ఏడుస్తూ పుడతాడు. పోతూ ఏడిపిస్తాడు. మధ్యలో ఏడవలేక నవ్వులు.. నవ్వురాక ఏడుపులు! ఛార్లీ చాప్లిన్ చిత్రంలాంటిది జీవితం. ఏడుపులు.. నవ్వులు పప్పులు, కూరల్లో ఉప్పూకారాలు.
పిల్లలకి.. ఆడపిల్లలకేనా రోదన బలం.. అలంకారం! ఏడ్చి ఏడ్చి ఎర్రమన్ను తిన్నతరువాతేగా యడ్యూరప్పకి మళ్లా
మాతృసంస్థలో పట్టు దొరికింది! మగజాతికి కన్నీటిని దూరంచేసి ఘోరనేరమే చేసింది మన సంస్కృతి.
శ్రీరామచంద్రుడు స్మితపారిజాతుడు.. శ్రీకృష్ణుడేమో చిదానంద స్వరూపుడు. దేవుళ్లే అయినా వాళ్లకళ్లూ కలువపూరేకులకు
మల్లే తడవక తప్పిందికాదు! మామూలు మగవాడికిక మూగిరోదిగా బతుకు సాగించడం సాధ్యమేనా!
మొదటి కవిత పుట్టిందే
మగవాడి ఏడుపులనుంచి. బావురుమంటే బాగుండదన్న మగబాధే వాల్మీకిచేత ఆరుకాండల రామాయణం రాయించింది. ఆ రామాయణంనిండా మళ్లా మగాళ్ల శోకన్నాలేగదా!
దశరథుడి.. దాశరథుడి కన్నీళ్లతో ఎన్ని గంగానదుల్నైనా తేలిగ్గా నింపేయచ్చు!
కన్నయ్యకళ్లూ ఎన్నడూ చెమ్మగిల్లలేదని ఖాయంగా చెప్పగలమా!
పెళ్లాం కాలి తాపులు తిన్నమహాపురుషుడు!
పదిమంది భక్తుల పాదాభివందనాలందుకొనే పరంధాముడికి.. ఆలికాలి తాపులు కన్నీళ్ళు
తెప్పించవా! ముకుందుడి ముక్కుచీదుళ్లను ముక్కు
తిమ్మన గడుసుగా పడగ్గదిలోనే తొక్కేసాడని నా అనుమానం.
ఆరున్నొక్క రాగాలాపన ఆడదానికి మాత్రమే ఆయుధంగా ఎవరందించారో! మొగుళ్లను యములాళ్ళు ఎత్తుకెళుతున్నప్పుడు, అన్నగారు
అడవికి తోలుకెళుతున్నప్పుడు ఆ ఆడాళ్లకేమీ కన్నీళ్లు రాలేదే! సొంతానికంటూ కొంతైనా లాభమంటేగాని ఏ కలికైనా
శోకాల జోలికి పోదేమో! సీతమ్మశోకం,
రతీవిలాపం, సత్యభామదుఃఖం..
మొగుళ్లకోసమో.. మొగుళ్ళు తేని పూలకోసమో
తప్ప ఏ దీనజనోద్ధరణకోసమో అయితే కాదుగదా!
అదే మరి సిద్ధార్థుడో! రుజాగ్రస్తజాతి దౌర్భాగ్యస్థితిగతుల్ని చూసి దుఃఖించాడు.
తథాగతుడుగా మారి దుఃఖమూలకారణాలు గుర్తించాడు. అయినా
మగాడికి.. గోడుకీ మధ్య ఇంకా ఇన్నేసి గోడలెందుకో!
'శ్రీ శ్రీ ఏడుపు ప్రపంచానిద'ని సందర్భం వచ్చింది కాబట్టి చలం అని ఉండవచ్చేమోగానీ..
నిజానికి మెజారిటీ మొగాళ్ల రోదన లోకంకోసమే! కళింగయుద్ధ హింసకు కళ్లు తడిసిన
అశోకుడు చెక్కిళ్ళు తుడుచుకుంటూ
కూర్చోలేదుగదా! రోడ్లపక్కన చెట్లు నాటించాడు! రఘునాథ
నాయకుడి 'శృంగార సావిత్రి'
కథానాయకుడుళ్ళాంటి ఏడుపుగొట్లు ఎన్ని కోట్లకో ఒకళ్ళు!
