Showing posts with label Movies. Show all posts
Showing posts with label Movies. Show all posts

Sunday, December 12, 2021

మానవతావాది చార్లీ చాప్లిన్‌ -కర్లపాలెం హనుమంతరావు

                                           

వదులు పంట్లాం, ఇరుకు కోటు, పెద్ద సైజు బూట్లు, నెత్తిమీద చాలీ చాలని టోపి, ఫ్రెంచ్‌ కట్‌ మీసాలు,  వంకీ కర్ర, వంకరటింకర నడక, బిత్తరచూపులు- చూడంగానే  నవ్వొచ్చే ఆ ఆకారానికి వేరే పరిచయం అవసరమా?  అవును..ఈ విచిత్ర హావభావాల ఏకైక పేటెంట్ హక్కుదారుడు.. మీరూహించినట్లు  చార్లీ చాప్లినే. కనుమరుగై మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా మన మనసుల్లో అతగాడు చిరంజీవి. మురికివాడల్లో పుట్టుక. కఠోర  దారిద్య్రం మధ్య పెంపకం. అషకష్టాలు చాలా చిన్నవి అతను పడ్డ కష్టాల ముందు. కోట్లకు పడగలెత్తిన ఈ హాస్యనటుడికి తల్లి కుట్టు మిషను.  నాటకాలే బాల్యంలో ఆసరా.  తండ్రి ప్రేమ తెలియదు. ఒక నాటకంలో భాగంగా పాట పాడుతుండగా గొంతు జీరబోయిన తల్లిని అభాసు పాలవకూండా కాపాడిన పాటే చాప్లిన్ ఆరంగేట్రం మొదటి ఐటం సాంగ్. ఆనాడు  చిల్లరతో రాలిన నవ్వ్వులనే జీవితాంతం నమ్ముకున్న విశ్వ కళాకారుడు చార్లీ. విధంగా అనుకోని పరిస్థితులు ఐదేళ్ల చాప్లిన్‌ను స్టేజి ఎక్కించాయి. తల్లి ఆర్యోగం పూర్తిగా క్షీణించి మనోవ్యాధికి గురికావడంతో ఆమెను పిచ్చాసుపత్రిలో చేర్పించారు. తల్లితోడు కూడా లేక పోయేసరికి అనాధ శరణాలయంలో పిల్లలను చేర్పించడంతో వారు అక్కడ అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. రెండేళ్ళ తరువాత తల్లి మానసిక వ్యాధి నుండి కోలుకుని చాప్లిన్‌ను ఒక డ్యాన్స్‌ బృందంలో చేర్పించింది. స్వతహాగా కళాకారుల కుటుంబం నుండి వచ్చిన చాప్లిన్‌ నృత్యంతో పాటు అనేక కొత్త రూపాలను ప్రదర్శించేవాడు.

 

బాల్యంలోనే ఇన్ని కష్టాలను చవిచూసిన చాప్లిన్‌ ఎప్పటికయినా నటుడు కావాలన్న లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. పొట్టకోసం అనేక రకాల పనులు చేస్తూ తన లక్ష్య సాధన కోసం కృషి చేస్తూనే ఉన్నాడు. క్రమంలో ఒక నాటక సమాజంలో వచ్చిన అవకాశాన్ని తన సహజమైన నటనా కౌశలం ఉపయోగించి ఆకట్టుకున్నాడు.ప్రపంచంలో అనేక నగరాలలో ప్రదర్శనలిచ్చాడు. 'కీస్టోన్‌ కాప్స్‌' అనే అమెరికా కంపెనీ ఆయన ఆద్భుత నటనకు మెచ్చి హాస్య చిత్రాలలో అవకాశం ఇచ్చింది. అవి మూగ చిత్రాలు, కళ అంటూ ఏమీ ఉండదు. దాన్ని దీన్ని గుద్దుకోవడం తన్నుకోవడం, క్రిందపడటం జనాన్ని నవ్వించడం ఇవి సినిమాల్లో ఉండేవి. ఎవరెక్కువగా నవ్విస్తే వారే హీరోలు, మొదటగా చిత్రాలలో చాప్లిన్‌ నటించారు.ఆయన నటించిన చిత్రాల్లో దేశ దిమ్మరి(1915) ఆయనకు శాశ్వత కీర్తినార్జించిపెట్టింది. చిత్రంలో ఆనాధ బాలుని పెంచటానికి పడ్డ పాట్లు ఎంతగా నవ్విస్తాయో, అంతగా సామాన్యుని బాధామయ జీవితాన్ని చూపిస్తాయి. చిత్రం ఆయనకు ప్రపంచ దేశాల్లో గొప్ప పేరును తీసుకువచ్చింది.

