Thursday, February 4, 2021

గారెల భారతం -కర్లపాలెం హనుమంతరావు -సరదా వ్యాసం

 



వింటే భారతమే వినాలని ఆరాటపడే తెలుగువాడికి తింటే గారెలు మాత్రమే తినాలని వెంపర్లాట! భారతంలో ఎక్కడా గారెల ప్రస్తావన లేదు. అయినా రామాయణంలో పిడకల వేటలా    భారతంలో గారెల కోసం తెలుగోడి వెతుకులాట!  గారెలు స్వీయ సృష్టి అని తెలుగువాడికో గట్టి నమ్మకం. సున్నా కనిపెట్టింది ఉత్తరాదివాడైతే  అంత కన్న కన్నాలున్న సున్నాలాంటి గారెలు కనిపెట్టింది తనేనని బడాయి. తినిపెట్టేవాళ్లు తప్ప ఏదైనా కొత్తది కనిపెట్టేవాళ్లు కలికానిక్కూడా కనిపించని రోజుల్లో గారె’ను సృష్టించినందుకు తెలుగువాడు గర్వపడ్డంలో తప్పేముంది?   

చప్పటి పిజ్జాలు, బర్గర్లే తప్ప   ఇప్పటి పిల్లతరానికి గారెల గరిమ గురించి ఆట్టే తెలియదు.  ఆదిమహావిష్ణువు చేతి వేలి మీదుండే చక్రం చూపించినా  పిక్చర్ పూర్తిగా రాదు. బండి చక్రం మాదిరి దొడ్డి గుమ్మంలో పడి ఉండేదని కాకుండా ..నోట పెట్టకుండానే లొటలొటా లోటాడు లాలాజలం  ఊరించేదని చెబితే బెటరేమో .. ధ్యాస కొంతైనా ఇటు మళ్లుతుంది!

గోంగూర కన్న గారెలు వాస్తవానికి తెలుగువాడి జిహ్వపుష్టికి ఆగ్ మార్క్. విశ్వామిత్రుడి సంతు సుమా మనమంతా!  సృష్టికి ప్రతిసృష్టి చేసిన  తండ్రిగారి పంథాలోనే  బూరెలకు బదులుగా గారెలు సృష్టించుకున్న ఘనులం మనం.

తెలుగువాళ్ల కాఫీ ప్రియత్వం సర్వే సర్వత్రా ప్రసిద్ధం. క్షీరసాగరం నుంచి వెలికొచ్చిన అమృతాన్ని మించీ కాఫీ పైనే తెలుగువాళ్లకు  మక్కువ ఎక్కువని కదా  నమ్మకం? ఆ సర్వజనాకర్షణీయ పానీయం కాఫీలో కూడా ఈర్ష్యాసూయలు రేకెత్తించగల   అసాధారణమైన రుచి  గారెలది.

'వడపై నావడపై పకోడీపయి  హల్వాతుంటిపై బూంది యూం/ పొడిపై నుప్పిడి పై  రవిడ్డిలిపయిం బొండాపయిన్సేమీయీ/ సుడిపై బారు భవత్క్రుపారసము నిచ్చో గొంత రానిమ్మునే/ నుడుకుం గాఫిని, యొక్క గ్రుక్క గొనెవే యో   కుంభదంభోధరా!’ అని కాఫీ పానీయం కుయ్యో మొర్రో మన్నట్లు  ఓ ముచ్చట.  పెరుగు వడ, పకోడీ, హల్వా ముక్క, బూందీ పలుకు, ఉప్మా ప్లేటు,  రవ్వ ఇడ్లీ, బోండా, సేమియా పాయసం.. లాంటి పిండివంటకాల వరకంటే  ఓకే! చివరికి వేడి వేడి గారెల రుచి  మీదా ఉడుకుడుకు కాఫీ తన ఉడుకుమోతుతనం దాచుకోలేకపోయింది! గారె రుచికి దక్కే గొప్ప ధృవపత్రం ఇంతకు మించేముంది? ఆరు రుచులు కలగలసి తొడగొట్టినా విస్తరి గోదాలో తెలుగోడి  గారె ముందు బలాదూర్ అన్న జనవాదే నిజమయింది.

