Friday, February 12, 2021

సారస్వతం ఓ మహాసముద్రం రచన : కర్లపాలెం హనుమంతరావు -

 


సారస్వతం ఒక మహా సముద్రం. అట్టడుగుదాకా వెళ్ళి  మంచిముత్యాలనేరి తెచ్చేవాడొకడు.  పై పైని ఈదులాటలతో తృప్తిచెందే వాడింకొకడు.  ఉప్పునొదిలేసి మంచినీటిని ఆవిరిరూపంలో గ్రహించి మొయిళ్ళద్వారా లోకానికి చల్లని వాన చినుకులు పంచే సూర్యకిరణంలాంటి ఘనుడు  మూడోవాడు. సాహిత్యంలోని విశేషార్థాన్ని స్వయంగా ఆకళించుకుని ప్రపంచానికి ప్రచుర పరిచే అతగాడే ఉత్తముడు.

 

సారస్వతం మహాసముద్రం అనాది ప్రసిద్ధం. అనంత శోభావిలసితం. కవిగణాలు నదీనదాల్లాగా విచ్చలవిడిగా దానికి పోషణ కల్పిస్తుంటారు. తత్సాంగత్య,  సాన్నిహిత్యాలతో తామూ పునీతు లవుతుంటారు. మహాసముద్రాన్నుంచి  ఉపసముద్రాలు బయలుదేరి  ప్రత్యేక నామాలతో శాఖో పశాఖలుగా ఎలా వర్థిల్లుతున్నాయో.. సారస్వతంనుంచి ఆంధ్రసారస్వతమని, సంస్కృత సారస్వతమని, ఆంగ్లసారస్వతమని విభేదాలు అలాగే వర్ధిల్లుతున్నాయి.

 

విపులమైన అనుభవం, విచిత్రమైన రసజ్ఞత, విమల భావనాశక్తి, విశేషమైన ఆశయోన్నతి, రహస్యస్ఫురణ మనిషి ప్రత్యేక లక్షణాలు.  అన్నిటికి మించి పలుకుబడి వల్ల కదా తతిమ్మా జంతుసంతుపైన అంతులేని ఆధిక్యత!  అనుభవానికి ఉద్రేకం, రసానికి ఉద్దీపన, భావానికి చైతన్యం, సంభవించినప్పుడు తన పలుకుబడితో తత్సమ్మేళనానికిగాని,   తరువాతి కాలంలో తదానందస్ఫురణకిగాని ఓ   బాహ్యప్రకటన కల్పించే ప్రయత్నంలో ఉప్పతిల్లేదే సారస్వతం.

 

అనుభవోద్రేకం పంచేంద్రియ సబంధి. చుట్టూతాగల  జడ అజడ రూపాత్మకమైన ప్రపంచంలో మనుష్యులు  అన్యోన్య సుప్రతిష్ఠులయ్యేదీ దీని వల్లే. సంకల్పం వల్ల  ప్రబలేది ఈ అనుభవం. ఈ అనుభవం నిసర్గమని, విరుద్ధమని రెండు రకాలు. నిసర్గానుభవం లోకికం. విరుధ్ధానుభవం అలౌకికం. మనుచరిత్ర నుంచే ఉదాహరణలివ్వవచ్చు రెండింటికి. ప్రవరాఖ్యుడి హిమాలయ సందర్శనం, అచ్చో రమ్యకాంతారవీధిన నారీదర్శనాదులన్నీ నిసర్గానుభవాలు. అకలంకౌషధ సత్త్వం, మరున్నారీరత్నం స్వాహావధూవల్లభుని సన్నిహితత్వంల్లాంటివన్నీ విరుద్ధానుభవాలకు ఉదాహరణలు.

 

రసోద్దీపనమూ హృదయసంబంధే. సామరస్యం దీని అంతిమ ఫలం. ఉత్కంఠవల్ల ఇది ఉత్ప్రేరితం. సభ్య, అసభ్యాలని రెండు రకాలు. పింగళి సూరనార్యుని ప్రభావతీప్రద్యుమ్నం లోని "కలకల నవ్వినట్ల తెలిగన్నుల నిక్కరు చూచినట్ల తో/బలుక గడంగినట్ల కడు భావగభీరత అబ్బినట్ల పెం/పొలయ రచించి జీవకళ యుట్టిపడన్ శివ వ్రాసినట్టి యా/చెలువున శాభిముఖ్యము భజింప దలంకెను దాను బోటియున్" లాంటి కమ్మని రసాలూరు పద్యం సభ్యరసానికి ఉదాహరణ.

ఆ కవిదే కళాపూర్ణోదయంలోని సీస పద్యం అసభ్యరసానికి ఉదాహరణ.