 

ప్రజా కళాకారుడిగా చాప్లిన్‌ నాటి భౌతిక పరిస్థితులకు స్పందిస్తూ తీసిన చిత్రం ''మోడరన్‌ టైమ్స్‌''. చిత్రంలో ఆధునిక కార్మికుడు యంత్రాల కోరల్లో చిక్కుకొని ఎలా నలిగిపోతున్నాడో, కార్మికుల సృజనాత్మకతను దెబ్బతీసి యంత్రంగా ఎలా మారుస్తున్నారో, కార్మికుల రక్తాన్ని ఎలా జలగల్లా పీలుస్తున్నారో వివరిస్తూ చివరకు కార్మికుడికి మిగిలేది. ఆకలి, దారిద్య్రం, మానసిక ఆందోళనలేనని వ్యంగ్యంగా వివరిస్తాడు. దీనితోపాటుగా అన్నం తినే సమయాన్ని కూడా తగ్గించటానికి తిండి తినిపించే ఆధునిక యంత్రాన్ని ప్రవేశపెట్టిన యజమానుల దురాశనూ, కార్మికుల శ్రమ దోపిడీకి వారు చూపే ఆత్రుతను వ్యంగ్యంగా విమర్శించాడు.అమెరికా పెత్తందారీతనం కార్మికులను, కమ్యూనిస్టులనే కాకుండా చార్లెస్‌ను కూడా వదలలేదు. చార్లెస్‌ మోడరన్‌ టైమ్స్‌ ద్వారా ప్రారంభమైన దాడి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక సభలో రష్యన్‌లను సమర్ధిస్తూ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడతాడు. దీనితో చార్లెస్‌పై అమెరికా దాడి పెరిగింది. దాడి ఎంతగా సాగిందంటే చివరకు ఆయన ఆదేశాన్ని విడిచిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా ప్రభుత్వం చార్లెస్‌కు కమ్యూనిస్టు ముద్రవేసి రీ-ఎంట్రీ అనుమతి కూడా ఇవ్వలేదు.

 

చార్లెస్‌ తీసిన ప్రతి సినిమాలోనూ మానవతాదృక్పథం, సమకాలీనత, సమస్యలపై స్పందన కనిపిస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రజలను ఆలోచింపజేసేదిగా ఉంటుంది. ఒక సినిమాలో (దిగ్రేట్‌ డిక్టేటర్‌) ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మన విజ్ఞానం మనల్ని అనుమానాల పుట్టలుగా మార్చిందని, మన తెలివితేటలు కఠిన హృదయాలుగా మార్చాయని, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తున్నామో అంత తక్కువగా స్పందిస్తున్నాం అంటారు.

ప్రపంచాన్ని గడగడలాడించిన రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైన నరరూప రాక్షసుడు అడాల్ఫ్‌ హిట్లర్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో తీసిన సినిమా ''ది గ్రేట్‌ డిక్టేటర్‌''(1937). ఆవిధంగా సామ్రాజ్యవాద వ్యతిరేకిగా, ప్రపంచశాంతి కోసం తపించిన మానవతావాదిగా, దోపిడీకీ వ్యతిరేకంగా పోరాడిన పేదల పక్షపాతిగా, మహా కళాకారుడిగా చార్లెస్‌ నిలిచిపోతాడు.''భౌతిక పరిస్థితులు మారనంతకాలం జీవిత వాస్తవాలు మారవు'' అంటాడు. అందుకేనేమో అతని సినిమాలో ''కళా విలువలు-వాస్తవికత'' రెండూ కనిపిస్తాయి.

-కర్లపాలెం హనుమంతరావు

 

Thursday, February 18, 2021

మహాత్ముడూ మామూలు మనిషే! కానీ మన కళ్లాకు కాదు! వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

 


 

గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా ఓవర్ భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.

కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది. 

అటెన్ బరో 'గాంధీచిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద,వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటేనిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట  గ్యారంటీ!

వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీగా మొదలై .. బాపూజీగామహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. 

గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని పెళ్లి చేసుకునిఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగాను  అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశానికి తిరుగుముఖం పట్టింది. 

దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా  వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటాను'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక పూట ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుందిఅంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు. 

మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల్ ఉద్దేశం. 

బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలుఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?! 

ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడుసీత,ఆంజనేయుడు వంటి ఎన్నో పౌరాణిక  పాత్రలకూ తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!

-కర్లపాలెం హనుమంతరావు

19 -02 -2020

(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)

***

Friday, July 24, 2020

వేటూరి పాటలతో ఆట



వేటూరి ఓ  పాటలోని  చిత్రమైన చతురత
సినిమా పాటలంటే సాహిత్యపరంగా పల్చగా ఉంటాయన్న చులకన భావం సాహిత్యంలో ఓ మాదిరి లోతు  పాతులు తమకు తెలుసును అనుకునే వాళ్లకి మనసులోనైనా కొద్దిగా కద్దు. (నాకూ ఒకానొకప్పుడు ఆ మాద్రిరి భావం ఉండేది, రవి వీరెల్లి గారి అంతర్జాతీయ మాసపత్రికలో ఆ అంశం మీద ఒక సినీరచయిత సాగించిన చర్చలో కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించినట్లు గుర్తు. ఇప్పటికీ ఆ భావనలో మార్పు అంతగా లేదు. కానీ  గత కాలపు సినీకవులు కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర.. ఆత్రేయ  .. మరీ  ముఖ్యంగా వేటూరి వంటి విద్వత్ కవుల  కలంపోటుల్లో మాత్రం  తరచి చూసే ఓపిక ఉన్నవాళ్ల కళ్లకి తరచూ  మెరుపులు తటిల్లుమని మెరిసి మురిపిస్తాయి. తార్కాణానికి ఒక మచ్చు తునకః శంకరాభరణం- ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణము- అనే పాట. ఆ పాటలోని - 'రసికుల కనురాగమై, రసగంగలో తానమై(స్నానం చేసి), పల్లవించు సామవేద మంత్రము'  అనే చరణంలో   సంగీతానికి ముఖ్యప్రాణులైన రాగం, తానం, పల్లవి- అనే మూడు పదాలను(అనురాగంలోని 'రాగం'; రసగంగలో చేసిన 'తానం'- సామవేద మంత్రం పల్లవించడంలోని 'పల్లవి'- పట్టు పీతాంబరంతో చుట్టిన   చందన గంధపు చితుకుల చందంగా దాచి మరీ వాడిన చతురత సుందరమూర్తిది.!  ఈ మూడు పదాలే ఆనక మరో పాట పల్లవికి తొలి పాదంగా మారడం అదనంగా అలరించే ముక్తపదగ్రస్తమంతటి చిత్రాలంకారం కూడా కదా!
-కర్లపాలెం హనుమంతరావు