సృష్టి సర్వం నిర్దుష్టంగా సృష్టించిన నిరంజనుడు కూడా  నీరుల్లి  గారెల రుచి కోసమే ధర్మసంస్థాపన వంకతో అడపా దడపా భూమ్మీదకు దయచేసేది! అయోధ్యలో పుట్టినవాడు అక్కడే రామాయణంకథ పూరా నడిపించుకోవచ్చు కదా  శ్రీరామచంద్రుడు! అమ్మ వైపు వాళ్లెవరో చెప్పింది విని కమ్మని గారెల పైన మోజు పెంచుకున్నాడు. కాబట్టే లంకారాజ్యాధిపతి వధ వంకన ఆంధ్రా సైడ్ దండకారణ్యాల దారిట్టాడు. అడవి నడిమిన అప్పటికప్పుడు బాణలి పెట్టి వండి వడ్డించే వ్యవధానం లేక  గానీ.. రామసోదరుల రాక ముందే పసిగట్టుంటేనా మన  శబరమ్మ మహాతల్లి ఏరుకొచ్చిన ఎండు పండ్లకు బదులుగా  పచ్చి కొబ్బరి కలిపి నానబెట్టిన మినప గారెలే పెద్ద బుట్టెడు ఆరగింపుకు పెట్టేదికదూ!

అంతా రామమయం’ అంటూ  అంత కమ్మంగా గానం చేయడం వెనుక దాగి ఉన్న రస రహస్యం ..  త్యాగయ్య తెలుగువాడుగా  అవతరించడమే కాదు.. ప్రతీ పూటా భగవదారానెపాన తయారయే గారెలు  తనివితీరా లాగించి తరించడం కూడా కావచ్చును! ముఫ్ఫై రెండు వేల సంకీర్తనలలు  రాశి పోసిన  తెలుగు అన్నమయ్యా    ఏదో ఓ  శృంగార సంకీర్తనల మధ్యన గారె గరిమను గూర్చి ఘనంగానే కీర్తించుంటాడు. కరిగిపోయిన రాగి రేకులతో పాటు గారె మీది కీర్తనలు కూడా మలిగిపోయుంటాయి.. తెలుగోడి బ్యాడ్ లక్! కంటబడ్డ ఏ దురాచారాన్నైనా చెండుకు తినకుండా వదిలిపెట్టని ప్రజాయోగి మన వేమన. గాడిద పాలను గురించి కందంలొ రాపాడేడే  ప్పించి.. గారెల రుచిని గురించి ఏనాడైనా పన్నైత్తి ఒక్క  చెడ్డ పదం వాడాడా ఎక్కడైనా? బీహారు కన్నయ్య చేత తెలుగిళ్ల వెన్న ముద్ధలు తినమరిగించిన గడుసుదనం కవి పోతనది.  గోపాలబాలుల గుంపు మధ్యన చేరి ఆ  బాలగోపాలుడు నంజిన   మాగాయ పసందు వర్ణనల సందున చెప్పి   పెరుగు గారెల రుచులు తగ్గించడం ఎందుకులెమ్మని   వదిలేసాడు! 

కలియుగంలో జంతుహింస నిషిద్ధం. కాబట్టి మేషం(మేక) బదులు మాషం, చక్రాలుగా వండుకు తినవచ్చు అన్నప్పటి బట్టి తెలుగువాడి గారె ప్రభకు తిరుగే లేకుండా పోయింది. తమిళమా.. తెలుగా .. కన్నడమా.. ఏదప్పా అత్యంత ప్రాచీన  భాష అని అడగడం ఆలస్యం..  కొప్పూ కొప్పూ పట్టుకునే రాధ్ధాంతంగాళ్లు కొప్పులోని వెంట్రుకలంత మంది. ఆ కొప్పు బ్యాచ్  సైతం గారె  ప్రాచీనత దగ్గర గప్ చుప్! అదీ మన గారె ఘనత.

