Tuesday, February 2, 2021

                                                              


కలసి ఉంటే కలదా సుఖం?

జి. ఎస్ . దేవి

( కర్లపాలెం హనుమంతరావు )



అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కాకి. అదో రోజు ఆహారంకోసం వేటకుబైలుదేరింది. దారిలో దానికి ఒక గద్ద ఎదురయింది. "తమ్ముడూ! ఎక్కడికీప్రయాణం?" అని యోగక్షేమాలు ఆరాతీయడం మొదలుపెట్టింది. మాటల సందర్భంలో

కాకి వేటకు బైలుదేరినట్లు తెలుసుకుంది. "నాకూ ఇంటినిండా గంపెడు సంతానం.నేనూ నీకు తోడుగా వస్తాను. ఇద్దరం కలసి వేటాడుకుందాం. వేటలో సంపాదించినదేదో ఇద్దరం చెరి కాస్తా పంచుకుందాం. నీకు సమ్మతమైతే ఈ క్షణంనుంచే మనం స్నేహితులం" అని పొత్తు ప్రతిపాదించింది గద్ద.

కాకిదీ అదే ఆలోచన. పెద్దజాతి జీవాల మద్దతు ఉంటే తప్ప మనుగడకు ఆస్కారం లేకుండా ఉన్నాయి పరిస్థితులు. 'గద్ద పెద్దజాతి పక్షి. బలమైనది. వడి ఎక్కువ. ఎంత ఎత్తైనా ఎగరగలదు. ఎంత దూరంలో వున్నా ఆహారం స్పష్టంగా పసిగట్ట గలదు. దీనితో పొత్తు అంటే లాభమే, అదృష్టం కలిసొచ్చినట్లు ముందు గద్దే

పొత్తు ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఆలస్యం చేస్తే అవకాశం జారిపోవచ్చు'అనుకుంది. కాకి గద్ద స్నేహానికి వప్పుకుంది.

ఆ రోజు నుంచి కాకి, గద్ద మంచి స్నేహం చిగురించింది. రెండూ కలిసి వేటకు వెళ్ళేవి. వేటలో సంపాదించిందేదో ముందు అనుకున్న విధంగానే చెరిసగం పంచుకునేవి. 'కలసి వుంటే కలదు సుఖం' అనే సూత్రంలోని సుఖాన్నిస్వయంగా అనుభవిస్తూ సఖ్యంగా కాలక్షేపం చేస్తుండేవి.

పెద్ద పక్షితో కాకి సఖ్యత ఆ అడవిలోనే ఉన్న నక్కకు ఏమాత్రం నచ్చలేదు. ఎవరన్నా ఆనందంగా బతుకుతుంటే నక్కకు అసలు గిట్టదు. నక్క నైజం అది. దాన్నే కుళ్ళుమోతుతనం అంటుంటాం మనం. కాకి గద్దల మధ్య తంపులు పెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తోంది నక్క.

ఆ అవకాశం రానే వచ్చింది. నక్కకు ఒకసారి కాలికి గాయమై కదలలేని పరిస్థితి వచ్చిపడింది. ఆహారం దొరకడం దుర్లభంగా ఉంది. ఇదే అదనుగా అది తన ఉపాయాన్నిఆచరణలో పెట్టేందుకు పూనుకుంది.

కాకి, గద్ద వేటకు పోయే దారిలో మూలుగుతూ పడుకుంది. అటుగా వచ్చిన కాకి. గద్ద చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నత్లు కనిపించే నక్కను చూసి ఆగాయి.

"కాకి తమ్ముడూ! ఇక ఈ పూటకు వేట అక్కరలేదు. ఈ నక్క మనకు వారానికి సరిపడా ఆహారంగా సరిపోతుంది" అంది గద్ద.

కాకికీ అలాగే అనిపించింది. "అవునన్నా! మనం వేటాడేదే కడుపు నింపుకోవడానికే కదా! సరిపడినంత ఆహారం దొరికాక మరే ఇతర జంతువునైనా చంపడం అడవి న్యాయానికి కూడా విరుద్ధం. మా ఇంటికి ఇవాళ బంధువులు వచ్చి ఉన్నారు. 'అతిథి దేవో భవ'

అని కదా పెద్దల సూక్తి ! ఈ సారికి వేట జంతువు గుండెభాగం నన్ను తీసుకోనిస్తావా! బంధువుల్లో నా పరువు నిలబడుతుంది" అని కాకి అడిగింది . గద్దకూ అభ్యంతరం చెప్పాలనిపించ లేదు. 'సమయానికి ఆదుకోని స్నేహానికి అర్థం ఏముంటుంది!' అని పెద్ద మనసుతో ఆలోచించింది. 'సరే' అని సంతోషంగా ఒప్పుకుంది.

