Tuesday, January 22, 2019

కొడవటిగంటి కుటుంబరావు -21 వ శతాబ్ది సంపూర్ణ మానవుడు

 ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకీయ పుటలో  ప్రచురితం 
-కర్లపాలెం హనుమంఅరావు 
కొడవటిగంటి కుటుంబరావు 

ఇరవయ్యో శతాబ్దపు సంపూర్ణ మానవుడు
-కర్లపాలెం హనుమంతరావు
అక్టోబర్ 28, 1909 జన్మించిన తేదీ. గుంటూరు జిల్లా, తెనాలి జన్మస్థలం. 'సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శ ద్వారా సుసంపన్నం చేయడమే సరైన సాహిత్యం' అన్న కొడవటిగంటిది  మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబం. ఇంట్లో నల్లుల బెడద తగ్గడానికని ఆయన  చిన్నతనంలో తల్లి ‘రు’ అనే అక్షరంతో అంతమయే అరవై ఊళ్ళ పేర్లు రాయించిందిట. అంత చాదస్తపు కుటుంబంలో పుట్టి 'బుద్ధికొలత వాదం' అనే ఓ కొత్త  సిద్ధాంతాన్ని ప్రతిపాదించే స్థాయికి ఎదిగిన మనోవికాసజీవి కొ.కు.
సమాజంలో చుట్టూ ఉన్న వ్యక్తుల నడవడికల్లోని  అసమంజసమైన తడబాటుకు విరుగుడు మంత్రం చదువేనని కుటుంబరావు బాల్యం నుంచే గాఢంగా భావించారు. కొ.కు ప్రసిద్ధ నవల 'చదువు'లోని చాలా అంశాలు  కొ.కుగారి వ్యక్తిగత అభిప్రాయాలేనని చాలా మంది సాహిత్య విశ్లేషకులు భావన.   విద్య ద్వారా లభించిన వివేకమే  ఆయన జీవితాన్ని ఎప్పటికప్పుడు చీలిన దారుల్లో నిలబడి ఉన్నప్పుడు మేలైన మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగే విధంగా ప్రేరేపించింది. తన పదకొండో ఏటే  పెద్దమ్మ పెంపకంలోకి వెళ్లిన  వాడు కుటుంబరావు. ఆమెకి అవసరానికి మించి ఎక్కువ మోతాదులో అన్నం వండే అలవాటు. మిగిలింది మర్నాడు పిల్లలంతా చద్దన్నంగా తినాలి. రోజూ చద్దన్నం తినేందుకు విసుగనిపించి దెబ్బలాటకు దిగేవాడుట కుటుంబరావు. ఒక రోజు కాస్త తక్కువగా వండేస్తే మర్నాటి నుంచి ఎప్పటి కప్పుడు వేడి వేడి అన్నరుచిగా తినవచ్చుగదా!' అని కుటుంబరావు ఆలోచన. ఇంత చిన్న తరుణోపాయం పెద్దమ్మకి ఎందుకు తట్టింది కాదో ఆ బాలుడికి అర్థం కాలేదు. తనే ఆమెకు చెప్పాడు చివరకి.  అయినా పెద్దావిడ 'పిల్లకాకి సలహా' కింద పెడ చెపిన పెట్టి తన పాత చాదస్తాన్నే కొనసాగించేదిట. ఇలాంటి అసంబద్ధమైన పోకడలంటే జీవితంలో చివరి వరకూ కొడవటిగంటి అసహనంగా ఉండేవార'ని వాళ్లబ్బాయి రోహిణీ ప్రసాద్ ఓ వ్యాసంలో చెప్పుకొచ్చారు.
కొ.కు. తెనాలిలో పాఠశాల చదువు 1925 వరకు సాగింది. 5వ ఏట తండ్రీ, 11వ ఏట తల్లీ మరణించడంతో మేనమామ వద్దే  పల్లె వాతావరణంలో పెంపకం.  అన్నయ్య వెంకటసుబ్బయ్య కవి, రచయిత.  కొ.కు సాహితీ రంగప్రవేశానికి ఆయనే ప్రేరణ. గిండీ ఈంజనీరింగ్ కాలేజిలో చదువుకుని ఓవర్సీరుగా పనిచేసిన సుబ్బయ్యగారికీ ఆధునిక భావాలు పుష్కలంగా ఉండేవి. ఆయన ప్రభావానికి తోడు పాశ్చాత్య సాహిత్యంతో  పరిచయం కొ.కు అదనపు ఆస్తి. తల్లావఝ్జల, గోవిందరాజులు వంటి ప్రసిద్ధులని కళ్లారా చూసిన అనుభవాలు జీవితంలో కలిసొచ్చాయి. 13వ ఏటే పద్యాలు.. పూర్తికాని ఓ థ్రిల్లరు రాసిన బాలమేథావి కొ.కు. 16వ ఏట హైస్కూలు చదువులోనే  తనకన్నా 5 ఏళ్ళ బాలికతో(పద్మావతి) వివాహం జరిగింది. (1939లో ఆమె  మరణించింది) 1825-27.. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియేటు..  ఆ తరువాత మరో రెండేళ్లు మహారాజా కళాశాల. విజయనగరంలో బియ్యే ఫిజిక్సులో చదివాడు.  రచనా వ్యాసంగం సీరియస్ గా పట్టుబడిందీ కాలంలోనే. డిగ్రీ చదువు చివరికి వచ్చేసరికి కుంటుంబరావులో నాస్తిక భావజాలం స్థిరపడింది. 1929లో కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు.  
