Thursday, February 4, 2021

లేచింది మహిళాలోకం -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడులోని ఓనాటి నా సంపాదకీయం)

 


                               


పరమేశ్వరుడు సమస్త వేదాంతరహస్యాలను పార్వతమ్మకు వివరించినట్లు  శివపురాణ కథనం. నారాయణమూర్తి భూదేవితో వైష్ణవాగమన విశేషాలు పంచుకొన్నట్లు విష్ణుపురాణం విశ్వాసం. స్త్రీ విద్యాధికారాన్ని దైవలోకమే మన్నించింది. కిందిలోకంలోనే ఎందుకో మగువకు దిగువస్థానం! ఆదిమయుగం సంగతేమోగానీ.. అంతా వేదమయంగా సాగిన రుగ్వేదకాలంలోనూ అమ్మదీ, అయ్యతో పాటు సంసార అరద చోదనంలో సమాన పాత్రే! బృహదారణ్యకంలో యాజ్ఞవల్క్యుడు భార్య మైత్రేయికి సాంఖ్యశాస్త్రం, భాగవతంలో కపిలాచార్యుడు తల్లి దేవహూతికి బ్రహ్మతత్వం బోధపరిచారు. మతంగ మహర్షి శబరిని జ్ఞానమాతగా ఉద్ధరించిన రామాయణగాథనే నేటికీ మనం నిత్యం పారాయణం చేస్తున్నాం! వాసంతి నుంచి ఆత్రేయి వరకు ముదితలెందరో మున్యాశ్రమాలలో వేదవేదాంగాది విద్యలలో కాణాచీలుగా వెలిగొందిన కథలు చదువుతూ కూడా స్త్రీ బుద్ధిని చంచలం, ప్రళయాత్మకంగా కించపరచడం మగవాడి దాంబిక ప్రవృత్తికి నిలువెత్తు దర్పణం. ‘నృణాతి నయతి స్వవశం పురుషమితి నారీ- పురుషుణ్ని స్వాధీనపరుచుకొనే శక్తే నారి’ అని దుష్టాన్వయం చేయడం నెలత ఆభిజాత్యాన్ని అవమానించడమే! ‘నారి’ అంటే వాస్తవానికి న అరి- శత్రువులు లేనిది. ఏ భూమి మీద సావిత్రి పతిభక్తి భర్త ప్రాణాలను రక్షించిందో, ఏ భువి లోపల సీతమ్మవారి పాతివ్రత్యం అగ్నిపరీక్షలో సైతం నెగ్గుకొచ్చిందో, ఏ పృథ్వి అత్రిసతి అనసూయ సౌశీల్యం త్రిమూర్తుల లౌల్యాన్ని బాల్యచేష్టగా మార్చి లాలించిందో, ఏ వసుంధర అరుంధతి.. లోపాముద్రాది నాతి జాతి సృష్టికర్త ఉనికిని సైతం ప్రశ్నార్థకం చేసి చూపిందో.. ఆ భూఖండంలోనే ఆడదానికి అడుగడుగునా అఖండంగా అగ్నిగుండాలు! నవనాగరీకులమని నయగారాలు పోయే మగవారి లోకంలో మహిళ బతుకు ఇంకా ముల్లు పక్కన అల్లాడే అరిటాకంత సున్నితమే! దేవనాగరీకంలో 'శర్వరి' ద్విశతాధిక పర్యాయపదభూయిష్ట! ‘మానవతీ!.. మానినీ!’గా సంబోధించినంత మాత్రాన మహిళ సమానవతి.. సన్మానినిగా మన్నింపబడుతున్నట్లెనా!

