Showing posts with label Money. Show all posts
Showing posts with label Money. Show all posts

Saturday, December 4, 2021

డబ్బు కష్టాలు- సరదావ్యాసం


గడించడం కష్టం. ఖర్చు చేయడం కష్టం.. ఎవరెవరికో లెక్కలు చెప్పాలి. అట్లాగని దాచుకున్నా కుదరదు. దారాపుత్రులు ఊరుకోరు. ఎక్కడ దాచాలో  తోచదు. ఎవర్మని నమ్మాలి? ఎంత వరకు కుమ్మాలి? డబ్బు ఉంటేనే కాదు. డబ్బు అంటేనే కష్టంబాబూ!

అగచాట్లెందుకు.. అస్సలు డబ్బే వద్దన్నా దెబ్బై పోవడం ఖాయం! పూట గడవాలన్నా.. పూటుగా మందు కొట్టాలన్నా ముందుగా కావాల్సింది కరెన్సీనే కదన్నా?

పొరుగింటి మీనాక్షమ్మల్తో పోలిక పెట్టే ఆండాళ్లు ప్రతి ఇంటా ఉంటారు.ఓ ముత్యాల బేసరయినా ముక్కుకి తగిలించలేదని అలిగి కూర్చుంటారు. రేకెట్ నుంచి పాకెట్ దాకా అన్నింటికీ మనీతోనే పని. డబ్బు లేందే డుబ్బు క్కొరగాడన్న సామెతేమన్నా సర్దాకు పుట్టించారా అనుభవజ్ఞులు?

ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్ల కట్టలవసరమే కదప్పా! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్దే డే ఆడే చెత్త సినిమాకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరికి చావని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసలవతల పారేస్తే పస్తులే!

పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!

బ్యాంకప్పుల వంకతో పైసా వసూల్. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల వంక చూపులు! వీల్చూసుకొని విదేశాలకు చెక్కింగ్స్!మంచి స్కీమ్సే కావచ్చు కానీ.. విమాన టిక్కెట్లకు సరిపడా అయినా మనీ తప్పని సరే కాదా.. దటీజ్ డబ్బూస్ పవర్!

బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్సుదే! బిట్స్ పిలానీ టు.. బిట్ కాయిన్స్ వరకు అంతా కాసుల తిరకాసులే!కాదంటే కుదరదు సుమా!

కుదురుగా ఉండనీయదు డబ్బెవర్నీ! పెద్ద నోట్లనట్లా అర్థరాత్రి కల్లా హఠాత్తుగా రద్దు చేయిందా లేదా? పెద్దాయన పేరనట్లా ఊరూ వాడా మారుమోగించిందా.. లేదా? బ్యాంకులంటూ కొన్ని డబ్బుండేచోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసింది. ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని మామూలు జనాలకు అవి ఖాళీ అయినప్పుడే తెలిసింది! అందీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!

డబ్బు లేందే అప్పులుండవు. అప్పులంటే వూరికే ఎగేసేందుకు తీసుకొనే సొమ్మా కాదు.. సర్కార్లు ఓట్ల కోసంమాఫీలు చేసేందుక్కూడా. ఏమైనా అంటే ఆర్బీఐ వూరికే ఫీలయిపోతుంది కానీ.. బాకీలు మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేది ఎట్లా?

ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లంకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి ఆ రువాబు. ప్రపంచం అమెరికా చుట్టూతా గిరిటీలుకొడుతున్నా.. అమెరికావాడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా ఆ సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లే. ఆ డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు.సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబు డాబు!

నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం. ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ ఓ రాయిగా మారిపోయాడు. భక్తులు హుండీల్లో వేసే రాళ్లతో లోకతంత్రం నడిపిస్తున్నాడు!రూపాయిల నోట్ల మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీని అయినా పట్టించుకొనుండేదా ఈ డబ్బు పిచ్చి లోకం?

గౌరవనీయమైన పదవుల కోసం ఘోరంగా కొట్లాడుకుంటుంటారు నిస్వార్థ ప్రజాసేవకులు. గౌరవంగా ఓ రూపాయి వచ్చినా మనీ మార్కెట్లో దాని మార్పిడి విలువ ఎన్ని కోట్లుంటుందో?

డబ్బు మీదే ప్రజానేతకీ నిజానికి బొత్తిగామమకారముండదు. కానీ ఎన్నికల తంతుకు కావాల్సిందే డబ్బు మూటలు కదా! అభిమానసందోహం ఆనందంగా కోట్లు ధారపోస్తామన్నా ఎన్నికల సంఘం నిమ్మళంగా ఉండనీయదు. అందుకే ఎన్నికలకు ముందు నెల్లాళ్లు నేతలు ఎన్నడూ ఎరగని కాయా కష్టానికి తయారయేది. పలుగూ పారా పట్టినా, మట్టి మూటలు నెత్తికెత్తినా, రోడ్దు పక్క టీ కాచినా, రొప్పొచ్చేటట్లు రిక్షా తొక్కినా.. కూలి కింద గంటకు ఓ ఐదారు లక్షలు తగ్గకుండా గడించేది.

డబ్బుంటేనే కోర్టుల్లో ఏ పిల్ అయినా వేయగలిగేది.. ఏ జింఖానా కోర్టుల్లో అయినా ఐపిఎల్ ఆడగలిగేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా చల్లంగా ఉండేది.

డబ్బున్న వాడికి నేరాలతో నిమిత్తం లేదు. బేళ్ల కొద్దీ నోట్లు మనవి కాదనుకుంటే చాలు.. బెయిళ్లైనా దానంతటవే నడుచుకొచ్చేస్తాయ్! మరో అప్పీలుక్కూడా ఆస్కారం ఉండదు.

రూకల్లేకుంటే లోకానికి లోకువ. డబ్బున్న మారాజుకే మొక్కే బుద్ధి దానిది. ఈ కలియుగమాహాత్మ్యం వడపోసిన మహానుభావుడు కాబట్టే అంతెత్తున ఏడుకొండల మీద కొలువై ఉన్నప్పటికీ హుండీలు నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొంటున్నాడు వడ్దికాసులవాడు.కళ్యాణ కట్టలో ఉచిత క్షౌరం చేసే చోట కూడా.. కాస్త చెయ్యి తడపందే కత్తెర మెత్తగా పడదు. పర్సు ఖాళీగా ఉన్నవాడంటే దేవుడుక్కూడా పడదు.

నోట్ల విలువ తెలియాలంటే సర్కారు కచేరీలే సలీసైన చోట్లు. అక్కడి కార్యాలయాల్లో అన్నేసి బల్లలు ఎందుకున్నాయో ముందా సూక్ష్మం తెలుసుకోవాలి తెలివున్న వాడెవడైనా. చాయ్ పానీకనిఎంతో కొంత పడితే గానీ స్ప్రింగు డోరును బార్లా తెరవనివ్వడుబిళ్ల బంట్రోతు. దఫ్తర్లో ఏ పనికయినా అంకురార్పణ జరిగేది ముందు మేజాబల్ల మీద కాదయ్యా.. బల్ల కింద! గుడ్దిగవ్వంతయినా విలువ లేకుంటే ఎందుకంతలా కిందా మీదా పడి ప్రజాసేవకులు కక్కుర్తి పడేది? ధన మూలం ఇదం జగత్! ఏ మూల చూసినా డబ్బు గమ్మత్తులే దుమ్ము లేపేస్తున్నప్పుడు .. నిప్పులాంటిబతుకని డప్పేసుకు తిరిగే అమాయకుడికి కూట్లోకి పప్పే కాదు ఉప్పు కూడ దొరకదు.

అన్నదాతలకు నేరుగా అంతంత సొమ్ము సర్కార్లు ధారపోస్తున్నాయ్ ఉదారంగా! ఉద్ధరించేందుకా? డబ్బు దెబ్బ తెలుసు కాబట్టే ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించినా పోలింగు రోజు ఓటరు చేతికి చీటీకింతని ముట్ట చెపుతున్నాయ్అన్ని పార్టీలూ!

ఆకాశమంత పందిర్లేసి.. భూలోకమంతవేదికల మీద ఎన్నొందల సార్లు రిలే ఆమరణ దీక్షలకైనా కుర్చమనండి.. ఆ ఎన్నికల ఆఖర్రోజున ఎవరెక్కువ పాడుకుంటారో వాడికే ఓటు పడేది! దటిజ్ నోట్ పవర్!

డబ్బు మత్తు డ్రగ్సు కన్నా చెడ్డది. డ్రగ్సు కేసుల్నైనా అది గమ్మత్తుగా గాయబ్ చేసేస్తుంది. నలుపో తెలుపో .. డబ్బున్న వాడి ముందు సర్కార్లైనా చేతులు నలుపుకుంటూ నిలబడక తప్పదు. వాడి గల్లాపెట్టె మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఎంత ల్యాంద్ సైడువిజేతకయినా బ్యాండ్ భజాయింపు తప్పదు.

కనక.. కేసులు సంగతి ఆనక చూసుకోవచ్చు మహాశయులారా! ముందుసూట్ కేసుల సంగతి పట్టించుకోండి! బ్యాంకులు వట్టి పోతే ఓటుబ్యాంకుకు గట్టి ముప్పు. ఇంకూ.. పేపరూ లేదని మంకు పట్లు వద్దు. ఎమ్టీ ఏటీఎమ్ములు ఎంతలావు వస్తాదుల్నైనా పల్టీ కొట్టించేస్తాయి!

సిబిఐ సంగతి ఆనక.. ముందు ఆర్బీఐ సంగతి చూడండి బాబులూ!

-కర్లపాలెం హనుమంతరావు


Tuesday, February 16, 2021

కాసు- తిరకాసు - సరదా వ్యాసం కర్లపాలెం హనుమంతరావు

 


కాసు - తిరకాసు 

( ఈనాడు - ప్రచురితం ) 

*


గడించడం అదో రకం. ఖర్చు చేయడం అంతకు మించిన నరకం.  చిత్రగుప్తుడి చిట్టా నుంచి లెక్కలు తప్పించినా భూలోక చిత్రగుప్తులు ఐ.టి, ఈ.డి లు ఉంటారు కదా!  ఆ  యముడి బ్యాచీ లుక్కుల నుంచి దృష్టి మళ్లించడం మామూలు యవ్వారం కాదు. మామూళ్లకు ఎప్పుడు లొంగుతారో.. ఏ మూలకు తోలుకెళితే  చల్లబడతారో.. అంతా ఆ  'పైన' ఉన్నవాడి అంతరంగాన్ని బట్టి   నడిచే తతంగం.  అట్లాగని ఏ ఇనప  గని, బయ్యారం గని కంట బడితే దాని మీద పడి   దోచుకోడమెందుకు?..   నిద్రలు కాచుకుంటూ ఆ తరగని సంపదలు దాచుకోడం ఎందుకు?.. అంటారా? పైకం పైన వైరాగ్యం  ప్రకటించడం  ప్రజాస్వామ్యంలో కుదరే పనేనా?


సంసారం దాలి గుంట కాదు.  సంపద పెరుగుతున్నంత కాలమే దారాపుత్రులు నోరుచేసుకోరు.  స్విస్ బ్యాంకులు సైతం అసాంజేకు దీటుగా కాతా  రహస్యాలన్నీ బహిర్గతం చేసే ఈ కాలంలో కాసుల వర్షం ఎవరికి  హర్షం అంటారా?  


డబ్బుంటే ఒక కష్టం. లేకుంటే డబుల్ నష్టం. పార్టీ టిక్కెట్టే కాదు.. సినిమా టిక్కెట్టు క్కూడా ఇక్కట్లు పడక తప్పని ముదనష్టపు జాతకం.. కోరి కోరి ఎవరు నాయనా నడి నుదుటన తలకిందులుగా రాయించుకొనేందుకు తయారయేది?పూట గడిచే మాట ఆనక! పూటుగా మందు పడాలన్నా ముందుగా కావాల్సింది కరెన్సీనే కదా దాదా!


పొరుగింటి మీనాక్షమ్మలతో పోటీలకు దిగే  ఆండాళ్లమ్మలు ప్రతి ఇంటాయన మెడకూ గుదిబండల్లా  వేలాడుతూనే ఉంటారు.  ఓ ముత్యాల బేసరో  ముక్కుకి తగిలించని  పక్షంలో బేవార్సు  శ్రీవార్సు అంటూ ఫార్స్ చేస్తారు!  రేకెట్ పని నుంచి పాకెట్ మనీ దాకా అన్నింటికీ మనీపర్శుతోనే పని. ప్రజల సొమ్ము అని గమ్మున ఊరుకుంటే ఫెయిలయిన చంద్రయాన్- రెండును చూపించైనా మనం ఆ అమెరికా చైనాల సరసన చేరామని  రెండు వేళ్లు చూపించుకునేందుకు  వీలుండేదేనా?  


డబ్బు లేందే డుబ్బుక్కొరగాడన్న సామెత ఏమన్నా సర్దాగా పుట్టిందా? నాలుగేళ్ల పాటు సర్కారును బ్రహ్మాండంగా నడిపినట్లు భుజాలు ఎగరేసారు పాపం చంద్రబాబు  సారు!   పంచే సొమ్ము సమయానికి ఆడక   నలభైయ్యేళ్ల సీనియరిటీ ఉండీ ముఖం తేలవేసారు!


ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్లు దండిగా అవసరమే కదండీ! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్- డే ఆడే చెత్త మూవీకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరకని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసి అవతల పారేస్తే ఇంట్లో పస్తులే సుమా ! 


పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!


బ్యాంకప్పుల వంకతో పైసల వసూళ్లు. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల కేసి పిచ్చి లుకింగ్స్ ! వీల్చూసుకొని వీల్-చైర్ పేషెంట్ పేరుతో విదేశాలకు చెక్కింగ్స్! వి. పి పెట్టిన విఐపి గారికైనా వీపెనక  లోపలి పాకెట్లో  విమానం టిక్కెట్లకి సరిపడా  మనీ అయినా తప్పని సరే కదా! దటీజ్ డబ్బూస్ పవర్!


బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి సర్కార్ ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్స్ ఆడించే సర్కస్ ఫీట్స్ దే! బిట్స్ పిలానీ  మొదలు బిట్ కాయిన్స్  వరకు అంతా కాసుల తిరకాసే!


