అమరకోశం - అర్థ వివరణ
- కర్లపాలెం హనుమంతరావు
కోశం' అంటే పుస్తకం. పదానికి అర్థం చెప్పే పద్ధతి వివరించే పుస్తకం అమరకోశం. వ్యాకరణం, ఉపమానం, వ్యవహారాలు వంటి వాటిద్వారా సిద్ధించిన విషయాల అర్థ నిర్ణయాలు వగైరాఈ తరహా కోశాలలో కనిపిస్తాయి!
ఇప్పుడు వాడుకలో ఉన్న ‘నిఘంటువు’ అనే పదం నిజానికి ‘కోశం’ అనే అర్వాచీన పదానికి ప్రాచీన రూపం. వేదాలలోని పదాలన్నిటినీ సంకలించి నిర్మించిన 'నిఘంటువులు' మన దేశంలో ఒకానొకప్పుడు విస్తృతంగా ప్రచారంలో ఉండేవి.
వీటికి వ్యాఖ్యాన రూపాలు 'నిరుక్తాలు'. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది యాస్కుడు రాసిన నిరుక్తం. 7వ శతాబ్దానికి చెందిన పాణిని తన వ్యాకరణంలో ఈ నిరుక్తాలను వాడుకొన్నాడు.
నిఘంటువులోని ఒక్కో పదం తీసుకొని దానికి సంబంధించి- ఏ ధాతువు నుంచి ఏ పదం ఉత్పన్నం ఆయిందో వివరించే ప్రయత్నం చేసాడు యాస్కుడు. వీలున్న చాలా సందర్భాలలో వేదాల నుంచే ప్రమాణాలు చూపించాడు. అ ప్రమాణాలలో కూడా అంతగా ప్రసిద్ధం కాని వాటికి తానే అర్థ వివరణలు ఇచ్చే ప్రయత్నమూ చేశాడు. ఇంత శ్రమపడ్డాడు కాబట్టే యాస్కుడి నిరుక్తి ‘వేద-నిరుక్తి’గా వేదార్థసారం తెలుసుకొనే జిజ్ఞాసువులకు ప్రామాణిక గ్రంథంగా స్థిరపడింది.
వేద సంబంధమైన పదాలతో పాటు లౌకిక పదాలను కూడా ఇముడ్చుకొన్న వాటిని ‘కోశాలు’ అంటారు. గతంలో కవులకు సహాయపడే పద్ధతిలో ఈ కోశాలు నిర్మాణం జరిగింది. బాణుడు (బాణోచ్ఛిష్టం జగత్ సర్వమ్ లోని బాణుడు) నుంచి బిల్హణుడు వరకు చాలా మంది పండితులు ఈ పదకోశ నిర్మాణాల మీద దృష్టి పెట్టినవాళ్లే. ఒకానొక కాలంలో శ్లేషకావ్యాలురాయడం ఒక ఫ్యాషన్ ( ఒక పదానికి రెండు అర్థాలు ఉంటే అది ‘శ్లేష’ అవుతుంది. ఇది అలంకారాలలో అర్థవివరణ జాతికి చెందినది). అట్లాంటి శ్లేష ప్రియుల కోసం శ్రీహర్షుడు 'శ్లేషార్థపదసంగ్రహః' అనే కోశం నిర్మంచాడు. అమరసింహుడు అనే పండితుడు ఉన్నాడు. ఆయన కవి కూడా. కాబట్టి వివిధ శాస్త్రాలకు సంబంధించిన సమాచారం తన అమరకోశంలో నిక్షిప్తం చేసాడు. కావ్యాలు రాయాలనుకొనే కవులకు.. ప్రత్యేకంగా ఆయా శాస్త్రాలు తీసి పరిశీలించే శ్రమ కొంత తగ్గిందంటే ఆ పుణ్యం ఈ అమరకోశానిదే .