"బెరుకెరుగని గాఢ పరిరంభమున నల్లి/బిల్లి గొంచు బెనంగు పెనకువలను/బెరిగెడి పేరాస పేర్మి ననర్గళ/లీల బర్వెడు కుచాస్ఫాలనముల/నడ్డమాకలు లేక  యబ్బినయ ట్లెల్ల/నమరించు నఖర రేఖాంకములను/గొదగొన్న లొదగొన్న తమి గొంకు కొసరు లే కొనరించు/ వివిధ దంతక్షత విభ్రమములు/మన్మథావేశవిలసనమహిమ నెఱపు/తపసి గని సాదు రేగిన దల పొలాన/నిలువ దను మాట నిజమయ్యె నే డటంచు/మగువ నవ్వుచు జేతకు మాఱు నేనె" దృశ్యరసం అసభ్యం.

భావోదయం మానసికం. ఐకమత్యం దాని అంతిమఫలం. ఉద్బోధాప్రేరితం. పాఠ్యం, స్మర్యం అని రెండు విధాలు. చదివేటప్పుడు మాత్రమే మేల్కొని ఉండేది పాఠ్యం. మనసును విడిచిపెట్టకుండా మళ్లీమళ్ళీ స్మృతిలోకki వస్తుండేది స్మర్యం. "మాయమ్మా నను నీవే/రాయలవై కావ రావరావే జేజే/మాయాతుమ లానినయది/పాయక సంతోష మున్నఫల మిల సామీ" పాఠ్యరసానికి ఉధాహరణ అయితే "కొందల మందె డెందము శకుంతల తా నిపు డేగు నం చయో!/క్రందుగ బాష్పరోధమున గంఠమునుం జెడె బుద్ధిమాంద్యమున్/బొందె; నొకింత తపోనిధులే యిటు గుంద, నెంతగా/గుందుదురో తమంత గను కూతుల బాయు గృహస్థు లక్కటా!" లోని భావం ప్రపంచహృదయ సంస్తవనీయమై స్మృతిగొల్పుతున్నది. ఇదీ స్మర్యం. మొదటిది కళాపుర్ణోదయనుంచి.. రెండోది అభిజ్ఞాన శాకుంతలం నుంచి.

 

ఆశయోద్ధరణం సంశయాత్మక సంబంధమైనది. సాఫల్యం దీని అంతిమ ఫలం.లౌకికం, ప్రాకృతం, పారమార్హికం- అని మూడు రకాలు. పోతనామాత్యుని భాగవతంనుంచే మూడింటికి ఉదాహరణలు ఇవ్వవచ్చు. "ఘను డా భూసురు డేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో/విని కృష్ణుం డది తప్పుగా దలచెనో విచ్చేసెనో యీశ్వరుం/డనుకూలింప దలంచునో తలపడో యార్యామహాదేవియున్/నను రక్షింప నెఱుగునో నెఱుగదో నా భాగ్య మెట్లున్నదో?"- లౌకికం.

'ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రీ రేలా బిలంబింప గా/రం డో బాలకులార! చల్ది గుడువన్ రమ్యస్థలం బిక్కడీ/దండన్ లేగలు నీరు ద్రావి యిరుపొంతన్ బచ్చిక ల్మేయుచున్/దండంబై విహరించు చుండగ నమందప్రీతి బోనేతమే"- ఆశయం ప్రాకృతం. కనక ప్రాకృతరసానికి ఉదాహరణ. "కల డందురు దీనుల యెడ/గల డందురు పరమయోగిగణముల్ పాలన్/గల డందు రన్ని దిశలను/గలడు కలం డనెడువాడు కలడో లేడో?"- ఈ పద్యంలోని ఆశయం పారమార్హికం.

 

పలుకుబడి భాషాసంబంధమైనది. అర్థజ్ఞత అంతిమ ఫలం. కృషి ప్రబలితం. స్వతస్సిద్ధం,   అనుశ్రుతం అని రెండు రకాలు. చిలవలు పలవలుగా విస్తరించేది అనుశ్రుతం. ఆ లక్షణం లేకపోతే స్వతస్సిధ్ధం. నందితిమ్మన పారిజాతాపహరణం ప్రథమాశ్వాసం స్వతస్సిధ్ధమైన పలుకుబడికి తార్కాణం. "కనకపంజర కారికలకు జక్కెర వెట్టి/చదివింప రెలొకో సరియ లిపుడు?కరతాళముల మందిరమయూరంబుల/నాడింప లేరకో యతివ లిపుడు?/క్రోవ్వాడిగోళ్ళదంత్రులు మీటి  వీణియ/లవలికింప రేలకో భా లిపుడు?/ఇన్ని దినముల వలె నుండదేమి నేడు/ చిన్న వోయిన దీ మేడ చెన్ను దఱిగి/పద్మముఖితోడ నెవ్వరే బారిజాత/పుశ్పవృత్తాంత మెఱిగింప బోలునొక్కొ?"