కానీ గారె   తెలుగోడి ఆస్తి. అందుకే దాని  పుట్టుపూర్వోత్తరాల మీద  అన్యులకంత అనాసక్తి.   నో ప్రాబ్లం. బాపూజీకి భరతరత్నకు మించిన స్థాయి ఉన్నట్లే మన గారె ముక్కకు మనకు మించిన ఖ్యాతి కద్దు. తిండి ప్రపంచంలో గారెలకు ప్రత్యామ్నాయం నిల్. మీ నూడిల్సు, మెక్డొనాల్డ్సు రుచిలో వాటి ధాటికి ఆటిరాలేవు. ప్లేటులో  వేడి వేడిగా  రెండు గారెలు వడ్డిస్తే మూతి కాలినా  అమెరికా ప్రెసిడెంటు అరక్షణంలో ఇరాను మీద కయ్యం   ప్లేట్ ఫిరాయించేస్తాడు!

వడలు పేరు వింటేనే చాలు ఒడలు పులకరిస్తుందని బడాయిలు పోయే తిండిపోతులంతా ముందు బుద్ధికి బాగా ఎక్కించుకోవలసిన ముఖ్యమైన అంశం.. వడకైనా, ఆవడకైనా మూల సూత్రం మన తెలుగువాడి గారే!  తెలుంగువాడుగా పుట్టనందుకు అప్పయ్య దీక్షితులు అంతలా దిగాలుపడింది ఈ అప్పచ్చులు వండుకు తినే సౌభాగ్యం దక్కనందుకే! వచ్చే జన్మకయినా సరే.. తెలుగు నేల పై బడి శుభ్రంగా శుద్ధమైన గొనసపూడినేతి గారెల  మోజు తీర్చుకోవాలని సుభ్రహ్మణ్య భారతీ కలవరించాడు మరి.  

గారెల గొప్పతనం తగ్గించేందుకే విందు వినోదాల మెనూలలో   కనిపించద్దని  నిబంధనని ఓ అనుమానం! అయినా, పెళ్ళీ పేరంటాల మధ్యన ఏ వడ ముసుగులోనో విస్తట్లో దూరి భోక్తల దవడల్లో నీరూరించనిదే వూరుకోదు.. మన ఘరానా తెలుగు గారె!

పేరుకే తద్దినం భోజనం. విస్తట్లో  ఆవపెట్టిన చట్మీ వధువు పక్కన నోరూరిస్తూ గారె వరుడు కనిపిస్తే విందు భోజనం మించి పసందుగా ఉండదూ! తికినంత కాలం రెండు ముద్దలు కడుపారా కతికెరుగని పెద్దలు ఎందరో ఈ పిదప కాలంలో! పితృదేవతల హోదా దక్కిన పిదపైనా   ఏ వాయస రూపంలోనో వచ్చేసి  భుక్తాయాసం తీర్చేసుకునే అవకాశం కల్పిస్తుంది  గారె. మరి తెలుగు గారె అంటే ఎవరికుండదు గౌరవం? పసికూనల నుంచి పండుటాకుల వరకు గారెలంటే ఎవరికీ చేదు కాదు. బాలభారతం సినిమాలో గారెల మీదో గొప్ప పాటుంది. వింటుంటే అదీ వీనులకు విందే! గారెల గరిమ తెలుగు కవుల పద్యాలలో మరీ మారుమోగుతుంది. 

పుట్టిన ముహూర్తం శుభంగా లేనప్పుడు  మేనమామ వచ్చి శిశువు మెడలో గారెల దండేస్తేనే  సర్వ గ్రహాలూ  శాంతించేది. శివయ్యను అదరగొట్టిన శనిగ్రహమే తలవంచిన   గారెల రుచి ముందు మానవమాత్రులం మనం మాత్రం ఎలా నిగ్రహం చూపించడం?

