Tuesday, May 2, 2017

గిరీశం గడుసు భాష

కన్యాశుల్కంలోని భాష ఉత్తర కోస్తాంధ్ర భాష. అయినా అన్ని ప్రాంతాలవారికీ ఆదరణీయమైంది. ఏముంది అందులో అంతగా అందం?! కన్యాశుల్కం నాటకం పుట్టి వందేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ చదివిస్తుంది.  తాజాగా అనిపిస్తుంది.. మళ్ళీ మళ్లీ చదివినా!  ఎక్కడిదా  తాజా సౌరభం?! కన్యాశుల్కంలో గురుజాడవారు వాడిన భాష మరే ఇతర గ్రంథాలలోగానీ.. రచనల్లోగానీ వాడిన దాఖలాల్లేవు.  ప్రసిద్ధమైన శైలి సామాన్యంగా అనుకరణకు గురవుతుంది.  అలాంటి ప్రయత్నాలేవీ కన్యాశుల్కం భాష విషయంలో సఫలమైనట్లు కనిపించవు.  గురజాడవారీ నాటకంలో చూపిన మార్గం  అనితరం సాధ్యం అనుకోవాలా?! ఎందువల్ల అలా?!
భాష.. సందర్భాన్ని బట్టి.. స్థాయిని బట్టి.. పరిసరాలను బట్టి రూపం మార్చుకుంటుందంటారు భాషాశాస్త్రావేత్తలు. 'ఒళ్ళు కొవ్వెక్కిందా?' అని  భర్త భార్యను ఇంట్లో గద్దించినట్లు గుళ్ళో గద్దించడం కుదరదు. తోటి మగవాళ్లముందైతే  'కాస్త సంబాళించుకో!' అంటూ తగ్గింపు స్వరంతో మందలించక తప్పదు. మర్యాదస్తులు కాకపోతే ఇంకాస్త ముతగ్గా 'కాస్త వళ్ళు దగ్గరుంచుకో!' అంటూ తక్కువ స్వరంలో హెచ్చరించవచ్చు. ఏకాంతంలో  సామాజికపరంగా ఏ పర్యవేక్షణాభయం  ఉండదు కాబట్టి ఒకటో రెండో 'బూతులు' కూడా జత కలిపి  చేతులు విసరవచ్చు. ఒకే తరహా మాటలను ఒకే స్థాయిలో, ఒకే భావంలో అన్ని తరగతులవారు వాడటం అసాధ్యం. 'పాత్రోచితం' అన్న మాట పుట్టేదు ఈ సందర్బంలోనే.  'పాత్రోచిత'మైన  సంభాషణలను గురజాడవారు కన్యాశుల్కం నాటకంలో అత్యద్భుతంగా పోషించారన్నది విమర్శకుల ప్రశంస. ఆయనలా
ఆ స్థాయిలో విజయవంతమైన రచయిత ఈనాటికీ  లేడనే మేథావుల అభిప్రాయం.
వేదంవారు  ప్రతాపరుద్రీయంలో.. నండూరివారు ఎంకి పాటల్లో.. కొనకళ్లవారు  బంగారి మామ పల్లెపదాల్లో.. రావిశాస్త్రిగారు తమ  వివిధ రచనల్లో.. సమకాలీన సాహిత్యంలో  నామినిగారు సాగిస్తున్న తన రచనల్లో ప్రదర్శించిన.. ప్రదర్శిస్తున్న  'పాత్రోచితమైన భాష'ను తక్కువ చేయలేం. కానీ గురుజాడవారి 'పాత్రోచితం' వాటన్నిటికన్నా  ఒక మెట్టు పైనే ఉందని ఒప్పుకోక తప్పదు. కన్యాశుల్కంలో గురజాడవారి  పోకడల్లోని వైవిధ్యం భాషాపరంగా   'విశ్వరూప ప్రదర్శనమే!

