 'సారీ ఫ్రెండ్స్! మీరు కంటిన్యూ చేయండి! ఫైవ్ మినిట్ సు లో నేను మళ్ళీ
జాయినవుతా!' అంటూ కాన్ఫెరెన్సు చాంబర్నుంచి బైటకొచ్చాడు
సుబ్బారావుగారు.
'మీరు ఇక్కడకు
రావాల్సుంటుంది. ఎంత తొందరగా వస్తే అంత మంచిది. అన్ని విషయాలు ఫోన్లో డిస్కస్
చెయ్యలేం గదా!' అంది అవతలి కంఠం.
సుబ్బారావుగారికి పరిస్థితి అర్థమైంది. ఫ్లైటుకి టైము
కాకపోవడంతో కారులో బైలుదేరారు. 'వీలైనంత
వేగంగా పోనీయ్! బట్ బీ కేర్ ఫుల్!' అని డ్రైవర్ని హచ్చరించి
సీటు వెనక్కి వాలిపోయారు.
సుబ్బారావుగారు విజయవాడ దగ్గర్లోని ఓ గాజు ఫ్యాక్టరీ
యజమాని. సంగం మిల్కు ఫ్యాక్టరీలో,
మార్కాపూరు పలకల ఫ్యాక్టరీలో ముఖ్యమైన వాటాదారుడు కూడా. తరాలనుంచి వస్తున్న
చీరాల చేసేత అమెరికన్ షర్టింగ్ ఎక్స్పోర్టింగు వ్యాపారం ఒకటి
నడుస్తోంది. ఆ పనిమీద ఒకసారి చెన్నై వెళ్ళివస్తూ తిరుపతి వెళ్లారు సకుటుంబంగా. పనిపూర్తి చేసుకుని ఘాట్ రోడ్ నుంచి
దిగివస్తుంటే ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లోయలోకి జారిపోయింది వాళ్లు
ప్రయాణించే కారు. పెద్దవాళ్లకేమీ పెద్ద దెబ్బలు తగల్లేదుకానీ.. పిల్లాడికే బాగా
గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో పెద్ద గాలివాన! కరెంటు తీగలు తెగి అంతటా కటిక చీకటి. దూసుకు పోయిన
బస్సుకూడా కనుచూపుమేరలో లేదు. బిడ్డ ఏడుపు వినబడుతుందేగానీ.. ఆ చీకట్లో ఏ పొదలో
చిక్కుకున్నాడో అర్థమవడం లేదు. భార్య ఏడుపుతో బుర్ర్ర అస్సలు పనిచేయడం మానేసింది. సెల్ ఫోనుకి సిగ్నల్ అందడం లేదు. 'బిడ్డను దక్కించు తండ్రీ! నీ కొండకు వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటాను!' అని మొక్కుకున్నారు సుబ్బారావుగారు.
ఆ దేవుడే పంపిచినట్లు కనిపించాడు సాంబయ్య అక్కడ ఆ
క్షణంలో! ఆ సమయంలో అతను అక్కడెందుకున్నాడో? కారు లోయలోకి జారే సమయంలో చెలరేగిన ఏడుపులు,
పెడబొబ్బలు విని వచ్చినట్లున్నాడు. అలవాటైన చోటులాగుంది! ఏడుపు వినిపించే లోతట్టులోకి అత్యంత
లాఘవంగా దిగి.. పొదల్లోనుంచి బైటకు తెచ్చాడు బిడ్డడిని. రెస్క్యూ టీం ఆ తరువాత అరగంటకు వచ్చి అందర్నీ ఆసుపత్రికి చేర్చింది
కానీ.. ఆ సమయంలోగానీ సాంబయ్య చొరవ లేకపోతే పిల్లాడు తమకు దక్కే మాట వట్టిదే!
ఒక్కడే వంశోధ్ధారకుడు. అదీ పెళ్లయిన పదేళ్లకు ఎన్ని తంటాలు
పడితేనోగానీ పుట్టలేదు. ఎన్ని వేల కోట్లు, ఫ్యాక్టరీలుంటేమాత్రం ఏం లాభం? వంశాన్ని ఉద్దరించేందుకు ఒక్క అంకురం అవసరమే
గదా! సాంబయ్య ఆ పూట కాపాడింది ఒక్క పసిప్రాణాన్నే కాదు.. ఆగర్భ శ్రీమంతుడైన సుబ్బారావుగారి వంశం
మొత్తాన్ని!
