Monday, February 8, 2021

కన్నయ్యకు విన్నపం - కర్లపాలెం హనుమంతరావు - (చోరకళావారసులు - ఈనాడు సంపాదకీయ పుట ప్రచురితం)

 



రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా! మా మొరలు  ఆలకించ రారా కృష్ణయ్యా! దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించుతావనే  కదా నిన్నంతా దుష్టదురిపాలకా.. శిష్టపరిపాలకా అని పిలిచేదీ.. కొలిచేదీ! బుడి బుడి అడుగులతో నువ్వలా కిలకిలలాడుతో నడిచి వచ్చినప్పుడల్లా 'మా చల్లనయ్య' వంటూ ప్రేమతో పదే పదే పొగిడేది! ఆ వల్లమాలిన ఆనందం ఇప్పుడు నీ భక్త జన సందోహంలో కంచు దివిటీ వేసినా కనిపించడం లేదు.  ఎందుకో  గమనించావా దీనజన బాంధవా?

మన్ను తిన్న నోటితో తినలేదని నువ్వు ఏ పరమార్థంతో  అమ్మ ముందు బొంకావో! భువన భాండాలని సైతం అవలీలగా  మింగేసే బకాసురులందరికీ ఇప్పుడు ఆ  బుకాయింపుల పర్వంలో నువ్వే ఆదర్శం! కిరాయి మనుషులను పెట్టి మరీ గోవర్థన గిరులను ఎత్తించేస్తున్న విఐపిలే విచారణల కమిటీల నుంచి స్వీయ రక్షణార్థం తులాభారంలో తులసీ దళానికి తూగిన నీ కన్నా ఎక్కువ అమాయకత్వం నటించేస్తుంటిరి కన్నయ్యా!. అస్మదీయులందరికీ పద్మనయనాలతో నయనానందకరంగా దర్శనమిచ్చే రాజకీయం సామాన్యుడినిప్పుడు  సహస్రాధిక క్రూర దంష్ట్రాల బలిమితో నమిలి  పిప్పిచేస్తున్నది బలరామ సోదరా!

మహాత్మా! నీవు లేకుండా మహాభారతమన్నా నడిచి ఉండునేమో కాని.. నీ వారసులమని చెప్పుకు ఊరేగే ఈ జోకరు నేతాగణ జోక్యం వినా చివరికి తిరుమల వెంకన్న దేవుడి దర్శన భాగ్యమైనా దొరికే అదృష్టం లేకుండా ఉన్నది!


దైవమంటే పెద్దలు ఎందరికో పన్ను కట్ట నవసరం లేని ఓ బడా ఖజానా! దేవాలయ అదాయాలు అనేక మందికి కడుపుకు నిండా తిన్నప్పటికీ తరగని వెన్నముద్దల వంటివి. నీ 'ధర్మ సంస్థాపనార్థాయ' థియరీ నీ  వారసులమని చెప్పుకు తిరిగే దొంగలు ఎందరికో 'ధనసంపాదనార్థాయ'గా మారిందయ్యా ముకుందా! 

నీ కాలపు రాజకీయం వర్ణం, వాసన, రుచి సంపూర్ణంగా మార్చేసుకున్నదిపుడు దేవకీ నందనా! 'గోపి' అంటే మెజారిటీకి నీవు కాదు నీరజాక్షా..  'గోడ మీద పిల్లి' మాత్రమే ముందు పటం కట్టు చిత్రం! కృపారసం పై జల్లెడివాడు పై నుంటే చాలు..   ముష్టి యములాడికని యేమిటిలే.. ఐటి,  ఇడి.. ల వంటి  యాంటీ ప్రజాహిత శాఖలెన్ని దాడిచేసినా  దడవనవసరమే లేదు కాలకేయులు తనుజ మర్దనా! చట్టసభల్లో బిల్లులు చెల్లిపోవడానికైనా, చట్టం ముందున్న కేసులు కుళ్ళిపోవడానికైనా కొత్త బాదరాయణ సంబంధాలు బోలెడు ఇప్పుడు పుట్టగొడుగులకు మించి పుట్టుకొస్తున్నాయి బదరీ నారాయణా! 

'భజగోవిందం.. '  అంటూ పదే పదే  పాడుకోడం మూఢమతం  నేడు.  సమయం బహు విలువైనది..  పాడుచేసుకునే 'మూడ్' లో లేడే ప్రజానాయకుడు.  భజనలూ, కీర్తనలూ, దండకాలూ, అష్టోత్తర నామావళులూ గట్రా ఎక్స్ట్రాలన్నీ బుల్లి బుల్లి దేవుళ్ల వరకు  మళ్లిపోయాయయ్యా యెపుడో యాదవేంద్రా! గురువాయూరుకు మించి పరమ పవిత్ర దేవాలయాలిప్పుడు హస్తినలో అమరావతిలో, భాగ్యనగరుల్లో వెలసి వర్థిల్లు రోజులు! జనార్దనా! పాదరక్షలు  బైట ఓ మూలన వినయంగా వదిలి పెట్టి మూలవిరాట్టుకో నమస్కారం కడు భయభక్తులతో కొట్టి, వీపు చూపనంత విధేయతతో వెనక్కి వెనక్కి నడిచొచ్చేస్తే చాలు.. గొప్ప వడుపు చూపినందుకు సదరు  భక్తశిఖామణులకే ముందుకు దూసుకెళ్లే  మొట్టమొదటి ఛాన్స్! 