కుదురుగా ఉండనీయదీ  మనీ ఎవర్నీ! పెద్దనోట్ల కట్ల నట్లా అర్థరాత్రి కట్లా ఎట్లా హఠాత్తుగా రద్దు చేసియించిందో  మోదీ సర్కార్ని..  చూసాం కదా? ఆ  పెద్దాయన మోదీ పేరు నట్లా ఊరూ వాడా దేశమంతటా మారుమోగించిందీ  రద్దయిపోతేనేమీ.. పిచ్చి నోట్లకట్టలే కదా!


బ్యాంకులంటూ కొన్ని డబ్బుండే  చోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసిందీ, ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నడిరోడ్ల పక్కన కూడా నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని బీద  జనాలకు అవి ఖాళీ అయినప్పుడైనా తలకెక్కించిందీ డర్టీ మనీనే! అదీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!

 

డబ్బు లేందే అప్పులుండవు. అప్పులేందే ఎగేసేందుకు  డబ్బూ ఉండదు.  మాఫీలు చేయించి బక్కోళ్ల ఓట్లు దండుకునేందుకైనా మాయదారి నాయకులకు అండగా నోట్లుండాల్సిందే కదా!   అదేమైనా అంటే ఆర్బీఐ పదే పదే ఫీలయిపోతుంది కానీ.. బాకీల  మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేదింకెట్లా?


ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లింకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి కా రువాబు! ప్రపంచం అమెరికా చుట్టూతా బొంగరంలా తిరుగుతున్నా,  అమెరికనోడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా బంగారంలాంటి  సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లనే  గదా గురువా!   ఆ డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు  సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు. సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబూ డాబూ.. దర్పం సర్వం.. గర్వం!

 

నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం.  ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ  ఓ గర్భగుళ్లో రాయిగ మారి కూర్చున్నాడు. భక్తులు హుండీ రాళ్లతోనే సర్వాంతర్యామి అయినా లోకతంత్రం సర్వం నడిపించేది ! 


రూపాయి నోటు  మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీ నయినా ఆనవాలు పట్టుండునా ఈ డబ్బు పిచ్చి లోకం?


ఘనమైన  పదవుల కోసం కదా ఘోరంగా కొట్లాటలు  నిస్వార్థ ప్రజాసేవకుల మధ్య ! గౌరవ వేతనమంటూ  వచ్చిపడే లక్షలూ, గౌరవ పురస్కారాలతో జనమిచ్చే  కానుకలు, విరాళాలే గాని   లేకుంటే ! మన వేమన దెప్పినట్లు  శునకానికి అయినా   పాలించే ఆ కనకపు సింహాసనమైనా  దాలిగుంట ముందు బలాదూర్!


డబ్బు మీదనేనా  ప్రజానేతల   ప్రగాఢ మమకారం? 

 నిజానికి సజావుగా జవాబు  చెప్పడం కష్టం. ఎన్నికల తంతుకు  కావాల్సింది ఎవలేని డబ్బు మూటలు ! కాని ఎన్ని కోట్లు   విరాళాలొస్తున్నా  ఎన్నికల సంఘంతో పాట్లు ! కాబట్టే  ఏ నేతా వంటి మీద నలగని బట్ట ఉండనీయడు! పలుగు పట్టినా,   మట్టి తట్ట మోసిన,  రోడ్దువార బంకుల్లో టీ కాచి పెట్టి,  రిక్షా తొక్కి పిక్క పట్టినట్లు ఫోజు పెట్టి ..  నిమిషానికి ఓ ఐదో ఆరో లకారాలకు  తగ్గకుండా కూలి   డబ్బులు రాబట్టటం!  


 డబ్బుంటేనే కోర్టుల్లో  పిల్స్   అడ్మిట్ అయ్యేది. స్పోర్టు కోర్టుల్లో ఐపిఎల్ గెలిపించడం అయేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా  చల్లంగా ఉండేది.


డబ్బున్న వాడిని నేరాలు దబ్బునేమీ చేయలేవు. బేళ్ల కొద్దీ నోట్లుంటే  చాలు.. బెయిళ్లైనా రావనలేవు. రూకల్లేకుంటేనే లోకానికి లోకువ. 


కాసుల తిరకాసు  కాచి వడపోసిన వడ్డికాసులవాడు కాబట్టే అంతెత్తున కొలువై ఉండీ హుండీలకు  నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొనేది. కళ్యాణకట్ట మీది  క్షౌరమైనా .. కాస్తంత  చెయ్యి తడపందే సాఫీగా సాగదు . పర్సు ఖాళీగాడంటే ఆఫీసు  బంట్రోతుకే కాదు  ఆ గాడ్స్  పూజారికే సరి పడదు.


డబ్బు డ్రగ్సు కన్న మత్తుది. డ్రగ్సు కేసులనైనా  గమ్మత్తుగా మాయచేసే మహత్తు దానిది  . నలుపో తెలుపో! డబ్బున్న వాడిదే చివరికి గెలుపు. 

***

 

Monday, January 30, 2017

దగ్గరి దారి- మరీ చిన్న కథ

ముఫ్ఫై అపార్ట్ మెంట్ల కాంప్లెక్స్ మాది. లిఫ్ట్ పనిచేయని ఓ పరగడున పాల పాకెట్లు తీసుకొని మెట్ల దారిన వస్తుంటే రెండో ఫ్లోర్ మెట్లకు ఓ మూల నిండుగర్భిణీలా ఉన్న ఓ వ్యాలెట్ కంటబడింది. అప్రయత్నంగా వంగి దాన్నందుకొని చూస్తే బరువును బట్టి లోపల సొమ్ము భారీగా ఉందని తేలింది. సభ్యత కాదు కాబట్టి ఎంతుందో తెలీదు కానీ.. మొత్తానిక అంతా దాదాపుగా ఐదొందలు.. వెయ్యినోట్లే. క్రెడిట్ .. డెబిట్ కార్టుల్లాంటివీ ఏవేవో ఉన్నాయి.  అన్నింటి మీదా బి. గోవింద రాజన్ అన్న పేరే ఉండుంటం వల్ల ఆ పర్శుతాలూకు ఆసామి ఎవరో తేలిపోయింది. వాచ్ మెన్ అప్పారావును అడిగితే .. అలాంటి పేరున్న వాళ్లెవరూ అపార్టుమెంట్లలో లేరని తేల్చాడు.
'ఇంత సొమ్ముంది. పై పెచ్చు ప్లాస్టిక్ కార్డులు! పోగొట్టుకొన్న మనిషి తానే వెదుక్కుంటూ రాడా? అప్పుడు తిరిగిచ్చేద్దాంలే!' అనిపించి ఇలా పర్శు నా దగ్గరుందని వాచ్ మెన్ కు చెప్పి  వచ్చేసాను.

ఒకటి రెండు రోజుల్దాకా ఎవరూ రాలేదు! ఆశ్చర్యం! మరీ ఆశ్చర్యం ఒక నెల రోజులు దాటినా ఎవరూ రాలేదు.

పరాయి సొమ్మును పాములా భావించే చాదస్తం  నాది. పోనీ  పోలీసులకిలా దొరికిందన్న సమాచారమిద్దామా అనిపించింది. వాళ్ల పోకిరీ బుద్ధి బాగా తెల్సుండబట్టి మనసొప్పలేదు. గుళ్లో హుండీలో వేయమని మొదలు పెట్టింది మా శ్రీమతి. పోలీసులకన్నా దేవుడి చూట్టూతా చేరిన  వాళ్లేమన్నా బుద్ధిమంతులా? ఆ పనీ చెయ్య బుద్ధి కాలేదు.
ఇంట్లో మధన ఇలా సాగుతుండగానే  మా  ధర్మ విచికిత్సను పటాపంచలు చేస్తూ  కాలింగు బెల్ కొట్టి మరీ ఓ నడి వయసు శాల్తీ లోపలి కొచ్చింది. అయిన పరిచయాలను బట్టి అతగాడు ఏదో ప్రైవేటు కాలేజీ లక్చెరరని తేలింది. అందరికీ    'గోరా'గా తెలిసిన అతగాడి అసలు పేరు 'గోవింద రాజ కుమారన్'ట! మా కాంప్లెక్సులో అద్దెకు దిగి ఇంకా రెండు నెలలు కూడా నిండక పోవడంతో అతగాడి ఆరిజన్ తమిళనాడు సైడు వేలూరని పసిగట్ట లేకపోయాం.   కృష్టాజిల్లా బ్రాహ్మణ యాసతో స్పష్టమైన తెలుగు మాట్లాట్టం వల్లా  గోరా రూట్స్ గోరైంతైనా పసిగట్టలేక పోయాం ఎవ్వరం.
పర్శులో ఐదువేల ఏడొందలు .. ఐదు వెయ్యి నోట్లు.. ఒక్క ఐదొందల నోటు.. నాలుగు యాభై నోట్లున్నాయని చూడకుండానే చెప్పేసాడు. క్రెడిట్.. డెబిట్ కార్డు వివరాలు కూడా అన్నీ పొల్లుపోకుండా చెప్పడంతో .. ఇంకా సందేహించడం అవమానించడమే అవుతుంది. అంతే కాదు. ఆ పరాయి సొమ్మును ఇంకా మోసే మానసిక స్థైర్యం నాకు లేదు. మా శ్రీమతిగారి హుషారుక్కూడా  అడ్డుకట్ట పడినట్లుంటుందన్న ఆత్రంతో పర్శు తిరిగి తెచ్చిస్తూ' అన్నీ సరిగ్గా  ఉన్నాయో.. లేవో.. ఒకసారి సరి చూసుకో బాబూ!' అన్నాను,
'ఉంటాయంకుల్! మీ నిజాయితీని గురించి  ఇక్కడందరూ చెప్పుకుంటుంటారు. ఆ  ధీమతోనే  ఆ రోజు మీ కంట బడేట్లు ఈ పర్సును  మెట్ల మూల పడేశాను. మీరా పరగడుపు చీకట్లలో  చూడ లేదు కానీ.. నేనక్కడే ఓ వారగా నిలబడున్నాను' అన్నాడు!
ఆశ్చర్యంతో నోరెళ్ళ పెట్టడం నా వంతయింది. ఇన్నాళ్ళూ నన్నవసరంగా టెన్షన్ పెట్టడం కొద్దిగా కోపం కూడా తెప్పించింది. నా ముఖంలోని భావాలను చదివినట్లుగా నొచ్చుకుంటున్నట్లు మొహం పెట్టి అన్నాడు గోరా 'సారీ! పెద్దవారు. మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. ఇంకేం  చేసేది? ఆ టైంలో ఇంట్లో మా అమ్మ నాన్నలున్నారు. మా నాన్నగారికి మందు పిచ్చి, దానికి తోడు నా జేబులు తడిమి ఎంతుంటే అంత పట్టుకేళ్లే అలవాటు. అడిగితే పెద్ద రభస అమ్మతో కూడా. బైకుమీదనుంచి పడి బాగా దెబ్బలు తగిలున్నాయని నన్ను చూడ్డానికి  హఠాత్తుగా ఊడి పడ్డారిద్దరూ. మర్నాడు మళ్లా బ్యాంకులో వేద్దును కానీ కుంటికాలు.. పెద్ద పెద్ద  క్యూలు! కుదర్లా! అంతకు ముందు రోజు రాత్రే మోదీగారీ పెద్దనోట్లు రద్దుచేసారు.  మా   వాళ్లిద్దర్నీ ఇప్పుడే బస్సెకించి  వస్తున్నా. సారీ  అంకుల్..  మా పేరెంట్సిద్దరూ  ఊరికెళ్లిందాకా నా హార్డ్ ఎరన్డ్ మనీ భద్రంగా ఉండాలంటే ఇంతకు మించి నాకు మరో దారి కనిపించలా’
.  
డబ్బు దాచుకోడానికి డబ్బు పోగొట్టుకోడం కూడా ఓ దగ్గరి దారని కనిపెట్టిన గోరా తెలివికి నోరెళ్ల బెట్టడం నా వంతయింది!
లకీగా ఇవాళ్టికింకా ఒక్క రోజు గడువు మిగిలుంది రద్దైన పెద్ద నోట్లు బ్యాంకులో వేసుకోడానికి. సంతోషమూ అయింది.
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రికలో మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)

***


Saturday, December 10, 2016

పెళ్లిల్లో ఆర్భాటాలంత అవసరమా?!- ఈనాడు సంపాదకీయం

'పెళ్ళిచేసి చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఏ గృహస్థుకైనా ఈ రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు 'ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే'! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్నప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న ఆ వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభకార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే. ఆ బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు! 'అన్నింటికి సైచి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి అంతరిక్షనౌక ప్రయోగంతో సరిగ్గానే పోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్యమన్న అతగాడి చమత్కారం- అణాపైసల్లో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణ మండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదుపులో ఉండొచ్చు గానీ, అతిథుల ఆ పూట ఆకలి దప్పికలను ఏ సూపర్‌ కంప్యూటర్‌ అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు.

పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగేది! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజనాదికాల కోసమేనని ఓ సంస్కృత శ్లోక చమత్కారం. 'జలసేవన గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడిలేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు ఓ భోజనప్రియుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మరి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరసపెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డు పెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవితానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని?! కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్‌'! పరగడుపున రాజులాగా, అపరాహ్ణం మంత్రిలాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికీ మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో అది శిరోధార్యం.