సాంబయ్యకు ఒక పదివేలు ఇచ్చాడు అప్పట్లో! తిరుపతి ఫారెస్టు
ఏరియాలో దొంగతనంగా కంప కొట్టి అమ్ముకుని జీవనం సాగించే అశేషమైన బడుగుజీవుల్లో
సాంబయ్యా ఒకడని తరువాత తెలిసింది. సాంబయ్యచేత ఆ పని మానిపించి బస్టాండు దగ్గర ఒక
బంకు దుకాణం పెట్టించారు సుబ్బారావుగారు.
సుబ్బారావుగారు తిరుపతి ఎప్పుడు వచ్చినా సాంబయ్యను
పిలిపించుకుని మంచి- చెడు విచారించడం అలవాటు. తన ఫ్యాక్టరీల్లో ఏదైనా పనిచేసుకోమని
సలహా ఇచ్చినా ససేమిరా అన్నాడు సాంబయ్య 'ముసిలోళ్ళు తిర్పతి దాటి బైట బతకలేరయ్యా సామీ! ఈ వయసులో ఆళ్లనొదిలేసి నా దారి నే చూసుకోడం నాయవా?' అంటాడు. పని వత్తిళ్లమధ్య ఈ మధ్య తిరుపతి వెళ్లడం కుదరడం లేదు. సాంబయ్య
కలిసి చాలా కాలమే అయింది. ఇప్పుడిలా
కలుస్తాడని కలలోకూడా అనుకోలేదు.
నెలరోజుల కిందట ఒకసారి తిరుపతినుంచి ఈ డాక్టరే కాల్ చేసి
చెప్పాడు 'పేషెంటు ఫలానా సాంబయ్య తాలూకు
మనుషులు మీ పేరే చెబుతున్నారు. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సొచ్చిం'దంటూ.
కొత్త అసైన్ మెంటుని గురించి చర్చలు జరుగుతున్నాయప్పట్లో.
ఇన్ కమ్ టాక్సు తలనొప్పుల్నుంచి తప్పించుకునే దారులు వెతుకుతున్నారప్పుడు ఆడిటర్సు. వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం
ఆదాయంనుంచి కనీసం ఒక్క శాతంతోనైనా ఏదైనా ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటుచేస్తే
రెండిందాలా లాభం. గుడ్- విల్ వాల్యూ పెంచి చూపించుకోవచ్చు. త్రూ
ట్రస్ట్.. గవర్నమెంటు ఏజన్సీలతో
వ్యవహారాలు స్మూతవుతాయి. మెయిన్
బిజినెస్ ఇస్యూసుని తేలిగ్గా సాల్వ్ చేసుకోవచ్చన్నది ఆ సలహా. ఎలాంటి ట్రస్టు పెట్టాలన్నదానిమీద చర్చ సాగుతున్నప్పుడే
తిరుపతినుంచి కాల్ వచ్చింది.
సుబ్బారావు తిరుపతి చేరేసరికి బాగా చీకటి పడింది. నేరుగా
ఆసుపత్రికి వెళ్లాడు. బెడ్ మీద
పడున్న సాంబయ్య అస్తిపంజరాన్ని తలపిస్తున్నాడు. తనకు పరిచయమయిన కొత్తల్లో
పిప్పిళ్ల బస్తాలాగుండేవాడు. డాక్టర్ని కలిసారు సుబ్బారావుగారు.
'సాంబయ్యకు డయాబెటెస్ టైప్ ఒన్. వంశపారంపర్యంగా ఉంది.
ఇప్పుడు జాండిసూ ఎటాకయింది. కిడ్నీలు
రెండూ పనిచేయడం లేదు. ఆల్మోస్టు లాస్ట్ స్టేజ్..'
'హెరిడటరీ అంటున్నారు. మరి వాళ్ళ పిల్లాడికీ…?'
'వచ్చే చాన్సు చాలా ఉంది. జువెనైల్ డయాబెటెస్ అంటాం దీన్ని.
అబ్బాయికిప్పుడు ఆరేళ్ళే కనక బైటకు కనిపించక పోవచ్చు. ముందు ముందయితే ఇబ్బందే!'
ఎమోషనలయారు సుబ్బారావుగారు' ఏదన్నా చేయాలి డాక్టర్ సాంబయ్యకు! అతని భార్యను చూడ్డం కష్టంగా ఉంది. ఆ
రోజు పొదల్లో మా బాబు పడిపోయినప్పుడు మా ఆవిడా ఇలాగే ఏడ్చింది'
'విధికి కొంతవరకే మనం ఈద గలిగేది. సాంబయ్యది హెరిడటరీ
ప్రాబ్లం. ఆశ పెట్టుకొఏ దశ దాటిపోయింది సార్! ఏం చేసినా ఆ పసిబిడ్డకే చేయాలింక!' అన్నాడు డాక్టరుగారు.