కోశాలలో రెండు రకాలుంటాయి. ఒకే అర్థం ఉన్న అనేక పదాలను ఒకచోట పేర్చే పద్ధతి. దీనిని వ్యాకరణంలో పర్యాయపదం అంటారు. ఇట్లాంటి పర్యాయపద కోశం ఒకటైతే, ఒక పదానికి ఉండే నానార్థాలను వివరించే నానార్థపద పద్ధతి రెండోది.
పర్యాయపదకోశంలో ‘వర్గం’ అని ఒక తరగతి ఉంది. ఒకే అంశానికి చెందిన అనేక పదాలను ఒక గుంపుగా వర్గీకరించే పద్ధతి ఈ ‘వర్గం’. వర్గం అమరసింహుడి సృష్టి.
ఉదాహరణకి: మనుషులకు సంబంధించిన పదాలన్నీ ఒక చోట చేరిస్తే అది ‘మనుష్యవర్గం’. అమరకోశం ద్వితీయ కాండలో ఆరో వర్గంగా ఈ ‘మనుష్య వర్గం’ కనిపిస్తుంది. 'గృహనిరుద్ధపక్షిమృగప్రసంగాత్' తద్వర్తిమనుష్యాణాం నామాని వివక్షుం ఇదానీం సాంగోపాంగం మనుష్యవర్గమాహ' అని నిర్ణయం. అంటే ఏంటి? ఇళ్లల్లో రకరకాల పెంపుడు జంతువులు ఉంటాయి గదా! వాటి పేర్లు చెప్పే సందర్భంలో ఆయా జంతువులను సాకే మనుషులను రకరకాల పేర్లతో పిలవడం ఒక భాషా సంప్రదాయం. ఏ మనిషిని ఏ పేరుతో గుర్తిస్తారో వివరంగా చెప్పే ప్రామాణిక విధానమే ‘మనుష్యవర్గం’. ఇది అమరసింహుడు ఆరంభించిన కొత్త విధానం.
'మనుష్యా మానుషా మర్త్యా మనుజా మానవా నరాః'। మనోరపత్యాని మనుష్యాః మానుషాశ్చ॥' అని నిర్ణయం,
1,2 .మనువు కొడుకులు కనుక మనుష్యులు, మానుషులు. ( మనుష్యా మానుషా )
3 . చనిపోయేవాళ్లు కాబట్టి మర్త్యులు (మర్త్యాః)
4 . మనువు వలన పుట్టినవాళ్లు: కాబట్టి (‘మను’జా)
5. మనువు సంబంధీకులు కనుక ( మానవా: )
6. సర్వం తమ అధీనంలోకి తెచ్చుకొనేవాళ్ళు కనుక (నరులు)
ఇట్లా ఈ ఆరూ మనుష్యమాత్రులకు వచ్చిన పేర్లు. అమరసింహుడి వర్గవిభాజనా పదవివరణ ఇంత విస్తారంగా శాస్త్రీయంగా ఉంటుంది. కాబట్టే అమరకోశం ఈనాటికీ నిఘంటువుకు ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకొని ఉంది. మరంత వివరణాత్మకంగా సాగే ఈ కింది పద్ధతి చూడండి!
మనుష్యుల్లోని పురుషులకు మరో 11 పేర్లు, స్త్రీలకు మరో 11 పేర్లు! అక్కడితో ఆగలేదు అమరసింహుడు. ఆ స్త్రీలలోని గుణాలను బట్టి ఇంకో 12 పేర్లు, మళ్లా ఆ గుణాలలో కూడా కోపం వచ్చే పద్ధతిని బట్టి మరో 2 పేర్లు, ఉత్తమ గుణాలను బట్టి మరో 4 పేర్లు.. ఇట్లా చెప్పుకుంటూ పోతే చిలవలు పలవులుగా సాగే పదాల ఉత్పన్నత విహారానికి దరీ దారీ దొరకదు. అంత లోతయిన పరిశీలనా జ్ఞానభాండారం కాబట్టే అమరకోశం పామర పండిత లోకాలు రెండింటికీ శిరోధార్య వ్యాకరణమయింది.
