Monday, February 15, 2021

ధర్మ నిర్ణయం - కథానిక - కర్లపాలెం హనుమంతరావు

 


ధర్మనిర్ణయం- కథానిక 

- కర్లపాలెం హనుమంతరావు 


 

బ్యాంకుడ్యూటీనుంచి ఇంటికి వస్తూ వసూ రామకృష్ణాపురం ఓవర్ బ్రిడ్జిమీద వెనకనుంచీ వస్తున్న ఇసుకలారీ గుద్ది బైకుమీదనుండి పడిపోయాడు గోవిందరావు.

ఆ సమయంలో చీకటి. వర్షంకూడా జోరుగా పడుతోంది. రాత్రి ఎనిమిది గంటలు దాటితే సాధారణంగా ఆ బ్రిడ్జిమీద జనసంచారం కనిపించదు అంతగా.

దాదాపు రెండు మూడు గంటలు అపస్మారక స్థితిలో పడివున్నాడు గోవిందరావు.

ఎవరో గమనించి అతని దగ్గర ఉన్న సెల్ఫోనులోనుంచి ఇంటివాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందించారు. ఆయన్ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించేసరికి అర్థరాత్రి దాటిపోయింది. 

మెడికో లీగల్ కేసు కనక ముందు పోలీసు రిపోర్టు అవసరం. ఆ తతంగమంతా పూర్తయి చికిత్స ఆరంభమయే వేళకి తెలిసింది.. పేషెంటు కోమాలోకి వెళ్ళిపోయాడని!

గోవిందరావు కొడుకు శరత్ గ్రూప్ త్రీ సర్వీస్ కమీషన్  ఇంటర్వ్యూలకని ఢిల్లీ వెళ్ళివున్నాడా సమయంలో. ఇంటార్వ్యూ ముగించుకొని ఇంటికి ఎలా వచ్చిపడ్డాడో తెలిదు.. ఇల్లంతా శోకసముద్రంలో మునిగివుంది.

'లాభంలేదు.. ఇంటికి తీసుకువెళ్లమంటున్నార్రా డాక్టర్లు! ఏం చేద్దాం?' అనడిగాడు గోపాలరావు. ఆయన శరత్ కి బాబాయి. అన్నగారు చేసే బ్యాంకులోనే లీగల్ ఆడ్వైజరుగా ఉన్నాడు. 

'నాన్న ఉన్నది కోమాలో కదా! ఎంత డబ్బు ఖర్చైనా సరే బతికించుకుంటాం బాబాయ్' అన్నాడు పళ్లబిగువున పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపుకొంటూ శరత్. 

'విషయం ఖర్చును గురించి కాదురా!..' ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు గోపాలరావుకి. 

'మరి?'

'శరత్ ని ఆసుపత్రి బయటవున్న కేంటిన్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి విపులంగా చెప్పే ప్రయత్నం చేసాడు గోపాలరావు. 'నాన్న కోమాలో ఉన్న మాట నిజమేకానీ.. డాక్టరులు చెబుతున్నదాన్నిబట్టి ఇంక హోప్స్ లేవురా!.. మనకింకో రెండు మూడు లక్షలు ఖర్చవడం తప్ప! ఇలా అంటున్నందుకు నాకూ బాధగానే ఉందిగానీ.. కొన్ని కొన్నిసార్లు వాస్తవాన్ని డైజస్టు చేసుకోక తప్పదు' 

'వాస్తవమేంటి బాబాయ్! నాన్న సజీవంగానే ఉన్నాడు. డబ్బుకోసం చూసుకొనే సమయం కాదిది. అమ్మకు తెలిస్తె చాలా బాధ పడుతుంది. పదండి.. వెళదాం!' అని లేచాడు శరత్.

బలవంతంగా శరత్ ని కూర్చోబెట్టాడు గోపాలరావు. 'అమ్మలాగా నువ్వూ ఎమోషనల్ గా ఆలోచిస్తే ఎలారా! ప్రాక్టికాలిటీ కావాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో!' 

'బతికున్న మనిషిని డబ్బుఖర్చు చూసుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ చేయించుకొని పోవడమేనా ప్రాక్టికాలిటీ అంటే!' 

