Saturday, February 27, 2021

అంతరాత్మతో ఆంతరంగిక భాషణ -కర్లపాలెం హనుమంతరావు - కవిత-

 


 

ఎత్తు అంతు చూడాలంటే లోయలోకి దూకాలి! 

 లోతు వింత తడమాలంటే ఎత్తులపై కెగబాకాలి! 

ఎత్తులోతు మర్మం ..  

లోయఎత్తు ధర్మం  

ఎవరం వివరంగా ఎరగం! 

హిపోక్రసీ లెస్  

అనిర్థారిత అర్థసత్య  

నిర్థరణ ప్రయత్న  

వైఫ ల్యానుభవానందానుభూతి 

అస్పష్ట వాచ్యప్రకటన ప్రయాసలే 

అద్దంలో అస్పష్టంగా  అగుపించే 

నీ విలోమ సౌందర్యం.. అంతరాత్మా! 

 

భావికి భార మౌతుందని 

కొలత బద్దలన్నిటిని   

గతం కోనేటికి మేపి 

ఖాళీ చేసిన మనసులో  

కొత్తరకం రసంతో  కష్టకాపురం 

మళ్లీ మొదలెట్టే యోగం 

మరో రూపమే  

అస్తి నాస్తి విచికిత్సాతీత 

పరాలోకోన్ముఖ మహాప్రస్థానం. 

మరా దేహాతీత యాత్రకు నువు సిద్ధమా? 

 

అరచేయి అండ అలాగే ఉంటే 

అద్దాని నజరానా 'జానా 

ఖజానా తీర్చలేని మొండిబాకీలా  

మిగిలే ఉంటే..  

బొందికి అంతులేని ధీమా 

అంతరాత్మ కదే   

గంతులేయ బుద్ధికాని కోమా 

నీకు తోడుగా  ఇహబంధాలూ 

అంతవసరమా? 

 

నల్లపట్టీ బెత్తెడు మందాన  

కళ్లక్కటించుకొన్నా 

నాలుగేళ్లు తెరిచి  

'వేళ్లెన్న'ని అడిగితే' 

నాలుగంటూ నిజం చెప్పేసే నిజాయితీ నీది 

నీ బాడీ లాంగ్వేజ్ అలా ఉండదే 

 

అందుకే  

అసుంటా  

కొన్ని యుగాల వరకైనా 

 బరి కావల అలాగే   

తన కొచ్చిన లొల్లాయి పదాలకు  

తోచిన రాగాలేవో గాలికి  తినిపిస్తో 

కాలక్షేపం చేసుకోమను.. పొమ్మను! 

నీ బ్రాండు పరమార్థం పండాలంటే  

కచ్చితత్వలేమికీ  

నిక్కచ్చిగా 'పచ్చికొట్టాల్సిందే.. 

  తప్పదు! 

 

నింగికి నిచ్చెనేసి  

చందమామ నెక్కేసి 

వెనక్కి తిరిగి చూడకుండ  

తొంగిచూసి రమ్మంటే 

చూసింది చూసినట్లు చెప్పందే  

మనసాగని  బంగారిమామలతోనూ  

తమాషాకైనా సరే  

తమరూ  రంగుల హరివిల్లు రంగంలోకి  

వెళ్లనే కూడదు 

రాత్రి సద్దులిక వాటితో వద్దనే వద్దు! 

 వెళ్లిపొమ్మను 

వినకుంటే నువ్వైనా 

వెళ్లగొట్టక తప్పదు.. సిద్ధమా 

అంతరాత్మా! 

 

లక్కీగా లవ్లీగా లెక్కలేవీ  

బొత్తిగా బుర్రకెక్కని  

తిక్క శంకరు లింకా  

 భూమ్మీద మిగిలుండలేదు! 

  

సూరీడు నిప్పుబంతికి  

 మరమ్మత్తు లొచ్చే వరకూ 

పాలపుంత బావిలో  

తూలిపడ్డ మేఘమాల నెవరన్నా   

చేది  మళ్ళీ బైటికి తెచ్చే దాకా 

 ఆల్ సిన్స్ ఆర్ సేఫ్  

ఇక్కడ  భూలోకంలో! 

ఉలిక్కిపడనక్కర్లేదెక్కడా  

 మాటవరసకు  

 కవిసమ్మేళనాలప్పుడో 

కదాచిత్  కవిత్వంలో   

బొందితో నీకున్న పొత్తు 

 చర్చల్లో కొచ్చినప్పుడు! 

అవార్డ్లు,  పురస్కారాలాటలో  

అదో గడుసు కవిసమయంగా 

సరిపుచ్చుకో అంతరాత్మా! 

  

వలపు యాత్రకు పలుపు తాడు.. 

'డ్యామిట్.. అడ్డమని  

చీదరించుకుంటే చాలు   

సగందారిలోనైనా సరే  

మైలురాయి మెడకి  

చుట్టేసొచ్చేసే వరుడెవరైనా  

ఉంటే .. గింటే  

నిక్షేపంగా వెంట తెచ్చుకో! 

