Monday, February 1, 2021

వ్యాసం- గురించి కొద్దిగా!  కర్లపాలెం హనుమంతరావు- సారంగ - డిసెంబర్ 1 - 2020 ప్రచురణ




తెలుగు సాహిత్యం వరకు ‘వ్యాసం’ ఆధునిక ప్రక్రియ కిందే లెక్క. పరిణతి, ప్రౌఢి, గభీరత, అగాథత, ప్రగాఢత లక్షణాలన్నీ ఏకకాలంలో సూచించే పేరు వ్యాసం. వ్యాసం పేరు పుట్టు పూర్వోత్తరాల చరిత్ర మన దగ్గర ప్రస్తుతానికి లేనట్లే.

శతాబ్దం కిందట బ్రౌన్ దొర, బహుజనపల్లి సీతారామయ్య వంటి విజ్ఞులు తమ పదకోశాలలో వివరించిన దానిని బట్టి- విస్తరించి చేప్పేటంత విషయం ఉన్నప్పటికి, సంక్షిప్తంగా పర్యాప్తత లక్షణానికి భంగం రాకుండా ఉపక్రమణ, ఉపసంహరణ వంటి  లక్షణాలతో పద్ధతిగా సాగే ప్రకియగా భావిస్తే సరిపోతుంది.  తెలియని విషయాలను తెలియచెప్పడానికి, తెలిసినవే అయినా మరింత లోతుగా తెలియచేసేందుకుగాను వ్యాస ప్రక్రియను ఉపకరణం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోవుంది ఇప్పటి దాకా.. తెలుగులో! వ్యాసంలో విషయ పరిజ్ఞానానికే పరిమితమయేవాళ్లు కొందరయితే, అదనంగా కళాత్మకతనూ జోడించే సృజనశీలత ఇంకొందరిది. శాస్త్రానికి శాస్త్రం, కళకు కళా అనుకుంటే సరి- వ్యాసం.

భారతీయ వేదవాజ్ఞ్మయానికి వ్యాసుడు సూర్యుడు వంటివాడని ప్రాచీనులకు అమిత గౌరవం.  వేదాలను విషయ విభజన చేసి విశదపరిచినందుకుగాను భారతీయ వాజ్ఞ్మయ సంస్కృతులకు సృజన, ప్రతిభలతో జీవం పోసిన వ్యాసుడిని వ్యాస శబ్దానికి  జోడించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తుంటారు. అది వృథా ప్రయాస.  ఆదునిక పాశ్చాత్య ప్రక్రియ ప్రభావం అధికంగా ఉండే సాహిత్య ప్రక్రియ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న మనం వాడే వ్యాసరూపం.

సాహిత్యభాషగా తెలుగుకు ఒక స్థాయి ఏర్పడి ఇంకా నిండా వెయ్యేళ్లైనా  నిండాయి కాదు. ఆరంభంలో అంతా పద్యమయంగా సాగిన తెలుగు సాహిత్యంలో వచనానికి చొరవగా పాదం పెట్టి నిలదొక్కుకునే  అవకాశం మరో నాలుగొందలేళ్ళకు మాత్రమే వచ్చింది.  ఆంధ్రమహాభారతంలో వచనం ఉంది కదా? అంటారు కొందరు పండితులు. అది చంపూకావ్యంలా సాగిన మాట వాస్తవమే కానీ,   రూపురేఖలు, శైలీ విన్యాసాల పరంగా అందులో కనిపించే వచనానికీ.. అధునాతకంగా మనం వాడుకునే  వచనానికి పోలికే లేదు.

పంథొమ్మిదో శతాబ్ది మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టిన తరువాత తెలుగువాళ్లకు పరిచయమయిన అచ్చుయంత్రాల పుణ్యమా అని  వచనంలో మెల్లగా చలనం మొదలయింది. కాలం గడిచే కొద్ది ఎదురయే రకారకాల అరిష్టాలను అధిగమిస్తూ అది చక్కటి, చిక్కటి పాకంలోకి తేలడానికి  వీరేశలింగంపంతులుగారు వంటి చైతన్యమూర్తులు పడ్డ తంటాలు అన్నా.. ఇన్నా? అప్పటికీ పంతులుగారి వచన రచన పూర్తిగా శిష్టవ్యవహారంలోనే సాగిందని చెప్పడానికి మనసొప్పుకోదు.. ఇప్పటి లెక్కల ప్రకారం.