సైన్సు పాఠలు బోధించే ఉపాధ్యాయుడి మెడలో తాయెత్తులు కనిపిస్తుంటే.. వినే విధ్యార్థికి గురువు విషయంలో గురి ఎలా ఏర్పడుతుంది? కొడవటిగంటిది సైన్సు సబ్జెక్టులను అధ్యయనం చెయ్యడమే కాదు.. నిత్య జీవితంలో తారసపడే ప్రతి అంశాన్ని ఆ శాస్త్రజ్ఞానం ప్రసాదించిన ఇంగితంతో తార్కికంగా ఆలోచించే తత్వం. అందు చేతనే ఆయన తన రచనల్లో చెప్పే విషయాల్లో ఏది అహేతుకం అనిపించదు. అయోమయంగా కలిగించదు. సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా కనిపించే ఆయన రచనా శైలికి ఆయన జీవితానికి కడదాకా ఎక్కడా వైరుద్యం కనిపించదు. కొ.కులో కనిపించే నిజాయితి చాలా మంది రచయితలలో అరుదుగా మాత్రమే అగుపిస్తుంటుంది.
అప్పటి అంతర్జాతీయ  ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్..సి రెండో సంవత్సరంలో ఆగిపోయింది. కొంతకాలం  వరంగల్లులో పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. 1942లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. కార్మికుల వాస్తవ జీవితాన్ని కళ్లారా పరిశీలించే అవకాశం కొ.కు కి ఆ కాలంలోనే దక్కింది. 1942లో ఓ ఆరునెలలు సిమ్లా జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీ రైటరుగా పనిచేయడం అతనిలోని రచయితకు కలిసొచ్చిన మరో అబుభవం. 1944లో ఒడిషా జయపూరులో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగాకూడా పనిచేసాడు కుటుంబరావు.
రచనలుః
1930లో కొ.కు తొలి రచన సినిమా ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. మొదటికథ 'ప్రాణాధికం' గృహలక్ష్మి మాస పత్రికలో. చక్రపాణి, మరికొంతమంది మిత్రులతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి యువ పత్రికను ప్రారంభించాడు.
 1940 - 42 మధ్య కాలంలో ఆంధ్ర పత్రికలో పనిచేసాడు. జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి అప్పటి సహోద్యోగే. 1
రెండో పెళ్ళి జరిగిన రెండు నెల్లకే ఆ భార్యా అనారోగ్యంతో మరణించడంతో 36వ ఏట ముచ్చటగా మూడో వివాహం చేసుకున్న విచిత్రమైన అనుభవం కుటుంబరావుది. చివరి వరకూ అతనితో జీవితం పంచుకొన్న ఆ సౌభాగ్యవతే వరూధిని. బొంబాయి ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా 1948లో మూడు నెల్లలు పనిచేసిన తరువాత ఆంధ్రపత్రిక దినపత్రికలో చేరి 1950-51లో ఆ సంస్థ వారపత్రికకు సంపాదకత్వం కూడా  నిర్వహించాదు కొ.కు.  ఆ క్రమంలోనే కొన్నాళ్ళు కినిమా వారపత్రిక సంపాదకత్వం.1952, జనవరి 1 నుండి..  1980 ఆగష్టు 17న తుది శ్వాస విడిచే  వరకూ 'చందమామ'కే అంకితమయిపోయారు. ఆ పత్రిక అత్యున్నత స్థితిలో కొడవటిగంటివారి  కృషి మాటల్లో వర్ణించలేనంత మహత్తరమైనది. ఆయన చనిపోయే ముందు పత్రికాఫీసుకని సిద్ధం చేసుకొని వెళ్లే బ్రీఫ్ కేసులో రాబోయే మూడు నెలలకు సరిపడినన్న కథలు రడీగా  ఉన్నాయని కొకుగారి కూతురు శాంతా సుందరి  ఓ సందర్భంలో అన్నారు.