పద.. మంగళహారతుల వేళ 

మించిపోతుందక్కడ 

పంచభూతాలు నీ కొసమే  

వెయింటింగక్కడ! 

 

భౌతిక దేహాన్నొదిలి 

కదిలి రావాలంటే కాస్ కష్టమే..  

తెలుసనుకో..  

భవబంధాల ముడి  ఎంత బలమైనదో! 

అందిన నక్షత్రం దానికి పుల్లనయినప్పుడో 

అందని నఖక్షతాల పైనెప్పుడు 

అడ్డూఆపూ లేకుండా తపన పెరిగినప్పుడో 

బొంది.. నువ్వూ కలిసి చేసుకున్న  

ఢిష్షుం.. ఢిష్షుంలే కదా 

సాహిత్యం నిండా అజరామరణాలకు  

యుగప్రతీకలై కూర్చున్నది 

నువ్విప్పుడు ఉండీ 

పెద్దగ పొడిచేసేదేమీ ఉండదు 

అంతరాత్మ హితవిప్పుడు  

 చెవి చొరబెడుతోంది కనక! 

 వాపే బలమనిపించడమే  

తాజా ట్రెండిప్పడు! 

వాపోవద్దు 

అంతరాత్మకు ఏడుపు ఎప్పుడూ శోభ నివ్వదు 

 

ఏదీ వృథాపోదన్న ప్రకృతి సూత్రం  

నీకు మాత్రం తెలీదనా 

వెలిసిపోయిన  నూలుపోగు ముందు   

వెన్నముద్ద కన్నయ్య వెండి మొల్తాడయినా   

వెలవెలపోతోన్నదిప్పుడు! 

నాలుగు బొమిక ముక్కలు 

గిద్దెడు సింధూరప్పాలు 

గుప్పెడు గడ్డిపోచ..  

మన్ను బొందన చకచకా  

గిలకరించిలా  

అంతరాత్మా నీ నెత్తి కెత్తి 

జైత్రయాత్రకని పంపే  దుష్టకాలమిది! 

నువ్వూనీ లవ్వూ సర్వం 

 కోతి మనిషి కొవ్వు వాలానికి 

వేలాడే కుచ్చెంట్రుకలైనా కాదిప్పుడు మరి 

   

శిల్పిలా ఉలి నల్పి.. నల్పి   

నువు కొట్టిన దెబ్బలు కదబ్బీ  

 బొందిగాడిని  

 బాహుబలనో..  

కంచిగోడ వదలని  

 బంగరు బల్లవో 

ఫైనల్ గా పతకం పోటీలల్లో 

నిలబెట్టేదీ! 

బొందినలా  

మంది మనస్తత్వానికి 

వదిలేయడమే మేలు నీకు! 

కనిపించని గాలిలో  

కనిపించే ధూళి మధ్య  

రికామీగా ఎగురుతో 

నదులకు నీళ్లు పట్టే  

చేపల కళ్లకు పొలుసులా 

వాడి నలా బతికి చావనివ్వు! 

వీరతిలకం దిద్దించుకుని  

బైలుదేరిన యోధుడయి ఉంటే  

పూలపైన రజను జల్లే  

మధుపాల పని  

 గుత్తంగా ప్రకృతిమాత   

వాడికప్పుడే అప్పగించుండును గదా? 

వాడి ఖాళీ బుంగ కడుపార్తికి  

కాళేశ్వరంకెసికెనాల్స్   నీరైనా చాలివుండదు. 

కాబట్టే  

ఏవీఁ ఇవ్వలేని పాదాలతో   

ఎగిరే భ్రమరమల్లే 

 ఇంటి గుమ్మం  

కుండీ పూవూ  

చొరపెట్టని  

రొదయి తిరుగున్నది వాడు!   

  

సరేఁఅయిందేదో అయింది. 

ఇహనైనా.. హిప్.. హిప్పంటూ  

వెర్రిగా అరవాలని కదా నీకు మోజు!. 

 రూట్ మ్యాపును నమ్ముకుని 

  శిఖరాగ్రం చివరంచు  దాకా 

ఎగబాకిలా వచ్చావోకంగ్రాట్స్! 

యోజనాల పర్యంతం   

అనంతం వరకు  

అవధులెరుగని వేగంతో  

పరుగులెత్తే 

  అగాధ అబౌతిక 

సాగర మావలి తీర  

మెలాగైనా చేరి తీరాలని గదా  

భడవఖానా ఇప్పుడు  నీ బాధంతా 

పెనుగాలితో పెనిగే   

చిరుమట్టి దివ్వొక్కటే ఉంది  

చివరి దాకా నీకు  

నమ్మకంగా తోడుండేదీ ఇదే మరి !  

బొందిని మన్నులో కలవనీ అంతరాత్మా! 

ముందీ భవసాగర మావలకు  

తొందరగా నువ్వైనా ఈదుకు రా 

***-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...