విధాయకానికి అందరూ భార్యలే అయినప్పటికీ. వాళ్ల వాళ్ల అర్హతలను బట్టి పేర్లు ఎట్లా ఏర్పడ్డాయో వివరించాడు ఆ మహాపండితుడు అమరకోశంలో.
'పత్నీ పాణిగృహితీ చ ద్వితీయా సహధర్మచారిణీ। భార్యా జాయాథా పుంభూమ్ని దారాః'॥ అంటూ ఎనిమిది విధాలైన భార్యల వివరాలిచ్చాడు. భర్తతో కలసి యాగంచేసే యోగం కలది, భర్త చేత హస్తం గ్రహించబడింది, యాగఫలం పొందే సందర్భంలో భర్తతో కలసి తాను రెండో స్థానంలో ఉండదగినది, భర్త లాగానే దాన, యజ్ఞాదుల్లో అధికారం కలది, పతిని పుత్ర రూపంలో తనయందు జనింపచేసే అధికారం కలది, ఆఖరిది(ఆశ్చర్యం కలిగిస్తుందేమో కూడా) కట్టుకున్నవాణ్ని హడలగొట్టేది(దారయంతి ఉద్వేజయంతి పతీనితి దారా:-దౄ భయే.. అని వివరణ).. ఇట్లా ఎనిమిది రకాల భార్యల పేర్లను వాళ్ల వాళ్ల అర్హతలు, గుణాల ఆధారంగా అర్థ నిర్ణయం చేసిన గొప్ప పదకోశం అమరకోశం.
ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే కనిపించే మరో విశేషం.. శ్లోకంలో మొదటి వరస నాలుగు పేర్లు ధార్మిక సంబంధమైనవిగా ఉంటే .. రెండో వరస నాలుగు పేర్లు లౌకిక జీవితానికి సంబంధించినవిగా ఉంటాయి!
వివరించుకుంటూ పోవాలే కానీ అమరకోశంలోని విశేషాలకు ఎప్పటికీ సశేషాలే. అమరకోశానికి అంత ప్రాచుర్యం ఉల్ఫాగా వచ్చి పడింది కాదు. శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఆకులూ, పూతా, కాయలూ, పూలూ, పళ్లూ, అవి రాల్చే గింజలూ.. సర్వం ఒక మహావృక్ష సమగ్ర స్వరూపాన్ని ఎట్లా కళ్లకు కడతాయో.. అదే విధంగా అర్థ విస్తరణ కొనసాగించే పద్ధతిలో అమరకోశమూ ఒక సమగ్ర శబ్దమహావృక్షాన్ని తలపిస్తుంది అంటే అతిశయోక్తి కాబోదు.
అమరకోశం తనకు ముందు వచ్చిన నిఘంటువులు, తరువాత వచ్చిన నిఘంటువులకు మించిన కోశరత్నం. సంస్కృత భాషా ప్రచారంలో అమరకోశానిది ప్రధాన భూమిక. అమరం మారుమోగినంత వరకు తతిమ్మా నిఘంటువులు మూగబోయాయి. అమరం వదిలేసిన పదాలను ఏరుకుని వాటికి వ్యాఖ్యానాలు రాయడం ద్వారా ఆ నిఘంటువులన్నీ తమ తమ అస్తిత్వాన్ని నిలుపుకోవలసిన పరిస్థితి. దేశ విదేశాల్లో దీనికి వచ్చిన అనువాదాలకు లెక్కేలేదు. ఈనాటికీ ‘ యస్య జ్ఞానా దయాసింధో: ‘ శ్లోకంతో సంస్కృత విద్యార్థి పాఠం మొదలుపెడతాడు. ఆ విధంగా అమరకోశం, అమరసింహుడు చిరంజీవులు.
(ఆధారం: అమరకోశం పీఠిక – చ.వేం. శేషాచార్యులు