చెట్లుచేమలుకూడా కన్నీళ్లు పెట్టుకొంటాయంటున్నారు ఇప్పటి జీవశాస్త్రవేత్తలు! చెట్టంత మగాడు! మరి
మనసు నొచ్చితే దుఃఖం ఆపుకోగలడా! ఆపుకోమనడం న్యాయమా!
కన్నీళ్ళవల్ల కామినులకైతే తాత్కాలికంగా మాత్రమే ప్రయోజనం! అదే మగజనావళికో! శాశ్వతమైన కీర్తిప్రతిష్టలు!. రామాయణం సీతమ్మశోకం వాల్మీకి స్థానాన్నిసాహిత్యంలో
సుస్థిరం చేసింది! ఉత్తర రామాయణం కరుణరసం పుణ్యమాఅని
భవభూతికి కాళిదాసు పక్కన
చోటు దక్కింది! శకుంతలను అత్తారింటికి సాగనంపే సందర్భంలో కణ్వమహర్షి
కార్చిన కన్నీళ్లైతే కాళిదాసుకు విశ్వసాహిత్యంలోనే శాశ్వతమైన
గౌరవం సాధించి పెట్టిందా లేదా!
నవ్వు నాలుగిందాల చేటు అన్నవాళ్లే.. ఏడుపు ఎన్నిందాల గ్రేటో చెప్పుంటే బాగుండేది. చెప్పకుండా
దాటేసారు! మయసభామధ్యంలో నవ్వి కష్టాలు కొనితెచ్చుకొన్న ద్రౌపది..
కురుసభామధ్యంలో ఏడ్చి కన్నయ్యకరుణను సాధించుకొంది. నవ్వు వత్తిడిని గుండెగదుల్లో దాచేస్తే.. ఏడుపు ఆ గదుల్లోని వత్తిడిబాంబు
వత్తి అంటించి మరీ 'ఢా'మ్మని పేల్చేస్తుంది.
కన్నీళ్లు చెక్కిళ్లదారిన బైటికెళ్లిన తరువాత గుండె కడిగిన ముంగిలంత శుభ్రమవుతుంది. నచ్చిన ముగ్గులు పెట్టుకోడానికి సిద్ధంగానూ
ఉంటుంది. ఆడగుండెకనే కాదు.. మగమనసుకూ ఈ శోకసూత్రం సమానంగా వర్తిస్తున్నప్పుడు..
మగాడిమీదే ఏడుపొద్దన్న ఆంక్షలు
రుద్దడం ఏం న్యాయం?
ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా శోకాన్నుంచి
ఎవరం ఏకమొత్తంగా తప్పించుకొలేం. 'ఈద వలెను.. ఈది గెలువ వలెను' అంటూ పురందరదాసు
పదం పాడిందీ కన్నీటిగోదారిని మనిషి ఈదడం గురించే! ఈ ముక్కు చీదుడుకి ఆడా మగా తేడా లేదు.
రామచంద్రుని దర్శనం కాలేదని
త్యాగరాజయ్య కాంభోజిరాగంలో గావుఁమన్నాడు. చెరసాల పాలైన కంచెర్ల గోపన్న నమ్మిన
దైవాన్ని తిట్టిపోసినవన్నీ ఆరునొక్కరాగం మార్కు శోకన్నాలే! జవ్వని
కనికరించలేదని క్షేత్రయ్య జావళీల్లో జవురుకుంటే.. వేంకటేశుని కనికరం లేదని సంకీర్తనల్లో కన్నీరు మున్నీరయ్యాడు అన్నమయ్య.
మగవాడి కళ్లు చెమ్మగిల్లినప్పుడల్లా జరిగింది సంగీత సాహిత్య లోకంలో నవీన సృష్టే! అయినా పురుషపుంగవులందరినీ
ఈ బాష్పలోకంనుంచి బహిష్కరించడమే బాధాకరం.
'గతమంతా తడిసె రక్తమున..