కల్యాణమంటే ఇద్దరు ఒకటయ్యే అర్థవంతమైన ముచ్చట. ఆత్మీయులు, బంధుమిత్రుల ముందు ఆ వేడుక ఎంత ప్రశాంతంగా జరుపుకొంటే అంత ముద్దు. అప్పు చేసి గొప్పగా పప్పన్నం పెట్టాలనుకోవడం తప్పు, అంతకుమించి ముప్పు. 'జుట్టెడు గడుపుకై చొరని చోట్లు చొచ్చి/ పుట్టెడు కూటికి బతిమాలే' అభాగ్యులు కోట్ల సంఖ్యలో పోగుపడిన దేశంలో విందు పేరిట అనవసర భేషజాలు, ఎడాపెడా వృథా చేయడాలు దారుణ నేరాల పద్దులోకే చేరతాయి. ఎంత భీమ బకాసురులైనా త్రిషష్టిత(63) సంవర్గ రస భేదాలను ఆస్వాదించడం కుదిరే పని కాదు. గొప్పకోసం చేసి చివరకు చెత్తకుప్పలమీదకు పారేసే విస్తరాకుల్లోని ప్రాణశక్తి ఎందరెందరినో ఆకలిచావుల పాలబడకుండా కాపాడగలదు. అటుకులు పిడికెడేనని కృష్ణయ్య కుచేలుడిని కాదు పొమ్మన్నాడా? బంధుమిత్రత్వాలకు విందుభోజనాలు కొలమానాలు, ప్రాతిపదికలు కానేకాదు. దేహమనే దేవాలయంలో ఆత్మారాముడి సంతృప్తికి ఫలం తోయం పరిమాణంతో కాక... ప్రేమతోనే నిమిత్తం. తినగ తినగ గారెలు వెగటు. ఆకలి సూచికలో అరవై మూడో స్థానంలోని మనదేశంలో అంత వెగటు పుట్టేదాకా తినాలనుకోవడమే అపచారం. వండి వృథా చేయడం క్షమించరాని నేరం. విందు వినోదాల్లో సాధారణంగా పదిహేనునుంచి ఇరవైశాతం దాకా ఆహార పదార్థాలు వృథా అవుతాయని ఆవేదన చెందుతున్నారు- 'హంగర్‌ ఎలిమినేషన్‌ అండ్‌ యూ' వ్యవస్థాపకులు వి.రాజగోపాల్‌. ఆ ఆవేదనలో కచ్చితంగా అర్థముంది. చెత్తకుండీలవద్ద ఎంగిలి విస్తళ్ల కోసం కుక్కలమధ్య కొట్లాడే కోట్లాది అన్నార్తులున్న అన్నగర్భ మనది. ఆకాశమంత పందిరి, భూలోకమంత వేదిక వేసి వైభోగంగా వివాహం చేసుకున్నా ఒకే వంటకానికి పరిమితం కావాలనే చట్టం తెచ్చే ఆలోచన మన పాలకులకు కలగటం ముదావహం. పొరుగున పాకిస్థాన్‌లో ఉన్నట్లు ఏకపాక శాసనం ఇక్కడా వచ్చేదాకా ఎందుకు... మనమందరం ముందుగానే మేలుకుందాం. స్వచ్ఛందంగా ఆహారవృథాను అరికడదాం. ఇంటికీ ఒంటికీ దేశానికీ అంతకంటే చేసే మేలు, సేవ ఏముంటుంది?

(ఈనాడు- సంపాదకీయం, ఈనాడు, 05-05-2011)

Thursday, December 1, 2016

పెళ్ళి చేసి చూడు!- పెద్దనోట్ల రద్దులో- సరదా గల్పిక


పెళ్లిళ్లు స్వర్గంలోనే జరిగినా వాటికి గుర్తింపు  కిందిలోకాల్లో ఫెళ్లున జరిగినప్పుడే. అందరు డబ్బున్న మారాజుల్లాగా మా గవర్రాజూ ఆకాశమంత పందిరి.. భూలోకమంత అరుగూ వేసి ఘనంగా చెయ్యాలనుకొన్నాడు తన కూతురు పెళ్లి. ఆఖరి నిమిషంలో ఆ మోదీగారి పుణ్యమా అని డ్యామిట్.. కథ అడ్డం తిరిగింది! నవంబరు, ఎనిమిది- అష్టమి తిధి మధ్య రాత్రి ఆ పెద్దాయన  హఠాత్తుగా పెద్ద నోట్లు రెండూ రద్దనేసెయ్యడంతో అందరు నల్లమహారాజుల మాదిరి మా గవర్రాజూ కొయ్యబారిపొయ్యాడు. అరక్షణంలో పాపం.. పాపరై పొయ్యాడు!
'పెళ్ళి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు' అన్నారు పెద్దలు. ఇల్లంటే ఇవాళ వల్లకాకపోతే మళ్లా ప్రభువులు మారినప్పుడైనా మెల్లంగా కట్టుకోవచ్చు. కళ్యాణమలా కాదే కక్కులా ఆగదు కదా! అందుకే కక్కా లేక.. మింగా లేక పాపం గుడ్లనీరు కక్కుకున్నాడు మా గవర్రాజు. ఆడబిడ్డను కన్న తండ్రులందరికీ ఆ గాలివారంత గుండె నిబ్బరం  ఉండడు! మేట్రిమోనియల్ మొదలు.. పిల్లని మెట్టినింట్లో దిగబెట్టిందాకా  దుడ్డు సంచుల్తోనే కదా ఏ శుభ కార్యమైనా? దుడ్లు దండిగా ఉన్నా సంచులు విప్పే ధైర్యం చాలకే గవర్రాజుకా గుడ్లు.. నీళ్లు! 
పెళ్లి కాబట్టి పిల్ల, పిల్లాడి జాతకాలు జత కలిసాయో.. లేదో చూసుకొన్నారు గానీ.. ప్రధాని మోదీజీ జాతకచక్రం కూడా ఈ మ్యాచికి మ్యాచవ్వాలన్న ఆలోచన రాలేదు.. అందుకే ఇప్పుడిన్ని తిప్పలు! మోదీజీ మూడ్ ను గురించి ఏమాత్రం ఉప్పందినా  ఈ మూడు ముళ్ల ముచ్చటకిన్ని ముళ్ళు పడకుండా ముందస్తు చర్యలు తప్పక తీసుకొనిండేవాడే.  ఎప్పట్నుంచో రాజకీయాల్లో నలుగుతున్న ఘటం మా  గవర్రాజన్న! ఏదేవైఁనా ఒక్కసారి గుండెలమీది కుంపట్ని దించేసాయలనుకున్నాక.. దింపకపోతే ఆ కాకకి  గుండెలు మొత్తం మండే  ముప్పుంది.  ఆ ముప్పునుంచి తప్పించుకొనాలనే కాక  ఉన్న నలుపులో ఒక శాతమన్నా తెలుపవుతుందన్న యావా తోడయింది. శుభలేఖ వీడియోలు  బాలివుడ్ మెగామోవీ స్థాయిలో వైరలవడానికి అదే కారణం. 'మన్ కీ బాత్' అంటే ఎప్పట్లా ఏవో మనసులోని ముచ్చట్లు  బైట పెట్టుకుంటాడనుకొంటే.. పిల్ల మనువుకే మొప్పొచ్చే మెగాబాంబ్ బ్లాస్ట్ చేసేసాడు మోదీ సాబ్!
పెళ్ళంటే పప్పు కూడని పెద్దల శాస్త్రం. ఆ పప్పులో వేసే ఉప్పుకే చచ్చే కరువొచ్చి చచ్చిందిప్పుడు. పాతరేసిన పాత పెద్ద నోట్లమీదున్న భరోసాతో బంధుమిత్రలందరినీ 'సపరివార సమేతంగా' విచ్చేసి  చందన తాంబూల సత్కారాలందుకొని వధూవరులనాశీర్వదించమని ప్రార్థించాడు. 'మాయా బజారు' మార్కు 'వివాహ భోజనాలు' మహా ఆర్భాటంగా ఏర్పాటయ్యాయని టాకొస్తే చాలు.. మరో రెండు శాతం బ్లాక్ వైటవుతుందని   మా  గవర్రాజు తాలూకు ఆడిటర్ల బడాయి. పెద్ద నోట్ల రద్దుతో మనీ బజారు మొత్తం కుదేలవడంతో  మా వాడికిప్పుడు  బేజారు!
పంచ భక్ష్య పరమాన్నాల మాట ఆనక.. పాయసంలో వేసే పంచదారక్కూడా చిన్న నోట్లే కావాలని చిల్లర వ్యాపారులు అల్లరి మొదలు పెట్టేరు. పది రూపాయలైనా సరే బిళ్లగా కనబడితే .. బిచ్చగాడి బొచ్చెలోకి విసిరేసే దర్జా మా గవర్రాజు బాబుది. యాబై నోటే రంగులో ఉంటుందో కూడా మర్చి పోయిన మా దసరా బుల్లోడికి  ప్రధాని రద్దు  ప్రకటన మర్నాటినుంచి పిల్ల పెళ్ళంటే  పెద్ద 'చిల్లర' వ్యవహారంగా మారి కూర్చుంది. 
అన్ని రోజులూ ఎప్పట్లానే డబ్బున్నరాజాలవనుకున్నాడు మా రాజు. ఆ ధీమాతోనే  పిల్ల మామగారిముందు  పెళ్ళేర్పాట్లను గూర్చి తుపాకి రాముణ్ని మించి గొప్పలు పోయాడు. పెళ్ళారు అడక్కముందే మూడ్రోజుల పెళ్ళి.. ముఫ్ఫై రకాల వంటకాలు.. మహారాజా ప్యాలెస్ పందిళ్లు.. కళ్లు మిరిమిట్లు గొలిపేట్లు లైట్లు! ఇహ పట్టు బట్టలు.. నగా నట్రలు.. విందు వినోదాల జాబితా చెప్పనే అక్కర్లేదు.  మారిన పరిస్థితుల వల్ల కిలో బెల్లానిక్కూడా  కొత్త రెండు వేల నోటు బైటికి తీయాల్సొస్తుందిప్పుడు. బ్యాంకోళ్లు విదిల్చే ముష్టి రెండున్నర లక్షల్తో ఇహ లక్షణంగా పెళ్ళి చేసే మాట కేవలం కల్లోనే!
పెళ్లంటే తాళాలు.. మేళాలంటారు. బీరువా తాళాలేవీ బైటికి తీయకుండా ఎంత ఘనంగానైనా చేసుకోండంటున్నారు ఆర్బీఐ గవర్నరు గారు! ఇదేం మేళం?బాజా భజంత్రీలు మోగించే వాడికైనా బయానాకింద తాంబూలంలో విధాయకంగా పెట్టివ్వడానికి కనీసం ఓ వందో.. అదొందలో ఉండాలి గదా? వంద నోటు కనిపించదు. కొత్తైదొందల నోటు కరుణించదు! పెళ్ళనుకుంటున్నప్పట్నుంచీ పిల్లదాని అత్తారిల్లు ఎలాగుండబోతుందోనని అల్లాడిపోతున్న గవర్ర్రాజుకిప్పుడు  గవర్నరాఫ్ ఆర్బిఐ గ వైఖరి ఎలాగుంటుందోనన్న బెంగ మొదలయింది. మామూలు పెళ్లయితే మగ పెళ్లివాళ్లని చూసుకుంటే సరిపోయేది. ఈ పెద్ద నోట్ల రద్దు తరువాత సర్కారు పన్నుల శాఖవాళ్లను కూడా చూసుకోవాల్సొస్తోంది. పాయసంలో రెండు జీడి బద్దలెక్కువ పడ్డా ఈడీ శాఖ వివరాలడిగేస్తుంది. పిల్ల, పిల్లాడికి పళ్లెంలో  పట్టు వస్త్రాలు పెట్టిద్దామన్నా అమ్మకాల పన్ను శాఖెక్కడ పట్టుకుంటుందోనని పీకులాటయిపోయింది! పెళ్లి పీటలమీద  కట్నకానుకలు చదివింపులప్పుడు కూడా లెక్కగా రాసుకునే బంధువుల పక్కనే ముక్కాల పీటేసుకొని బైఠాయిస్తుంటిరి ఆదాయప్పన్ను డేగ గాళ్లు! అడకత్తెర్లో పోక చెక్క బతుకై పోయింది పాపం మా గవర్రాజు బతుకు. పెద్ద నోట్ల పాతర దొడ్డెనకుందన్న నిబ్బరం.  అత్తారేవీఁ అడగనే లేదు.  పిలదాని మెళ్లో నిఖార్సైన  నవరసుల నాన్తాడు నాలుగైదు కిలోలది   ప్రొద్దుటూరు సరుకు దిగేస్తానన్నాడు. దాంతాడు తెగ.. ధడాల్మనీ రద్దు పిడుగొచ్చి పడుతుంద నెవడు కలగన్నాడు? వట్టి దారప్పోగుకింత పసుపు ముద్ద రాసి సొంఠికొమ్ము తాళి  వేలాడేస్తానంటూ  నానుస్తున్నాడిప్పుడు పాపం!   తక్కువ చేస్తే వియ్యాలవారితో తంటా! ఎక్కువ చేస్తే ఎన్ఫోర్సుమెంటు పెద్దల్తో పెంట!
సంభావన పంతుల్నుంచి.. సన్నాయి  భజంత్రీల దాకా అందరి చేతుల్లో తలా ఓ కొత్త రెండు వేల నోటు పెట్టుకుంటే పోతే .. ఇహ అల్లుడి పెట్టుపోతలప్పుడు పెట్టుకోడానికి మిగిలుండేది నోట్లకట్టకు మిగిలుండే ప్లాస్టిక్ బాండే! భూనభోంతరాళు దద్దరిల్లేట్లు పిల్ల పెళ్లి చెయ్యాలని పాపం ఇంతప్పట్నుంచి అడ్డమైన గడ్డి కరిచీ ఈ పెద్ద నోట్లు పోగేసాడు మా గవర్రాజు. ఇప్పుడు అలక పాన్పుమీద అందరల్లుళ్లల్లా ఏ బైకో.. టీవీనో.. టాబ్లెట్టో.. అడిగుంటే..  అదో రకం! చెక్కో.. డ్రాఫ్టో.. నెఫ్టో.. నెట్టో.. డెబిటో.. క్రెడిటో.. ఆ కార్డులు గీకో.. కంప్యూటర్ మీటలు కొట్టో అల్లుడి ముచ్చట తీర్చుండే వాడు! ముందనుకున్న కట్నంలో మిగిలున్న బకాయి మూడుకోట్లు మొత్తం చిల్లర పైసల రూపంలో ఒకే మూటగా చెల్లించాలని మంకు పట్టు పట్టుక్కూర్చున్నాడు! చెల్లని వెయ్యి నోటులా వెల వెలా పోతున్న మా గవర్రాజన్న ముఖం చూస్తుంటే.. చెప్పద్దూ.. పాపం.. ఆ మాజీ
టాటా చైర్మన్ మిస్త్రీ మొహమే మళ్లీ గుర్తుకొచ్చేస్తుంది!తల తాకట్టైనా పెట్టి పెళ్లి గండం గట్టెక్కే తల్లిదండ్రులకీ దేశంలో కొదవేం లేదు కానీ.. తాకట్టుకొట్టు వాడి గల్లా పెట్లోనైనా లెక్కకు పనికొచ్చే చిల్లర ఉండాలి కదా!
చిల్లరమీదే కదా ఇవాళ దేశంలో ఈ అల్లరి ఆర్భాటమంతా?