శరత్ గొంతులోని వెటకారాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకుడేమీ కాదు గోపాలరావు. 'చిన్నపిల్లాడు. జీవితమంటే ఏంటో అనుభవం లేనివాడు. తండ్రి అంటే విపరీతమైన ప్రేమాభిమానాలున్న ఏ కొడుకైనా అలాగే ఆలోచిస్తాడు. అన్నీ తెలిసిన తనే ఎలాగో నచ్చచెప్పి అన్నయ్యకుటుంబాన్ని ఈ కష్టంనుంచి గట్టెక్కించాలి' అనుకొన్నాడు గోపాలరావు.

'మీ నాన్న తరువాత నాన్నంత వాణ్ని. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినరా!'అన్నాడాయన.

'తొందరగా చెప్పు బాబాయ్! అమ్మెందుకో కాల్ చేస్తోంది' అంటూ రింగ్ టోన్ కట్ చేసి అసహనంగా కూర్చున్నాడు శరత్.

గోపాలరావు చెప్పాడు' మీ నాన్న రిటైర్మెంటు ఇంకో వారంలో ఉంది. కంపాషియేనెట్ గ్రౌండ్సుమీద బ్యాంకునుంచి బెనిఫిట్స్ రావాలంటే రూల్సు ప్రకారం ఎంప్లాయీ రిటైర్మెంటునాటికి  సజీవుడై ఉండకూడదు'

'డెత్ బెనిఫిట్స్  అంటే మనీనా? ఆ ముష్తి రెండు మూడు లక్షలకోసం జన్మనిచ్చిన తండ్రిని బతికుండగానే చంపేయడం నావల్ల కాదుగానీ.. పద బాబాయ్.. ఇక వెళదాం!.. డాక్టర్లతోకూడా మాట్లాడాల్సిన పని చాలా ఉంది' 

లేవబోయిన శరత్ ని బలవంతంగా లాగి కూర్చోబెట్టి అన్నాడు గోపాలరావు 'సాంతం వినిపోరా! బెనిఫిట్స్ అంటే నాటోన్లీ మనీ.. ఎంప్లాయిమెంటుకూడా! మీ నాన్న సర్వీసులో ఉన్నప్పుడే పోయాడని డాక్టర్లు సర్టిఫై చేస్తేనేగానీ మీ ఇంట్లో ఒకళ్లకి ఉద్యోగం రాదు. ఇది నీ ఒక్కడికే సంబంధించిన విషయం కాదు. చెల్లాయి పెళ్ళి చెయ్యాల్సి ఉంది. మీ నాన్న చేసిన అప్పులున్నాయి!'

గోవిందరావు ఇంటిపరిస్థితులు గోపాలరావుకు తెలియనివి కావు. నీతికి, నిజాయితీకి నిలబడే అధికారిగా మంచిపేరైతే ఉందిగానీ.. కుటుంబాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో అన్నగారు విఫలమయ్యారనే ఒప్పుకోవాలి. శరత్ కి బాగా చదువు అబ్బినా విదేశాలకు పంపించి ఊడిగం చేయించడానికి ఇష్టపడలేదు. కొడుకుచేత ఇక్కడే ఎమ్మెస్సీ చేయించాడు. కూతురు పెళ్ళి ఇంకా వరాన్వేషణ దశలోనే ఉంది.

అయినా బిడ్డలకు ఆయనంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి బతికుండగానే 'నీ వల్ల నాకేంటి ప్రయోజనం? వ్యాపారం చేసుకోవాలి.. పెట్టుబడి తెచ్చివ్వు! నీ ఉద్యోగం నాకిప్పించేసి నువు విశ్రాంతి తీసుకో!' అనే సంతానం అంతకంతకూ అధికమవుతున్న ఈ కాలంలో ఇలాంటి బిడ్డల్ని కలిగివుండటంకూడా అదృష్టమే!'శరత్ ను మనసులోనే అయినా  అభినందించకుండా ఉండలేకపోయాడు గోపాలరావు. 

'ఈ విషయాన్ని ఎలాగూ తల్లితో, చెల్లితో సంప్రదించడు వీడు! పోనీ తనే నేరుగా ఒకసారి వదినతో మాట్లాడితేనో!' అనిపించింది గోపాలరావుకి.