***

Wednesday, February 19, 2020

మహాత్ముడు మామూలు మనిషి కాదా.. మొదట్లో? -కర్లపాలెం హనుమంతరావు






గాంధీజీ పోరాటం చేసింది తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా. ఆయన తపించింది తెల్లవారితో సమరం చేసే సమయంలో హింస వైపుకు మళ్లరాదనే నియమం కోసం. గాంధీజీని క్రమంగా బాపూజీగా..  మహర్షిగా మార్చివేసింది భారతీయులలో అతని పట్ల పెల్లుబుకుతూ వచ్చిన వ్యక్తిగత ఆరాధన. అదే చివరికి  దైవభావనగా మారింది. బాపూజీ బతికి ఉన్నరోజుల్లోనే ఈ తరహా  భావోద్వేగాలు పొడసూపినా తన దృష్టికి వచ్చిన ప్రతీసారీ గాంధీజీ నిర్ద్వందంగా ఖండించేవారు.   అయినా ఆయనకు మరణానంతరం ఈ దైవరూపం తప్పిందికాదు.
కానీ.. జాతికి ఇంత సేవ చేసిన గాంధీజీకి  ఇన్ని కోట్ల మంది   భారతీయులలో  కనీసం కృతజ్ఞతగా ఒక్కరికైనా  చక్కని చలనచిత్రం ద్వారా నివాళి అర్పిద్దామన్న మంచి ఆలోచన తట్టలేదు! చివరికి బాపూజీకి  వెండితెర మీద దర్శన భాగ్యం కల్పించింది ఒక తెల్లవాడే .. అటెన్ బరో! స్వదేశీ ఉద్యమాన్ని అత్యంత విజయవంతంగా నడిపించిన  గాంధీజీని ఆ పాత్రలో మెప్పించింది ఒక విదేశీయుడు.. బెన్ కిన్స్ లే! అదొక పారడాక్స్!  కాని ఒకందుకు  అదే మంచిదయిందనిపిస్తుంది.
అటెన్ బరో 'గాంధీ' చిత్రం బ్లాక్ బస్టర్ అయిన తరువాత ఆ సినామా వసూళ్లలో వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం పేద, వృద్ధ కళాకారులు ఎందరికో నెల నెలా పింఛనులా ఆర్థికసాయం అందించారు చాలా కాలం. బాపూజీ ఆదర్శాలకు అనుగుణంగా ఆయన పోయిన తరువాత కూడ కొంత మంచి పని జరిగిందన్న తృప్తికి ఆస్కారం కల్పించారు అటెన్ బరో బృందం. అదే భారతీయుల ఆధ్యర్యంలో గాని చిత్ర నిర్మాణం జరిగి వుంటే? నిర్మాతలు భారీ బడ్జెట్ అయిందన్న మిషతో వినోదప్పన్ను కోసం లాబీయింగ్ చేసుకోవడంలో బిజీగా ఉండిపోయేవారు. చిత్రం విజయవంతం అయివుంటే  ఆర్థిక లాభాలలో ఒక్క పైసా అయినా పేదవర్గాలకు నలిపి నామం పెట్టి ఉండేవాళ్ళు కాదన్న మాట గ్యారంటీ !
వీటికి మించి చెప్పవలసిన మరో ముఖ్యమైన విషయం బాపూజీని చిత్రంలో చిత్రీకరించే విధానంలోని తారతమ్యం. విదేశీయుల చేతిలో నిర్మాణం అయింది కాబట్టి పూర్తిగా మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ మామూలు గాంధీగా మొదలై .. బాపూజీగా, మహర్షిగా వికాసం చెందిన క్రమాన్ని సహజ పరిణామ దశల పద్ధతిలో నప్పేలా తీసే ప్రయత్నం చేసారు. ఎక్కడా 'సూపర్ఫిషియల్' అన్న భావనకు ఆస్కారం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