మోదీజీ ఆర్థిక  సంస్కరణల పుణ్యం! రాబోయే రోజుల్లో పెళ్లి చూపుల్నుంచే పెను మార్పులు తథ్యం! పిల్లాడిది 'ఆధారపడే ఉద్యోగమా?.. ఉపాధా?' అన్న ఆరా ఆనక తీరిగ్గా.  ముందసలు 'ఆధార్ కార్డు ఉందా.. లేదా' అని  తరిచి చూడడం ముఖ్యం పెళ్లికూతురు తరుఫు వాళ్లకిక.  ఆరోగ్య పరీక్షల ధృవీకరణ పత్రాలు  వెంట లేకుండా వధూవరులెవరూ పెళ్లి చూపులకు సిద్ధమవలేరు. రోజులకొద్దీ బ్యాంకులముందు.. ఏటియంల ముందు ఎండ.. వాన.. చలి.. కాలుష్యాలకు తట్టుకొని  తిండి తిప్పలు లేకుండా క్యూలో నిలబడేపాటి  శరీర దార్ధ్యం కాబోయే భర్తగారికి తప్పని సరి. ఒక్కో బ్యాంకుకొక్కో శాల్తీ.. ఏటియంతో కలిపి కుటుంబానికో   డజను జతల కాళ్లు   తప్పని సరి. ఆపాటి బిడ్డల్ని కనేపాటి ఆరోగ్యం కాబోయే భార్యకూ కంపల్సరి!
ఏమో.. ముందు ముందు మరిన్ని తీవ్రమైన చర్యలుంటాయని సంకేతాలిస్తున్నారు కదా మోదీజీ ఇప్పట్నుంచే!
-కర్లపాలెం హనుమంతరావు



 (వాకిలి- అంతర్జాల పత్రిక- డిసెంబరు- 2016-లాఫింగ్ గ్యాస్ గా ప్రచురితం)

Saturday, November 19, 2016

పెద్దనోట్ల రద్దు చిన్న వ్యూహమేం కాదు! -వార్తా వ్యాఖ్య


2016, నవంబరు 8 రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనతో 500, 1000 నోట్లు రద్దయినప్పటి రెండు రోజుల వరకు ప్రతికూలమైన స్పందనలు అంతగా ఏ దిశవైపునుంచి రాకపోవడం గమనించాలి. ముఖ్యంగా.. ప్రతిపక్షాలనుంచి. ఈ పథకం వల్ల పెనునష్టానికి గురయ్యే వర్గాలనుంచైతే అస్సలు మాటా పలుకు లేదు. ప్రధాని తన ప్రకటనలోనే సామాన్యులకు ఈ సంస్కరణ వల్ల కొన్ని రోజులు ఇబ్బందులు ఎదురవుతాయి.. దేస సంక్షేమం కోసం, తనకోసం కనీసం ఓ 50  రోజులు సహించమని చేసిన విన్నపంలోని నిజాయితీ కూడా సామాన్యుణ్ణి కదిలించింది. మాటలు వేరు.. అనుభవం వేరు. ఒక లెక్క ప్రకారం దాదాపు 8.25 లక్షల కోట్ల 500 నోట్లు, 6.70 లక్షల కోట్లకు విలువైన 1000 నోట్లు చట్టబద్ధమైన కరెన్సీ ఈ ప్రకటన నాటికి చలామణిలో ఉంది. అదంతా ఒక్క రద్ధుతో కొద్ది కాలంలోనే  చిత్తు కాగితాల పోగుగా మారడానికి సిద్ధమై పోయింది. పెద్ద నోట్లు అధిక శాతం సహజంగానే నల్ల కుబేరుల దగ్గర పోగై ఉంటాయి, వాస్తవానికి వాళ్లు ఆందోళన చెందాల్సిన అతి పెద్ద దుర్ఘటన. నిరసన అటు వైపునుంచి కాకుండా.. సామాన్యుల వైపునుంచి రావడం మొదలు పెట్టింది. చిన్న జనం ఆక్రోశమంతా తమ దగ్గర ఉన్న కాస్తో కూస్తో పెద్ద నోట్లు ఎక్కడ చెల్లకుండా పోతాయోనని. వాటి మీద ఆధారపడే నిత్యజీవితావసరాలను గడుపుకోడానికి బాగా అలవాటు పడిన జనానికి ఆ మాత్రం ఆందోళన ఉండటం తప్పదు. రద్ధైన నోట్లను చిన్న నోట్లతోగాని.. కొత్తగా తాయారు చేసిన 500, 2000 నోట్లతోగాని బదిలీ చేసుకోవచ్చు కొన్ని చిన్న చిన్న నిబంధనలను సక్రమంగా పాటిస్తే. కానీ ఎందుచేతనో నోట్ల జారీని  పాటించవలసిన ఆర్థిక సంస్థలు.. బ్యాంకులు.. తపాలా ఆఫీసులముందు.. చాంతాండంత క్యూలు ఎన్ని రోజులకూ ముందుకు  కదలకుండా ఉండిపోవడంతో నిరసన గళాలకు మెల్లిగా స్వరం పెరిగింది. కొత్త నోట్లను ఇవ్వవలసిన ఏటియంలు బొత్తిగా చేతులెత్తేయడం కూడా ఈ అయోమయానికి మరింత గందరగోళం జత చేసింది. పండగ రోజుల్లో.. పెళ్లిళ్ల సీజనులో ప్రధాని ఇంత పెద్ద రద్ధు సంస్కరణను ఎందుకు చేసారో అర్థం కాలేదు. దానికి తోడు ప్రభుత్వ యంత్రాంగం ఆశించినంత చురుగ్గా నోట్ల బదిలీ.. నగదు జమ వ్యవహారం నిర్వహణ సాగడం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు కనీసం కనుచూపు మేరలోనైనా కనిపించక పోవడంతో.. సామన్యుల నిరసన సాకుని పెద్ద వర్గాలు.. ప్రతిపక్షాలు.. నల్లకుబేరులు.. ఈ సంస్కరణ మూలకంగా తాత్కాలికంగా నష్టపోతున్న వ్యాపార వర్గాలు.. ఓపిక పట్టే అలవాటు లేకుండా అలవోకగా కువిమర్శలకు దిగిపోయే మధ్య తరగతి జీవులు.. నిరసన జ్వాలలను ఎగదోస్తున్న సమాచార మాధ్యమాలు.. ఇవన్నీ కలిపి సృష్టిస్తున్న ఆందోళనకరమైన వాతావరణం పుణ్యమా అని  వాస్తవంగా ఈ పెద్ద నోట్ల రద్దు దేశానికి ముందు ముందైనా ఏదైనా  మేలు చేస్తుందా? అని కుశంక పెంచుతోంది.
సరైన ముందస్తు చర్యలు చేపట్టకుండా  ఇంత పెద్ద సంస్కరణను ప్రధాని ముందుకు తీసుకు రాకుండా ఊండవలసిందని సర్వోన్నత న్యాయస్థానమూ వ్యాఖ్య్లలు చేయడం గమనార్హం. సందు దొరికతే ఆందోళనకు దిగి చట్టసభలను స్థంభింప చేసే రాజకీయ వాతావరణం మన దేశ ప్రజలు ఇవాళే కొత్తగా  చూస్తున్న విషయం కాదు కాబట్టి దాన్ని గురించి ఏ వ్యాఖ్యానమూ అవసరం కాదు.
స్వతంత్రం వచ్చిన ఈ ఏదు దశాబ్దాలలో నోట్ల రద్దు ఇవాళే కొత్తగా మొదటి సారి జరిగింది కాదు అంటున్నారు, నిజమే.. కానీ.. నోట్లు రద్ధయిన సంధర్భం.. రద్దుచేసిన ప్రభత్వాన్నికూడా పరిగణనలోకి తీసుకుంటే.. కచ్చితంగా.. జాతికి మునపటి సంస్కరణల మాదిరిగా కాకండా మేలు చేసే చర్యే!
2014 ఎన్నికల ప్రచార సందర్భంలో ప్రధాని అభర్థిగా మోదీ ప్రజలముందు  పదే పదే విదేశాల్లో దాగిన  నల్లధనం  తిరిగి స్వదేశానికి రప్పించడం గురించి ప్రస్తావించేవారు. ఈ దేశానికి చెందిన ఆ చట్టబద్ధమైన సొమ్మునంతా తెప్పించగలిగితే ఒక్కో పౌరుడికి 15లక్షల రూపాలయదాకా లాభం వస్తుందన్నది  ఓ లెక్కగా సామాన్యుడికి వివరించేందుకు చెప్పిన వివరం. అలా ఆయాచితంగా డబ్బు వచ్చి పడుతుందని ఏ అమాయకుడూ ఆశ పడలేదుగానీ.. హామీ ఇచ్చిన మేరక్ కొన్నైనా చర్యలుంటాయనై ఆశపడ్డ మాట నిజం. మోదీకి వచ్చిన భారి మెజారిటీల కారణాలలో ఇదీ ఒకటి. గద్దె ఎక్కైనప్పట్నుంచీ మోదీని ప్రతి పక్షాలు ఎద్దేవా చేస్తూనే ఉన్నాయి.. నల్లధనమెక్కడా? 15 లక్షల జమ ఎప్పుడు? అంటూ. నరేంద్ర మోదీ నైజం తెలిసిన వాళ్ళెవరూ ఇలా ఎగతాళికి పూనుకోరు. ఈ దేశపు రాజకీయ నెతల మాదిరి మాటకు మాట చెప్పడం ఆయనకు అలవాటు లేదు. మొనంగా ఉంటూనే.. తన మానాన తాను నిశ్శబ్దంగా పని చేసుకుంటూ .. చివరి ఫలితం ద్వారా జవాబు చెప్పడం ఆయన రాజకీయ విధానం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పనివిధానాన్ని గమనించిన వారందరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. నల్లధనం విషయంలోనూ ఆయన నిమ్మకు నీరెత్తినట్లేం  కూర్చో లేదు. గద్దెనెక్కిన కొత్తల్లోనే విదేశాల్లోని నల్లధనం వెలితీతకు
సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక పరిశోధక బృంధాన్ని ఏర్పాటు చేసారు. బ్యాంకింగు లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఒకరికొకరు మార్పిడి చెసుకోనే విదేశీ ఒప్పందాలకు చొరవ చూపించారు. బినామీ లావాదేవీలను అడ్డుకునేందుకు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. జనధన్ యోజన- నగదు చెల్లింపులమీద వత్తిడి తగ్గించి లావాదేవీలన్నీ బ్యాంకు కాతాల ద్వారా సాగించేందుకు చేసిన తొలి చొరవ. మన దేశంలో అధిక శాతం ఆర్థిక లావాదేవీలు నగదు రూపంలో సాగడం వల్ల.. అక్రమార్జన పరులకు పెద్ద నోట్లు ఓ గొప్ప వరంగా మారింది. ఈ పరిస్థితి ఇప్పుడే కొత్తగా వచ్చింది కూడా కాదు. గతకాలపు యూడిఏ పాలనలో కూడా నల్లదనంగో  ఓ సమాంతర ఆర్థిక వ్యవస్థ నిర్భయంగా సాగుతుండేది. కట్టడి చేసేందుకు ప్రభుత్వం తరుఫునుంచి నామామాత్రపు చర్యలే కొనసాగుతుండడం.. పన్నులు చెల్లించకుండా సొమ్మును దాచుకొనే నైజాన్ని మరింత ఈ దేశవాసులకు మరింత నేర్పించినట్లయింది. ఏవేవో స్వచ్చంద ఆదాయ ప్రకటనల పథకాలు వస్తూ పోతుండేవే కాని.. వాటిని చిత్తశుద్ధితో అమలు చేసే యంత్రాంగం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థను 70% నల్లధనమేమో నడిపించే దురవస్థ కొనసాగుతూ వచ్చింది. దీనికి తోడు సరిహద్దుల కవతల నుంచి ఉగ్ర వాదులు చైనా సాంకేతిక సహాయంతో నకిలీ నోట్లు గుద్ది చలామణీలో పెట్టేవారు. అలా పెడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించే స్థాయికి వచ్చిన తరువాతే మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టింది. అన్ని విషయాలమీద చక్కని అవగాహన ఏర్పరుచుకున్నందువల్లే  నల్లధనం కట్టడికి తీసుకునే ముందస్తు చర్యలను గుట్టు చప్పుడు కాకుండా ఉంచడం జరిగింది. ఆఖరి అవకాశంగా మొన్నటి 'స్వచ్చంద ఆదాయ ప్రకటన' పథకం ప్రకటించినా.. కొత్త ప్రభుత్వం పనితీరుని సరిగ్గా అర్థం చేసుకోలేని నల్లకుబేరులు ఎప్పటిలాగానే నల్లమందు మింగిన రోగుల్ల చల్లంగా ఉండి పోయారు. అక్కడికీ వెంకయ్యనాయుడు గతి కొద్ది కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాడు.. మోదీ మిగతా ప్రధానుల్లా కాదని.. కశ్మీర్ ఉగ్రవాదులమీద చేసిన సర్జికల్ దాడుల్ని చూసైనా అర్థం చేసుకోవాలని. ఏమయింది? దేశ నల్లకుబేరులమీద సర్జికల్ దాడి మొదలైంది. మందు ముందు మరిన్ని ఆపరేషన్లుంటాయని మళ్ళీ మళ్ళీ హెచ్చరికలూ వస్తున్నాయి.
ప్రధాని టైమింగుని గురించి జనసామాన్యం ఓ రకంగా విమర్శిస్తుంటే.. రాజకీయ పక్షాల
విమర్శ మరో విధంగా ఉంది. త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసిన దొంగదెబ్బగా మమతా బెనర్జీనుంచి.. ములాయం సింగుదాకా అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఈ దేశంలో చివరికి పంచాయితీ ఎన్నికనైనా సరే.. డబ్బు ప్రమేయం లేకుండా ఊహించుకోడం సాధ్యం కాని స్థితికి చేరుకున్నాం మనం. రాష్ట్రాల ఎన్నికలంటే ఎన్ని వేల కోట్లు కుమ్మరించాలో వేరే వివరించనక్కర్లేదు. దానికీ సిద్ధపడి దాచుకొన్న దొంగ డబ్బు  సంచీ మూటలను అభ్యర్థులు విప్పుతున్న చివరి దశలో ఉరుములేని పిడుగులాగా నరేంద్ర మోడీ ఒక్క మధ్యరాత్రి ప్రకటనతో మొత్తం తలకిందులు చేసేసాడు! ముందు ముందు ఇంకేమోమో చేసేస్తానంటున్నాడని దుగ్ధ. మమతా బెనర్జీ..సిపియం వంటి బద్ధ శత్రువులు సైతం ఏకం అవాల్సి వచ్చిందంటే.. మోదీజీ తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు ఎంత పెద్ద సంస్కరణో అర్థమవుతోంది కదా!
నిజమే! సరైన హోం వర్కు కొరవడ్డం వల్ల తగినంత చిల్లర నోట్లు  లేక  చిన్న చిన్న వ్యాపారులు .. వయోధికులు.. రోగులు..రోజు కూలీలు.. రైతులు..  పసిపిల్లలు.. చిరు జీతగాళ్లు.. వండి వార్చి పెట్టవలసిన మహిళలు.. ఆగచాట్లు పడుతున్న మాట అక్షరాలా నిజం. ఇంత పెద్ద చర్య తీసుకునేముందు ఎంత గోప్య్తత అవసరమైనా .. సామాన్య జనం నిత్యావసర జీవనాధారాలమీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉండవలసింది. ఎంత ఉపద్రవంలో అయినా దొంగదారులు వెతికే నల్లకుబేరుల నక్కజిత్తు వ్యూహాలను నిరోధించేందుకు మరికొంత అధ్యయనం చేసి ఉండవలసింది. ఆ మాట ఇప్పుడు మోదీజీ కూడా ఒప్పుకుంటున్నారు. కనక ఊహించని లోపాలు బైటపడిన ప్రతి సందర్భంలోనూ.. వెంటనే తగు చర్యలు తీసుకొనే ప్రణాళికలు సిద్ధం చేయాల్సుంది. దేశాధ్యక్షుడు ఒక్కడి చేతే 'సరే' అనిపిస్తే చాలదు. దేశం మొత్తం 'శభాష్' అనే రీతిలో ఈ సంస్కరణల పర్వం నిరాటంకంగా కొనసాగిస్తే.. దశాబ్దాలుగా దేశానికి పట్టిన పీడ నివారణ అవడం ఎంత సేపు! రాజకీయాలతో సామాన్యుడికి సంబంధం లేదు. సామాన్యుడు పేరుమీద సాగే రాజకీయాలతో అసలే సంబంధం లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రక్షాళన అవుతుందంటున్నారు. ఉగ్రవాదుల ఆట కడుతుందంటున్నారు. దరలు తగ్గి సామాన్యుడి నిత్యజీవనంలో అనన్యంగా గణనీయమైన మేలు సంభవమంటున్నారు. ప్రపంచంలో పదేళ్లలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతామంటున్నారు. ఆన్నీ కాకపోయినా .. కొన్నైనా నిజమైతే.. ఇన్ని రోజులుగా సామాన్యులు పడుతున్న కష్టాలకు ఒక సార్థకత ఏర్పడినట్లవుతుంది.
రాజకీయాలదేముంది? ఈ దేశంలో ఎప్పుడూ అవసరార్థం అటూ ఇటూ మరుతుండేవే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం.. ప్రజల వలన.. ప్రజల కొరకు కదా సాగాల్సింది!
-కర్లపాలెం హనుమంతరావు