కలిగినవాడయితే మనసు మళ్లినప్పుడల్లా చప్పున చేసుకుని తినేయచ్చుఖరీదైన అప్పచ్చులు! లేనివాడో? కనీసం పండుగ పబ్బాలప్పుడు లేమి దాచుకునేందుకైనా  చేసుకు తీరక తప్పదు కదా!  అప్పు చేసి అయినా సరే పప్పుకూటికి ‘సై’ మనే   తెలుగువాడు. గారెను మాత్రం ఎందుకు దూరం పెడతాడు?

పడక దిగింది మొదలు, పడక ఎక్కే దాకా బతుకు నిండ ఎన్నో అరాచకాలు! సంబంధంలేని సవాలక్ష సమస్యలతో ప్రజలను పీడించే ప్రభుత్వాలు! మామూలు జనం ఇష్టానుసారం  చేసుకునే అవకాశం ఒక్క తిండితిప్పల వరకే పరిమితం. ఆ తిండి తిప్పల్లో కూడా   ఉప్పు చప్పుల రాజీ ఎందుకు? బడాబాబులకయితే  బడా బడా బ్యాంకులు కూడా  గారెల వంటలకైనా సరే లక్షల కోట్లు కుమ్మరిస్తాయ్. చిల్లర మనుషులకు చిల్లుచెంబో,  సొత్త తప్పేళో   తాకట్టు కొట్టుకు నడిస్తే తప్ప గారె బాణలి పొయ్యిపై కెక్కదు. అయినా సరే! భరత ఖండం దక్షిణాదిమళ్లా ఎప్పుడు తెలుగు బిడ్డగా పుట్టొచ్చామో! వంటికి నిండుగా గుడ్డా గుడుసూ  గొడవలు ఎప్పుడూ ఉండేవే! పండగా పబ్బం వచ్చిందంటే తెలుగోడి వంటింటి పొయ్యి మీది   సలసల  కాగే బాండీ  నూనెలో  గారెల పిండి చుయ్యిఁ ..చుయ్యిఁ’ మంటూ పడి తీరాల్సిందే!

గారె ఒలంపిక్స్ షీల్డును తలపిస్తుంది. ఆటల్లో గోల్డులు గట్రా కొట్టుకొచ్చే  తంటా తెలుగువాడికి లేదు.  ఏ పండుగ పబ్బమొచ్చినా రుబ్బురోలు ముందో రెండు గంటలు కూలబడ్డా చాలు! సుబ్బరంగా వంద ‘ఒలంపిక్’ పతకాలను మించి  గోల్డ్ గారెలు తయార్! 

వివాహ భోజనంబు వింతైన వంటకంబు

వియ్యాలవారి విందు ఓ హోహ్హొ నాకె ముందు

ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల

ఓహ్హోరె అరెసెలుల్ల హహహ్హహహ్హహా

ఇయెల్ల నాకె చెల్ల ..’

చెల్ల సరే! అసలీ మినప గారెల తయారీ ఎల్లా అని గదా?