గాంధీ అందరిలాంటి మనిషే. అందరిలానే చదువుకుని , పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలను కన్న తండ్రి ఆయన.  ఉపాధి కోసరంగా అందరిలానే విదేశాలలొ అవకాశాల కోసం వెదుకులాడుకుంటూ వెళ్లిన  యువకుడు. అక్కడ ఎదుర్కొన్న జాతి వివక్షకు సంబంధించిన అవమానాలను ఎదుర్కొని పోరుసలపాలన్న దీక్షతో ముందుకు వెళ్లి విజయవంతమైన తరువాతనే ఒక గౌరవప్రదమైన వ్యక్తిత్వంతో భారతదేశం తిరుగుముఖం పట్టింది.
దక్షిణాఫ్రికాలో తెల్లవారి దెబ్బలకు గాయపడ్డ పూట  గాంధీ ఇంట్లో కస్తూరి బాయితో కలసి చేసిన ఒక సన్నివేశంలో దర్శకుడు గాంధీని ఏ విధంగా చిత్రించదల్చుకున్నాడో.. స్పష్టంగా అర్థమవుతుంది. బుగ్గ మీద అంటించిన టేపు బాగా గుంజుతోంది తీయమని కస్తూరి బా ను అడుగుతాడు గాంధీ. కస్తూరి బా భర్త మంచం మీద కూర్చుని అటు తిరిగి    ఆ టేపును తీసే సందర్భంలో గాంధీజీ ఆమె వీపు మీద చేతులు వేయడం చూపిస్తాడు దర్శకుడు. ఆ సమయంలో గాంధీజీ కళ్లల్లోని ఎరుపు జీర మీద ఫోకస్ చేయడం అత్యంత సహజంగా వచ్చిన సన్నివేశం. 'బ్రహ్మచర్యం పాటిస్తానన్నారుగా?' అని అడుగుతుంది కస్తూరి బా అప్పటికీ! ఒక్క క్షణం మౌనం. (తప్పు జరిగిన తరువాత అని కాబోలు అర్థం) 'రేపు ఒక రోజుకి ఉపవాసం ఉంటానులే'అంటాడు గాంధీ. ఒక తప్పుకు ఒక రోజు ఉపవాసంతో సరి అని కాబోలు గాంధీ భావం! 'మరీ ఎక్కువ ఆనందించకండి.. రెండు రోజులు ఉపవాసం ఉండాల్సి వస్తుంది' అంటుంది కస్తూరిబా. ఆ తరువాత గాంధీ కస్తూరి బాయిని ఆనందంతో ముంచెత్తుతాడు.  ఆ సన్నివేశం మనకు భారతదేశంలొ కనిపించదు. చూడాలంటే విదేశీ వెర్షన్ చూడకతప్పదు.
మనిషి నుంచి మహాత్ముడిగా  గాంధీజీ ఎదిగిన క్రమం చూసే భాగ్యం బైటదేశాలవారికే అన్నమాట. మన వాళ్లకు బాపూజీని మానవ మాత్రుడుగా చూపించడం పెద్ద దోషం. ఆయన ఆకాశం నుంచి ఊడిపడ్డట్లు జాతి భావించాలన్నది కాబోలు.. సెన్సారు సార్ల ఉద్దేశం.
బాపూజీ కూడా కోరుకోని వీరాభిమానం ఇది. అలా దైవ భావన ఆపాదించుకునేదుంటే 'సత్యంతో నా ప్రయోగాలు' ఆత్మకథలో మరీ అన్ని పచ్చి నిజాలు దాచకుండా నిర్భీతిగా ఎందుకు పెట్టడం?!
ఈ తరహా దౌర్భాగ్యం ఒక్క బాపూజీకే కాదు..   రాముడు, సీత, ఆంజనేయుడు, అంబేద్కర్, ఫూలే వంటి ఎన్నో వ్యక్తిత్వాలకు తప్పడం లేదు. రామా అంటే బూతు కూత కూస్తున్నారంటూ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు అవడం ఈ మధ్యన మరీ ఎక్కువయింది! అందుకే ఈ ఉదాహరణను ఇక్కడ విజ్ఞుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. ఆలోచించవలసిన అవసరం ఇహ పైన బుద్ధిమంతులదే! స్వస్తి!
-కర్లపాలెం హనుమంతరావు
19 -02 -2020
(ఓంకార్ ‘ఆల్ ఇన్ వన్’ ఆధారంగా)
***