***

Sunday, October 23, 2016

నల్ల’మేతగాళ్లు- ఈనాడు వ్యంగ్య గల్పిక


రోజూ ఉండే రాజకీయాలకేం గానీ ఇవాళ నీకు మహాభారతంలోని ఓ మంచి కథ చెప్పాలనుందిరా!'
'కహానీలు చెప్పడంలో నిన్ను మించిన మొనగాడు లేడుగా! బాదేయ్  బాబాయ్!'
'సృంజయుడనే ఓ రాజుగారికి సంతానం లేదు. నారదులవారో సారి చూడ్డానికని వచ్చినప్పుడు రాజు కోరితే 'గుణవంతుడు, రూపవంతుడయిన కొడుకు పుడతాడ’ని ఆశీర్వదించాడు.’
'గుణాన్నేమన్నా కోసుకు తింటామా? రూపాలతో ఏమన్నా వ్యాపారాలు చేయబోతున్నామా?  వాడి చెమట, రక్తం, ఉమ్మి, కన్నీళ్లుకూడా చివరికి కాసులుగా మారిపోవాలి.  అట్లాంటి రూకలు రాల్చే పుత్రుణ్ని ప్రసాదించండి స్వామీ!' అని కోరుకున్నాడా రాజు. అట్లా పుట్టిన సుపుత్రుడే సువర్ణష్ఠీవి.'
'ఆ నడిచే ఏటియంగానీ  ఇంకా ప్రాణాలతో ఉంటే.. అర్జంటుగా  అడ్రస్ చెప్పెయ్  బాబాయ్! అసలే మన కష్ణమ్సోళ్ళు  గోల్డు గట్రాలు గీకే పనుల్లేక పాపం   గోళ్లు గిల్లుకుంటున్నారూ!'
'హుష్ఁ! ముందు కథ విన్రా! ఆశకొద్దీ ఆ బంగారు బాబుని దొంగలు ఎత్తుకెళ్లా రోసారి. నిధులకోసం పొట్టకోసి చూస్తే వట్టి పేగుచుట్టలు, మాంసం ముద్దలు! రక్తధారలు మినహా మరేవీఁ కనిపించక చెత్త కుండీలో పారేసి పోయారు చిర్రెత్తిపోయి. రాజుగారి దుఃఖం సంగతింక చెప్పాలా? నారదులవారా పుత్రశోకానికి చలించిపోయి 'అందుకే ఎర్ర చందనం దుంగల్లాంటి బిడ్డల్ని కాదు.. ఎవర్ హీరో చంద్రబాబులాంటి మచ్చలేని చంద్రుళ్లను  కొడుకులుగా కోరుకోవాల'ని మందలించాడు. మళ్లీ సువర్ణష్ఠీవిని  బతికించి పోయాడు'
'కథ బాగుంది కానీ బాబాయ్ .. ఇప్పుడా గోల్డుబాబుగాడి గోలింతర్జంటుగా  ఎందుగ్గుర్తుకొచ్చిందో?!’
'ఇవాళ్టి పత్రిక పరీక్షగా చూసుంటే నీకూ ఇట్లాంటి కథే ఇంకోటేదన్నా గుర్తొంచ్చుండేదేమో! అపరాల ధరవరలు ఆకాశాన్నంటుతున్నట్లు.. అవినీతి అధికారుల ఆమ్యాఁమ్యాఁలు కూడా అంగారక గ్రహాని కెగబాకుతున్నాయంట.. వింటంలేదా!'
'పెట్రోలు రేట్లు తగ్గించినట్లే తగ్గించి డీజిలాయిలుమీద దొంగ దెబ్బలు తీస్తే ఎంతధికారులయితే మాత్రం పాప మింకేం చేస్తారు బాబాయ్.. పాపిష్టి పన్లకు  పాల్పడ్డం తప్ప?'
'అందుకేనంటావా పోయినేడాది మన అధికారుల దగ్గర పట్టుబడ్డ అక్రమార్జన  సొమ్ము సిటీ మెట్రో ప్రాజెక్టు  సగం నిధులకు సరిసమానంగా ఉందీ! ఈ లెక్కన ఏ.సి.బి వాళ్లు దాడి చెయ్యని.. చెయ్యలేని.. చెయ్యడానికి మనసొప్పని సొమ్మంతా లెక్క చూస్తే  మన పోలవరం పెంచిన అంచనాలక్కూడా మించుంటుందేమో గదా?! సమాచార హక్కు చట్టాలు, అన్నాహజారేలు అన్నం నీళ్లూ మానేసి దీక్షలకు  దిగడాలు, అవినీతి నిరోధక శాఖల అడుగడుగు నిఘాలు, కాలు కదిపినా చాలు వళ్లు ఝల్లుమనిపించే విజిలెన్సువాళ్లు  ఝళిపించే కొరడాలు, న్యాయస్థానాల మార్కు నిష్పాక్షిక విచారణలు, జనాల చీదరింపులు.. ఎన్ని ముళ్ల కంచెలడ్డంగా ఉన్నా .. ఇదేందిరా 'పచ్చి గడ్డే' పరమాన్నమంత హుషారుగా మన అధికారులిలా చేలల్లోపడ్డ ఆంబోతుల్లా  లంచాలు మేసెయ్యడాలూ?!'
'లంచాలు' ఏంటి బాబాయ్.. మరీ అంత మొరటు పిలుపు? ముడుపులు, నైవేద్యాలు, నజరానాలు, మామూళ్లు, ఫలహారాలు, ప్రసాదాలు,  చాయ్ పానీలు, విరాళాల్లాంటి నాజూకు సహస్రనామాలు వేలకు వేలుంటేనూ! అయినా ఇవాళే ఈ అరాచకాలన్నీ కొత్తగా పుట్టినట్లా తత్తర్లేంటంట? పరగడుపునే భగవంతుడి ముందు బోర్లాపడిపోయి 'నాకిది కావాలి.. వాడికది ఇవ్వద్దం'టూ కోరికల చిట్టా విప్పి.. బదులుగా కొట్టే ముష్టి ' మూడ్రూపాల టెంకాయ' నే మంటారో?! దేవుడంతటి వాడే దేవేరులవారి అనుగ్రహంకోసం పారిజాతపుష్పాన్ని సమర్పించుకోవాల్సొచ్చింది.  రాజులనుగ్రహించే  అగ్రహారాల కోసం కాదా కవులు ఏకాక్షులను సైతం ఏకాంబరులతో కలిపి స్తోత్రపాఠాలు వల్లెవేసిందీ?! భూం పుట్టినప్పట్నుంచే బహుమానాలు పుట్టుకొచ్చాయంటారు  పెద్దలు.  ఆదాము అవ్వలచేత సంసారం చేయించడానిక్కూడా సైతానుకి ఆపిల్ పండు చవుఁరొదిలింది మరి! '
'ఆ లెక్కలిక్కడ కుదరువురా తిక్క సన్నాసీ! జనంచాకిరీ చేయడానికని కదా సర్కారు నెల నెలా జీతభత్యాలు ధారపోస్తునదీ? అదనంగా ఈ 'చాయ్ పానీ'లని గుంజటం అన్యాయ మనిపించడం లేదట్రా నీకూ?'
'నూలు పోగైనా అందకపోతే చందమామక్కూడా వెలుగులందించాలనిపించని  రోజులు బాబాయివి!  ప్రభుత్వందలాలకు బల్లకింది చేతులదో రకమైన అందం చందం. 'ఠంచనుగా బడికి పోరా!' అంటే జీళ్లు కొనుక్కోడానికి  డబ్బులిమ్మంటున్నాడు చడ్డీలేసుకోడంకూడా రాని చంటి కుర్రాడివాళా రేపూ. నోరూ వాయీ లేని మూగ గేదైనా  నోటికింత పచ్చిగడ్డందకపోతే పొదుగుమీద వేలైనా వెయ్యనివ్వదు కదా! నోరున్న మనిషి.. అందునా సర్కారు నౌఖరు. నోరు కుట్టేసుకోమంటే దారం దబ్బనం తెచ్చేసుకుంటాడనే?! ఇన్ని నీతులు వల్లేస్తున్నావ్ గానీ బాబాయ్.. నీ నాలిక్కే ఓ బొట్టు తేనెచుక్క అంటిందనుకో..  చప్పుమని  చప్పరించెయ్యకుండా వుండగలవా? నీళ్లమడుగులో చేపలాంటిది బాబాయ్  అధికార పదవి. తడవకుండా చేపెట్లా ఈతకొట్టలేదో.. డబ్బూ దస్కమంటకుండా  అధికారి కూడా తన ధర్మానికి న్యాయం చెయ్యలేడు.'
'ఆహాఁ! ఎంతమోఘమైనా తర్కం లేవదిసావురా బాబ్జీ! మేతగాళ్లను కూడా ఓ గొప్ప సృజనాత్మక కళకారులుగా ఆవిష్కరించిన తమ ఘనతను మెచ్చుకు తీరాల్సిందే!'
‘నీ మెప్పుల మెడల్సు మెడల్లో వేసుకుని డప్పట్టుకొనూరేగాల్సింది నిజానికి నేను కాదు బాబాయ్! ఇక్కడ నయీం తరహా భాయీలతో కల్సి అందినన్ని రాళ్ళు దండుకునే దండనాయకులు.  అక్కడ నయా నయా ప్రాజెక్టులడొంకల్లో దొరికినన్ని  దోరమగ్గిన పళ్లు పోగేసుకునే  సర్కారు దొరలు!  జీతమెలాగూ  చేతికొచ్చేదే. గీతానికే చేతికళలవసరం. వాటిమీదా నువ్విలా  గీతాబోధనలు సాగిస్తే.. సర్కారువారి దస్త్రాలు ఒక్కంగుళమైనా ముందుక్కదలని మొండి రథాలయిపోతాయ్. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో కూడా పన్లెంతో మందకొడిగా సాగే రోజుల్లో.. మన దగ్గర సర్కారు కార్యాలయాలెంత  మందు దుకాణాల్లా కళకళ లాడేవో తెలుసా నీకు? అందుక్కారణం.. ప్రభుత్వం తాలూకు కామందులవారి  క్కావలసినంత మందు- మాకూ అందుతుండటమే! ఆర్థికరంగం పరిపుష్టి సర్కారు నౌకర్ల ‘ముష్టి’ పన్లమీదే ఆధార పడుండేది.’
'బాగుందిరా బాబూ తర్కం! నీ వాలకం చూస్తుంటే.. సర్కారు మార్కు అక్రమార్జనను కూడా ఏ సవరణలైనా చేసి రాజ్యాంగబద్ధం చెయ్యాలనేట్లున్నావుగా?!'
'సందర్భానికి తగ్గ సూచనిచ్చినందుకు నిన్నభినందించకుండా ఉండలేక పోతున్నా బాబాయ్! అక్రామార్జనను సర్కారుద్యోగుల హక్కుగా గుర్తించి తీరాల్సిందే! సిటిజన్ ఛార్టుల్లో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల్లో 'ఈ ఫలానా పనికి పైన ఇంత.. ఆ ఫలానా పనికి అడుగునింతింత'ని  రేట్లు ఫిక్స్ చేసేస్తే..  అస్పష్టత తొలగిపోతుంది. అవాయిడబుల్ పోటీలు.. అన్వాంటెడ్  లిటిగేషన్లతో అయే జాప్యం నివారణయిపోతుంది. ఆదాయానికి మించిన ఆస్తులున్నవారిని గుర్తించి గౌరవిస్తే.. తరువాతొచ్చే తరాలకు   ప్రేరణ కల్పించినట్లవుతుంది. ఆదాయప్పన్ను వెల్లడి పత్రాల్లో  కూడా అదనపు ఆస్తులు ప్రకటించుకునే సంస్కరణలు వెంటనే చేపటాల్సుంది. జీతభత్యాల   తరహాలో గీతభత్యాలమీదా రాయితీలు ప్రకటించాలి. అవినీతి నిరోధక శాఖ, విజిలెన్సు డిపార్టుమెంటులాంటి అభివృద్ధి నిరోధక శాఖలను వెంటనే రద్దు చేసెయ్యాలి.  ఆ ఆఫీసు కార్యాలయాలను సర్కారుద్యోగుల బేరసారాల కేంద్రాలుగా మార్చాల్సుంది వెంటనే.  ఆవినీతి నిరోధక శాఖ సిబ్బందిని నీతి నిరోధక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం ద్వారా  సమస్యలుత్పన్నం కాకుండా చూసుకోవచ్చు. అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే పద్ధతిలోనే అక్రమార్జనలనుకూడా సక్రమార్జనలుగా గుర్తించే పథకాలు వెంటనే చేపట్టాల్సుంది. అధికారులు.. ఉద్యోగులు  నానాగడ్డీ కరిచి పోగేసుకొనే సంపదలను దాచుకొనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో స్వఛ్ఛంద ప్రకటనలు వచ్చే వరకు నల్లసరుకును  భద్రపరుచుకొనేందుకు సర్కార్లే గిడ్డంగులను నిర్వహించాల్సుంది. ఇసుక తవ్వకాల్లాంటి భారీ ప్రాజెక్టుల్లో పోగైన సొమ్ముకా గిడ్డంగులు చాలని పక్షంలో నేలమాళిగలు ఏర్పాట్ల దిశగా  వెంటనే చర్యలు చేపట్టాల్సుంది. లంచగొండులకు తగినంత ధీమా కలిగిస్తే. విదేశాల్లో మూలిగే మన  సొమ్మంతా స్వదేశానికి తరలొచ్చి జాతివనరుల నిర్మాణంలో తనవంతు నిర్మాణాత్మక పాత్ర తప్పక పోషిస్తుంది. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎప్పుడూ మనదేశం నుంచీ కేవలం ఒక్కరడజను మించి పేర్లు కనిపించక పోవడం  సిగ్గుపడే విషయం. నల్లధనానిక్కూడా చట్టబద్ధత కల్పిస్తే ఒక్క మనదేశంనుంచే ఊరికి వకరడజనుకు తగ్గకుండా  కుబేరులు బైటపడ్డం ఖాయం. ఏమంటావ్ బాబాయ్?'
'నా మనసులోని ముచ్చట బైట పెట్టాలంటే నువ్వు నాకూ ముందొక వెయ్యినూటపదహార్లచ్చుకోవాలంటాను. హ్హాఁ.. హ్హాఁ.. హ్హాం!'