పలకరించడానికని వెళ్ళిన సుబ్బారావుగారిని చూసి కన్నీళ్ళు
పెట్టుకున్నాడు సాంబయ్య. ఏదో చెప్పాలని ఉందిగానీ అప్పటికే మాట పడిపోయిందతనికి.
కొడుకు చేతిని పట్టుకుని పిచ్చి చూపులు చూసాడు పాపం!
'సాంబయ్యకు ఆట్టే బంధుబలగం కూడా ఉన్నట్లు లేదు. '.పిల్లాడి మంచి చెడ్డలు మనం చూసుకుందాం
లేండి! వాళ్లకిష్టమైన చోట మంచి హాస్టల్లో పెట్టించి ఓపికున్నంతవరకు
చదివిద్దాం. ఆ కుటుంబానికి ఏ లోటూ రాకుండా
ఏర్పాటు చేద్దాం. ఆ పూచీ నాదీ!' అన్నారు సుబ్బారావుగారు
తిరుగుప్రయాణమయేటప్పుడు సాంబయ్య భార్య
వినేటట్లు.
ఆ మర్నాడే సాంబయ్య పోయినట్లు కబురొచ్చింది విజయవాడకి. ఆ విషయం చెబుతూ ' మీరు వెళ్ళిపోయిన తరువాత నేనూ చాలా ఆలోచించాను సుబ్బారావుగారూ! పిల్లాణ్ణి
హాస్టల్లో పెట్టి చదివించడం, జీవితాంతం వాళ్ళు నిశ్చింతగా
బతకడానికి ఏర్పాట్లు చేయడం.. చిన్న సాయమేమీ కాదుగానీ.. మీ లాంటి వాళ్ళు
చేయదగ్గది.. మీలాంటి వాళ్ళే చేయగలిగే కార్యం ఒకటుంది సార్!' అన్నాడు
డాక్టర్ శ్రీనివాస్.
'ఏమిటో చెప్పండి.. తప్పకుండా చేద్దాం.. వీలైనదైతే!' అన్నారు సుబ్బారావుగారు.
'జువెనైల్ డయాబెటెస్ కి ఒక విరుగుడు ఉంది సార్! స్టెమ్
సెల్సుతో చికిత్స మంచి ఫలితాన్నిస్తుంది. పిల్లల వూడిపోయే పాలదంతాలను
వూడిపోవడానికి ఒక పదిరోజులముందే తీసి భద్రపరిస్తే.. భవిష్యత్తులో వచ్చే పెద్ద రోగాలకి చికిత్స చేయడం తేలికవుతుంది.
పాలదంతాల్లోని మూలకణాల ద్వారా ఈ వైద్యం సాధ్యమేనని రుజువయింది. దంతాల పల్సులో ఉండే
మూలకణాలని ముఫ్ఫై నలభై ఏళ్లవరకు భద్రపరిచే ల్యాబులు ఇప్పుడు ఇండియాలో ఢిల్లీ, ముంబై, పూనేవంటి
నగరాల్లో పనిచేస్తున్నాయి. మా కొలీగ్ ఒకతను వాళ్ల పాప పాలపళ్ళు అలాగే ముంబై
బ్యాంకులో డిపాజిట్ చేయించానని చెప్పాడండీ!'
సుబ్బారావుగారికీ ఆలోచన బాగా నచ్చింది. కంపెనీ తరుఫునుంచి
పంపించిన వైద్యులు ఢిల్లీ బ్యాంక్ పని విధానాన్ని పరిశీలించి సమర్పించిన
పత్రంలో మరిన్ని అనుకూలమైన వివరాలు ఉన్నాయి. 'మూలకణాలు శరీరంలో కొన్ని భాగాల్లో ఎక్కువగా.. కొన్ని
భాగాల్లో తక్కువగా ఉంటాయి. దంతాలవంటి వాటినుంచి ఒక రెండు మూడు మూలకణాలని రాబట్టినా
చాలు.. వాటిద్వారా కొన్ని లక్షల కణాలని సృష్టించుకోవచ్చు. శరీరంలో పాడైన
భాగాలను ఈ కణాలు వాటికవే బాగుచేసుకుంటాయి.
బొడ్డుతాడునుంచి మూలకణాలను సేకరించే విధానం చాలా కాలంనుంచి ప్రాచుర్యంలో ఉన్నదే. ఆ
అవకాశం లేకపోయినవాళ్ళు నిరాశ పడనవసరం లేదంటున్నారు ఇప్పుడు. పాలదంతాల విషయంలో తగిన
జాగ్రత్త పడితే ఫ్యూచర్లో బోన్ మ్యారో, కిడ్నీలవంటి వాటికి సమస్యలొస్తే పరిష్కరించుకోవడం తేలికవుతుంది'.