కాకి, గద్ద ఇంత సఖ్యంగా ఆహారం పంచుకోవాలనుకోవడం నక్క కేమాత్రం నచ్చింది కాదు. 'ఇద్దరి మధ్యా కుంపటి రాజేయడానికి ఇదే తగిన అదను' అని లోలోన ఒక కుతంత్రం ఆలోచించుకుంది.

బైటికి మాత్రం ప్రాణంపోయే బాధ నటిస్టూ "మీ ఇద్దరి మధ్య ఈ స్నేహం చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొస్తోంది. ఈ చివరి రోజుల్లో నేను చేసిన పాపాలు గురుకొచ్చి నా మీద నాకే రోత పుడుతోంది. వచ్చే జన్నలోనైనా మీ వంటిమంచి వారిలో ఒకటిగా పుట్టాలని మహా కోరికగా ఉంది. సాధ్యమైనంత తొందరగా నా ప్రాణాలు తీసేసుకోండి. నా శరీరం మీలాంటి ఉత్తములకు ఆహారంగా మారటం నించి గొప్ప అవకాశం ఇంకేముంది! నా పాపాలకు ఇట్లాగైనా పరిహారం దొరుకుతుందేమో! కాకపోతే నాదొకటే చిన్న విన్నపం. ఈ చివరి కోరికను మీరు ఇద్దరూ తప్పకుండా

మన్నిస్తారనే ఆశిస్తాను" అని బుడిబుడి రాగాలు తీయడం మొదలుపెట్టింది.

"ఎమిటా కోరిక?" అని అడిగింది గద్ద.

"నా దేహంలోని గుండె భాగాన్ని నువ్వే తీసుకోవాలి గద్ద బావా! అతిముఖ్యమైన గుండె భాగం కాకిలాంటి నీచ జంతువు పాలపడితే నాకు వచ్చే జన్మలో ఉత్తమ జన్మ ఎలా దొరుకుతుంది?" అంది నక్క.

నక్క మాటలకు కాకి మనసు చివుక్కుమంది. తనను నీచమైన జంతువు అనడం-ఎక్కడాలేని కోపం తెప్పించింది. "సృష్టి లోని జీవులన్నీ సమానమైనవే. వాటిని సృష్టించే సమయంలో ఒకటి ఎక్కువ.. మరొకటి తక్కువ.. అని దేవుడైనా అనుకుని ఉండడు. ఈ భేదభావాలన్నీ మనకుగా మనం కల్పించుకునేవే. అయినా మా కాకులకు మాత్రం ఏం తక్కువ? అని తగవుకి దిగింది కాకి

."అలా కాదులే కాకిబావా! 'పక్షీనాం కాకి ఛండాలి-పక్షులన్నింటిలోనూ కాకి అతి నీచమైన జీవి' అని కదా

శాస్త్రాలు చెబుతున్నాయి!"అని నయగారాలు పోవడం మొదలుపెట్టింది నక్క.

"మనుషులది ఉత్తమ జన్మ అని కదా మీరనే ఆ శాస్త్రాలు చెబుతున్నది కూడా! అలాంటి మానవులు కూడా మరి చనిపోయిన తరువాత తమ పిండాలని ముందుగా మా కాకులే

తినాలని కోరుకుంటారు. మా గొప్పతనానికి ఇంతకు మించి వేరే నిదర్శనం ఏముంటుంది? ఇంకా ఈ గద్దంటేనే లోకులకు లోకువ. ప్రాణాలు పూర్తిగా పోకముందే కళేబరాలకోసం పైన ఆకాశంలో గిరిటీలు కొడుతుంటాయని అసహ్యం. ఈ గద్దలంటే మనుషులకు యమదూతలకన్నా రోత." అంది కాకి ఆ కోపంలో.