పాత్రలకి రచయితకి స్థాయిల్లో   అంతరం సర్వసాధారణం. అయినా సమంజసమయిన రచయిత పాత్రల నోట మాటలు పలికించే సందర్భంలో ఆయా పాత్రల వైయక్తిక (కులం.. ప్రాంతం.. పరిసరాలు.. లింగం.. వయసు.. ఉద్వేగాది)  స్థాయిలకు తగ్గ  పాత్రోచితమైన భాష ప్రయోగించాలన్న స్పృహతోనే ఉంటాడు. వట్టి స్పృహ పాత్రోచితాన్ని పండించలేదు. రచయిత అనుభవమూ జతకలవాలి.. రచయితలూ మామూలు మనుషులే. కాబట్టి అన్ని సందర్భాలకీ తగిన అనుభవం అందుకోవడం సాధ్యం కాకపోవచ్చు. పరోక్షానుభాలక్కూడా  ఆస్కారం లేకపోవచ్చు. అప్పుడు ఊహమీద ఆధారపడక తప్పదు. ఆ ఊహాధార  స్వీయానుభవాలనుంచి  పుట్టిందీ  కాకుండా.. పరోక్షానుభవాలద్వారా మలుచుకున్నదీ కానప్పుడే 'పాత్రోచితం' ఉచితానుచితాలమీద చర్చ రేగుతుంది. గురజాడవారి కన్యాశుల్కం విషయంలో ఇలాంటి చర్చేదీ సాగినట్లు రికార్డుల్లో లేదు(నాకు తెలిసినంత వరకు).  'పాత్రోచితమైన భాషాప్రయోగం'లో ఆయన విజయం సాధించారనడానికి ఇదే రుజువు.  తన నాటకంలోని పాత్రలభాషమీద అంతలా  సాధికారికత సాధించేందుకు గురుజాడవారు తీసుకున్న జాగ్రత్తలు ఏమయి  ఉంటాయో? విజ్ఞులు తేల్చాల్సిన లోతైన అంశం అది. ఈ వ్యాసం ఉద్దేశం కేవలం గురజాడవారి కన్యాశుల్కం తాలూకు  పాత్రల భాషావైవిధ్యం. అదీ.. గిరీశం  కోణంనుంచీ స్థాలీపులాకన్యాయంగా ప్రస్తావించుకోవడం మాత్రమే!

గిరీశం  రాకతో మొదలై..  గిరీశం పోకతో ముగిసే నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలోని దాదాపు అన్ని ముఖ్యపాత్రలతోనూ గిరీశం  'ఇంటర్ యాక్ట్' అయాడు. ఆయా సందర్భాల్లో గిరీశం వాడిన భాష.. అందులోని వైవిధ్యం గురించి కొంత చర్చిస్తే గురజాడవారికి 'పాత్రోచితమైన భాష' మీదున్న  సాధికారికతను గూర్చి ప్రాథమిక స్థాయి అవగాహన ఏర్పడొచ్చు.