Friday, February 15, 2019

కథలు- సినిమా కథలు - నా సరదా వ్యాసం



కథలు- సినిమా కతలు
-కర్లపాలెం హనుమంతరావు 
ఇప్పుడంటే వయస్సు, ఆరోగ్యం దృష్ట్యా సినిమాలమీదకు దృష్టి సారించడం లేదు. కానీ.. ఒక దశాబ్దం కిందట సినిమాలే ప్రపంచంగా..  సినిమా ప్రపంచంలో చెడ తిరిగిన వాడిని. 'చెడ' తిరగడం సినిమా జీవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం. 
బుద్ధిమంతులు ఇంట్లో.. గదిలో ఓ మూల చేరి  ప్రశాంతంగా .. ఏ అర్థరాత్రో.. ఆపరాత్రో.. ఎన్నికాగితాలూ.. కంప్యూటరు బైట్లు ఖరాబు చేసుకున్నా . అడిగే నాథుడు ఉండడు. సినిమా రచయితకు అలా కుదరదు.  క్లాప్ బాయ్ నుంచి.. దర్శకుడిదాకా అందరూ 'నాథుళ్లే'. ఎవరికి వాళ్ళు వాళ్లను 'శ్రీనాథుళ్ల'ను కోవడం సినీజీవుల విలక్షణత. రావిశాస్త్రిగారినో సారి  సినీ కథ రాసేందుకని మద్రాసు తోలుకెళ్లారు తెల్సీ తెలియని అమాయకులెవరో తిరిగొచ్చిన తరువాత కొత్త  అనుభవం ఎలా ఉంది శాస్త్రిగారూ?' అనెవరో అడిగితే 'బాఁనే ఉంది. జల్సాగా కూడా ఉంది. మన భోజనానికి మన ఖర్చు లేదు. మన మందుకీ మనం  ఖర్చు అక్కర్లేదు. మన పసందు ఏదైనా సరే  మనం అచ్చుకోనక్కర్లేదు. మన పన్లేవీ  మన చేత చేయనివ్వరు.. చివరికి కథ కూడా..' అనేసారు.
ఈ కాలంలో అచ్చుపత్రికల్లో  కథల పేరుతో వచ్చే రాతలకే  ఏ 'ఏకతా'సూత్రం అతకడం లేదు. ఏ కతకైనా 'ఏకత'(Unity) అవసరమని SYD FIELD అనే పెద్దాయన 'Screenplay' అనే పుస్తకంలో సిద్ధాంతం చెబుతాడు. The Foundations of ScreenWriting పేరుతో పడీ పడీ 300 పేజీల ఉథ్గ్రంథమోటి   రాస్తూ బుర్రను తొలిచే  పురుగును .. ఫైనల్ గా  మిణుగురు పురుగు మాదిరి   ఎలా మెరిపించచ్చో  స్టెప్ బై స్టెప్ లెక్కలాగా  సాధికారికంగా వివరిస్తాడు.   హాలీవుడ్లో చిత్రాలు ఈ సిడ్ ఫీల్డ్   సూత్రాలమీద ఎంతవరకు తయారవుతాయో  తేల్చడం అంత తేలిక కాదు. కానీ.. హాలీవుడ్ స్థాయి బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలందించాలని కలవరించే వెర్రి సజ్జంతా  కనీసం  ఒక్కసారైనా  ఈ పుస్తకం అట్టను తడిమి లోపలేం రాసుందో తెల్సుకుంటే లాభమే కానీ.. వచ్చే నష్టమేమీ ఉండదు. 
కథను  తెరకు అనువదించడం  ఒక శాస్త్రం. శాస్త్ర ప్రకారం చేయడం అపాయకరమని మొదట్నుంచీ మన తెలుగువాళ్లకెందుకో ఒక అపనమ్మకం.  (ఇప్పుడు కాస్త పరిస్థితి మారిందంటున్నారు). హాలీవుడ్డో. కొరియన్ ఫుడ్డో..వాళ్లు అష్టకష్టాలూ పడి వండుకున్న వంటకాల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చి ఎంగిలి పడ్డం  మన రచయితలకో థ్రిల్లు! 'లోకో భిన్న రుచిః ' అన్న సూత్రంలోని మాయమర్మం కాస్తయినా వంట పట్టిన   రచయిత  'నేటివైజేన్'  టెష్టులో 'సి'గ్రే డైనా సాధిస్తాడు. అదీ కుదరని 'మక్కీకి.. మక్కీ' కుక్కింగు రాయుళ్ళు-  నమ్ముకొని రంగంలోకి దూకిన దిగిన నిర్మాతల్ని నట్టేట ముంచేస్తారు.  మరో సినిమా తీయడం ఆనక.. బెజవాడ బస్టాండులో మిరబ్బజ్జీ  బాండీ వేసుకునే  స్థాయికి తీసుకు రాఅకపోతే అక్కడికి అదృష్టవేఁ!   