***

గోవిందరావుకి ఇంకో ఆపరేషన్ అవసరమన్నారు ఆసుపత్రి వైద్యులు. ఫస్టు ఆపరేషను వల్ల ఫర్దర్ డేమేజీ కంట్రోలయింది. ఈ ఆపరేషను సక్సెస్ అయితేనే పేషెంటు తొందరగా రికవరయే అవకాశం ఉంది. వికటిస్తేమాత్రం ప్రాణానికి ముప్పు. రిస్క్ ఫ్యాక్టరుమాతం కాస్త ఎక్కువే! ఈ విషయం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి! బట్.. మేటర్ అర్జంట్! 'ఓకే' అనుకొంటే మాత్రం ఒక హాఫ్ ఇన్స్టాల్మెంటుకింద రెండు లక్షలు కౌంటర్లో కట్టేయండి' అంటూ పెద్ద ఫార్మాలిటీస్ లిస్టే చదివాడు ఆసుపత్రి సూపరింటెండు శరత్ ని పిలిచి కూర్చోబెట్టుకొని.

తల్లితో, చెల్లితో సంప్రదించి బాబాయిచేత రెండులక్షలు కౌంటర్లో కట్టిస్తున్నప్పుడు మాత్రం శరత్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. 

'కూలి పనయినా చేసి నీ సొమ్ము అణాపైసలతో సహా చెల్లిస్తాను బాబాయ్!' అని తన రెండు చేతులూ పట్టుకొన్న అన్నకొడుకుతో అన్నాడు గోపాలరావు 'ఆ కూలీపని చేసే ఖర్మనీకు పట్టకూడదనే అంతగా నీకు చెప్పుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు! మరోసారి ఆలోచించుకొన్న తరువాతే డబ్బు కడదాం!'

'ఈ నిర్ణయం నాదొక్కడిదే కాదు బాబాయ్! అమ్మకూ, చెల్లాయిక్కూడా నాన్నను మళ్లీ మామూలు మనిషిగా చూడాలని ఉంది' అని శరత్ అన్న తరువాత గోపాలరావు మౌనంగా సొమ్ము చెల్లించేసాడు.

ఆ సాయంత్రమే ఆపరేషన్ అయిపోయింది. రాత్రంతా కండిషన్ బాగానే ఉందన్నారు డాక్టర్లు. తెల్లారుఝామునుంచి కంగారు పడటం మొదలుపెట్టారు. 

సోర్యోదయానికన్నా ముందే గోవిందరావు అస్తమించాడు. ఏడుపులు.. పెడబొబ్బలు.. అయినవాళ్ళొచ్చి పరామర్శించడాలు.. చివరిచూపులకని ఎక్కడెక్కడివాళ్లో తరలివచ్చారు. ఫార్మాలిటిసన్నీ యథావిధిగా జరిగిపోయాయి. శరత్ తండ్రి చితికి కొరివిపెట్టాడు.

కొత్తసంవత్సరం ప్రపంచమంతా వేడుక జరుపుకొంటుంటే.. గోవిందరావు లేని లోటును  జీర్ణించుకొంటూ విషాదంగా గడిపింది శరత్ కుటుంబం.

శిశిరం శాశ్వతం కాదు. వసంతం మళ్ళీ రాక మానదు. ప్రకృతి చెప్పే పాఠం ఇదే!

మళ్లీ ఏడాది గడిచేసరికల్లా ఆ ఇంట్లో మరో బుల్లి గోవిందు కేరింతలు వినిపించాయి. తండ్రిపోయిన ఆర్నెల్లలోపే కూతురికి పెళ్ళి జరిపిస్తే ఆ కన్యాదానఫలం తండ్రికె దక్కుతుందని- శరత్ పంతంకొద్దీ చెల్లికి మంచిసంబంధం చూసి కళ్యాణం జరిపించాడు.

శరత్ కి తండ్రి చేసే బ్యాంకులోనే ఉద్యోగం వచ్చింది కంపాషియనేట్ గ్రౌండ్సుమీద. గోవిందరావు యాక్సిడెంట్ సందర్భంలో అయిన ఖర్చంతా బ్యాంకే భరించింది రూలు ప్రకారం. 