గిరీశం పుట్టుకతో వైదీకి బ్రాహ్మణుడు. పట్నవాసం అతగాడి బాడీ లాంగ్వేజీ..  భాషల్లో మార్పు తెచ్చింది. భాషావిషయికంగా  చూస్తే  గిరీశం నోట ఇంగ్లీషు పలుకుబళ్లు ధారాళంగా దొర్లుతుంటాయి. అంత్యప్రాసాదులతో ఆంగ్లపద్యాలను  ఆశువుగా దంచేస్తుంటాడు.
ఏకాంతంలో ఉన్నప్పుడు స్వగతంలో  చెప్పుకొనే  భాష  పాత్ర నిజ నైజాన్ని పట్టిస్తుందని మనస్తత్వవేత్తల భావన. నాటకం ప్రథమాంకం ప్రథమ సన్నివేశంలోనే గిరీశం తత్వాన్ని పరిచయం చేస్తారు గురజాడ. 'పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం.  యీలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయములు ఊరుకుంది కాదు(పూటకూళ్లమ్మ). వెంకుపంతులుగారి కోడలుకి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి  మనకు దేహశుద్ధి చేస్తారు. మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా ఉంది..గిరీశం గడుసుదనం.. వంచన గుణం.. స్త్రీలౌల్యం.. మాటకారితనం పటం కట్టేది ఇలాంటి మాటలవల్లే. వెంకుపంతులుగారి కోడలు.. మధురవాణి స్మృతిపథంలోకి రాగానే గిరీశం పెదాలమీదకు 'ఇంగ్లీషు పద్యాలు' తన్నుకొస్తాయి. మధురవాణి స్మరణ చేస్తూ 'It is women that seduces all mankind' అనీ అంటాడు.   నిందను ఎదుటి పక్షంమీదకు తోసే అతగాడి నీచ నైజం ఈలాంటి ఉక్తులు వల్లే బైటపడేది. 
ఇక విజయనగరం చెక్కెయ్యాలన్న ఆలోచన రావడం తరువాయి..   శిష్యుడు వెంకటేశంతో అతగాడు పలికే    వ్యాక్యాల్లో గుప్పించేవన్నీ డాంబిక   ఆంగ్లపదాలే! ఈనాటి టీ వీ యాంకర్లను తలదన్నే భాషా భేషయం! 'డా'మిట్! .. ఇది బేస్ ఇన్గ్రా'టిట్యూడ్. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్. విడో మారియేజ్ విషయమై, నాశ్చికొచ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను. పూనా డక్కన్  కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఎలెవన్ కాజెస్ ఫర్ ది డిజనరేషన్ ఆఫ్ ఇండియాను గూర్చి మూడు గంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి  ప్రొఫెసర్లు డంగయి పోయినారు. చుట్ట నేర్పించినందుకు 'థేంక్స్' చెప్పకపోగా.. తప్పు పడుతున్నావ్.అంటూ గిరీశం ప్రదర్సించే ప్రాగల్భ్యభాషకు అంతూ పొంతూ ఉండదు. 'ఫాల్స్' వైదుష్య ప్రదర్శనలతో  ఎదుటి పాత్రల బుర్రలో గడబిడలు సృష్టించడంలో గిరీశానిది అందె వేసిన చెయ్యి. 'మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే!' అని శిష్యుడు వెంకటేశం నిందలకు పూనుకున్నప్పుడు
'ఖగపతి  యమృతము తేగా/భుగ భుగమని పొంగి చుక్క భూమిన్ వ్రాలెన్/ పొగచెట్టై జన్మించెను/ పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అంటూ   బృహన్నారదీయం నాలుగో అధ్యాయం ధూమపానాన్ని సమర్థించిందని   దబాయిస్తాడు.   ఇటువంటి  మాటల గారడీవిద్య అగ్నిహోత్రావధానుల్నుంచి.. సౌజన్యారావు పంతులుగారి వరకు అందరి ముందు ప్రదర్శిస్తాడు నాటకం ఆసాంతం.  ఎదుటి మనిషికి ఆలోచించుకొనే అవకాశం ఇవ్వకుండా  స్వకార్యం సాధించుకొనే నిమిత్తం  బుకాయింపు భాష  ఎంత ఉపయుక్తంగా ఉంటుందో  గిరీశానికి తెలిసినంతగా  తెలుగు సాహిత్యంలో మరే పాత్రకీ తెలీదు.