ఒక బిడ్డకు తల్లయీ పుట్టినింటికి పోయిరావాలంటే పట్టెమంచం మామగారినుంచి.. వంటగది తోడుకోడలు వరకు ఇంటిసభ్యులందరి అనుమతులు తప్పనిసరి. అందుకోసమై అత్తింట కొత్తగా కాలు పెట్టిన ఇంతి కన్నీటితో దేబిరించే జానపదుల పాట సరిపోదా.. కలికి కామాక్షి ఎంత కలవారి కోడలైనా ఒలికి వళ్లోకి వచ్చి వాలేది వట్టిసున్నా మాత్రమేనని! ‘బాలప్రాయమునాడు నాతి పడుచూను/ వేల్పులెత్తగలేని విల్లు తానెత్తే/’ జనకముని పుత్రిక సీత. అది చూసి ‘ఈ సీత నెవ్వరికిత్తునని దలచీ/ ఘనులు ఎవ్వరూ రానీ కరమునా బట్టీ/ పూని వంచితే ఇత్తు పొలతి వారికినీ’ అని ఆ మారాజు నిశ్చయించుకొన్న ‘సీతమ్మ స్వయంవరం’ గీతికలో మాత్రం ఏమంత నీతిసూత్రం దాగుందని? సీత రాత బాగుండి ‘రఘువంశ తిలకుడు రామచంద్రుడు మునుకొని హరివిల్లు ముమ్మారు వంచి’ విరిచేయబట్టి సరిపోయింది! రుగ్వేదయుగంలో మాదిరి సౌందర్యం, సౌశీల్యం, బుద్ధి, బలం, యవ్వనం, సమయానుకూల వర్తన.. గమనించుకొని గదా వరుడి మెడను వధువు స్వయంనిర్ణయానుసారం వరమాలాకృతం చెయవలసిందీ? ‘పెళ్లయిన ఇంట ఆరునెల్ల కరువంట’ అని సామెత!ఆడపిల్లంటే గుండెలమీది బరువు. అటూ ఇటైతే.. కన్నకడుపు చెరువు’ వంటి భావనలు నవసమాజం నుంచి ఇంకా తొలగకపోవడం భామినుల ఆభిజాత్యానికి ఏమంత శోభస్కరం? శాస్త్రాలు సైతం సుతోదయ భాగ్యంకోసం మాత్రమే క్షీర, సోమాది రసాభిషేకాల ప్రస్తావనలు చేయడం గమనార్హం. గర్హనీయం. ‘ఆడదై పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలు’ అన్న ఆత్మన్యూనతా భావంలోనే అధికశాతం మగువలు ఈ నాటికీ మగ్గడం విచారకరం! మగవాడు తిరిగితే చెడనిది.. ఆడది తిరిగితే ఎలా చెడుగవుతుందో? ‘చక్రవర్తులైనట్టి చానలుండ/ దరుణు లుద్యోగములు చేయ దగరటంచు/’ బల్కనేమిటి?’ అని వెనకటికి ఓ కవిపురుషోత్తముడు కడిగిపారేశాడు. ‘విమల సచ్చరిత్ర విమలామహాదేవి- కాంతుని నేపాటి కలత పఱచె?/అపర సరస్వతి యననొప్ప దమయంతి- నాథు నేపాటి నమిలి మ్రింగె?/.. తక్కుగల రామలందరు మిక్కుటముగ- జదువ నేర్చియు బతుల కసౌఖ్యములను/ కలుగ జేసిరె?’ అన్న ఆ కవిప్రశ్నకు ఈనాటికీ సబబైన సమాధానం కరువు. ఇంట గెలిచిన ఇంతికి రచ్చ గెలవడం ఎంతని.. అవకాశమంటూ ఒకటి దక్కడమే ముఖ్యం గాని!

పురుషునిలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని వెన్నుతట్టి లేపేది అమ్మగా, ఆలిగా, చెల్లిగా.. స్త్రీమూర్తే! బుద్ధిలో నాలుగింతలు, శక్తిలో అంతకు రెట్టింపు ఆధిక్యంలో ఉండీ.. వెనకుండి గెలిపించేందుకే ఆసక్తి చూపించే మగువను మగవాడు ఏనాడు అర్థంచేసుకొన్నాడు కనుక! అంగనంటే వాడికి అంగడిబొమ్మ. ముంగిల్లో తిరిగే మరబొమ్మ. తిమ్మిరి దింపుకొనే పడక గుమ్మ. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అని మనువేనాడో అప్పటి అవసరాల నిమిత్తం ఎందుకు చేసాడోగాని.. ఆ పాడుబడ్డ సిద్ధాంతం చూరుకే మగవాడు ఈనాడూ గబ్బిలాయిలా వేలాడ్డం నవ్వు పుట్టిస్తుంది. ఆగ్రహమూ తెప్పిస్తుంది. ‘ఆకొన్న అతిథిని ఆ పూట నిల్పం- నతివను ముందుగా నడుగవలయు/ అతిరిక్తుడౌ రోగి ఔషధం బిప్పింప- బడతి ఆజ్ఞ బొందవలయు ముందు/ బైరాగికిని నొక్క పాత వస్త్ర మొసంగ- బొలతి శాసనంబు బొందవలయు/.. ఇంక స్వాతంత్ర్య మనునది యెందు గలదొ- యెరుగగా రాదు మీకును బురుషులార!’ అని బుడమగుంట శివరామయ్యకవిగారు వందేళ్ల కిందటి ఆంధపత్రిక (అబలావిలాపం) లో హేళనకు దిగిన నాటి పరిస్థితుల్లో ఈవేళ్టికీ వీసమెత్తు మార్పు లేదు. సరికదా మహిళామణి ఆలోచనల్లో.. ఆచరణలో.. అభివ్యక్తీకరణల్లో.. ఆభిజాత్యం పాళ్ళు పొంగుకొస్తున్నాయి కూడా. సంతోషమే కదా! వలతి మగవాడికన్నా ఎందులో వెలితి? ‘అగ్బరంతటి వైరి నాజి జయింపదే– రాణి వీరాబాయి రౌద్ర మెసగ?/ నిరుపమ శౌర్యవార్నిధి గుతుబుద్ధీను- దురమున దోలదే కరుణదేవి?/ తన బాణ నైపుణ్యమున కెర సేయదే- సంయుక్త రిపులను సమరమందు?’ ‘అట్టి యసమాన శూరత్వ మతివలకును/ గలుగ జేయరె తొల్లింటి కాలమునను?’ అని తొయ్యలులంతా ఏకమై కొంగులు బిగిస్తే అయ్యలెంత మొనగాళ్లైనా మునుపటంత మొండిగా ముందడుగు వెయ్యలేరీనాడు. జన్మతః జన్మదాతల వర్గానికి దఖలుపడ్డ హక్కులకు ఇంకే మాత్రం మోకాలడ్డడం సాధ్యం కాదన్న ఇంగితమే సౌదీ పాలకులకు కలిగుండాలి. పోయిన వారం ఆ సంప్రదాయిక దేశంలో జరిగిన పురపాలకసంఘం ఎన్నికల్లో సౌదీసోదరి తొలిసారి ఓటుహక్కు వినియోగించుకుంది. శుభం. వాహన చోదన నుంచి.. సరుకుల బేరం వరకు ఎన్నో ఆంక్షలు మహిళకు ఆ గడ్డమీద! ఎన్నికల్లో నిలబడే హక్కూ ఆమెకిప్పుడు దఖలు పడడం సామాన్యమైన గంతు కాదు. ముందు ముందు మరిన్ని మహిళాసంస్కరణలకు ఇది నాందీ ప్రస్తావన కావాలన్నదే అభిలాష. సౌదీ సోదరీమణులందరికీ శుభాభినందనలు!

***

-కర్లపాలెం హనుమంతరావు

04 -0౨2021

బోథెల్; యూఎస్ఎ

( సౌదీ మహిళకు పురపాలక సంఘ ఎన్నికలలో మొదటిసారి ఓటు వేసే హక్కు దఖలు పడిన సంబరంలో రాసినది)

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...