కాకుంటే కన్నీళులతో' అన్నాడు మహాకవి శ్రీశ్రీ. మీ రక్తం కలగి కలగి.. మీ నాడులు కదలి కదలి.. మీ ప్రేవులు కనలి కనలి..
ఏడవకండేవకండి.. జగన్నాథ రథచక్రా
లొస్తున్నాయొస్తున్నాయ'నీ అన్నాడు. ఆ రథచక్రాలేవో
వచ్చేలోపైనా పతితులు.. భ్రష్టులు.. బాధాసర్పదష్టులు..
కడుపారా భోరుమనక తప్పదుకదా! ఆ వ్యథానివిష్టుల్లో
మగాళ్ళూ ఉన్నారని నిష్ఠూరాలాడితే ఎలా! 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు/నా యిచ్ఛయే గాక నాకేటి
వెరపు' అని తెగించేదాక
మగాడి గొంతుకి ఉరితాడు బిగిస్తామన్నా అయే కడుపు చెరువు అవక మానదు కదా! మనసు నొచ్చిననప్పుడు.. మనసుకు నచ్చినప్పుడూ కళ్లలో సెలయేళ్లు సుళ్లుతిరగడం దేహధర్మం. మగపుటక పుట్టినందుకు వగపోత వద్దనడం.. అదేం ధర్మం!
పారూకి మల్లే దేవదాసూ విఫలప్రేమికుడే! అమ్మడై పోయింది కాబట్టి.. ఏడ్చి గుండె బరువుదించేసుకొంది పార్వతి. మగవాడన్న మొహమాటానికి
పోయి మందుకు బానిసయ్యాడు
దేవదాసు. ఎవడి ఏడుపు వాడిని ఏడవనిచ్చేస్తే ఈ మందులు.. మధ్యనిషేధాలు.. బందులు.. ఆందోళనళ్లాంటి గందరగోళాలేవీ ఉండవు కదా!
ఏడుపుగొట్టు చిత్రాలదెంత సక్సెస్
రేటో.. లెక్కలు చూస్తే అవాక్కవాల్సొస్తుంది! దేవదాసు.. అనార్కలి.. బాటసారి..
సుఖదుఃఖాల్లాంటి విషాదాంతాలన్నీ నిర్మాతలకు సుఖాంతాలే! 'చివరకు మిగిలేది' సైతం చివరికి కాసులే మిగిల్చిందంటే టాకీసులోని టిక్కెట్లన్నీ అమ్మలక్కలవనేనా? ఆడాళ్ల చీరెచెంగులతో సమానంగా..
మగాళ్లు పైకండువాలూ తడిసి ముద్దయ్యాయనేగా అర్థం!
నవ్వి ఆడది.. నవ్వక మగాడు ఇబ్బందుల్లో పడతారన్నది వట్టి అబద్ధం.
నవ్వొచ్చినప్పుడు నవ్వనిచ్చినట్లే.. ఏడుపొచ్చినప్పుడూ
ఏడవనివ్వాలి.. ఆడనైనా.. మగనైనా! లేకుంటేనే ఇబ్బంది. 'కలకంఠి కంట కన్నీరు ఒలికిన ఇంట సిరులేవీ నిలవ్వంటారు. కంఠికైనా.. కంఠుడికైనా
.. సెంటిమెంటులో తేడా ఎందుకుండాలన్నదే పాయింటు.
ఎదపొద కదిలినప్పుడు ఏడుపు పురుగును బైటికి తరమాల్సిందే! దగ్గు..
డ్రగ్గు.. పెగ్గు.. పొగ.. మగతమాత్రల
తోడుతో పరిష్కరించే
సమస్య కానే కాదిది. నరాల వత్తిడి ఉపశమనానికి, శరీరమలినం విసర్జనానికి,
భావోద్వేగం వ్యక్తీకరణకు దేహం నేర్చిన చమత్కారాల్లో
కన్నీటిదీ ఓ ప్రధాన మార్గం. ఆ ఆరునొక్కరాగానిక్కూడా
ఆడా.. మగా అంటూ సన్నాయినొక్కులెందుకంట!