‘!..!..!’
-కర్లపాలెం హనుమంతరావు
((ఈనాడు 18, నవంబరు, 2011లోని సంపాదకీయం పుటలో ప్రచురితం-కొద్ది సవరణలతో) 

Thursday, August 4, 2016

సరళీకర వ్యాపార విధానాలు


'ఈ మధ్య పత్రికల్లో మరీ ఎక్కువయిందేంది బాబాయ్ గోల! ఈ 'ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏందీ?'
'పక్కనే చక్కని తెలుగు ముక్కల్లో రాసుంది.. చదువుకోవచ్చు గదరా! 'సరళతర వ్యాపార నిర్వహణ' అనీ! పనిమాలా  వచ్చి మీ బాబాయి పనిని చెడగొట్టందే నీకేం తోచదా  బాబిగా?
'బాబాయీ!.. పనీనా! బాబోయ్.. ఇదేంటి పిన్నీ కొత్తగా!'
'అట్లకు పిండి రుబ్బి పెట్టాలి. బట్టలకు సబ్బెట్టి ఉతికి ఆరబెట్టాలి.. అన్నింటికన్నా ముందు ఇప్పుడు ఈ బియ్యంలో రాళ్లు ఏరి పెట్టాలి' అదీ మీ పిన్ని నాకు జారీ చేసిన  హుకూంరా  హనుమంతూ! ఏ 'సరళతర విధానం' అవలంబించి ఈ పనులన్నీ చక చకా  తెముల్చుకుందామా! అని ఇందాకట్నుంచీ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇదిగో.. ఇంతలోనే నువ్వొచ్చేసావు! ఇంద.. నువ్వూ ఈ చేట చేత్తో పుచ్చేసుకో!'
'ఈ బియ్యంలో రాళ్లు ఏరే కన్నా.. రాళ్ళలో బియ్యం ఏరడం సులభం లాగుంది   బాబాయ్! అదే ప్రస్తుతానికి నీవు అవలంబించవలసిన 'సరళతర' విధానం కూడానూ!
'మా బాగా చెప్పావురా బుజ్జిగా! ఈ దుకాణాలవాళ్ళు బియ్యంతో వ్యాపారం చేస్తున్నారో.. రాళ్ళతో వ్యాపారం  చేస్తున్నారో బోధ పడకుండా ఉందిరా!'
'అర్థమయిందిలే బాబాయ్ ఇప్పుడు ఈ 'ఈ వే డూ బి' అంతరార్థం.  ఐ మీన్  'సరళతర వ్యాపార నిర్వహణ' మూలసూత్రం!'
'ఛ!.. చ! ప్రపంచ బ్యాంకు ఇలాంటి  చేటలో బియ్యం చెరిగే  విధానాలను గురించి  ఎందుకు నివేదికలు తయారు చేస్తుందిరా తిక్క సన్నాసీ? పెద్ద పెద్ద  వ్యాపారాలు చేసుకునేందుకు ఉన్న వెసులుబాట్లను బట్టి వివిధ దేశాలకు అది ర్యాంకులిస్తుంటుందిగానీ ప్రతి ఏటా. ఆ ర్యాంకుల్ని ఆధారం చేసుకొనే   వ్యాపారస్తులు ఏ ఏ దేశాల్లో పెట్టుబళ్ళు పెడితే గట్టి లాభాలు గుంజుకోవచ్చో  ఓ అంచనాకొస్తుంటారు'
'అట్లాగయితే .. మన దేశానికే మొదటి ర్యాంకు వస్తుండాలే!'
'వెనకనుంచి మొదటి ర్యాంకు రానందుకు సంతోషించు!   పోయినేడాది మనది  నూట ముఫ్ఫై నాలుగో ర్యాంకు ..నూట ఎనభై దేశాల పట్టికలో! ఈ సారేదో నాలుగు స్థానాలు ముందుకు జరిగాయనుకో! సింగపూర్ దే మొదటినుంచీ మొదటి స్థానం'
'అన్యాయం బాబాయ్! అంతా సింగపూరు సింగపూరు అంటూ చిందులేసే వాళ్లే కానీ.. మన దగ్గరున్నన్ని  సులువుసూత్రాలు  ప్రపంచంలో ఇంకెక్కడున్నాయి.. చెప్పు! ఈస్టిండియా కంపెనీ ఈ వెసులుబాట్లన్నీ లెక్కేసుసుకొనే కదా మన దేశాన్ని వెదుక్కుంటూ  వచ్చి మన నెత్తికెక్కిందీ!'
'ఆ పాత స్టోరీలన్నీ ప్రపంచ బ్యాంకు ముందు పరమ వేస్టురా అబ్బిగా?'
'పోనీ.. ఇప్పటి లెక్కలు చూసుకున్నా మనకే ఫస్టు ర్యాంకు రావాలి బాబాయ్ న్యాయంగా! సర్కారు భూముల్ని ఇంచక్కా ఆక్రమించి ఆకాశాన్నంటే భవంతులు లేపినా .. అడిగే నాధుడుండడు మన దగ్గర. తిక్క పుట్టి ఎవరైనా కోర్టు గడప తొక్కినా .. ఏ అపరాధ రుసుమో కట్టేస్తామని.. అఫిడవిట్టో అదేందో ఒకటి గీకి పారేస్తే సరి.. అంతా సెట్టైపోయినట్టే. ఆక్రమించిన భూములు అమ్ముకొనేటప్పుడు సెటిల్మెంటుకు ఏ ప్రజానేతో వచ్చి మోకాలడ్డినా ఓ శాతం మనది కాదనుకుంటే సరి..  అంతా ఓం శాంతిః.. శాంతిః.. శాంతిః!'
'ఆ మాటా నిజమేననుకో! వడ్డించే చేతులు మనవాళ్లవయేట్లు కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు.. తట్టెడు సిమెంటన్నా తయారవకముందే పది రూపాయల షేరు పదింతలు పెంచి రాత్రికి రాత్రి రాక్ ఫెల్లర్ తాతై పోవచ్చు'
'మరే! తుక్కు తవ్వుకునేందుకని అనుమతులు తీసేసుకొని ఉక్కు తయారయే సరుకు తవ్వుకున్నా చాలుగదా.. ఏడుకొండలవాడి నెత్తికి  కిరీటాలనేంటి.. పడుకొనే గదుల్లో పక్క ఎక్కేందుకు  వాడే ఎత్తుపీటలు కూడా ఇంచక్కా మేలిమి బంగారంతో మలాములు చేయించుకోవచ్చు'
'లెక్కలడిగే నోళ్ళు నొక్కి పారేసేందుకు విందులు.. వినోదాలు..   నాలుగు నోట్ల కట్టల సందు చూసుకొని  విసిరేయడాల్లాంటి  చమత్కారాలు చచ్చేటన్ని ఎటూ మన దగ్గర ఉంటాయిగదా!'
'వేలు దూరే సందిస్తే చాలు.. కాలు బార్లా చాపుకునే వెసులుబాట్లు వేలకు వేలున్నా మన దగ్గర మరి ఎందుకు  మరీ  ఇంత దిక్కుమాలిన దిగువ ర్యాంకులో మనల్ని తొక్కేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు?'  మంచి ర్యాంకు కొట్టేయాలంటే మరేదన్నా  మతలబు ఉందంటావా బాబాయ్?'
'ఏమోరా! దమ్ముండాలే కానీ దుమ్మూ ధూళితోనైనా సరే దుమ్ములేపే వ్యాపారాలు బ్రహాండంగా చేసిపారేసే వెసులుబాట్లు మన దేశంలో వీశలకొద్దీ వాడుకలో ఉన్న మాటా వాస్తవమే! ఒప్పుకుంటాగానీ.. ప్రపంచ బ్యాంకు వ్యాపార నిర్వహణ పెరామీటర్లకీ  పక్కదారి చిట్కాలు బొత్తిగా సెట్టవవేమోరా! టర్కీలో ఎప్పుడో రద్దయిన తుక్కునోట్లనుకూడా   ఇంచక్కా  కోట్లకిందకు మార్చేసే   చురుకు బుర్రలకైతే  లెక్కలేదిక్కడ!   గాలికీ వానకీ   ఎక్కడో శేషాచలం అడవుల్లో పడి  ఎదిగేవి ఇక్కడి  చందనం మొక్కలు!  పులులూ.. చలులూ అని కూడా వెరవకుండా ప్రాణాలకు తెగబడి మరీ   రెండు  దుంగల్ని  నరికి  ఏ చైనాకో జపానుకో తరలించి  నాలుగు డబ్బులు దండుకునే  రూట్లు ఎన్ని కనిపెట్టారు మన లోకల్ కొలంబస్సులు! కొత్త మార్గాలు కనిపెట్టారన్న కనీసమైన కృతజ్ఞతైనా లేకుండా  ఎన్ని ఎన్ కౌంటర్లు జరిపారో  వాళ్లమీద  ఈ గడ్డమీద!'
'రాత్రనక పగలనక వళ్లూ కీళ్లూ ఇరగ దీసి మరీ  సాధన చేసి గెలిచినా క్రికెట్ అటగాళ్లకు  చివరికి గిట్టేది ఓ కప్పు.. అదీ పదకొండు ఆటగాళ్లకీ కలిపి ఒహటి. కనీసం కాఫీ.. టీలు  పోసుకొని తాగేందుకైనా వీలు లేకుండా పొడుగు మూతిది.  వేలంపాట విధానం కనిపెట్టి ఆటగాళ్లూ వేలంపాట సరుక్కన్నా ఏమీ తీసిపోరన్న లాభసూత్రాన్ని కనిపెట్టిన లలిత్ మోదీనైనా బిజినెస్ మోడల్ గా చూసుకోవద్దూ!  ఆ అబ్బిని  దేశం  సరిహద్దులు దాటిందాకా తరిమి  తరిమి కొడితిమి గదా మనందరం కలసి! ఏటేటా అందమైన సుందరాంగుల శృంగార భంగిమలతో గోడకేలండర్లు పంచి పెట్టే అమూల్యమైన ఆలోచన   మాల్యా జీది.   బ్యాంకులకు అతగాడేవో  ముష్ఠి మూడువేల కోట్లు బకాయి పడ్డాడని దేశం దాటి పారిపోయిందాకా నిద్రైనా పోకుండా పహరా కాస్తిమి! ఆడంగులు.. పీనాసులు  పోపు డబ్బాల్లో.. పక్కగుడ్డల కింద సందుల్లో దాచుకున్న  చిల్లర సొమ్మునంతా బైటికి తీయించడమేమన్నా  సామాన్యమైన  చమత్కారమా? స్తబ్ధుగా పడున్న  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  ఒక్కసారిగా తట్టిలేపాడన్న   విశ్వాసమైనా    లేదు అగ్రిగోల్డు పెద్దాయనమీద దేశంలోని పెద్దలెవరికీ!'
'నిజమేరా!  నాలుగు డబ్బులు దేశానికి రాబట్టే  ఉపాయాలు కనిపెట్టే వ్యాపారస్తులమీదా న్యాయస్థానాలు సైతం అట్లా  అగ్గినిప్పులు కురిపిస్తుంటే.. ఏ గుండె నిబ్బరంతో విదేశాలనుంచి బిజినెస్ మాగ్నెట్లు  సముద్రాలు దాటి వచ్చి మరీ ఇక్కడ పెట్టుబళ్ళు పెడతారు!.. మదుపుదార్లకు  డబ్బులు చెల్లించే విషయంలో విఫలమై తీహార్ జైలు ఊచలు లెక్కించే  సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ రాసిన పుస్తకం ‘లైఫ్ మంత్రాస్’ వరల్డ్ బెస్ట్ సెల్లింగ్ బుక్ గా రికార్డుకెక్కింది. అయినా  ప్రపంచ బ్యాంకు అతగాడి వ్యాపార  సులువు సూత్రాలని లెక్కలోకే తీసుకోలా! ప్రపంచ బ్యాంకు పెరామీటర్లకూ  కొన్ని పరిమితులు ఉండిపోయాయనుకుంటా!'
'అలాగని.. అన్ని రకాల వ్యాపారాలకు తరగని గని వంటి మనదేశానికి ఇంత దిక్కుమాలిన ర్యాంకు ఇచ్చి కిందకు తొక్కేస్తే.. అరటి తొక్కల వ్యాపారం కూడా ఇక్కడ ఇంక ఎక్కిరావడం కష్టం కదా!బాబాయ్! అందరూ మన ఆంధ్రపత్రిక నాగేశ్వర్రావు పంతులుగారంత చురుగ్గా ఉండరు.. తలనొప్పి మందు అమృతాంజనాన్ని కూడా ఫ్రాన్సులాంటి దేశాల ఆడపిల్లలకి సౌందర్య సాధనం కింద అమ్మి సొమ్ము చేసుకోవడానికి!'ఈ కాలం 'ఈ-కాలం' అయిపోయింది. ఈ ర్యాంకుల గొడవొకటి కొత్తగా నెత్తిమీదకొచ్చి పడింది.   ఎలాంటి వ్యాపార  వెసులుబాటులో విస్పష్టంగా  చెప్పకుండా   వట్టిగా  'సరళతర వ్యాపార నిర్వహణ' అని ఒక పేరు పెట్టి  ర్యాంకుల పట్టికలు తయారు చేసేస్తుంటే.. ఎంత   మేథస్సు పొంగిపొర్లే పుణ్యభూమి అయినా   పైసా పెట్టుబడి పెట్టేందుకు  విదేశీయులే కాదు.. స్వదేశీయులూ ఛస్తే  ముందుకు  రారు'
' అందుకే కదరా ఇందాక మీ పిన్ని రాళ్ళేరమని ఇచ్చిన బియ్యాన్ని 'ఈజీవే ఆఫ్ డూయింగ్ బిజినెన్' పద్ధతిలో  రాళ్ళకు బదులు బియ్యం గింజలేరి ఇచ్చేసింది! ఇదిగో .. దాంతో చేసిన కిచిడీ! అందుకో!  రుచి చూడు! ఫలితం పాజిటివ్ గా ఉంటే   .. 'సరళతర  వ్యాపార నిర్వహణ' ప్రాజెక్టు రిపోర్టొకటి తయారు చేసి'   ప్రపంచ బ్యాంకుకి సమర్పించేటట్లు మన ప్రభుత్వాలమీద వత్తిడి పెంచేద్దాం!'
'బాబోయ్! పన్ను విరిగింది బాబాయ్! నీ బియ్యం కిచిడీ బంగారం కానూ!'
విరగదుట్రా మరి! బియ్యం  కిచిడీలో అన్నీ రాళ్లేనాయ మరి!'
 మీ బాబాయిగారి 'సరళతర వ్యాపార నిర్వహణవిధానం అలాగా ఏడ్చింది మరి! ఆడమనిషినని తీసి పారేయకుంటే తోచిన సలహా ఒక్కటిస్తాను. వింటే వినండి! ఈ దేశంలో  అపరిమిత లాభాలు గడించి పెట్టే సరళతర వ్యాపార నిర్వహణ' విధానాలు  సక్రమంగా పనిచేసే రంగం ఒక్కటే ఒక్కటి.. రాజకీయ రంగం. అందులో మీరెలాగూ రాణించే రకం కాదు గానీ.. లోపలికి పదండి.. మీకోసం రోలు.. పొత్రం ఎదురు చూస్తున్నాయి.. అట్లకి పిండి రుబ్బి పెడుదురుగానీ ఇద్దరూ కలసి!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం- ఈనాడుకి.. కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి ధన్యవాదాలతో)