దంతాలనుంచి మూలకణాలను సేకరించి భద్రపరిచే స్టెమేడ్ బయోటిక్
సంస్థలు ఢిల్లీలోలాగా ముంబై, పూనా, బెంగుళూరు, చెన్నైలలో ఉన్నా.. విభజనానంతరం ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో
ఇంకా
ఏర్పడలేదన్న విషయం
సుబ్బారావుగార్లో మరింత ఉత్సాహం
పెంచింది.
సాంబయ్య కొడుక్కి ఆరేళ్లే. అతగాడి పాలపళ్లను గనక
భద్రపరిస్తే భవిష్యత్తులో వాడికొచ్చే జువెనైల్ డయాబెటెస్ కి చికిత్స అందించడం
సాధ్యమవుతుంది. ఆ రకంగా సాంబయ్య రుణం మనం తీర్చుకున్నట్లూ అవుతుంది' అంది సుబ్బారావుగారి సతీమణి ఈ విషయాలన్నీ
భర్తనోట విన్నతరువాత.
'నిజమే కానీ.. ఇది కాస్త
ఖరీదైన వ్యవహారంలాగుందే? ప్రారంభంలోనే అరవై వేలవరకు వసూలు చేస్తున్నాయి
ల్యాబులు! ఆ పైన మళ్ళీ ఏడాదికో ఆరేడువేలదాకా రెన్యువల్ ఫీజులు!'
సుబ్బారావుగారిలోని వ్యాపారస్తుడి మథనను పసిగట్టింది ఆయన
సతీమణి.
'సాంబయ్య మనింటి దీపాన్ని నిలబెట్టాడండీ! అతనింటి దీపం
కొడిగట్టకుండా చూసే పూచీ మనకు లేదా? మనకింత ఉంది.. ఏం చేయలేమా?' అనడిగింది భర్తను.
భార్యదే కాదు.. భర్తదీ చివరికి అదే ఆలోచనయింది.
సుబ్బారావుగారికి ఛారిటబుల్ ట్రస్టు తరుఫున ఏంచేయాలో
సమాధానం దొరికింది. బోర్డు మీటింగులో
చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ప్రపోజల్ టేబుల్ చేసారు 'సాధారణంగా కన్నవారు బిడ్డ పుట్టగానే వాళ్ల బంగారు భవిష్యత్తుకోసం ఆర్థికంగా
ఆలోచిస్తారు. కలిగినవాళ్ళు బ్యాంకులో డిపాజిట్లు.. సేవింగ్సు కాతాలు
ప్రారంబిస్తారు. చదువులకోసం, పెళ్ళిళ్ళకోసం ముందస్తు
ప్రణాళికలు వేసుకుంటారు. అన్నింటికన్నా ముఖ్యమైన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే
స్పృహమాత్రం ఇంకా మన సమాజానికి అలవడలేదు. పుష్టికరమైన ఆరోగ్యాన్ని అందించినంత
మాత్రానే ఆరోగ్యభద్రత కల్పించినట్లు కాదు. ప్రాణాంతకమైన వ్యాధులు వస్తే ఎంత సంపద
ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయతే! స్టెమ్ సెల్సుని సేకరించి భద్రపరిచే ల్యాబులను మన
ట్రస్టు తరుఫున ప్రారంభిద్దాం. పేద పిల్లల పాలపళ్లను సేకరించి వాటినుంచి మూలకణాలని
రాబట్టి భద్రపరిచే ఏర్పాట్లు చేయిద్దాం. ఇదంతా ట్రస్టు తరుఫున మనం సమాజానికి
అదించే ఉచిత సేవా సౌకర్యం'
సభ్యులంతా ఆమోదపూర్వకంగా బల్లలమీద చిన్నగా చరిచారు.
సుబ్బారావుగారి సంస్థల తరుఫున ప్రారంభమయిన మూలకణాల సేకరణ, భద్రత ల్యాబు ప్రారంభోత్సవంలో లాంచనంగా
డిపాజిట్ చేయబడిన మొదటి స్పెసిమన్ సాంబయ్యకొడుకు పాలపళ్లనుంచి సేకరించిన మూలకణాలే!
సాంబయ్యకొడుకు మంచి హాస్టల్లో చేరి చక్కగా చదువుకొంటుంటే.. సాంబయ్యభార్య
ట్రస్టువారి బ్యాంక్ ల్యాబులోనే పనికి
చేరింది***
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రభూమి వారపత్రిక 2 జూలై 2015 సంచికలో ప్రచురితం)
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రభూమి వారపత్రిక 2 జూలై 2015 సంచికలో ప్రచురితం)
No comments:
Post a Comment