హాలీవుడ్డు కయినా.. బాలీవుడ్డు కయినా.. టాలీవుడ్డు కయినా.. అతకడాలు.. అతక్క పోవడాలంటూ ఉండవు. సిడ్ ఫీల్డు స్క్రీన్ రైటింగు పాఠాలు ఒక్క  హాలీవుడ్డు మేథావుల చెవుల్లో  ఊదిన గాయత్రీ మంత్రాలేవీఁ కాదు.  ఊహా మాత్రంగా మెదడులో మెదిలిన ఆలోచన తెరమీదో కావ్యంగా కనిపించేందుకు జగమంతా ఒకే విధానాన్ని పాటించాల్సి ఉంటుంది.  కథానిర్మాణం  వెన్నెముక కూర్పయితే కథలోకి జీవం తేవడం సృజనాత్మకతకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. సిడ్ ఫీల్డుకైనా.. రాబర్డ్ మెక్ కైనా.. సిద్ధాంతం బుర్రకెక్కించడం వరకే పరిమితం! స్పీల్ బర్గో.. చక్రపాణో కావడం  మేథస్సుకు సంబంధించిన  చమత్కారం. 
తెరమీద కదిలే కథకి..  తెర వెనక ఎంత కథ నడవాలో వివరించే సిద్దాంతం స్క్రీన్ ప్లే!  వాస్తవానికి అనుభవ పూర్వకంగా సాధించవలసిన యోగం. ఈదే నైపుణ్యం నేర్పే పుస్తకాలుండచ్చేమో.. కానీ.. ఈదడానికి మాత్రం ఎవరి రెక్కలు వాళ్లకే సాయం రావాలి' . సినిమా కథ తయారీకి కూడా సరిగ్గా అతికేదీ మార్క్ ట్వైన్ సూక్తి. కాకపోతే పుస్తకాలలో మనం చదివే కథలకి.. తెరమీద  మనం చూసే కథనాలకీ నిర్మాణ సిద్ధాంతంలో ఆట్టే తేడా లేదు. మనసును రంజింపచేసే ఈ రెండు ప్రక్రియల్లో ఉండేది ఒకే సామాస్య నిర్మాణ సూత్రం. చదువరులకి.. వీక్షకులకి ఆ మర్మాలు అనవసరమేమో గానీ.. కథానిర్మాతలకు ఈ లోతు పాతులన్నీ కాకపోయినా .. కొన్నైనా తెలిసుండాలి కదా!  వడ్డించినన భోజనం ఆరగించే మనిషికి అనుపాకాల తయారీతో సంబంధమేముంటుంది. భోక్తకు కావల్సింది రుచి. రుచికరంగా వండటమెలాగో తెలుసుకోవాల్సిన ధర్మం వంట చేసే మనిషిది. వంటమనిషికి కథలు రాసేవాళ్లకి ఒకే సూత్రం. ఆ సూత్రాలు తెల్సుకునేందుకైనా కొన్ని సిద్ధాంత గ్రంధాలమీద మనసుంచి అవపోసన పట్టాలి.
సిడ్ ఫీల్డ్.. రాబర్ట్ మెక్ లాంటి  అనుభవజ్ఞులైన చలనచిత్రకథాశాస్త్రజ్ఞులు  స్క్రీన్ రైటింగుకి సంబంధించిన సిద్ధాంత గ్రంథాల్లో  చెప్పిన పాఠాలన్నీ అందుచేతనే.. ఔత్సాహిక  సినీకథా రచయితలకు.. కథారచయితలకు..  ఒకే విధంగా ఉపకరించే  పాఠ్యగ్రంథాలని నా ఉద్దేశం.
నేను సినిమారంగంలో క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో చదివిన కొన్ని పుస్తకాలుః
నేను చదివిన కొన్ని పుస్తకాలు
1.SYD FIELD /SCREENPLAY
2.ROBERT MckEE/ STORY- 
substance, structure, style, and the principle of screenwriting
3.తెలుగు సినిమా సాహిత్యం- కథ , కథనం, శిల్పం- డాక్టర్ పరుచూరి గోపాల కృష్ణఉస్మానియా విశ్వవిధ్యాలయం నుంచి పి.హెచ్.డి పట్టా పొందిన సిద్ధాంత గ్రంథం
4.సినిమా స్క్రిప్టు రచనా శిల్పం- చిమ్మని మనోహర్