తాటాకుగ్రంథాలు అచ్చుపుస్తకాలుగా మారే క్రమంలో కావ్యకర్తల వివరాలను, కావ్య పరిష్కరణకు సంబంధించిన కడగండ్లను.. అచ్చయ్యే కావ్యానికి చెందిన ముచ్చట్లేవైనా ఉంటే.. ముందు.. ఏ  ‘ముందు మాటలు’లోనో, పీఠికలోనో, పరిచయంలోనో, పరామర్శ రూపంలోనో  ఎంతో కొంత సాటి పండితులతో పంచుకోవాలని, చదివే పాఠకులలో ఉపజ్ఞ పెంచాలన్న తపన ఉండటం సహజం. ఆ సదుద్దేశంతో  గ్రంథ ప్రకాశకులు చేసిన ఆలోచనల మూలకంగనే  నేటి వచనం  పురుడుపోసుకుంది.  అచ్చయిన కావ్యాలను గురించి సమకాలీన పత్రికలలో పండితుల మధ్య సాగిన సమీక్షలు, ప్రశంసలు, విమర్శలు, ప్రతివిమర్శలు తరహా ఖండన మండనలు వేటికైనా వచనమే వేదికగా నిలబడిన పరిస్థితి మొదట్లో. ఆ వచనం వాడుక పెరుగుదల  శాస్త్రబద్ధమైన వ్యాస ప్రక్రియ పరిణతికి కూడా బహుధా దోహదం చేస్తూవచ్చింది క్రమంగా. ఇవాళ వార్తా విశేషాలను కూడా మనం అందమైన కథనాల రూపంలో చదువుతున్నాం. అది వ్యాసమనే తరువుకు  తాజా పూలు, కాయలు, పండ్లు కాయిస్తున్న  కొత్తగా పుట్టుకొచ్చిన శాఖ.

స్థూలంగా గమనిస్తే, తెలుగులో పత్రికల పుట్టుక తొలిరోజుల్లో వెలుగు చూసిన వ్యాస ప్రక్రియలో  సింహ భాగం  సాహిత్య సంబంధితాలే. సహజంగానే అవి ప్రచురించే వ్యాసాలు సాహిత్య సంబంధంగానే ఉంటాయి కదా!

ఆ తరహా సాహిత్య వ్యాసాలను సేకరించి సంకలనాలుగా వెలువరించాలనే సంకల్పం ఏర్పడ్డ తరువాత వెలుగు చూసిన మొదటి వ్యాససంకలనం ‘హితసూచని’ అంటారు. ఆ పుస్తకాన్ని ప్రచురించింది కీ.శే. శ్రీ సామినేని ముద్దు నరసింహులునాయుడు. ఆ తరువాతి అయిదేళ్ళకు గాని బెంగుళూరు నుంచి జియ్యరు సూరి అనే మరో  తెలుగు ఉపాథ్యాయుడి చొరవతో  రెండు భాగాలలో మహిళలకు సంబంధించిన ‘స్తీ కళా కల్లోలిని’ అనే వ్యాససంపుటి వెలుగు చూసిందికాదు. అయితే తన వ్యాసాలను ఆ మహానుభావుడూ  వ్యాసాలుగా కాకుండా ‘గ్రంథం’గా  పేర్కొనడం  విచిత్రం.  మనం ఘనంగా స్మరించుకునే సంఘసంస్కర్త  కీ. శే కందుకూరి వీరేశలింగంపంతులుగారికి స్ఫూర్తినిచ్చిన మహామహోపాథ్యాయుడు కీ.శే పరవస్తు వేంకట రంగాచార్యులవారు తన కాలంలో విశాల సామాజిక భావజాలం దట్టిస్తూ అతి చక్కని వచనంలో స్ఫూర్తివంతమైన వ్యాసాలు వెలువరించారు. జంటకవులుగా ప్రసిద్ధి పొందిన  తిరుపతి వేంకట కవుల గురువు కీ.శే చర్ల బ్రహ్మయ్యశాస్త్రిగారికీ పరవస్తులవారే పరమ గురువులని చెళ్లపిళ్లవారు తన ‘కథలు-గాథలు’లో చెప్పుకొచ్చారు.  అయితే తెలుగు వ్యాసకర్తల తొలితరంలో వందేళ్లు జీవించిన ఈ పండితుడు పత్రికలకు వ్యాసాలను వ్యాసాల పెరుతో కాకుండా ‘సంగ్రహం’ పేరుతో పంపించేవారుట! వేంకట రంగాచార్యులవారు చూపించిన ఆ వ్యాస జ్యోతుల వెలుగుదార్రిలోనే కందుకూరివారు తన స్వంత పత్రికలలో రాజారామ్మోనరాయ్ మొదలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహదేవ గోవింద రానడేల వరకు .. అందరి వ్యాసాలు పరశ్శతంగా ప్రచురించి  తెలుగు సమాజాన్ని చీకటి నుంచి విముక్తం చెయ్యడానికి శతథా ప్రయత్నించింది.  ఆ వైతాళికుడూ ప్రారంభంలో తన వ్యాసాలను వ్యాసాలు అనేవారు కాదు; ఉపన్యాసాలు అనే ప్రస్తావించేవారు. బహుశా తాను ఉపన్యసించిందల్లా అచ్చులో  ప్రచురించడం వల్ల కావచ్చు. విషయ వైశద్యమూ, విజ్ఞాన వైదగ్థ్యంతో పంతులుగారు రాసిన వైవిధ్య ప్రక్రియల పరంపరలో చిట్టచివరిది కూడా ‘వ్యాసమే’ కావడం.. అదో విశేషం. 1919 నాటి ఆంధ్రపత్రిక ఉగాది వార్షిక సంచికలో పోతన జన్మస్థల వివాదం గురించి  రాసిన ‘వ్యాసం అది.