Sunday, August 30, 2015

నల్ల ధనం ఓ సరదా గల్పిక--శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి

"నల్ల మందు తెలుసు. నల్ల ధనం ఏమిటండీ? ఎక్కడుంటుందండీ?
రాజ్యాంగంలోని 21 వ అధికరణ కింద పౌరులకు లభించిన గోప్యతా హక్కు ఎవరి కొంపైనా ఎలా ముంచుతుందండీ? రాజ్యాంగంలోని 32(1) అధికరణ ప్రకారం ఎలాంటి సమాచారం ప్రకటించలేమని  సర్కారు చేతులు ఎందుకు కట్టేసుకుందండీ? ఎన్డియే మొన్న మే మాసంలో సుప్రీం రిటైర్డు జస్టిస్ ఎం బి షా సారథ్యంలో ప్రత్యేక బృందాన్నిఏ తమాషా కోసం నియమించిందండీ? తొందరపడి ఎవరి  పేర్లనూ బైట వద్దని అసోచామ్ ఎందుకు అడుగుతుందండీ? ద్వంద్వ పన్నుల విధానం అంటే ఏమిటీ? అది దెబ్బతింటే దేశ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు ఏ విధంగా విఘాతం కలుగుతుందండీ? ఏ  ఆరోపణలు నిరాధారమైనవని తేలితే ఏ వ్యక్తులకు  అప్రతిష్ఠ ? నల్లధనానికి ఆస్కారంలేని వ్యవస్థాగత సంస్కరణలా.. అవేమిటండీ?"

పొద్దస్తమానం అలా  వార్తా పత్రికలు ముందేసుకుని  జోగుతుంటారు గదా  శ్రీవారూ..   చిక్కు ముళ్ళేమన్నా కాస్త విప్పుతారేమోనని దగ్గరికి వెళ్ళడిగా  బుద్ధి లేక పొద్దున్నే! ముడి అనుకున్నారో ఏమో పాడు.. హుషారుగా లేచి నిలబడి ఆనక  విషయం విని చారునీళ్ళల్లో అప్పడంలా చప్పడిపోయారు "ప్చ్.. అంతంత పెద్ద విషయాలు నీ కొద్ది బుర్రలో పట్టవులే  గానీ.. మీ ఆడాళ్ల కవసరమైన ముఖ్య సమాచారం  మాత్రం చెప్తా విను" అని మాట దాటేశారు.  'ఇక్కడ సంపాదించిన సొమ్మును ఇక్కడి లెక్కల ప్రకారం పన్నులూ పాడూ కట్టకుండా..  ఇక్కడే ఖర్చు పెట్టకుండా ఇంకెక్కడో దేశంలో పూడ్చి పెడితే దాన్ని  విదేశీ నల్ల ధనం అంటారని.. అధికారంలో కొచ్చిన వంద రోజుల్లో దేశాల్లో ఉన్న నల్లధనాన్నంతా తవ్వి తెచ్చి తలా ఒక పదిహేను లక్షలు దాకా  మోదీజీ పంచబోతున్నారనీ' మా వారు చెప్పిందాన్ని బట్టి నాకు అర్థమైన సమాచార సారాంశం. డబ్బు  పంచడం వరకూ సంతోషమే  కానీండి.. ఎక్కడ దాచుకోవాలో.. ఎక్కడ పూడ్చుకోవాలో.. సంపాదించుకునే వాడి ఇష్ట ప్రకారం కాదా ఉండేదీ!  ఇదేందీ.. ఇందులో   ఏదో మతలబు ఉంది.. ఎక్కడో తంతా ఉంది!
నాలుగు రాళ్ళు ఎక్కువొచ్చే చోట.. ఇచ్చిన సొమ్ముకు కాళ్ళు రావన్న గట్టి నమ్మకం ఏర్పడ్డ చోట చూసి మరీ చక్రవడ్డీకి  అప్పులిచ్చేది మా ఊళ్ళో వెంకాయమ్మ గారు. మా పేట ఆడాళ్ళందరికీ ఆమే ఆడ చంద్రబాబు. గవర్నమెంటుకు చెప్పనంత మాత్రాన ఆమె దగ్గరున్న  చీటీపాటల డబ్బంతా   నల్లసొమ్మై పోతుందా.. విడ్డూరం కాక పొతే! ఆ మాటే మా ఇంటాయనతో అంటే ఆయన గారేమో  తల గోడకేసి మోదుకున్నారు. "నన్ను చంపక..  పోయి కప్పు కాఫీ పట్రా! అసలే ఇక్కడ నే టెన్షన్తో   చస్తూంటే మధ్యలో నీ టీవీ చర్చలు!" అని విసుగూ! వివరంగా చెప్పే విషయం కరువైనప్పుడల్లా ఇలా కరవ రావడం మా వారికి  జగన్ బాబుకు మల్లే మామూలే లేండి! సరే!.. మా సంబడాలకేం గానీ.. ముందీ నల్లధనం సంగతే ఏందో తేల్చాలి. 

ఈయన గారొచ్చి వివరించక పోతే మహా  మనకిహ లోకంలో తెలిసే మార్గాలే కరువా! ఇంట్లో ఆయన  చూసే  టీవీనే నేనూ చూసేది అంతకన్నా ఎక్కువ సేపు. ఆయన గారు చదివవతల పారేసే 'ఈనాడే' నేనూ ఆనక తిరగేసేది. కాక పోతే ఎప్పుడూ చూసే సీరియళ్లూ.. సినిమా కబుర్లూ కాస్త పక్కన పెట్టి ఈ నల్లదనం  మీదా సారి దృష్టి పెడితే సరి.. సర్వం మనకే అరటి పండు వలిచినంత సులువుగా  అవగతమయి పోతుంది.

అవగతమయింది కూడాను. ఓస్! ఇంతోటి భాగ్యానికే ఇన్ని రోజుల బట్టీ దీని మీదిన్ని  కుస్తీ పట్లా! వ్యవహారం సుద్దపిక్కతో ముగ్గేసినంత సుబ్బరంగా కనిపిస్తుంటేనూ! ఓపిక .. సావకాశం ఉన్నవాళ్లేవేవో.. నానా అగచాట్లు పడి.. నాలుగు డబ్బులు గడించారే అనుకోండి.. పోనీ  అది డబ్బు కాదబ్బా.. గడ్డే అనుకుందాం.. ఎవరు మాత్రం  తినడం లేదీరోజుల్లో గడ్డీ గాదంపన్నులు కట్టనంత మాత్రాన పచ్చ నోటు ఎలా నల్లబడుతుందో నా బుర్రకింకా ఎక్కటం లేదమ్మా!

ఏనుగు బరువేయబోతే  చీమైనా ఏం చేస్తుంది? పుట్టల్లోనే నక్కుంటుంది. వేలు పెడితే ఠక్కుమని కుట్టేస్తుంది కూడానుకాల్చినా కాల్చకున్నా మనం పాత బకాయిల్తో సహా కరెంటు బిల్లులు  చచినట్లు కడుతున్నామంటే తప్పించుకునే మరో దారి లేకే గదా!  దారేదో  ఓటి ఉంది కాబట్టే   సంపన్నులంతా తమ సంపాదన్ని  దేశం దాటించేస్తున్నారు! దారి నెందుకు మూసేయడం లేదన్నదే నా పాయింటు. ఎప్పటికప్పుడు ఏవో లోపాయికారీ వ్యవహారాలు అవీ పెట్టేసుకుని.. చూసీ చూడనట్లు పోనిచ్చి..  ఓట్లేసే బికార్ల మెప్పుకోసం విదేశీ నిధులంటూ.. అక్రమాస్తులంటూ అల్లరి పెడతారా!  నెలరోజుల బట్టీ చూస్తున్నా.. విచిత్రం! ఒక లెక్కా పత్రం ఏదీ  లేనట్లుంది ఈ నల్లధనలక్ష్మి ఆకార వికారాలకి!   ఒకడు లక్ష కోట్లంటాడు. ఒకడు అర లక్ష ఖాతా లంటాడు. ఒకడు అర్థ శతాబ్దంబట్టీ సాగే లోపాయికారీ వ్యవహార మంటాడు. పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీని.. పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీని తప్పులు పడుతున్నారు. అసలు నల్ల ధనంలో ఉన్నతప్పేమిటో  ముందు తేల్చమని నాకైతే సుప్రీం కోర్టు కెళ్ళాలన్నంత కచ్చగా ఉంది.

'గట్టిగా వాగబోకే పిచ్చి మొహమా! ముందే కోర్టుల్లో నలుగుతున్న వ్యవహారాలివన్నీ! ఎతిమతంగా ఏదన్నా వాగితే నిన్నూ మూసేస్తారు" అని మా వారి రుసరుసలిక్కడ. నేనెప్పుడు  జైలుకెళ్లి చిప్పకూడు తింటానా అని ఈయనగారికీ  తహతహ లాగుంది చూస్తుంటే!

రోజులు బొత్తిగా బాలేవని నాకు మాత్రం తెలీదా? ఎప్పుడో వాడేసిన సర్కారు సొమ్ముకు ఇప్పుడు లెక్కలడిగి  బెంగుళూర్లో చిప్పకూడు తినిపించారా జయలలితమ్మ చేత.   తుఫాను మీదెవడో పిల్లాడు తెలిసీ తెలీక అవాకులూ చెవాకులూ వాగాడని  లోపల వేసేసారు! నేనేమంత మరీ యతిమతం దాన్ని కాదు. అయ్యొరామా! ఇంట్లో నాలుగ్గోడల మద్యా  మనసులోని ముచ్చట్లను కూడా  బైటపెట్టుకునే రాత లేకపోతే ఇహ ఈ సంసారమెందుకంట? టింగురంగా అంటూ బైట తిప్పుకుంటూ తిరుగుళ్లెందుకంట?