Thursday, June 21, 2018

సినిమా మాటలంటే 'మాటలు కాదు'!- సరదా వ్యాసం




'సావధానం బలదేవా.. సావధానం! ఇదిగో నా పాచికల మీద ఒట్టుపెట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. ఆలకించండి! మోసం చేసి కపట ద్యూతం చేసి పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్లు వనవాసానికి వెళ్లారు. అ దుర్వార్త విని నువ్వు మమ్ములను దండించడానికి వచ్చావు. నువ్వొక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానికి, అతిముఖస్తుతికి లోబడతావని నాకు తెలుసు. మా జాతివాడవు కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసాననంతరం మళ్లీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముని సహాయం లేకుండా చేయడానికి. కానీ.. యతోధర్మ స్తతోజయః అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది'
సినిమా ఇంకో పావుగంటలో అయిపోతుందనంగా శకుని వేషంలో సియస్ఆర్ పలికిన ఈ నిమిషం డైలాగు మాయాబజారు సినిమా మొత్తానికీ పెద్ద డైలాగ్. తెలుగులో సియస్ఆర్ సింగిల్ టేక్ లో ఓకే చేయిస్తే.. తమిళంలో నంబియార్ నాలుగైదు టేకులు తిని బావురుమన్నాడని.. గుమ్మడి వెంకటేశ్వర్రావుగారు తన 'తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు'లో రాసుకున్నారు. ఒక నిమిషం డైలాగులో సినిమా కథ సారాన్నంతా సరళమైన భాషలో పామరుడికి కూడా అర్థమయే పద్ధతిలో ఇలా రాయడానికి ఎంతో పాండిత్యంతో పాటు సినిమా ప్రక్రియ మీద అంతులేని అవగాహన ఉండితీరాలి. అవి పింగళివారికి పుష్కలంగా ఉన్నాయి. కనుకనే మాయాబజార్ సంభాషణా శైలికి అత్యుత్తమ  మైన తార్కాణంగా ఈనాటికి ఫిలిం స్కూళ్ళ నుండి సినిమా సభల వేదికల మీద వరకు అన్నింటా ఉధహరించుకుంటున్నాం మనం.
సినిమా సంభాషణ అంటే క్లుప్తంగా, సరళంగా, సహజంగా, పాత్రోచితంగా, స్పష్టంగా భావం పలికేలా, జీవం ఉట్టిపడేలా, జనంభాషలో అందంగా, కథాప్రయోజనానికి దోహదపదే విధంగా ఉండాలని సినీపండితుల నిశ్చితాభిప్రాయం.
పాత్రలకు బదులు రచయితలు మాట్లాడడం పాతపద్ధతి. అంటే అన్ని పాత్రలూ ఒకే మూసలో పలికే మొనోటోనీ విధానమన్న మాట.
ఫిలిం ప్రక్రియ ఖరీదైన వ్యవహారం. కనుక వృధా సంభాషణలకు ప్రోత్సాహముండదు. టీవీ ధారావాహికాలకి ఈ సాగతీత ఉంటుంది! అక్కడ 'డై'లాగ్ అంటే చచ్చిందాకా సాగదీయడమనే అర్థం సరిపోతుందేమో కానీ.. సినిమాలో ప్రతీ సెకనూ ఖరీదైన వ్యవహారమే. కాబట్టి అవసరమైనంత మేరకే పాత్ర పెదాలు కదిలించాలి. అదీ సినీ సంభాషణలకు సంబంధించినంత వరకు ప్రథమ ప్రధాన సూత్రం.
పాత సినిమాలలో పాత్రలు పూర్తిగా పుస్తకాల భాష మాట్లాడేవి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక సందేశమో, పోలికో తెచ్చి చప్పట్లు కొట్టించుకొనేవి. రంగస్థలం వాసనలు పూర్తిగా తొలగిపోని తొలినాటి దశ అది. ఇప్పుడు సినిమాలకు సంభాషణలు రాసేవాళ్లకు నాటకాలతో ప్రత్యక్షంగా అనుబంధం లేదు. నేరుగా జీవితాలనుంచి సినిమాలలోకి దిగబడిన సరుకే ఎక్కువ.  సినీ సంభాషణలు పక్కింట్లో  నుంచి వినిపించే తరహాలో ఉండటానికి అదే కారణం. ఇది మంచి మార్పే! కానీ.. కత్తెర వేసేవాళ్ల చెవుల్లో డబ్బు చెట్లు మొలవడం వల్ల  పదిమంది ముందు వినడానికి ఇబ్బంది కలిగించే పదాలు కూడా విచ్చలవిడిగా వెండితెర మీద వినిస్తున్నాయి! కథానాయకులు సైతం ప్రతినాయకులను మించి బూతు పురాణాలు విప్పడం పసిపిల్లల మీదా, మాస్ మనస్తత్వం ఉన్నవాళ్ల మీదా విపరీతమైన చెడుప్రభావం చూపిస్తోంది.
పాత సినిమాలలో పాత్రలు సందర్భోచితంగా చక్కని తెలుగు  నుడికారంతో  మాట్లాడేవి. సంభాషణలు రాసేవాళ్లు సంస్కృతాంధ్రాలలో ఉద్దండులైనా, సినిమా ప్రక్రియ ప్రధానంగా పామరజనరంజకం అనే  భావన ఉంది కనుక సరళమైన, సజీవమైన భాషను ఎన్నుకొనేవాళ్లు. పౌరాణిక చిత్రమైనా మాయబజారులోని పాత్రలు నేలబారు ప్రేక్షకులకు అర్థమయే పదాలనే వాడాయి. ‘మోడర్నిజం’ మిషతో ఇప్పుడు వచ్చిపోయే మెజారిటీ చిత్రాలు కనీసం టైటిళ్లలో అయినా తెలుగుదనం ఉండకూడదని ఒట్టు పెట్టుకున్నట్లున్నాయి! వీలైనన్ని సన్నివేశాల్లో బట్లరింగ్లీష్ దంచేస్తున్నారు. రాసేవాడికీ, రాయించుకొనేవాడికీ కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి ఇంగితమైనా లేని కారణంగా సినిమాల ద్వారా వీళ్లు వినిపిస్తున్న బూతుపదాలే జనసామాన్యంలో ఊతపదాలుగా స్థిరపడుతున్నాయి!