మినప పప్పో  పావు కిలో, అల్లం    రెండంగుళాల పొడవు,          పచ్చి మిర్చి  ఓ ఆరు కాయలు చిన్నివి,  ఉల్లిపాయలు బుల్లివి ఓ వంద గ్రాములు,  కరేపాకు కత ఇహ నీకు మాత్రం తెల్వనిదేమున్నది..  దొరికితే ఓ రెండు రెబ్బలు, కమ్మటి గుంటూరు నెయ్యి ఓ చెంచాడు,  ఘుమ ఘుమ లాడే ఇంగువ అర చెంచాడు, ఉప్పు తగినంత.. ఐదొందల గ్రాముల  నువ్వుల నూనె! నూనె బాణలిలోకి ఒంపి పెట్టుకోవాలి! గారంటే  గట్టిగ ఉండాలి గదా!  పప్పు ని ఒక గంట పాటు  నానపెట్టి, మెత్తంగా రుబ్బి పెట్టుకోవాలి. అల్లం, మిర్చి, ఉల్లి, రేపాకు, మన్నూ మశాన్నంన్నీ సన్నగా తరిగిపెట్టుకోవాలి. రుబ్బిన పిండి లో ఉప్పు, నెయ్యి, ఇంగువ, మిరప, అల్లం, రేపాకు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి. డీప్ ఫ్రై పాన్ లో నూనె  పోసి వేడెక్కాక పిండిని అర చేయి  సైజు మందాన  వత్తుకొని నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే! గారె గోల్డెన్ బ్రౌన్ రంగుకు వచ్చే వరకు వేయించుకుంటే సూపర్ గారెలు రడీ! అన్నట్లు మధ్యలో కన్నం పెట్టినప్పుడే అది ఆంధ్రా గారె!

బహిరంగంగా మార్కెట్లలో వేరుశనగ నూనె ధరలు వేసే వీరంగం చూస్తుంటే  ఎంత ‘లావు’ ట్రంపుగారికైనా ఇంత పిక్కె గారైనా వండి రుచి చూపించే మాట కల్ల! పండుగ మర్యాద కోసమైనా పిసరంత పక్క పాకిస్తోనోడికి  వండి తినిపిద్దామంటే మినుముల రేట్లు రేకట్లతో పోటీకి దిగి మన శ్రీహరి కోట  నుంచే ఆకాశంలోకి దూసుకెళ్లిపోతున్నాయ్!

ప్రసిద్ధ తెలుగు జంటకవులలో తిరుపతి వేంకట శాస్త్రిగారని ఘరానా పండితులు. వెంకట రామకృష్ణకవులతో వారికి ఏ కారణం చేతనో హమేశా సంకటాలు! ఇద్దరు పండిత ప్రకాండుల మధ్యనా బురద జల్లుడు పద్యాలు వరదలా పోటెత్తినప్పుడు   శాస్త్రిగారి గురువుగారే  శిష్యుణ్ని దెప్పుతూ గారెల ప్రస్తావతో ఓ గొప్ప హితవు చెప్పారు. 'గారెల పిండివంటకయి కాంతుడు కాంతను పృచ్ఛ సేయ నా/ సారసనేత్ర వ్రేలొకటి చయ్యన జూపి ‘యిదొక్కడున్న దా ధారం’ అన్నదటఒక ఇంట్లో! గారెలు వండిపెట్టమని ఓ తిండియావ సంసారి భార్యను పీడించుకు తింటుంటే  'గారెకు మధ్యలో చిల్లు పెట్టే నా చూపుడు వేలు తప్పించి కొంపలో ఇంకే  సరంజామా లేదు.. పోయి తెమ్మన్నదని ఆ వెటకారం! ఆ దయనీయ స్థితిలోనే ప్రస్తుతం మనం ఉన్నది కూడాను!

‘తెలుసు! పెద్ద పండుగకు కూడా గారెలు  వండుకు తినే యోగం బడుగోడుకి ఎట్లాగూ లేదనేగదా.. గారెల గురించి ఇన్నిన్ని నోరూరించే ముచ్చట్లు చెప్పుకొచ్చిందీ!

ఔరౌర గారెలల్ల.. అయ్యారె బూరెలిల్ల

ఓహ్హోరె అరెసెలుల్ల.. హహహ్హహహ్హహ

ఇయెల్ల నాకు కల్ల ..’

హహహ్హహహ్హహా! హహహ్హహహ్హహా! హహహ్హహహ్హహా!’

-కర్లపాలెం హనుమంతరావు

05  -03 -2021

బోథెల్, యూఎస్ఎ

***

 


 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...