అచ్చంగా ఆంగ్లపాండిత్యమేనాసందర్భాన్ని బట్టి భాష మార్చే ఊసరవెల్లి గుణంలోనూ   గిరీశం ఘనాపాఠి. నైజాంవారి కొలువులో ఉద్యోగం అయిందని  మధురవాణిని నమ్మించే   సందర్భంలో    ఉర్దూ పాండిత్య ప్రదర్శనకి  తెగబడే సన్నివేశం గిరీశంగారి    రంగులు మార్చే లక్షణానికి సలక్షణమైన తార్కాణం.   'ఇదిగో జేబులో నైజాంవారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా!  మా నేస్తం సదరదాలత్ బావురల్లీఖాన్ ఇస్సహన్ జింగ్ బహద్దర్ వారు సిఫార్సు చేసి వెయ్యి సిక్కా రూపాయిలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేశా బాధ్షావారి హుజూర్న ఉండటం..' అంటాడా మహాశయుడు. కోతలు ఈ స్థాయిలో సాగించినప్పుడే   విషయంలోని సారం కొంతైనా నమ్మదగినట్లుండేదని..    మధురవాణి వంటి  గడసరి ఎదుట  ఆటలు  సజావుగా సాగేదని గిరీశానికి  తెలుసు. గురజాడవారు ఇదంతా   ఊహామాత్రంగా  సృష్టించిన సంభాషణా చాతుర్యమే అయినా.. వాస్తవ సమాజంలోని 'అరచేతి వైకుంఠ రాయుళ్ళ'   జీవనశైలిని ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. గాఢంగా పరిశీలించకపోతే  సంభాషణల్లో ఇంత  పాత్రోచితమైన శైలిని పండించడం కుదరదు.
మకాం అగ్రహారానికి మార్చుకునే సన్నివేశంలో  గిరీశం తన భాషాసరళిని   పరిసరాలకు.. ఎదుటి పాత్రలకు అనుగుణంగా మలుచుకునే క్రమం గమనిస్తే..   గురుజాడవారి సునిశితమైన  సమాజిక పరిశీలనాశక్తి అవగతమవుతుంది.  అగ్నిహోత్రావధాన్లు ప్రథమ దర్శనంలోనే  'ఈ తురకెవడోయ్' అంటూ గిరీశాన్ని   అనుమానిస్తాడు. పల్లెల్లో కొత్తవారిని   అనుమానించడం సర్వసాధారణం. గిరీశానికి ఆ తరహా అనుభవం అప్పటికి కొత్త. కాబట్టే వెంటనే కోపం ముంచుకొస్తుంది. నిజ నైజానికి విరుద్ధంగా 'టర్క్.. డామిట్.. టెల్ మాన్' అంటూ చిందులేస్తాడు. 'మానా? మానులా ఉన్నానంఛావూ? గూబ్బగలగొడతాను' అంటూ అగ్నిహోత్రులు మళ్లీ అగ్గిరాముడు  అయినప్పటిగ్గానీ..    స్థలాన్ని బట్టి భాషలో మార్పు తెచ్చుకోవలన్న స్పృహలోకి రాడు గిరీశం.   కరటక శాస్త్రుల జోక్యంతో అప్పటికున్న యుద్ధవాతావరణం సద్దుమణుగడంతో..  ఆ పాత్రకున్న ప్రాధాన్యం ఇట్టే పసిగట్టేస్తాడు. వెంటనే అతగాడినీ తనకు అలవాటైనా మాటకారితనంతో పడగొట్టే ప్రయత్నం చేస్తాడు! 'మీ లాంటి(కరటక శాస్త్రులు) ఛప్పన భాషలూ వచ్చిన మనిషి ఎక్కడా లేడనీ.. సంస్కృతం మంచినీళ్ల ప్రవాహంలా తమరు మాట్లాడతారనీ.. తమలాంటి విదూషకుణ్ణి ఎక్కడా చూళ్ళేదనీ.. డిప్టీ కలెక్టరుగారు శలవిస్తుండేవారు. కవితారసం ఆయన్లా గ్రహించేవారేరీ? నా కవిత్వమంటే ఆయన చెవి కోసుకుంటారు. మహారాజావారి దర్శనంకూడా నాకు చేయించారండి' అంటూ గప్పాలు  మొదలు పెడతాడు.  కరటకశాస్త్రి విదూషక లక్షణాలకు సరిగ్గా అతికే  భాష అది! కొత్త చోట ఆశ్రయం సంపాదించేందుకు    గిరీశానికి అలా  తన భాషాచాతుర్యం అక్కరకొస్తుంది.