సినిమా ప్రధానంగా దృశ్యమాధ్యమంగా వినోదపరిచే కళ. దృశ్యపరంగా చెప్పలేని సందర్భాలప్పుడే మాటల ద్వారా భావప్రకటన జరగాలన్నది  మూలసూత్రం. 'మాతృదేవోభవ' చిత్రంలోని ఒక సన్నివేశం ఇప్పటికీ కళ్లముందు కనిపించి కంటతడి పెట్టిస్తుంటుంది. భర్త తాగుబోతు. భార్యకు కేన్సర్. పిల్లలు అనాధలైపోతారని ఆ తల్లి దిగులు. ఒక్కొక్కరినే దత్తత కిచ్చేస్తుంటుంది. కవల పిల్లల్లో ఒకడు దివ్యాంగుడు. ముందు వాడినే దత్తు తీసుకుందామని వచ్చిన డబ్బున్న దంపతుల ఆలోచన. కానీ వాడికి తోబుట్టువులను విడిచి వెళ్ళాలని ఉండదు. అయినా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి.  చివరికి  దివ్యాంగుడికి బదులు మంచి బిడ్డను దత్తు తీసుకొని దంపతులు వెళ్ళిపోతున్నప్పుడు 'అవిటి కాలుతో పుట్టడమే నా అదృష్టం' అంటూ ఆ దివ్యాంగుడు సంబరపడుతుంటే ఆ సంభాషణ రాసిన రచయిత సత్యమూర్తికి రెండు చేతులూ ఎత్తి నమస్కరించ బుధ్దేస్తుంది.
కామెడీ ఎన్టర్టైన్మెంట్ వంకతో ఇప్పుడొచ్చే సినిమాల్లో మూడొంతుల భాగాన్ని కథతో ఏమాత్రం సంబంధం లేని కుళ్ళు స్కిట్లతో నింపేస్తున్నారు. కాబట్టే జాతీయస్థాయిలో తెలుగు సినిమా రూపాయి విలువలా రోజు రోజుకూ దిగజారుతోంది.
మాయాబజారులో మాయాశశిరేఖ పెళ్లిసందడి సన్నివేశం  గుర్తుందా?  వధువు రూపంలో ఉన్న ఘటోత్కచుడు వరుడి పాదం మహారాక్షసంగా తొక్కేస్తాడు. లక్ష్మణకుమారుడు గగ్గోలు పెట్టేస్తుంటే శశిరేఖ నంగనాచిలా 'ఆర్యపుత్రులు నా కాలు తొక్కచ్చునేం?' అంటూ ఒక్క వాక్యంతో వగలాడితనమంతా ప్రదర్శిస్తుంది.   ఆ ఘట్టంలో రచయిత వాడిన ఆ చిన్న వాక్యంలోనే సావిత్రి ఎన్నో రకాల హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. చలనచిత్రం ప్రధానంగా పాత్రల హావభావాల ద్వారా నడిచే దృశ్యమాలికేగా!
సన్నివేశం పండేందుకు చాంతాడంత  సంభాషణలు దండగ. డైలాగ్ ఎంత చిన్నదైతే ప్రేక్షకుడి మెదడు అంత పదునుగా పనిచేస్తుంది. నాటి మిస్సమ్మ నుంచి నేటి 'అతడు' వరకు విజయవంతమైన చిత్రాలన్నింటిలో పదునైన స్వల్ప సంభాషణలే  ప్రధానపాత్ర పోషించాయి. సినిమా సంభాషణలు రాసే రచయితలు సూక్ష్మంగా గ్రహించాల్సింది  ఏ సన్నివేశానికి  ఏ మోతాదులో పాత్రల నోట సందర్భోచితమైన డైలాగులు సాధ్యమైనంత సంక్షిప్తంగా పలికించాలన్నది.
మాయాబజారు చిత్రం ఈనాటికీ మూవీ రచయితలకు మంచి గైడ్. సమర్థత  ఉంటే తల్పాలకు బదులు గిల్పాలు, కంబళ్లకు బదులు గింబళ్ళు కూడా సృష్టించేయచ్చు. ఆ చిత్రంలోనే పింగళివారు అన్నట్లు 'ఎవరూ పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది?'
దుషట చతుషటయం, అసమదీయులు, తసమదీయులు వంటి సందర్భోచితమైన పదాలు ఎప్పుడు ప్రయోగించాలో వర్ధమాన రచయితలు ముందు అధ్యయనం చేయాలి.  'బోర్' అనే ఆంగ్లపదానికి 'సుత్తి' ని తిరుగులేని ప్రత్యామ్నాయంగా మార్చేసిన జంధ్యాల సామర్థ్యం ఒక్క రోజుల్లో అలవడే రసవిద్య కాదు. పట్టుదలగా పదాల మీద పట్టు సాధించాలి. ఒక తరంలో ముళ్లపూడి ప్రదర్శించిన విలక్షణ పూలశైలి, అనంతరం జంధ్యాల ప్రవేశపెట్టిన గిలిగింతల స్టైల్, సమాంతరంగా పరుచూరి సోదరులు  కదను తొక్కించిన జవనాశ్వపు వరవడి, నవరసాలను సైతం ఒకే లైనులో ప్రకటించే త్రివిక్రమ్ మాటల మంత్రం.. అబ్బో.. అలా.. చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి వాలం సైతం చిన్నదనిపించే జాబితా మన ఒకనాటి తెలుగు సినీ సంభాషణా రచయితలది. 'సినిమాకి మాటలు రాయడమంటే మాటలు కాదు'  అన్న మాట ముందు ప్రవర్థనమాన సినీరచయితలు మనసులో పెట్టుకుంటే చాలు.. శ్రధ్ద దానంతటే పుట్టుకొచ్చేస్తుంది.
పామర జనానికి ఈనాటికీ సినిమాలే పరమ ప్రామాణికం. శారదమ్మ తన మీద ప్రసరించిన అక్షర కటాక్షాన్ని ప్రజాహితానికి మాత్రమే వినియోగించడం ప్రతీ సినీరచయిత సామాజిక బాధ్యత. సినిమాకు వినోదం ప్రధానమే.. కానీ మనోవికాసాన్నీ అది తోడుతెచ్చుకోవాలి.   
-కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
(ఆంధ్రభూమి దినపత్రిక -09, జూలై, 2009, వెన్నెల పుటలో ప్రచురితం)



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...