పరీక్షలు పోవచ్చు. ప్రేమ విఫలమవచ్చు. ఉద్యోగానికి
ఉద్వాసన కావచ్చు, వ్యాపారం ముంచేయచ్చు. దగ్గరి
బంధువులు దూరమవచ్చు, దూరపు రాబందులు నట్టింట తిష్ఠేయచ్చు. క్రికెట్ మ్యాచిలో భారత్ ఓడచ్చు. పాక్ అదే మ్యాచిలో గెలిచేయచ్చు. ఇష్టమైనపార్టీకి ఎన్నికల్లో డిపాజిట్టుక్కూడా దిక్కులేకపోవచ్చు.
పక్కింటాయన పెళ్లాం పద్దాకా పుట్టింట్లోనే పడున్నా మన కట్టుకున్న దేభ్యం కాలు క్షణంకూడా బైట పెట్టకపోవచ్చు.
కాన్వెంట్లొ పిల్లల ఫీజులు.. కాంప్లెక్సులో మెయింటెనెన్సులు.. పెద్దాళ్ల ఆసుపత్రి బిల్లులు..
చెల్లించాల్సొచ్చినప్పుడు, రైతుబజారులో
కూరగాయలు కొనాల్సొచ్చినప్పుడు, కోడికన్నా కొత్తిమీరకట్టకెక్కువ
భరించాల్సొచ్చిన్నప్పుడు, బండి పద్దాకా
మరమ్మత్తుకొస్తున్నప్పుడు, పంజగుట్ట ట్రాఫిక్లో బైకు ఇరుక్కున్నప్పుడు,
ఆదితాళం మేళంకూడా తెలీని
పక్కింటావిడ మన బెడ్ర్రూంగోడపక్కనే కచేరీ క్కూర్చున్నప్పుడు, అవినీతి
పితామహుడు భారీ మెజారిటీతో
ఎన్నికల్లో విజయఢంకా మోగించినప్పుడు, పక్కసీటు లంచగొండినే మళ్లీ మళ్లీ పదోన్నతలక్ష్మి వరిస్తున్నప్పుడు, చూసిన
కుళ్ళుచిత్రమే టీవీలో మళ్ళీ మళ్లీ కుళ్లబొడుస్తున్నప్పుడు, వార్తాపత్రిక తెరిచే వేళకే టీవీనుంచి ఆవిడ ధారావహికం
కారేటప్పుడు, పదేళ్ళు నిండని చంటిబుడతడు
ఆన్ లైను ఆటల మధ్యనే ఆడబడితెల బొమ్మల్చూస్తూ చొంగలు కార్చేస్తున్నప్పుడు.. ఆడకైనా.. మగకైనా ఏడుపు ఒకే విధంగా తన్నుకొస్తుందా
రాదా!
ఉల్లిపాయ పొరలు
వలిచేటప్పుడుకూడా కన్నీళ్లు పెట్టుకోరాదని మగాళ్లమీదలా పడేసి ఆంక్షలు విధిస్తే సమస్యలేమన్నా పరిష్కారాలైపోతాయా!
'ఏంటి మహానుభావా!
నడిరాత్రి నెత్తికొట్టుకొంటూ ఈ సుత్తి రాతలు!' అంటూ గయ్యిమంది మా దేవేరి పక్కదిగకుండానే.
తెల్లారి ఈ ఏడుపు రాతలే చూపించి
‘ఎలాగుంది డార్లింగ్?’ అనడిగానా.. ఎప్పట్లానే 'ఏడ్చినట్లుంది'
అని ఫక్కున నవ్వేసిందే మూడులోనో ఉండి.
ఇన్నాళ్లకి మా అర్థాంగి పంట
నవ్వు తెప్పించినందుకేమో నా కళ్లవెంటా బొట బొటా నీళ్లు! నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే కదా వస్తాయి!
అవార్డు ఫంక్షన్లలో ఆడాళ్లు ఏడవటంలా!
‘బట్ యూ ఆర్ యే బాయ్!’ అంది మా
భార్యామణి.
'బాయ్సి డోంట్ క్రై'
థియరీ.. నౌ ఐ డోంట్ కేర్!’ అనేసా!
-కర్లపాలెం హనుమంతరావు
(డిసెంబరు 2015 నాటి వాకిలి- లాఫింగ్ గ్యాస్ కాలమ్ లో ప్రచురితం)
http://vaakili.com/patrika/?p=9502