ఎవరికైనా కోపం వస్తే అంతే. మెదడు నిగ్రహం కోల్పోతుంది. మంచి సంబంధాలను చేజేతులా చెడగొడుతుంది క్రోధం. ఇప్పుడు జరిగిందీ అదే. కాకి మాటలకి గద్దా కృద్ధురాలైంది "ఎంత సాహసం! పెద్ద జాతి పక్షిని. నన్ను పట్టుకుని ఇంతలేసి మాటలు అంటావా? జనం నిన్ను మాత్రం మన్నిస్తున్నారనిఅనుకుంటున్నావా? నీ నలుపు చూస్తే వాళ్ళకి ఎక్కడలేని జుగుప్స. నీ అరుపు వింటే అంతకు మించి అసహ్యం! నలుగురూ చేరి చేసే అల్లరిని మీ ' కాకి

గోల' తోనే పోలికపెట్టి చీదరించుకునేది! నీ బతుక్కు నువ్వా మా జాతిని వేలెత్తి చూపించేది! మేం విష్ణుమూర్తి వాహనానికి వారసులం. నక్క బావ చెప్పింది నిజమే. దైవాంశ మాది. బుద్ధితక్కువై నీతో జతకట్టాను. ఈక్షణంనుంచీ నీతో కచ్చి. నక్కబావ చివరి కోరిక మన్నించి తీరాల్సిందే. దానికి పుణ్యగతులు రావాలంటే గుండెభాగం నేనే తిని తీరాలి" అని అడ్దం తిరిగింది గృద్ధ౦..

కాకికి బక్కకోపం ఇంకా ఎక్కువైంది. నెత్తురు పీల్చి బతికే నీచజాతి

దోమకైనా.. 'చీ..పో' అని చీదరించుకుంటే కోపం రాకుండా ఉండదు కదా! ' ఆత్మగౌరవం’ అంటామే మనం.. అది అన్ని జీవులలోనూ ఉండే ఉంటుంది. అహానికి దెబ్బ తగిలితే అందుకే ఎవరికైనా రోషం తన్నుకొస్తుంది. అది సహజమే. ఆ రోషం

పెరిగితే ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ క్షణంలో హద్దులు తెలియవు. బుద్ధి సుద్దులు విననీయదు. జగడానికి దిగి ఆగడం ఆగడం జరిగి అన్నివిధాలా సర్వనాశనం అయిన తరువాతనే ఏ వీరంగాలేవైనా ఆగటం.

కాకి ఆత్మాభిమానమూ దెబ్బతిన్నది మరి. గద్ద ఆత్మగౌరవమూ గాయపడింది. ఇంత కాలం కలిసుంటూ ప్రదర్శించుకున్న పరస్పర సౌహార్దత అంతా కేవలం శుష్క ఆదర్శంగానే మిగిలిపోయింది రెండు పక్షుల మధ్య.

కాకి 'కావు.. కావు' మంటూ తన మూకను కేకలేసి మరీ పిలిచింది.

గద్ద మాత్రం గోళ్ళు ముడుచుకుని కూర్చుంటుందా? ఆ జాతి పక్షులన్నిటికీ పిలుపులు వెళ్ళాయి.

చూస్తున్నంతలోనే కాకులకూ.. గద్దలకూ మధ్య భీకర సంగ్రామం!

అంతా నక్కబావ సమ్ముఖంలోనే. నక్క జిత్తులమారితనం ఫలమే.

ఏ యుద్దంలోనైనా చివర్న తప్పనిసరిగా కనిపించే దృశ్యమే అక్కడా కనిపించింది.

క్షణాల్లో చచ్చిపడిన కాకులు.. గద్దలు! వాటి పీనుగ కుప్పలు! చావు తప్పి కన్నులొట్టపోయిన పక్షులు ఎటెటో ఎగిరివెళ్లిపోయాయి. 'కలసి ఉంటే కలదు సుఖం’ అన్న సూత్రం అంతరార్థం అర్థంచేసుకొనేందుకు ఇప్పుడు అక్కడ ఏ గద్దఅన్నగారూ లేరు. కాకి తమ్ములుంగారూ మిగిలిలేరు. ఉన్నదంతా ఒక్కజిత్తులమారి నక్క మాత్రమే. దానికి ఐదు సంవత్సరాలకు సరిపడినంత ఆహారం..”