ఇంగ్లీషు తెలియని పల్లెటూరు బుచ్చెమ్మతో మాటల కలిపే సందర్భంలో గిరీశం  వాడే మాటల్లో ఒక్క ఇంగ్లీషు ముక్కా వినిపించదు. గమనించారా! '.. నా గొప్ప నే చెప్పుకోకూడదు కదా! అదొహటి. అంతకన్నా ప్రమాదమైన మాట మరోటుంది. చూశారా వదినా!(ఆ పిలుపులోని నర్మగర్భతను గిరీశం గడుసుదనానికి మచ్చుతునక)-మొదట్నుంచీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయి ఉన్న అత్తగారూ మావఁగారూలాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్ళ నెత్తి కెక్కవు.  ఇలాంటి మాటలు మనం వాళ్ళతో చెప్పినట్టాయనా.. కర్రుచ్చుకుంటారు. మావఁగారు వేదం మట్టుకే చదువుకున్నారు గానీ.. నేను శాస్త్రాలు అన్నీ చదువుకొన్నాను. ఆబ్బో.. నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు ఏవఁన్నాడూ? 'బాలాదపి సుభాషితం' అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినా విని ఆ ప్రకారం  చెయ్యాలయ్యా అన్నాడు.' ఇలా సాగుతుంది గిరీశం సంభాషణా ధోరణి.  ఎంత సహజమైన.. సరళమైన తెలుగు పలుకుబడి! 

'ఏ రోటి దగ్గర ఆ పాట' పాడించాలని తెలిసుండటం వేరు. ఆ పాట శృతి తప్పకుండా  పాడించడం వేరు. ఆ కళలో 'గురజాడ వారు నిష్ణాతులు' అని రుజువు చూపించడానికి  వెయ్యి ఉదాహరణలు ఇవ్వచ్చు కన్యాశుల్కం నుంచే.. గిరీశం పాత్రనుంచే!

బుచ్చెమ్మంటే మేదకురాలు. మరి  సౌజన్యారావు పంతులుగారు ఎంత లోకం చదివిన మేధావులు? వారితో మాట్లాడే సమయంలో కూడా గిరీశం మరో విధమైన భాషాచాతుర్యం ప్రదర్శిస్తాడు. మరీ డాంబికపు ఇంగ్లీషు పదాల జోలికి పోతే ఆ మేధావికి పట్టుబడిపోవచ్చన్న తెలివిడి ఉంది. అందుకే  చదువుకున్నవాళ్ళ శిష్ట వ్యవహారికం వచ్చి పడుతుంది గిరీశం భాషలో. చివరికి పంతులుగారి చేతే  'మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ లాంటి యంగ్ మెన్ లావుగా  ఉంటే మన  దేశం బాగుపడును.' అని పంతులుగారినుంచి ప్రశంసలు పొందాడంటే గిరీశానికి భాషమీదున్న పట్టుకు వేరే సర్టిఫికేట్లు ఎందుకు? పంతులుగారి ప్రశంసకు దీటుగా గిరీశం బదులిచ్చిన తీరే భాషాప్రయోగంలో సందర్భం సైతం ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో తెలియ చేస్తుంది. పంతులుగారి సంభాషణా శైలినే అనుకరిస్తూ 'అట్టి విచారం తాము పడనక్కర లేదు. మా గురువుగారి ఉపదేశం డ్యూటీ ముందు.. ప్లెషర్ తరువాతానండీ. అందులోనూ నేను చిన్ననాటనుంచే కొంచెం కాన్ సన్ ట్రేషనూ ఇంద్రియ నిగ్రహమూ అభ్యాసం చేయడం చాతనూ వొళ్ళు మరచి ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండటం చేతనూ స్త్రీ సుఖముల యడల నాకు విముఖత లావండి.. బుచ్చెమ్మయొక్క హృదయ నైర్మల్యమూ.. ఆమె దురవస్థా చూచిన్నీ.. నా శిష్యుడియందు నాకుండు ప్రేమాతిశయం చేతనున్నూ.. అమె యందుకూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమెను వివాహము కావడమునకు ఒప్పుకున్నాను గానండి ఇంద్రియ సుఖముల నపేక్షించి కాదు. ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహము కూడుననే నిశ్చయముతో నన్ను వివాహము కావడమునకు అంగీకరించారండి! కనుక మా  మారియేజీ అనేది ట్రూ మారియేజిగాని సాధారణపు విడోమారిఏజి కాదండీ' అంటూ నయగారాలు ప్రదర్శిస్తాడు!  సౌజన్యారావు పంతులుగారనేంటి ఆయన్ను పుట్టించిన బ్రహ్మదేవుడుకూడా గడుసుగిరీశం జేబులో పడిపోయే మాటకారితనం కాదా ఇదంతా? రామప్ప పంతులు సంపర్కం జరిగినప్పుడూ గిరీశం ఆ గుంటనక్క స్థాయికి తగ్గట్లే మాటలు విసరడంలో ఇహ వింతా.. విడ్డూరమూ ఏముంటుంది?