సాహిత్య జీవితం:
శాస్త్రజ్ఞులు చెప్పే స్థలం (space), కాలం (time) అనే రెండు కొలతలకు అదనంగా జగత్తుకు బుద్ధి అనే మూడో కొలత 'బుద్ధి' కూడా ఉంటుందనే 'బుద్ధికొలత వాదం' సిద్ధాంతాన్ని మొదటి సారిగా ప్రతిపాదించి అనేక రకాల చర్చలకు పునాది రాయి వేసిన కొ.కు శాస్త్రవేత్తా? సాహిత్యవేత్తా? అంటే.. ఆ రెండూనూ అని సమాధానం చెబితే సరిపోదు. వాటికి తోడు సామాజికవేత్తా, సంస్కరణవాదీ, బౌద్ధిక జీవీ,, మార్క్సిష్టూ, మనస్తత్వవేత్తా.. అని కూడా చెప్పుకొంటేనే కొ.కు వ్యక్తిత్వాన్ని సంపూర్ణం  సందర్శించైనట్లవుతుంది.. ఒక్క కవిత్వం  మినహా కుటుంబరావు గారు కలగ జేసుకొని సాహిత్య ప్రక్రియ తెలుగులో దాదాపు  లేదనే అపిస్తోంది! 50 ఏళ్లల్లో ఆయన చేతిమీదుగా జాలువారిన పది నుంచి పన్నెండు వేళ పుటల రికార్డు ఇప్పటికీ ఏ తెలుగు రచయితా సమీపంలోకి కూడా రాలేనంత ఘనమైన  రికార్డు.
కొడవటిగంటివారి కొన్ని అభిప్రాయాలుః
"సాహిత్యం నుండి ప్రజల్నీ, రాజకీయాల నుండి సాహిత్యాన్నీ, ప్రజల నుండి రాజకీయాలనీ రక్షించే ప్రయత్నాలు చూస్తూంటే నాకు నవ్వొస్తుంది.
నియంతల మీదా, నిరుద్యోగమ్మీదా, లాకౌట్ల మీదా, యుద్ధాల మీదా గొంతెత్తేందుకు కళాకారులకు హక్కు లేదు. అది రాజకీయులకే ఉందనడం మూర్ఖత్వం. అణగదొక్కాలనుకునేవారే ఇలాంటి తలతిక్కవాదం చేస్తారు".
"ప్రకృతి రహస్యాలను వివరించలేనిది శాస్త్రం కాదు; జీవితంలోని కష్టాల్ని తీర్చలేనిది ఆవిష్కరణా కాదు; జీవితంలోని ప్రతీ కోణాన్ని చూపించలేనిది సాహిత్యమే కాదు"
"మారుతున్న కాలానికి అనుగుణంగా సాహిత్యమూ మారాలి … పాతకాలపు సాహిత్య పద్ధతులకే కట్టుబడి ఉండడమంటే మోసం చెయ్యడమే"
"కులం మిథ్య, మతం మిథ్య, ధనమొకటే నిజం" (పేదవాడైన అగ్రకులస్తుని కంటే డబ్బున్న దళితునికే ఎక్కువ పేరు ఉంటుంది. ఈ వ్యవస్థని ఉద్దేశించి అన్న వాక్యం)

ఆధునికులు అని చెప్పుకొనే వారిలో చాలా మంది చాదస్తులేనని ఆయన రూఢిగా నమ్మేవారు. చేజేతులాచిన్నపిల్లలకు పెళ్లిళ్లు జరిపించి, ఆనక భర్తహీనులైన ఆడబిడ్డలతో  ఇబ్బందులు పడే సంప్రదాయవాదులంటే మొదటినుంచి కొ.కు కు వళ్లు మంటే!  సమాజంలో పెడమార్గాలకు మూలకారణాలు వ్యక్తుల్లో కాక.. వాళ్లను సాకే వ్యవస్థలోనే ఉన్నాయని  కుటుంబరావుగారికి మార్క్సిజం సిద్ధాంతం అధ్యయనం తరువాత మర్మం అంతు పట్టింది.