తెలుగు సమాజ బహుముఖీన వికాసం ఇరవయ్యవ శాతాబ్ది తొలి దశాబ్ది నుంచి ఆరంభమయిందంటారు చరిత్రకారులు. ఆ వికాసోద్యమంలో  భాగంగా సాహిత్యరంగం తాలూకు ఎదుగుదల బారలు మూరల్లో కాకుండా అంగల్లో ఉండటం తెలుగువాళ్లు చేసుకున్న  అదృష్టం. కృష్ణాపత్రిక ఆవిర్భావంతో ఆరంభమయిన ఆర్భాటం దేశాభిమాని, ఆంధ్రకేసరి లాంటి చిన్నా చితకా పత్రికలతో సరిపుచ్చుకోక అనంతరం కాలంలో అమేయపర్వతంలా ఎదిగిన ఆంధ్రపత్రికకు, మరో దశాబ్దంనర  తరువాత భారతి వంటి సాహిత్య మాసపత్రికలకు  ప్రేరణగా మారటం.. చెప్పుకోదగ్గ విశేషం.  అన్ని పత్రికలలో  కాల్పనిక సాహిత్యానికి రెట్టింపు ఆదరణ విషయ ప్రాధాన్యతకు అధిక గౌరవమిచ్చే ‘వ్యాస’ ప్రక్రియకు లభించడం సాంస్కృతిక పునరుజ్జీవన కోణంలో విశేషమైన సగుణాత్మక మలుపు.

సాహిత్య ప్రక్ర్రియ ఏదైనా కావచ్చు.. అందులోని విషయ వివరణ పరిచయానికి వస్తే వ్యాసమే ఆలంబన అవుతుంది కదా! అందులోనూ త్రిలింగ, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, ప్రబుద్ధాంధ్ర, రెడ్డిరాణి, ప్రతిభ, జయంతి లాంటి పత్రికలకు వ్యాసాలు మాత్రమే అంగీకారయోగ్యం. అందుకే, పంథొమ్మిదో శతాబ్దిని పక్కన పెట్టినా, కేవలం ఇరవయ్యో శతాబ్దపు వ్యాసరచయితల పట్టికను పరిశీలిస్తే ఆంజనేయుడి తోకంత సుదీర్ఘంగా ఉంటుంది. తిరుపతి వేంకట కవుల నుంచి, కట్టమంచి, వేలూరి, విశ్వనాథ, నోరి, నిడదవోలు, మల్లంపల్లి, బండారు తమ్మయ్య, వేటూరి ప్రభాకరశాస్త్రి, భావరాజు వెంకటకృష్ణారావు.. ఇట్లా జాబితాలోని ఉద్దండుల పేర్లు అంతూ పొంతూ లేకుండా సాగిపోతాయి. వ్యాస ప్రక్ర్రియకు పరిణతిని సమకూర్చిన గిడుగు రామ్మూర్తిపంతులు, కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు వంటివారు ప్రత్యేకంగా ఈ సందర్భంలో ప్రస్తావనార్హులు.

ఎప్పటి కప్పుడు కొత్త నీరు ఊటలెత్తే  వ్యాసజలనిధిలో ఎన్ని పొరలనని మనం తడవగలం? ఎంత మంది ప్రజ్ఞావంతులైన వ్యాసకర్తలకు న్యాయం చేయగలం?! కుతూహలం కొద్ది ఏదో తెలిసిన నాలుగు మాటలు నలుగురు మిత్రులతో పంచుకోవడం తప్పించి. స్వస్తి.

కర్లపాలెం హనుమంతరావు

(  సారంగ - డిసెంబర్ 1 - 2020 ప్రచురణ ) 


https://magazine.saarangabooks.com/%e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b8%e0%b0%82-%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a6%e0%b0%bf%e0%b0%97%e0%b0%be/



No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...