భాషను బట్టే భావాన్ని అంచనా వేసుకుంటాడు ప్రదర్శనల్లో ప్రేక్షకుడు.. పుస్తకాల్లో పాఠకుడు.  సందర్భోచితమైన శైలీవిన్యాసాల ప్రదర్శన అభాసుపాలు కాకుండా నడిపించాలంటే  రచయితకు భాషమీదే కాదు.. పాత్రోచితమైన పలుకుమీద,..  సామాజిక ధోరణులమీద సరైన అవగాహన ఉండి తీరాలి. పాత్రల  యాస ఎంపికలో చూపించే శ్రద్ధ.. తదనుగుణమైన  పదాల ఎంపికలోనూ  రచయితకు తప్పని సరి. పాత్ర అదే కావచ్చు. వివిధ సందర్భాలకు తగ్గట్లు భాషలో ఛాయాబేధాలుకూడా ఉంటాయి. సరైన అవగాజనతో వాటినన్నింటినీ విజయవంతంగా నిర్వహించినప్పుడే.. 'పాత్రోచితం' అనే లక్షణానికి న్యాయం జరిగినట్లు. ఈ అవగాహన తనకున్నట్లు రుజువు చేసుకున్నారు కాబట్టే 'కన్యాశుల్కం' అనే గొప్ప నాటకం సృష్టించిన ఉత్తమ సాహిత్యవేత్తగా   గురజాడ అప్పారావుగారు   లోకం దృష్టిలో  స్థిరబడిపోయారు.

'పాత్రోచితం' అంటే  సమాంతరంగా సాగే సమాజంలోని వ్యక్తుల స్వరూప స్వభావాలను.. ధోరణులను వాస్తవానికి వీలయినంత దగ్గరగా  నాటకంలోని పాత్రల్లో  ప్రతిబింబించడం. సజీవమైన రచన సాధించేందుకు రచయితకు ఈ 'పాత్రోచితం'మీద నిర్దిష్టమైన అవగాహన అవసరం. ఆ అవగాహన సాధించకుండా రచయిత పాత్రల సృష్టికి పూనుకుంటే.. వాటి  నోట పలికే మాటలు.. కేవలం  నిర్జీవ శభ్దాలు మాత్రమే!
-కర్లపాలెం హనుమంతరావు(ఈనాడు - తెలుగు వెలుగు మాస పత్రిక ఏప్రియల్ 2017 సంచికలో 'మాటే మంత్రమో!' శీర్షికతో ప్రచురితం)