ఆత్మకథల నిజాలనైనా తొక్కి పెట్టి తగలెట్టడమే నేటి పచ్చి పారదర్శకతకు  కచ్చితమైన నిర్వచనం. నార్కో 'అణా'లసిస్ పరీక్షల్లో కూడా నాలిక మడత  ప్డడ్న్పని మెళుకువ చూపడమే నేటి నేతకు ఉండదగ్గ మొదటి గొప్ప  లక్షణము.

సర్వ లోకాలను  ఏలే  సామర్థ్యం ఉన్నా ధర్మసంస్థాపన కోసమని   గుర్రాలను తోలే పనికి ఒప్పుకున్న వెర్రివి  నువ్వు! విదురుడంతటి ఘనుడు అరటిపండు ఒలిచి తొక్క చేతికిచ్చినా బెదరకుండా ఆరగించిన మాలోకానివీ నువ్వే! రాజసూయ యాగంలో ఎంగిలాకులు ఎత్తిన వినయ  సంపన్నుడివి. 'కుయ్యో మొర్రో' మన్నది ఓ ఆఫ్ట్రాల్  బోడి కరిరాజమయినప్పటికీ అప్పటికప్పుడు  సిరికైనా చెప్పనంత హడావుడిగా భువికి దిగివచ్చిన  ఆర్తత్రాణ పరాయణత్వం నీది! నిస్సహాయులను కాపాడే నీ ఆత్రం మరి నీ భక్తులమని చెప్పుకు ఊరేగే నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే గెలిపించే సూత్రం!   

గోవర్థన గిరిని ఎత్తడం కాదయ్యా గొప్ప ఇప్పుడు మాధవయ్యా! పెరుగుతున్న ధరవరలను మా కోసం కిందికి దింపి చూపించు! మానినీ మాన సంరక్షకుడివని  వనితల  మంగళ హారతులవీ అందుకొనుడు కాదు మగతనం! నిస్సందేహంగా నీలో ఇంకా ఆ ఇంతుల జాతి పై పిసరంత పక్షపాతం ఉందంటే.. ఏదీ! సందునో దుశ్సాసనుడు శాసిస్తున్నాడీ కలికాలంలో! ఆ కేసులకు బెదరకుండా ఆ కీచకుల  పీచమణచు!  ఒక్క పసిబిడ్డ పాలలోనే ఏం ఖర్మ పరంధామా! బక్క మనిషి తినే ప్రతి గడ్డి పరకలోనూ విషం కలిపే పూతనలే  ఎక్కువ లాభాలు గడిస్తున్నదిప్పుడు.  ఆ కల్తీ శాల్తీల   పనిపట్టగల చేవ చూపెట్టగలవా చూడామణీ? పంచ భూతాల పాలిటి పగటి భూతాలుగా మారి జగతి సర్వాన్ని సైడు కాలువ సరుకుగా చేసే కాళీయుల మాడు మీదెక్కి ముపటి మాదిరిగా మళ్లీ మా కోసం తాండవమాడి చూపించవయ్యా  తామస హర మనోహరా!  

నువ్వా ద్వాపరాన చంపింది ఏదో నీ ఒక్క మేనమామ కంసుడిని మాత్రమే కదా కన్నయ్యా! ఆ దుష్టుడి వారసులు ఈ కలియుగం ఇంకింత మంది! ప్రతి అడుగులో   అణగారిన వర్గాలను  ఇంకా  అణగదొక్కడమే వారి పని! వంద తప్పులు  వరకు సహించే ఓపిక పరమాత్ముడివి కనక నీ కుంది గాని ముకుందా! మానవ మాత్రులం మేమీ కుందులు ఇక ఏ మాత్రం  ఓర్వలేని దుస్థితికి చేరుకున్నాం! ఆత్మకు చావు లేదు. నిజమే! కానీఅది ధరించే దేహానికి ఆకలిదప్పులు తప్పవు కదా? ఎంత కట్టి విడిచే దేహమయితేనేమి! విడవక కట్టుకునేందుకైనా ఓ గోచీపాతకు నోచుకోనిది మా లేమి.   చిటికంత  చినుకు రాలినా చాలు.. ఊళ్లకు ఊళ్లు వరద గోదావరులు!  తమదంటే హాయిగా  వటపత్ర శాయి బతుకు. ఒక్క గోవులను ఉద్ధరించినంత మాత్రానే గొప్ప దేవుడి వయిపోతావా గోపాలా? ఆబాలగోపాలం లబలబలాడుతున్నదీ  భూగోళంలో! బక్క జీవులకు దిక్కైనా మొక్కైనా ఎప్పుడూ నువ్వొక్కడివే చక్రధారీ! జనం కష్టసుఖాలకు  చెక్ పెట్టు దారి ముందు చూడు మురారీ!  

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు - సంపాదకీయ పుట 01 -09 -2010 ప్రచురితం)


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...