శృంగారనైషధంనుండిఅనుశ్రుత రసానికి ఉదాహరణ "జగము లొక్కుమ్మడి సాధింప నెత్తిన/రతిమన్మథుల విండ్లు రమణి బొమలు/కాంతినిర్ఝర మీదు కామయౌవనముల/ కుంభప్లవము లింతి కుచయుగంబు/నడు మింత యని కేల దొడికి పట్టిన ధాత/యంగుళిరేఖ లబ్జాస్యవళులు/యువమనో మృగ రాజి దవిలింప దీర్చిన/మదనవాగుర లిందువదన కురులు/వాల్య తారుణ్య సీమావిభాగమునకు/నజుడు వ్రాసిన రేఖ తన్వంగియారు/భానువరమున బడాసిన పంకజముల/యపరజన్మంబు పూబోది యడుగు లధిప."

స్థాయీస్ఫురణ తన్మాత్ర సంబంధమైనది. తన్మయత్వం అంతిమ ఫలం. అవ్యక్తస్థాయిలో ఆనందం, వ్యక్తిస్థాయిలో విజ్ఞానం లాభాలు. అవ్యక్తస్థాయీసంబంధాలలో నాలుగు రకాల ఆనంద స్ఫురణలు. సౌందర్య వికారాలు, సంయోగ వియోగాలు, విచార సంతోషాలు, విషాద వినోదాలు. వ్యక్తిస్థాయీ సంబంధమైన విజ్ఞానస్ఫురణలూ నాలుగు రకాలు. నిర్దేశం, నియుక్తం, నిరూఢం, నిబద్ధం.

'జగన్మోహినీవేషం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణగొల్పే సౌందర్యం. బాహుకరూపం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ వికారం. అశోకవృక్షం కింద సోకించే సీతావియోగం అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ వియోగం. మాయరంభ, మాయనలకూబరుల సంయోగమ వ్యక్తస్థాయి ఆనందస్ఫురణగొల్పు సంయోగం. వ్రేపల్లెలొ శ్రీకృష్ణుడు గోపబాలకులతో గడిపిన ఘట్టాలు అవ్యక్తస్థాయి ఆనందస్ఫురణ గొల్పే వినోదాలు. అజ్ఞానవాసంలో పాండవుల ఇడుములు అవ్యక్తస్థాయి అనందస్ఫురణ విషాదానికి ఉదాహరణ. వ్యక్తిస్థాయిని నిర్దేశించేవి ప్రకృతిశాస్త్రాలు, నిరూఢాలు, నియుక్తాలు,  సంగీత శాస్త్రాదులు. వేమన పద్యాల్లాంటివి నిరూఢాలు. వేదాంతాదులులు నిబద్దాలు.

సారస్వతంలో అనుభవం రూపంలాంటిది. రసం కళవంటిది. భావం జీవాత్మ. ఆశయం పరమాత్మ. పలుకబడి జీవం. స్థాయీస్ఫురణం జీవపదార్థం. సారస్వత విభేదాలు రెండు రకాలు. సాధ్య సారస్వతం. సిద్ధ సారస్వతం. అనుభవ రస భావ ఆశయాలలో ఒకటి రెండు కొరవడి.. పలుకుబడి సాయంతో వ్యక్తిస్థాయికి విజ్ఞానస్ఫురణ  కలిగించేది సిద్ధ సారస్వతం. మనం సర్వసాధారణంగా సారస్వతం అనేది ఇలాంటి సిద్ధ సారస్వతాన్నే.

కేవలం అనుభవాన్ని మాత్రమే బోధించే ప్రకృతి శాస్త్రాలు, కేవలం రసాన్ని మాత్రమే బోధించే సంగీతాది శాస్త్రాలు, కేవలం బావ బోధకాలైన నీతిశాస్త్రాలు, మతగ్రంథాలు, రసాన్ని, ఆశయాన్ని మాత్రమే బోధించే భజన కీర్తనాదులు సాధ్య సారస్వతాలు.

అనుభవ రస భావ ఆశయాలు  నాలుగు సమ్మిశ్రితమై వాటి వాటి ప్రాముఖ్యాన్ని బట్టి ఉచితానుచితాలను వహించే ప్రబంధాలు, శతకాలు, నాటకాలు, నవలలు కొన్ని సిద్ధ సారస్వతాల కిందకే వస్తాయి.

చివరగా ఓ విన్నపం!

సాహిత్యాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేస్తేనే గానీ సాహిత్య సృజన సాధ్యం కాదని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. సాహిత్యాన్ని లోతుగా పరిశీలన చేయవలసిన విశ్లేషకులకు ఓ చిరు కరదీపికగానైనా  ఉపయోగ పడాలనే సదుద్దేశంతో చేసిన సమాచార సేకరణ ప్రయత్నంగా అర్థం చేసుకోమని మనవి. మాన్యులు కీర్తి శేషులు కవికొండల వెంకటరావువంటి వారినుంచి పొందిన ప్రేరణగా ఈ ప్రయత్నాన్ని చూడమని వినయపూర్వకమైన వినతి*

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

14 -02 -2021

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...