Monday, February 1, 2021

కవిత్వం- మహిమ -కర్లపాలెం హనుమంతరావు

 

                                    



 

లోకంలో ఏదీ శాశ్వతం కాదు.నిన్న చూసింది ఇవాళ.. ఇవాళ చూసింది రేపు మళ్ళీ కంటబడతాయన్న భరోసా లేదు. చిరంతనమైన పదార్థమేదీ మరి సృష్టిలో  లేనే లేదా?అంటే బొత్తిగా మరీ అంత  నిరాశ పడవల్సిన  పరిస్థితీ కాదు. 'ప్రజ్ఞాన నవనవోన్మేష శాలినీ ప్రతిభామతా' అని శాస్త్రకారుల ఊరడింపు ఉండనే ఉండింది. బుద్ధివికాసంతో భూమ్యాకాశాల మధ్య ఎప్పటికప్పుడు కొత్త బంగారు లోకాలు కల్పన చేసే   అపర బ్రహ్మఒకడున్నాడు. సర్వధర్మాలను, శాస్త్రాలను స్వీయశక్తులతో మధించి శుభకరమైన అనుభవ తరంగాలను  మన ఆత్మానందం కోసం సృజించే ఆ యోగిపుంగవుడి  పేరే 'కవి'.   

 

మనకోసం స్వీయజీవితాన్ని మీదుకట్టిన వాడతడు. కష్ట సుఖాలు స్వయంగా అనుభవిస్తాడు. పాపపుణ్యాలను అంతశ్చేతనతో మధిస్తాడు. దేశకాలపాత్రాది పరిమితులు వేటికీ లోబడకుండా, కాలం వెంట, కర్మ వెంట మనోవేదనతో మనోవేగంతో మనకోసం సదా సంచరించే  ఆ యక్షమానవుడిని గురించే మహాప్రస్థానంలో శ్రీశ్రీ

'వేళకాని వేళలలో

లేనిపోని వాంచలతో

దారికాని దారులలో

కానరాని కాంక్షలతో

దేనికొరకు దేని కొరకు

దేవులాడుతావ్

ఆకటితో అలసటతో

ప్రాకులాదుతావ్? అని వర్ణించింది.

 ఆ యువకాశల నవపేశల సుమగీతావరణంలో  తిరుగులాట తత్త్వజ్ఞులందరికి అంత అనువైన ఆట  కాదు. సకల హృదయ కేదారసీమలను దున్ని పదును చేయడం సామాన్య కృషీవలుడి చేసే సాగుపనీ కాదు. నవరసభరితమైన బీజాలను విత్తి, అవి మొలకలెత్తి కవితాలతలై పుష్పించే దాకా మొక్కవోని దీక్షాతత్పరలతో పెంచి పోషించడం- తల్లి బిడ్డలను సాకటానికి మించిన చాకిరి.  సుకృతి సుమాలతో అల్లిన మాలలతో భాషామతల్లి గళసీమలను అలంకరించే వృత్తే కవి ప్రవృత్తి కనక అది కవికొక  క్రీడావినోదం.అందుకే విశ్వవిశ్వంభరా పురోభివృద్ధికి  మూలకారకుడంటారు కవిని.

చారిత్రిక జ్ఞానానికి పునాదిరాయి వేయడమూ  కవి పనే. కవి లేని దేశం లేదు. కవి లేకపోతే సంస్కృతే పూయదు. వాల్మీకి వినా రామకథ ఏదీ?వ్యాసుడు చెబితేనే కదా పాండవుల ఊసు తెలిసింది! చరిత్రవల్ల కాదు.. శకుంతలా దుష్యంతుల ఉనికి మనకు తెలిసింది  కాళిదాసు పుణ్యంవల్ల.

రవి కాంచని చోట కవి కాంచుననేది కల్ల మాట కాదు. సర్వం కవి నిర్మితం అన్నది అతిశయోక్తనిపించే సత్యం. లోకాన్నంతా తన చూపు మేరకు మలుపునేకునే ప్రజ్ఞ ఒక్క కవికే సొంతం. సృష్తికి ప్రతిసృష్టి కవి సు నైపుణ్య పుణ్యమే. వీరుని కత్తివాదర లాగా అది మొక్క పోనిది. లక్షమంది భటులుండు గాక.. ఒక్క కవిపలుకే మనసుకు సాంత్వన. రాజస్థానాలనిండా కవుల దండు ఉండటానికి ఇదే కారణం.  మాటలతో విసిగినప్పడు కవి పాటలు కావాలనిపిస్తుంది  లోకానికి. అదీ కవి మహిమ.

"పాటలెన్నియో నేను బాడితిని గాని

 పాటయింతటి సౌఖ్యమైనదని యెరుంగ"

టెన్నిసన్ కవి మహిమను గురించి అన్న ఆ మాటలు అన్ని కాలాలకు అందరి కవులకు వర్తించే స్తుతి.

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...