అహ.. మాట వరసకే అనుకుందాం. మా వారు మహనల్లగా ఉంటారు. అయినా మరీ ఏమంత దుర్మార్గులు కారే! నలుపంటే నాకూ ఏమంత పడి చచ్చే మోజు లేదు కానీ.. పన్ను కట్టని సొమ్ముకి  నల్ల ధనమని పేరెట్టి ఇలా అల్లరి పెట్టడడమే  ఏం బావోలేదని నా ఉద్దేశం.

నల్ల సముద్రం.. మన గుంటూరు నల్లచెరువుల్నేమన్నా మనం అపవిత్రమను కుంటున్నామా? బొగ్గంటే నల్లబంగారం అంటారు మా వారు. నలుపు నారాయణ స్వరూపం. రాముడు నీలమేఘ శ్యాముడు. కృష్ణుడు నల్లనయ్య. మన కంటిగుడ్డు నలుపు. కాటుక నలుపు. నల్లద్రాక్ష యమ  తీపి. మా చెల్లాయి  జడ నాగుబాములా నల్లగా నిగనిగలాడుతుండ బట్టే కదా మరిదిగారు కాణీ కట్నం లేకుండా చేసుకున్నదీ! దిష్టి తగలకుండా పసిబిడ్డ బుగ్గకి పెట్టే చాదు బొట్టు నలుపే కదండీ! శివరాత్రి అవావాస్యనాడొస్తుంది. దీపావళిదీ అదే తంతు. 'నల్ల' అంటే అరవంలో బహు బాగని అర్థంట. మా పక్కింటి ఆండాళమ్మగారు మా పిల్లను  పట్టుకుని పద్దస్తమానం 'నల్ల పొన్ను.. నల్ల పొన్ను' అని తెగ మెటికలిరిచుకుంటుంది.   పచ్చ నోటును పట్టుకుని నల్లడబ్బనడమే.. అన్యాయంగా ఉంది!

'తెలుపో..నలుపో.. జాన్తానై.. తేడా లిక్కడ లేనే లేవ్' అని సినిమాల్లో ఎన్ టీ ఆర్ చిందు లేసినప్పుడు చప్పట్లుకొట్టి.. ఇప్పుడేమో  నల్ల డబ్బునుగురించి .. నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడ్డం తగదన్నది  నా పాయింటు!

'ఇప్పుడీ  మహాతల్లి నల్ల ధనాన్నిలా వెనకేసుకొస్తుందేందిరా కామెడీగా!' అని మీరు విస్తుపోతున్నారని తెలుసుఉన్న మాట అనుకుంటే కామెడీగానే ఉంటుంది మరి! దార్నే పోతుంటే   రూపాయి బిళ్లే మీ కంట బడ్డదనుకోండి. ఎవరూ చూడకుంటే మీరు మాత్రం లటుక్కని తీసి  పర్సులో వేసుకోరూ! అసలుమనిషి  వచ్చి అడిగినా తిరిగిచ్చెయ్యడానికి ప్రాణం ఉసూరుమంటుందే! మరి అన్నేసి లక్షలు.. కోట్లు ! ఎట్లా సంపాదించారన్నది ఆనక.. సారి 'మనదీ' అనుకున్నాక  సొమ్మూ సమ్మంధమూ లేకుండా  మధ్యలో సర్కారోడొచ్చి  పన్నులూ పాడూ  కట్టమంటే.. ఎవరికైనా  మనసుక్కంష్టంగానే  ఉంటుంది కదండీ!

ఇవాళ ఆ జైపూరియానో, లోధీనో, టింబ్లోనో.. పేర్లే సరిగ్గా మన నోటికొచ్చి చావవు .. ఐనా  నోటికొచ్చినట్లు తిట్టి పోస్తున్నాం! న్యాయమా! రేపు మన ఊరి పెద్ద మనిషే.. మన పక్కింటి రామనాథమే.. మన పొరుగూరి పుల్లమ్మక్కే ఈ జాబితాలో దర్శనమీయచ్చు. కోర్టువారి దగ్గర ఆంజనేయుడి తోకంత జాబితా ఉందంటున్నారు మావారువిడతల వారీగా విఛారణ లుంటాయంట. ఏ రోజు పేపర్లో ఎవరి పేరొస్తుందో.. ఏ పూట ఎవడి పుట్ట ఠపాల్మని పేలిపోతుందో.. ఏ క్షణంలో ఎవరి చరిత్ర అందరం చదివే  పుస్తకం తంతవుతుందో.. ఎవరికి తెలుసు?
ఎన్నో విచిత్రాలు నిత్యం జరిగే ఈ పుణ్యభూమిలో  టీలమ్ముకునే పిల్లాడు ప్రధాని మంత్రవలా?   మునుపటి ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పెద్దమనిషి   తాడుతెగి  సంపాదనంతా నల్ల ధనమని తేలి  చివరికి సర్వం కోలుపోయి టీ నీళ్లక్కూడా దేబిరించ వచ్చు.   రాష్ట్రం సరిహద్దులు దాటే పప్పు ధాన్యాల లారీని పట్టుకోలేక పోవచ్చు గానీ.. సర్కారు తలుచుకుంటే పాకిస్తాన్లో దాక్కున్నా దావూద్ ఇబ్రహీం  గడ్డం పట్టుకు లాక్కురాగల్దు. స్విర్జర్లాండులో పుట్టక పోవడమే డబ్బున్న వాళ్ళ  తప్పంటే ఇహ చేసేదేమీ లేదు.

ఉన్నవాడికే కదా పన్నుల  బాధేంటో బోధ పడేది. చెల్లని పావలా కూడా మిగల్చుకోలేని   మా ఎదురింటి  కుచేల్రావూ నల్లకుబేరులని తూలనాడే వాడే!
దొంగసారా వ్యాపారం చేసి కోట్లకు పడగ లెత్తాడు మా అంకయ్య మామ. సాని పాపల్నితార్చి శరణాలయంపైన అంతస్థుల్లేపాడు మా  బల్లిశాస్త్రి బాబాయి. ఇసుకలో దుమ్మే కలిపాడో.. దుమ్ములో ఇసకే పోసాడో.. ధర రెట్టింపయిందాక దాచి కొత్త రాజధాని వస్తుందని ఆశల్లేవంగానే   బంగారం రేటుకు అమ్మేసాడు మా వీధి పచారీ కొట్టు సుబ్బయ్య శెట్టి. ఎవరూ బొట్టెట్టి  పిలవక పోయినా..లోకుల  వ్యవహారాల్లో బలవంతంగా దూరి సెటిల్మెంట్ల వంకతో సింహభాగం కొట్టేసే కోటిరెడ్డి కోట్లకు పడగలెత్తిన కథ మా వాడంతా రామాయణంలా పారాయణం చేస్తుంటాం అందరం. వాళ్లంతా  తలా రాజకీయ పార్టీలో దూరి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు  ఓట్లడుక్కోడానికని  వస్తే  అంతటా 'ఓహో.. ఆహోఅన్న నోళ్ళే కానీ.. నొసళ్ళూ ఒహళ్ళూ చిట్లించిన పాపాన పోలేదు! ఐన కాడికి నాలుగు రాళ్లు వెనకేసుకునే సదవకాశం ఇదేనని .. ఇంట్లోనూ  ఈయనగారు  లక్షా తొంభైసార్లు తహ తహ లాడారు. మళ్లా పొద్దున్నేపత్రిక  రాగానే నల్లకుబేరుల జాబితాలో కొత్త పేర్లేవీ బైటపడటం లేదని పెదవి విరుపులు! ఎవరికీ చట్టమంటే పట్టడం లేదని.. కారాలు..మిరియాలు!!

అహ.. నాకు తెలీక అడుగుతున్నా గానీ    పేర్లు బైట పెడితే ఏమవుతుందంట? రాత్రికి రాత్రే ఆ కొచ్చారియాలు, జైపురియాలు.. సెలబ్రటీలై పోడానికా! గ్లోబల్ యుగమో ..  పాడో..  వార్తొచ్చిన ఉత్తర క్షణంలోనే ఉత్తరమెరికా నుంచి దక్షిణాఫ్రికా అడవుల దాకా పేర్లు పాకిపోతున్నాయీ మధ్య మరీ! పుట్టిన అప్పలపాలెంలోనే మొహాలు సరిగ్గా తెలీని డిప్పకాయలంతా ఇట్లాంటి లప్పనమేదో తగిలి గొప్పోళ్లై పోవడమే తప్ప ..    వాళ్ల  ముల్లేమన్నా మన చిల్లుజోలెల్లో వచ్చి  పడబోతుందా? నల్లధనంమీద నడిపించే 'బ్లాక్ మెయిల్' కాదూ ఇదంతా!

డబ్బున్న పెద్దమనుషులతో వ్యవహారాలు! ఎన్ని చూసుకోవాలిఎంత గడ్డి కరిస్తే కూడిందో ఈ ముదనష్టం! ఎన్నాళ్లని మురగ బెట్టిందో.. ఎందరెందరి  కొంపలు కూల్చి పేర్చిందో.. ఎక్కడెక్కడి గనులు తవ్వినవో.. ఎన్ని వ్యాపారాలకు, కంట్రాక్టులకు   తెగిస్తే అంత సొమ్ము  పోగయుంటుందీ!  అడగంగానే చూపించేసెయ్యడానికి ఇదేమన్నా పెళ్ళి ఆల్బం ఫొటోలా?
నాలుగు డబ్బులు బ్యాంకులో పోగయితే చాలు  అదేదో సుమతీ శతకంలో చెప్పినట్లు బెల్లం చూట్టూ ఈగల్లా మూగి పోతారు బంధు మిత్రులు. కాదంటే కారాలు.. లేదంటే మిరియాలు! చే బదుళ్లు ఇచ్చుకుంటూ కూర్చోడానికా ఇన్నిన్ని చేదనుభవాలతో   ఆర్జించిందీ! ఊరూ పేరూ కూడా తెలీని దేశాలదాకా  పోయి డబ్బలా  వూరికే పూడ్చి పెడతారా ఎవరైనా?

'ఎలుక తోక నలుపు. ఎందాక ఉదికినా తెలుపుకి తిరగేది కాదద'ని మన యోగి వేమనగారు ముందే చెప్పారు. చెవిన బెట్టే నాథుడేడీ?

ఆటల్లో మనమెలగూ పోటీకి పోలేము. పరిశోధనల్లో సైతం మన ప్రోగ్రెసు అంతంత మాత్రంగా ఉంది. అందాల పోటీల్లో గడపదగ్గరే  తూలుడు. వ్యాపారాల్లోనైతే  చైనా జపాన్లదే  ముందడుగు. ఒక్క ఈ నల్లకుబేరుల జాబితాలోనే  మనది ముందు వరసలో స్థానం. దానికీ ముప్పం తెచ్చుకునే  పనులు ముమ్మర మవుతున్నాయి. అదే బాధ

అత్తగార్లకు సంఘాలునాయి. అడుక్కునే వాళ్లకు సంఘాలున్నాయి. ఆఖరికి తాగుబోతు దేవదాసులు సైతం సంఘటితమై మత్తు హక్కులకోసం పోరాడుతున్న దేశమిది. సంఘమూ పెట్టుకోడానికి ఆస్కారం లేదనేగా నల్లకుబేరుల మీదింత విలయ తాండవాలు!

నల్లఖాతాలెవరో ఖాతాదారులకు తెలుసు. డబ్బు దాచుకున్న బ్యాంకులకూ  తెలుసు. గతపాలకుల కాలంలోనే జాబితా వచ్చింది కాబట్టి నాటి ప్రముఖులందరికీ  నల్లపేర్లన్నీ కంఠతా వచ్చుండచ్చు. నాటి జాబితానే నేటి ప్రభువుల చేతిలోనూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నేతలందరికీ లోపాయికారీగా పాపులెవరో తెలిసుండచ్చు. కోర్టు సమర్పణలూ ముగిసాయి  కాబట్టి అక్కడి  యావత్ సిబ్బందికీ ఆ పేర్లన్నీ  కంఠోపాఠంగా నాలికమీదే ఆడుతుండవచ్చు. విచారణకని దిగిన సిట్టో.. స్టాండో .. వాళ్ల కార్యాలయాల్లో మాత్రం జాబితాలోని ప్రతి వివరమూ  చక్కర్లు కొట్టకుండా ఉంటాయా? ఇక తెలియని దెవరికమ్మా? యావత్ వ్యవహారంతో ఏనాడూ   సంబంధమూ  లేని.. సాధారణ పాటకజనానికి.. మీకూ.. నాకూ!
కోర్టుల్లో కేసులు రుజువై శిక్షలు ఖాయమైన పురచ్చి తలైవి ఫొటోలే చట్టసభల గోడల మీదనుంచి ఇంకా   కిందకు దిగలేదు. ఓటర్లకి తెలీకుండా ఎన్నెన్ని వ్యవహారలిక్కడ గుట్టు చప్పుడుగా చక్కబడటం లేదూ! శతకోటి బోడిలింగాల్లో నల్లధనం  ప్రహసనం ఒహటీ!

'చిట్టచివరి  చిట్టాలో ఆరొందల పై చిలుకు పేర్లున్నాయోచ్!  కోర్టు గడపల దాకా వచ్చాసాయోచ్!'  అని గంతులేస్తునారీ మధ్య మా ఇంటి హనుమంతులవారు. సరే.. మన సోమ్మేం పోయింది మధ్యలో!   సీల్డు కవర్లు.. సిట్టులు.. స్టాండప్పులు.. అన్నీ తట్టుకుని.. ఆ నల్లమొత్తాలు మొత్తానికి మన దేశంలోకి  తరలివస్తే అదీ మరో అద్బుతమే!
మోదీగారు తలా ఓ ఐదులక్షలిస్తానన్నారు గాబట్టి.. మా వారి  వాటాతో ఇంచక్కా వడ్రాణం చేయించుకోవచ్చు! నా వంతంటారా! అది స్త్రీ ధనం. నల్లధనంతో మల్లే ఆడుకుంటానంటే మాడి మసై పోతారు ఎంతటి వారైనా!*
-శ్రీమతి గుడ్లదొన సరోజినీదేవి
(సారంగ- అంతర్జాల పత్రికలో ప్రచురితం)










మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...