"ఐదుసంవత్సరాలకు కాదు ! రెండున్నర సంవత్సరాలకు..”ఠక్కున ఎవరో పార్టీ కార్యకర్త సరిచేసాడు. ‘అవునవును’ అన్నట్లు తతిమ్మా కార్యకర్తలంతా వంతపాడారు.

ఉపాధ్యాయుడు తృప్తిగా తల ఊపాడు “కావాలనే ఐదు సంవత్సరాలని తప్పుగా చెప్పాను తమ్ముళ్లూ! తప్పును చక్కగా గుర్తించారందరూ! ఇదే పాఠం మీద మరో మూడు ప్రశ్నలు. వాటి మీదొచ్చే స్పందనలను బట్టే రేపొచ్చే ఎన్నికలలో మన పార్టీ తరుఫున మీకు దక్కే టిక్కెట్లు. ఈ కథకు తగ్గ పేరేమిటి?”

‘ప్రజాస్వామ్య అవస్థలో ఎన్నికల నాటకం.. ‘

“పొత్తుల ప్రహసనం జిత్తుల అసహనం”’

"గుడ్. బాగా లాగారు సెంట్రల్ పాయింట్! మరో ప్రశ్నః ఈ ఎన్నికల నాటకంలో మన పార్టీ ఏ పాత్రను పోషిస్తే ప్రహసనంలో అసహనం బాగా రక్తి కట్టేది?”

కాకి పేరు ఎంత చెత్త కార్యకర్తయినా చస్తే చెప్పడు. గద్ద పేరైనా వెరైటీ కోసం కొందరు కోరుకుంటారని గురువుగారు భావించారు, అన్నిరోజుల కంఠ శోష ప్రభావం.. వృథా పోలేదు! అందరూ ఏకగ్రీవంగా 'నక్క' పాత్రకే టిక్కెట్టేశారు.

సార్ తృప్తిగా తలాడిస్తూ “వారం రోజులగా సాగిన ఈ రాజకీయ శిక్షణా తరగతుల ఇంతటితో సమాప్తం.” అంటూ లేచి నిలబడ్డారు.

గుండెధైర్యం కాస్తంత ఎక్కువుండే ఓ  కార్యకర్త కలగజేసుకొని అందరి మెదళ్లను తొలిచే సందేహాన్ని బైటపెట్టాడు “మూడు ప్రశ్నలన్నారు, రెండే అడిగారేంటి గురూజీ..?! ఆ మొదటిది కూడా తెలిస్తే మా పీకులాట అణుగుతుంది కదా!”

ఆ పీకులాటకి జవాబు నాకే తేలలేదు ఇంత వరకు. అందుకే అడగలేదు బాబూ! ఆదిగారు కాబట్టి చెప్పక తప్పదు ప్రశ్న “గద్దలకూ కాకులకూ మధ్య పొత్తు ఈ కథలోనే కాదు.. అసలే కథలోనైనా కడ దాకా నిలుస్తుందా.. లేదా?” అన్నది  కథ ముందు నుంచి ఉన్న సందేహం”

హై కమాండుకే అంతుబట్టక తన్నుకులాడే ప్రశ్న! మీలో ఎవరికైనా ఏమైనా సవ్యవ్మైన సమాదానం తెలిస్తే చెప్పేయచ్చు! ఎవరి జావాబు సబబుగా అనిపిస్తే వాళ్లకే .. ఎన్నికలొస్తే గిస్తే.. ఎదుటి పక్షం నలబడనిస్తే.. గిసే.. జనం బడబడా ఓట్లన్నీ మనకే వేస్తే గీస్తే.. కోర్టుల్లో గిట్టనోళ్ళు కేసులెట్లాగూ వేస్తరు.. అవన్నీ గెలిస్తే గెలిస్తే .. అప్పుడు ఏర్పడబోయే ప్రభుత్వంలో కొత్తగా ఎర్పాటు చెసైనా ఇచ్చే  ఆ మంత్రిత్వ శాఖకు పర్మినెంటుగా టెంపరరీ బాధ్యతలు వాళ్లకే!?  ఏం చెప్పండి తమ్ముళ్ళూ కావాలా ఆ పోర్టుఫోలియో?’

అంతటా పిన్ డ్రాప్ సైలెన్స్!

***

(సూర్య దినపత్రిక వ్యంగల్పిక)

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...