గోవిందరావు- రిటైర్మెంటుకి సరిగ్గా ఇరవైనాలుగ్గంటలముందు ఆసుపత్రిలో చేసినా ఆ రెండో ఆపరేషన్ విఫలమై చనిపోవడంవల్లే ఇవన్నీ సంభవమయాయి!

ఆసుపత్రి సూపరింటెండెంటుగారి సహకారంలేనిదే ఇవన్నీ సాధ్యమయేవి కాదు. గోవిందరావు చొరవవల్లె బ్యాంకునుంచి లభించిన రుణం సాయంతో చిన్న ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి పెంచగలిగాడు సూపరింటెండెంటు. గోవిందరావు ఇంటి పరిస్థితి వివరించి ఆ కుటుంబాన్ని ఆదుకొమ్మని ప్రాఢేయపడింది మాత్రం గోపాలరావే!

డెసెంబరు ముప్పైఒకటో తారీఖునే అంత అర్జంటుగా అవసరం లేకపోయినా.. ఉన్నట్లు కలరిచ్చి రెండో ఆపరేషను చేయాలని నిర్ణయించడం వెనకున్న అంతరార్థం ఇప్పటికీ శరత్ కుటుంబానికి తెలీదు.

***

'ఇంతకాలం మీరు తోటివైద్యులందరికీ నిత్యం బోధించే మెడికల్ ఎథిక్సన్నీ ఇలా గాలికి వదిలేయడం న్యాయమేనా?' అని అడిగింది సూపరింటెండెంటుగారి భార్యామణి భర్తద్వారా ఇంట్లో అసలు విన్నతరువాత.

''నేను ఎథిక్సుని ఎప్పుడూ జవదాటను. ఇప్పుడూ జవదాటలేదు  మైడియర్ శ్రీమతిగారూ! మైండిట్.. ప్లీజ్! ఒక పేషెంట్ అన్ని రోజులు కోమాలో ప్రోగ్రెస్ లేకుండా పడివున్నాడంటేనే మెడికల్ భాషలో 'క్లినికల్లీ డెడ్'.  రిటైర్మెంటుకి ముందే గోవిందరావుగారి మరణాన్ని ధ్రువీకరించడంవల్ల ఏజ్ బార్ కి దగ్గరగా ఉన్న అతని కొడుక్కి బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆర్థికపరమైన చిక్కుల్నుంచి ఆ కుటుంబం బైటపడింది. నేనా రోజున లోనుకోసం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఈ గోపాలరావుగారు ఏమన్నాడో తెలుసా! 'ఏ వృత్తికైనా ఎథిక్సుంటాయండీ! ఎథిక్సంటే రూళ్లకర్రపట్టుకొని చండశాసనం చేసి నిజాయితీపరుడనిపించుకోవడం ఒక్కటేనా? మేథస్సిచ్చిన వివేకాన్ని  ఉపయోగించి నిజమైన అర్హులను ప్రోత్సహించడంకూడా  కదా! అఫ్ కోర్సు  ఆయనే అన్నట్లు అది అన్నంపెట్టే తల్లిలాంటి సంస్థకి కన్నంపెట్టి చేసే ఘనకార్యంమాత్రం కాకుడదనుకో! నాలాంటి ఎంతోమందికి కొత్తజీవితాలను ప్రసాదించిన ఆ మంచిమనిషికి ఎవరికీ నష్టం, కష్టం కలగకుండా ఇలా సాయంచేయడంలో ఎథిక్సును ఎక్కడ అతిక్రమించినట్లు! మరో ముఖ్యమైన విషయం చెప్పనా! అసలీ ఆలోచన చేసిందే ఆ గోవిందరావుగారి తమ్ముడు గోపాలరావుగారు. వృత్తిపరమైన ఎథిక్సుకి ఆయన పెట్టింది పేరు 'అన్నాడు ఆసుపత్రి సూపరింటెండుగారు. 

***

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్;  యూఎస్ఎ 

(స్వప్న కథలపోటీలో 'శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం పొందిన కథ- జూన్ 2012 సంచికలో ప్రచురితం)

 

 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...