Monday, February 8, 2021

నాలుగు ను గురించి నాలుగు ముక్కలు - కర్లపాలెం హనుమంతరాను


 . 


నలుగురూ నాలుగు చేతులూ వెయ్యండి. నలుగురితో నారాయణ. నలుగురు పోయే దారిలో నడవాలి. నలుగురూ నవ్వుతారు... ఇవీ నిత్యం మనం వినే మాటలు. అనే కార్థంలో ‘నలుగురు’ మాటను వాడుతుంటాం. ఇలా జన వ్యవహారంలో నాలుగు సంఖ్య తరచుగా వినిపిస్తుంది.

మనకు సంఖ్యాశాస్త్రం ఉంది. అంకెలకు సంబంధించి నమ్మకాలు ఉన్నాయి. కొందరు కొన్ని సంఖ్యల్ని తమకు అదృష్ట సంఖ్యలుగా భావిస్తుంటారు. కొన్ని ప్రయోజనాలకు తమకు నచ్చిన సంఖ్య రావాలని తపన పడుతుంటారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలు ఒకదాని కంటే ఒకటి పెద్దదిగా మనం భావించినా సహజంగా అన్ని సంఖ్యలూ వాటికవే విశిష్టమైనవి. నాలుగు సంఖ్యను చాలామంది ఉత్తమమైనదిగా పరిగణించరు. ఎవరి నమ్మకం ఎలా ఉన్నా నాలుగంకెకు ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

సృష్టికర్త బ్రహ్మను చతుర్ముఖుడన్నారు. సృష్ట్యాదిలో బ్రహ్మ నలుగురు మానస పుత్రుల్ని సృష్టించాడు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. వేదాలు నాలుగు. ధర్మార్థ కామమోక్షాలు నాలుగు. పురుషార్థాలూ ఆశ్రమ విధానాలు నాలుగింటిని చెప్పారు. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. చాతుర్వర్ణ వ్యవస్థనూ వేదవాంగ్మయం పేర్కొన్నది. యుగాలు నాలుగు- కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. మానవ జీవిత దశలనూ బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలనే నాలుగింటిగా విభజించారు.

దిక్కులు నాలుగు. మూలలూ నాలుగే. తూర్పు దిక్కు ఋగ్వేద సంబంధమైనది. సూర్యోదయానికి ఆధారభూతం గనుక పూజ్యమైనది. దక్షిణం యజుర్మంత్రాలకు, పశ్చిమం అధర్వమంత్రాలకు స్వాభావికమైనవని, ఉత్తర దిక్కు సామవేద సంబంధి అని తెలిపే శ్రుతి ప్రస్తావనలున్నాయి.

మండూకోపనిషత్తులో నాలుగు అవస్థలు చెప్పారు. జాగృదవస్థలోని అనుభవాలకు కారణం జాగరిణి. ఈ అవస్థలోని జీవాత్మ విశ్వుడు. స్వప్నానుభవకర్త సూక్ష్మశరీరధారి అయిన జీవుడు. వాడిని స్వప్నంలో ప్రేరేపించేవాడు తైజసుడు. గాఢనిద్రను అనుభవించే సుఖజీవిని ప్రాజ్ఞుడంటారు. ఈ అవస్థకు కారకురాలైన పరమేశ్వరి ప్రాజ్ఞ. పై మూడు స్థితులకు అతీతమైన స్థితి ‘తుర్య’. ఈ మూడు అవస్థల్లో లేని స్థితిని పరదేవత కలిగిస్తుందంటారు.

మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష- నాలుగు వాసనలు. ఇవి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు అంతఃకరణలకు సంబంధించినవి. స్నేహితులతో మైత్రి మనసు లక్షణం. ఆర్తులపట్ల కరుణ బుద్ధి లక్షణం. పుణ్యకర్మల్ని ఆనందించడం చిత్త లక్షణం. సజ్జనుల్ని బాధించడం అహంకార లక్షణం. వాక్కుకు నాలుగు రూపాలు. పరా, పశ్యంతి, మధ్యమ అనే మూడు అంతరంగంలో ఉండే వాక్కులు; బహిర్గతమయ్యేది వైఖరి.

మృత్యువు నాలుగు రూపాలని వేదం చెబుతోంది. అవి సూర్యుడు, వాయువు, అగ్ని, చంద్రుడు. సూర్యుడు రోజూ ఉదయ సాయంత్రాల ద్వారా ఒకరోజు జీవుల ఆయుర్దాయాన్ని గ్రహిస్తూ, మృత్యువుకు కారణమవుతాడు. వాయుసంచారం దేహంలో సరిగ్గా లేనప్పుడు ఊపిరితిత్తుల వ్యాధుల ద్వారా మరణానికి అవకాశాలెక్కువ. శరీరంలోని జఠరాగ్ని సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం జీర్ణంకాక ఆకలిదప్పులుండక చనిపోయే అవకాశమూ ఉంది. చంద్రుడు పంటలకు కారకుడు. పంటలు పండకపోతే ఆహారం లేక మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది.

మేఘం, మెరుపు, పిడుగు, వృష్టి (వాన)- నీటికి నాలుగు రూపాలు. రాజ్యరక్షణకు అవసరమైన చతురంగ బలాలు- రథ, గజ, తురగ, పదాతి దళాలు. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు చతుర్విధ ముక్తులు. సామ, దాన, భేద, దండోపాయాలు రాజనీతికి సంబంధించిన చతురోపాయాలు. ఇలా చెప్పుకొంటూపోతే ఇంకా ఎన్నో... అందుకే నాలుగంకె కూడా ఘనమైనదే!

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...