 చిన్నతనంలో నేర్చుకున్న పెళ్ళి మంత్రాలూ, తద్దినం మంత్రాలూ వగైరాలన్నీ ఆయనకు చివరిదాకా గుర్తున్నాయి. సంప్రదాయకవిత్వాన్ని నేర్చుకుని రాయగలిగిన తరవాత ఆ పద్ధతిని నిరసించి, చెండాడినవాడు  శ్రీ శ్రీ. ఆయన పంథాలాగే కొ.కు కుడా తాను తరవాతి కాలంలో సహేతుకంగా, తార్కికంగా విమర్శించిన సంప్రదాయాలన్నీ మొదటినుంచీ సుపరిచితమే.  సంప్రదాయవాదులకు అదే పెద్ద  కంటగింపుగా ఉండేది. ఆయన రచయితగా మారిన తరువాత  సమీపబంధువులే అతనిని ఎలా తూలనాడేవారో  మా. గోఖలే  వివరించారు.  ఆరంభంలో  యువ వితంతువును  గురించే ఎక్కువ రాయడం జరిగింది. అప్పట్లోని  బ్రాహ్మణ కుటుంబీకులు ఆచారం  ముసుగులో సొంత లాభం చూసుకొనే గడసరితనాన్ని   గురజాడలా, చలంలా ప్రతిభావంతంగా ఎండగట్టిన కోవకు చెందిన వాడు కొ.కు. కాకుంతే పెద్దమనుషులుగా చలామణీ అయే వారి ప్రవర్తనను శాసించే సామాజిక, ఆర్థిక, రాజకీయశక్తులను  విశ్లేషించడం కొ.కు చేసిన అదనపు కృషి.
షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ కథలు నవులుతూనే చవులూరించే తెలుగు ఆధునిక సాహిత్యంలోని తొలితరం రచయితల కథలన్నీ దాదాపుగా చదివేసి ఆకళింపు చేసుకొన్న  ఇంగితం కొడవటిగంటిది. సెకండు ఫారం నుంచే  వార్తాపత్రికల కథనాల ఆధారంగా తనూ ఓ కథ అల్లేసి, చదివి, చించేయడం  ఓ నిరంతర అభ్యాసంగా లాభించింది తదనంతర కాలంలో కుటుంబరావుగారికి. రాత వల్లే విషయం సమగ్రంగా అవగాహనకు వస్తుందని కొ,కు చివరి వరకు ప్రగాఢంగా నమ్మేవారు.
తన తరం ఆలోచనలకు బింబసామానలైన తన రచనలు ముందు తరాలకి కేవలం చరిత్ర పరిశీలనకు మాత్రమే అవసరంగా ఉండాలి కాని.. ఆ పంథాలో తరువాతి రచయితల రాతలు సాగితే తను ఆశించిన అభ్యుదయం ప్రగతిమార్గాన నదవడం లేదన్న భావం వస్తుందని కొ.కు చాలా సందర్భాలల్లో చెబుతుండే వారు. జాతిని మరింత ముందుకు తీసుకు వెళ్లేదే సరైన సాహిత్య ప్రయోజనమని ఆయన విశ్వాసం.బుద్ధికి పదునుపెట్టి, పని కల్పించేలా రచన ఉండాలని ఆయన తపన..
సాహిత్యానికి అదనంగా శాస్త్రీయసంగీతం, తోట పని, వంట చేయడం.. లాంటి కార్యక్రమాలలో కొ.కు చివరి వరకు ఆసక్తి అలాగే కొనసాగిందంటారు. అన్నట్లు ఆయన సినిమాను కాక.. సినిమానే ఆయన్ను ప్రేమించింది. నాటకరంగమూ మరో ప్లటోనిక్ ప్రేమికురాలు.  వివిధరంగాల్లో పేరున్న ఎందరో  ఆయనకు ఆయాచితంగా దక్కిన  సన్నిహితులు. స్థానం నరసింహారావు, రఘురామయ్య.. వగైరా ఆ కోవకి చెందిన వారు. 
మద్రాసులో శ్రీశ్రీ లాగారాత్రి భోజనానికి బదులు ఇడ్లీ స్వల్పాహారం, బీచ్ ఒడ్డున నిద్రానుభవాలు తనకూ ఉన్నట్లు ఆయనే చెప్పుకున్నారు.  వరూధినితో వివాహం తరువాత  వ్యక్తిగతజీవితం కుదుట పడింది.  చందమామలో చేరాక  పూర్తి  మానసిక ప్రశాంతి లభించింది.
అచ్చు టెక్నాలజీ నుంచి పత్రికల సామాజిక ప్రభావం దాకా అన్నిటినీ ఆయన సమగ్రంగానే అవగాహన చేసున్నారు. సైన్స్, టెక్నాలజీ రంగాల ప్రగతి ఆయన దృష్టి కోణం నుంచి దాటి పోలేక పోయింది.  
ఇరవయ్యో శతాబ్దపు మానవుడుగా, రచయితగా, చింతకుడుగా ఆయన చివరిదాకా క్రియాశీలంగానే జీవించినట్లు లెక్క.